ఏటి ఒడ్డున కొన్ని మాటలు – మూలా సుబ్రహ్మణ్యంతో స్వాతి కుమారి కబుర్లు

స్వాతి: కౌముది కథ చదివాను ఇదివరకే. నిశ్చల యాత్ర గుర్తొచ్చింది. ఇదో మంచి ప్రయోగాత్మక కథ
సుబ్రహ్మణ్యం: నిశ్చల యాత్ర?
స్వాతి: అవును
సుబ్రహ్మణ్యం: కొంతవరకు చైతన్య స్రవంతిలో ఉంటుంది..
స్వాతి: ఆహా
సుబ్రహ్మణ్యం: బుచ్చిబాబు గారి ప్రభావంలో రాసింది
స్వాతి: అనువాద కవిత్వం ఎప్పుడైనా ప్రయత్నించారా?
సుబ్రహ్మణ్యం: లేదండీ… అనువాద కవిత్వానికి రెండు భాషల మీదా మంచి పట్టు ఉండాలి.. అదీ కాక కవిత్వంలో చాలా భాగం అనువాదాలకి లొంగదు.
స్వాతి: ఊ, ఎందువల్లంటారు? ఒక్కో భాషకుండే వెసులుబాటుని బట్టి భావ వ్యక్తీకరణ ఉంటుంది కాబట్టి, యథాతథంగా అనువాదం కష్టం అంటారు. ఒకసారెక్కడో చదివాను ఎవరూ అనువదించలేనిది గొప్ప కవిత్వం అని.
సుబ్రహ్మణ్యం: అవును ఇస్మాయిల్ గారి కింది కవితని తీసుకుందాం..

సెలయేరా, సెలయేరా!
గల గల మంటో
నిత్యం ఎలా పాడగలుగుతున్నావు ?

చూడు, నా బతుకునిండా రాళ్ళు.
పాడకుంటే ఎలా? (పాట)

“పాడకుంటే ఎలా?” అన్న వాక్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించడానికి ప్రయత్నించండి..How can i stop singing?” అన్నా మూలంలోని భావం రాదు. ఇలా భాషాతీతంగా ఉండే నిశ్శబ్ధ కవిత్వమే అనువాదాలకి లొంగకపోతే ఇక శ్రీశ్రీ శబ్ద కవిత్వం సంగతి చెప్పాలా?
స్వాతి: ఇంకొకటి, కవిత్వానికి క్లుప్తత ఎంతవరకు అవసరం? పేజీల తరబడి ఖండికలుగా వచ్చే కవితలు కొన్నిటిలో ఆసాంతమూ చదివించే గుణం ఉండటం లేదు. పైగా చిన్న భావాన్ని పెద్ద కవితలో చెప్పబూనటం వల్ల పలచబడి సాంద్రత లోపిస్తుంది. కానీ శ్రీశ్రీ లాంటి కొందరు కవులు రాసిన పెద్ద కవితా ఖండికల్లో కూడా మొదట్నుంచి చివరి దాకా ఒకే తీవ్రత, సాంద్రత కనిపిస్తాయి. ఈ తేడా ఎందువల్ల? అధిగమించటం ఎలా? అసలంతపెద్దవి రాయటం కవికి ఎంతవరకూ అవసరం?
సుబ్రహ్మణ్యం: క్లుప్తత అంటే లైన్ల సంఖ్య అనే కాదు అనిపిస్తుంది నాకు. అంత పొడుగు ఉన్న శ్రీశ్రీ “కవితా! ఓ కవితా!”, “దేశ చరిత్రలు”, “మానవుడా!” కవితల్లో క్లుప్తత లేదని అనగలమా? క్లుప్తత అంటే విసుగు పుట్టించే వివరణలు, అనవసర వాక్యాలు లేకపోవడం. చెప్పాల్సిన భావాన్ని బట్టి కవిత నిడివి కవితే నిర్ణయించుకుంటుంది. కావాలని పొడిగించడానికి చేసే ప్రయత్నాలు వికటిస్తాయి. కవిత్వం అంటే కనీసం 40-50 లైన్లు ఉండాలన్న భ్రమలు పాతుకుపోయాయి. ఈ భ్రమలు తొలగాలి.
స్వాతి: అవును, ‘కవితలోని ఏ ఒక్క పదం లేకపోయినా కవిత అర్ధం లేనిదవుతుంది’ అనిపిస్తే దాన్లో కచ్చితంగా క్లుప్తత ఉన్నట్టే, అది ఎన్ని పేజీల పాటు సాగినా సరే!
సుబ్రహ్మణ్యం: యెస్, తిలక్ రాసిన “మంచు” అని ఒక కవిత ఉంటుంది..
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: చాలా పెద్ద కవిత అయినా ఎక్కడా విసుగు పుట్టదు
స్వాతి: నిజం
సుబ్రహ్మణ్యం: కవిత్వం అర్థం కావాలా?
స్వాతి: కనీసం కవికి 🙂
సుబ్రహ్మణ్యం: 🙂 వచనానికే ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. కవిత్వానికి అర్థాలు ఆపాదించుకునే గుణం ఎక్కువ. పాఠకుడి స్థాయిని బట్టి ఒకే కవిత పలు కోణాల్లో వికసిస్తుంది. ఉదాహరణకి ఇక్బాల్ చంద్ రాసిన “శలభం” అనే కవితా ఖండిక తీసుకుంటే..

నీ వెలుగు చుట్టూ
రెక్కలు రాల్చుకుంటూ జన్మ జన్మాలు
ఎన్నెన్ని కొత్త అవతారాలు
నీ కాంతి కానక మళ్ళీ విసర్జనాలు
మనిద్దరి మధ్య సంబంధం అతి పవిత్రం
అందుకే..
నిన్నందుకోలేకపోతాను ప్రతిసారీ!

ఒక శలభం దీపంతో అన్న మాటలు.. ఆ శలభం మనిషి ఐతే దీపం జ్ఞానం, శలభం ప్రియుడు ఐతే దీపం ప్రియురాలు, శలభం కవి ఐతే దీపం కవిత్వం. గొప్ప కవిత్వానికి ఒకటి కంటే ఎక్కువ Dimensions ఉండటం సహజం. ఈ రకమైన కవిత్వాన్ని అర్థం కాలేదు, అస్పష్టంగా ఉంది అంటే చేసేదేమీ లేదు. కవిత్వం చదవడం కూడా ఒక కళే! పాఠకుడి నుంచి కనీస సాధనని ఆశించడం తప్పు కాదేమో! ఐతే నాణానికి మరో వైపు, ఆధునిక జీవితంలోని absurdityని చిత్రిస్తున్నామంటూ అర్థం పర్ధంలేని రాతలు, విశృంఖలమైన రచనలు ఎక్కువయ్యాయి. మితిమీరిన స్వేచ్ఛ ఏ విషయంలోనైనా ప్రమాదకరమే!
స్వాతి: ఈ వాదాలు ఇజాల గురించి కొంచం చెప్పండి
సుబ్రహ్మణ్యం: కవిత్వంలో వాదాలు.. కవిత్వంలో సార్వజనీనత ఉండాలి. ఒక ముస్లిం రాసిన కవితని ఒక హిందువు చదివి అనుభూతి చెందగలిగితేనే అక్కడ కవిత్వం ఉన్నట్టు. దుఃఖానికి కులమత భేదాలు ఉండవు. అలాగే కవిత్వానికి కూడా! “నా బురఖా కింద పారే కన్నీటి నదులని నువ్వు చూడలేవు!” అని ఒక పాకిస్తానీ కవయిత్రి రాసిన వాక్యాలు గుండెను చుట్టేస్తాయి. అది నిజమైన కవిత్వం. ఇక ప్రస్తుత తెలుగు కవిత్వానికి వస్తే ఆ వాద కవులం, ఈ వాద కవులం అని చెప్పుకుంటూ మరొక వర్గాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కవిత్వం పుంఖానుపుంఖాలుగా వస్తోంది. ఈ రకమైన కవిత్వంలో కవిత్వం పాలు తక్కువ, పొలికేకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కవిత్వం కవిత్వమే. ఇస్మాయిల్ గారు చెప్పినట్టు కవిత్వానికి లేబుల్స్ తో పని లేదు.

మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే
చెండాలుండుండేటీ సరి భూమీ ఒకటే

అన్న అన్నమయ్యకి దళితవాద కవిగా ముద్ర వెయ్యక్కరలేదనుకుంటా!
సుబ్రహ్మణ్యం: Internet లో తెలుగు కవిత్వం గురించి మీకేమనిపిస్తుంది?
స్వాతి: Internet లో ఐనా, పత్రికల్లో ఐనా ఈ మధ్య కాలంలో కవితాత్మకత, భావుకత లేని వాటిని కవిత పేరుతో రాసేస్తున్నారనిపిస్తుంది. ప్రచురించే వాళ్ళు కూడా పేజీ నింపటానికి ఏదోకటి అనుకుంటారా అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంటర్నెట్ గురించి ప్రత్యేక అభిప్రాయం ఏమీ లేదు. మీరు చెప్పండి
సుబ్రహ్మణ్యం: మీరు చెప్పింది కొంత వరకు నిజమే. ఐతే కవిత్వం ఏ కాలంలో అయినా అరుదుగానే వస్తుంది.
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: మొన్న కామేశ్వరరావు గారి వ్యాసంలో కొన్ని మంచి విషయాలు చర్చించారు ఐతే Internet లో కవిత్వం రాస్తున్న చాలా మంది కవులు.. మేం కవులం కాదు… మాకు తోచింది మేం రాస్తాం… ఇష్టం ఉంటే చదవండి, విమర్శించకండి.. అనే ధోరణిలో ఉన్నారు..
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: ఇది ఒక విధమైన పలాయన వాదం…
స్వాతి: రైట్
సుబ్రహ్మణ్యం: కవిత్వానికి తగిన సాధన, క్రమశిక్షణ ఇవేవీ అలవరచుకోకుండా, కనీసం తెలుగులో వచ్చిన గొప్ప కవిత్వాన్ని చదవకుండా… ప్రారంభించిన మర్నాడే శ్రీశ్రీ స్థాయిలో రాసెయ్యాలనుకోవడం అవివేకం.
స్వాతి: రాసెయ్యాలనుకోవడం కాదు. చదివే వాళ్లకి అలా అనిపించాలనుకోవటం
సుబ్రహ్మణ్యం: 🙂
స్వాతి: మీరు పైన చెప్పిన తరహా ఏమిటంటే వాళ్లకి నిజంగా గొప్ప కవిత్వం రాయాలని లేదు, విమర్శల ద్వారా నేర్చుకోవాలని లేదు ఏదోకటి రాస్తే ఎవరో ఒకరికి నచ్చక పోదు కదా అది చాలు అనే మనస్తత్వం
సుబ్రహ్మణ్యం: ఎంత వరకో ఎందుకు.. eemaata.com లో ఎన్నో మంచి వ్యాసాలు, కవితా సంకలనాలు ఉన్నాయి. అవి ఎంతమంది కొత్త కవులు చదువుతున్నారనేది ప్రశ్నార్థకమే! కాకపోతే చాలా మందిలో మంచి స్పార్క్ ఉంటుంది.. కాస్త సాధన చేస్తే మంచి కవిత్వం రాయగలరు అనిపిస్తుంది
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: ఆఖరి మాట.. 🙂 మన ముందుతరాలకి లేని వెసులుబాటు మనకి ఉంది. ఇంటర్నెట్ ద్వారా దేశ దేశాల గొప్ప కవిత్వం మనకి సులభంగా అందుబాటులోకి వచ్చింది. రాసింది చదివి వెంటనే అభిప్రాయాలు చెప్పే సంప్రదాయం కూడా కవులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐతే వీళ్ళు గుర్తు పెట్టుకోవలసింది ఏమిటంటే కవితని విమర్శించడం కవిని విమర్శించడం ఒకటి కాదు. కవిత్వం మీద ఎక్కువ మమకారం పెంచుకోకుండా విమర్శల్లో నిజాయితీ, మంచివిషయాలు ఉంటే తప్పక ఆచరణలో పెట్టాలి.
సుబ్రహ్మణ్యం: ఈమాటలో మంచి వ్యాసాల links పంపిస్తా.. let us publish them so that they will be helpful
స్వాతి: బాగుంది thanks, పొద్దు తరఫున
సుబ్రహ్మణ్యం: 🙂

<<ముందు పేజీ
|<మొదటి పేజీ

————-

-స్వాతి కుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

8 Responses to ఏటి ఒడ్డున కొన్ని మాటలు – మూలా సుబ్రహ్మణ్యంతో స్వాతి కుమారి కబుర్లు

  1. చర్చ బావుంది.
    ఛందస్సుని ఒక పాత్రతో కన్నా ఒక మూసతో (అచ్చు) పోలచడం కొంతవరకూ సమంజసం. ద్రవం పాత్రలో పోసిన తర్వాత కూడా పాత్రా ద్రవం వేరుగానే ఉంటాయి. మూసలో పోసి తీసిన పదార్థం (బంగారం కాని, మట్టి కాని), ఆ మూస తాలూకు ఆకారంలోకి మారి, ఆ ఆకృతి దాని అస్తిత్వంలో భాగమై పోతుంది. పద్యంలో రాసిన కవిత్వమూ అంతే.
    వచన కవిత్వంలో ఆకారం కొత్తగా కవి సృష్టించుకుంటాడు.
    ఇక కొన్ని సందేహాలు:
    1. ఎవరి కోసం వారు రాసుకున్నది అందరికీ తాకుతుందని ఎలా చెప్పగలం?
    2. కవిత్వానికి సార్వజనీనత అవసరమా? సాధ్యమా?
    3. Target audienceని దృష్టిలో పెట్టుకొని కవిత్వాన్ని రాయలేమా?

  2. రామారావు says:

    చర్చ అర్ధవంతంగా బాగుంది. వచన కవిత్వం నాకు మహా చెడ్డ చిరాకు. “మనుష్యులు కాళ్ళతో నడుస్తారు, పక్షులు రెక్కలతో ఎగురుతాయి” అంటూ మేము మాట్లాడుకునే మాటలని కవిత్వంలో చొప్పిస్తే, ఇక మేము మాట్లాడుకోటానికి ఏముంటుంది? మేము కవిత్వమే మా భాషగా మార్చుకోవాలేమో.

  3. కామేశ్వర్రావు గారికి ..
    మీ ప్రశ్నలకి సమాధానించగల వాణ్ణి కాదుగానీ నాకు తోచిన ఆలోచనలు పంచుకోవడంలో తప్పు లేదనుకుంటాను.
    1. ఎవరి కోసం వారు రాసుకున్నదే అని బయటికి అన్నా, లోపల ప్రతి రచయితకీ కవికీ తాను ఎవర్ని ఉద్దేశిస్తున్నాడో కొంత అవగాహన ఉంటుంది. అది అనుభవంతో బలపడుతుందని నా నమ్మకం.
    2. సార్వజనీనత .. ఇది కొంచెం అపార్ధానికి తావిచ్చే పదం .. అంటే “అందరికీ” అని కాకుండా “అనేకులకి” అని చెప్పుకుంటే, కచ్చితంగా సార్వజనీనత అవసరమూ, సాధ్యం కూడా. ప్రవరుడి నేపథ్యం గానీ, ఊహలు కానీ, అనుభవాలు కానీ మనవి కావు, ఐనా అతన్ని గురించిన కవిత్వం ఆస్వాదించగలుగుతున్నాం. ఇది కవిలోనే కాదు, పాఠకుల్లోనూ అంతర్గతంగా ఉంది. ఆంగ్లంలో empathy అంటారు. ఇంకాస్త పైమెట్టుకి వెళితే, అనుభవ సారాన్ని పిండి ఒక తాత్వికతని ఆవిష్కరించే కవిత్వం ఇంకా గొప్ప ఆనందం కలిగిస్తుందని మీకు అనుభవమే.
    3. Target Audience తప్పకుండ రాయొచ్చు. ఎప్పుడైనా గానీ, ముఖ్యంగా ప్రస్తుత సామాజిక నేపథ్యంలో కవిత్వం (రచన) కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలకి అంకితమవుతోంది. ఇక్కడ సందేశం అందిందా అన్నదే ముఖ్యం, కవిత పదికాలాల పాటు వర్ధిల్లిందా అన్నది కాదు. అది ఒక వ్యాపార ప్రకటనకి రాసిన జింగిల్ కావచ్చు, ఒక సినిమా పాట కావచ్చు, లేదా ఒక వాద సందేశం కావచ్చు. మనిషి మనుగడ పోరాటాల నించి ప్రాణం పోసుకున్న కవిత్వం భాషల సరిహద్దులు, ఎల్లలు దాటి కొన్ని దశాబ్దాల పాటు కొత్త ప్రాణం పోసుకుని కొత్త ఉద్యమాలకి పునాది ఐన దృష్టాంతాలు లేకపోలేదు. ఉదాహరణకి వికీలో we shall overcome పాట చరిత్ర చూడండి.
    రామారావు గారికి .. వచన కవిత్వం చిరాకు అన్నారంటే .. మీకు తగలాల్సిన కవిత్వం తగల్లేదన్న మాట. తిలక్ రాసిన “నీవు లేవు, నీ పాట ఉంది” చదవండి. అలాంటి పద్యం ఒక్క సాంప్రదాయ కవిత్వంలో చూపించండి (అన్నమయ్య పదాల్లో తప్పించి) .. అంతెందుకు .. మూలా సుబ్రహ్మణ్యం గారి కొన్ని పద్యాలు అద్భుతంగా ఉంటాయి. కళ్ళంటూ ఉంటే చూసీ .. మనసుంటే చదివీ .. ప్రపంచమొక పద్మవ్యూహం .. కవిత్వమొక తీరని దాహం!! 🙂

  4. బై దవే .. వెరీ వెరీ వెల్ డన్.
    స్వాతి గారికీ సుబ్రహ్మణ్యంగారికీ బహుధా అభినందనలు.

    ఇటువంటి ప్రయోగాలూ, ఫీచర్లూ మరిన్ని చేస్తుండాలని సంపాదక వర్గానికి వేడికోలు.

  5. చాలా చాలా బావున్నాయి మీ కబుర్లు!! ఎన్నో ఉపయోగకరమైన విషయాలు చెప్పారు.. కవిత్వాన్ని అర్ధం చేసుకోవడానికి పాఠకుడు కూడా కొంత కృషి చేయాలి అన్నదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.. అప్పుడే కవితని ఆస్వాదించిన అనుభూతి కలుగుతుంది!
    మీ ఇద్దరికీ అభినందనలు.. Also, thanks for the wonderful links!

    కొత్తపాళీ గారూ, ‘సార్వజనీనత ‘ కి మీ వివరణ అదుర్స్! 🙂

  6. కడప says:

    మంచి సంభాషణ. వస్తున్న వ్యాఖ్యలు కూడా మీ మాటలకు తగిన స్థాయిలోనే వున్నాయి. నిజాయితీగా ఏం మాట్లాడుకున్నా, రాసుకున్నా వాటికొక విలువ వుంటుందని మరోసారి చూస్తున్నాను.మీకూ సుబ్రహ్మణ్యంగారికీ పొద్దుకూ అభినందనలు. (ఈ సైటును, లేఖినిని నాకు పరిచయం చేసిన రామనాధకు థాంక్సు).

  7. Vaidehi Sasidhar says:

    చక్కటి చర్చ.సుబ్రమణ్యం గారికి,స్వాతి గారికి అభినందనలు!!!
    కామేశ్వరరావు గారి ప్రశ్నలు,కొత్తపాళీ గారి సమాధానాలు చాలా బావున్నాయి.ఆసక్తి ని,ఆలోచనను రేకెత్తిస్తూ.అందుకే,ఈ విషయం పై నా అభిప్రాయాలు కూడా పంచుకుందామన్న ఈ చిన్ని ప్రయత్నం.(అతిరధులు,మహారధులు వ్యాఖ్యానించాక ఇది సాహసమే అవవచ్చు!)
    1.ప్రధానం గా కవి తనకోసమే రాయటం జరుగుతుందని నా అభిప్రాయం.రాయాలనే తపన పూర్తిగా వైయుక్తికమైనది.అయితే ఈ రాయటం అనేది నిజమైన కవితావేశం లోంచి వచ్చినపుడు,ఆ భావావేశం కవీత్వీకరణ అనే మాధ్యమం ద్వారా వ్యక్తీకరించబడినపుడు ఆ అనుభూతి పాఠకుడి అనుభవం లోకి వస్తుంది. ఎంత వరకూ తాకుతుంది అనేది చాలావరకు కవి ప్రతిభ మీదే ఆధారపడ్డా అందరి పాఠకుల రసానుభూతి ఒకటే కాకపోవచ్చు.అది వారి వారి స్పందనాశక్తిని బట్టి ఉంటుంది కూడా.

    2.గొప్పకవిత్వ లక్షణా ల్లో సార్వజనీనత ఒకటని నా అభిప్రాయం.మొదటి ప్రశ్నలో ఉన్న “తాకే గుణం” వల్లే ఈ సార్వజనీనత సాధ్యమవుతుందేమో.ఈ సర్వజనీనత వల్లే కవి తాలూకు వైయుక్తిక అనుభూతి పాఠకుల వైయుక్తిక అనుభవంగా ఒక చక్కటి కవిత ద్వారా ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుందనిపిస్తుంది.అందుకే ఇప్పటికి గజేంద్రమోక్షం,రామాయణం,వేంగిక్షేత్రం లొ కొన్ని పద్యాలు చదువుతుంటే కండ్లు చెమర్చి గొంతు పెగలకపోవటం జరుగుతుంది. అదేవిధంగా తిలక్ తన ప్రియబాంధవి పాటను ‘నా లోపల లోపల ఆరుతున్న కుంపటిలో రగులుతున్న ఒకే ఒక స్మృత్యాగ్ని కణం లాగా…” అన్న పంక్తులు చదివినప్పుడల్లా అయన వేదనా తీవ్రత మన హృదయాలను పట్టి వెంటాడుతుంది.కొత్తపాళీ గారు చెప్పిన ఎంపతీ కూడా ఈ సార్వజనీనత కు కారణం అనిపిస్తుంది.

    మొత్తమ్మీద గొప్ప కవిత్వంలో ఆర్ద్రత(తాకే గుణం),సార్వజనీనత రెండూ కలిసే ఉంటాయని నా అభిప్రాయం.ఆర్ద్రత లేని కవితకు(వస్తువు ఏదయినా) కదిలించే శక్తి ఉండదు.కదిలించని కవిత కు సార్వజనీనత లోపిస్తుంది.

    ఇకపోతే నా అభిమాన కవిత “నువ్వు లేవు నీ పాట ఉంది” గురించి కొత్తపాళీ గారి వ్యాఖ్య అక్షర సత్యం అనిపిస్తుంది.ఈ కవిత చదివిన ప్రతిసారీ (బహుశా కొన్ని వందలసార్లు చదువుకోవటంజరిగింది)ఒక గొప్ప సంగీత కారుడు తన ప్రియబాంధవి స్మృతుల తాదాత్మ్యం తో ఏకబిగిన ఊదిన వేణువు పాట లా,చక్కటి ధార,ఆర్ద్రత తో సాగుతుంది.

  8. radhika says:

    చక్కటి చర్చ.సుబ్రమణ్యం గారికి,స్వాతి గారికి అభినందనలు

Comments are closed.