శారదా విజయోల్లాసము – 1

కౌఁగిలింత దెచ్చెఁ గష్టములను

రవి :  ఇప్పుడు గిరిగారి కౌగిలింతల పర్వం మొదలెడతారు

రవి :  ఆయన మూడుపూరణలు పంపారు – కౌఁగిలింత దెచ్చెఁ గష్టములను. అన్న సమస్యకు

గిరి: లేదు, సంవాదం చక్కగా సాగుతోంది. కాకపోతే ఇంత ఆలస్యంగా మెలకువ ఉన్నది ఈ మధ్యకాలంలో అరుదు – అందుకే అన్నాను, అన్యథా భవించవద్దు

కామేశ్వర రావు :  గిరిగారూ మీ కవుగిలింతతో కవులకి గిలిగింతలు పెట్టండి

రవి :  ఈ పూరణ తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం చర్చను. పెద్దలేమంటారు?

రవి : గిరిగారూ, ఓ రెండు పూరణలు వినిపించండి

శంకరయ్య  : అది ధృతరాష్ట్రుని కౌగిలి కాకుంటే నయమే.

గిరి: సరేనండీ

గిరి: మొదటిది – ఇల్లరికం ఇతివృత్తం ఆధారంగా

గిరి:

ఆ.

ఎల్లర నలరించు నిల్లరికంబను

చలనచిత్రమందు తెలివిలేని

నాయకి పొడగన్న నాయకునికి చెల్లి

కౌఁగిలింత దెచ్చెఁ గష్టములను

గిరి: రెండవది – పాండురాజు కథ

గిరి:

ఆ.

వనము కేగి కురునృపాలుడు మృగయావి

నోదియై చరించు టాదిగా మృ

గముల రూపమూనిన మునిజంట సురతి

కౌఁగిలింత దెచ్చెఁ గష్టములను

శంకరయ్య  : గిరిజ కౌగిట్లో నాగేసర్రావు. జమున చూసింది. లడాయి షురూ …

చదువరి  : 🙂

గిరి: శంకరయ్యగారు 🙂

 

రవి :  మూడవది కూడా లాగించండి గిరి గారూ

గిరి: మూడవది – అహల్య కథ

గిరి:

ఆ.

కపటిమాయ వలన గౌతముఁడు చనిన

వేళ తెలియక పతివేషధారి

దరికి జేరు ధాతతనయకు కాముకు

కౌఁగిలింత దెచ్చెఁ గష్టములను

కొత్తపాళి : బాగు బాగు

రవి :  ఎన్ని కష్టాలో!

కామేశ్వర రావు :  రాముని పాదధూళి సోకేంత అదృష్టం పడితే కష్టమంటారేమిటి! 🙂

గన్నవరపు వారు :గిరిగారూ మూడు పూరణలూ పసందుగా ఉన్నాయి.

శంకరయ్య  : మూడూ బాగున్నాయి. అభినందనలు.

గిరి: ఆ అదృష్టం కోసం ఆమె పడ్డ కష్టాలని తలచానంతేనండీ

ఆదిత్య  : @2 కౌగిలింతలో మహా భారతమే నడిచిందన్నమాట! ! తెలియలేదు స్మీ !

చదువరి  : మూడిట్లోకీ మొదటి పద్యం బాగుంది.

కామేశ్వర రావు :  వనము కేగి – వనమునందు, అంటే సాధువుగా ఉంటుంది

రవి :  ఆదిత్య గారూ, రెండవది భారతం, మూడవది రామాయణం, మొదటిది “బాగోతం”

చదువరి  :రవి. 🙂

ఆదిత్య  : 🙂 🙂

కామేశ్వర రావు :  🙂

గిరి: 🙂

రవి :  గిరిగారు సర్వ శాస్త్రకోవిదులు

ఆదిత్య  : గ్రంథసాంగులేమో  🙂

గిరి: కామేశ్వరరావుగారు, సరేనండీ

కామేశ్వర రావు :  మొత్తానికి కావపురాణాలలో ఎక్కడ చూసినా కౌగిలింత కష్టాలనే తెస్తుందన్న మాట!

గిరి:రవిగారు, సర్వచిత్రకోవిదులు అని చెపుదామనుకున్నారేమో. ఒకప్పుడు సినిమాలంటే పిచ్చి ఉండేది లెండి

రవి :  మీరేనండి విదులు..కో విదుః?

రవి :  సరే…శంకరయ్య గారూ, మీ వంతు..

శంకరయ్య  : అలాగే ….

శంకరయ్య  :

మధురమైన సుఖము మగనికి యిల్లాలి

కౌఁగిలింత దెచ్చె; కష్టములను

కలుగఁజేసెనయ్యొ వెలయాలి కౌఁగిలి

యిల్లు గుల్లసేసి కొల్లగొట్టి.

గన్నవరపు వారు :  గురువుగారి పూరణ బ్రహ్మాండము !

రవి :  లీగలైజ్ చేశారు.

గిరి: శంకరయ్యగారు ఘటికులు, ఒకే పద్యంలో రెండు కౌగిలింతలు చొప్పించేసారు

కామేశ్వర రావు :  ఆ రెండిటిలోనూ చక్కని వ్యత్యాసం కూడా చూపించారు. ఒకటి వట్టి కౌగిలి. ఇంకొకటి కౌగిలింత!

శంకరయ్య  : ‘ఇంత’ పరిశీలనా? కామేశ్వరా! సంతోషం. ధన్యవాదాలు.

గన్నవరపు వారు :   తప్పని పనులు ఉండడము వలన నేను శలవు తీసుకొటున్నాను. వీలయితే మరల వస్తాను. అందఱికీ ధన్యవాదములు.

రవి :  మూర్తి గారు, మీ పూరణ వినిపించి వెళ్ళగలరా?

గన్నవరపు వారు : అలాగే

గిరి: శంకరయ్యగారు, మీ ఇంతి పరిశీలనముందు మా వెంత పరిశీలనలైనా అంతంత మాత్రమే కదండీ

శంకరయ్య  : వినిపించి ‘వెళ్లాలా’?

గన్నవరపు వారు :

చలన చిత్ర మందు చకిత నాయికఁ జేరి

బాహువులను బట్ట బండ రాము

డోప లేక పోయె నూపిరి యాడక

కౌఁగిలింత దెచ్చెఁ గష్టములను !

కామేశ్వర రావు :  హహహ!

శంకరయ్య  : ‘బండరాముడే’ ఐనా ఓపలేక పోయాడా?

రవి :  ఇలాంటి నాయికనేమంటారో లాక్షణికులు రాయలేదు.

మురళి : Dope లేక పోయె

గిరి: హ హా, శంకరయ్యగారి అనుమానం సరైనదే

కామేశ్వర రావు :  శంకరయ్యగారూ, ఓపలేనిది పాపమా నాయిక అనుకుంటానండీ!

శంకరయ్య  : అయితే వాడు ‘బెండు రాముడే’

గన్నవరపు వారు :  రామారావు గారు చక్కని నటులు, కాని పాపము కధానాయికలు !

చదువరి  : “ఇలాంటి నాయికనేమంటారో లాక్షణికులు రాయలేదు.” – ధృతరాష్ట్రిక!

రవి :  :))

కామేశ్వర రావు :  చదువరిగారు 🙂

రవి :  చాణూరముష్టిక 🙂

చదువరి  : 🙂

కామేశ్వర రావు :  కబందహస్తిక

చదువరి  : 🙂

గిరి: బావున్నాయి – అన్నీనూ

శంకరయ్య  : నిజమే సుమా  … ఆ కోణంలో ఆలోచించలేదు…

గిరి: నాయిక ని నాయడుకు చేసి, బండరాముణ్ణి దొండపండు చేస్తే – మన తెలుగుచిత్రాలకి సరిపోయే పద్యం తయారవుతుంది

గిరి: కాకపోతే మూర్తి గారు, డలాసు వాసులు కనుక వారు చూసే కౌగిలింతులు వేఱు

గన్నవరపు వారు :   ప్రతి దినమూ ! అలవాటయిపోయింది చూడడము !

కామేశ్వర రావు :  నిజంగా పద్యం చదివేసరికి నాకళ్ళముందు కొన్ని సీన్లలా కదలాడాయి!

రవి :  అవునండి. నిజం.

కామేశ్వర రావు :  అదీ ఒకోసారి వెనకనుండి వచ్చి అమాంతం పట్టుకుంటాడు!

గన్నవరపు వారు :  మరి శలవు. ధన్యవాదములు.

గిరి: మూర్తిగారు, సభని మంచి రసపట్టులోకి దించి వెళ్ళిపోతున్నారు

గిరి: సబబు కాదు

రవి :  తప్పనిసరైతే దిబ్బరొట్టె తిని వచ్చెయ్యండి, మూర్తి గారు!

గిరి: కామేశ్వరరావుగారు, మా కళ్ళముందు కూడా కదలాడించేస్తున్నారు మీరు

కామేశ్వర రావు :  🙂

శంకరయ్య  : వారు వైద్యులు… తప్పదు …. ఎవరిని మృత్యువు కౌగిలింతనుండి విడిపించదానికో …

రవి :  వైద్యో నృసింహో హరిః

కామేశ్వర రావు :  శంకరయ్యగారు, భలే చెప్పారు!

రవి :  సరే శిరీష్ గారు ఈ సమస్యను పూరించినట్టున్నారు…  చెప్పండి

చదువరి  : సరే..

చదువరి  :

విగ్రహాన్ని విరిచె భీముగా తలపోసి

ఫలము దక్కలేదు వ్రతము చెడెను

కక్ష తీరలేదు కాంక్ష బైటపడెను

కౌఁగిలింత దెచ్చెఁ గష్టములను!

శంకరయ్య  : బాగుంది. అభినందనలు…

గిరి: చదువరిగారు కష్టాలని భలే వెలికి తీస్తారు.

రవి :  మీ ఫేవరెట్ హీరో (విలన్?) పద్యమే చెప్పారు.

చదువరి  : 🙂

గిరి: ఈ సన్నివేశం నాకు గుర్తువచ్చింది కానీ, కష్టం ఎక్కడుందిలే అని వదిలేసాను. చదువరిగారు చక్కగా ఒడిసిపట్టేసారు

కామేశ్వర రావు :  ఓహో ఇందుకా ఇందాకా ధృతరాష్ట్రిక అన్నది!

ఆదిత్య  : మంచి జాతీయాన్ని వాడారు

కామేశ్వర రావు :  ఫలము దక్కలేదు వ్రతము చెడెను –  చక్కగా పద్యంలో పొదిగారు

రవి :  ఈ పద్యాన్ని సమకాలీన రాజకీయనాయకులకు అన్వయించవచ్చు.

శంకరయ్య  : అవును .. ఈ మధ్య విగ్రహాల మీద ఆగ్రహం ఎక్కువౌతునది….

గిరి: కక్షతీరలేదు కాంక్షబైటపడెను – భళీ

చదువరి  : ధన్యుణ్ణి.

 

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.