అందాలకు కాణాచి ఆశ్వీజ మాసమ్ము!
పరిఢవిల్లె ప్రకృతి ప్రశాంతమై ఎల్లెడల –
ఎండలూ వానలూ ఏకమై రాగానె ఝడిసి
పింజలై మేఘాలు నింగిపై పరుగుతీసాయి!
వెనకట్టె వానలు వడి తగ్గె వాహినులు
నిర్మల వారితో నిండి ప్రవహించె నదులు.
చల్లని శారద చంద్రికాపూరమున సొక్కి
వెల్లనై మెరిసింది వెండి పోలికను రేయి !
చేమంతి విరబూయ పూదోటల చెలువము హెచ్చె
పంటచేలు తలవంచె పరాగపు పెంపుమీర!
తేమ తగ్గి గాలి ఎల్లెడల తెమ్మెరై వీయగా
సేదదీరి జనులు మదినెంతొ సంబరపడ్డారు.
దసరా పండుగలు దరికి రాగానే నరులు
నవరాత్రి పూజల నయమున కొలిచారు దుర్గను !
దినదినము కొలిచారు దివ్యశక్తిని వారు!
మహిషాసురమర్దని మహిమగల తల్లి –
ఇష్టసిద్ధితోడుత అష్టైశ్వర్యములనిచ్చు,
కొలిచినవారికి కొంగుబంగారమై నిలిచి !
విజయదశమినాడు ఆయుధాల నర్చించి
ఉద్వాసన చెప్పారు ఉత్సవాలకు అందరూ.
విజయయాత్రలకు విహితదినము విజయదశమి –
నరకాసురుని తలపడ నడిచెను భగవానుడు !
************
నరరూప రాక్షసుడు నరకుడనువాడు
భూదేవి గర్భాన విష్ణ్వాంశము చేత నొక,
దుర్ముహూర్తాన జనించిన దుష్ట పుత్రుడు,
లోకాల నలయించు లోకకంటకుడు వాడు !
దుష్ట మిత్రుల నెందరినో దరిజేర్చుకుని
వాడు పాపిష్టి పనులెన్నొ ప్రీతితో చేశాడు !
కన్నెపిల్లల చెరబట్టి కడగండ్ల పాల్జేసె,
సాధుజనుల హింసించె, సజ్జనుల పీడించె,
యజ్ఞ యాగాది క్రతువుల నేవగించుకొనె,
దుండగాలు చేసి జగమును దురపిల్లజేసె !
రాక్షస గణములకు రారాజై వాడు
దుశ్చర్యలన్నిటికి దక్షయై నిలచాడు !
“హా, హా ” రవముల ధ్వనించె నంతరిక్షమ్ము.
దీనజనులకు దిక్కెవ్వరంటూ దురపిల్లె ధరిత్రి….
*****
దీననాథుడు, అజేయుడు, దివ్య శక్తియుతుడు
హరి తా పూనుకొనె హరియింప కడగండ్లు !
“దుష్టశిక్షణ సేయుటే నా ధ్యేయమ్ము కాగా,
శిష్టరక్షణమన్న నాకెంతొ ఇష్టమగుటచే
నరకుని వధియింతు నళినలోచన నేను
నరకబాధల నుండి నరుల కాపాడగాను!
లోకకంటకుడౌ నిజ పుత్రుని దునిమాడి
రక్షింతు లోకాన్ని రయమున పోయి !
గర్భశోకము తప్పదింక మనకు !”
భర్తమాటలు విని బిట్టు వగచింది వసుధ –
“దుష్ట పుత్రునిగన్న తల్లినగుటచేత
వాడి పాప చర్యలందు పాలుంది నాకు –
పాపాత్ముని కన్న పాపాన పొగలుచూ ఈ
పుత్రశోక మనుభవిచక తప్పునా నా కిపుడు !
చేసిన తప్పును దిద్దుకొన సమయ మరుదెంచె
పాపిష్టి నరకుని పట్టి పరిమార్తు రణమున.
వాని వధింపగా వరమిమ్ము నా” కనుచు
దుర్భర శోకాన దుఖించె ధారుణీమాత !
“అటులె కాని” మ్మంచు ఆనతిచ్చె భూజాని.
**********
దుష్టుల దునుమాడి, శిష్టుల రక్షింపగా
సంకల్ప మాత్రాన ఇలను జన్మించి రిరువురూ,
పరమాత్మ కృష్ణునిగ, పడతి తా సత్యగా !
సంతసించిరి సురులు, మునులు, సజ్జనులందరు –
నవరాత్రి పండుగల నాతి సత్యనుగూడి
నిశ్చల భక్తితో దుర్గ నర్చించె కృష్ణుడు !
లోక కల్యాణమునకై లోకమాతను ప్రార్థించి
లోకరక్షకుడు రథమెక్కె రణమునకేగ –
నవలామణి తా నాథునికి రథసారధయ్యనంత
సతిపతు లిద్దరూ సమరభూమిని చేరగ
తలపడెను నరకుడు తండ్రితో పోరుకు –
ఘోర రణమందు అతి ఘోరుడౌ నరకుడు
అమ్ముల జడిలో ముంచి అలయించె తండ్రిని,
సొలసి లీలా మానుషరూపుడు సొమ్మసిల్లె !
ఆగ్రహము పెంపున అమ్ములు చేగొని శీఘ్రమే
విల్లెక్కుపెట్టి, బాణములు సంధించి తాను
రణము చేయ సంసిద్ధురాలాయె రమణి సత్య !
బాణాలు గుప్పించి, భయంకర యుద్ధము చేసి
నరకుని దునుమాడె నళినలోచని తానె!
నేలగూలి నరకుడు నిర్వీర్యుడై చచ్చె !!
************
దేవదుందుభులు మ్రోగె దిక్కులదరగాను,
సురలు పుష్పవృష్టి కురిపించి రా పుణ్యవతిపైన !
మూర్ఛ వీడి లేచి ముదిత విక్రమము చూసి
మురిపాన మగువను పొగడె మాధవుడు –
దుష్ట పుత్రుని దునిమిన ధన్యవు అవనీ !
వాసిగంటివి మాట నిలుపుకు వనితలందరిలో…..
పీడ విరగడయ్యెనని ప్రజలు పండుగ చేస్తారు.
చతుర్దశి నరకుని పుణ్యతిధి కాగా, ముందుగా
నిన్ను మెచ్చి ఆపై వాడికి నివాళు లిస్తారు!, పిదప
స్వర్గస్థులైన పెద్దలు తరింపగా తర్పణలిస్తారు ….
ప్రేమ లెన్ని ఉన్నా మాతృపేమకు దీటు కాదేదీ !
తల్లి ప్రేమనే త్యజించి లోకాల్ని కాచిన తల్లివి నీవు!
జగము గుర్తించులే నీ అఖండ త్యాగ నిరతి –
నీ ఈవికి గుర్తుగా ఇలలోన గొప్ప పండుగ చేస్తారు
దీపావళి పేరున వెలిగింతురు దీపాల వరుసలెన్నో –
నీ కన్నీటి చినుకులే దీప కళికలై వెలిగి ఇంటింట
చీకట్లు తొలగించి కాంతిని వెలయించును జగాన !
స్వార్ధాన్ని విడిచి, సుతుని దునిమి లోకాల
చీకట్లు పోకార్చి కాచిన ఘనత కదా కలికి నీది !
దీపావళి నాడు నీ విజయాన్ని దీపింపజేయగా
వెలిగింతురు వేలాది దివ్వెలు వరుస వరుసలుగా
దివ్య దుందుభులు మ్రోయగ, పూలు కురిపించగా
విలువైన బాణసంచా ఏటేట వెగింతురు చూడు !
తనయుని తమకై చంపిన త్యాగశీలివగుటచే
జోహారులర్పించి నీకు జ్యోతలిడుదురు జనులు -”
ఇట్లు పరిపరి విధముల కృష్ణుడు పడతి నోదార్చె .
పతి మాటలతో సుంత పరితాపము తగ్గగా నామె
దుఃఖాన్ని దిగమింగి దయతో దీవించె లోకాన్ని!
కృతజ్ఞత పెంపున జనులు కొనియాడి రామెను…….
***********
దీపావళీ శుభదినాన దీపలక్ష్మికి మ్రొక్కి
ధనలక్ష్మిని పూజించి ధన్యులైన వారు
సకల సౌభాగ్యములు, సిరిసంపదలు కల్గి
కలకాలమూ ఇలలోన సుఖముగా నుందురు!
==============
మీకు దీపావళి శుభాకాంక్షలు.