పుస్తక సమీక్షలు


సి.బి.రావు! తెలుగులో బ్లాగుసమీక్షలు రాయడం మొదలుపెట్టిందాయన. బ్లాగరుల సమావేశాలకు పెద్ద. తెలుగులో సశేష బ్లాగులు అశేషంగా రచించి, ఇంకా రచిస్తూ వస్తున్న సీరియల్ బ్లాగరి. ఆయన రాసే సచిత్ర సమావేశ నివేదికలు చదవడం కోసం తెలుగు బ్లాగరులు దీప్తిధార (రావుగారి బ్లాగు) వద్ద కాపు వేసి ఉంటారు. ఇప్పటికి ఎన్నో బ్లాగులను సమీక్షించిన సి.బి.రావుగారు ఈ వ్యాసంలో పుస్తకసమీక్షల గురించి వివరిస్తున్నారు. రావుగారు ఆంధ్రప్రదేశ్ పక్షివీక్షకుల సంస్థ (A.P. Birdwatchers’ Society) కార్యదర్శి కూడా.

————–

దాదాపు అన్ని పత్రికల్లోనూ పుస్తక సమీక్షలు వస్తూ ఉంటాయి. ఒక కొత్త పుస్తకం మార్కెట్లోకి విడుదలైనప్పుడు ఆ పుస్తకంలోని విషయంపై ఆసక్తి, అభిరుచితో బాటు, దాని యొక్క మంచి-చెడులను బేరీజు వెయ్యగల సామర్థ్యమున్నవాళ్ళు ఆ పుస్తకాలపై సమీక్షలు రాస్తారు. కొందరు బ్లాగరులు సైతం తాము చదివిన పుస్తకాలపై తమ తమ బ్లాగుల్లో క్లుప్తంగానో, వివరంగానో తమ అభిప్రాయాలు రాస్తూ ఉంటారు.

ఐతే అవన్నీ పుస్తక సమీక్షలేనా? అసలు వేటిని పుస్తక సమీక్షలనవచ్చు? తమకు బాగా నచ్చిన/అసలు నచ్చని పుస్తకాలపై అందుకు గల కారణాలను సైతం వివరిస్తూ పత్రికల్లో సవివరమైన సమీక్షలు తామూ రాయవచ్చా? అని చదివేవాళ్ళకు సందేహాలొస్తూ ఉంటాయి. ఆ సందేహాలను తీర్చడంతోబాటు మంచి సమీక్షలెలా ఉండాలో తెలిపే ప్రయత్నమే ఈ చిరువ్యాసం.

ప్రచురణ కర్తలు లేక రచయితలు,తమ పుస్తకాలను సమీక్ష నిమిత్తం, 2 ప్రతులను పత్రికా సంపాదకులకు పంపిస్తారు. ఒక పుస్తక పాఠ్యాంశం, ఉదాహరణకు పక్షుల వలసపై ఉందను కోండి. సంపాదకులు అలాంటి పుస్తకాలను, పక్షి శాస్త్రజ్ఞులకో,కనీసం ఆ subject తెలిసినవారికో సమీక్షకు పంపుతారు. కొన్ని సార్లు అభిప్రాయాలు అడుగుతారు. ఒక subject పై authority కానవసరము లేదు, కనీస పరిచయము ఉంటే బాగుంటుందని సంపాదకుల అభిప్రాయం.


అలాగే నవలలను ఇతర రచయితలకు ఇచ్చి సమీక్ష చేయమంటారు. కథా శైలి, కథనం, భాష,కథాంశం కున్న ప్రాధాన్యత, ముగింపు ఇవన్నీ కథను ప్రభావితం చేస్తాయి. పుస్తక ముద్రణ, కాగితపు నాణ్యత, పుస్తక ధర, అచ్చు తప్పులు, ముఖ చిత్ర అలంకరణ వగైరాలు సమీక్షకుడు పరిగణలోకి తీసుకుంటాడు. సమీక్షకుడు తన సమీక్షలో కథా సారాంశాన్ని, క్లుప్తంగా ఇస్తూ, సాధ్యమైనంత వరకూ ముగింపు చెప్పక, పాఠకుడికి పుస్తకం చదవటానికి కావాలిసిన ఆసక్తిని చంపకండా, అందులోని విశేషాలు, బాగోగులు విశ్లేషణాత్మకంగా వివరిస్తాడు. అంతేకాక, కథలోని ఒకటో రెండో పారాగ్రాఫులను తన సమీక్షలో ఉటంకిస్తాడు. దీని ద్వారా పాఠకుడికి రచయిత శైలి తెలియపరచాలని సమీక్షకుడి అభిప్రాయం. కొన్ని పర్యాయాలు, పుస్తక ముఖ చిత్రాన్ని రంగులలో, తన సమీక్షలో భాగంగా ఇస్తాడు సమీక్షకుడు. దీనివలన పుస్తకం కొనకుండానే పాఠకుడు పుస్తకాన్ని అనుభూతి చెందే అవకాశం లభిస్తుంది.

సంజీవదేవ్ పారదర్శి అనే కలం పేరుతో సమీక్షలు చేసేవారు.ఆయన మానసిక శాస్త్రవేత్త కాదు,వైజ్ఞానికుడు కాదు,linguist కాదు, వైద్యుడు కాదు. దేవ్ ఈ అంశాలున్న పుస్తకాలనే కాకుండా పలు ఇతర అంశాలున్న గ్రంధాలను, బహుముఖ ప్రజ్ఞాశాలురపై వ్యాసాలు రాశారు. అవి రసరేఖలు, కాంతిమయి వగైరా వ్యాస సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. Specialist కాకుండా generalist లు కూడా సమీక్ష చెయ్యవచ్చు అనేదానికి సంజీవదేవ్ ఒక మంచి ఉదాహరణ అవుతారు.

సమీక్షలో, కేవలం కథా సారాంశం సంక్షిప్తంగా ఇస్తే, అప్పుడు అవుతుందది సంక్షిప్త కథ. మరి, మీరు పలు బ్లాగులలో చదువుతున్నవి, సమీక్షలా లేక పరిచయాలా అన్న విషయం, ఈ సరికి విజ్ఞులయిన పాఠకులకు, అవగతమయ్యే వుంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలకు బలమివ్వక, రచయితపై అభిమానం ప్రదర్శించకుండా, నిష్పాక్షికంగా, తటస్థం గా రాసినప్పుడు సమీక్షలకు, సమీక్షకుడికి విలువ పెరుగుతుంది.

– సి.బి.రావు(http://paradarsi.wordpress.com)

About సి.బి రావు

సి.బి.రావు: తెలుగులో బ్లాగుసమీక్షలు రాయడం మొదలుపెట్టిందాయన. బ్లాగరుల సమావేశాలకు పెద్ద. తెలుగులో సశేష బ్లాగులు అశేషంగా రచించి, ఇంకా రచిస్తూ వస్తున్న సీరియల్ బ్లాగరి. ఆయన రాసే సచిత్ర సమావేశ నివేదికలు చదవడం కోసం తెలుగు బ్లాగరులు దీప్తిధార (రావుగారి బ్లాగు) వద్ద కాపు వేసి ఉంటారు. రావుగారు ఆంధ్రప్రదేశ్ పక్షివీక్షకుల సంస్థ (A.P. Birdwatchers' Society) కార్యదర్శి కూడా.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

3 Responses to పుస్తక సమీక్షలు

  1. radhika says:

    ఈ వ్యాసం సిరిసిరి మువ్వ గారి ప్రశ్నలకు సమాధానం గా రాసిందా?ఏదయినా పొద్దులో మిమ్మలిని చూడడం చాలా ఆనందం గా వుంది.

  2. netijen says:

    మీ వ్యాసం బాగుంది.
    “గ్రంధ విమర్శ , పుస్తక పరిచయం లేదా బుక్ రివ్యు చూసారా?”

  3. బ్లాగరుల వివరాలు అడిగే మీరు, సమీక్షలు సచిత్రంగా చేసే మీరు, ఇక్కడ మీ చిత్రం వుంచలేదేమభ్భా! 🙂

    — ప్రసాద్
    http://blog.charasala.com

Comments are closed.