రవి : శిరీష్ గారి హృదయవిదారక గాథ, టీవీ సీరియళ్ళ తాలూకుదే – గుండె చిక్కబటుకుని విందాం
గిరి: పదండి ముందుకు – మా గడియారం పన్నెండు కొట్టి అరగంటయ్యింది
చదువరి : చిత్తం..
చదువరి :
1.
ఆడవిలను జేయు ఆగడాలను జూచి
తరచితరచి ఏడ్చి తనివిదీర
మనసు నింపుకొనును మధ్యాహ్న వేళలో
మగని ధ్యాస కూడ మరచి మగువ
2.
ఇంతి ఏడ్పు జూడ నిచ్చగించగలేక
టీవి కట్ట దలచె జీవి యపుడు
గయ్యిమనుచు లేచె కయ్యము చెయ్యగ
బిక్కచచ్చియతడు పక్కజేరె
3.
విస్తుపోయి తలచె పుస్తె కట్టినవాడు
’ఏడుపన్న తనకు వేడుక’నుచు
నాటి కాగుదాక నేటికింతెయనుచు
బిక్కుబిక్కుమనుచు చక్కనుండె
4.
అతడి బాధ దేవు డాలకించెనొ ఏమొ
ఆగగా కరెంటు ఆగె టీవి
క్షణము లోనె ఇంట శాంతి కమ్ముకొనెను
మౌన సాగరాన లీనమాయె
5.
స్విచ్చి వేసినట్టు విచ్చుకొనెను గొంతు
తరుణి ఏడ్వదొడగె కరుణ మీర
శాంతి క్షణికమాయె భ్రాంతి తొలగిపోయె
ద్విగుణమవగ నేడ్పు వేగముగను
6.
“వేడుకవగ చూస్తి వేలాది ఎపిసోడ్లు
ఎన్నడవ్వ లేదు ఇట్టి కట్టు
ఇట్లు చేసినావు ఇంట నుండి ఇపుడు
ఎందుకయ్య ఇంత ఈసు నీకు”
7.
“నాదు కంటి నీరు నాథుడోర్చగలేడు
సుఖమునుండనేను చూడలేడు
పాడు ప్రభుత కూడ తోడుగా జేరెగా
ఏడ్చువారి జూచి ఏడ్చిపోవ”
నచకి : చదువరి గారూ, హృదయవిదారకంగానే ఉంది!
గిరి: గుండెలు కరిగించేస్తున్నారండీ
చదువరి : రాసేటపుడు గుండె నీరైపోయిందండి.. 🙂
కామేశ్వర రావు : నచకిగారు, ఎవరి బాధ? భార్యదా, భర్తదా? 🙂
రవి : వేడుకవగ చూస్తి వేలాది ఎపిసోడ్లు…:)
రాఘవ : దీనికి కర్త సు…
గిరి: ఏదీ ఓ చిన్న రుమాలు కూడా విసరండి. నాకైతే ఇద్దరి పరంగాను బాధగానే ఉంది. భర్తపాపం అసలే బిక్కచిక్కి పక్కచేరాడు – అంటే పక్కమీద పడి ఏడ్చాడని అన్వయించుకున్నాను
నచకి : చూచినవారెల్లరిదీ!
రవి : ఒక్క కర్త ఏమండి? కర్త,కర్మ, ఖర్మ, క్రియ అన్నే అతనే..
రాఘవ : నేనే కనుక … ఐతే సు… … అగుగాక – ఎవరికి తోచింది వారు పూరించుకోండి
రాఘవ : 🙂
రవి : సరేనండి – ముందుకు వెళదాం
కామేశ్వర రావు : ఇది “ఆడ విలను జేయు ఆగడాలను జూచి” – ఇక్కడున్నది “ఆడ, విలనా”, “ఆడవిలనా”? 🙂
శంకరయ్య : ఎందుకో నా నెట్ డిస్కనెక్ట్ అయింది ఇంత సేపూ …
రవి : ఒక వృత్తం చూద్దాం. “దమ్మును లాగుచుంటి గద తాళగరాదె క్షణమ్ము నీవికన్”
గిరి: అధ్యక్షా, సుమనుడి వర్ణనకి సరైన సమయం ఆసన్నమైనదని ఊహించాను. మీరు దమ్మంటే అటే వెళదాము
చదువరి : అయ్యా నాకు కరెంటు పోయింది. ఓ పది నిముషాల్లో రాకపోతే నేను బైటకు పోవచ్చు.
చదువరి : ఆడవిలనే నండి. 🙂
రవి : ఈ వృత్తం చూసి సుమనుడిని పలుకరిద్దామండి
కామేశ్వర రావు : గిరిగారు, సుమనుడిని ఇంతసేపు భరించడం కష్టంగాని, ఒక దమ్ములాగి మళ్ళీ రావచ్చు 🙂
రవి : నచకి గారు మీదీ వంతు:
గిరి: దమ్మును లాగుచుంటి తాళగరాదె ఆంటారా – సరే
రాఘవ : మా విద్యుత్తు వారూ శాఖాచంక్రమణం చేస్తున్నారు! 🙁
రవి : నచకి గారూ, ఒకటవసారి
కామేశ్వర రావు : నచకిగారు, దమ్ములాగడానికి బయటకి వెళ్ళిపోయారా ఏమిటి?! 🙂
రవి : రెండోసారి
నచకి : వచ్చేసాను
కమ్మిన చీకటుల్ తొలగు కాలమునందున విచ్చుకొన్న యా
తమ్మి సుమాలు నచ్చెనని తప్పక యున్న పళాన దెచ్చి నీ
కిమ్మనగా సరస్సునకునేగి స్వయమ్ముగ సుందరారవిం
దమ్మును లాగుచుంటి గద తాళగరాదె క్షణమ్ము నీవికన్
రవి : తమ్మిసుమాలు – ఇది సరైన సమాసమేనా?
గిరి: ఎవర్తె ఈమె, నాయకుడిని సరస్సులోనికి దింపుటయే కాక వేగిరపెడుతున్నది
నచకి : సరియే… తొలుత తెలుగు, తఱువాత సంస్కృతం (పైగా “సుమాలు” అన్నది తెలుగే)
రవి : బావుందండి.
కామేశ్వర రావు : “కిమ్మనగా”నే, కిమ్మనకుండా సరస్సునకు వెళ్ళాడన్నమాట నాయకుడు 🙂
నచకి : 🙂
కామేశ్వర రావు : దమ్మును సుందరారవిందమ్ముగా మార్చడం బాగుంది.
రవి : బానే ముగ్గులోనికి దింపింది
కామేశ్వర రావు : అందమ్ముగా ఉంది
నచకి : నేను అరవిందమ్మునే లాగబోతిని అనుభవశూన్యుడనై… పండిత నేమాని వారు దాన్ని సుందరారవిందమ్మును చేసారు.
గిరి: కామేశ్వరరావుగారు, మీరు సుంద’రమ్ము’ గా ఉందని అంటారనుకున్నానే
కామేశ్వర రావు : గిరిగారు, ఇక్కడున్నది దమ్మే కాని రమ్ము కాదుగా 🙂
నచకి : గమ్మునుండుట మేలు
గిరి: లేదండీ, మీతో పోటీకి వచ్చే దమ్ముకూడా లేదు
రవి : రాఘవ గారి దమ్మెంతో చూద్దాం. రాఘవ గారు లేరా?
నచకి : రావా, రాఘవా?
కామేశ్వర రావు : పోనీ ఈ లోపుల గిరిగారు లాగుతారా?
రాఘవ : కొంచెం సేపు నిద్ర నటించాలి కదా…
రాఘవ : పాత్రలో పరకాయప్రవేశం! 🙂
గిరి: మీరు లాగమంటే – నేను కూడా కిమ్మనకుండా లాగుతాను
రాఘవ : ప్రస్తుత పద్యంలో నేను శ్రీకృష్ణుఁడను
గిరి: కానీ రాఘవ ప్రత్యక్షమైనట్టున్నాడు – మారువేషంలో అతణ్ణే లాగనిద్దాము
కామేశ్వర రావు : బాబోయ్, రాఘవాని ఎవరో సునటరత్న ఆవహించినట్టున్నాడు! 🙂
రాఘవ :
కొమ్మరొ సత్యభామ! నరకున్ విభుఁడేను వధించి వీని భా
రమ్మునుఁ దీసివైచెదఁ జరాచరజీవతతుల్ సుఖింప లో
కమ్మునఁ బోరునందు ధవుఁ గౌతుకమున్న నతిక్రమింపరా
దమ్మును లాగుచుంటిఁగద తాళఁగరాదె క్షణమ్ము నీవిఁకన్
నచకి : సెహబాస్!
రాఘవ : నిజం చెప్పమంటే, నాకు ఫోను వచ్చిందండీ. వెంటనే మాట్లాడవలసివచ్చి… అలా వెళ్లి ఇలా వచ్చేలోపు మీరు పిలిచారన్నమాట.
గిరి: రాఘవా, సత్యభామ కృష్ణుని మాటవిన్నదంటారా
నచకి : నిజానికి “అమ్మును…” అని వ్రాద్దామంటే నాకు సరైన సందర్భం తోచలేదు. అందుకని “అరవిందమ్మును…” లాగాను. నీవు ఆలోచనాపరుడివి కనుక నీకు సత్యభామ దొఱికెను, సోదరా! 😀
రాఘవ : ఐనా, కృష్ణుడివేషం కదండీ, అన్నగారి నుండీ పుట్టబోయేవఱకూ అందరికీ ఇష్టమే
కామేశ్వర రావు : బాగుంది. “లేమా! దనుజుల గెలుచగ లేమా!”
రాఘవ : 🙂
కామేశ్వర రావు : గెలువగ లేమా!
నచకి : కామేశా, ఆ పద్యం నాకూ యిష్టం. 🙂
రాఘవ : గిరిగారూ, మా భామ నేను నటించనంతవఱకూ మాట వింది. నటించినప్పుడు వినలేదు.
కామేశ్వర రావు : “అఖండయతి” వేసినా అఖండంగా పూరించారు 🙂
శంకరయ్య : అలా వెళ్ళి ఇలా వచ్చాను. ఈలోగా బాగానే గోష్ఠి జరిగించే … మిస్సయ్యాను.
శంకరయ్య : రాఘవ గారి పూరణ బాగుంది. అఖండయతి పండితామోదమైనదే. పరవాలేదు.
రాఘవ : @న.చ.కి: సత్యభామ కృష్ణునకే దొఱకును 🙂
రాఘవ : కామేశ్వరరావుగారూ, శంకరయ్యగారూ, ధన్యోస్మి.
రవి : సరే ఎలానూ వచ్చారు కాబట్టి తదుపరి సమస్యను పూరించండి శంకరయ్య గారూ: రంభా హృదయాబ్జ భృంగ! రామయనంగా!
శంకరయ్య : అలాగే …
చదువరి : కరెంటొచ్చంది..
శంకరయ్య : (నారదుఁడు నలకూబరునకు రామనామ మహిమను తెలుపుట)
శంకరయ్య :
శంభుసుహృదాత్మసంభవ!
రంభాహృదయాబ్జభృంగ! రామ యనంగన్
సంభృతశుభనామము పా
పాంభోధిఁ దరింపఁజేయు నతిపావనమున్.
నచకి : దయ చేసి భావం వివరించండి, మాస్టారూ!
కామేశ్వర రావు : “శంభుసుహృదాత్మసంభవ!” అన్న సంబోధన చాలా బాగుందండీ!
శంకరయ్య : శివుని మిత్రుడైన నలకూబరుని సుపుత్రా!
శంకరయ్య : రంభ హృదయమనే కమలానికి తుమ్మెద అయిన వాడా!
రవి : ఓహో, నలకూబరుని ప్రియురాలు రంభ కాబట్టి సంబోధన అన్నమాట
శంకరయ్య : అది ‘శివుని మిత్రుడైన కుబేరుని సుపుత్రా!’
నచకి : అదే అడగబోయాను… నలకూబరుడే రంభకు ప్రియుడు కదా అని…
నచకి : చక్కగా పూరించారు. కామేశ్వరరావు గారన్నట్టు “శంభుసుహృదాత్మసంభవ!” అన్న సంబోధన బాగుంది.
కామేశ్వర రావు : రాముడిని “ధరాత్మజా హృదయసారస భృంగ” – అంటాడు రామదాసు. అది గుర్తుకు వచ్చింది.
శంకరయ్య : ‘రామ’ అనేది గౌరవింపబడిన పేరు.
శంకరయ్య : పాపసముద్రాన్ని దాటించే పావననామం.
కామేశ్వర రావు : అవును “జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ” – మళ్ళి రామదాసే!
రవి : రాఘవ గారు చీకట్లోకి వెళ్ళినట్టున్నారు. వారొచ్చేలోపు ఓ దత్తపది
కామేశ్వర రావు : మీ పద్యం మొత్తం, దాశరథీ శతకాన్ని గుర్తుకు తెచ్చిందండీ! చాలాబాగుంది!
రవి : బిట్టు, చిప్పు, మెమరీ, బైటు – పద్య ప్రాశస్త్యం -గిరిగారి వంతు
శంకరయ్య : ధన్యవాదాలు ..
గిరి: వినండి
గిరి:
సీ.
ఎనమండు బిట్టుల నేర్పఱచిన బైటు| లేర్పడు ననితెల్పు ఇంజనీర్లు
మెదడన వేవేల మెమరిచిప్పులనియున్| తెలియు సాంకేతిక నిపుణవరులు
పదనదములు లోతుపాతులరసి భా|వార్థరససమన్వయంబు లెఱిఁగి
పద్యపాదములు కేవలగణాక్షర సమూ|హములు కావని తెలియంగ నేర్చి
ఆ.
చలువచదువులమ్మ చరణములు కొలిచి,
గుజ్జువేల్పుటొజ్జ బొజ్జగణప
తి మది దలఁచి, వ్రాయు తెలుఁగు కవిత కడు
హృద్యపద్యమనఁగ హృదినిహత్తు
గిరి: వేల్పులొజ్జ అని అనాలేమో నని అనుమానమున్నది నాకు
కామేశ్వర రావు : వేల్పు + ఒజ్జ = వేల్పుటొజ్జ సరైనదే
గిరి: సరేనండీ
శంకరయ్య : వేల్పుటొజ్జ సరైన ప్రయోగమే.
కామేశ్వర రావు : “పాతులరసి భా” – ఇక్కడ గణం తప్పింది
శంకరయ్య : పద్యపాదములు కేవలగణాక్షర సమూ|హములు కావని అనడం బాగుంది.
కామేశ్వర రావు : శంకరయ్యగారి మాటే నాదీను
నచకి : మేక్ ఇట్ త్రీ!
శంకరయ్య : ఇచ్చిన పదాలను అవే అర్థంలో ప్రయోగించారు.
శంకరయ్య : 🙂
కామేశ్వర రావు : స్వార్థపూరితమైన పూరణ 🙂
నచకి : సార్థకమైన పూరణ కూడా 🙂
గిరి : శంకరయ్యగారు, ప్రశ్నలో ఎక్కడా అలా చేయకూడదని లేదని వాడాను
ఆదిత్య : ఈ దత్తపది గరికపాటివారు ఒక అవధానంలో పూరించారు. ఆ పూరణ…
ఆదిత్య : ఎప్పటికైన చావదిది, ఎప్పటికింకను బిట్టు బల్కునం
గిరి : కామేశ్వరరావుగారు, స్వార్థపూరితమే
ఆదిత్య : చిప్పుడు కూడ చెప్పెదను హేలగ లీలగ పూలగాలిగా
శంకరయ్య : అభ్యంతరం ఏమీ లేదండీ …
నచకి : స్వార్థ = సు+అర్థ అన్నారా, కామేశ్వరా?
ఆదిత్య : తప్పదు మార్గమున్, రిపులు తామె మరీచికలైరి, పద్యమున్
శంకరయ్య : అది స్వర్థం అవుతుంది
గిరి : కామేశ్వరరావు గారు, లోతుపాతుల నరసి అని ఉండాలండి
ఆదిత్య : ముప్పుగ నెంచనేల పదముల్ పడవే గొనబై టుపుక్కునన్
గిరి : తప్పుగా టంకించాను
శంకరయ్య : ఆదిత్య గారూ … బాగుందండీ.. సెహబాస్ ..
కామేశ్వర రావు : స్వార్థపూరితమైనా, గిరిగారి పూరణే అర్థవంతంగా ఉంది, గరికిపాటివారి పద్యంతో పోలిస్తే.
శంకరయ్య : అది గరిక పాటి వారిదా? టుపుక్కు జరజర డుబుక్కు మే!
రవి : 🙂
కామేశ్వర రావు : గరికిపాటివారిది ఆశుపూరణ కాబట్టి అలా ఉండడంలో ఆశ్చర్యం లేదనుకోండి
నచకి : అవును, శంకరయ్య గారూ… కానీ పెద్దలు ఊరికే “స్వార్థ” అనెయ్యరు కదా అని… కాస్త పొడిగించి శ్లేష దాచారేమోనని… 🙂
రవి : సరేనండి, ఇక సుమనుడి దిశగా అడుగులేయక తప్పదు
గిరి : కాళ్ళు రావడంలేదు
శంకరయ్య : మంచి మనస్సు కల పేరు పెట్టుకొన్నవాడు …మరి!
రవి : ఆదిత్యగారు మనల్ని నడిపిస్తారేమో
ఆదిత్య : బాబోయ్!!!
రవి : 🙂
కామేశ్వర రావు : నిండా మునిగాక చలేముంది, కానియ్యి…
శంకరయ్య : మెడకు పడ్డ పాము కరవక పోతుందా .. కానీయండి …
గిరి : ఈ గుంపులో సుమనుడి విషయంలో కేవలం ప్రకటనలు చూసినప్పటికీ కామేశ్వరరావుగారే అధికబాధితవర్గాధ్యక్షులు
ఆదిత్య : తప్పుతుందా!
ఆదిత్య :
ఏమీ ! యీతడు కృష్ణుడా ? ప్చ్ హ! తలకాయిట్టిట్టు అల్లాడ్చు నే
లో ! మస్తశ్వయరుగ్మమా? నటనమా?! లుప్తావబాసాప్రబో
ధామోదాంధ వృధా వ్యధా చపల అధ్యారోప విగ్నానమా?
ఈ ముస్తాదము సృష్టిఘాతమునిదే ఈ ఠీవి తో జంపుదున్ !
ఆదిత్య : అర్థం అడక్కండి
కామేశ్వర రావు : గిరిగారు, భలేవారే! తెలుగు బ్లాగుల్లో సుమను అభిమానుల (బాధితుల అన్నది ధ్వని) సంఘం కూడా ఉంది, మీకు తెలీదు కాబోలు!
రాఘవ : ఈలలు… ప్చ్ హ విగ్నానమా
రాఘవ : అన్నగారు భాషలో దిగిపోయారు
గిరి : చపలాధ్యారోప – అవుతుందేమో
రవి : కామేష్ గారు సుమన్ మీద రీసెర్చి చేసినట్టున్నారు
గిరి : కామేశ్వరరావుగారు, తెలియదు – మిమ్మల్ని కదిపినప్పుడల్లా సుమనుడి గురించి కొత్తవిషయాలు తెలుస్తున్నాయి – అందుకే అలా అన్నాను
గిరి : ఆదిత్యా – విగ్నానమా..చూచినాము, నచ్చినది
శంకరయ్య : నాదీ అదే మాట!
కామేశ్వర రావు : పాపం అన్నగారి మాట పూర్తిగా తడబడి పోయింది!
ఆదిత్య : ఏదో ఆవేశంలో వ్రాశాను .. చాలా తప్పులే ఉండవచ్చు
నచకి : సీరియళ్ళ తోనె చీల్చి చెండాడెడు
నచకి : సుమను వైపు నడుపు సుగుణవరులు
నచకి : పెద్ద తెఱల పైన పింఛముతో వచ్చె
నచకి : పిన్న పెద్దలంత బేరుమనగ!
గిరి: మీ ఆవేశం అర్థం చేసుకోగలిగే తెలుగువారు చాల మంది ఉంటారు
గిరి: ఉన్నారు
శంకరయ్య : అతన్ని ఆ రూపంలో చూసాక అర్థం లేని పదాలే వస్తాయి.
రాఘవ : న.చ.కి… అచ్చెరువున నుండ నన్నగారు
రాఘవ : 🙂
కామేశ్వర రావు : నచకిగారు 🙂
ఆదిత్య : 🙂
రవి :గిరిగారూ, ఇప్పుడు ఇక మీ వంతు
చర్చ బాగుంది, పద్యాలు కూడా.
~సూర్యుడు
:)భలేగుందండి…