తెలుగునాట విద్వాన్ విశ్వం గారిది ప్రత్యేక స్థానం. వీరి జీవితంలో ఉద్యమం, సాహిత్యం, జర్నలిజం ముప్పేటగా కలిసిపోయాయి. ప్రాకృతం, సంస్కృతం, ఆంగ్ల భాషలను ఆకళింపు చేసుకున్న పాండిత్యం ఆయన సొంతం. వామపక్ష ఆలోచనలనూ, భారతీయ లోచనాన్నీ కలిపి చూసిన సమన్వయవాది విశ్వం.
ఛాందసమెరుగని సంప్రదాయవాది,
ఆవేశంలేని ఆధునికవాది,
మనసున్న మానవతావాది విశ్వం.
విద్వాన్ విశ్వం అనగానే చాలామందికి మాణిక్యవీణ కాలమ్ గుర్తుకువస్తుంది. అలాగే ఎంతోమందికి పెన్నేటిపాట, ఒకనాడు కావ్యాలు స్ఫురించవచ్చు. ఇంకొందరికి బాణుభట్టు కాదంబరి, కాళిదాసు మేఘసందేశం అనువాదాలు స్ఫురణకు రావచ్చు. అయినా, ఆంద్రప్రభ సచిత్ర వార పత్రిక సంపాదకుడిగానే ఆయన సుప్రసిద్ధులు. విద్వాన్ విశ్వం మొదట సంస్కృత ప్రాకృతాలను లోతుగా అధ్యయనం చేసి తర్వాత ఉపాధ్యాయుడుగా స్థిరపడకుండా, రాజకీయ ప్రవేశం చేసి అటు తర్వాత పాత్రికేయుడుగా సంపాదకుడుగా మన్నన పొందారు.
పత్రికా రచయితగా విశ్వం సామర్ధ్యాన్ని, సృజనను ఆయన శీర్షికా వ్యాసాల ద్వారా చాలావరకూ బేరీజు వేసుకోవచ్చు. అయితే సంపాదకుడుగా ఆయన ప్రతిభ బోధపడాలంటే వారి నిర్వహణలో ఎటువంటి శీర్షికలు ప్రారంభమయ్యాయి, వాటి వస్తు సంవిధానాలు, అలాగే వాటి రచయితల ఎంపిక ఏవిధంగా ఉండేవో ఆయా సంచికలను సూక్ష్మదృష్టితో అధ్యయనం చేస్తే తప్ప బోధపడదు. నిజానికి తెలుగు పత్రికారంగంలో విశ్వం మాణిక్యవీణ కాకుండా మరో రెండు వీణలు ఉన్నాయి. గోరా శాస్త్రి వినాయకుని వీణ వాయించగా బాలాంత్రపు రజనీకాంతరావు విశ్వవీణను సవరించారు.
క్రీస్తుశకం 603 నుంచి 648 వరకు పాలన చేసిన శ్రీ హర్షవర్ధనునకు కృషి సమకాలికుడు అయిన ఆస్థానకవి బాణుడు. బాణుడు రచించిన ‘కాదంబరి’ మహా కావ్యాన్ని విద్వాన్ విశ్వం గారు తెలుగులో అందించారు. దానితోపాటు కిరాతార్జునీయం, మేఘ సందేశం, దశకుమార చరిత్రకు విశ్వం గారు అనువాదాలు చేశారు.
దాశరధి గారికి తెలంగాణమంటే ప్రాణం లేచి వచ్చినట్టు విశ్వం గారికి రాయలసీమ అంటే పంచప్రాణాలు. భాష గురించి, వ్యక్తీకరణ గురించి, మాండలిక పద ప్రయోగం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా రాయలసీమ ప్రాంతపు పలుకుబడుల గురించి వివరిస్తారు. తెలుపు-నలుపు శీర్షికలో విశ్వం భాష గురించి, పలుకుబడుల గురించి చేసిన చర్చ అప్పట్లో సాహిత్యవేత్తల్లో గొప్ప ఆసక్తిని రేపింది.
రాయలసీమ గత వైభవానికి గర్విస్తూ దాన్నే స్తుతిస్తూ ఆగిపోలేదు విద్వాన్ విశ్వం. విశ్వానికి – వల్లంపాటి వెంకట సుబ్బయ్య వ్యాఖ్యానించినట్టు – ఆ కీర్తి పట్ల పలవరింతగానీ, వెర్రి వ్యామోహం కానీ లేవు. అందుకే, పెన్నేటి పాటలో ఇలా అంటారు –
ఇది గతించిన కథ; వినిపింతునింక
నేటి రాయలసీమ కన్నీటి పాట
కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు
కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు అని చాలా వాస్తవిక చిత్రాన్ని పాఠకులకు అందిస్తారు.
స్థూలంగా పరిశీలిస్తే మాత్రా చందస్సు, సూక్ష్మంగా గమనిస్తే పద్యం సొగసు కనబడడం పెన్నేటిపాట గొప్పదనం. నిజానికి పద్యానికి మాత్రా ఛందస్సు జోడించి కవి కొత్తబాట వేశారు. తిప్పతీగె, రేణుగంప, తుమ్మతోపు, చిట్గీత, తంగేడు, పల్లేరు గాయలు, గూబమూల్గు తీతువు, పాపరకాయలు వంటి పద ప్రయోగాలతో పూర్తి సజీవ చిత్రణతో విశ్వం కవిత సాగుతుంది. చాలా సాధారణమైన పదాలు పద్యంలో చేరి అలవోకగా కలిసిపోతాయి.
———-
(అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ వారు ప్రచురించిన “సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం” అన్న పుస్తకం నుండి కొన్ని విశేషాలు)
మాకు అంతగా , బాగా తెలియని విద్వాన్ విశ్వం గారి సాహితీ సమగ్రం ఇలా తెసుకోవడం చాలా విలువైనదిగా ఉంది.
“సాహితీ విరూపాక్షుడు” కొని తెలుసుకోవలసిన విషయాలు తో పాటు..సాహితి ప్రపంచాన్ని మరింత విశదంగా తెలుసుకునే భాగ్యం కల్గించినందుకు.. నాగ సూరి గారికి,కే. మురళీ మోహన్ గార్కి ధన్యవాదములు తెలుపుతూ..
నాకు తెలిసినంత వరకూ జాలంలో ఇటు తెలుగులో గానీ, అటు ఆంగ్లంలో గానీ విద్వాన్ విశ్వం గారి గురించి సమగ్రం కాదుగదా కనీస స్థాయిలో ప్రాథమిక సమాచారం కూడా లేదు. ఇది మొట్ట మొదటి వ్యాసం. ఈ వ్యాసాన్ని రాసిన వేణుగోపాల్ గారికి, రాయించిన పొద్దు సంపాదక బృందానికి అభినందనలు. వ్యాసంలో సంక్షిప్తంగా విశ్వం గారి జీవిత విశేషాలను, అలాగే బాలసాహిత్యంలో ఆయన చేసిన కృషిని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది.
you are correct mitrama…Vidwan viswam was not a subject of any literary discussion………..ok you go through this book and leave some observations.. Nagasuri
సరిగ్గా చెప్పారు. జాలంలోనే కాదు, అచ్చుపుస్తకాలలో కూడా ఈయన గురించి తెలిసేది తక్కువనుకుంటున్నాను. ఈయన పెన్నేటిపాట కూడా చాలాకాలం పబ్లిషర్లు రాకపోతే తెలంగాణా రచయితల సంఘం వారు ముద్రించారు.ఆ పుస్తకానికి రాళ్ళపల్లి వారు చక్కని పీఠిక వ్రాశారు.
నాగసూరి వేణుగోపాల్ గారి వ్యాసం బావుంది కానీ నిడివి చాలా తక్కువగా ఉంది. చక్కని ప్రయత్నం. పొద్దుకు అభినందనలు.
నిజానికి ఇది పుస్తకంలో పది పేజీల వ్యాసం. ఇక్కడ ఎడిటింగ్‌లో కుదించబడింది 🙂
u can read RALLAPALLI pitika in this book..
vanaja garu..thank you very much. Recently sahitya akademi released a monograph entitled VIDWAN VISWAM…140 pages..Rs 40.
విద్వాన్ విశ్వం గారి గురించి నాగసూరి వేణుగోపాల్ గారు, మురళీ మోహన్ గారూ పుస్తకాన్ని వెలువరించారని ” పొద్దు ” ద్వారా తెలుసుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. రాయలసీమ మట్టి నుంచి ఆవిర్భవించిన విశ్వం గారు – రాయలసీమ భూమిపుత్రుడు! ఆయన ” పెన్నేటి పాట” కావ్యం రాయలసీమ జీవనవేదం!
Than you obulareddy garu…pl mail ur postal address murali will send a copy to u. Can u plan some release function in rayalaseema area……….
ఒక సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీలొ బహుమతినందుకోడం కోసం నేనొకసారి అనంతపురం జిల్లాకు వెళ్ళినప్పుడు..అక్కడ బానర్ మీద విద్వాన్ విశ్వం గారి పేరు చూడటం జరిగింది. నాకు చప్పున మాణిక్య వీణ గుర్తొచ్చింది. ఆ ప్రతిభా మూర్తి గురించి ఇలా చెప్పుకోడం, గుర్తు చేసుకోవడం బాగుంది. అలాగే, వారి రచనలు కూడా చదివే అవకాశం మనకిక్కడ దొరికితే ఇంకా బావుంటుందేమో!?