పదవ ప్రకరణం
అధికారులు పోలీసు అధిపతి ఇంట సమావేశమై ఒకరినొకరు గమనించుకుని ఈ వచ్చిపడిన కష్టాలతోనూ, మనోవ్యధతోనూ ఎలా చిక్కిపోయినదీ తెలుసుకున్నారు. నిజానికి, ఈ కొత్త గవర్నర్ జనరల్ నియామకమూ, ఈ రెండు హెచ్చరికలూ, ఈ విడ్డూరమైన పుకార్లూ వారి ముఖాలపైన ముద్ర వేసినట్టయింది; వారి కోట్లు బాగా వదులయాయి. అంతా అధ్వాన్నమైపోయింది; అధ్యక్షుడు చిక్కిపోయాడు, మెడికల్ బోర్డు ఇనస్పెక్టరు చిక్కిపోయాడు, ప్రాసిక్యూటరు చిక్కిపోయాడు. సెమ్యోన్ ఇవానవిచ్ అనే ఆయన – ఆయన్ను ఇంటిపేరు పెట్టి ఎవరూ పిలిచేవారు కారు, ఆయన చూపుడువేలి కొక ఉంగరం ఉండేది, దాన్ని ఆడవాళ్లకు చూపుతూ ఉండేవాడు – ఆయన కూడా చిక్కిపోయాడు. కొంచం కూడా చలించని ధైర్యశాలులు కొందరు లేకపోలేదు, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు; కానీ వాళ్ళు ఎంతోమంది లేరు – పోస్టు మాస్టరు ఒక్కడే. ఆయన నిండుకుండ లాగా తొణకకుండా ఉండిపోయాడు. ఇలాటి అసందర్భాలు తటస్థపడినప్పుడల్లా ఆయన, “మీ గవర్నరు జనరళ్ళ సంగతి మాకు తెలుసు లెస్తూ! మిమ్మల్ని మూడు నాలుగుసార్లు మార్చేస్తారు. కాని అయ్యా, నేను ముప్ఫై ఏళ్ళుగా ఉన్నట్టే ఉన్నాను” అంటాడు. దానికి అధికార్లు “నీకేం ఇవాన్ ఆంద్రేయిచ్, నువు పోస్టాఫీసు చూసుకుంటావు- తపాలా తీసుకుంటావు, పంపిస్తావు; మహాచేస్తే, కోపం వచ్చినప్పుడు పోస్టాఫీసు ఒక గంట ముందే మూస్తావు, టైముదాటి ఇచ్చిన వర్తకుడి ఉత్తరం తీసుకుంటావు లేక పంపగూడని బంగీ పంపేస్తావు- నీ ఉద్యోగం లాటిది చేసేవాడెవడైనా మునీశ్వరుడులాగే ఉంటాడు. కాని సైతాను రోజూ నీవెంటపడి, వద్దుమొర్రో అంటున్నా ముడుపు అంటగడతాడనుకో. నీకు భయమేముందీ? ఒక్కడే కొడుకు; కాని ప్రస్కోవఫ్యదోర్నా దేవుడి వద్ద వరంపొంది; ఒక్క ఏడుకూడా నాగా పెట్టకుండా నాకో ప్రస్కోవ్యనో, పెత్రూష్కనో ఇస్తూనే ఉన్నది; మా స్థితిలో నువుంటే ఇలా మాట్లాడకేం” అంటారు.
అధికార్లు అనేది అదీ; మరీ సైతానును ధిక్కరించడం సాధ్యమా, కాదా అంటే అది నేను చెప్పలేను. ఈ సందర్భంలో జరిగిన సమావేశంలో, ఇంగితమని నలుగురూ దేన్నైతే అంటారో, ఆ ముఖ్యమైన వస్తువు బాగా లోపించింది. చూడగా మనం ప్రాతినిధ్య సంస్థలకు పనికిరామల్లే ఉంది. రైతు సమావేశాలు మొదలుకొని సాంస్కృతిక సమావేశాల వరకూ ప్రతి సమావేశంలోనూ, పైన దక్షతగల నిర్వాహకుడు లేకపోయాడో.., ఎంత డబ్బు కావాలో అంతా అవుతుంది. ఇది ఇలా ఎందుకవుతుందంటే చెప్పడం కష్టం. రష్యనుల మనస్తత్వం ఎలాటిదిగా కనిపిస్తుందంటే, వారు ఏర్పరిచే కమిటీలు వినోదాలూ, విందులూ, జర్మనుల పద్ధతిలో వనవిహారాలూ మాత్రమే జయప్రదంగా నిర్విహించగలవు. అయినప్పటికీ మనం ప్రతిదానికీ ముందుకు వస్తాం. ధర్మకార్యాలకూ, దానాలకూ, ఇంక వేటివేటికో సంఘాలు ఏర్పరచమంటే, వాయువేగంతో వచ్చిపడతాం. ఆశయాలు గొప్పవే కావచ్చు, కాని క్రియ ఉండదు. మనం ఆరంభంలోనే సంతృప్తిచెంది అంతా అయిపోయినట్టు భావించడం మూలాన ఇలా జరుగుతూ ఉండవచ్చు. మాటవరసకి, పేదల సహాయార్ధం ఒక సంఘం ఏర్పాటౌతుంది, మంచి మొత్తమే వసూలవుతుంది, మన మహదాశయాన్ని లోకానికి చాటటం కోసం నగరంలో ఉండే అడ్డమైనవాళ్లకూ విందు ఏర్పాటు చేసి వసూలైన మొత్తంలో సగం ఖర్చుపెట్టేస్తాం. మిగిలినదానిలో నుంచి కమిటీవారి ఉపయోగం నిమిత్తం ఒక బ్రహ్మాండమైన ఇల్లు తీసుకుని, దానికి దానికి చలిమంటల ఏర్పాట్లూ, నౌకర్లూ, చాకర్లూ వగైరా అన్ని హంగులూ అమర్చుతాం; అంతా అయ్యాక పేదలకు పంచడానికి సరిగ్గా అయిదున్నర రూబుళ్ళు మిగుల్తుంది. దీన్ని ఎలా పంచాలనే విషయమై కమిటీ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు వస్తాయి. ప్రతివాడూ తనని నమ్ముకున్న ఎవడో ఒకడి కిమ్మంటాడు.
ఇప్పుడు సమావేశమైన కమిటీ మరొకలాటిది. ఇది పరిస్థితుల ప్రోద్బలంవల్ల ఏర్పడింది. ఇది పేదవాళ్ళ సమస్యా, పైవాళ్ల సమస్యా కాదు, అక్కడ చేరిన అధికార్ల సొంత సమస్య. ఉపద్రవం అందరికీ సమానంగానే వచ్చిపడింది. అందుచేత ఈ సమావేశం మరింత ఐక్యంగానూ, ఐక్యకంఠంగానూ ఉండవలసింది. కాని అలాటిదేమీ జరగలేదు. ఏ సమావేశంలో ఐనా అభిప్రాయభేదాలకు తావుండనే ఉంటుంది, కాని ఇక్కడ చేరినవారిలో ఏ నిర్ణయానికి రావడానికీ శక్తి చాలకపోవడం కూడా కనబడింది, చిత్రం. ఒక పెద్ద మనిషి, చిచీకవ్ దొంగనోట్లు తయారుచేసినవాడే నంటూనే “ఒకవేళ అలాటివాడు కాడేమో” అని కూడా అనేశాడు. మరొకడు, అతను తప్పక గవర్నరు జనరలు ఆఫీసులో పనిచేసేవాడేనని, “అయితే, అలా అని అతని మొహాన రాసిలేదులే” అన్నాడు. అతను మారువేషంలో ఉన్న బందిపోటు అన్న సూచనకు ఏ ఒక్కరూ సమ్మతించలేదు. అతను చూడటానికి ఎంతో పెద్దమనిషిలాగా ఉండటమే గాక, అతని స్వభావం చూస్తే హింసాచర్య చేసేవాడిదిగా లేదని అందరూ ఒప్పుకున్నారు. కొంతసేపుగా దీర్ఘాలోచనలో ఉండిన పోస్టు మాస్టరు, లోపల ఏదో తన్నినట్టుగా ఉన్నట్టుండి, “ఇంతకూ అతనెవరో మీకు తెలుసటర్రా?” అన్నాడు. ఇలా అప్పుడాయన గొంతులో ఏదో ధ్వనించింది; అందరూ ఒక్కసారిగా “ఎవరు?” అని అడిగారు. “అతను మరెవరూ కాదు, కాప్టెన్ కపేయ్కిన్ ఎవరో కూడా మీకు తెలీదా?” అన్నాడు పోస్టు మాస్టరు.
కాప్టెన్ కపేయ్కిన్ ఎవరో తమకు తెలియదని అందరూ అన్నారు.
పోస్ట్ మాస్టరు తన పొడుం డబ్బీ కొద్దిగా మాత్రమే తెరచి ఒక పట్టు తీసుకున్నాడు. డబ్బీ పూర్తిగా తెరిస్తే తలా ఒక పట్టూ తీసుకుంటారని భయం; వాళ్ల వేళ్ళు శుభ్రంగా ఉండవని అనుమానం – ఆయన తరచు అనేవాడు; “అయ్యా, తమ వేళ్ళు ఎక్కడెక్కడ తాకాయో చెప్పటానికి వీలు లేదు. నశ్యం అనేది మహా శుచి అయిన వస్తువు” ఆయన పొడుం తీస్తూ “కాప్టేన్ కపేయ్కిన్ కథ మహా విచిత్రమైనది. రొమాన్సు పుస్తకాలు రాసేవాళ్లకు ఎంతో బాగుంటుంది.” అన్నాడు.
ఈ కథను, అంటే రచయితలు ఆకర్షించే మహా విచిత్రమైన రొమన్సును వినాలని తాము కుతూహలపడుతున్నట్టు అందరూ చెప్పగా, పోస్టు మాస్టరు ఇలా ప్రారంభించాడు.
“అయ్యా, 1812 దాడి అనంతరం” – ఆ గదిలో ఒకరుగాక ఆరుగురు ఉన్నప్పటికీ, ఆయన వారిని అలాగే సంబోధించాడు – “1812 దాడి అనంతరం కాప్టెన్ కపేయ్కిన్ ను క్షతగాత్రులవెంట యుద్ధరంగం నుండి పంపేశారు. అమిత దురుసు మనిషీ, ఖయాళీ మనిషీ కావటంచేత ఎన్నో రకాల శిక్షలు పొందాడు, నిర్బంధంలో ఉంచబడ్డాడు- అతను చవిచూడని అనుభవం లేదు. క్రాస్నోయలోనో, లైప్‌త్సిగ్ లోనో సరిగా చెప్పలేనుగాని, అతని ఒక చెయ్యి, ఒక కాలు పేలిపోయాయి, ఏమిటనుకున్నారో. ఆ సమయంలో మరి క్షతగాత్రుల కోసం ఎలాటి ఏర్పాట్లూ లేవు. ఆ.. దాన్నేమంటారూ? – క్షతగాత్రుల పెన్‌షన్ నిధి తరవాత ఎంతో కాలానికిగాని సాగింది కాదు. తెలుసా? తాను శ్రమచేసి బతకవలసి ఉంటుందని కాప్టెన్ కపేయ్కిన్ గ్రహించాడు. కాని అతనికి ఉన్నది ఒకే చెయ్యి, తెలిసింది గాదూ! ఎడమచెయ్యి. అతను ఇంటికి, తండ్రివద్దకు వెళ్లాడు; నేను నిన్ను పోషించలేను. నాకే ఇంత రొట్టె తునక దొరకకుండా ఉంది’ అన్నాడు తండ్రి. ఏమనుకున్నారో. అయ్యా అప్పుడు మన కాప్టన్ కపేయ్కిన్ పీటర్స్‌బర్గ్ వెళ్ళి తాను ఒకవిధంగా తన ప్రాణాన్నీ, రక్తాన్నీ ధారపోశానని అధికారులతో చెప్పి వారివద్ద నుంచి సహాయం ఏదైనా లభిస్తుందేమో చూద్దామని నిశ్చయించుకున్నాడ. అయ్యా, ఇంకేముందీ, అతను ఏదోవిధంగా, సామానుబళ్ల మీదనో, ప్రభుత్వ వాహనాలమీదనో చిట్టచివరకు పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. అప్పుడు, ఏమిటనుకున్నారో, ఇతనుందే, ఇతని పేరేమిటీ, అదే కాప్టెన్ కపేయ్కిన్, రాజధానిలో వచ్చి పడ్డాడు. ఒకవిధంగా అలాటిది ప్రపంచంలో మరెక్కడా లేదన్నమాట: ఒక్కసారిగా అతని ఎదట, ఒకేవిధంగా ఒక కొత్త ప్రపంచం, ఒక జీవిత విధానం, ఒక షహజాదీ వింతగాధ, తెలిసిందిగాదూ, ప్రత్యక్షమయింది. ఒక్కసారిగా, ఏమిటనుకున్నారో – నెవ్‌స్కీ ప్రాస్పెక్ట్, గరోఖవీయా, లితేయినీ; గాలిలో ఏదో గోపురంలాంటిది; వాటి దుంపతెగ వంతెనలు ఏ ఆధారమూ లేకుండానే, తెలిసింది గాదూ, నిలబడతాయి! ఎక్కడన్నా బస సంపాదింతామని చూశాడు; కాని, చచ్చే ఖర్చుతో కూడిన పని. పరదాలూ, తెరలూ, పాడూ, పచ్చిబద్దలూ, తెలిసింది గాదూ, తివాసీలూ – అయ్యా, పర్షియా అనుకోండి!.. ఒకవిధంగా ధనాన్ని కాళ్లకింద మట్టగించడమన్నమాట. వీధులంట పోతుంటే, ముక్కుతో వేలకువేలు పీల్చెయ్యొచ్చు: మరి మన కాప్టన్ కపేయ్కిన్ వద్ద చూడబోతే యాభై రూబుళ్ళూ, కొద్ది చిల్లరా ఉన్నది… దాంతో ఎస్టేటు కొనటానికున్నదా చెప్పండి. దానికొక నలభైవేలు చేరిస్తే, ఏమన్నా వీలౌతుందేమో, ఫ్రాన్సు రాజును అప్పడిగి తీసుకురావాలి; సరే, అతను ఒక వసతి గృహంలో రోజుకు రూబులిచ్చి బస సంపాదించుకున్నాడు… అక్కడ ఎంతోకాలం ఉండటానికి లేదని అతనికి తెలుసు. ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలో విచారించాడు. “ఎవరికి దరఖాస్తు పెట్టుకుంటావూ? ఉన్నతాధికారులు పీటర్స్‌బర్గ్‌లో లేరు” అని చెప్పారు. వారంతా పారిస్‌లో ఉన్నారు; ఇంకా సైన్యాలు తిరిగి రాలేదు. తెలిసింది కాదూ? కాని ఒక తాత్కాలిక కమిటీ ఉన్నట్టు చెప్పారు; అక్కడికి వెళ్ళి విచారిస్తే, ఏమైనా చెయ్యవచ్చునన్నారు. ‘ఒక విధంగా నేను రక్తం ధారపోశాననీ, ప్రాణాలను ధారపోశాననీ చెబుతాను’ అనుకున్నాడు కపేయ్కిన్.
అయ్యా, అందుకని పెందలాడే లేచి, ఎడమచేత్తో గడ్డం దువ్వుకున్నాడు. మంగలి దగ్గరకు పోవడమంటే, ఒకవిధంగా డబ్బు ఖర్చేగద; తన మురికి దుస్తులు వేసుకుని, తన కొయ్యకాలితో, ఏమిటనుకున్నారో, కుంటుకుంటూ కమిటీపెద్ద ఉండేచోటికి బయల్దేరాడు. ‘అల్లదిగో నది ఒడ్డున ఉండే ఇంటో’ అని చెప్పారు. ఏమి ఇల్లులెండి, తెలిసింది గాదూ, కిటికీలకు అద్దాల తలుపులూ, ఏమిటనుకున్నారో, పదేసి అడుగుల వెడల్పుగల నిలువుటద్దాలు, చలవరాళ్ళు, నౌకర్లు, అయ్యా, చూస్తే తల తిరిగిపోయేటట్టున్నది. తలుపుకు ఒకలోహపు పట్టుపిడి ఉన్నది – మహామహుడి కుండవలసినది, దాన్ని తాకాలంటే ముందు దుకాణానికి పరిగెత్తి, తెలిసిందికాదూ, ఇంత సబ్బుకొని, రెండు గంతలసేపు చేతులు కడుక్కోవాలన్నమాట. వాకిలి దగ్గర ద్వారరక్షకుడు, తెలిసిందికాదూ, వాడిచేతిలో ఒక కర్ర, వాడిది జాగీర్దారు మొహం, వాడి మెడపట్టీ బలిసిన కుక్కలాగా ఉంది. ఎలాగో కొయ్యకాలు ఈడ్చుకుంటూ మన కపేయ్కిన్ రిసెప్షన్ గదిలోకి వెళ్ళి, తన మోచెయ్యి తగిలి ఏ అమెరికన్ గిల్టు పింగాణీ కూజా, ఈ ఇండియన్ కూజా ఏమైపోతుందోనని ఒదిగి ఒకమూల నిలబడ్డాడు. అతను చాలివచ్చినదాకా వేచి ఉండవలసి వచ్చిందంటూ వేరే చెప్పాలా? ఎందుకంటే అతను వచ్చినవేళకు పెద్ద అధికారి అప్పుడే నిద్రలేచాడు, నౌకరు ఆయన మొహం కడుక్కోవడానికి నీళ్ళూ అవీ తెచ్చాడు, తెలిసీందికాదూ? మన కపేయ్కిన్ నాలుగు గంటలు వేచిఉన్నాక పనిలోఉన్న గుమాస్తా ఒకడు వచ్చి, “డైరెక్టరు గారు ఇప్పుడే వస్తారు. ” అన్నాడు. అ్ప్పటికి భుజకీర్తుల వాళ్లతోనూ, భుజాల మీద ముడులుగల వాళ్లతోనూ గది నిండిపోయింది- బటానీలు పొసిన పళ్ళెంలాగా. అయ్యా చివరరకు డైరెక్టరు రానే వచ్చాడు. డైరెకరు మరి…..ఏమిటనుకున్నారో ! ఆయన మొహంలో, అదేమరి ఆయన హోదాకు తగ్గట్టు, తెలిసిందికాదూ?… అంతదర్జా. అన్ని విధాలా హుందా అయినమనిషి; ఒక్కొక్కరినీ సమీపించి, మీరు దేన్నిగురించి వచ్చారు? మీకేం కావాలి? మీ పని ఏమిటి అని అడిగాడు. అయ్యా, చిట్టచివరరకు ఆయన కపేయ్కిన్ వద్దకు వచ్చాడు. కపేయ్కిన్ అదీ ఇదీ చెప్పాడు: రక్తం ధారపోశాను, కాళ్ళూ చేతులూ పోగొట్టుకున్నాను, పనిచేసుకోలేను – సాహసించి అడుగుతున్నాను, ఏ విధమైన సహాయంగాని దొరకదా, పరిహారంగా ఏదో ఒక రకమైన ఏర్పాటు, పింఛనులాంటిది. తెలిసిందికాదూ? అతడి కొయ్యకాలూ, ఖాళీగా ఉండిన చొక్కా కుడిచెయ్యీ చూశాడు డైరెక్టరు. ‘మంచిది, ఒకటిరెండు రోజుల అవతల మళ్ళీ కనపపడు ‘ అన్నాడు. మన కపేయ్కిన్ పారవశ్యం చెందాడు. ‘ఇంకేం, అంతా కుదిపోయిందిలే’ అనుకున్నాడు. అతను పేవ్‌మెంట్ మీద గెంతుకుంటూ వెళ్ళి, పాల్కిన్‌స్కీ రెస్టారెంటులోకి పోయి ఒక గ్లాస్ వోద్క తాగాడు. అయ్యా, లండన్ రెస్టారెంటుకు భోజనానికి వెళ్ళి, కట్లెట్లూ, ఊరగాయీ, కోడీ ఆర్డరిచ్చాడు. ఒక బుడ్డీ ద్రాక్షసారా తెప్పించాడు, సాయంకాలం థియేటరుకి వెళ్ళాడు – మొత్తంమీద మంచి జల్సా చేశాడనవచ్చు. వీధిలో నక్కులాటి ఇంగ్లీషు పిల్ల కనిపించింది, హంసలాగ తేలిపోతూ, ఏమిటనుకున్నారో, మన కపేయ్కిన్ – అతని రక్తం కాస్త వేడెక్కి ఉన్నది, తెలిసింది కాదూ – కొయ్యకాలు టకటకలాడించుకుంటూ ఆమె వెనకే పరిగెత్తుదామనుకున్నాడు. కానీ మళ్ళీ వద్దులెమ్మనుకున్నాడు. ‘పస్తుతానికి ఆడవాళ్ళ వెంటపడటం కూడని పని. తరవాత, పింఛను వచ్చాక, చూసుకోవచ్చు. ఇప్పటికే కాస్త కణువు దాటాను’ అనుకున్నాడు. ఈలోపుగా, ఒక్కరోజులోనే అతను తనకున్న డబ్బులో సగం ఖర్చు పెట్టేశాడు, మీరు గమనించాలి.
మూడునాలుగు రోజులు తాళి, అతను కమిటీకివెళ్ళి, డైరెక్టరునుచూసి, ‘తమరునాకేం సహాయం చెయ్యబోతున్నారో తెలుసుకునేందుకు వచ్చాను, నాకు చేసిన జబ్బులూ, తగిలిన గాయాలూ మూలాన రక్తం ధారపోశానన్నమాట…’ ఈ ధోరణిలో తగిన భాషలో చెప్పుకున్నాడు, తెలిసింది కాదూ? పై సైనికాధికారుల వద్దనుంచి ఉత్తరువులు రానిదే మేము నీ విషయంలో ఏమీ చెయ్యలేమని నీకు ముందే చెప్పెయ్యాలి. పరిస్థితి నువే చూడు. యుద్ధకార్యకలాపాలు ఒకవిధంగా ఇంకా ముగియలేదు. కొంచం ఓపిక పట్టాలి. మంత్రిగారు వచ్చినదాకా ఆగాలి. ఆ తరువాత నీకు కొంత గిట్టుబాటు కాకపోదు. బొత్తిగా చేతిలో ఏమీ లేకపోతే, ఇంద దీనితో గడుపుకో; అంటూ ఆయన ఏదో ముట్టజెప్పాడు. అది పెద్ద మొత్తం కాదు, తెలిసింది కాదూ? కాని పైనుంచి ఉత్తరువులు వచ్చేదాకా సరిపోతుంది, పొదుపుగా వాడితే. కాని మన కపేయ్కిన్ కు కావలసింది అది కాదు. తనకు వెంటనే వెయ్యి రూబుళ్ళు మొత్తంగా ఇస్తారనో ఏదో అనుకున్నాడు; ఇచ్చి, ‘ఇదిగోరా అబ్బీ! దీనితో హాయిగా తాగు, జల్సా చెయ్యి.’ అంటారనుకున్నాడు. అది లేకపోగా, ఆగమమన్నారు, గడువుకూడా చెప్పకుండా. వాడప్పటికే ఇంగ్లీషు పిల్లను గురించీ, భోజనాలను గురించీ, కట్లెట్లను గురించీ కలలు కనేశాడు. అందుకని వాడు, నీళ్లలో తడిసి, చెవులు వేళ్ళాడేసుకుని, తోక ముడుచుకునిపోయే కుక్కలాగా, గబ్బిలాయి మొహం వేసుకుని మెట్లుదిగి వచ్చేశాడు. అతను అప్పుడే పీటర్స్‌బర్గ్ జీవితం రుచిమరిగాడు, అది అతన్ని పట్టేసింది. ఇప్పుడతను ఎలా బతకాలో తెలియకుండా పోయింది, సుఖాలనుభవించే ఆశలేదు, తెలిసింది కాదూ? అతను చూడబోతే మంచి ఆరోగ్యంతో, జీవం తొణికిసలాడుతూ ఉన్నాడు. అతని ఆకలి తోడేలు ఆకలే. అతను ఒక రెస్టారెంటు పక్కగా వెళ్ళేవాడు; అక్కడి వంటవాడు, ఏమిటనుకున్నారో, ఫ్రెంచివాడు కపటంలేని మొహం వేసుకుని, లినెన్ చొక్కా, తెల్లని ఆప్రన్, మంచులాంటిదన్నమాట, ధరించి నోరూరించే వంటకాలన్నీ చేస్తుండేవాడు. వాటినిచూస్తే ఎంత ఆకలి పుడుతుందంటే మనని మనమే తినెయ్యాలనుకుంటాం. అతను మిల్యూతిన్‌స్కీ దుకాణం పక్కగా వెళితే అందులోనుంచి సామన్ చేప తొంగిచూస్తుండేది, ఎత్తు ఐదురూబుళ్ళ ఖరీదు చేసేది. కిటికీలో పెద్ద బస్సు ప్రమాణంగల పుచ్చకాయ కనిపించేది, ఎవరన్నా వెర్రివాళ్ళు వచ్చి తనను నూరు రూబుళ్ళకు కొంటారేమో అన్నట్టుగా.