ఎదురు చూస్తూ
– స్వాతీ శ్రీపాద
——–
అందంతే అలా జరిగిపోతుంటుంది..
-కె. లుగేంద్ర
——-
మరో కవిత
– జాన్‌హైడ్ కనుమూరి
———
మట్టి – మరికొన్ని ప్రశ్నలు
– సిరికి స్వామినాయుడు
ఎదురు చూస్తూ
– స్వాతీ శ్రీపాద
——–
అందంతే అలా జరిగిపోతుంటుంది..
-కె. లుగేంద్ర
——-
మరో కవిత
– జాన్‌హైడ్ కనుమూరి
———
మట్టి – మరికొన్ని ప్రశ్నలు
– సిరికి స్వామినాయుడు
నవనందనవాసంతంలో ఎదురయ్యిన సమస్యలను ఎవరెవరు ఎలా పరిష్కరించారో చూద్దాం.
సమస్య: కాలము జేసినన్ గలుగు సౌభాగ్యంబశేషమ్ముగా
లంక గిరిధర్
శ్రీ లింటన్ నిలువంగనీక కడుదారిద్ర్యంబు వెన్నాడి భే
తాలున్ విక్రముడెంతజేసిన నిజస్థానంబు మార్పంగ లే
జాలండట్లు తిరంబునైన తుద కా ఛాయల్ ద్యుతిప్రాప్త ధూ
పాలై కాలము జేసినన్ గలుగు సౌభాగ్యంబశేషమ్ముగా
వసంత్ కిశోర్
సతీ అనసూయ సుమతితో :
పతిగా నీకొక మూర్ఖ మానవుడు , పా – పాత్ముండు ప్రాప్తించినన్
సతిగా నీదెశ చూడ కుండినను, వే – శ్యాలోలు డైనన్సరే
గతినే మార్చగ నీవు జేయు పలు , సౌ – కర్యంబులన్ గూల్చినన్
పతితో కాలము జేసినన్ గలుగు సౌ – భాగ్యం బశేషమ్ముగా !
దువ్వూరి సుబ్బారావు
నీతిందప్పని సత్యజీవనమునన్ నిశ్చింతగా సాగుచున్
భీతింజెందక కష్టనష్టములలో విశ్వేశునే నమ్ముచున్
భూతాత్మా! పరమాత్మ! నీలగళ! శంభో! యంచు నిత్యార్చనల్
ప్రాత:కాలము జేసినన్ గలుగు సౌభాగ్యం బశేషమ్ముగా !
నచకి
సభలో పట్టము గట్టునేమొ త్వరలో సంప్రీతిఁ నందాఖ్యుకున్
అభిశంసించిన సంగతుల్ మఱచునో, ఆ వైశ్యుడో, వేశ్యయో
ప్రభువో కాలము జేసినన్ గలుగు సౌభాగ్యంబశేషమ్ముగా
విభవంబంతయు సొంతమౌను గద యా వేశ్యాసమ్మోహమ్ము వీ
డి భవిష్యత్తున రాజ్యమేమిటను మాటే రాజు యోచించినన్
ఈ పద్యమునకు మూలము: “ఉత్తున్గభుజ నాశోవా దేశకాలగతోపివా వేశ్యా వణిగ్వి నాశోవా నన్దో రాజా భవిష్యతి” అన్న సంస్కృతపద్యం.
ఉత్తుంగభుజుడన్న రాజు ఒక వేశ్య (రాజనర్తకి?) మోజులో పడి తన పట్టపురాణిని అలక్ష్యం చేయటమే కాక గర్భిణియైన ఆమెను తన రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ఆమె తన అనుంగు చెలికత్తెతో రాజ్యము బయటనున్న ఒక అడవిలో కాలం వెళ్ళదీస్తూ ఉంటుంది. రాణిగారికి పెళ్ళికి ముందు నుంచీ కూడా ఆమెకి పుట్టినింట బట్టలమ్మిన వ్యాపారి ఒకరు ఆమె మీది గౌరవంతో “రుణరూపేణా” ఆమెకు, ఆమె చెలికత్తెకు, ఆమెకు అడవిలో ఉండగా పుట్టిన కొడుకు నందుడికి తగిన సరుకులు, బట్టలు తెచ్చి యిస్తూ ఉంటాడు. అప్పులు పెఱిగిపోతున్నాయి, రాజుగారేమో మాఱరు, నా కొడుకు భవిష్యత్తు తలచుకుంటే బాధగా ఉందని రాణి బాధపడినప్పుడు చెలికత్తె చెప్పే పద్యమది. “ఉత్తుంగభుజుడు మరణించవచ్చు, దేశకాల పరిస్థితులు మాఱవచ్చు, ఆ వేశ్య కానీ యీ వర్తకుడు కానీ మరణించవచ్చు, నందుడు రాజూ కావచ్చు” అని, ఏది జఱిగినా రాణి కష్టాలు తీఱినట్టేనని. “నందో రాజా భవిష్యతి” అన్నది కూడా “ఏమో, ఏం జఱగనుందో!” అన్న అర్థంలో వాడటం మీకు తెలిసే ఉంటుంది.
ఫణి
పదరా నాయక! సేవజేయ ప్రజకున్ స్వార్థమ్మునే వీడుమా!
మదిలో దేశము జాతినిల్పి సమతా మార్గమ్ములో పాలనన్
పదవీకాలము జేసినన్ గలుగు సౌబాగ్యంబశేషమ్ముగా
పది కాలమ్ములు నీదు నామమిలలో భద్రమ్ముగా నిల్చులే!
సమస్య: అర్జునునికి వణుకు పుట్టె నశనిపాత భీతిచే
లంక గిరిధర్
ద్రోణనిర్మితవ్యూహము త్రుంపనేగె
బాలు డొక్కడను పిడుగుపాటు వార్త
కర్జునునికి వణుకు పుట్టె నశనిపాత
భీతిచే నచలములు మున్ బెడకినట్లు
వసంత్ కిశోర్
నిర్జనముగ జేయు ననిని – నిర్విరామ దీక్షతో
నిర్జరు డగు బావ మదిని – నిలిచి యుండ తోడుగా
నర్జునునికి ! వణుకు పుట్టె – నశని పాత భీతిచే
గర్జనలను విన్న ద్వార – క న్వసించు వారికే !
వసంత్ కిశోర్
శకుని కర్ణున్ని పొగుడుతూ ధుర్యోధనునితో చెబుతున్న మాయ మాటలు !
భీకరముగ కర్ణు డనిని – సూకములను
భీషనముగ కొట్టి నపుడు – భీతి జెంది
యర్జునునికి వణుకు పుట్టె ! – నశని పాత
భీతిచే భీము డయ్యని – భీరువయ్యె !
గోలి హనుమఛ్ఛాస్త్రి
నిర్జరపతి సుతుని యమ్ము నిజము వజ్ర ఘాతమే
నిర్జనముగ నరికి వేయు నిపుడ టంచు భీతిలెన్
అర్జునునికి – వణుకు పుట్టె నశనిపాత భీతిచే
దుర్జనులగు యరులు జూడ తొణుకు చుండెగా మదిన్.
గన్నవరపు మూర్తి
ఊర్జితమగు గోప మూని యుర్వి యదుర నార్చుచున్
‘నిర్జనపతిఁ జేతు నవని నిశ్చయమ్ము పరశువున్ ‘
గర్జన లిడి భీతి గొల్ప ఘనుడు రాము డుగ్రతన్
అర్జునునికి వణుకు పుట్టె నశనిపాత భీతిచే !
ఆదిత్య
స్ఫూర్జగర్జనలకు తానె స్ఫూర్తి నిచ్చు ఆర్భటిన్
ధూర్జటివలె భీష్ముపైకి దూకె కృష్ణ మేఘమే
స్వార్జిత చిరకీర్తి ఫలము వరదపాలగునని లో
నర్జునినికి వణుకు పుట్టె అశనిపాత భీతిచే
ఫణి
దుర్జయుడగు భార్గవుడదె తునిమి సాగె కుత్తుకల్
మార్జనమును జేసెననిని మరుగు రక్త ధారచే
దుర్జనుండనంచు నన్ను త్రుంచునంచు కార్తవీ
ర్యార్జునునికి వణకుపుట్టె నశనిపాత భీతిచే!
సమస్య: భార్యకు మ్రొక్కిన శుభమగు పతి దేవునకున్
గోలి హనుమఛ్ఛాస్త్రి
భార్యగ మారెడు వధువే
ఆర్యా ! శ్రీ గౌరి దేవి నారాధిస్తూ
కార్య సఫలతకు శంభుని
భార్యకు మ్రొక్కిన శుభమగు పతి దేవునకున్.
లంక గిరిధర్
శౌర్యము చెల్ల దని తెలిసి,
కార్యము సాధింప నట్లకాడల లాఠీ
చర్యల గయాళిని వెఱచి,
భార్యకు మ్రొక్కిన, శుభముగు పతిదేవునకున్
గన్నవరపు మూర్తి
ఆర్యాణి, శివులఁ గలుపగ
వీర్యమ్మున శరము లేసి విల్తుఁడు గూలన్
భార్యామణి రతి శంభుని
భార్యకు మ్రొక్కిన శుభమగు పతి దేవునకున్
దువ్వూరి సుబ్బారావు
భార్యకు పతియే దైవము
భార్యకు సుఖ దు:ఖములను బాసట పతియే
మర్యాద గల్గు పతిచే
భార్యకు మ్రొక్కిన శుభమగు పతి దేవునకున్
వసంత్ కిశోర్
కాశీ జేరిన పిమ్మట , చంద్రమతి హరిశ్చంద్రునితో :
ఆర్యా ! సద్గుణ సాంద్రా !
శౌర్యము , వీర్యము గలిగిన – సత్య వ్రతుడా !
ఆర్య, యపర్ణయు , పురహరు
భార్యకు మ్రొక్కిన శుభమగు ! – పతి దేవునకున్ !
శ్యాం పుల్లెల
కార్యముకొఱకాఫీసరు
భార్యకు మ్రొక్కిన శుభమగు – పతిదేవునకున్
కార్యమును చెప్పమని కవి
వర్యుడు ఘన రామదాసు పాడగ లేదా?
ఫణి
కార్యార్థి యౌచు పత్నిని
ఆర్యులకడ వీడి చనెడు అవసరమందున్
ధైర్యము వీడక శంభుని
భార్యకు మ్రొక్కిన శుభమగు పతిదేవునికిన్!
సమస్య: తిరుగుచు నుండు గాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్
లంక గిరిధర్
పరపతిలేని కార్యముల భారము మూపున గానుగెద్దనన్
తిరపడ, ముందు కేగక ప్రతిక్షణ మెవ్వనికో తలొగ్గు మో్ర
తరి పనితావు గానడు కృతార్థత, కార్యసముద్రమధ్యమున్
తిరుగుచు నుండు గాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్
గన్నవరపు మూర్తి
శరముల నుర్వి నాకముల జన్మము లొందుచుఁ గర్మ బంధమున్
విరతియు లేక దేహముల విశ్రుత ధర్మము లాచరించినన్
గిరిధరు భక్తి భావమున గీర్తన సేయక ముక్తి రాదు దాఁ
దిరుగుచు నుండు గాని యొక తీరముఁ జేరడు జీవు డెన్నడున్ !
దువ్వూరి సుబ్బారావు
పరిమితి లేదు కోర్కెలకు వాంఛలచే జనియించు మోహమున్
దరిగనరాని మోహమున తప్పదు బంధము బంధనమ్ములన్
మరల భవాబ్ధి కోర్కెలును మర్మ మెఱుంగగ లేక నంధుడై
తిరుగుచు నుండు గాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్
వసంత్ కిశోర్
సిరిపతి జేరగోరి, యట – శ్రీపతి మూర్తిని ముందు నిల్పినన్
తిరమది లేక భావమున , – దిక్కది తూర్పును జూచు నట్లుగా
స్థిరముగ ముక్కు మూసుకొని – తీరుగ గూర్చొన , ధ్యాన మందునన్
తిరుగుచు నుండు గాని యొక – తీరము జేరడు జీవు డెన్నడున్ !
ఆదిత్య
ఎరుగదు గానుగెద్దు గుడులెంతగ చుట్టిన తైల స్వాదమున్
ఎరగొను మోక్షఘాసమును ఎట్టులొ క్షోద్ధుడు సిద్ధమానవుం
డరిగిన ఏగుదెంచు మరలాతడు సృష్టికి యంతమున్నదో ?
తిరుగుచునుండుగాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్
ఫణి
మరుచును దైవమున్ మరల మాధవు జేరెడు మోక్షమార్గమున్
పరుగులు తీయు మానవుడు పైడియు పేరును కోరి మూర్ఖుడై
తిరుగలిలోని గింజవలె దిగ్గలి యందలి కప్ప బోలికన్
తిరుగుచునుండు గాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్
సమస్య: రాష్ట్రమునేలఁగా నొక విరాధుఁడు రావలె రక్త పాయియై!
దువ్వూరి సుబ్బారావు
రాష్ట్రము రాజభోజ్యమను! రాష్త్రహితమ్మన స్వార్థమే యనున్!
రాష్ట్రజనుల్ పసుల్ గనగ రారవివేకులు ప్రశ్నజేయ, సౌ-
రాష్ట్రము తీరునొల్లనను రాష్ట్రపు నేతలు! చూడనింక నీ
రాష్ట్రమునేలఁగా నొక విరాధుఁడు రావలె రక్త పాయియై!
గన్నవరపు మూర్తి
రాష్ట్రము నేలు దుర్మతులు లజ్జ యొకింతయు లేక హీనులై
రాష్ట్రము దోచ, తస్కరుల, రక్త పిపాసుల మట్టు పెట్టుచున్
రాష్ట్రమునేలఁగా నొక విరాధుఁడు రావలె రక్త పాయియై
రాష్ట్రముఁ బ్రోవ సత్కృప విరాధుని ద్రుంచడె రాము డప్పుడున్ !
ఫణి
ఖలులు కఠినాత్ములసురుల్
గల రాష్ట్రమునేలగానొక విరాధుడు రా
వలె రక్తపాయియై వా
రలనేరి ప్రజల మనమ్ముల ముదమెనర్పన్
నచకి
రాష్ట్రము నేలఁగా నొక విరాధుఁడు – రావలె రక్తపాయియై
రాష్ట్రమునందు పౌరులకు రక్షణనీయగ జామదగ్నియే –
భ్రాష్ట్రము పోల్కి నుగ్రుడయి పాలకరాజును సంహరించియున్
రాష్ట్రముఁ శాంతిసౌఖ్యముల రాజిలజేసెడి రాముడాతడే!
సమస్య: జాలములో లేనిదేది జగమున లేదే
లంక గిరిధర్
జాలరి నరుడు చరాచర
జాలమును కబళన జేయసాగె దురాశన్
చాలదు క్షు త్తుడుగ దతడి
జాలములో లేనిదేది జగమున లేదే
గన్నవరపు మూర్తి
మిగిలిన సంగతి తెలియదు, పెళ్ళి సంబంధములు మహా జోరుగా సాగుతున్నాయిట జాలములో !
కాలము దెచ్చిన మార్పుల
వేలములన్ వేసి మరులు వేవురు వరులున్
జాలముఁ జిక్కిరి జాణలఁ
జాలములో లేని వేవి జగతిని లేవే !
దువ్వూరి సుబ్బారావు
గేలము సొమ్ముకు, విలువల
వేలము, పరిశీలనముల వెలదుల శీలం-
బేలా సంశయ మంత-
ర్జాలములో లేనిదేది జగమున లేదే
వసంత్ కిశోర్
భారతంలో లేనిదేదీ లోకంలో లేదని వ్యాస ఉవాచ :
మూలము , సత్యము , ధర్మము
కాలపు రీతు , లవినీతి – కార్యక్రమముల్
మేలగు విలువలు , భారత
జాలములో లేని దేది – జగమున లేదే !
ఫణి
వేలజగమ్ములు పుట్టును
మేలగు నీ మనము నందె మేఘమువోలెన్
ఏలర సంశయమా ఘన
జాలములో లేనిదేది జగమున లేదే
సమస్య: పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్ !
లంక గిరిధర్
పంచాస్యున్ నుతియించె నొండసురు డా భస్మాంగు సంప్రీతి సా
ధించెన్ చేతులవింతశక్తిగెలిచెన్ తీక్ష్ణాగ్ని భస్మంబుగా
వించన్ సాగె వరంబొసంగిన భవున్ వీక్షింప వైచిత్ర్యమై
పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్
గోలి హనుమఛ్ఛాస్త్రి
అడవిని వదలి దారి తప్పి ఊరి లోకి వచ్చిన సింహం తో గ్రామ సింహం…
పంచ్చాస్యంబువు నీవె గాని కనగా వాసంబు కారాటవే
పంచాస్యంబును నేనె గ్రామమున కావాసంబు నీ వీధియే
కొంచెం బైనను చోటు లేదనుచు తా కోరల్ని చూపించుచున్
పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్
వసంత్ కిశోర్
వరమిచ్చి వెళ్ళబోతున్న శివునితో భస్మాసురుడు :
పంచారించిన నాదు చేయి శిరమున్ – భస్మంబు నీవౌదువో ?
కించి త్తాళుము ! విశ్వనాథ ! కరమున్ – గోరంత , నీ నెత్తిపై
పంచారించి , పరీక్ష జేతు , వరమున్ – పాలాక్ష ! యంచున్నటన్
పంచారించగబోవు దుష్టు భయమున్ – పర్వెత్తె పంచాస్యుడే!
పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ – శ్వానమ్ము చిత్రమ్ముగన్ !
దువ్వూరి సుబ్బారావు
సంచుల్ పంచుచు సామభేదములతో జాతీయ కాంగ్రేసు చే-
యించెన్ చూడు ప్రచార మోట్ల కొఱకై నేమాయె యూపీన నా
వంచింపుల్ గ్రహియించి సజ్జనములే ప్రాంతీయమున్ మెచ్చె నౌ
పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్ !
వసంత్ కిశోర్
సింహా న్నోడించిన చెవుల పిల్లి సంగతిది ! అందరికీ తెలిసిందే ! :
మంచిన్బెంచగ నెంచినట్టి మృదు రో – మంబంత నిశ్చింతగాన్
వంచించన్ సమకట్టి యా మెకము; న – వ్యాజంబుగా , దానితో
చాంచల్యంబగు నీదు రాజ్యమిక , నో – చంద్రాస్య , యిద్దేశమున్
పంచారించగ జూచు చుండెనిదె,నీ – ప్రత్యర్థి యిబ్బావిలో
యంచుం జెప్పిన , బావిదూకెనది హా – హాకారమున్ జేయుచూ !
పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ – శ్వానమ్ము చిత్రమ్ముగన్ !
నచకి
సంచారించు విమానమే త్రుటిని హైజాకయ్యి భద్రస్థలిన్ –
పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్
పెంచంగా దగునే విషాస్పదులిలన్? వేలార్చు సౌభాగ్యముల్
కొంచెమ్మైన దయాగుణంబుఁ గనరే కూళాత్ములే తీరునన్!
(సెప్టెంబరు 11, 2001 నాడు అమెరికా రక్షణాలయమైన పెంటగన్ పై జఱిగిన వైమానిక దాడుల నేపథ్యం)
శ్యాం పుల్లెల
కుంచెన్ పట్టుకు చిత్రకారుడిలలో క్రొంగొత్త మార్గంబునన్
పంచున్ హాస్యము బాలబాలికలకున్ వ్యంగ్యంపు చిత్రాలలో
కాంచన్ గాదది వింత, బుల్లి తెరపై కార్టూను చిత్రంబులో
పంచాస్యంబును వెంటనంటి తరిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్
సమస్య: వాక్స్వాతంత్ర్యము లేని దేశములనే వర్ధిల్లు సారస్వతుల్
లంక గిరిధర్
ప్రాక్స్వేచ్ఛాదృతి మానవామరుల సంబంధస్థ పావిత్ర్యమున్
వాక్స్వోత్కర్షము పెంపునన్ సడలు దుష్ప్రారబ్ధ మార్గమ్ములన్
దృక్స్వాభావిక మంచు పాదుకొన నీదే, దైవ దూషార్థమౌ
వాక్స్వాతంత్ర్యము లేని దేశములనే వర్ధిల్లు సారస్వతుల్
తాత్పర్యము – ప్రాక్దేశ నిర్దేశిత స్వేచ్ఛ దైవ మానవ సాంబంధ పవిత్రతను మనబుద్ధి
గొప్పదని నమ్మి తూలనాడ నీయదు, దైవ దూషణ చేయగల స్వాతంత్ర్యములేని దేశములలోనే
సారస్వతులు వర్ధిల్లుచుందురు
దువ్వూరి సుబ్బారావు
పాక్స్వాతంత్ర్యము పొందె గాని యకటా ప్రారబ్ధమే మందు నా
పాక్స్వేచ్ఛన్ గణుతింప స్వేచ్ఛ యణువే పౌరాళికిన్ వారిదౌ
వాక్స్వాతంత్ర్యము ముప్పునంబడెగదా పల్మార్లు “సంకెళ్ళలో
వాక్స్వాతంత్ర్యము” లేని దేశములనే వర్ధిల్లు సారస్వతుల్.
సమస్య: కాడు పిలిచె నిన్ను కదలవేమి?
గోలి హనుమఛ్ఛాస్త్రి
శకుంతల తో చెలి కత్తె…
‘ పిల్ల ‘ గాలి కొరకు ప్రియుడు దుష్యంతుడు
వచ్చి చేరి నాడు వనము నందు
నాన్న గారు లేరు నడుమ నడుము చెలి
కాడు పిలిచె నిన్ను కదల వేమి?
గన్నవరపు మూర్తి
వరూధినితో చెలికత్తెలు ;
కల్ల గాదు నిజమె కరఁగి యా ప్రవరుండు
ప్రియముఁ గూర్చ వచ్చె రయముఁ దోడ
విధువు వెల్లివిరిసె వినుతించి నెచ్చెలి
కాఁడు పిలిచె నిన్ను కదల వేమి ?
లంక గిరిధర్
యేలిక రఘురాము కాల మకాల మృ
త్యువులు లేవని పని త్రోయు టేమి
దినకరుండు గ్రుంకె దీపాల వేళాయె
కాడు పిలిచె నిన్ను గదల వేమి
ఇవి యొకకాటికాపరితో భార్య నుడువిన పల్కులు..
వసంత్ కిశోర్
వీరబాహుడు హరిశ్చంద్రునితో :
కాటి కాప రీవు – నేటి నుండి యిచట
కల్లు కుండ మరియు – కర్ర గొనుము !
కాకరూక ములును – కంకము లట నుండు
కాడు పిలిచె నిన్ను – కదల వేమి?
దువ్వూరి సుబ్బారావు
బ్రోవ భార మేమి బ్రోచువా రింకను
నిను వినను మరెవ్వ రనుచు రామ!
కీర్తనలను జేసె నార్తి తోడను పాట
కాడు పిలిచె నిన్ను గదలవేమి ?
ఫణి
నిండు జాబిలి యది పండు వెన్నెల రేయి
కొండమల్లె తావి గుండె నిండ
మరుశరమ్ములబోలు మాటలతో చెలి
కాడు పిలిచె నిన్ను కదలవేమి?
సమస్య: పాపము లేనిచో జగము పాడయి పోవును నిశ్చయంబుగన్
దువ్వూరి సుబ్బారావు
శ్రీపతి నందనందనుడు శ్రీ రఘుభార్గవరామ వామనుల్
చేప వరాహకూర్మనరసింహులు బుద్ధుడు కల్కిరూపులన్
పాపుల మట్టుబెట్టడె ప్రపన్నుల గావగ నెంత జాలియో
పాపము! లేనిచో జగము పాడయి పోవును నిశ్చయంబుగన్
సమస్య: తెలుగు ప్రాచీనభాషగాదిలను జూడ !
గన్నవరపు మూర్తి
నవ నవోన్మేషమై వెల్గు ననను గనుమ !
తేనె లూరెడి కవితల తీపి గొలుపు
పరిళ మించెడి ప్రత్యూష వారిజమ్ము !
తెలుగు ! ప్రాచీన భాష గాదిలను జూడ !
నన = పుష్పము
ప్రాచీన భాష హోదా వచ్చిన తరువాత యిది పాత చింతకాయ పచ్చడి కాదంటే మనకు వచ్చిన
నష్ట మేమిటి ?
గోలి హనుమఛ్ఛాస్త్రి
తెలుగు నచ్చిన వాడిట్లు తెలియ జేసె
‘ తెలుగు ప్రాచీన భాష గా యిలను జూడ’
తెలుగు నచ్చని తంబిట్లు దిద్ది నాడు
‘ తెలుగు ప్రాచీన భాష గాదిలను జూడ’
లంక గిరిధర్
జనని కాదని సంస్కృతంబును విదిల్చి
తమిళకన్నడమలయాళ ద్రావిడంపు
యోషలే దనకు సుహృద భాషలన్న
తెలుగు ప్రాచీనభాషగాదిలను జూడ
ఆరోపణము రాబర్టు కాల్డవెల్ సృష్టించిన ద్రావిడభాషాసమూహము మీద యన్నది
తాత్పర్యము.
వసంత్ కిశోర్
ఒక తమిళ పార్లమెంటు సభ్యుడు ప్రధాన మంత్రితో :
భరత దేశాన , జూడగ – భాష లందు
తమిళ భాషయె , ప్రాచీన – తమము గాన
తమిళ భాషకె , నిధులివ్వ – ధర్మ మగును !
తెలుగు ప్రాచీన భాష గా – దిలను జూడ !
దువ్వూరి సుబ్బారావు
తెలుగు భారతి నాల్కపై తిరుగు భాష
తెలుగు ఆంధ్రుల జిహ్వకు తీపి భాష
తెలుగు స్వాయంభువైనట్టి దివ్య భాష
తెలుగు ప్రాచీనభాషగాదిలను జూడ !
నచకి
యూనికోడున “అక్షర” స్థానమొంది
విశ్వవిస్తృత జాలమె విడిది గాగ
బ్లాగులోకాన రాజిల్లు భాష మనది
తెలుగు ప్రాచీనభాషగాదిలను జూడ !
పొద్దు పాఠకులందరికీ నందన ఉగాది శుభాకాంక్షలు. అంతర్జాల కవి కర్షకుల సేద్యంగా, రస రమ్యమైన పద్య సుమాలతో శోభిల్లిన ‘ నవనందనవాసంతము ‘ నుండి మీకై ఏర్చి కూర్చిన పూగుత్తులను అందుకోండి. ఆనందించండి.
ముందుగా ఎవరెవరు ఎలా ప్రార్థన చేశారో, ఏమి ఆకాంక్షించారో చూద్దాం.
సనత్ శ్రీపతి
ముందుగ నీకె మ్రొక్కెదను మోదక హస్త ముదమ్మునంది మ
న్మందిర మందు నీదు మృదు మంజుల పాదయుగమ్ముతో సుధా
స్యందమరందబిందువుల సందడినందరికందజేసి శ్రీ
నందన నామ వత్సరమునందు పసందగుపద్యమందుమా !!
దువ్వూరి సుబ్బారావు
నందన నామ వత్సరపు నవ్య మధూదయ చంద్రికా ద్యుతిన్
వందన మాచరించెదము పల్కుల తల్లికి పద్యవాక్సుధల్
కుందన జాల పాత్ర నిడి కూర్మి నివేదన జేసి సాహితీ
స్యందన మందు తెన్గు పుర యాత్రకు నేగెడు వేళ ప్రీతితో.
వసంత్ కిశోర్
వందిత దేవతా , నరుల – వందన మందెడు గుజ్జు వేలుపా
నందన నామ వత్సరము – నాట్యము సేయగ పద్య సంపదల్
చందన గంధమందు మిదె – చల్లని చూపుల బొజ్జ దేవరా
ముందుగ వందనం బిడుదు – మూషిక వాహన ! మమ్ము గావుమా !
లంక గిరిధర్
శ్రీగిరిదేవనందన కుచిద్దమనా సితపద్మలోచనా
శ్రీగణనాథ సిద్ధియుత శ్రీకరరూప వియచ్చరన్నుతా
శ్రీగురుతుల్యశాంతిమయ శ్రీధరసేవ్య జగద్ధరప్రియా
శ్రీగజమూర్ధ వీతభయ శ్రీశుభదాయక విఘ్ననిర్భయా
అని గణనాథుని నుతించి
సిరిపతిపుత్రజాయ విదుషీ మృదుభాషిణి వాక్ప్రభా ఝరీ
గురుతరపూజ్యభాజన అకుంఠితపండితసత్వకారణా
సురనరవంద్యనామ ప్రియసూక్త వినిర్మలభాతి భారతీ
సరసిజగర్భ హృత్సరసిజస్థిత సారమతీ సరస్వతీ
అని చదువులతల్లి పాదములకు మోకరిల్లి
అనుసరణీయ పద్ధతుల నాచరణీయము చేయు లఘ్వులై
అనుకరణీయ పండితుల నాదరమొప్పగ కొల్చు గుర్వులై
జనతతిమెచ్చు గోష్ఠులకు జాలకవీంద్రులనన్ గణంబులై
జను చినచేపలైన మము చల్లనిచూపుల గావు మొజ్జలై
అని వేడుకొని, నవనందనవాసంతగోష్ఠి లోనికి ప్రవేశించిరి జాలకవులు.
కామేశ్వరరావు
కవికోకిలలు గళమ్ములు
సవరింపగ సరసపద్య సమ్మోహనమై
నవనందనవాసంతము
భువనానందమ్ము గూర్చు పొద్దుపొడిచెగా!
ఫణి
వందనమెల్ల కవులకు ప
సందగు పద్యరచనావిశారదులకు శ్రీ
నందన మందున వీనుల
విందును చేయంగ వచ్చు విద్వత్తతికిన్
అలా ప్రార్థించుకుని అడుగిడగానే వారికిచ్చిన కవనక్షేత్రమును, మా ప్రశ్నపత్రమును పరికించండి
************************************************************************
*సమస్యాపూరణము*
*దత్తపదులు*
*పద్యాలతో రణం*.
ఈ శీర్షిక క్రింద మేమిచ్చే అంశం ఆవకాయ vs గోంగూర. ఈ రెంటిలో ఏది గొప్పది అన్నది తేల్చాలి! J రెండిటిలో ఖచ్చితంగా ఏదో ఒక పక్షాననే ఉండాలి. రెండూ బాగుంటాయి అని చెప్పినవి పరిగణించబడవు!! రెండిట్లో బాగా యిష్టమైన ఒకదాన్ని మాత్రమే సమర్థించాలి. ఒకటి రెండు పద్యాలలో వాదించాలి.
*వర్ణనలు*
http://www.crafts-gifts.com/paintings/indian-bow-arrow.jpg
http://picsoff.com/files/funzug/imgs/paintings/indian_paintings_20.jpg
*కొత్త ఛందస్సు*
వసంత ఋతువర్ణన —- *నవనందిని* అనే వృత్తం లో. దాని లక్షణాలు స-జ-స-న-గగ. 4వ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం ఉంది.
*అనువాదం*
I find no peace and all my war is done,
I fear and hope, I burn and freeze like ice,
I fly above the wind, yet can I not arise,
And naught I have and all the world I seize on;
That looseth nor locketh holdeth me in prison,
And holdeth me not; yet can I ’scape nowise;
Nor letteth me live nor die at my devise
And yet of death it giveth none occasion.
Without eyen I see; and without tongue I plain;
I desire to perish, and yet I ask health;
I love another, and thus I hate myself;
I feed me in sorrow, and laugh in all my pain.
Likewise displeaseth me both death and life,
And my delight is causer of this strife.
The curtains were half drawn; the floor was swept
And strewn with rushes; rosemary and may
Lay thick upon the bed on which I lay,
Where, through the lattice, ivy-shadows crept.
He leaned above me, thinking that I slept
And could not hear him; but I heard him say,
‘Poor child, poor child’; and as he turned away
Came a deep silence, and I knew he wept.
He did not touch the shroud, or raise the fold
That hid my face, or take my hand in his,
Or ruffle the smooth pillows for my head.
He did not love my living; but once dead
He pitied me; and very sweet it is
To know he still is warm though I am cold.
ग्रीवाभङ्गाभिरामं मुहुरनुपतति स्यन्दने बद्धदृष्टिः
पश्चार्धेन प्रविष्टः शरपतनभयाद्भूयसा पूर्वकायम्।
दर्भैरर्धावलीढैः श्रमविवृतमुखभ्रंशिभिः कीर्णवर्त्मा
पश्योदग्रप्लुतत्वाद्वियति बहुतरं स्तोकमुर्व्यां प्रयाति॥
గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యందనే బద్ధదృష్టిః
పశ్చార్ధేన ప్రవిష్టః శరపతనభయాద్భూయసా పూర్వకాయం
దర్భైరర్ధావలీఢైః శ్రమవివృతముఖభ్రంశిభిః కీర్ణవర్త్మా
పశ్యోదగ్రప్లుతత్వాద్వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి ||
चुलुकिततमः सिन्धोर्भृङ्गैः करादिव शुभ्यते
नभसि बिसिनीबन्धोरन्ध्रच्युतैरुदबिन्दुभिः ।
शतदलमधुस्रोतःकच्छद्वयीपरिरम्भणा-
दनुपदमदःपङ्काशङ्काममी मम तन्वते ॥
చులుకితతమః సింధోర్భృంగైః కరాదివ శుభ్యతే
నభసి బిసినీబంధోరంధ్రచ్యుతైరుదబిందుభిః
శతదలమధుస్రోతః కచ్ఛద్వయీపరిరంభణా
దనుపదమదః పంకాశంకామమీ మమ తన్వతే ||
एको रागिषु राजते प्रियतमादेहार्धहारी हरो
नीरागेषु जनो विमुक्तललनासङ्गो न यस्मात् परः।
दुर्वारस्मरबाणपन्नगविषव्याविद्धमुग्धो जनः
शेषः कामविडम्बितान्न विषयान् भोक्तुं न मोक्तुं क्षमः
యేకో రాగిషు రాజతే ప్రియతమాదేహార్ధహారీ హరో
నీరాగేషు జనో విముక్తలలనాసంగో న యస్మాత్ పరః
దుర్వారస్మరబాణపన్నగవిషవ్యావిద్ధముగ్ధో జనః
శేషః కామవిడంబితాన్న విషయాన్ భోక్తుం న మోక్తుం క్షమః
************************************************************************
ముందుగా నవనందిని వృత్తంలో పద్యాలతో నందన యుగాదికి అర్చన చేద్దాం.
వసంత ఋతువర్ణన —- *నవనందిని* అనే వృత్తం లో. దాని లక్షణాలు స-జ-స-న-గగ. 4వ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం ఉంది.
సనత్ శ్రీపతి
కవనమ్ము లెత్తు కొనునా కవిగ ళమ్ముల్
రవళించు కోకిల స్వరార్ణవము తోడన్
చివురించు గుల్మ తతి లేచిగురు మ్రొగ్గల్
అవనిన్ వసంత మనగా నదియె నమ్మీ
గన్నవరపు మూర్తి
తలిరించె మామిడులు నా తరువు లందున్
గళ మెత్తి కోకిలలు స్వాగతము బల్కెన్
మలిసంజ ప్రేయసుల నామనియె రాగా
నలినాల దేటియలు గానములు సల్పన్ !
దువ్వూరి సుబ్బారావు
కుసుమించె నింబములు, కూకుహులు పాడెన్
మెసవింపులై పికము మామిడిచివుళ్ళన్,
వసివాడి శీతలమదే పరుగు వెట్టెన్,
ప్రసవించె నామనిసుతున్ ప్రకృతి తానై!
ఆమని = వసంతము, నలినము = తామర
ఆదిత్య
తనుమానసంబు పులకింతల సుఖమ్మం
దెనిదేమి చిత్రము? యుగాది రవమా? పూ
వనమా ? మనోజ శరమా ?పరువమా? ఆ
మని గ్రుమ్మరించిన సుధామధురజమ్మా?!
నచకి
రవళించు కోకిలల ఆరవములన్నీ
కవనమ్ములై విరిసి స్వాగతములీయన్
భువనాల నామని భలే పొలుపు నింపన్
నవనందనమ్మదియె నెన్నటికి యుండున్
నందన నామ సంవత్సర ఉగాది సందర్భంగా పొద్దు పత్రిక నిర్వహించిన వచన కవిసమ్మేళనం – నందనవనం
ఇందులో పాల్గొన్న కవులు;
1. హెచ్చార్కే
2. కేక్యూబ్ వర్మ
3. జాన్ హైడ్ కనుమూరి
4. కే. లుగేంద్ర
5. ఎమ్మెస్ నాయిడు
6. శైలజా మిత్ర
7. స్వాతీ శ్రీపాద
ముందుగా ఉగాదికి స్వాగతం;
– స్వాతీ శ్రీపాద
——————
విజృంభణ
– స్వాతీ శ్రీపాద
నేనంటాను
ఆకులైనా తివాసీయైనా
నీకోసమేగా
ఎందుకంటే
వసంతరాణివి నీవే కదా!
————-
ఉగాది మనలోనే ఉంది
– శైలజామిత్ర
ప్రతి సాయంత్రం
విషాదం కాకుంటే
అది ఉగాది కాక ఏమవుతుంది ?
ప్రకృతి చల్లదనం
పక్షుల కిల కిలా రావం
పసిపాప చిరునవ్వుల హారం
మానవత్వ పరిమళం
దాతృత్వం
అర్థం చేసుకునే తత్వం
ఆదరించే మహోన్నతం
ఉగాది కాక మరేమవుతుంది ?
ఉగాది అనేది పండుగే అందరికి
ప్రకృతి ఆనందం ఉగాది
మనిషిలోనే ఉంది ఉగాది
మంచి ఆలోచనే ఉగాది
చేతిలో కావాల్సింది ఉంచుకుని
ఎక్కడో వెదికితే
మనకు మిగిలేది సందేహాల నిశీధి.!
‘ There is always some madness in love.
But
there is also always some reason in madness.’
– Nietzsche.
వసంత రాత్రి వెన్నెల – పుచ్చపువ్వులా విచ్చుకునుంది.
అసలే మధు మాసమేమో, వెన్నెల్ని తాగి మరింత మత్తుగా తూలుతోంది…
ఆ అమృత వేళ లోకమంతా గాఢ సుషుప్తి లోకి, అతను మాత్రమే మెలుకువలోకి! ,
అంత నిశ్శబ్ద అర్థ రాత్రప్పుడు అతను ఇల్లొదిలి బయల్దేరాడు..చప్పుడు లేకుండా!
అలా, కొంత దూరం నడిచి, యేటి తీరాన్ని చేరాడు. “వచ్చావా, !నేస్తం” అంటూ.. నవ్వింది, అతని కోసమే వేచి వున్న ఆ చిన్ని పడవ.
అతను చకచకా, లంగరు ముడి విప్పి, పడవని ఇసక లోంచి లాగి, నీళ్ళ లోకి తోసాడు. ఆ వెంటే, చటుక్కున అందులోకి గెంతాడు. వేగంగా, గెడ తీసుకుని, బలంగా నీళ్ళని వెనక్కి తోసాడు. పడవ ముందుకి కదిలింది వూగుతూ వయ్యారంగా.!
ఒక రిథం లోకి వొచ్చాక, తెడ్డు చెప్పినట్టు కదులుతూ… ప్రయాణం సాగించింది ఆ పడవ.. ఆలాపనానంతరం..మొదల్లయ్యే ఓ మధుర గానంలా…
****
అదొక చిన్న ఊరు.
ఆ ఊరికి అటు కొండలు. ఇటు అడవులు. మధ్య లో యేరు. వీటన్నిట పైనీ కురుస్తూ వెన్నెల ధారలు!
నింగిలో వెలిగేదీ వాడే. నీటిలో మెరిసేదీ వాడే అన్నట్టున్నాడు చంద్రుడు. ఏటినీటి మడుగులో వెన్నెల గుత్తి పూచినట్టు.. యేరుయేరంతా మిసిమి వెలుగు పరుచుకుని వుంది. తల మీద వెండి కిరీటాలు పెట్టుకుని పరుగెడుతున్న అలలు కళ్ళని జిగేల్మనిపి స్తున్నాయి.
ఆ వెన్నెల రాత్రిని, నిశ్శబ్దరవాన్ని…. సెలయేటి సౌందర్యాన్నీ తిలకిస్తూ హాయిగా ఈల పాటందుకున్నాడు.. ఈ ఏకాంతాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాడు. దీని కోసం ఎంత కష్టపడ్డాడు! మొత్తానికి సాధించాడు.
అతనే సందీప్! అందగాడు. చురుకైన వాడు. ప్రకృతి ఆరాధకుడు. రాత్రి షికార్లు అతనికో హాబీ! వెన్నెల్లో బోట్ యానాలంటే ప్రాణం. గొప్పవెన్నెల ప్రియుడు. మూన్ లవర్.
అతనికెందుకో – ఆ క్షణంలో తరచూ వచ్చే ఓ కల చప్పున గుర్తొచ్చింది..
నదిలో వేగంగా దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్నభావన కలిగింది. ఓడ వైపు తను ఈదుతూ వెళ్తాడు. దేనికోసమో తెలీదు. అప్పుడు – తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్లు, తనచుట్టూ అంతులేని కడలి పరచుకున్నట్లు అనుభూతితో అలా చూస్తూనే వుంటాడు. ఆ తర్వాతేమౌతుందో ఏమో …చప్పున మెలకువొచ్చేస్తూ వుంటుంది. కొన్ని కలలకు జీవ శక్తి వుంటుందనుకుంటా..వెంటాడుతూ వుంటాయి.
ఈ కలకు తన మనసుకూ వున్న సంబంధమేమిటో అర్థం కాలేదు. చిన్న నిట్టూర్పు.. విడిచాడు.
అంతలో – అతని మనసులోకెవరో మెత్తగా అడుగిడుతున్నట్టు తోచింది.
‘ఏమిటిలా, ఎప్పుడూ లేనిది?’ అని అనుకున్నాడే కానీ, గుండెలో చోటు చేసుకునే ప్రేయసి తొలి ప్రవేశం అలాగే వుంటుందని అప్పడతనికి తెలీలేదు.
సాగుతున్న యానం ఒక్కసారిగా వులిక్కిపడేలా అతని ఈల పాటకి ఒక కర తాళం తోడవుతూ .. “హే! ..ఇటూ..ఇక్కడా.”. అంటూ ఓ అమ్మాయి తనని .పిలుస్తోంది.
‘ఎవరు?’ ఆగి, గిరుక్కున వెనక్కి చూసాడు… తీరం వెంబడి ఒక పడుచు తన దెసగా , పరెగెడ్తూ వస్తోంది.
పైట చెంగు గాలిలో వూగుతూ, రేగుతున్న ముంగురులు సవరించుకుంటూ, వెన్నెల్లో కదిలే బొమ్మలా వుంది.
అతను ఆశ్చర్య బోతున్నాడు పిలిచింది తననేనా అని. అవును ఆమె మళ్ళీ కూడా తననే పిలుస్తోంది. “హేయ్, ప్లీజ్ ఆగండి నేనూ వస్తాను..” అంటూ.
క్షణాల్లో ఒడ్డునొరుసుకుంటూ.. పడవ ఆగింది. అప్పుడు చూసాడు ఆమెని దగ్గరగా.
నేర్పెరిగిన చిత్రకారుని కుంచె నుంచి జారిన ఒక సౌందర్య రేఖ – జీవం పోసుకుంటే అచ్చు ఇలాగే వుంటుందేమో అనేంత అందంగా వుందామె! .
దేవతలు తిరిగే సమయం కదా. ఓ దేవ కన్య తప్పి పోయి కాని , ఇటు కానీ రాలేదు కదా! ఆశ్చర్యపోతున్నాడు.
“హలో” అంటూ పలకరించింది ఆ ఎలనాగ స్వరం ఎలదేటి పాటంత మధురంగా వుంది.
అతను నవ్వీ నవ్వనట్టుగా వున్నాడు. “మీరు?” అంటూ ఆగాడు.
“నా పేరు మధూలిక. నేనూ రావాలనుకుంటున్నా..రావొచ్చా!?!” ఏదో అడగాలని మర్యాద కొద్దీ అడిగిందే కానీ, అప్పటికే, చీర కుచ్చిళ్ళు పైకి పట్టుకుని, నీళ్ళని చిమ్ముకుంటూ పడవలోకి రానే వచ్చింది..
వొద్దనడానికి అతనికెలాగూ మనసు లేదు కాబట్టి, లోలోనే నవ్వు కుంటూ ” రండి. ఫర్వాలేదు” అంటూ ఆహ్వానించాడు.
ఆమె అప్పటికే..అతనికెదురుగా కూర్చోడం కూడా జరిగిపోయింది.
పడవ ముందుకెళ్తోంది.
ఆమె చిన్నపిల్లలా సంబరపడి పోతూ… జడ ముందుకేసుకుని, నీళ్ళ మీదకొంగి వేలి కొసలు తాటిస్తూ చెప్పింది.
“మీకు నేను తెలీదు కాని, మీరు నాకు బాగా తెలుసు. ”
“ఎలా?”
“ప్రతి రాత్రీ మిమ్మల్ని చూస్తూనే వుంటా… ఆ గుట్ట మీంచి!” అంటూ అటుగా చూపించింది.
ఆమె చేయి చూపించిన వైపు చూసాడు. గుట్ట మీదికి మెట్లు నిచ్చెనేసినట్టు కనిపిస్తున్నాయి. అవి వెన్నెల్లో నల్లగా మెరుస్తూ..
ఆమె చెప్పింది నిజమే. ఆ గుట్ట వెనక ఊరుంది. ఆమె ఇల్లు అక్కడే!
రోజూ రాత్రిళ్ళు మల్లె పందిరి కింద పడుకుని, ఆకాశంలో చుక్కల్ని లెక్కేయడంలో ఆమె బిజీగా వుంటూ వుంటుంది. అదిగో అప్పుడు ఇతని ఈల పాట విని, వొచ్చి చూస్తూ వుంటుంది… “అలా మీరు నాకు పరిచయం .” అంది నవ్వుతూ.
ఆ మీనలోచని కంటి కొసల జాలువారుతున్న కాంతుల్ని, పెదవి మీద కవ్విస్తున్న నవ్వుని, యెద యవ్వన సిరులని, పిడికెడు నడుంని చుట్టిన కొంగు బిగింపునీ, ఆ నడుం మీది చిన్న మడతని, దోరగా చూశాడు. ఓ లేత చంద్ర కిరణం ఆ నునుపు భుజం మీద వాలి నిలవలేక లోయలో జారుతూ చేసిన చప్పుళ్ళకి. అతని గుండె ఝల్లుమంది.
ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తున్నాడు.
ఒంటరాడపిల్ల! ఇంత రాత్రి వేళ ఓ వయసుగాణ్ణి ఆపి, లిఫ్టడిగి మరీ.. షికార్ రావడం ఎంత సాహసం! తనంతట తాను వచ్చింది కాబట్టి సరే, అదే.. తను గనక ‘వస్తారా! అని అడిగుంటే, హమ్మో! ఎంత గలాటా ఐపోనూ !? ‘ఔరా!! వనితల చిత్తములు బహు విచిత్రములు’ అని అందుకే అంటారు కామోసు. ‘ ఇంతకీ ఈమెని ఎంతవరకు నమ్మొచ్చు.?’ ‘ఊహు.’ వద్దంటోంది మనసు. ” రాదు సఖా! నమ్మ రాదూ సఖా, ఆడవారీ నిలా నమ్మ రాదూ సఖా.’ అంటూ పాడుతోంది కూడా!..
లోనుంచి దూసుకొస్తున్న నవ్వుని ఆపుకోలేకపోయాడు.
“మీకంత నవ్వుస్తోందే?!నన్ను చూస్తే? ” చిన్నబోతూ అడిగింది.
తను నవ్వుతోంది అందుకు కాదన్నట్టు తలూపాడు.
“మరి, దేనికనీ?”
“మీ ప్రశ్నే నా ప్రశ్నానూ. దేనికని ఇలా నాతో రావాలనుకుంటున్నారు ?” ముక్కు సూటిగా ప్రశ్నించాడు.
” ఓ.. అదా ” తమాషాగా నవ్వి చెప్పింది.
ఆమె కెన్నాళ్ళనుంచో వెన్నెల్లో ఇలా పడవ ప్రయాణం చేయాలని ఆశట. తన కోర్కె విని, ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేస్తారట. ‘ఇదేం షోకూ?.. వింత కాకుంటే! దెయ్యాలు తిరిగే వేళ, మనుషులు తిరక్కూడదు. పట్టుకుంటే వొదలవు’ అని ఆటపట్టిస్తారట. ఇన్నాళ్ళకి ఇతగాణ్ని చూసాక, తన కల ఫలించినట్టనిపించిందట.. అంటూ ఇంకా ఏవేవో మాట్లాడేస్తూ వుంది.
అచ్చు తనకు మల్లేనే ఆమె కూడా! ఆమె అభిరుచులు తెలుసుకున్నాక మరింత ఆనందమేసిది అతనికి.
“మీరెక్కడుంటారు?” ఆమే అడిగింది మళ్ళీ.
“నేనవతల గట్టున భద్రగిరి లో వుంటా. హాండ్లూం గార్మెంట్స్ బిజినెస్ చేస్తున్నా.. డిజైనర్నికూడా! ప్రస్తుతం ఎక్స్ పోర్టింగ్ మీద కాన్సెన్ ట్రేట్ చేస్తున్నా… ముఖ్యంగా ఇక్కడి చేనేత కార్మికులకి ఎలాగైనా పని కల్పించాలనేది నా ఆశయం.” చివరి వాక్యాన్ని గర్వంగా చెప్పుకున్నాడు.
“ఓ! భద్ర బ్రాండ్’ మీదే కదూ? మీ పేరు సందీప్ అవునా” అంది ఉద్వేగంగా!
“అరె! ఎలా గుర్తు పట్టారు?” ఆశ్చర్యపోయాడు.
“విదేశీయులు ముచ్చటగా ధరించే తెలుగు మగ్గాల వస్త్రాలు’ మీ కాప్షన్ కదూ?! ఆంగ్ల కవుల్ని, ఆత్రేయ లవ్ కోట్స్ నీ ముద్రిస్తూ తయారుచేసే టీషర్ట్స్ మీ ప్రత్యేకం, అవునా!” కళ్ళింతింత చేసుకుంటూ అడిగింది.
“అవునూ, మీకిదంతా ఎలా తెలుసు?”
“బిజినెస్ కాలం’ లో మీ ఇంటర్వ్యూ చదివా.. యూత్ కి మీరో గొప్ప స్ఫూర్తి అని పేపర్లన్నీతెగ పొగిడేస్తూంటే తెలీకుండా ఎలా వుంటుంది! భలేవారే మీరు!” అంది.
ఆమె మాటలకి గొప్పగా అనిపించింది.
“గ్లాడ్ టు మీట్ యూ” అంటూ చేయి చాచింది. అతనూ చేయి కలిపాడు ఆనందంగా.
ఆమె గురించి అడుగుదామనుకునేంతలో ఆమే మరో మాటలోకి తీసుకెళ్ళడంతో ఆగిపోయాడు.
సరిగ్గా అక్కడే అతనో పెద్ద పొరబాటు చేసాడేమో! లేకపోతే ఇంత కథ జరిగి వుండేది కాదు.
జీవితమే ఓ గొప్ప సస్పెన్స్ కథ. ఏ పాత్ర ఎప్పుడొస్తుందో తెలీదు. ఎక్కడ ఏ మలుపు తిరుగుతుందో అంతకన్నా తెలీదు. దేవుని మించిన అద్భుత రచయితెవరుంటారు? సందీప్ విషయం లోనూ అదే జరుగుతోంది.
అందమైన ఆడపిల్లతో కలిసి వెన్నెల్లో గడిపే కాలం ఇంత తీయగా వుంటుందన్న సంగతి అన్నాళ్ళూ అతనికి తెలీలేదు కానీ, ఇప్పుడు తెలుస్తోంది. చాలా కొత్తగా, అంతకంటేనూ.. చాలా గమ్మత్తుగా వుందతనికి.
ఇద్దరి మధ్యా ఆ రాత్రి ఎన్ని కబుర్లయ్యాయి! ఎన్ని సంగతులు దొర్లాయి! ఎన్ని నవ్వులు పొంగాయి. ఎన్ని గిలిగింతలయ్యాయి!!
తెల్లారొచ్చే ముందు..ఆమెని దిగ బెడ్తూంటే…మళ్ళీ కలవదేమోనని బెంగేసింది..ఇదేమిటిలా..కొన్ని గంటల పరిచయానికే!? వింతైన విస్మయం!
ఆమెని ఏదేదో అడగాలనుంది. కానీ ఆమే చెప్పింది చెవి దగ్గరకొచ్చి..
వింటున్న అతనికి ఎంత గొప్ప హుషారేసిందంటే -అమాంతం నీళ్ళల్లో దూకి ఈదుకుంటూ వూరు చేరాలనిపించేంత సంబరమేసిపోయింది.
ఇంతకీ ఆమేం చెప్పిందంటే – “ఈరాత్రి కూడా వస్తారుగా?మీకోసం ఎదురుచూస్తూంటా!” అని.
ఎక్కడో గుండె గూట్లో జంట పిట్ట పక్కకొచ్చి వాలినట్టు.. అతని మనసులో ఒక వెచ్చని తలపు – వలపుతలుపు తట్టినట్టుగా.. వుంది.
****
కొంతమందితో పరిచయాలు, గ్రీష్మకాలపు ఉషోదయాలకు మల్లే చురుక్కుమంటూ.. చొరవగా చొరబడి, మనసునంతా ఆక్రమించేస్తాయి. జీవన దిశల్ని నిర్దేశిస్తాయి. మన మీద సర్వాధికారాల్నీ చలాయిస్తాయి.
‘తన మసెప్పుడిలా జారిందో.. క్షణాల్లో’ అని అతను వింతై.. విభ్రాంతై పోతున్నాడు. ‘అసలిదెలా సాధ్యం’ అని అనుకుంటాం కానీ, నిజానికి – కలలో కానీ, ప్రేమలో కాని అసాధ్యాలంటూ ఏవీ వుండవు.
అనుభవజ్ఞుల మాటలు ఒప్పొకోకుంటే వొల్లనంటాయి మరి.
ఏ అమృత ఘడియలో ఆ అందాలరాశి పరిచయ మైందో కాని, హఠాత్తుగా. అతనికి పగలంటే ఇష్టం పోయింది.
‘ పొద్దు పొడవనీడు
ఎండ పైట కప్పనీడు
మంకెన పువ్వు పెట్టుకోనీడు
వీడు తిట్టి తిట్టి నన్ను పశ్చిమ కనుముల్లోకి త రుముతాడు. చూడవే వీని గోల ”
అంటూ రోజూ – సందె వేళకి తన గోడు వెళ్ళ బోసుకుంటోంది పగలు..
ప్రేమికుని మనసెరిగిన సంధ్యా కాంత మాత్రం – చల్లగా నవ్వి, ..అతని కోసమే రాత్రి గా మారుతోంది. ముంగిట చుక్కల ముగ్గేసి, చంద్ర కాంతిని వెలిగిస్తోంది.
ఆ చల్లని చైత్రావళిన..యేటి మేట మీద – అతనికో వెచ్చని నెచ్చెలిని కూడా ఇస్తూ..మురిసిపోతోంది.
కొన్ని అనుభవాలు మన అనుమతి తీసుకోవు – అనుభూతుల నిధుల్ని గుండె గదిలో నింపి పోడానికి.
నీటి లో నిప్పు అంటుకున్నట్టు …వెన్నెల్లో అగ్గి రేగినట్టు సందీప్ లోనూ ప్రేమ రాజుకుంది… ముందు రవ్వలా, ఆ తర్వాత జ్వాలలా!
ఇప్పుడతనికి ఆమె తో స్నేహం, వెన్నెల విహారం ఎంత ‘ ఇదిగా’ వుందంటే ..తనిన్నాళ్ళు బ్రతికింది ఇప్పటి ఈ కొత్త ఊపిర్లు కోసమే నన్నట్టుంది. ప్రేమంటే – ‘కళ్ళు తెరిచి పునర్జన్మ చూడ్డం’ అంటూ కొత్త కొత్త నిర్వచనాలిచ్చేస్తునాడు.
రాయడం రావాలే కాని, ప్రతి ప్రేమికుడూ ఒక షేక్ స్పియరే!
కళ్ళు తెరచి కలలు కనడం..కళ్ళు మూసి ఆమెని కాంచడం..అతనికిప్పుడు దినచర్యయి పోయింది. ఆమె ఎదురుగా వుంటే సమయమే తెలీడం లేదు.
ప్రేమికులు కలసినప్పుడు గంటలన్నీ నిముషాలైపోతాయట! గడియారం లో చిన్న ముల్లు పెద్దముల్లు లా గిరగిరా తిరుగుతోంది..
ఆమె సాన్నిహిత్యం లో వసంతం వెళ్ళి పోయింది. గ్రీష్మం కూడా జారుకుంటోంది..మెల్లమెల్లగా.
అప్పటికే వాళ్ళిద్దరి మధ్య’ దూరం తగ్గిపోయి కూడా చాల రోజులైపోయింది. ఎంత వొద్దనుకున్నా..దగ్గరవకుండా వుండలేకపోడం ప్రేమికుల బలమైన బలహీనతనుకుంటా!
****
చీకట్లో – నల్లటి మఖ్మల్ పరచి, వెన్నెట్లో – పసిడి రజను గుమ్మరించి.. ఇన్నాళ్ళు వలపు పాన్పుగా మారిన ఆ సైకత శయ్య ..
ఆ క్షణంలో ముళ్ళకంచెగా మారుతుందని – అతనే కాదు ఆమె కూడా ఊహించి వుండదు. కారణం..
అతను తండ్రి కాబోతున్నాడు.
వినంగానే ఆనందంతో వుక్కిరి బిక్కిరయి పోయాడు. అవును మరి, పురుషునికి మొదటి పులకింత స్త్రీ! రెండో పరవశం సంతానం.
కాని, ఆమె మాత్రం అలా లేదు. ముఖం కిందకి దించుకునుంది.
కాదా మరి. ఆమెకి విచారం కాదా ? పెళ్ళి కాకుండా ఇలా జరగడం ..
ఆమె బాధని అర్థం చేసుకున్న వాడిలా…”కమాన్ మధూ! చీర్ అప్. చీరప్ ..మనం వెంటనే పెళ్ళి చేసుకుందాం..” అన్నాడు. ఐనా, అమేం చలించట్లేదు.
అతని మనసెందుకో కీడు శంకిస్తోంది.
ఆమె నోరు విప్పితే బావుణ్ణనిపిస్తోంది.
కొన్ని సెకన్ల నిశ్శబ్దం తరవాత చెప్పింది మధూలిక.
“సారీ, సందీప్! ఐ యాం అల్రెడీ మ్యా రీడ్” .
వింటం వింటమే అతను రాయై పోయాడు. తనేమిటీ వింటున్నాడు? మధూ వివాహితురాలా !?
“అవును. . నాకు పెళ్ళైంది. నేను మరొకరి భార్యని. నా భర్తకి నేనంటే చాల ప్రేమ. కాదు. ప్రాణం. .”
వున్నవాడున్నట్టు ఏటిలో పడిపోయినట్టుంది పరిస్థితి. తనచుట్టూ అంతులేని కడలి పరచుకున్నట్లు అలా ..చూస్తూనే ఉన్నాడు సందీప్ – శూన్యమై పోతూ.
‘ఈమె తనని ప్రేమించట్లేదు’ అది మరో షాక్. పెళ్ళి ఆలోచన అసలే లేదు. మరి ఏమిటికని వచ్చింది?.. ఎందుకనిలా చేసింది? అసలెవరీమె? తననిలా ఛిద్రంచేసి పోడానికి? తల తిరిగి పోయే ప్రశ్నలు మనసుని కుమ్మేస్తున్నాయి.
ఇతరుల మీద మన నమ్మకం మనల్నెంతగా వంచిస్తుందంటే.. మోసపోయామని తెలుసుకునే చివరి క్షణం దాకా అనుకుంటా!
” నేనేమిటీ, ఇలా ?’ అని కదూ నీ సందేహం?” అతనిమనసు చదివినట్టే అడిగింది. అంతలోనే విరక్తి గా నవ్వి, గొంతు సవరించు కుంది. ” జీవితం లో మనకి అన్ని ఆనందాలు అందించేస్తే ఇక తన పాత్ర కి విలువేమిటనుకుంటాడో ఏమో, ఆ భగవంతుడు! .అందుకే, కొన్ని అందకుండా, అందుకోనీకుండా తన దగ్గరే వుంచేసుకుంటాడు. . అవి కావాలని ఏడ్చే మనుషుల్ని చూసి నవ్వుతాడు.. ఆయనదొక స్ట్రాటెజీ..నేనూ అందులో చిక్కుకోక తప్పలేదని తర్వాత తెల్సింది. ఎప్పుడంటే – మాకు సంతానం కలగదని తెలిసాక! ఈ నిజం ఆయన్ని నిలువునా క్రుంగ దీసింది. ఆయన పడుతున్న బాధంతా నాకోసం అని తెలిసాక ఆయన మీద ప్రేమ ఇంకా రెట్టింపయ్యింది. పురుషుని ప్రేమ కోసం..స్త్రీ ఎంత త్యాగమైనా చేస్తుందనుకుంటా..’ ఆ ప్రేమే నన్నింత దూరం తీసుకొచ్చింది. నీకు దగ్గర చేసింది.
సంతానం పొందే మార్గాలు చాలానే వున్నాయి. కాని, నిన్ను చూసాక, నేనీ మార్గం ఎంచుకున్నా. కారణం నీ అందం, తెలివి, మంచితనం, చదువూసంస్కారం. ఇవన్నీ
చూసాక – నీ ప్రతి రూపానికి తల్లి ని కావాలనిపించింది. అందుకు కొన్నాళ్ళు నీకు ప్రియురాలి గా మారాల్సి వచ్చింది.
వింటున్న అతనిలో ఎలాటి కదలికలూ లేవు.
“సందీప్!..ఆయన ట్రైనింగ్ పూర్తి చేసుకుని, రేపో..ఎల్లుండో యూకే నించి వచ్చేస్తున్నారు..ఇక నిన్ను కలవడం..ఇదే..ఆ..ఖ..రు..సా..రి..”
ఒక్కో మాటా ఒకో డైనమైట్ లా పేలుతోంది అతని గుండెల్లో.
.నీకిప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే..”..ఆమె పూర్తి చేయక ముందే, అతనందుకున్నాడు. ” నా మీద ప్రేమ కొద్దీ. కదూ?” అన్నాడు చాలా నింపాదిగా.
ఆమె అవునంటూ తలూపిందో లేదో.. అంతకంటే ముందే అతని చేయి గాలిలో లేచి, ఆమె చెంపని చెళ్ళుమనిపించింది. ! అదెంత బలంగా తాకిందీ అంటే, ఆ విస్సురికి – పడవ అంచుకెళ్ళి ధబ్ మంటూ కొట్టుకుని కింద కుప్పలా కూలింది.
ఆ దృశ్యాన్ని చూడలేక – చంద్రుడు మబ్బులెనక్కెళ్ళిపోయాడు. ఆ వెనకే..మబ్బు మీద మబ్బు చుట్టుకుంటోంది దట్టంగా.
ఈ హఠాత్పరిణామానికి ఆమె దిగ్భ్రాంతురాలై పోయింది.నిప్పు కణికల్లాంటి అతని కళ్ళు చూస్తే మొట్టమొదటిసారిగా భయమేసింది.
అందరి మగాళ్ళలాంటి వాడే సందీపూ అనే ఆమె అంచనా తారుమారయ్యిందీ అంటే, అది – అతని తప్పు కాదుగా!
సందీప్ ఆవేశం దుఖంలోకి మారడానికి ఎన్ని క్షణాలో పట్టలేదు. ప్రపంచంలో రెండు రకాలు ప్రేమలుంటాయని, అతనికిప్పుడే తెలుస్తోంది. ఈమెది రొమాంటిక్ లవ్..
ఈమె, తనని ఒక పరికరంగా ఉపయోగించుకుంది. తను కోరింది అందాక..తెలివిగా గుడ్ బై చెప్పేస్తోంది. కాదు వొదిలించేసుకుంటోంది. ఎవరన్నారు, ఆడది అబలని, అమాయకురాలనీ!
ఈమె పరిస్థితి ఇదని తనకు ముందే తెలిస్తే, ..ఇంత గుండె కోత వుండక పోనేమో.
నిజానికి ప్రేమించిన వాడు మోసం చేసినందుకు దుఃఖించడు. మనసుని ముక్కలు చేసినందుకు ఏడుస్తాడు.
..తనని తండ్రిని చేసి, తన బిడ్డని మాత్రమే స్వీకరిస్తున్న ఆమె ఆ క్షణంలో ఓ అందమైన రాక్షసిలా కనిపించింది. మొట్టమొదటి సారిగా ఆమె పై అసహ్యమేసిపోయింది. ఆమె ఊనికిని భరించలేని వాడిలా మండుతున్న కట్టెలా కదిలాడు అక్కణ్నుంచి.
పడవని – ఒక్క తోపు తోసాడు నీళ్ళల్లోకి బలంగా.
ఆమె కంగారుగా లేచి, ..” దీపూ! ప్లీజ్! ఆగు. ..వెళ్ళకు” అంటూ అరిచింది కీచుగా
ఆ పిలుపు అలాగే వుంది. ఎప్పట్లా! ఆ గొంతులో ప్రేమా అలాగే వుంది. మార్దవంగా! స్వరం లో తేడా లేదు.
అతను నిర్లక్ష్యంగా గెడ వేస్తూవుంటే..
ఆమె తూలుకుంటూ వచ్చి, అతని వొళ్ళో వాలిపోయింది. సరిగ్గా అప్పుడే మెరిసిన మేఘం మెరుపులో చూసాడు.. అప్పుడు చూసాడు… ఆమె తలకి తగిలిన గాయం! రక్తం ఫౌంటైన్ లా పైకి వుబుకు తోంది.
అతని కోపం చప్పున చల్లారిపోయింది. ” మధూ..” అంటూ పిలిచాడు ఆవేదనగా.
“దీపూ ! ఎందుకిలా చేసావ్?” ఆమె గొంతు వణుకుతూంటే. అతని .గుండె కలుక్కుమంది. . “మధూ! నేను అడగాల్సిన ప్రశ్నని నువ్వడుగుతున్నావా!?’ కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. వాటికి మాటలు రావు. బాధకి భాష్యాలు – కన్నీళ్ళు !
గండి తెగిన గుండె కి కళ్ళే ద్వారాలవుతాయనుకుంటా. తన కన్నీళ్ళు ఆమె కంటపడకుండా …నీళ్ళ ల్లో జేబురుమాలు ముంచి గాయాన్ని తుడిచాడు. రక్తం ఆగటం లేదు. కంగారు పడ్డాడు. బట్టని మళ్ళీ తడిపి, కట్టు కట్టి, వెనక్కి పడుకోబెట్టాడు. ఆమె మూల్గుతోంది. గర్భిణి అని కూడా చూడకుండా చేయి చేసుకున్న తన ప్రవర్తనకి సిగ్గనిపించింది.
కడుపులోని తన బిడ్డకేమీ కాదు కదా! అంతలోనే కలత చెందుతున్నాడు.
త్వరత్వరగా పడవ నడుపుతున్నాడు… గట్టొచ్చేసింది.
తను దిగాల్సిన చోట దిగి పోయిందామె.
అరచేత్తో నుదురదిమి పట్టుకుంటూ అలాగే తూలుకుంటూ..వెళ్ళిపోతోంది.
అతని గుండె నీరైంది అమెనలా చూసే సరికి.
ఆమెని పసిపాపలా ఎత్తుకుని, ఇంట్లో దింపాలనుంది. కాని , అసహాయుడి లా చూస్తూ వుండిపోయాడు కారణం, ఆమె మరొకరి భార్య!
ఇన్నాళ్ళు తనకు తెలీని ఒక కటిక నిజాన్ని తెల్సుకుని..తట్టుకోలేకపోతున్నాడు.
****
ఇంటికెలా వొచ్చి పడ్డాడో అతనికే తెలీదు….. నాలిక పిడచ కట్టుకు పోతోంది..గొంతెండిపోతోంది..శరీరమంతా దహించుకు పోతోంది దాహం!.దాహం..దాహం గా వుంది. . పెదాలు తడారి పోతున్నాయి.. గడగడా..నీళ్ళు తాగాడు . దాహం పోలేదు. . .. కళ్ళు మూసుకున్నాడు..పసివాడు కనిపిస్తున్నాడు. ‘ ‘నాన్నా కం..కం..’ అంటూ చిట్టి చేతులేసుకుంటూ పిలుస్తున్నాడు. వాడు..తన బిడ్డ! కాదు..మధూలిక బిడ్డ..మధు తనదే కదా..!కాదు..అతని భార్య…అతనెవరు? ఆమె భర్త! మరి ఆమె తనది కదా! కాదు. నీకేమీ కాదు. ఎవరిదో కటికనవ్వు వినిపిస్తోంది..ఆ నవ్వు మధూలికది కదూ? అవును ఆమెదే.
ఆ పక్క నుంచే గుండెల్ని నులిమేసే శోకం కూడా వినిపిస్తోంది. అది తనదే. తనే రోదిస్తున్నాడు. గుండె పగిలేలా ఏడ్చేస్తున్నాడు. మరు క్షణం లో అతడు పోటెత్తిన సముద్రమై పోయాడు. సునామీ కంటే మించిన ప్రళయం అంటూ ఏదైనా వుంటే అది ఖచ్చితంగా భగ్నప్రేమికుని హృదయమే.
తల పేలిపోతోంది.. మరో పక్క దా..హం..దాహం…దాహం..తను తాగాల్సింది నీళ్ళు కాదని తెలిసాక, అతను రివ్వున లేచి.. ఓ బాటిల్ అందుకున్నాడు .సీసా ఎత్తి, గడ గడా తాగుతున్నాడు! ఘాటైన ఆ ఎర్రటి ద్రవం..ధార లా గొంతు దిగుతూ వుంటే.. గుండె మంటలు ఆరుతున్నట్టుంది. క్రమక్రమంగా రెప్పలు వాలి పోసాగాయి. రగిలిన మనసు మాయమై పోయింది. ఇప్పుడు శరీరం మత్తు గా..హాయిగా గాల్లో తేలుతున్నట్టుంది.
‘ఇంత స్వర్గాన్ని ఇక్క డుంచుకుని తనేమిటీ..పిచ్చోడిలా ఆమె వెంటపడ్డాడూ ? ఊ?!.’.నవ్వు కున్నాడు.. ఏడ్చుకున్నాడు ..అలా అలా నిద్రలో కెళ్ళి పోయాడు.. గాఢమైన నిద్రలొకి.. ఇప్పుడతని కళ్ళు ఎంత ప్రశాంతం గా..మూతలు పడి పోయున్నాయో! .
ఎన్ని మలుపుల కథకైనా..
ఎంత దీర్ఘ బ్రతుకు ప్రయాణానికైనా..
ముగింపు – నిద్రొకటే నేమో!?
****
అప్పటికి ఎన్నాళ్ళై పోయిందో! అతనలా, మత్తులో పడి బ్రతకడం అలవాటయి!
చెలి లేని తోట లెందుకు, చైత్ర మాసాలెందుకు..
చెలి లేక వసంతా లెందుకు….వొట్టి పూల పరిమ ళాలెందుకు.
ఏరువాక పున్నమి లెందుకు , శరత్కాల చంద్రికలెందుకు..
ఇన్ని మాటలెందుకు..ఆమె లేని, తనెందుకు, ఈ తనువెందుకు?
‘దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్నభావన కలిగింది. తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్లు, తనచుట్టూ అంతులేని కడలి పరచుకున్నట్లు అనుభూతి. చూస్తూనే ఉన్నాడు సందీప్. . పుడమిని జోకొడుతున్న అలల లాలిపాట వింటూ తృప్తిగా నిదురపోయాడు ‘
అలా నిదుర పోతూనే వున్నాడు..ఎప్పుడూ వచ్చే కలే ఈసారి జోకొడుతోంది.
“దీపూ ! నేనూ! ఒక్క సారి కళ్ళు తెరిచి చూడవూ? ప్లీజ్!” అతని భుజాలు పట్టి కుదుపుతూ, బేలగా పిలుస్తోంది ఆమె.
“ఆమె, మధు కదూ. ?” బలవంతంగా కళ్ళు విప్పి చూడ బోయాడు. పగలూ రాత్రీ చిక్కటి చీకటి కలవాటుపడ్డ కళ్ళు వెలుగుని భరించలేకపోయాయి. కళ్ళకడ్డుగా చేతులుంచుకుని సగం కళ్ళు తెరచి చూసాడు.
ఎదురుగా ఆమే! ‘ ..’మ..ధూ..” ప్రాణం లేచొచ్చింది. . కొడిగడుతున్న దీపానికి చమురు చుక్క అందినట్టు! లిప్త కాలం బాటు అతని ముఖం వెలిగి పోయింది
ఆమె గభాల్న అతని పక్కనే చతికిలబడి పోయి, అతని చేతిని ఒళ్ళోకి తీసుకుంటూ అంది ఆర్ద్రంగా..”ఏమిటీ పిచ్చి పని. ఎందుకిలా బాధ పెడ్తున్నావ్ నన్ను..” అనుకోకుండా దుఖం ముంచుకొచ్చిందామెకి.
ఆమె ప్రశ్నకి అంత మత్తులోనూ నవ్వొచ్చిందతనికి. నీరసంగా నవ్వేస్తూ అన్నాడు –
“నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా” .
“నిజమే చెప్పు” అంది కళ్ళు తుడుచుకుంటూ.
“నేనెప్పుడూ ఇంతే మధూ! తాగుబోతుని, పచ్చితాగుబోతుని”
“అబద్ధం” అరిచినట్టు చెప్పింది.
“ఐతే. నీకు నిజం తెలిసే వుండాలి. కదూ!..” .అన్నాడు వేదాంతిలా నవ్వి, వాలిపోతున్న బరువు రెప్పల్ని పైకెత్తి… ఆమె కళ్ళలోకి చూసాడు – జవాబు కోసమన్నట్టు.
ఆమె చప్పున కళ్ళు వాల్చేసుకుంది. తప్పు చేసినదానిలా.
ఈ కొన్ని రోజుల్లోనే సందీప్ చిక్కి శల్యమయ్యాడు. తిండీ తిప్పలు లేక శుష్కించిన శరీరంతో, పెరిగిన గెడ్డంతో రోగిష్టిలా తయారయ్యాడు. పరిస్థితి ఇలాగే వుంటే అతని ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. అదే జరిగితే..ఆ పాపం తనని బ్రతకనిస్తుందా! ఆమె కుమిలి కుమిలి పోతోంది లోలోపల.
కొన్ని తప్పులు అంతే. నిప్పుని ముట్టుకున్నట్టే! తెలిసి తాకినా, తెలియక తాకినా తప్పదు – మనసుల్ని దహిస్తాయి. ఆ తర్వాత మనుషుల్ని కూడా! ఈ నిజం తెల్సుకున్నాక, జరిగిన పొరబాటుని సరి చేద్దామనుకుంటోంది కానీ,, అప్పటికే సరిదిద్దలేనంత ఆలస్యమైందన్న సంగతి ఆమెకి అర్థమై పోయింది – అతన్ని కళ్ళారా చూశాక!
‘ఇతని ఈ దుస్థితికి ఎవరు కారణం? తనే! ఔను తనే! ముమ్మాటికీ తనే! ‘ రెండు చేతుల్లో ముఖం దాచుకుని పెద్దగా ఏడ్చేసింది. “ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు..” వెక్కుతూ అడిగింది.
ఆ కన్నీళ్ళకు కరిగిపోతూ అడిగాడు “‘మధూ. మనం ఎక్కడికైనా పారిపోదాం! నాతో వచ్చేస్తావా?” ఆశగా అడిగాడు.
ఆమె చివ్వున తలెత్తి చూసింది.”నీకెన్ని సార్లు చెప్పాను. నేనా పని చేయలేననీ! ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి ఆలోచన్లు చేయకు.” మందలించింది.
అమెని నిశితంగా చూసాడు. పాపిట్లో కుంకుం ధరించి, మెళ్ళో నల్లపూసల గొలుసేసుకుని, తల నిండా చెంగు కప్పుకుని..చక్కని గృహిణి లా వుంది.
ఆమెని అలా చూస్తూ చూస్తూ ..హఠాత్తుగా ఫక్కున నవ్వాడు..
“ఇప్పుడెందుకా నవ్వు? ” కోపమేసి అడిగింది.
“దేవదాస్ లో డైలాగ్ గుర్తొచ్చింది. అందుకు..”
వొళ్ళు మండి పోయిందామెకి. “నోర్మూసుకో. పిచ్చి మాటలూ నువ్వూనూ…అది సినిమా. ఇది జీవితం.” అని కోప్పడ్తూనే..
అతన్ని పసివాడిలా వొళ్ళోకి లాక్కుని, గుండెలకు హత్తుకుంటూ.. అతని చేయి తీసుకుని తన తల మీదుంచుకుంది. ” దీపూ! నా మీదొట్టేసి చెప్పు ఇంకెప్పుడూ తాగనని. .ప్లీజ్…”
షాక్ కొట్టిన వాడిలా చేయి లాక్కున్నాడు వెనక్కి. అంతలోనే.. కొంచెం కిందకి జారి, ఆమె పొట్ట మీద చెంప చేర్చాడు. లోపల బిడ్డ కదుల్తోంది. అతని హృదయం కదిలి, కన్నీరైంది.
ఎక్కడో ఉరుమురిమి, మెరుపులు మెరిసాయి. టైం చూసాడు. పన్నెండు దాటుతోంది. అది పగలు కాదు. రాత్రి! ఇంత అర్ధరాత్రి వేళ తనని వెతుక్కుంటూ ఒంటరిగా వచ్చిందా ‘ మధూ!? ‘ నివ్వెర పోతూ చూసాడామెని.
“నువ్ ఎంతకీ కనిపించకపోతే.. ఏమైపోయావోనని..నేనే వచ్చేసా..”
ఆ వెతుకులాట పేరే ప్రేమ అని ఆమెకి తెలీదు. తెలిసినా, పట్టించుకోదు. పట్టించుకున్నా, పరిష్కారమూ లేదు. ఆమె కేవలం ఒక స్త్రీ. ఒక అసహాయురాలు. పాపం! ఆమె కోరుకున్నది – తన నుంచి ఒక బిడ్డని.
ఇవ్వాలనుకున్నది తనకొక జ్ఞాపకాన్ని అంతే!.
ప్రేమలో – స్త్రీ అనుభూతిని మాత్రమే వాంచిస్తుందట. అనుభవాల గాయాలు తనవి. అనుభూతుల గీతాలు ఆమెవి.
ఆలోచిస్తే – నిజానికి, తన కంటే ఆమే – ఎక్కువ సాహసం చేసింది. జీవితంలోనే కాదు, ఇంత చీకటి వేళ తన కోసం రావడం కూడా…ఆమె చేసినది తెగువే..ఇది లోకానికి తెలిస్తే!?
నిజమైన ప్రేమెప్పుడు అవతలి వారి గురించే ఆలోచిస్తుంది.
అతను బెడ్ మీంచి గభాల్న లేచి నిలబడబోతూ.. తూలి పడబోయాడు. పడిపోకుండా ఆమె ఒడిసి పట్టుకుంటుంటే.. అతని చుబుకానికి ఆమె నుదురు తాకింది. దాని మీద పచ్చి పోని గాయాన్ని చూసాడు.. చప్పున ఒంగి పెదాలతో సృ శిస్తూ …” బాధేస్తోందా బంగారూ” అని అడిగాడు లాలనగా!
ఆమె కళ్ళల్లోకి నీళ్ళు తెచ్చుకుంటూ చూసింది. తను వచ్చిన పని పూర్తి కాలేదన్నట్టు..
అతను నవ్వి చెప్పాడు. “తాగను సరేనా!..”
“ఇంకోటి కూడా ?” అంటూ ఆశగా చూసిం దతని వైపు.
“ఈసారి మంచి అమ్మాయిని చూసి పెళ్ళిచేసుకుంటా. ఇక చాలా వాగ్దానాలు!?” అంటూ ఆమె చెయి నొక్కి వొదిలేస్తూ “పద! వర్షం వస్తే ఏరు దాటడం కష్టం..హర్రి అప్..” అంటూ తొందర చేసాడు.
ఆమె – గుండెల నిండా శ్వాస తీసుకుని, కదిలింది అతని వెనకే!
ఈదురు గాలి మొదలైంది హోరెత్తుతూ..
పడవ కదిలింది బరువుగా తూలుతూ..
గుట్ట చేరే దాకా ఆమె బోధనలు చేస్తూనే వుంది. జీవితపు విలువల గురించి ఫిలాసఫీ చెబుతూనే వుంది.
నిన్నటి ప్రేయసి నేటి తత్వ వేత్త గా మారడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్త్రీలు మానసికంగా ఎంత త్వరగ ఎదిగిపోతారు! కాలం కంటే వేగంగా.
అతనెలా నడుచుకోవాలో శాసిస్తోంది.
ఆడవాళ్ళు హక్కులివ్వరు కాని, అధికారాలు మాత్రం బాగానే చలాయిస్తారే!? అంత బాధలోనూ నవ్వొచ్చిందతనికి ఆమెని చూస్తే!
ఆమె చేరుకోవాల్సిన గమ్యం వచ్చేసింది.
అతన్ని వదల్లేక వదల్లేక వెళ్ళిపోతోంది. అతను అలాగే చూస్తూన్నాడు. గుట్ట ఆఖరి మెట్టు మీద.. ఆమె పాదం చివరి మెరుపు కని పించే వరకూ…ఊపిరి బిగపట్టి మరీ చూశాడు.
ఆ తర్వాత….ఏమీ లేదు. ఐపోయింది. ఆమె వెళ్ళి పోయింది. శాశ్వతం గా దూరమై వెళ్ళి పోయింది. ఇక ఎప్పటికీ కనిపించనంటూ …చివరి..వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. తన తోడు అనుకున్న ఆమె – తన ప్రాణాలు తోడుకుని మరీ వెళ్ళిపోయింది..
అతడు తిరుగు ముఖం పట్టాడు. ఒంటరి గా.
హఠాత్తుగా గుండె ఖాళీ అయిపోయినట్టైంది. ఎక్కడో సీసా పగిలిన శబ్దమైంది. మళ్ళీ వెలితి మొదలైంది. పాము విషంలా -విషాదం చుక్క చుక్క గా వొళ్ళంతా పాక్కుంటూ పోతోంది. ప్రాణం కొడి గట్టిన దీపం లా రెపరెపమంటూ.. మసి పూసుకున్న రాత్రి మీదపడి గర్జిస్తూ..
చుట్టూ చీకట్లు..
చెవుల్లో గాలి రొదలు
గుబులు పోతూ యేటి అలలు
అంత చల్లని చలిలోనూ అతనికి దాహమేస్తోంది. నోరెండి పోతూ..నాలిక పిడచకట్టుకుపోతూ! గబ గబా జేబు తడుముకుని, సీసా తీసుకుని తొందరతొందర గా మూత తీసాడు. ఆ తొందర్లో ఊహించనిది జరిగిపోయింది. చేతిలో తెడ్డు జారి ప్రవాహంలో పడి కొట్టుకు పోయింది.
ఫెళ్ళుమంటూ వురిమింది ఆకాశం. ఇక ఆగ మన్నా ఆగనంటూ విరుచుకు పడింది వర్షం..ఏరు పోటెత్తింది.
అతని ప్రయత్నమేంలేకుండానే ఎటో పడి పోతోంది పడవ!
అతనికి చప్పున కల గుర్తొచ్చింది.
‘దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్నభావన కలిగింది. తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్లు, తనచుట్టూ అంతులేని కడలి పరచుకున్నట్లు అనుభూతి. చూస్తూనే ఉన్నాడు సందీప్. ఈ ఏకాంతాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాడు. దీని కోసం ఎంత కష్టపడ్డాడు! మొత్తానికి సాధించాడు. చిన్న నిట్టూర్పు. పుడమిని జోకొడుతున్న అలల లాలిపాట వింటూ తృప్తిగా నిదురపోయాడు.’
తనచుట్టూ అంతులేని కడలి పరచుకున్నట్లు అనుభూతి..అంత మత్తు లోను చూస్తూనే ఉన్నాడు సందీప్. . కొంత సేపు వెతికాడు. తెడ్డు కోసం! కనిపించలేదు. దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్నభావన కలిగింది. తన కల నిజమౌతున్నందుకు పడీ పడీ నవ్వుతున్నాడు.
ఇంతలో మరో సారి గొంతు తడుపుకుందామని జేబులో చేయుంచాడు. దీని కోసం ఎంత కష్టపడ్డాడు! మొత్తానికి సాధించాడు. చిన్న నిట్టూర్పు
అంతెత్తున ఎగెరెగిరి పడుతున్న కెరటాల మీద పడవ – పుల్లలా ఊగిపోతూ వుంటే… భలె నవ్వేస్తోందతనికి.. తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్లు..
అంతే. సరిగా అప్పుడే – ఏటి మధ్యకొచ్చిన పడవ, సుడిలో తిరగబడిపోయింది.
అతనికి ఈత వచ్చు. ఈత గాడు… గజ ఈత గాడు. కాని, అలాటి ప్రయత్నమేమీ చేయలేదూ అంటే కారణం?!
బహుశా! మునకే సుఖమనుకున్నాడేమో!
పుడమిని జోకొడుతున్న అలల లాలిపాట వింటూ తృప్తిగా నిదురపోయాడేమో!?
– స్వాతికుమారి బండ్లమూడి
ఈయన కవిత్వం చదువుతుంటే ..
“ఊరి బయట పొంగిన వాన వాగును సముద్రం అనుకున్న క్షణాలు
బడి నుంచి ఇంటికి బహు దూరపు దారిలో గాలికి కంట్లో పడిన ఇసుక కణాలు” గుర్తుకొస్తాయి.
—
చదవటం ఆపేశాక “వస్తే రావొచ్చు మళ్లీ ఇక్కడికి, ఈ అందమైన నిరర్థక నిశ్శబ్దం లోనికి” అనిపిస్తుంది..
—
పిచికగూడు, కాశీమజిలీ, కోలాటం బ్లాగుల ద్వారా కవిత్వాన్నీ, కథల్నీ, వ్యాసాలూ-అనుభవాలనీ పంచుకుంటూ అంతర్జాలంలో సుపరిచితులైన తెలుగు కవి హెచార్కే గారితో పొద్దు జరిపిన మాటామంతీ;
1. ముందుగా మీ పరిచయం – వ్యక్తిగా మీ నేపథ్యం, వివరాలు వగైరా
మా అమ్మ నాన్న పేర్లు కొడిదెల సుబ్బమ్మ, సంజీవ రెడ్డి. బాగా దిగువ మధ్య తరగతి కుటుంబం. ఊరి పేరు చెబితే పూర్తి పేరు చెప్పమంటారు. ‘గని’. అంతే. రెండక్షరాలు. కర్నూలు జిల్లాలో మారుమూల గ్రామం. పుట్టి బుద్ధెరిగే సమయానికి ఇంట్లో అప్పుల దుఃఖం. మా అమ్మ నవ్వుతూ ఉండిన సమయాలు గుర్తు లేవు. నా మందకొడి స్పందనల వల్లనో తన ఫ్రస్ట్రేషన్స్ వల్లనో నాన్న బాగా కొట్టే వాడు. అమ్మ అంటే రెండు నీళ్లు నిండిన కళ్లు, నాన్న అంటే ఒక చర్నాకోల గుర్తొస్తాయి. ఆ ఇరుకు జీవితానికి అమ్మ నాన్నల చెడ్డ అలవాట్లు, సోమరితనం కారణాలు కావు. చాల మంచి వాళ్లు, కష్ట జీవులు. పొలాన్ని మాత్రమే నమ్ముకున్న రైతులు. చాల మంది రాసీమ రైతుల లాగే తల వంచడం, మనసులో లేనిది చెప్పడం చాత కాని మనుషులు. బహుశా అందువల్లనే, తరచు అనవసరమైన పేచీలతో బాధ పడే వాళ్లు. ఆ నొప్పి, ఆ పేచీ కలిస్తే నేను అనుకుంటాను. మనుషులందరి లాగే నేనూ ‘మాతృ గర్భంలో మరణ వ్యూహం’ రూపొందిన వాడినే. చాల ఊళ్లు తిరిగాను. చాల పనులు చేశాను. వ్యూహం నుంచి బయట పడ్డానని అనిపించదు.
పొగాకు మండె తిప్పుతుండగా మండ్రగబ్బ తేలు కుట్టి ఒక రోజూ రాత్రి ఏడ్చి ఏడ్చి చనిపోయిన సావాసకాడు శివరామి రెడ్డి, పదారేండ్ల వయసులో నలభై దాటిన మనిషిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన చిన్నత్త, అద్భుతంగా పాఠాలు చెప్పడంతో పాటు ‘ఏడవడం కాదురా, ఎదిరించి బతకాల’ని ధైర్యమిచ్చిన రమణ మూర్తి సారు… ఇంక అలాంటి మరి కొందరు మనుషులు, ఘటనలు కలిసి నా జీవితం.
మాది ‘1970 తరం’ అని చెబితే చాలు, చాల విషయాలు ఇక చెప్పక్కర్లేదనుకుంటాను. అది… యువతరంలో అభద్రత భావం, వీర వీత్నాం, చైనా సాంస్కృతికి విప్లవం, జెపి సంపూర్ణ విప్లవం, ఎమర్జెన్సీ, నక్శల్బరి కెరటాల తరం. ఆ కెరటాలలో నేనూ ఒకడిని.
2. కవిత్వంతో మీ అనుబంధం ఎప్పటిది? ప్రచురించిన కవితా సంకలనాలు,కవితలు కాకుండా మీరు చేసిన ఇతర రచనల వివరాలు..
అలా ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆరో తరగతిలో స్కూలు లైబ్రరీ నుంచి నాకు ఇచ్చిన మొదటి పుస్తకం, ‘బంగారు దీవి’ అనే నవల ఆబగా చదివేశాను. అది ఏ జూల్స్ వెర్న్ నవల అనువాదమో కావచ్చు. దానితో పాటు మిగిలిన పిల్లలకు ఇచ్చిన పుస్తకాలు కూడా తీసుకుని చదివాను. అప్పటి నుంచి కథలు, నవలలంటే మోజు. ఎక్కడ ఎవరింటికి వెళ్లినా వాళ్ల గూళ్లలో చందమామ, ఆంధ్ర పత్రిక ఉంటాయేమోనని చూసే వాడిని. గూట్లో పుస్తకం కనిపిస్తే ఆ ఇంట్లో మనుషులు గొప్ప వాళ్లని అనుకునే వాడిని. 8/9వ తరగతిలో మాకు రవీంద్రుని రాజర్షి నవల నాన్ డిటెయిల్డ్ టెక్స్టుగా ఉండేది. చాల గొప్పగా అనిపించింది. అప్రయత్నంగా మొదలెట్టి ఆ నవలను అనుకరిస్తూ నలభై యాభై పేజీల నవల రాశాను. దేవాలయం బదులు దేవ్యాలయం అని రాస్తే, ఆదాటున నా నోట్‌బుక్ చూసిన తెలుగు సారు, నాకు నేనుగా చేసిన గుణసంధిని చూసిన భలే ముచ్చట పడ్డాడు. పదో తరగతిలో వ్యాస రచన పోటీ బహుమతిగా రమణ మూర్తి సారు ఇచ్చిన ‘మహా ప్రస్థానం’ అంటే ఇప్పటికీ ప్రాణం. ఆ తరువాత కొద్ది రోజులకే చదివిన కృష్ణ పక్షంలో ‘ఆకులో ఆకునై’ వంటి మెత్తటి పద్యాల కన్న ముందు నాకు నచ్చింది “వికృత క్రూర క్షుథా క్షుభిత వికట పాండుర శుష్క వదన దంష్ర్టాగ్నిలో నవ్వేలా….” అనే సమాస భూయిష్టమైన పద్యం అని చెబితే ఆ మధ్య కొందరు పెద్దలు అబద్ధం చెబుతున్నాననుకున్నారు. కాని, నిజం. అది నాకెందుకు అంత ఇష్టమయిందో, అర్థాలు తెలుసుకుని మరీ ఎందుకు ఆనందించానో తెలియదు. అది తెలిస్తే నాకు ఒకేసారి శివారెడ్డి, నగ్నముని, ఇస్మాయిల్, జాక్ లండన్, శరత్, డాస్టావస్కీ, గోర్కీ… ఇలా బిన్నమైన రచయితలు ఎందుకు ఇష్టమవుతారో తెలుస్తుందనుకుంటాను.
ఎనిమిదో తరగతిలో రాజేశ్వర రావు అనే ఒక బ్రాహ్మణ పిల్లాడు నా సావాస కాడు, బెంచ్ మేట్. తను ఏదో పేచీలో కట్టు దప్పి ‘సూద్దర వెధవలింతేలే’ అన్నాడు. నాకు చాల ఖోపం వచ్చింది. శూద్రత్వం, రైతు పని చాల గొప్పవని చెబుతూ, పనిలో పనిగా బ్రాహ్మణులను ఈసడిస్తూ రాసింది నా మొదటి కవిత. రాజేశ్వర రావు ఆ కాగితం తీసుకెళ్లి వాళ్ల చిన్నాన్నకు, అంటే, మా టీచరుకు ఇచ్చాడు. అప్పుడు నా అరిచేతి మీద తేలిన బెత్తం దెబ్బలు కవిత్వానికి గాను నేను పొందిన మొదటి బహుమతి. ఆ తరువాత అట్టాంటివి చాలానే దొరికాయి, రెండేళ్ల జైలు సహా. J
మా ఊళ్లో విజయాత్రేయ అని పద్య కవి, నవలా (ఎంవిఎస్ పబ్లికేషన్స్) రచయిత ఉండే వారు. పుస్తకాల మీద ప్రేమతో ఆయనకు, ఆ కుటుంబానికి చేరువ అయ్యాను. తెలుగు పేపర్ బ్యాక్ నవలలు వాళ్లింట్లో విపరీతంగా చదివాను. సెలవు వస్తే చాలు వాటి కోసం వాళ్లింటి అరుగు మీద వాలే వాడిని. ఆదివారాలు తప్పని సరి. ఆ ఇంట్లో వాళ్లు నన్ను ‘ఆదివారం గాడు’ అని పిలిచే వాళ్లు. అమ్మయ్య వాళ్లు చెబితే అంగడికి వెళ్లి ఆకులు వక్కలు తీసుకు రావడం వంటి పనులు చేస్తూ పుస్తకాలు చదివే వాడిని. ‘రాయడం’ అనే పని మానవ మాత్రులు చేసేదే అని, నేను మానవుడిని గనుక నేనూ రాయగలనని అనుకోడానికి విజయాత్రేయ, వాళ్లింట్లో పుస్తకాలు కారణం.
కిరోసిన్ లాంతరు మసక వెలుగులో మా ‘కత జెప్పే పుల్లన్న’ వాళ్లావిడతో కలిసి చెప్పిన ‘డక్కి కత’లు వింటున్నప్పడు కత/ కవిత నాది కూడా అని బలంగా అనిపించింది. గ్రామ పంచాయతీ రేడియోలో ‘అలుగుటయే ఎరుంగని….’ పద్యాలు విని సరిగ్గా అలాగే నాలో నేను పాడుకుంటూ ‘పద్యాలు’ రాసి విజయాత్రేయకు చూపించినప్పుడు తెలిసింది, పద్యాలకు ఛందస్సు అని ఒకటి ఉంటుందని. ఆ తరువాత కొద్ది రోజులకే ఛందస్సు అక్కర్లేని కవిత్వం ఉందని, అది నాకు బాగుంటుందని తెలిసింది. అప్పటికి రాసిన సీస పద్యాలు, తేటగీతులను సంతోషంగా చించేశాను. నిజం చెప్పొద్దూ, కాస్త పెద్ద వాడినయ్యాక, “అయ్యా, మీరు ఈ చందస్సు పద్యాలు కాకుండా కవిత్వం రాయండి” అని విజయాత్రేయకు ఆరిందా సలహా కూడా ఇచ్చాను, ఆయన వినలేదు గాని.
నా మొదటి కవిత (‘చాటుమాటు’) ప్రీ యునివర్సిటీ కోర్సు చదువుతుండగా ‘మినీ జ్వాల’ (‘జ్వాల’ పత్రిక కవిత్వ అనుబంధం) లో వచ్చింది. విజయవాడ శీష్ మహల్ లో సినిమా చూసి వస్తున్నప్పుడు భోరు వానలో తడుస్తూ, తనుగా లేచి దాపుకు వెళ్లడం చేత కాక దీనంగా విలపించిన ఒక కుష్టు రోగి, అతడికి సాయపడని నా హీనత్వం ఆ కవిత వస్తువు. అచ్చులో నా పేరు చూసి మా నాన్న సంతోషపడ్డాడు. రెండో కవిత: బీఎస్సీలో ఉండగా ‘జ్యోతి’మాస పత్రికలో వచ్చింది (‘జీవితం కాగితం’). నన్ను చుట్టు ముట్టిన పలు ‘సిద్ధాంతాలు’ నన్ను నాకు కాకుండా చేస్తాయని, ఎవరెవరో రాసుకోడానికి, బొమ్మలేసుకోడానికి నన్నొక కాగితాన్ని చేస్తాయని, అ ఇంకులు రంగులతో నేను ఉబ్బిపోవడం మినహా ఏమీ ఉండదని ఆ కవిత. దాన్ని చదివి ‘నువ్వు ఆర్టిస్టువిరా’ అని నా ప్రాణ స్నేహితుడు తమ్మినేని పుల్లయ్య మెచ్చుకోడం తీపి గుర్తుల్లో ఒకటి.
ఆ కవిత లోని అభిప్రాయంతో నేను ఉండిపోలేదు. విప్లవోద్యమం లోనికి వెళ్లాను. పూర్తి కాలం కార్యకర్తగా పని చేశాను. కవిత్వం ఉద్యమానికి పనిముట్టు అనే భావనతో.. అదీ సమయం దొరికినప్పుడు… రాశాను. తనకు ‘కవిత్వమే జీవితం’ అన్నందుకు నా ఇష్ట కవి శివుడితో పేచీ పడ్డాను. వచన కవితతో పాటు చాల పాటలు రాశాను. ‘తూర్పు చేని గట్టు కాడ/ చెట్టు పుట్ట గొట్టెటోడ’, ‘జాజర జాజర జాజర జాజా/ జాజరాడుదం, జమ గుడి పోదం’, ‘అదరకండి బెదరకండి పోరాడే రైతులార/ చెదరకుండ నిలవండీ జనం పోరు గెలిచి తీరు’ వంటి కొన్ని పాటలు ఇప్పటికీ కొందరు గాయకులకు తెలుసు. కవిత్వం రాయదల్చుకుంటే, ‘కవిత్వమే జీవితం’ అనుకుని పని చేయాలన్న శివుడి అభిప్రాయం పూర్తిగా సరైందని తెలుసుకోడానికి నాకు చాల రోజులు పట్టింది. ఇప్పటికైనా తెలిసిందో లేదో.
మొదటి కవితా సంకలనం ‘గుండె దండోరా’లో రెండు మూడు బలహీనమైన వచన కవితలు మినహా అన్నీ పాటలే. ఆపైన ప్రచురించిన కవితా సంకలనాలు ఏడు. ‘రస్తా’, ‘లావా’, ‘అబద్ధం’, ‘ఒక్కొక్క రాత్రి’, ‘నకులుని ఆత్మ కథ’, ‘చిన్న చిన్న ఘటనలు’, ఇటీవలి ‘వానలో కొబ్బరి చెట్టు’.
కథలు రాయడం కూడా ఇష్టం. కథ పేరుతో మళ్లీ కవిత్వం రాయకుండా ఉండాలని అనుకుంటాను. ఒక్కోసారి అది కుదరక, ‘పోన్లే’ అనుకుంటాను.
సాహిత్య విమర్శ అని అనలేను గాని, అలాంటి పని చేశాను. అలాంటి ప్రయత్నాల సంపుటి పేరు ‘సంబరం’. అందులో నేను సమర్థించిన ఉత్తరాధునిక భావనలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. ప్రజలతో సన్నిహితంగా బతకాలనే కోరికతో ఉద్యమ జీవిని కావాలని ఇటీవల మరోసారి ప్రయత్నించాను. ‘సంబరం’లోని అబిప్రాయాల గురించి ఇప్పడేమంటావు’ అని అడిగారు. ‘అదే మాట అంటాను, కుదరకపోతే వద్దు లెండి’ అనేసి ఇక ఆ ప్రయత్నం మానుకున్నాను.
‘ఈనాడు’ ఉద్యోగిగా పావని, దినకర్ అనే పేర్లతో రాజకీయార్థిక విషయాల మీద బోలెడు వ్యాసాలు రాశానండోయ్. ఏం చెబుతున్నాననేది వదిలేసి ఎలా చెబుతున్నాననేది ఒక్కటే పట్టించుకుని రాస్తే చాల మంది ఇష్టపడతారని అప్పుడే తెలిసింది. మూడు నాలుగు మినహా ఆ వ్యాసాలు నా అభిప్రాయాలు కావు. ‘ఆస్థాన’ కవిత్వం ఎంత బాగున్నా ఎందుకు మంచిది కాదో ఆ విధంగా నాకు అనుభవమయ్యింది. ఆ కాలంలో కవిత్వం కూడా మారు పేరుతోనే రాశాను. ( అవి ‘కాలానికి కన్నం వేసి దొంగిలించిన కొన్ని క్షణాలు’). మోసం బయట పడ్డాక, ఇక ఉద్యోగంలో ఉండగా కవిత్వం రాయ లేదు. కవిత్వం రాయకుండా ఉండడం కుదరక, ఆ తరువాత ఆర్నెళ్లకు రాజినామా చేశాను.
3. మీకు బాగా నచ్చే సాహితి ప్రక్రియ ఏది? ఒకవేళ కవిత్వం ఐతే అది కాకుండా ఇష్టమైన మరోటి చెప్పండి. ఎందుకు ఇష్టమో కూడా.
పాఠకుడిగా నాకు బాగా నచ్చే సాహిత్య ప్రక్రియ కథ. ఆ తరువాత వరుసగా కవిత్వం, నవల, వ్యాసం. చాల సార్లు చిన్న కథగా రాయాల్సిన దాన్ని నవలగా పెంచుతారని నాకు అనిపిస్తుంది. అందుకని గొప్పగా ఉందని ఎవరో చెబితే తప్ప నవలల జోలికి పోను. వీలయినంత వరకు కథలు చదవడానికే ఇష్టపడతాను. (క్రైమ్ థ్రిల్లర్లు వేరు. అవి తాత్కాలికి మరణాలు. నన్ను నేను భరించలేక పిచ్చి పట్టి పోవడం కన్న, తప్పుడు నిర్ణయాలకు బలైపోవడం కన్న… ఒక్కోసారి అవే మేలు అనిపిస్తాయి.)
రచయితగా కవిత్వం ఎక్కువ ఇష్టం. ఆ తరువాతే కథ, వ్యాసం. కవిత్వం ఇచ్చే సాంత్వన (రచయితకు) ఇంకేవీ ఇవ్వవు. రాసే వరకు ఒక చోట కూర్చోనీయని అలజడి, రాశాక ఒక విముక్తి భావన చాల బాగుంటాయి. నా అనుభవం మేరకు; కథ కోసం ఓపిగ్గా ఆలోచించాలి. తగినంత మానసిక సంయమనం, భౌతిక తీరిక అత్యవసరం. బతుకులోని డిటెయిల్ ని శ్రద్ధగా చూడడానికి, అలా జరుగుతుందా, అలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించుకోడానికి, ఆపైన ప్లాట్ నిర్ణయించుకోడానికి, చివరికి ఎవరూ డిస్టర్బ్ చేయకుండా కూర్చుని రాసుకోడానికి తగినంత సౌకర్యం, స్థలం, సమయం, ఓపిక అవసరం. అవి నాకు ఇటీవలనే దొరుకుతున్నాయి. మునుపు లేవు.
కవిత్వం వేరు. ఒక భావోద్వేగం లోపలికి ప్రవేశిస్తుంది. గుండెకు గుచ్చుకుంటున్నట్లు తిరుగుతూ ఉండిపోతుంది. వదలదు. ఏ పని చేస్తున్నా లోపల రసాయనిక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒక పదంతో ఒక ఘటనతో లింకప్ అయినప్పుడు మనసు కాంతివంతం అవుతుంది. వెంటనే రాయకపోతే చాల కోల్పోతానని అనిపిస్తుంది. (ఔను, ‘క్యాపిటల్’ రాయకపోతే బతుకు వ్యర్థమని మార్క్సుకు అనిపించినంతగా అనిపిస్తుంది). రాయకుండా ఉండడం అసాధ్యమవుతుంది. అచ్చంగా రాయడానికి ఎంతో సేపు పట్టదు. రాసింది బాగుంటే బాగుంటుంది లేదా చించెయ్యొచ్చు. ఒకటి రెండు పేజీలే కదా?! అదే కథ అయితే, చించెయ్యాల్సి వస్తే ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. ఒక మేరకు మార్పులు అవసరమే గాని, మొదటి ఫీలింగ్స్ ని ఎడిట్ చేసుకోవడం వల్ల పద్యం చెడిపోతుందని నా అనుభవం. కవిత్వం రాయబడే ‘సమాధ్యవస్థ’ అనబడేది ఏదో ఉంది. ఏదో రహస్యం ఉంది.
ఒక్క మాటలో చెప్పాలంటే; నేను కథ రాయకుండా, మందు కొట్టకుండా ఉండగలను. కవిత్వం రాయకుండా, సిగరెట్లు కాల్చకుండా ఉండలేను. J
పాఠకులకు ప్రయోజనమంటారా? కవిత్వం ‘ఆనందం’ ఇస్తుంది. సాంత్వన ఇస్తుంది. ‘ఓహ్ నేను అనుకుంటున్నది నిజమేనే’ అని భరోసా ఇస్తుంది. మంచి కవిత్వమైతే మరి మరి చదువుకోవాలని అనిపిస్తుంది. తగిన సందర్భంలో గుర్తుకు వచ్చి అవాంఛనీయ ఆలోచనలను వాయిదా వేయిస్తుంది. నడిపిస్తుంది. ఒక పాఠకుడిగా నాకు కవిత్వం చాల మేలు చేసింది. చాల సార్లు నన్ను బతికించింది.
పాఠకుల మీద ప్రభావం విషయంలో కవిత్వానిదే పెద్ద పీట. నా మట్టుకు నేను కథ/నవల, కవిత్వం రెండూ బాగానే చదివాను. నా జీవితాన్ని కవిత్వం ప్రభావితం చేసినంతగా కథ/నవల ప్రభావితం చేయలేదు. అంతే కాదు, ప్రాథమికంగా కవినై ఉండడం వల్ల ఒక పాత్రికేయుడిగా నాకు ఎక్కువ మేలు జరిగింది. (కవుల మాటలు తీసుకుని హెడ్డింగులు పెట్టడం వంటి చిన్న ‘మేలు’ కాదు). భాష మీద, మానసిక రీతుల మీద పట్టు సంపాదించడానికి కవిత్వం ఎక్కువ ఉపయోగపడుతుంది. కథకుడి మాదిరిగా కాకుండా కవి తక్కువ మాటల్లో, అదీ నిర్దిష్టమైన, నిర్దుష్టమైన మాటల్లో మాట్లాడాల్సి ఉంటుంది. కవితలో సమాచారం తప్పైతే కొంపలేం మునగవు. సమాచారం కోసం ఎవరూ కవిత్వం చదవరు. చదవకూడదు. కవి చెప్పిన వాస్తవాల్ని క్రాస్ రెఫరెన్సు తరువాత తప్ప తీసుకోరు. భాషా ప్రయోగంలో, పీలింగ్స్ విషయంలో కవి తప్పులు చేయగూడదు. తగిన పదాల కోసం, ఫీలింగ్స్ ని సరిగ్గా పట్టి ఇచ్చే పదాల కోసం కవి తనను తాను తవ్వుకోవాల్సి ఉంటుంది. అందు వల్ల భాష మీద, మానసికాంశాల మీద పట్టు కోసం కవిత్వం చదవడం ఒక అవసరం.
ఊళ్లలో వినిపించే సామెతలలో, ఇచ్చకాలలో, తిట్లలో కవిత్వం ఉంటుంది. ఉదా: ‘గోడలకు చెవులు’, ‘తల మాయ’. మా నాన్న నుంచి విన్న ‘గుడ్డు పెట్టే కోడికి తెలుసురా ముడ్డి మంట’, మా అమ్మ నుంచి విన్న ‘వాదు ల్యాక వల్లూరుకు పోతొండా ఇరుగు పొరుగు నా సవుతులార ఇల్లు బద్రమే’ వంటి మాటల్లో కవిత్వం ఉంది. నా నాల్గవ తమ్ముడు, ఏడాది నిండని వాడు చనిపోయినప్పుడు రాత్రంతా ఏడ్చిన అమ్మ మాటల్లో కవిత్వం ఉంది. అమ్మమ్మ తాతయ్య చెప్పే కతల్లో కథ ఉంటుంది. భాష లోని సౌందర్యం సామెతలు, నుడికారాలు, ‘విచిత్రా’లే కదా?! దాదాపు ప్రతి అమ్మమ్మ కత చెబుతుంది. ఊళ్లో కొద్ది మంది మాత్రమే కొత్త కొత్త సామెతలు, నుడికారాలు, విచిత్రాలతో మాట్లాడి మనసును కాస్త పైకెత్తుతుంటారు. అందరం వాళ్ల గురించే మాటకారులని అంటాం. కత ఎప్పుడైనా చెప్పొచ్చు, చెప్పడానికి/వినడానికి తీరిక ఉంటే చాలు. కవిత్వం అనదగిన మాటలను కొన్ని ‘ఉద్రిక్త’ సమయాల్లోనే అంటాం/వింటాం. ఆ మాటలు మన తీరిక కోసం ఆగవు. కవితకు కథకు చాల తేడా ఉంది. కవిత్వం బతుకులోని తడి, కథ అంటే బతుకే.
కొత్తగా చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే తప్ప వ్యాసం రాయగూడదు. కొత్తది సమాచారం కావచ్చు, ఉన్న సమాచారంలోనే కొత్త కోణం కావచ్చు. అలాంటి అవసరం లేకుండా వ్రాసిన వ్యాసాలు చదవాల్సి వస్తే, రచయితను తిట్టిపోయాలనిపిస్తుంది. అలా రాసినందుకు నన్ను నేను తిట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కవిని, కథకుడిని మాత్రం… అది నేనే అయినప్పుడు కూడా… అలా తిట్టాలని అనిపించదు. బాగో లేదని చెప్పాల్సి వస్తే తప్పకుండా చెప్పాలి. దాని కన్న ముందు రచయిత ప్రయత్నాన్ని అభినందించాలని అంటాను. (ఇది నా మీద నా సానుభూతి (ప్యాట్రనైజేషన్) అనుకోవచ్చా? ఏమో!)
4. కవిత్వానికి మీ నిర్వచనం, కవిత్వం కవికి ఎలా పనికొస్తుంది, పాఠకుడికి ఏమైనా పనికొస్తుందా?:)
కవిత్వం అనిర్వచనీయం. బతుకు లోని అనిర్వచనీయాలను వ్యక్తం చేయడానికే కవిత్వం ఉంది. సైన్సుకు, హేతువుకు, తర్కానికి అందని అజ్ఞాతాలను జ్ఞాతం చేసుకోవాలనే బలమైన కోరికకు అక్షర రూపం కవిత్వం. మనుషులకు కవిత్వం బాగా అనుభవం లోనికి వచ్చే కొద్దీ దేవుడి అవసరం తగ్గిపోతుందని నా నమ్మకం.
‘బతుకులో చాల దుఃఖం ఉంది. మీ కవిత్వంలో దుఃఖం, క్షోభ ఎందుకు కనిపించవు’ అని ఓసారి ఇస్మాయిల్ గారిని (ఉత్తరంలో) అడిగాను. కష్టాలు, సంక్షోభాల జీవితం లోంచి కవిత్వం ఆనందాన్ని పిండి ఇవ్వాలని ఆయన అన్నారు. ‘పిండి ఇవ్వడం’ అంటే జీవితం లోంచి ఆహ్లాదకర విషయాల్ని యాంత్రికంగా వేరు చేసి ఇవ్వడం కాదు. ‘భూమి గుట్టు తెరవబోయి బిరడాలో ఇస్క్రూలా ఇరుక్కున్న పురుగు’ నిజానికి ఒక అసంతోషం, స్వేచ్ఛ యొక్క తీవ్ర పరిమితి. కన్నీళ్లు, సంక్షోభాలు, విస్తరించే శూన్యాలు.. దేని లోంచి మాట్లాడినా కవిత్వం పరమావధి ‘ఆనంద’మే.
ఆనందం ఇచ్చే క్రమంలోనే కవిత్వం మనుషుల మనస్సులను ప్రభావితం చేస్తుంది. మనుషులు మనుషులుగా తయారు కావడానికి దోహదం చేస్తుంది. “విప్లవ కెరటం నన్ను ‘ఫ్రాడ్’ చేసింది” అన్నాడొక సారి శ్రీశ్రీ. విప్లవం సంగతేమో గాని, కవిత్వం మనుషులను ‘ఫ్రాడ్’ చేస్తుంది. దీన్ని విస్మరించి ప్రయోజనం లేదు. ఈ మేరకు ‘శుద్ధ కవితా’ వాదం అసాంఘికం. తన వాక్కు సమాజాన్ని ప్రభావితం చేస్తుందని కవి మరిచిపోకూడదు. ‘నాకు బాగున్నది నేను చెబుతానంతే’ అనడం ఒక రకం క్రూరత్వం. కవిత్వం ప్రచారం కోసం కాదు గాని, రాసి ప్రచురించిన ప్రతిదీ దేన్నో ఒక దాన్ని ప్రచారంలో పెడుతుంది. కవిత్వం ‘కదిలేదీ కదిలించేదీ’ అనే స్పృహ కవికి ఉండాలి. కవిత్వంలో మంచి సెబ్బరలపై మాట్లాడే సందర్భాల్లో ఈ ఆలోచన మరింత ముఖ్యం. తరచు దీన్ని ‘వస్తు చర్చ’ అంటూ ఉంటారు. అందమైన పాత్రలో విషం ఇచ్చినా ఫరవాలేదా అనే ఎదురు ప్రశ్నకు జవాబు లేదు.
5. వ్యక్తి జీవితంలో కానీ, సమాజంలో కానీ సాహిత్యం/కవిత్వం ఉండటానికి లేకపోవడానికి మధ్య తేడా ఏమిటని మీరనుకుంటున్నారు?
కవిత్వం లేని సమాజం ఎండిపోయిన పువ్వు లాంటిది. ఎండిపోతేనేం అనుకుంటే పేచీ లేదు. ఎండబెట్టిన మాంసం, కూరల్లాగే ఎండిపోయినవి ఎక్కువ కాలం మన్నుతాయి. కాని, తడి ఉన్నవే బాగుంటాయి. అవే ఎక్కువ ఆరోగ్యం.
ఇవాళ మనకు కనిపిస్తున్న చాల ఘోరాలకు కారణం ఏమిటి?
తినడానికి తిండి, తలదాచుకోడానికి ఇల్లు లేకపోవడం, నిరుద్యోగం వంటి సమస్యలున్నాయి. రాను రాను ఈ కనీసావసరాల తీవ్రత తగ్గుతోంది. ఇందిరా గాంధీకి ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ అంటే ఓట్లు పడ్డాయి. రాజశేఖర రెడ్డి వాటికి విద్యా, వైద్యాలను కలిపితే గాని ఓట్లు పడలేదు. ఈ అజెండా నుంచి ఏ పాలకుడూ తప్పించుకోలేడు. కొత్తగా వచ్చే పాలకుడు ఉన్న వాడిని బలిమిని తొలగించాలి లేదా అజెండాలో ‘భద్రత’ వంటి మిగిలిన నిత్యావసరాలను చేర్చి ఓట్లు అడగాలి. అదీ నేటి జీవితం. నిత్యావసరాల తీవ్రత ఇటీవల బాగా తగ్గింది. మరి; చుట్టూరా ఈ అలజడి, ఆందోళన, ఆత్మహత్యలు ఎందుకున్నట్లు? అట్టడుగు పొరల్లో ఇంకా జనం ఉన్నారు గాని, చాల మంది ఎగువకు పాకి ‘మధ్య తరగతి’లో చేరిపోయారు. అలజడులు, అందోళనలు, ఆత్మహత్యలు మధ్య తరగతిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి కనీసావసరాలకు పరిమితమైనవి కావు. కొత్త కారణం ఏమిటి?
రింగు రోడ్డు మీద బోల్తాపడి నిండు ప్రాణాల్ని బలి తీసుకున్న ఖరీదైన బైకుల వెనుక, కొత్తగా మొలిచిన ఫ్యాషన్లను అందుకోలేని నిరాశతో పక్కదారులు పడుతున్న యువకుల వెనుక, వాస్తవికత పునాది లేని ఉద్యమాలలో ఆత్మహత్యల వెనుక… అసలు కారణం ఏమిటి? వీళ్లు కేవలం కూడు గుడ్డ లేని పేదవాళ్లు కాదు. జీవితం పట్ల ఆసక్తిని కోల్పోయిన వాళ్లు. వీటి వెనుక ఉన్నది ఒక రకమైన ‘బోర్డమ్’, సమాజం ‘ఎండిపోవడం’. సమాజం ఎండిపోకుండా, బతుకులో తడిని చేర్చగలిగేది ఏమిటి?
బడిలోనయినా, బయటైనా మనుషులను మనుషులుగా కాకుండా ‘సంపాదన యంత్రాలు’గా తయారు చేసే జీవితమే ఇవాళ ఉంది. ఇంత ‘ప్రొజాయిక్’ బతుకు ఇంతకు ముందు ఉండిందా? నీషే ఫిలాసఫించినట్లు ‘దేవుడు చనిపోయాడు’. దేవుడిని నమ్మం, నమ్ముతాం అనే ఇద్దరిలోనూ దేవుడు చనిపోయాడు. దేవుడు ఇచ్చే సాంత్వన లేదు. హృదయం/ ఆత్మ లేని సమాజానికి మతమే హృదయం/ఆత్మ అయ్యిందన్నాడు మార్క్సు. ఇప్పుడు వట్టి ‘క్రతువు’గా, ఇంకేవో అవసరాల వేదికగా తప్ప మతం లేదు. దేవుడి స్థానాన్ని కేవలం ‘మానవుడు’ భర్తీ చేయలేడు. మత విశ్వాసం స్థానాన్ని కేవలం ‘మానవత్వం’ భర్తీ చేయలేదు. భర్తీ చేయగలిగింది ఏమటి?
వినోదానికి కూడా వినియోగ వస్తువుగా తప్ప చోటు లేదు. ఆటలు, టీవీ, సినిమా వంటి వినోదాలలో ఉన్నది సంపాదన-కేంద్రకమైన హృదయ విదారక పోటీయే. వీటిలో సామాన్యులు వట్టి ప్రేక్షకులు లేదా ‘విజయులను’ చూసి అసూయ పడాల్సిన వాళ్లు. మనుషులు కేవలం ప్రేక్షకులుగా ఉండలేరు. తాము కూడా పాల్గొనే వినోదాన్ని కోరుకుంటారు. ప్రతి కదలికను ‘శ్రమ’గా ప్యాక్ చేసి, పోటీ పడి, అమ్ముకోలేకపోతే ఇప్పుడు దేని లోనూ పాల్గొనలేం. క్రికెట్ కామెంటరీలో ఆ యుద్ధ భాష ఎందుకు? హాయిగా ఆడుతూ పాడుతూ బతకడం కాకుండా నృత్య గానాలలోనూ ‘చెమటోడ్చడం’ ఎందుకు?
చాలకాలం క్రితం సోర్బాన్ (1968) విద్యార్థులు ఈ పరిస్థితిని చక్కగా వ్యక్తం చేశారు. అన్నం మాత్రమే కాదు మాకు అన్నీ కావాలన్నారు. ముఖ్యం గులాబీలు కావాలన్నారు. సౌందర్యం కోసం వీథులకెక్కారు. వాళ్లు అడిగిందీ నేటి సమాజంలోని ఖాళీని పూరించేది ఒక్కటే, ఈస్తటిక్ సౌందర్యం. అది సమాజంలో అత్యధికులకు అందుబాటులోకి వచ్చే కొద్దీ నేటి ‘రాహిత్య’ రూపాలన్నీ తోక ముడుస్తాయి. మనుషులు జీవితాన్ని ఆనందిస్తారు. ‘బోర్డమ్’ కు ఇదే తగిన జవాబు. ఇది కుదురుకునే వరకు అలజడి, ఆందోళన, ఆత్మ హత్యలు ఉంటాయి. బతకడం కన్న చావడం మేలని అనిపించడం ఉంటుంది. బతుకులో లేని సౌందర్యాన్ని మరణంలో వెదుక్కోవడం ఉంటుంది. అది ‘గ్లామరస్’ గానూ ఉంటుంది.
సహజ సౌందర్యంతో కూడిన జీవితానికి, జీవితేచ్ఛకు కవిత్వం, కథ మంచి సాధనాలు. డబ్బు లేకపోయినా సాధ్యాలు.
అందరూ తెలుగు భాష బతుకుతుందా లేదా అని చర్చిస్తున్నారు. తెలుగులో వ్యవహరించే వాళ్లు ఉన్నంత వరకు, దానిలో వ్యవహారాలు జరిగినంత వరకు తెలుగు భాష ఉంటుంది. వ్యవహారాలకు చాలక పోవడం వల్ల (మరో మాటలో, అవసరం లేకపోవడం వల్ల) తెలుగు భాష అదృశ్యమైతే పోయిందేం లేదు. తెలుగులో ఇంగ్లీషు పదాలు కలిసిపోవడం గురించి ఇలాంటి గగ్గోలే వినిపిస్తోంది. నిన్న సంస్కృత పదాలు, ఉర్దూ పదాలు తెలుగును ముంచెత్తితే ఏ ఫిర్యాదు లేదు. ఇవాళ తెలుగులో ఇగ్లీషు పదాలు కలిస్తే ఎందుకంత వీరంగం? వ్యవహారంలో ఉన్న భాష కథకు, కవిత్వానికి అవసరం. అలాంటి భాష ఎప్పడూ ఉంటుంది. మనుషులు ఉన్నంత కాలం ఉంటుంది. తెలుగు లేదా మరొక భాష కాదు; కథ, కవిత్వం ఉంటాయా లేదా అనేది అసలు సమస్య. ఇక ముందు మనుషులు ఎండిపోయిన జీవితానికి అలవాటు పడతారా లేక సరదాను, సౌందర్యాన్ని విస్తరిస్తారా అన్నదే వ్రశ్న.
‘బూర్జువజీకి ఒకే ఒక్క సరదా ఉంటుంది, అన్ని సరదాలను పాడు చేసే సరదా’ అని గుర్తు చేసినందుకు కూడా 1968 సోర్బాన్ పిల్లలంటే నాకు ఇష్టం. ఆ పిల్లలు వేలెత్తి చూపిన ‘నెగటివ్ సరదా’ను విమర్శించడం ద్వారా కవిత్వాన్ని, కథను కాపాడుకోగలమని అనుకుంటాను.
6. కవిత్వం లోపల్నుండి తన్నుకొచ్చే ఒక ఆవేశంతో మొదలౌతుంది. ఉద్యమం లోలోపల రగిలించే ఒక ఆశయంతో కదులుతుంది. ఉద్యమ కవిత్వమూ, కవితా ఉద్యమాలపై మీ అభిప్రాయాలూ, అనుభవాలూ, ప్రయోగాలు చెప్పండి.
మీరన్నది నిజమే. ‘కవిత్వం లోపల్నుండి తన్నుకొచ్చే ఒక ఆవేశంతో మొదలౌతుంది’. సమాజం ‘లోపల రగిలే ఆశయంతో ఉద్యమం మొదలౌతుంది’. ఉద్యమాలు సమాజం చెప్పే కవిత్వాలు.
మిగతా అన్ని అనుభవాల వంటిదే ఉద్యమంలో ఉన్న వ్యక్తి అనుభవం కూడా. అంత కన్న ఎక్కువా కాదు తక్కువా కాదు. అటు కొందరు ఇటు కొందరం చేరి వాదించుకోనక్కర్లేదు. నేను ఉద్యమ కవిత్వాలతో ఉన్నాను. ఉద్యమేతర కవిత్వాలతోనూ ఉన్నాను. ఉంటాను. కవితా ఉద్యమాలతో లేను గనుక వాటి గురించి ఏమీ చెప్పలేను. అసలు తెలుగులో కవితా ఉద్యమాలు అనేవి సంభవించాయా? దిగంబర కవితోద్యమం అలాంటి ఒక ప్రయత్నం. అంతకు మించి…? వచని కవితోద్యమం ఒకటి ఉందని అంటే అనవచ్చు. సర్రియలిజం, డాడాయిజం వంటివి తెలుగులో కాస్త ప్రస్తావితం అయ్యాయే గాని, అనువదితం కాలేదు. వాటి మీద ఒకరిద్దరు తీసుకున్న పి.హెచ్.డి. పత్రాలను చూస్తే ‘ఓరి దేవుడా’ అనిపిస్తుంది. అభ్యుదయ, విప్లవ సాహిత్యోద్యమాలు కవితోద్యమాలు కావు. అది సామాజిక ఉద్యమాలకు బాసటగా వచ్చిన కవిత్వం, అంతే. దళిత, స్త్రీవాద ఉద్యమాల విషయంలోనూ నేను ఇలాగే అనుకుంటున్నాను.
ఏ ఒక్క ఉద్యమం చిరస్థాయిగా ఉండదు. ప్రాణ శక్తిని కోల్పోయాక, తను ఏమి సాధించగలదో దాన్ని సాధించాక, ఉద్యమం ఉండదు. తాను చేయగలిగింది చేసి, సాధారణ జీవితంలో కలిసి పోతుంది. లేదా, స్వరూప స్వభావాలు మార్చుకుని కొత్త అవసరాల కోసం మరో ఉద్యమం అవుతుంది. పేరు అదే కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఉద్యమాలు లేకుండా సమాజం ఉండదు. సమాజం ఉద్యమాల రూపంలో గుణాత్మక మార్పులకు లోనవుతుంది.
తమ జీవితాలకు సంబంధం లేకపోవడం వల్ల కావచ్చు, తమ ప్రయోజనాలకు విరుద్ధం కావడం వల్ల కావచ్చు, వాటిని పట్టించుకుంటే గొప్ప కవిత్వం అసాధ్యమని నిజాయితీగా విశ్వసించడం వల్ల కావచ్చు… కొందరు కవులు ఉద్యమ స్పర్శకు దూరంగా ఉంటారు. అది తప్పూ కాదు, ఒప్పూ కాదు. నేను వాళ్ల నుంచి నేర్చుకుంటాను. ఉద్యమంలో తలమునకలవుతున్న వ్యక్తి కూడా ఇరవైనాలుగ్గంటలు ఉద్యమ జీవిగా ఉండడు. ఒక భర్తగా, ఒక తండ్రిగా, కొడుకుగా, స్నేహితుడిగా, ప్రేమికుడిగా ‘వ్యక్తిగత’ జీవితం ఉంటుంది. ఆ అనుభవాలూ రాయిస్తాయి. పూర్తికాలం విప్లవకారుడిగా ఉన్నప్పుడు రాసిన ‘లావా’ కవిత్వంలో నా వ్యక్తిగతం కూడా ఉంది. వ్యక్తిగతానికి, సామూహికానికి మరీ అంత దళసరి గీత ఉంటుందని అనుకోను. చర్చించాల్సింది కవిత్వాన్ని, ఉద్యమాన్ని కాదు.
ప్రయోగాలు అనే పెద్ద మాట వాడలేను. ఒకే రకం జీవితం జీవించలేదు. అలాంటప్పుడు ఒకే రకం కవిత్వం ఉండదు. జీవితంలోని ప్రయోగాలు కవిత్వంలో కనిపిస్తాయి. అన్నిటిలో అనుసరించిన సూత్రం ఒకటే: నాకు తెలియనిది తెలిసినట్టు పోజు కొట్టే కవిత్వం రాయొద్దు, నేను చేయనిది/ చెయ్యొద్దని అనుకుంటున్నది…. గిరాకీ ఉంది కదా అని… చేస్తున్నట్టు రాయొద్దు, చెప్పాలని బలంగా అనుకున్నది ఏ సమూహానికైనా బాధ కలిగిస్తుందేమోనని చెప్పడం మానెయ్యొద్దు, issue to issue కలిసి నడవాలే గాని ఎవరినీ అనుసరించొద్దు, ఎవరూ నన్ను అనుసరించాలని కోరుకోవద్దు. నాకు నిమగ్నత, స్నేహం, ప్రేమ ఇష్టం. నిబద్ధత, విధేయత, భక్తి అయిష్టం. ఉత్తి అయిష్టం కాదు, కోపం. ఒక భావోద్వేగంగా ఈ కోపం నా కవిత్వంలో ఉంది. అది చాల సార్లు నా మీద నా కోపంగానే ఉంది. J
7. తెలుగులో వచ్చిన, వస్తున్న కాల్పనికేతర సాహిత్యం గురించి ఏమంటారు. తెలుగేతర భాషలతో చూస్తే సంఖ్య, స్థాయి విషయంలో వీటి స్థానం ఏమిటి? మీకు బాగా నచ్చిన; ప్రభావితం చేసిన నాన్-ఫిక్షన్ పుస్తకాలేమిటి? తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ
తెలుగులో కాల్పనికేతర (కవిత్వేతర) సాహిత్యం తగినంతగా రాలేదనుకుంటాను. మహీధర నళినీమోహన్ సైన్సు పుస్తకాలు, నండూరి రామ్మోహన రావు విశ్వదర్శనం, నరావతారం వంటి పుస్తకాలు, కొడవటిగంటి సైన్సు వ్యాసాలు చాల చాల బాగుంటాయి. హాయిగా చదివించడంతో పాటు వాటి నుంచి తెలుసుకోడం కూడా వుంటుంది. జీవితం గురించి ఒక చూపు ఏర్పడడానికి, చూపు విశాలం కావడానికి ఉపయోగపడతాయి. అనువాదమే గాని; టెడ్ అలెన్, సిడ్నీ గోర్డన్ లు ‘గతి తార్కిన భౌతిక వాదా’న్ని పరిచయం చేస్తూ రాసిన పుస్తకం నా జీవితంలో ఒక మలుపు. విశ్లేషణలో, ఆలోచనలో ఇప్పటికీ నాకు నచ్చిన మోడల్. నన్ను హాంట్ చేసే మరో పుస్తకం కూడా అనువాదమే, (దాన్ని కవిత్వం అంటారేమో), ఏంజిలా కాట్రోచ్చి పుస్తకానికి శ్రీశ్రీ తెలుగు ‘రెక్క విప్పిన రెవల్యూషన్”.
గతంలో ‘అభిసారిక’ వంటి పత్రికలలో కాస్త చదవదగ్గ మంచి సమాచారం ఉండేది. ‘ఈనాడు’లో సమరం గారు ఆ పనిని కొంత కాలం కొనసాగించారు. నరసింహరావు గారు నడిపించిన పత్రిక (దాని పేరు ‘మార్పు’ అనుకుంటా) చాల ఆసక్తికరంగా నడిచింది.
మనస్తత్వ శాస్త్రంలో కనీస ప్రవేశం లేని వాళ్లు వ్యక్తిత్వ వికాసం పేరిట ఎక్కడెక్కడో ఏరుకొచ్చిన సమాచారంతో రాసిన నిష్పూచీ పుస్తకాలు చాలానే వచ్చాయి. యువతీ యువకులలోని అభద్రత భావాన్ని సొమ్ము చేసుకోడం మినహా వీటి వల్ల ప్రయోజనం ఉందని అనుకోను. కె.ఎన్. వై. పతంజలి చివరి రోజుల్లో రాసిన ‘గెలుపు సరే… బతకడం ఎలా’ అనే పుస్తకం చాల బాగుంటుంది. అలా నిర్మొహమాటంగా మాట్లాడి ఒప్పించిన పుస్తకాలు ఇంకేమైనా ఉన్నాయా?
ఇతర భాషల్లో కాల్పనికేతర సాహిత్యం… అల్తూజర్, గ్రాంసీ, ఫుకో, లేటార్డ్, బార్త్, డెరీడా, సయీద్, చాంస్కీ లు ఈ కాస్తయినా తెలియకపోతే; ఉద్యమంలో క్రియాశీల పాత్ర వదిలేశాక మిగిలిపోయిన నన్ను నేను అర్థం చేసుకోడం చాల కష్టమయ్యేది. ఇక్కడ నేనొక విషయం అంగీకరించాలి. ఉత్తరాధునిక భావనలను అసలు రచయితలపై వచ్చిన వ్యాఖ్యానాల ద్వారానే ఎక్కువగా అర్థం చేసుకున్నాను. నాది ‘పీఠికా పాండిత్య’మే, ‘సాధికారికం’ కాదు. బి. తిరుపతి రావు ‘పోస్ట్ మోడర్నిజం’ పుస్తకానికి మార్సిస్టు వ్యతిరేకత కేంద్ర బిందువు కాకపోయి ఉంటే, దాని వల్ల చాల మేలు జరిగేది.
8. కవిగా, చదువరిగా వేర్వేరు దశల్లో మీ ఆలోచనలు, అబిరుచుల్లో వచ్చిన మార్పులు, తొక్కిన కొత్త దారులు.. ఈ మధ్య కాలంలో ఆకట్టుకుంటున్న రచయితలు, రచనలు, సాహిత్య ధోరణలు వగైరా?
ఇప్పటికే మీకు తెలిసిపోయింది. సాహిత్యంలో ‘గాడ్ పాదర్స్’ కాదు గదా, నా వాళ్లు అని చెప్పుకోదగిన మనుషులెవరూ నా జీవితంలో లేరు. ప్రతి అడుగూ చీకటిలో తడుములాట. అడివిలో ఒంటిరి పయనం. బాగా చిన్నప్పడు, క్లాసులో మొదటి సారి పాఠంగా విన్నప్పడే బౌద్ధం, కమ్యూనిజం చాల గొప్పవి, నావి అనిపించాయి. అందులో మార్పు లేదు. మానవ స్వభావాన్ని అర్థం చేసుకోడంలో నాలో కొంత మార్పు ఉంది. తాము బౌద్ధాన్ని, కమ్యూనిజాన్ని ఇష్ట పడతామని అనే వాళ్లంతా గొప్ప వాళ్లేనని ఒకప్పుడు అనుకునే వాడిని. వాటిని కూడా ‘వాడుకునే’ వాళ్లు ఉంటారని తెలిశాక, మొదట పట్టరాని దుఃఖం కలిగింది. తరువాత ఆ దుఃఖం నా జ్ఞానం (knowledge)గా మారింది. నా దుఃఖాన్ని, జ్ఞానాన్ని లోకంతో పంచుకోడానికి ప్రయత్నించాను. వినాయకుని బొడ్డులో వేలు పెట్టి తేలు కాటు తిన్న దొంగ ‘తనకు అద్భుతానందం కలిగింద’ని అబద్ధం చెప్పడం ద్రోహమని, ఆ జ్ఞానాన్ని సహచరులకు పంచడం అతడి కనీస ధర్మమని అనుకున్నాను.
‘హిపొక్రసీ’ ఒక విశ్వజనీన, విశ్వకాలీన విశేషం. దాన్ని అధిగమించి మనిషి వేసే ఒక్కొక్క అడుగు మంచి ప్రపంచం దిశగా ఒక్కొక్క విజయం. హిపోక్రసీ-వ్యతిరేకత ఇవాళ్టి కవి చేతనకు, మానవ ప్రవర్తనకు కేంద్ర బిందువుగా ఉండాలని కోరుకుంటాను. హిపోక్రసీ లేని చోట చావు కూడా పెళ్లి వంటిదే, అది ఉన్న చోట పెళ్లి కూడా….!
కవిత్వంలో శ్రీశ్రీ మార్గం, కథనంలో కొకు దారి నాకు బాగా ఇష్టం. శ్రీశ్రీ మార్గమంటే ‘మహా ప్రస్థానం’ మాత్రమే కాదు, ఖడ్గసృష్టి కూడా. శ్రీశ్రీలోని ‘శబ్దం’, ఇస్మాయిల్ లోని ‘నిశ్శబ్దం’, నగ్నముని లోని సూటి మాట, శివుడి లోని సంక్లిష్టత ఏ ఒక్కటీ అన్ని సందర్భాలకు పనికొచ్చేది కాదు. ఏది ఎప్పుడు ఎలా అనేది కవి తనకు తాను చేసుకోవలసిన నిర్ణయం.
ఇంగ్లీషులో జాక్ లండన్ అంటే, ఆయన వచనంలోని కవిత్వం అంటే చాల ఇష్టం. ఇటీవల రాబర్ట్ బ్లై పద్యాలు నాకు చాల బాగుంటున్నాయి. చదువుతుంటే లోపల పొద్దు పొడుస్తున్నట్టు, వెన్నెల కాస్తున్నట్లు ఉంటుంది. ఇంకా చదవాలి, రాయాలి. పతంజలి అన్నట్లు ఒక కవి తన బతుకంతా అన్ని సార్లు రాసేదీ ఒకే ఒక్క పద్యమే అయిప్పటికీ.
9. మతానికి, నమ్మకాలకి, ఒక్కోసారి తర్కానికీ కూడా అతీతమైన తాత్విక జిజ్ఞాస , ఆసక్తి కవుల్లో ఎంతో కొంత ఉంటుంది. ఈ దారిలో మీ ఆసక్తి, అనుభవాలు, దొరికిన మార్గదర్శకాలు గురించి?
చాల బాగా చెప్పారు. కవి ఎప్పుడూ జిజ్ఞాసానందుడే, వివేకానందుడు కాడు. తన అన్వేషణలో భాగంగా అప్పుడప్పుడు కొన్నిటికి అనుచరుడిలా కనిపిస్తాడు. ఎప్పుడూ నాయకుడు మాత్రం కాడు. కవి జవాబును వెదకడానికి ప్రేరణ ఇచ్చే ప్రశ్నే గాని, జవాబు కాడు.
కవిగా నన్ను నడిపించిన అనుభూతి ‘ఆశ్చర్యం’. ఒక ఘటన, మాట, ఊహ నాకు కలిగించిన ఆశ్చర్యం పంచుకోడానికి రాయాలనిపిస్తుంది. మతం, నమ్మకం, ఒక తర్కం ఆశ్చర్యం కలిగించినప్పుడు అదీ కవిత్వమే. గురజాడ ‘దేశమంటే మట్టి కాదోయ్…’ అలాంటి కవిత అనుకుంటాను. దాన్ని మొదట విన్నప్పుడు కలిగిన ఆశ్చర్యానుభూతి నాకు ఇప్పుడు విన్నా కలుగుతుంది. చెరబండరాజు ‘కొండలు పగలేసినం’ అని మొదలెట్టి వరుసగా వేసిన ప్రశ్నలు కూడా అంతే. ఆ ప్రశ్నలకు సరైన జవాబు దొరక్క పోవడం దీనికి కారణం కావచ్చు. జవాబు దొరికితే అవి ఒక విజయోత్సవంలో భాగంగా ఉండిపోతాయి.
ఇలాంటి వాటికి విశ్వజనీనత ఉండదనే వాదాన్ని అంగీకరించలేను. ఒక ప్రత్యేక స్థితి అదృశ్యమయ్యాక, ఆ స్థితి లోంచి రాసింది విలువ కోల్పోతుందని అనుకోను. రవీంద్రుని ‘లివింగ్ అండ్ ది డెడ్’ కథలోని యోగమాయలా నేను వితంతువును కాను, కాలేను, నాకు ప్రేమాస్పదులైన స్త్రీలు ఎవరికీ ఆ దురవస్థ ఉండదు. రేపు మాపు ఎక్కడా వితంతువులే ఉండకపోవచ్చు. అయినా నేను యోగమాయను అని నాకు ఎందుకు అనిపిస్తుంది? జాక్ లండన్ ‘కాల్ అఫ్ ది వైల్డ్’ లోని బక్ అనే కుక్కతో నేను ఎందుకు ఐడెంటిఫై అవుతాను? ‘విదూషకుని ఆత్మహత్య’ లోని విదూషకునితో…? పొనీ, మాతృ గర్భంలో మరణ వ్యూహం తెలుసుకున్న అబిమన్యునితో…?
వయసుతో, స్థలంతో, కాలంతో నిమిత్తం లేకుండా నాకు నచ్చిన ప్రతి మనిషీ, ప్రతి మాటా, ప్రతి ఘటనా నాకు మార్గదర్శకమే. ఇక్కడ ‘నాకు నచ్చిన…’ అనే క్లాజు తప్పు కాకపోతే, నాకు దొరికిన మార్గదర్శకం ‘నేనే’ అనడం తప్పు కాదనుకుంటాను.
10. ఆనందాన్ని కొనుక్కునే బద్ధకం నుండి బయటపడి తనకు తానే సంతోషాన్ని సృజించుకోగల వ్యక్తిత్వౌన్నత్యం గురించి ఇందాక చెప్పారు. బహుశా సాహిత్యం, కళల పట్ల అభిరుచి ద్వారా దీన్ని సాధించవచ్చేమో అనిపిస్తుంది. ఈ విషయంపై ఈ తరం వాళ్లకి మీరిచ్చే సలహా?
నేను ఈ తరం వాడినే. J సలహా ఏమైనా ఉంటే నాకు నేను ఇచ్చుకునేదే. నాకు ఏది నిజంగా సంతోషంగా ఉంటుందో అదే చెయ్యాలి. ఇతర్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఏది నాకు సంతోషకరమో నాకు నేను ఆలోచించుకోవాలి. ఇతర్లు తమకు సంతోషకరమైన పద్ధతిలో తాము ఉండడాన్ని గౌరవించాలి. దొంగతనం, అబద్ఢం, యుక్తి, ఆటలో తొండి, హత్య, ఇంకొకరిని ఆత్మహత్యకు పురికొల్పడం వంటి పనులతో సంతోష పడే వాళ్లు కూడా లోకంలో ఉన్నారు. వాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోవాలి. మారుమూల పల్లెటూరి వాడిని కావడం వల్ల ఈ విషయం తెలుసుకోడానికి చాల సమయం పట్టింది. దానికి చెల్లించుకున్న మూల్యం గురించి దిగులు పడను. జీవించడం ఎప్పుడైనా మొదలెట్టొచ్చునని నాకు నేను చెప్పుకుంటాను.
ఇప్పటి అవసరాల కోసం, శారీరకంగా చాత కాని సమయాల కోసం తగిన మిగులు ఉండేట్టు చూసుకోవాలి. దానికి మించి సమకూర్చుకోవడం అర్థ రహితం. ఇతర్లకు నా మీద అసూయ కలిగితే చూసి ఆనందించడానికి తప్ప అతి అదనం దేనికీ పనికి రాదు. అనందించడానికి మంచి ప్రత్యామ్నాయాలు చేరువ అయ్యే కొద్దీ ఈ ‘అసూయ మీద ఆధార పడిన ఆనందం’ అనవసరం అవుతుంది. సాహిత్యం అలాంటి మంచి ప్రత్యామ్నాయం. మనుషులు కవిత్వం, కథలతో ఆనందించే స్థితి పెరిగే కొద్దీ కూడబెట్టుకుని పొరుగు వాడి అసూయకు గురై ఆనందించాలనే కోరిక తగ్గుతుంది. వ్యక్తులుగా ఇప్పుడు కూడా ఎవరికి వాళ్లం దీన్ని అనుభవం లోనికి తెచ్చుకోవచ్చు. ఉన్నంతలో హాయిగా జీవించ వచ్చు.
ఈ మాటలు డబ్బుకే కాదు, గుర్తింపు/కీర్తికి కూడా వర్తిస్తాయి. నాకు నేనుగా బతికిన క్షణాలు చాలు. వాటి సెలబ్రేషన్ చాలు. స్నేహితులతో కలిసి చేసుకునే సెలబ్రేషన్ మరింత బాగుంటుంది. అది కుదరకపోతే, కుదరాలనే కోరిక కూడా కవిత్వమే.
ఈ నెల ఇస్తున్న అంశం:
ముగింపు మేమిస్తాం..
దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్నభావన కలిగింది. తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్లు, తనచుట్టూ అంతులేని కడలి పరచుకున్నట్లు అనుభూతి. చూస్తూనే ఉన్నాడు సందీప్. ఈ ఏకాంతాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాడు. దీని కోసం ఎంత కష్టపడ్డాడు! మొత్తానికి సాధించాడు. చిన్న నిట్టూర్పు. పుడమిని జోకొడుతున్న అలల లాలిపాట వింటూ తృప్తిగా నిదురపోయాడు.
ఆలోచించండి. ఈ ముగింపుకి సరిపోయే కథను పంపండి. నేపథ్యం మీ ఇష్టం. పాత్రలు, సన్నివేశాలు ఏవైనా అభ్యంతరం లేదు. హాస్యం, హారర్.. ఎటువంటివైనా బాధలేదు. ముగింపు మాత్రం సరిపోవాలి.
గమనిక: ఈ సమస్య మీదనే కాక గతనెలల్లో ఇచ్చిన దేని మీదనైనా రచయితలు ఎప్పుడైనా కథలు పంపవచ్చు.
ఈ శీర్షిక కాన్సెప్టు గురించిన మరిన్ని వివరాల కోసం కథ చెబుతారా.. ప్రకటన చూడండి.
అట్ట
1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు మద్రాసులో చందమామ, యువ, ఆంధ్రజ్యోతి అనే పత్రికలను నడిపారు. ఇవన్నీ నాగిరెడ్డిగారు నడిపే బి.ఎన్.కె.ప్రెస్‌లో అచ్చయేవి. చక్రపాణిగారు ప్రెస్ పనిమీద మాటిమాటికీ తల్లిలేని తన ఇద్దరు కొడుకులతో తెనాలినుంచి మద్రాసుకి రావలసిరావడమెందుకని నాగిరెడ్డిగారి భార్య ఆయనను తమ ఇంటి మేడమీదనే ఉండమని ఆహ్వానించడం. ఆ కుర్రవాళ్ళ బాధ్యత తీసుకోవడం మొదలైన విషయాలు ఇతర సందర్భాల్లో మనకు తెలిశాయి.
నా దగ్గరున్న అరుదైన పాత పుస్తకాల్లో ఏప్రిల్ 1950నాటి ఆంధ్రజ్యోతి సంచిక ఒకటి పూర్తిగా దొరికింది. దాన్ని ఈ తరం పాఠకులతో పంచుకునే ఉద్దేశంతో పూర్తిగా స్కాన్‌చేసి సమర్పిస్తున్నాను. యువ అనే పత్రికను మొదటగా తెనాలినుంచి నడిపినది మానాన్నే. అది ఆగిపోవడంతో ఆయన అనుమతితో చక్రపాణి అదే పేరును మళ్ళీ వాడుకున్నాడు. అయితే ఇదీ కొన్నాళ్ళకు ఆగిపోయి, ఆ తరవాత మరొక అవతారమెత్తింది.
ఈ సంచికలో మా నాన్న కుటుంబరావుగారి రచన ఒకటీ, మా అమ్మకు పెదనాన్న చలంగారి నాటిక ఒకటీ, ఆయన పెద్ద కుమార్తె సౌరిస్ రచన ఒకటీ ఉన్నాయి. వీరంతా చక్రపాణిగారికి పాత తెనాలి స్నేహితులనేది చెప్పాలి.
ఈ సంచికలో నేను గమనించిన కొన్ని విశేషాలున్నాయి. ఒక చిత్రానికి భావపరిచయపోటీ పెట్టడం. ఇది బెంగాలీ పత్రికలనుంచి చక్రపాణిగారు అలవరుచుకున్న సంగతేమో తెలియదుగాని చందమామలో ఫోటోవ్యాఖ్యల పోటీ, యువ మాసపత్రికను 1961 నుంచి మరొకసారి హైదరాబాద్ నుంచి ప్రచురించడం మొదలెట్టాక దాని ముఖచిత్రానికి వ్యాఖ్యల పోటీవంటివన్నీ ఇదే ధోరణిని సూచిస్తాయి.
ఈ సంచికలో ముఖచిత్రమూ. లోపలి ఇలస్ట్రేషన్లూ, కార్టూన్లూ అన్నీ
వెనక అట్ట
వేసినది కేశవరావు. ఈయన చందమామ తొలి సంచికలలో కూడా బొమ్మలు వేసేవాడు. 1950నాటికి చిత్రా
చందమామలో చేరాడుకాని శంకర్ ఇంకా ప్రవేశించలేదు. అప్పటికి బాపూ యుగం మొదలవడానికింకా అయిదారేళ్ళ వ్యవధి ఉంది. కథలకి బొమ్మలూ, ముద్రణలో అచ్చుతప్పులు లేకుండా తీసుకున్న జాగ్రత్తలూ వగైరా
విశేషాలు నేటి పాఠకులు గమనించగలరు. అప్పటి ప్రకటనలూ, అణా
పైసలలో పుస్తకాల ధరలూ కూడా కొంత ఆర్కైవల్ వేల్యూ కలిగిన విషయాలే.
పొద్దు చదివేవారిలో కొందరివద్దనైనా ఇటువంటి అరుదైన పాత పత్రికల కాపీలుంటే వాటిని పంచుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్నయ. తిక్కనలతో పోల్చలేకపోయినా ఇవన్నీకూడా సాహిత్యచరిత్రలోని భాగాలే. తెలుగువారిలో సాహిత్యమూ, కళలూ వగైరాల గురించిన ఆత్మవిశ్వాసం వీటివల్ల బలపడుతుంది.
————————–
* ఇదే సంచిక నుండి మరికొన్ని పేజీలు మరొక భాగంలో ప్రచురించబడతాయి – పొద్దు
అప్పుడప్పుడూ
కన్పించని గాలిపాటకోసం
చెవులురిక్కించి వెతుకుతుంటాను
వెతుకులాట వెర్రిగా కన్పిస్తుంది నీకు
మూసలోకి దిగిపోయిన ఆలోచనలన్నీ
బయటకువచ్చే
బిరడా మూతనెవరైనా తెరుస్తారని చూస్తుంటాను
ఎవరికివారు
మూసల్లోకి దిగిపోయారనే సంగతే గుర్తుకు రాదు!
నాకు నేనే
మూసను బద్దలుకొట్టుకొని
ఏ తీరంలోనో మూర్చబోతాను
గాలిచేసే వింతసవ్వడులమధ్య
ఈ విషయం ఎలాగో తెలుస్తుంది నీకు!