మీ కందం – రమణీయార్థప్రతిపాదకము

“రమణీయార్థప్రతిపాదకః శబ్దః కావ్యమ్|”

– రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దమే కావ్యమట. ఇది జగన్నాథపండితరాయలవారి రసగంగాధరంలో మొదటి కారిక. రమణీయమైన అర్థం – ఇందుకు ప్రామాణికత ఏది? ఎవరికి తోచిన అర్థం వారివరకూ రమణీయమైనదనే అనుకోవచ్చుగా? అంటే ఆయన వ్యాఖ్యానం చెబుతాడు.

– ఏ శబ్దం తాలూకు అర్థం అయితే “లోకోత్తర” మైన (అలౌకిక) సౌందర్యంతో భాసిస్తూందో, అది రమణీయత్వమట!

ఆహా, లోకోత్తరమైన సౌందర్యం అన్నావు, బావుంది. ఇది కూడా ఎవరికి వారు తమకిష్టమైన అర్థాన్ని లోకోత్తరమైందని చెప్పుకోవచ్చుగా? అని మరో ప్రశ్న ఎవరైనా అడిగితే అందుకూ లాక్షణికుడు సమాధానం చెబుతాడు.

ఏ భావన అయితే మనస్సును పరవశింపజేయడం మాత్రమే కాక, మరీ మరీ మనసును వెంటాడుతుందో అది అలౌకికత్వమట! సాహిత్యదర్పణకారుడి మాట – “సచేతసామనుభవః ప్రమాణం తత్ర కేవలమ్” – ఇక్కడ అన్వయించుకోవాలి.

********************************************************

నాకు నచ్చిన కందం –  ఈ శీర్షికలో ఉటంకించిన కందమే. ఆ పద్యం మరోసారి.

కం ||

మృగమదసౌరభవిభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్.

“కస్తూరి, పచ్చ కర్పూరపు పరిమళాల తాలూకు చిక్కటి సౌరభము ఇతర సువాసనలను కప్పివేస్తూ, ఒకానొక అమ్మాయి జాడను తెలిపే గాలితెమ్మెర … అలా …వీచిందిట!”

పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం చేసే సందర్భంలో ఆమె గురించిన మొట్టమొదటి పద్యం అది.

అంతకు ముందు పద్యాలలో పెద్దన గారంటారు. ఆత్రావు చెంగలువలున్న వఱిమడియట.మామిళ్ళు గోరంటలున్న త్రోపట అది. (తావుల్‌ క్రేవలజల్లు చెంగలువ కేదారంబు…)ఆ పక్కన ఱాతికంబంతో కట్టిన పందిరికి ద్రాక్షతీగలూ, పూలతీగలూ అల్లుకున్నాయట. ఆ సౌభాగ్యం చూసి అచ్చెరువొంది (కాంచి తదీయ విచిత్రోదంచిత సౌభాగ్యగరిమ కచ్చెరువంది..) ప్రవరుడు అక్కడికెళ్ళాడు.

ఈ వర్ణన రాయలవారి వేసవి విడిది పెనుగొండ తాలూకుదట.(కావ్యంలో హిమాలయాలని చెప్పినప్పటికిన్నీ ) అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ… అంచేత ’మన’ దైన ప్రాంతాన్ని ఇష్టపడని వాడు ఎవడు?

అక్కడికెళితే – ఆ పూల, ద్రాక్షల, మామిళ్ళ, చెంగలువల సువాసనను కప్పివేస్తూ మృగమదకర్పూరమిళిత సౌరభం తాలూకు గుబాళింపు!

ఆ పరిమళాన్ని అనుసరిస్తూ ప్రవరుడు ఆ మంటపాన్ని చేరుకుంటాడు. అక్కడ విద్యుల్లతావిగ్రహ, శతపత్రేక్షణ, చంచరీకచికుర, చంద్రాస్య, చక్రస్తని – ఒకమ్మాయి కూర్చుని వీణ వాయిస్తూ ఉన్నది.

– మొదట ఘ్రాణేంద్రియం, ఆ తర్వాత శ్రవణ, చక్షురింద్రియాలు, ఆ తర్వాత స్పర్శ, ఆ తర్వాత రుచి (వరూధిని అధరం) – ఒక్కొక్కటినీ వరూధిని అనే అమ్మాయి ఎలా ఆకర్షిస్తుందో – ఆ విషయాలను  చిక్కగా అల్లుకుంటూ వెళ్తాడు ఆంధ్రకవితాపితామహుఁడు. కావ్యాస్వాదకులు తన్మయులౌతారు కానీ కావ్యనాయకుడు – ప్రవరుడు చలించడు!

అమ్మాయి జాడ తెలుస్తే “జనాన్విత మిచ్చోట” ఉందేమోనని (మాత్రమే) వెళతాడు ప్రవరుడు. ఆ తర్వాత – ప్రవరుని ఆలోచనల గురించి చెప్పకుండా,  అమ్మాయి ప్రవరుని చూపి ఎలా మరులుగొంటుందో వివరిస్తాడు కవి. అంతా చేసి “ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ!” అనిపిస్తాడు అతనిచేత. ఆమె కనులసోయగంలో “భయపడినజింక” తాలూకు లక్షణాలు కనిపిస్తాయాయనకు. ఇదీ ప్రవరుని చిత్తస్థిరత్వం, ఇంద్రియనిగ్రహమూనూ.

మొదట “శతపత్రేక్షణ” గా ఆమెను తిలకించిన ప్రవరుడు తర్వాత  “భీతహరిణేక్షణ” ఎందుకన్నాడు? ప్రవరుడు సౌందర్యారాధకుడు. (అయితే కాముకుడు కాదు.) మొదట  అమ్మాయిని చూసి ఆమె సౌందర్యాన్ని గుర్తించి ప్రశంసించినాడు. అయితే వరూధినికి మాత్రం అతడిని చూడగానే కోర్కె పడగవిప్పింది. (చూచి ఝళంఝళత్‌ కటకసూచిత..)ఆమె కనులలో కోర్కె చూసిన ప్రవరుడు ఆమెకు పాడి గాదని హెచ్చరిస్తూ, తనొక భూసురుడనని నచ్చచెబుతూ “ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ” అంటాడు. (ఈ పద్యం వస్తుధ్వనికి ఉదాహరణగా శ్రీ రాజన్నశాస్త్రి గారు వివరించారు)

ఇలా ఒక సన్నివేశం వివరిస్తూ, ఆ సన్నివేశంలో వరూధిని వంటి అందాలభరిణెను కనులకు కట్టేట్టూ చేస్తూ, ఆ మగువపొలుపును పాఠకులతో ఆఘ్రాణింపజేస్తూ, ఆమె రూపవర్ణనతో తన్మయులను చేస్తూ, ఆమె కౌగిలింత (తాలూకు పద్యం – ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో ..)తో గగుర్పాటుకు గురి చేసి చివరకు పాఠకుణ్ణి, తన నాయకుడు ప్రవరుణ్ణి వేఱు చేసి చూపుతాడు పెద్దన. ఈ ప్రకరణం లోని పద్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క అప్సరస అని ఒకరిద్దరు విశ్లేషకుల వింగడింపు. అందులో మొదటి అప్సరస అయిన ఈ కందపద్యం నాకు ఇష్టమైనది.

ఈ పద్యం మనసులో అనుకున్న వెంటనే పద్యం తాలూకు సందర్భం, ఉపాఖ్యానం మధ్యలో ఈ పద్యం తాలూకు సౌరభం మొత్తం – గుప్పెడు మల్లెలతో మనసును కొట్టినట్టు – అలవోకగా తాకుతుంది.

**********************************************************

రమణీయార్థప్రతిపాదకమైన శబ్దం కావ్యం – ఈ మాటకర్థం పై పద్యం ద్వారా తెలుస్తుంది.

**********************************************************

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

One Response to మీ కందం – రమణీయార్థప్రతిపాదకము

  1. నాకు కంద పద్యాలంటే ఇష్టం. ఈ పద్యం చాలాచాలా ఇష్టం. మగువ పొలుపు తెలుపు నొక్క మారుతమొలసెన్ అన్న కవి కవులకే పెద్దన్న.చక్కటి పరిచయం.

Comments are closed.