చాలా ఏళ్ల క్రితం ఆరుద్ర భారతిలో ఒక వ్యాసం రాస్తూ, "విశ్వనాథ నాకు గురుతుల్యులు, ఎందుకంటే ఆయనను చదివి ఎలా రాయకూడదో నేర్చుకున్నాను" అని చమత్కరించారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఆరుద్ర షష్ట్యబ్దిపూర్తి వచ్చింది. అవకాశం రానే వచ్చిందని, యీ ఉత్సవానికి విశ్వనాథవారుండి ఆయన అభినందనలు తెల్పితే ఎలా వుంటుందో పేరడీ రాశాను. బాపు నాలుగు లైన్లలో ఆరుద్ర ఫేస్‌కట్‌ని, విశ్వనాథ వుమ్మి బిందువుల్ని కారికేచర్ వేసిచ్చారు. నాటి ఆంధ్రజ్యోతి సంపాదకులు నండూరి రామమోహన రావు సరిగ్గా ఆ రోజు వచ్చేలా అచ్చు వేశారు. "కొందరు జ్ఞానము పెంచెదరు. ఈతడు గెడ్డము పెంచినాడు.." అని మొదలై విశ్వనాథ శైలిలో సాగి శుభాకాంక్షలతో ముగుస్తుంది. అందరూ బాగుందనడం ఒక ఎత్తు అయితే, ఆరుద్ర ప్రత్యేకంగా మెచ్చుకోవడం నాకు ఆనందం కలిగించిన ఒక ఎత్తు. అంతేకాదు, షష్టిపూర్తి సంచికలో ఆ పేరడీ తప్పక రావాలని ఆరుద్ర పట్టుబట్టడం మరో ఎత్తు. ఆ సంచికని డా. బెజవాడ గోపాలరెడ్డి, బి.ఎస్.ఆర్. కృష్ణ ఎడిట్ చేశారు.
ఆరుద్ర తమాషా అయిన మనిషి. మాజిక్కులు చేస్తారు. రీడబుల్‌గా రాయడం ఆరుద్ర జన్మహక్కు. మద్రాసు త్యాగరాయనగర్‌లో (చాలామంది త్యాగరాయనగర్/ టి.నగర్ అంటే సంగీతం త్యాగరాజు మీంచి వచ్చిందనుకుంటారు. కాదు సర్ త్యాగరాయ పిట్టి పేరు మీంచి టి.నగర్‌కు ఆ పేరొచ్చింది. ఈయన తోళ్ల వ్యాపారి, జస్టిస్ పార్టీ ప్రముఖులు, ఓల్డ్‌వాషర్‌మన్ పేట నివాసి) 1 – శివప్రకాశమొదలి స్ట్రీట్‌లో ఆరుద్ర వుండేవారు. ఇంటి పక్కన ఒక కారు గ్యారేజి, దాని గోడల నిండా బుక్‌షెల్ఫ్‌లు, వాటి నిండా పుస్తకాలు, ఆ మధ్యన ఆరుద్ర వుండేవి. ఓసారి గళ్లలుంగీ, పొడుగు లాల్చీలో గెడ్డం దువ్వుకుంటూ కూచుని వుంటే – అచ్చం షాజహాన్‌లా వున్నారండీ అన్నాడొక మిత్రుడు. పెద్దగా అనక, రామ వింటే తాజమహల్ కట్టించమంటుంది అన్నారాయన గెడ్డం దువ్వుకుంటూ. రామలక్ష్మి ఆయనని "అబ్బాయ్" అని పిలిచేవారు.
డా. పప్పు వేణుగోపాలరావు అని ఓ పెద్దమనిషి చెన్నైలో వున్నాడు. కళింగ ప్రాంతీయుడు. సాహిత్యాన్ని సంగీతాన్ని నాట్యాన్ని సరసాన్ని క్షుణ్ణంగా రుబ్బినవాడు. అమెరికన్ కాన్సులేట్‌కి అనుబంధంగా ఒక సాంస్కృతిక విభాగం వుంది. దక్షిణాదికి డా. పప్పు వేణుగోపాలరావు డైరెక్టర్‌గా వుండేవారు. మంచి విద్వత్తున్న వాడు. ఆరుద్రని అనుకరించడంలో దిట్ట. అప్పుడప్పుడు రామలక్ష్మి గారికి ఫోన్ చేసి, "నే..నే ఆరుద్రని మాట్లాడుతున్నా" అని ప్రారంభించేవాడు. ఆవిడ వెంఠనే, వున్న ఒక్కడితోనే ఛస్తుంటే మళ్లీ నువ్వొకడివి" అని నవ్వేసేవారు.
మల్లాది రామకృష్ణశాస్త్రి గారి దర్బార్ గురించి వినడమే గాని నేనెరుగను. పానగల్ పార్క్ కేంద్రంగా నడిచేదిట. అక్కడికి వెళితే, ఆ రోజుల్లో తెలుగు లిటరరీ దిగ్గజాలందరి దర్శనం అయ్యేదని చెబుతారు. ఆరుద్ర ముఖ్య అనుచరగణంలో ప్రముఖులు. ఆ తర్వాత మాతరం వారికి మాట్లాడే నిఘంటువు ఆరుద్ర. నిఘంటువే కాదు, విజ్ఞానసర్వస్వం. మంచి కవిగా, సినీ గేయకారుడుగా, వ్యాసకర్తగా అందరికీ తెలుసు. సమగ్రాంధ్ర సాహిత్యం సరేసరి. చదరంగం మీద చక్కని పుస్తకం రాశారు. నేటి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ని అతి చిన్నవయసులోనే గుర్తించి ప్రోత్సహించింది ఆరుద్ర. ఒకసారి యిలాగే ఆయన బహుముఖ ప్రజ్ఞ మీద మెచ్చుకోలుగా అన్నాను. అందుకాయన విలాసంగా నవ్వి, "ఏవిటో, ఆరుద్రకి అన్నీ తెలుసు.. తెలుసు అంటారు గాని, అరవై దాటి చాలాకాలమైంది. ఇంతవరకు ఎట్లా పడుకుంటే సుఖంగా హాయిగా నిద్రపడుతుందో తెలియడం లేదు. ఏమి తెలియడమో ఏమో.." అన్నారు. నాకు ఏమనాలో అర్థం కాలేదు. "త్వమేవాహం"లో "నువ్వు ఎక్కదలుచుకున్న రైలు జీవితకాలం లేటు" అనే వాక్యం కోటబుల్ కోట్‌గా, ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయింది.
నిన్న మొన్ననే "The Dance Traditions of Andhra" పుస్తకం మార్కెట్‌లోకి వచ్చింది. సుప్రసిద్ధ నాట్యాచారిణి పద్మసుబ్రహ్మణ్యం దీనికి విపుల పీఠిక రాశారు. ఆరుద్ర సెంట్రల్ యూనివర్శిటీలో లలిత కళల విభాగంలో విజిటింగ్ పాకల్టీగా వుండే రోజుల్లో తయారు చేసుకున్న నోట్సుల సారాంశం యీ పుస్తకం.
ఆరుద్ర ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం "మనిషీ – ఆడ మనిషీ" పేరుతో ఒక సుదీర్ఘ కావ్యాన్ని సంకల్పించి, రాయడం మొదలుపెట్టారు. ఈ మహేతిహాసాన్ని అంచెలంచెలుగా రాస్తూ వచ్చారు. చాలా రకాల రచనా వ్యాసంగాల మధ్య యీ ఇతిహాసం ఆదుర్దాగా కాక తాపీగా నడవసాగింది. 1995 లో ఇండియాటుడే వారు సాహిత్యవార్షికను వెలువరిస్తూ ఆరుద్రని ఏదైనా రచన యిమ్మని కోరారు. కొత్తగా రాయడం ఇప్పుడు సాధ్యం కాదు. నడుస్తున్న ఇతిహాసం వుందని "మనిషీ – ఆడ మనిషీ" యిచ్చారు. దానిని వారు "స్త్రీ పురాణం" పేరుతో శ్రీనర్సిం చిత్రాలతో ప్రచురించారు. అదే యిటీవల విడుదలైన "స్త్రీ పురాణం". దీని ముఖచిత్రం శ్రీలక్ష్మాగౌడ్. ఈ 56 పేజీలు పుస్తకం వెల వందరూపాయలు. కాపీలు విశాలాంధ్రాలో లభిస్తాయి.
ఇంతటి దీర్ఘకవితను ‘ఆదాము అవ్వ’ స్ఫూర్తి, స్ఫురణలతో రాయాలనుకోవడానికి ఆరుద్ర మనసులో జ్ఞానపీఠ్ మెదిలివుండవచ్చు. అందుకోసమే కాకపోయినా అందుకోసం కూడా అయివుండవచ్చు. దాదాపుగా అదే సమయంలో ఆచార్య సి. నారాయణరెడ్డి "విశ్వంభర" దీర్ఘ కవితకు శ్రీకారం చుట్టారు. ఇది కూడా మానవ నాగరికతా పరిణామక్రమానికి సంబంధించిన వస్తువే. రెండింటికీ తేడా వుంది. సమకాలికులైన ఇద్దరు మహాకవులు సమీప సారూప్యంగల కవితావస్తువును ఎంపిక చేసుకోవడం యాధృచ్ఛికం.
ఒక సినిమా కోసం పాట రాసి, పావుగంటలో బయటపడి నాలుగువందలు జేబులో వేసుకుని వెళ్తుంటే, "మీ పనే బావుందండీ, పావుగంటలో ఫోర్ హండ్రెడ్" అని వ్యాఖ్యానించారొకరు. "…కాని దీని వెనకాల పాతికేళ్ల హోంవర్క్ వుంది" అంటూ కారెక్కారు ఆరుద్ర.
అన్ని శాఖలలోనూ ఆరుద్ర ముద్ర వుండి తీరుతుంది. ఎన్నో సినిమా పాటలు రాశారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. బాపురమణల "స్నేహం" చిత్రానికి రాసిన టైటిల్ సాంగ్ ఒక ప్రయోగం –
"ఎగరేసిన గాలిపటాలు
దొంగాటలు దాగుడుమూతలు
గట్టుమీద పిచ్చుకగూళ్లు
కాలవలో కాగితం పడవలు
గోలీలు గోటీబిళ్ల
ఓడిపోతే పెట్టిన డిల్లా
చిన్ననాటి ఆనవాళ్లు
స్నేహంలో మైలురాళ్లు…"
ఇలా సాగుతుంది యీ పాట. పొడిముక్కలతో బాల్యంలోని మధురస్మృతులను జ్ఞాపకం చేయడం దీని ప్రత్యేకత. ఎక్కడా పల్లవులు చరణాలు పంక్తులు వుండవు.
ఎగరేసిన గాలిపటాలు దొంగాటా దాగుడుమూతలు
గట్టు మీద పిచ్చుక గూళ్లు కాలువలో కాగితం పడవలు గోలీలు గోటీబిళ్ల ఓడిపోతే పెట్టిన డిల్లా*
చిన్ననాటి ఆనవాళ్లు స్నేహంలో మైలురాళ్లు.
పడగొట్టిన మామిడికాయ పొట్లంలో ఉప్పూకారం
తీర్థంలో కొన్న బూరా… కాయ్ రాజా కాయ్…
దసరాలో పువ్వుల బాణం దీపావళి బాణసంచా
చిన్నప్పటి ఆనందాలు చివురించిన మందారాలు
నులివెచ్చని భోగిమంట మోగించిన గుడిలో గంట
వడపప్పు పానకాలు పంచుకొన్న కొబ్బరిముక్కా
గోడ మీద రాసిన రాతలు జీడితో వేసిన బొమ్మలు
చిరిగిపోని జ్ఞాపకాలు చిత్త స్వాతి వానజల్లులు.
(* గోలీల్లో డిల్లా పెట్టడమంటే, వేళ్లు మడిచి ఆ చేత్తో గోలీని దొర్లిస్తూ కంచాలో వేయాలి. ఆటలో యిదొక చిన్న శిక్ష)
చిత్రం ఏమిటంటే రాముడు, కృష్ణుడు పై ఆరుద్ర రాసిన పాటలు భావస్ఫోరకమే కాదు సూపర్‌హిట్స్ కూడా. రాయినైనా కాకపోతిని, అందాల రాముడు ఇందీవర శ్యాముడు, సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం పాటలు, ఎవరుకన్నారెవరుపెంచారు (ముద్దుబిడ్డ) యివన్నీ చాలా ప్రాచుర్యం పొందాయి. బాపురమణలు టివికి తీసిన భాగవత కథల్లో సుందరకాండను సుదీర్ఘగీతంగా రచించారు ఆరుద్ర. రామాయణంలో సుందరకాండను సువర్ణ అధ్యాయంగా చెబుతారు. జిజ్ఞాసులు ముముక్షువులు దానిని బీజాక్షరమంత్రంగా భావిస్తారు. ఇదే ఆరుద్ర చిట్టచివరి రచన.
పాండిత్యం, క్రియేటివిటీ, పాఠకులతో చదివించగల నేర్పు – రచయితకు కావల్సిన మూడు ముఖ్య దినుసులూ సమపాళ్లలో గల ప్రయోగశీలి ఆరుద్ర. బాపురమణలు జ్యోతి మంత్లీ ప్రారంభించినపుడు అందులో ఆ చేత యీ చేత ఆరుద్ర ఎన్నో రాశారు. అలాగే మద్రాసు నుంచి ఆ రోజుల్లో వచ్చే ఆనందవాణి, ఢంకా, నవోదయ (నీలంరాజు వెంకటశేషయ్య) లాంటి పత్రికలకి అప్పటికప్పుడు స్టిక్కూ, స్టిక్కున్నరా ఐటమ్స్ రాసినవి లెక్కా లేదు పద్దూ లేదు. టైపు సెట్టింగ్ రోజుల్లో "స్టిక్" అనేది ఒక కొలమానం. వేసవి వెన్నెల పేరుతో ఒక తమిళ కవితా సంకలనాన్ని తెలుగు చేశారు. దానికి ప్రసిద్ధ చిత్రకారులు "గోపులు" చిత్రాలు వేశారు. తర్వాతి కాలంలో శ్రీశ్రీతో విభేదించారు. ఆరుద్రకి యీ మధ్య "అపకీర్తికండూతి" ఎక్కువైందని శ్రీశ్రీ చమత్కరించారు. శ్రీశ్రీ జీవితం రాస్తానని చాలా రోజులు శ్రమించి బోలెడు భోగట్టా సేకరించారు ఆరుద్ర. దాదాపు ఏడువందల పేజీల మేటర్ సిద్ధం చేశారు. ఎందుకోమరి అచ్చులోకి రానీయలేదు. వామపక్ష మేధావులు వద్దని సూచించారేమో తెలియదు. వాళ్లు శ్రీశ్రీని తల మీద పెట్టుకున్నారు. ఆరుద్రని కేవలం చంకన పెట్టుకున్నారు. ఆరుద్రకి ఖరీదైన అస్వస్థత ఏర్పడినపుడు కూడా వామపక్షాలేవీ ఆదుకోలేదు. ప్రభుత్వమే ఆదుకుంది. సమగ్రాంధ్ర సాహిత్యం కాపీరైట్ కూడా తీసుకుని ఆరుద్ర కుటుంబానికి ఇతోధికంగా మేలు చేసింది.
ఆరుద్ర మద్రాసు వాసి అవడంతో తమిళ పండితుల పరిచయాలు వుండేవి. నాట్య సంగీత శాస్త్రాలని అధ్యయనం చేయడానికి బాగా వీలు దొరికింది. లండన్‌లో ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి వుంటారు. ఆయన గొప్ప అతిధేయుడుగా పేరుపడ్డారు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఫాక్సిమిల్ ఎడిషన్ వేసింది ఆయనే (విదేశాంధ్ర ప్రచురణలు)! తర్వాత టంగుటూరి సూర్యకుమారిపై సమగ్ర సచిత్ర గ్రంథాన్ని తెచ్చిందీ ఆయనే. ఆయన అన్నారు – "ఎంతోమంది యీ దేశం వచ్చినవారు నా యింట బస చేస్తారు. అందులో కవులు కళాకారులు వున్నారు. కాని ఆరుద్ర లాగా తపనతో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నవారెవరూ లేరు. ఆయన రోజంతా మ్యూజియమ్స్‌ని, లైబ్రరీలను, చారిత్రక ప్రదేశాలని సందర్శిస్తూ నోట్సులు రాసుకునేవారు. బోలెడు అపురూపమైన సమాచారం సేకరించుకున్నారు. జ్ఞానసముపార్జన ఆయనకో పిచ్చి."
ఆరుద్ర కంటె గొప్ప వారిని చూడచ్చు.
ఆరుద్ర కంటె తక్కువ వారిని చూడచ్చు.
ఆరుద్ర లాంటి మరొకరిని మాత్రం చూడలేం.
ఇది మాత్రం నిజం.
————————————-xxxxxxxxxxx————————————
ఈ వ్యాసంలోని బొమ్మ, అంతర్జాలం నుండి సేకరించినది
చాలా చక్కటి పరిచయం చేసారు. ఇంకా ఇంకా రాస్తే బాగుండుననిపించింది.ఆరుద్రతో మీవంటి పరిచయస్థుల అనుభవాలు ఎన్ని రికార్డు చేస్తే అంత మంచిది.మహా కవుల రచనలు పబ్లిష్ అయినవి ఎక్కడైనా కొని చదువుకోవచ్చును. కానీ ఆసక్తికరమైన వారికి సంబంధించిన విషయాలు నలుగురికీ తెలియాలంటే వారి వారి మిత్రులు అవి రికార్డు చేసి ఇలా ఆందిస్తూ ఉండాలి.
ా