[one_half][dropcap style=”font-size: 60px; color: #9b9b9b;”]అ[/dropcap]నగనగా ఒక ఊళ్ళో ఒక తాగుబోతు. అర్థరాత్రి బాగా తాగి సీసా రోడ్డుప్రక్క విసిరి పారేసాడు. తెల్లారేక ఒక కుర్రవాడు అటుపోతూ, పగిలిన సీసాలో ఒక గాజుముక్కను ఏరుకు ఇంటికివెళ్ళాడు. ఇంట్లో తిడితే బుద్ధిగా ఇంటిప్రక్క చెత్తకుప్పదగ్గర పడేశాడు. అది చూశాడు పక్కింటి మరో కుర్రవాడు. వీడు ఇటు తిరగగానే అలా వచ్చి ఆ గాజుముక్కని తీసుకోబోయాడు. అంతే వీడు మళ్ళీ ఇటు తిరిగాడు. ఇంకేముంది నాదంటే నాది అని కొట్లాట. అది ముదిరి పెద్దవాళ్ళ మధ్యకు పోయింది. ఎంతైనా ఇరుగుపొరుగు వాళ్ళుకదా! చివరికి ఒకామె చెయ్యీ నోరూ పారేసుకుని గాజుముక్క సంపాదించి కొడుకుతో లోపలికిపోయింది. ఇంకో ఆమె ఆవేశంలో, పాలవాడు తీసుకుపోతున్న పాలసీసాని విరగగొట్టి తనకొడుక్కి ఇంకో గాజుముక్క ఇచ్చి లోపలికి పోయింది. ఇద్దరు పిల్లలూ ఎంచక్కా గాజుముక్కలు బ్యాగుల్లో దోపుకుని స్కూలుకిపోయారు.
స్కూలులో ఆరోజు క్లాసు జరుగుతున్నంతసేపూ ఈ గాజుముక్కలు అందరి చేతుల్లోనీ తిరిగాయి. ఆ మర్నాడు క్లాసులో ప్రతివాడిదగ్గరా ఒకొక్క గాజుముక్క. అందులో, మూడేళ్ళు డింకీలు కొట్టిన ఒక పెద్ద చిన్నపిల్లవాడు, తన గాజుముక్కే అన్నిటికన్నా మంచిదని ఒప్పించాడు. అంతే కాదు తనవాళ్ళందరికీ అలాంటి గాజుముక్కే తెచ్చుకోమని ఆజ్ఞ జారీ చేశాడు. తన స్నేహితులు అనడానికి అది గుర్తు అన్న మాట. అదిలేనివారందరూ శత్రువులన్నమాట.
ఒక తండ్రి కొడుకు గోల భరించలేక, ఒక గాజు సీసాల కొట్టువాడిని బ్రతిమాలి అలాంటి గాజుముక్కే తయారు చేయించాడు. విషయాన్ని పసిగట్టిన ఆ కొట్టు వాడు, హుటాహుటిని అటువంటి అచ్చు ఒకటి తయారు చేయించి, కొన్ని గాజుముక్కలు ఆ స్కూలు దగ్గర అమ్మకం మొదలుపెట్టాడు. అలా అలా ‘ఆ గాజుముక్క’ అన్ని స్కూళ్ళకూ విస్తరించింది.
ఒక యువకుడు తన ప్రియురాలికి కానుక ఇద్దామనుకున్నాడు. ఈ ‘ఆ గాజుముక్క’ని చూస్తే అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. పెళ్ళయ్యాక తమకు పుట్టే పాపాయికోసం అని చెప్పి ‘ఆ గాజుముక్క’ కానుకగా ఇచ్చి ప్రియురాలి మోముపై నునుసిగ్గులు చూడాలని అతడి ఊహ. ఆ విధంగా పిల్లలకు పరిమితమైన ‘ఆ గాజుముక్క’ యువకులకు తాకింది.
కొద్దిరోజులలో అది దేశమంతటా వ్యాపించింది. ప్రజలనాడికి అనుగుణంగా అనేకమంది పోటీదార్లు నాణ్యమైన ‘ఆ గాజుముక్క’లు తమవే అని ప్రకటనలు మొదలుపెట్టారు. కొందరు కాస్తముందుకు వెళ్ళి వీటిపై పరిశోధనలను కూడా మొదలెట్టారు. వేరొకప్రక్క ‘ఆ గాజుముక్క’ ఇంట్లో ఉంటే శుభకరమన్న నమ్మకం ఎలాగో వ్యాపించింది. దానిపై వేరొకవిధంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈలోగా ఒక చిత్రకారుడు శివుడు ‘ఆ గాజుముక్క’నుండి జారుతున్న విషాన్ని త్రాగుతున్నట్లు చిత్రించాడు. విష్ణువు అందరికీ అమృతాన్ని పంచాడని అయితే కేవలం దేవతలే సత్యాన్ని గ్రహించి ఆ గాజుముక్కతో త్రాగారని అందుకే అది పనిచేసిందని, రాక్షలుసు మామూలుగా త్రాగారని అందుకే పని చెయ్యలేదని ఒక స్వప్రకటిత ‘వేదశ్శాస్త్ర పురాణేతిహాస రహస్య భేది’ అయిన ఉద్దండపండితుడు శెలవిచ్చారు. స్టార్ హొటళ్ళల్లో ‘ఆ గాజుముక్క’ను కూడా చెంచాలతో పాటు పెట్టడం మొదలెట్టారు. అలా దైనందిన జీవితంలో ‘ఆ గాజుముక్క’ భాగమైపోయింది.
[/one_half]ఒక పిల్లవాడు నేను ‘ఆ గాజుముక్క’తో కాదు స్పూన్ తో తింటానని మారాం చేస్తున్నాడు. కోడలు తప్పంతా నాగరికత తెలియని అత్తామామలదేనని విసుక్కుంది. స్పూన్ వాడకూడదని చెప్పింది. ఆ కుర్రవాడు ‘ఆ గాజుముక్క’తో తింటూ ఉంటే కోసుకున్న పెదవిని చూపాడు. తన పిల్లవాడు ఇంత అప్రయోజకుడయ్యాడే అని ఆ మాతృహృదయం తల్లడిల్లి ‘ఆ గాజుముక్క’తో తినడానికి కోచింగ్ కి పంపింది. అలా అది ఒక విద్యావిషయకంగా మారింది. ఈలోగా చిన్నపిల్లలకు కోసుకోని ప్లాస్టిక్ అంచులున్న ‘ఆ గాజుముక్క’లను ఒక ప్రముఖ కంపెనీ విడుదలచేసింది.
మార్కెట్లో కొన్ని పుస్తకాలు… ” ఆ గాజుముక్క ఫేమిలీ పేక్ .. కుటుంబానికి ఒక వరం “, ” 30 రోజులలో ఆగాజుముక్కతోతినడం “, ” ఆ గాజుముక్కకు 100 ఉపయోగాలు “, “ఆ గాజుముక్కతో వంటచేసే విధానం “, “ఆ గాజుముక్కతో తినడం.. శాస్త్రీయ విశ్లేషణ”, “నా గాజుముక్క… స్వీయ చరిత్ర “, “గాజుముక్కాట – జాతీయ క్రీడ? “
మరొకప్రక్క ‘ఆ గాజుముక్క’ అంచుల దగ్గర పరమాణువుల క్రియాశీలత పై ఒకరికి డాక్టరేట్ వచ్చింది. వాటి సాంద్రత, రంగుల ప్రభావం, ఆ ఆకారం యొక్క వైశిష్ట్యం మొదలైన అంశాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయ్. ప్రప్రధమంగా ‘ఆ గాజుముక్క’ పాఠ్యాంశాన్ని ‘ కట్టింగ్ ఎడ్జ్ ‘ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా విచ్చేసిన ఒక అగ్రరాజ్య దూతకు మన ప్రధానమంత్రి స్వయంగా ఒక ‘ఆ గాజుముక్క’ను బహూకరించారు. ” ఇది రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు ప్రతీక ” అని ఇరుదేశాలవారు కొనియాడారు. ‘ఆ గాజుముక్క’ల ఖరీదు అమాంతం పెరిగిపోయాయి. విదేశీ ‘ఆ గాజుముక్క’లు “ స్టేటస్ సింబల్” గా మారాయి.
ఈలోగా పొరుగురాజ్యం నుండి కొన్ని కంపెనీలు నాణ్యమైన ‘ఆ గాజుముక్క’లను తక్కువధరకే మన బజారులోకి తెచ్చారు. ఇది కన్నుకుట్టిన అగ్రరాజ్యం, తన చెప్పుచేతల్లో ఉండే అంతర్జాతీయ వస్తు నిర్దేశక సంస్థ ద్వారా ప్రపంచంలో తమ కంపెనీల ‘ఆ గాజుముక్కలు’ తప్ప ఇతరులవి నాసిరకమైనవని, ప్రమాదకరమైనవని, పర్యావరణానికి హాని కలిగిస్తాయని ప్రకటించారు. ‘ఆ గాజుముక్క’ల పేటెంట్ కూడా వివాదాస్పదంగా మారింది.
భారతదేశంలో ‘ఆ గాజుముక్క’ పరిశ్రమ మూతపడే స్థితికి వచ్చింది. దీనిని నిరశిస్తూ ఆత్మాభిమాన నినాదంతో ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం కూడా అగ్రరాజ్యాల దురహంకారాన్ని సహించేదిలేదని స్పష్టం చేశాయి. ఆ విధంగా భారతీయులను ఏకం చేసిన మహత్తరశక్తిగా ‘ఆ గాజుముక్క’ ఉద్భవించింది. స్వతంత్ర దినోత్సవంలో ‘ఆ గాజుముక్క’ను గాంధీగారి బొమ్మ ముందు పెట్టి నివాళులిచ్చే ఆనవాయితీ మొదలయ్యింది. మెల్లగా మార్కెట్లో ‘ఆ గాజుముక్క’ల విక్రయం తగ్గింది. అందునా ‘దేశవాళీ ఆ గాజుముక్కలు’ కనిపించటంలేదు. అప్పుడప్పుడు ‘ ఆ గాజుముక్క’ పరిశ్రమవాళ్ళు ఆత్మహత్యల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నష్టపరిహారాలు ప్రకటిస్తూనే ఉన్నారు.
మెల్లగా ‘ ఆ గాజుముక్క’ యొక్క పుట్టుక అగ్రరాజ్యంలోనే జరిగిందని, వారి సహృదయం వల్లనే మన దేశం బ్రతుకుతున్నదని, వార్లేకపోతే ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణ మనవాళ్ళు కలలోనైనా ఊహించలేరనీ ప్రగాఢమైన నమ్మకం ప్రబలిపోయింది. దేశం స్వస్థితికి వచ్చింది.
అదీ ‘ ఆ గాజుముక్క’ కథ. మన నిత్యజీవితంలో ఇలాంటి ‘ ఆ గాజుముక్కలు’ ఎన్నో ఉన్నాయి.
అసలు జీవితమే ఒక ‘ఆ గాజుముక్కే’మో! ఏ తాగుబోతు పడేసిపోయిన సీసా ముక్కో?!
————–
great!!!!!!!!!!!!
గతానుగతికో లోకః న లోకః పారమార్థికః అని ఊరికేనే అనలేదు కదా మన దేశంలో పుట్టినదాన్ని ఎప్పటి వలెనే అగ్రరాజ్యం ఎగర వేసుకుని పోవడం చాలా బావుంది
పాలంకి సత్య
LEARN HOW TO LIVE…. THEN ONLY LIVE…..VYARTHANGA BRATUKAKU…. JEEVITAMLO EMCHEYALO TELUGUSUKUNI BRATUKU….
SARMA –
katha bagundi kajumukkalativaru eenadu antho veeluva ponduthunnaru
kadedi kathaki anarham…!!!!
ee samaajamlo 99% gajumukkala moorkhule