ఆఖరుకు అతను బండి తోలేవాళ్ల పేర్లు కూడా చెప్పాడు.
వాళ్ళు నెపోలియన్ గురించి కొంచెం సూచనగా అని, ఆ తరవాత లెంపలు వేసుకున్నారు. ఎందుకంటే, నజ్ద్ర్యోవ్ వెంటనే ఒక చాటభారతం ఎత్తుకున్నాడు; అంతా పచ్చిఅబధ్ధాలు, ఆ సోది ఆకును అందక, పోకను పొందకుండా ఉండటంచూసి వినేవాళ్ళు ఒక్క నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయారు. ఏదైనా పనికివచ్చే ముక్క బయటికి వస్తుందేమోనన్న ఆశతో పోలీసు అధిపతి ఒక్కడే మరికొంచెంసేపు ఆలకించి, చిట్టచివరకు విసుగెత్తి, “ఎందుకొచ్చిన దిదంతా ?” అనుకున్నాడు. “ఏంచేస్తేమటుకు ఎద్దు పాలిస్తుందా ?” అన్నారు అందరూ ఏకగ్రీవంగా. దీని ఫలితంగా అధికారుల పరిస్థితి మరింత అధ్వాన్నమయింది; చిచీకన్ ఎవరయినదీ తెలియనేలేదు. ఆ తరవాత జరిగిన సంఘటనలనుబట్టి మనిషి ఒక వింతప్రాణి అన్నది స్పష్టమయింది; అతడు ఇతరులకు సంబంధించిన అన్నివిషయాలలోనూ వివేకమూ, తెలివితేటలూ, ఙ్ఞానమూ కనబరచి, తన సొంత విషయాలలో పనికిరాకుండా పోతాడు. జీవితంలో క్లిష్ట సమస్యలను ఎదుర్కోవటానికి అతను ఎంతో మనోబలంతోనూ, వివేకంతోనూ కూడిన సలహాలివ్వగలడు. పదిమందీ అతన్నిచూసి “ఆహా, ఎంత సునిశితమైన బుద్ధి! ఏమి పట్టుదలగల మనిషి !” అంటారు. కాని ఈ సునిశితమైన మనిషికే ఏదన్నా కష్టం వచ్చిపడనివ్వండి; అతని ప్రకృతి ఎలా మారుతుందో ! ఇంత తీర్మానమూ నీరుగారిపోయి పిరికిపందగా, అసహాయుడైన చంటి పిల్లాడులాగా, నజ్ద్ర్యోవ్ చెప్పినట్టుగా చవటలాగా అయిపోతాడు.
ఈ తర్జన భర్జనలూ, పుకార్లూ మిగిలినవాళ్ళకన్నా ప్రాసిక్యూటరు మీద గట్టి దెబ్బతీశాయి, దేనికోగాని వాటి ప్రభావం ఎందాకా వెళ్ళిందంటే, ఆయన ఇంటికివచ్చి అలోచిస్తూ అకస్మాత్తుగా “అర్థం పర్థం లేకుండా, చచ్చిఊరుకున్నాడు. పక్షవాతమే వచ్చిందో, పాడేవచ్చిందో గాని, బల్లముందు కూచున్నవాడు కాస్తా ముందుకు ఒరిగిపోయాడు. అలాటప్పుడు నలుగురూ చేతులు ఎగరేసి, “ఎంతపని జరిగిందీ !” అనటం సహజం. రక్తంతీసేస్తే బతుకుతాడేమోనని డాక్టరుకు కబురుచేశారు, కాని ఆత్మ వేరైపోయి కట్టె మిగిలిందని తెలుసుకున్నారు. ఆయనకు ఒక ఆత్మంటూ ఉండేదని అప్పుడే వారికి తెలిసి వచ్చింది, ఆయన బతికున్నంతకాలమూ ఆ సంగతి కప్పిపెట్టాడు. చిన్నవాడికి వచ్చినా, పెద్దవాడికి వచ్చినా చాలా భయంకరమైనదే. క్షణం కిందటిదాకా కదులుతూ, తిరుగుతూ, పేకాడుతూ, కాగితాల మీద సంతకాలుపెడుతూ ఉండిన మనిషి, లావుపాటి కనుబొమలూ, చిట్లే కన్నూ వేసుకుని తరచు అధికార్ల మధ్య మెలిసినవాడు ఇప్పుడు బల్లమీద పడుకుని ఉన్నాడు, ఆయన ఎడమకన్ను ఆడటం లేదు. ఒక్క కనుబొమమాత్రం ప్రశ్నార్థకంగా కొంచెం పైకి లేచి ఉన్నది. చచ్చినమనిషి దేన్నిగురించి ప్రశ్నిస్తున్నాడో, దేనికి చచ్చాడో, ఎందుకు బతికాడో __ దేవుడికే తెలియాలి.
“ఇదంతా అసందర్భంగా ఉందే ! ఇలా జరగటానికి వీల్లేదు ! అధికార్లు ఈ విధంగా దొడుచుకోవటమూ, ఇంత అయోమయంలో పడటమూ, చిన్నపిల్లలు కూడా తెలుసుకోగలవాటిని తెలుసుకోలేక పోవటమూ అసంభవం !” అనేకమంది పాఠకులు ఈమాట అని, అభూతకల్పన చేసినందుకు రచయితను తప్పుపడతారు, లేదా ఆ అధికార్లను బుద్ధిహీనులని తిడతారు. మనుషులు బుద్ధిహీనుడనే మాటను విరివిగా ఉపయోగిస్తారు, రోజుకు ఇరవై సార్లు పొరుగువాణ్ణి ఆ మాట అంటారు. అవతలివాడు పది విషయాలలో ఒకటింట బుద్ధితక్కువ వాడైతే చాలు, తొమ్మిది విషయాలలో సమర్థుడైనా వాడు బుద్ధిహీనుడికిందనే జమ.
పాఠకులకేం, వారు ఎత్తునకూచుని పైనుంచి అంతా చూస్తూ, కిందనడిచేదాన్ని విమర్శించగలరు; కింద ఉండేవాడు తన సమీపంలో ఉన్నది తప్పించి, ఇంకేమీ చూడలేడు. పాఠకుడు మానవచరిత్రలోనుంచి శతాబ్థాలకు శతాబ్థాలే అనవసరమని కొట్టిపారెయ్య గలడనుకుంటాను. ప్రపంచంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. అలాంటి పొరపాట్లు ఈనాడు పిల్లలుకూడా చేయరు. చరమసత్యాన్ని అన్వేషించే మానవజాతి, తన ముందున్న సూటి అయిన రాజమార్గాన్ని విడిచిపెట్టి, వంకరటింకర దారులా, ఇరుకు సందులా, చొరరాని గొందులా పడి ఎన్నిసార్లు పోలేదు ! ఈ రాజమార్గం మిగిలిన అన్ని మార్గాలకన్నా విశాలమైనది. పగలు దానిపైన సూర్యుడు ప్రకాశిస్తాడు, రాత్రివేళ అనేక దీపాల కాంతితో అది వెలిగిపోతూ ఉంటుంది. అయినా, మానవులు దానినివదిలి అంధకారంలో నడిచారు. దైవకృపవల్ల వారికి ఙ్ఞానోదయం అయినప్పటికీ అనేకమార్లు తప్పుతోవలు తొక్కారు, పట్టపగలే కీకారణ్యాలు జొరబడ్డారు, ఒకరికళ్ళలో ఒకరు దుమ్ము చల్లుకున్నారు, క్షణభంగురాల వెంటతగిలి అగాధం అంచుకు వచ్చారు;
ఆ తరువాత ” బయటపడే మార్గమేమిటి ? ఏది దారి ?” అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆ తరంవాళ్ళు అంతా స్పష్టంగా చూడగలరు; తమ తాతముత్తాతల అఙ్ఞానానికి ఆశ్చర్యపడి, అవహేళన చేస్తారు. కాని, ఆ చరిత్రలోకూడా దివ్యకాంతిరేఖలున్నాయనీ, ఆ చరిత్రలో ప్రతి అక్షరమూ తమని ఎలుగెత్తి పిలుస్తున్నదనీ, తమకేసి వేలుచూపుతున్నదనీ గ్రహించరు. ఈ తరంవాళ్ళు నవ్వుతూనే, అహంకరిస్తూనే కొత్తరకం పొరపాట్లు చేస్తారు, వాటినిచూసి ముందు తరాలవాళ్ళు నవ్వుకుంటారు.
చిచీకన్కు ఈ గొడవలేవీ కొంచెంకూడా తెలీదు. కర్మం చాలక అతనికి శైత్యం చేసి, మొహం పొంగరించింది, గొంతువాచింది; మారుమూల పట్టణాలలో ఉండే వాతావరణం ఈ జబ్బును విరివిగా అందరికీ పంచుతూ ఉంటుంది. అనుకోరాదుగాని, తనకు సంతతి ఏర్పడకముందే జీవితం అంతమైపోతుందేమోనన్న భయంతో అతను మూడు నాలుగు రోజులపాటు పక్క దిగకుండా ఉండటం మంచిదనుకున్నాడు. ఈ సమయంలో అతను అత్తిపళ్ళు వేసిన పాలు పుక్కిటబట్టి తరవాత ఆ అత్తిపళ్ళు నోట వేసుకున్నాడు, చెంపలకు హారతి కర్పూరమూ కీమోమిల్ వేసిన సంచులు కట్టుకున్నాడు. తోచడానికి గాను తానుకొన్న కమతగాళ్లందరి జాబితాలు మళ్ళీ తయారుచేశాడు. తన ట్రంకులోనుంచి ఒక పుస్తకం తీసి చదివాడు, తన పెట్టెలో ఉన్న రకాల కాగితాలూ; వస్తువులూ చూసుకున్నాడు. చదివినదే మళ్ళీ చదివాడు, ఇంతచేసినా అతనికి తోచక వెర్రెత్తింది. ఇదివరదాకా హోటలుబయట ఎప్పుడూ ఎవరిదో ఒక బండి నిలబడే ఉండేది, ఇప్పుడు అధికారులు ఒకరూ తనను చూడరాకపోవటం అతనికి ఆశ్చర్యం కలిగించింది – పోస్టుమాస్టరు లేడు, ప్రాసిక్యూటరు లేడు. అధ్యక్షుడూ లేడు. గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ అతను అలక్ష్యంగా భుజాలు ఎగరేశాడు. చివరకు అతను బాగుపడి బయటకు రాగలిగినందుకు చాలా సంతోషించాడు. ఇక ఆలస్యం చెయ్యకుండా బయటకివెళ్ళే ప్రయత్నం సాగించాడు, తన పెట్టె తెరచి, గ్లాసులో నీళ్ళు పోసుకుని, గడ్డం చేసుకునే బ్రష్షూ, సబ్బూ తీసి గడ్డం చేసుకోసాగాడు. నిజానికి గడ్డం బాగా మాసింది. గడ్దం చేత్తో నిమురుకుంటూ అద్దంలో చూసుకుని, “అబ్బో, అడివిలాగయిందే! ” అనుకున్నాడు. నిజానికి, అడివి కాకపోయినా, చెంపలమీదా, గడ్డంకిందా బాగా పెరిగింది. గడ్డం చేసుకోవడం తోటే దుస్తులు వేసుకుంటూ, తొందరలో పడినంత పని చేశాడు. చివరకు డ్రెస్ చేసుకోవటం పూర్తి అయింది, మీద “ఉడుకులాం” చల్లుకుని, వెచ్చగా కప్పుకుని, ఎందుకైనా మంచిదని చెంపలు కప్పుకుని, కిందికిదిగి వీధిలోకి వచ్చాడు. పడి లేచినవాళ్లందరికీ ఉండేటట్టే అతనికి బయటికి వెళ్ళడం ఆటవిడుపులాగా ఉంది. ప్రపంచమంతా అతని కళ్లకు మందహాసం చేస్తున్నట్టుగా ఉంది – ఇళ్ళూ, పక్కగా వెళ్ళే పల్లె జనమూ, వాళ్ళు నిజానికి మొహాలు ముడుచుకునే ఉన్నారు, వారిలో ఒకడు అంతకుముందే తన తమ్ముడి గూబలు పగలగొట్టాడు కూడా. అతను ముందుగా గవర్నరును సందర్శించుతామనుకున్నాడు. దారిలో రకరకాల ఆలోచనలు అతన్ని ఆవేశించాయి: గవర్నరు కుమార్తె అతని మనసులో విడవకుండా మెదులుతున్నది, అతను రకరకాల పగటి కలలు కన్నాడు, చిట్టచివరకు తనను తానే అవహేళన చేసుకున్నాడు. ఈ విధమైన ఆలోచనలతో అతను గవర్నరు గారిల్లు చేరాడు. ముందుహాలులో అతను గబగబా పైకోటు విప్పెయ్యబోతుండగా అక్కడుండే బంట్రోతు, అతనికి ఆశ్చర్యం కలిగించేలాగ కలలోకూడా ఊహించనిమాట అన్నాడు: “తమరిని లోపలికి రానివ్వవద్దని సెలవయింది! “