శారదా విజయోల్లాసము – 1

వర్ణన (బాపు బొమ్మ)

రవి :  సరేనండి. బాపు బొమ్మ దాకా వెళ్ళొద్దాం.

బాపు బొమ్మవ్ -పొద్దు

బాపు బొమ్మ

రవి :  ఈ సారి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చిన విజయాదిత్య గారి పూరణ విందామని ఉంది

ఆదిత్య  : తప్పకుండా

ఆదిత్య  :

సీ||

నిలువెత్తు ప్రేమకు నిలువుటద్దము కాగ
నీ మది తెలిపేను నిలువు బొట్టు

చెవిలోని జుంకాలు చిలిపిగా మీటగా
లలితగీతాలతో కులుకునెపుడు

కనుపాప నను జూచు కనుపాపవై దోచు
కలసిన తొలినాళ్ళు కదలు చుండు

విరిశరముల పువు పేరుల దొంతర
వాలు జడగ నల్లి వలపు జల్లు

గీ||

యుగములయ్యెను నిను వీడి యుండలేను

అనుచు వ్రాసిన పతిలేఖ హత్తుకొనుచు

ఆద మరచెను తెలుగింటి ఆడపిల్ల

బాపు బొమ్మౌచు యాషాఢ బాధ మరిచె

చదువరి  : అద్భుతం!

గిరి : నిలువుబొట్టు – ఆహా, ఈ బొమ్మని వర్ణిస్తే వ్రాయవలసిందే..

రవి :  చివరి పాదం లో abstractness ప్రవేశపెట్టి అద్భుతంగా మార్చారు

గిరి : కనుపాప నను జూచు కనుపాపవై దోచు – భలే

శంకరయ్య  : చాలా బాగుంది.

ఆదిత్య  : ధన్యవాదాలు

కామేశ్వర రావు :  బ్రహ్మచారులకి ఆషాఢ బాధాల గురించి తెలియడం “చిత్రమే”! 🙂

కామేశ్వర రావు :  ఇంతకీ ఆమె ఎలా ఉంటుందో అతడు సరిగ్గా ఊహించాడా, అతని ఉత్తరాన్ని చూసి ఆమె అలా తయారయ్యిందా?

శంకరయ్య  : ‘బొమ్మౌచు యాషాఢ’ యడాగమం రాదు. ‘బొమ్మౌచు నాషాఢ’ అంటే సరి!

ఆదిత్య  : శాంకరయ్యగారు ! సరిదిద్దినందుకు ధన్యవాదాలు

రవి :  ఆమెను ఆదిత్యుడు ఇలా ఊహించారు.

కామేశ్వర రావు :  “ఆదమరచెను తెలుగింటి ఆడపిల్ల” – ఇది నాకు బాగా నచ్చింది

గిరి : కామేశ్వరరావుగారు, మీరెంతైనా చెప్పండి ఇలాంటి పద్యాలు బ్రహ్మచారులే బాగా వ్రాయగలరు

కామేశ్వర రావు :  పై పద్యమంతా శరీరమైతే, ఆ బొమ్మలోని ఆత్మ ఆ పాదంలో కనిపించింది

శంకరయ్య  : నే నేకీభవిస్తున్నాను.

రవి :  ఓ మారు కామేశ్వరరావు గారి పూరణ విని చూద్దాం

కామేశ్వర రావు :  రవీ, వింటారా? చూస్తారా? 🙂

శంకరయ్య  : కామానికే ఈశ్వరుడు … ఏం వినిపిస్తాడో ..

గిరి : మీరు చూపిస్తే వింటాము

రవి :  రెండూనూ

కామేశ్వర రావు :  సరే, అవధరించండి

 

అలికులవేణి! యచ్చతెనుగందము చిందెడి బాపు బొమ్మ! ఓ

కలికివయారి! ఆ తొగలకన్నుల మైమరపేమొ చెప్పవే!

చెలువము మీరు నీ మగని చే లిఖితమ్మదె యుత్తరమ్ము, ఏ

వలపుల తీపిగుర్తుల సువాసన లీనుచునుండెనో గదా!

 

“ఎంత మంచివాడొ! ఈమైలు పొట్టిగా

కొట్టి పంపకుండ కూర్మితోడ

ఒద్దికయిన వ్రాత ముద్దుగా లిఖియించె”

ననుచు మురియుచుంటివా,  సుశీల!

 

ప్రక్కల పూలపొత్తముల భావకవిత్వ సుగంధ, మాపయిన్

జిక్కని గొంతుతో మధువు జిందు రఫీ యెలదేటి గానమున్!

మక్కువ పొంగు నీ చెలుని మాటలతేనెల సొక్కుచున్ మఱిన్

జెక్కిట జేయిజేర్చి మధుసీమల దేలితి వెంత భాగ్యమో!

 

మీ యిరువురి దాంపత్యము,

పాయని ప్రణయానురాగ బంధము, నిత్యం

బై యాదర్శంబై రమ

ణీయంబై తనరుగాత నెరకైత వలెన్!

కామేశ్వర రావు :  స్వస్తి!

గిరి : అన్నాదమ్ముల పూరణలు ప్రక్కన పెట్టుకుని చదుకున్నా సరిపోతున్నాయి

నచకి  : అధ్యక్షుల వారు, పెద్దలు, సభ్యులు క్షమించాలి

గిరి: నెరకైత నిజంగానే

చదువరి  : ఈమెయిలు కాకుండా చేతిరాతతో ఉత్తరం రాస్తే మురిసిపోతోందా..  🙂

కామేశ్వర రావు :  గిరిగారు, అదంతా బాపూ బొమ్మలో ఉన్న మాహాత్మ్యమండీ!

ఆదిత్య  : చూపించడం వినిపించడమే కాదు. ఇంద్రియాలన్నిటినీ మైమరపింపజేశారు

కామేశ్వర రావు :  నచకి గారికి స్వాగతం

శంకరయ్య  : చక్కని భావనా పటిమ. చాలా బాగుంది. అభినందనలు.

రవి :  కామేశ్వరరావు గారూ అంతా బావుంది కానీ అచ్చతెనుగు బొమ్మ, పద్యంలో రఫీ ను లాగారు.

కామేశ్వర రావు :  శంకరయ్యగారు, కృతజ్ఞతలు

నచకి  : నెనర్లు, కామేశ్వరరావు గారూ!

శంకరయ్య  : రఫీ తెలుగు పాటలు కొన్ని పాడాడు కదా!

రవి :  రఫీ తెలుగుపాట తల్చుకుంటే కాస్త ఎలాగో ఉంటుంది. 🙂

కామేశ్వర రావు :  🙂 అక్కడ వస్తున్నవి హిందీ పాటలే లెండి 🙂

నచకి  : నాకూనూ 🙂

గిరి: కామేశ్వరరావుగారు, బాపుబొమ్మలో రఫీ గానము వినిపించి, భావకవిత్వము రుచి చూపించి, ఆదర్శదాంపత్యం గురించి తెలియజెప్పింది మీరే కదూ

కామేశ్వర రావు :  భావకవిత్వం చదువుతూ రఫీ (హిందీ)పాటలు వింటూంటే అదొక అద్భుతమైన అనుభవం లెండి!

గిరి: అయ్యబాబోయ్ – నాకు రఫీ తెలుగు పాట అని ఎక్కడా అనిపించలేదు, వినిపించలేదు

గిరి: నిజం చెప్పాలంటే – చౌదవీ కా చాంద్ పాటని ఊహించుకున్నాను

నచకి  : నీలి మేఘమాలవో… అనుకుందాం, పోనీ! 🙂

రవి :  నాకు “చురాలియా..” వినిపించింది

గిరి: మరి కామేశ్వరరావుగారు ఏ పాట ఊహించి వ్రాసారో తెలియదు – తెలుగు పాట కాదని మాత్రం అనిపిస్తోంది 🙂

నచకి  : అయితే “గులాబిపువ్వై నవ్వాలి మనసు…” అనుకోవచ్చు,రవి గారూ! 🙂

కామేశ్వర రావు :  నా ఓటు గిరి గారికే

రవి :  నచకి గారూ గులాబి పువ్వై …బాలు పాట

నచకి  : నీలిమేఘమాలవో… కూడా రఫీ కాదు తెలుగులో. గాత్రం అలా ఉంచేసి భాష మార్చమని మదీయ ఉద్దేశ్యము. 🙂

కామేశ్వర రావు :  “ఎహసాన్ తెరా హోగా ముఝ్ పర్” కూడా ఊహించుకోండి

శంకరయ్య  : కామేశ్వరరావు గారూ, ‘చురాలియా హై దిల్ కో’ మీ వర్ణన…

కామేశ్వర రావు :   అదీ “చౌదవీ క చాంద్” – ఈ రెండూ నా ఆల్టైం రఫీ ఫేవరెట్లు

గిరి: ఇంకో పాట చెప్పనా – ఖిల్తే హై గుల్ యహా కూడా సరిపోతుంది

రవి :  టీవీ చూడకుండా రేడియో పాట వింటూంది అంటే ఆదర్శ ఇల్లాలే అన్నమాట

కామేశ్వర రావు :  అవును 🙂 ఈమైలివ్వకుండా ఉత్తరం పంపిన భర్త ఆమెకి సరిజోడు!

శంకరయ్య  : అది సీరియళ్ళు వచ్చే టైం కాకపోవచ్చు కదా.

నచకి  :గిరిగారూ, ఖిల్తే హై… అన్నది యెందులోనో చరణం కదండీ?

 

రవి :  సనత్ గారూ, బాపు బొమ్మను విజయాదిత్య, కామేష్ లు (అన్నదమ్ములు) వర్ణించారు

కామేశ్వర రావు :  అందుకే ఆమెని “సుశీల” అన్నది 🙂

చదువరి  : 🙂

సనత్ : 🙂

శంకరయ్య  : సినిమా పేరు గుర్తుకు రావడం లేదు. శశికపూర్ హీరో ..

కామేశ్వర రావు :  నచకిగారు, కాదండి అది పల్లవే

గిరి: నచకి  గారు, సచిన్ దేవ్ బర్మన్ సంగీత ఇచ్చిన చిత్రము, శశికపూర్ పాడిన పాట – చిత్రం గుర్తురావడం లేదు

కామేశ్వర రావు :  ఖిల్తె హై గుల్ యహా, ఖిల్కె భికర్నె కొ

శంకరయ్య  : రాఖీ హీరోయిన్ …

గిరి: అదే పాటని తెలుగులో నీ మది చల్లగా, స్వామీ నిదురపో దేవుని నీడలో అని అనువదించారు

గిరి: షర్మీలీ అండీ – ఇప్పుడే తట్టింది

శంకరయ్య  : అవును …

రవి :  శంకరయ్య గారూ ఇప్పటికి ఆదర్శ ఇల్లాలేనని సరిపెట్టుకుందాం. ఇంక కొన్నేళ్ళు పోయిన తర్వాత టీవీ సీరియల్ రుచి తెలుస్తుంది

కామేశ్వర రావు :  గిరిగారు, మీరు తెలుగు అనువాదాలని గుర్తు చెయ్యకండి మహాప్రభో! 🙂

నచకి   : నిజమే… అది నీ మది చల్లగా… అన్న తెలుగు పాటకి మాతృకనే. 🙂

రవి :  ఇందాక నచకి గారు కూడా అనువాదం గుర్తు చేసి “చిత్రవధ” చేశారు

చదువరి  : 🙂

శంకరయ్య  : అంటే .. ఇప్పుడు అనువాదప్రక్తి మొదలుపెట్టమనా?

గిరి: కామేశ్వరరావుగారు, తప్పలేదు – ఒకదాని వెంట ఒకటి తన్నుకొచ్చేసాయి..నచకి గారు గులాబిపువ్వై గుర్తుచేసాక మొదలయ్యింది 🙂

శంకరయ్య  : అనువాద ప్రక్రియ ….

రవి :  ఇంకా గిరిగారి పూరణ మిగిలి ఉంది

నచకి   : అందుకని గిరిగారు అనువధ చెయ్యబోయారంటారా?

కామేశ్వర రావు :  🙂

రవి :  అనువాదకులకు ధృతరాష్ట్ర పరిష్వంగ ప్రాప్తిరస్తు

నచకి   : 😀

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.