అంతర్జాలంలో వ్యాపారీకరణ

-గార్లపాటి ప్రవీణ్

అంతర్జాలంలో వ్యాపారీకరణ మొదలై చాలా రోజులయింది. దానిని విశ్లేషించడమే ఈ వ్యాస ఉద్దేశ్యం.

మరి ఈ ప్రకటనల ఇంజనునే మన తెలుగు వారు స్థాపించగలిగితే!?
ఓ గూగుల్ యాడ్‌సెన్స్ లాంటి సాఫ్టువేరునే తెలుగు వెబ్‌సైట్ల కోసం తయారు చేసుకోగలిగితే, అప్పుడు తెలుగు అంతర్జాల మార్కెటుకి ఉపయోగం కదా. ఎలా పని చేస్తుందంటే..

మొదట్లో వెబ్ పేజీలను సమాచార ప్రచురణ కోసమే మొదలుపెట్టారు. తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలన్నదే ముఖ్య ధ్యేయంగా ఉండేది. అలాగే తమ గురించి పది మందికీ చెప్పుకోవాలనేది కూడా ఒక కారణం. మొదట్లో స్థావరంగా (స్టాటిక్) ఉన్న అంతర్జాలం నెమ్మదిగా చలనశీలంగా (డైనమిక్) మారడం మొదలుపెట్టింది. స్థావరం అంటే ఎక్కువగా మారని, వాడుకరులతో ఇంటరాక్షన్ లేని వెబ్ పేజీలని అర్థం.

పోగా పోగా అంతర్జాలం కోసం DHTML, జావా, జావాస్క్రిప్టు మొదలయిన లాంగ్వేజీలు/స్క్రిప్టుల రాకతో అంతర్జాలం చలనశీలంగా మారడం మొదలుపెట్టింది. అంటే ప్రజలు తమ వెబ్‌పేజీలను వాడుకరితో ఇంటరాక్టివ్‌గా తయారు చెయ్యగలిగారు.

పై రెండిటికీ ఉదాహరణలు చెప్పుకోవాలంటే – మీరొక వ్యక్తిగత వెబ్‌సైటు మొదలుపెట్టారనుకోండి మీ రెస్యూమే, మీ ప్రాజెక్టులు మొదలయిన వివరాలను అక్కడ పెట్టుకుంటారు. దానిని స్థావర వెబ్‌సైటుగా అనుకోవచ్చు. అదే ఓ ఫోరం, ఫ్లికర్ లాంటి ఫోటో అప్‌లోడ్, యూట్యూబ్ లాంటి వీడియో అప్‌లోడ్, ఆర్కుట్ లాంటి సోషల్ నెట్వర్కింగు లాంటి వాటిని చలనశీల వెబ్‌సైటు లని అనుకోవచ్చు.

ఇక ఈ రెండిటికీ మధ్యలో ఉన్నవి బ్లాగులనుకోవచ్చు. ఎందుకంటే వీటిలో బ్లాగరి రాసే కంటెంటూ ఉంటుంది, అలాగే వ్యాఖ్యల ద్వారా డైనమిక్ గానూ సాగడానికి ఆస్కారం ఉంది.

ఇక అంతర్జాలం అభివృద్ఢి చెందుతున్న కొద్దీ అందులో వ్యాపార అవకాశాలు పెరిగాయి. ఆ ప్రస్థానం పలు విధానాలుగా సాగింది. కోట్లాది డాలర్ల వ్యాపారంగా ఎదిగింది. ఆ విధానాలను కొంత మేరకు విశ్లేషించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

స్థూలంగా చూస్తే అంతర్జాల వ్యాపారీకరణలో రెండు రకాలు కనిపిస్తాయి.

  1. మొదటిది సాఫ్ట్‌వేర్/కంటెంటు/సర్వీసుల వ్యాపారీకరణ
  2. రెండో రకం -మనందరికీ తెలిసిన ఉచిత కంటెంటు ఇవ్వడంతో పాటు వ్యాపార ప్రకటనలని ఉంచడం.

రెండిటి గురించీ విశ్లేషిద్దాము.

సాఫ్ట్‌వేర్/కంటెంటు/సర్వీసులని వ్యాపారీకరించడం:

ఈ పద్ధతిని అన్ని వెబ్‌సైట్లూ పాటించలేవు. తమ సైటులో తప్ప మరెక్కడా దొరకని కంటెంటును కలిగి ఉన్న వెబ్‌సైట్లు మాత్రమే ఈ పద్ధతిని అనుసరించగలవు. ఎందుకంటే.. అంతర్జాలం ఇప్పుడు ఎంతగా విస్తరించిందంటే ఒక చోట దొరకని సమాచారం వెంటనే వేరే చోట దొరుకుతుంది. ఒకరు సమాచారాన్ని దాచివేసినా, అది వేరేచోట్ల చటుక్కున దొరుకుతుంది. అలాగే ఒక సాఫ్ట్‌వేర్ గానీ సేవగానీ డబ్బు వసూలు చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఉచితమయినది ఇంకోటి వెంటనే పుట్టుకొస్తుంది. ఈ పద్ధతి సఫలం కావాలంటే ఆయా సైట్లకు ప్రత్యామ్నాయం ఉండకూడదు. అంటే వాటి ఖాళీని ఎవరూ పూరించలేని విధంగా ఉండాలి.

ఉదా:
ఐఈఈఈ (IEEE): ఈ సైటులోని వ్యాసాలను చదవాలంటే మీరు ఆ సంస్థ సభ్యత్వం తీసుకోవాలి. ఆ తర్వాతే అందులోని వ్యాసాలు చదవచ్చు. దీనికి ప్రజలు డబ్బులెందుకు కడతారంటే ఇందులోని కంటెంటు ఇంకెక్కడా దొరకదు కనుక. (niche content) అందుకనే వ్యాపారీకరించడం సాధ్యపడింది.

అలాగే సాఫ్ట్‌వేర్/సేవ వ్యాపారీకరణ తీసుకుంటే..

గూగుల్ యాప్స్ (Google Apps): గూగుల్ దీని ద్వారా సర్వీసుని, సాఫ్ట్‌వేర్ ని వ్యాపారీకరిస్తుంది. మనం వాడే జీమెయిల్, టాక్, డాక్స్ మొదలయిన వాటిని సంస్థలు తమ డొమెయిను పేరుతో వాడుకోవచ్చు. తమకనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ సేవలోని ఒక ప్రత్యేకత ఏమిటంటే.. చిన్న చిన్న సంస్థలకు ఒక గుర్తింపు కావాలి. దానికి సరసమైన ధరలో ఒక విధానం కావాలి. అది గూగుల్ యాప్స్ ద్వారా సాధ్యం. ఇలా ఏదో ఒక ప్రత్యేకత ఉంటే గానీ వ్యాపారీకరించడం కుదరదు.

ఇక రెండో‌విధానం –

ఉచిత కంటెంటు + వ్యాపార ప్రకటనలు (అడ్వర్టైజింగు):

వ్యాపారీకరణతో వచ్చే మొదటి సమస్య డబ్బు. అవును, డబ్బే! అంత వరకూ కంటెంటు మీద ప్రాధాన్యం ఉంచిన సైట్లు హఠాత్తుగా డబ్బు కోసం పాఠకుల గురించి ఆలోచించడం మొదలుపెడతారు.

దీనిని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది గూగులే. యాడ్‌సెన్స్ సహాయంతో గూగుల్ అన్ని అప్లికేషన్లకీ అడ్వర్టైజింగుని జోడిస్తుంది. సాఫ్ట్‌వేర్ ని ఉచితంగా ఇస్తుంది. దీని వల్ల రెండు లాభాలు. వాడుకరులు విపరీతంగా పెరుగుతారు. ఎందుకంటే డబ్బు కట్టక్కర్లేదు కనుక. కంపెనీకి డబ్బూ చేకూరుతుంది, ప్రకటనల వల్ల. కాబట్టి ఇద్దరికీ లాభదాయకమే. ఈ పద్ధతి అంతర్జాలంలో విపరీతంగా ఆదరణ పొందింది. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ పద్ధతినే ఆచరిస్తున్నాయి.

ఉదా:
జీమెయిల్: జీమెయిలు రాక ముందు ఎన్నో మెయిలు అప్లికేషన్‌ లు అంతర్జాలంలో ఉన్నాయి. కానీ అవి అందించే అంశాలు పరిమితం. చిన్న సైజు మెయిలు బాక్సులు ఇస్తాయి. POP వంటి సౌలభ్యాలు ఉండవు. మరి జీమెయిలు మార్కెటుని ఎలా సంపాదించుకుంది?
-1జీబీ సామర్థ్యం గల మెయిలు బాక్సులని కల్పించింది.
-ఉచిత POP సర్వీసుని అందించింది.
-అద్భుతమయిన ఇంటర్ఫేసుని తయారు చేసింది.
-ఆహ్వానపు పద్ధతిని అవలంబించి, లేని డిమాండుని సృష్టించింది.

తర్వాత దాని ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఇప్పుడు జీమెయిలు అడ్రసు లేని వారు అరుదే. జీమెయిలు ద్వారా డబ్బుచేసుకోవటానికి కూడా గూగుల్ ఈ ప్రకటనల పద్ధతినే అవలంబించింది. మెయిలు పక్కనే సందర్భోచిత ప్రకటనలు అలాంటివే.

ఇక ఈ వ్యాపారీకరణను తెలుగు సైట్లకి ఎలా ఆపాదించుకోవచ్చు ?

పైన పేర్కొన్న పద్ధతులు కొంత మేరకు మాత్రమే స్థానిక సైట్లకు వర్తిస్తాయి. ఎక్కువగా గ్లోబల్ వెబ్‌సైట్లకే బాగా పనిచేస్తాయి. అదీకాక పెద్ద తరహా వెబ్‌సైట్లకి మాత్రమే. మరి.. చిన్న వెబ్‌సైట్లు గానీ బ్లాగరులవంటివారు గానీ మానెటైజు చేసుకోవడం ఎలా?

  • ఇక్కడ ఒక సూత్రం ఉంది.. మీ వెబ్సైట్లకు, బ్లాగుకూ వేలకొద్దీ సందర్శకులు ఉంటే తప్ప, యాడ్‌సెన్స్ (అలాంటి ఇతర) ప్రకటనలు సత్ఫలితాల నివ్వవు. దీనికి ప్రత్యామ్నాయం దాదాపు లేదు.
  • టెక్ క్రంచ్, లైఫ్ హాకర్ వంటి బ్లాగులని చూస్తే అవి ప్రకటనల ద్వారా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే వారికి నెలకి దాదాపు మిలియన్‌ల కొద్దీ హిట్లు ఉన్నాయి కనుక. అదీ కాక
  • వేల కొద్దీ ఉండే చిన్న సైట్ల మానెటైజేషను ప్రకటనల ద్వారా కుదరదు.. సింపుల్!

(ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఇంగ్లీషులో కూడా మిలియన్ల బ్లాగులలో కొన్ని మాత్రమే సమర్థవంతంగా మానెటైజ్ చెయ్యగలుగుతున్నాయి.)

అయితే సైట్లు ఇక్కడ కొంత సృజనాత్మకంగా ఉండాలి; కొత్త పద్ధతులు అన్వేషించాలి. అలాంటి కొన్ని పద్ధతులు ఈ కింద గమనించగలరు.

  • తెలుగు పుస్తకాలు అమ్మే avkf వంటి సైట్ల గురించి వింటూ ఉంటాము.
ఇప్పుడు ఏ బ్లాగరో లేదా పొద్దో ఓ పుస్తక సమీక్ష ప్రచురించింది. దానికి పక్కనే avkf నుంచి పుస్తకం లంకె ఉంచామనుకోండి.. పుస్తకం నచ్చిన వారు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే avkf వారికి వ్యాపారమూ పెరుగుతుంది. ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవచ్చు.
  • అలాగే ఇంగ్లీషులో పెద్ద బ్లాగులు (టెక్‌క్రంచ్ వంటివి) చూస్తే అవి రిఫరల్స్ ని ఒక విధానంగా ఎంచుకుంటున్నట్లుగా గమనించవచ్చు. కొన్ని పెద్ద సైట్లైతే ప్రకటనల కంటే రిఫరల్సుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
కారణం.. ప్రజలకు ప్రకటనలు చూడగానే చిరాకు పుడుతుంది. ముఖ్యంగా పాపప్ ప్రకటనలు, బ్యానర్లు.
అదీగాక, ఇప్పుడు మంటనక్కలాంటి విహరిణులు పాపప్ లను ఆటోమేటిగ్గా నిరోధిస్తాయి. దానికి అనుబంధంగా యాడ్‌బ్లాక్ ప్లస్ లాంటి పొడగింతలు వాడే వారికి ప్రకటనలు కనిపించకుండా అరికట్టే సౌకర్యం ఉంది.

అలాగే ఇతర వాణిజ్యపరమైన తెలుగు సైట్లకు గానీ, ఇతర సైట్లకు గానీ లంకెలు ఉంచవచ్చు. అవి బ్లాగులోని అసలు విషయానికి అడ్డుపడకుండా, ఎబ్బెట్టుగా ఉండకుండా ఈ లంకెలను ఉంచడం ఒక కళ.

  • అలాగే నవతరంగం లాంటి ఒక సినిమా సైటును తీసుకుంటే.. దానికి అనుబంధంగా ఐఎండీబీ లాంటి ఒక సినిమా రేటింగు సాఫ్టువేరుని జత చేసారనుకోండి. నెమ్మదిగా సినిమాకు సంబంధించిన ప్రకటనలని దాంట్లో చూపించవచ్చు. సినిమా వారితో ఒప్పందాలూ కుదుర్చుకోవచ్చు.

ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే, ఏకంగా ఈ ప్రకటనలనే తెలుగువారికి అనుగుణంగా మార్చుకోవడం ఇంకో ఎత్తు. ఇప్పటి ప్రకటనలతో చిక్కేమిటంటే ప్రకటనల మార్కెటు స్థానికం కాదు. అంటే మీరు ఒక తెలుగు సైటులో ఏ బెస్ట్ బయ్ ప్రకటననో చూసారనుకోండి.. మీరు దానిని నొక్కుతారా? అలాగే తెలుగు సైట్లకి ఆంగ్లంలో ప్రకటనలు ఉంచితే (గూగుల్ యాడ్సెన్స్ లాగా) ఎవరూ పెద్దగా వాటి జోలికి పోరు.

మరి ఈ ప్రకటనల ఇంజనునే మన తెలుగు వారు స్థాపించగలిగితే!?
ఓ గూగుల్ యాడ్‌సెన్స్ లాంటి సాఫ్టువేరునే తెలుగు వెబ్‌సైట్ల కోసం తయారు చేసుకోగలిగితే, అప్పుడు తెలుగు అంతర్జాల మార్కెటుకి ఉపయోగం కదా. ఇదెలా పని చేస్తుందంటే..

బ్లాగులు తీసుకుంటే ఏ పెద్ద బ్లాగు అగ్రిగేటరు సైటో ఈ ప్రకటనల ప్రొవైడరు అవుతుంది. బ్లాగరులు దానికి అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీలు తమ ప్రకటనల కోసం ఈ సైటును సంప్రదిస్తారు. ఈ సైటు ఇతర బ్లాగులకి ఈ ప్రకటనలని అందిస్తుంది. వచ్చిన ఆదాయాన్ని ఇద్దరూ పంచుకుంటారు ఏదో ఒక నిష్పత్తిలో. ఇది ఇప్పుడు గూగుల్ మొదలయిన కంపెనీలు చేసేదే కానీ ఆ స్థాయి వేరు, ఇది వేరు. అవి ఇంకా స్థానిక మార్కెట్లకి చేరువకాలేదు. ఆ లోటుని వీటితో పూడ్చవచ్చు.

ఇవి కొన్ని ఆలోచనలు మాత్రమే. ఈ వ్యాసం రాయడం వెనుక ఉద్దేశం కూడా ఇలాంటి ఆలోచనలని మొదలు పెట్టించాలనే.

అయితే ఇక్కడ వ్యాపారీకరణతో వచ్చే ఇతర ప్రభావాలనూ, చిక్కులనూ కూడా చెప్పుకోవాలి.

వ్యాపారీకరణతో వచ్చే మొదటి సమస్య డబ్బు. అవును, డబ్బే! అంత వరకూ కంటెంటు మీద ప్రాధాన్యం ఉంచిన సైట్లు హఠాత్తుగా డబ్బు కోసం పాఠకుల గురించి ఆలోచించడం మొదలుపెడతారు. వారికి ఎలాంటి కంటెంటు నచ్చుతుంది, ఏది ఎక్కువ వివాదాలు, వాగ్వాదాలను సృష్టిస్తాయి, ఎక్కువ హిట్లు సంపాదించి పెడతాయి.. ఇలా అన్నమాట.

ఉదాహరణకు సినిమాల ఆధారితమయిన కొన్ని తెలుగు సైట్లు. వాటిలో ప్రకటనలు ఎక్కువ, కంటెంటు తక్కువ. మొదట మంచి కంటెంటుతో ఆకట్టుకున్న ఈ వెబ్‌సైట్లకు ఇప్పుడు ప్రజలను తమ సైటుకి రప్పించడమే ధ్యేయం. దానికోసం నిజాయితీకి నీళ్ళొదిలేసి, బ్రేకింగ్ హెడ్‌లైన్‌లతో ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాసాలు ప్రచురించడం వంటి పెడదోవలు తొక్కుతున్నాయి.

ఈ మధ్యే వెబ్‌జైన్ గా చెప్పుకునే ఒక సైటులో వ్యక్తిగత బ్లాగుల చర్చలలోంచి దూషణలను తమ వెబ్‌జైన్ లో ప్రచురించింది. బ్లాగరుల గురించీ, బ్లాగుల గురించీ పనికిరాని చర్చ జరపడానికి అది వేదికగా నిలిచింది. ఇవన్నీ చవకబారు ఎత్తుగడలు. ప్రస్తుతం ప్రజలను ఆకట్టుకోవడానికి ఉపయోగపడగలవేమో కానీ వారిని నిలుపుకోలేవు.

అలాగని డబ్బు చేసుకోవడం తప్పు కాదు; అది కూడా కావాలి. ఎందుకంటే.. ఏపనైనా, లాభం ఉంటే ఎక్కువ మంది దాని మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది -ఆ పెట్టుబడి శ్రమ రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు. తెలుగు అంతర్జాల పరిశ్రమ మంచి ఆలోచనలను అమలుపరచి, తెలుగు వెబ్‌సైట్లు వ్యాపారీకరణ దిశగా అడుగులు వేస్తాయని ఆశిద్దాం.

—————–

ప్రవీణ్ గార్లపాటి బ్లాగావరణంలో ఆబాలగోపాలానికీ పరిచితుడైన బ్లాగరి, గార్లపాటి ప్రవీణ్. చురుకుగాను, తరచుగాను రాసే కొద్దిమంది బ్లాగరులలో ప్రవీణ్ ఒకరు. తెలుగుబ్లాగు గుంపులోనూ, అంతర్జాలంలో తెలుగుభాష వ్యాప్తికోసం జరిగే సాంకేతికాంశాల సహాయాల చర్చలలోనూ ప్రవీణ్ చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. తెలుగు బ్లాగుల్లోని అత్యుత్తమ టపాలను ఎంచి ఒక eపుస్తకంగా ఇటీవలే వెలువరించారు.

About ప్రవీణ్ గార్లపాటి

బ్లాగావరణంలో ఆబాలగోపాలానికీ పరిచితుడైన బ్లాగరి, గార్లపాటి ప్రవీణ్. చురుకుగాను, తరచుగాను రాసే కొద్దిమంది బ్లాగరులలో ప్రవీణ్ ఒకరు. తెలుగుబ్లాగు గుంపులోనూ, అంతర్జాలంలో తెలుగుభాష వ్యాప్తికోసం జరిగే సాంకేతికాంశాల సహాయాల చర్చలలోనూ ప్రవీణ్ చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. తెలుగు బ్లాగుల్లోని అత్యుత్తమ టపాలను ఎంచి ఒక eపుస్తకంగా ఇటీవలే వెలువరించారు.
This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

10 Responses to అంతర్జాలంలో వ్యాపారీకరణ

  1. John Hyde says:

    good

  2. బ్లాగు చాలా బాగుందండీ. ఇంకా మంచి పోస్టులు మీనుండి రావాలని కోరుకుంటున్నా.

  3. సులభంగా అర్ధమయేలా ఉంది. బాగుంది.

  4. shiva-speaks says:

    అఫిలియేట్ మార్కెటింగ్ మంచిది. మీ కాంటెంట్ ని దృష్టిలో ఉంచుకుని టై అప్ అవండి. నేను ఈ విషయముల మీద త్వరలొ ఒక పోస్ట్ రాస్తాను.

  5. పెదరాయ్డు says:

    మీరు అర్థవంతమైన చర్చలకు తెర తీస్తున్నారు కాని ప్రతిస్పందనలు ఆశించిన స్థాయిలో లేవు. కూడలి, జల్లెడ లాంటి అగ్రిగేటర్స్ లో రిజిస్టర్ చేసారా?

  6. కె.మహేష్ కుమార్ says:

    ఆలోచన చాలా బాగుంది. చెయ్యడం ఎలా?

  7. rayraj says:

    :)) అతి ముఖ్యమైన ఈ విషయం గురించి చర్చ అర్ధంతరంగా ఆగిపోయిందేటి చెప్మా!
    :))

  8. Pingback: తెలుగు సినిమా వెబ్ సైట్లు – ఎంత సంపాదిస్తాయి? « జురాన్ సినిమా

  9. Pingback: రోజువారీ సమాచార వినియోగంలో తెలుగు — నా ఆకాంక్షలు « వీవెనుడి టెక్కునిక్కులు

Comments are closed.