జర్కన్

ఇది పసుపూ కాదు, ఆకుపచ్చా కాదు. మిరిమిట్లు గొలపదు. అంగుళం పొడవు, నాలుగు ముఖాల అందం దీనివి. ఎన్ని వస్తువులు పారేశాను? ఇచ్చేశాను. ఇది మాత్రం ఇంకా ఇప్పటికీ నాదగ్గర ఉంది. ఉపయోగం లేదు. దీని ఖరీదు తెలీదు నాకు. విలువ?

హార్బరు, ఏర్పోర్టులు, స్టేషన్లూ నా జీవితంలోని మజిలీలను సూచిస్తాయి. అర్ధరాత్రి సమయాల్లో రైళ్ళు మారడం, హార్బర్ దీపాలు మెల్లగా వెనక్కి వెళుతూ దండల్లాగ మారుతూంటే డెక్ మీద నిలబడి నీళ్ల గలగల వినడం, ఉక్కురంగు తెల్లవారుఝాముల్లో డల్ గా ఏర్పోర్టు లౌంజ్ ల్లో కూచుని నీరీక్షించడం…. వెనక్కి చూస్తే, ఇవే నా జీవితంలోని మలుపుల్ని సూచిస్తున్నాయేమోనని అనిపిస్తుంది. ‘విలువల’ ప్రమేయం లేదు నాకు. స్థిరంగా నిలబడి, నలుగురి మధ్యా ఉండి, మనుష్యులతో, వస్తువులతో సంబంధాలూ, మమతలూ పెంచుంటున్నవాళ్లకి విలువలు. ఐతే, దేనికీ విలువ కట్టకపోవడం?…

“దీన్ని మీకు ఎందుకిస్తున్నానో నాకు బాగా తెలియదు. నాకు అప్పుడప్పుడు ఇలా ఇవ్వాలని వుంటుoది. ఈ నెలరోజుల్లోనే మీరంటే నాకు అమితమైన స్నేహభావం ఏర్పడింది. ఇంతకంటె ఖరీదైనవి, అందంగా ఉన్నవీ నా దగ్గర మీరు చూశారు. కాని ఇదే ఇస్తున్నాను.”

తెల్లవారుఝామున, మింగ్లడాన్‌ ఏర్పోర్టులో, నన్ను సాగనంపడానికి వచ్చి, వచ్చీపోయే విమానాలు చెవులు బద్ధలు కొడుతూ శబ్ధం చేస్తూంటే,  ఉల్లిపొర కాగితం విప్పి, దీన్ని ఇటి అటూ తిప్పి చూపించి నాచేతిలో పెట్టి, వీరాస్వామి అన్నమాటలు. ‘నంగిరి’గా, సిగ్గుగా, భయంగా, అన్నమాటలే అంటూ, మళ్ళీ రద్దు చేస్తూ, వీరాస్వామి దీన్ని నాచేతిలో పెట్టాడు, నా ముఖం చూడకుండా, చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ, ఆ ప్రయత్నంలో నా హృదయానికి చాలా దగ్గరగా వస్తూ.

వీరాస్వామికి సిగ్గు, భయం, ‘నంగిరి’తనం చాలా దూరం. కాని ఆక్షణంలో అతని సహజగుణాలు మాయమయి పోయాయి.

తీసుకోక  ఏం చేస్తాను? ఇవ్వడం అలవాటయిన నేను!
సిగ్గు, భయం వీరాస్వామికి చాలాదూరం. ‘నేషన్‌’ ఎడిటర్ కి నేను రాసిన వుత్తరం చదివి, నా ఎడ్రస్ సంపాదించి, నాకు రాశాడు వీరాస్వామి. తనకి కూడా ‘క్రెమటోరియా’ గురించి స్థిరమైన అభిప్రాయాలున్నాయన్నాడు. వాటిగురించి ఆలోచించే ఆంధ్రులున్నారని సంతోషంగా ఉందన్నాడు. రంగూన్ వచ్చినప్పుడు తనని కలవమన్నాడు. ఉత్తరాల మీద ఉత్తరాలు కురిపించాడు, మొదటి దానికి తప్ప నేను జవాబే రాయకపోయినా. అంతేకాదు, తన మాండలే స్నేహితులకి కూడా రాశాడు నన్ను చూడమని. అతని స్నేహం ధాటికి తట్టుకోవడం కష్టమైపోయింది. క్రమంగా క్రెమటోరియా అడుగున పడిపోయాయి. అతని ఉత్తరాలు ఆత్మకథ రూపం దాల్చాయి.

’ఆశయాలూ, ఆశలూ, అభిరుచులూ, హక్కులూ, స్వామ్యం అని అరిచే వెధవల్ని హతమార్చాలి. ఎలా అనుకున్నారు? గోడకి నిలబెట్టి, చేతులెత్తించి, మెషిన్‌గన్‌తో టకటకామని.’
‘ప్రపంచ జనాభాలో ముఖ్యంగా మనదేశపు జనాభాలో నూటికి తొంభయిమంది పురుగుల్లాంటి వాళ్ళు, ఫ్లిట్ కొట్టి చంపినట్లు చంపాలి.’
‘సంగీతం ఎవరికర్ధమౌతుంది? కుస్తీలు పట్టి ఒకేసారి పదిమందిని చిత్తుచెయ్యగల వాళ్లు ఎంతమంది వున్నారు?’
‘చచ్చిన తరువాత కూడా లక్షసేవలు చేయించుకుంటారు, ఈ అధమాధమ మానవులు. కర్రలు, నెయ్యి, రబ్బిష్, కాఫిన్లు, మంత్రాలు, ప్రార్ధనలు, ఏనివర్సరీలు. ఒక సెకండులో బుగ్గి అయ్యే ఈ స్టుపిడ్ కళేబరానికి ఇన్ని పరిచర్యలెందుకో…. అందుకే మీరు క్రెమటోరియా గురించి రాసింది నాకు నచ్చింది.’
ఉత్తరాల్లో ఊహించుకున్నట్లుగా లేడు వీరాస్వామి. ఆరడుగుల రెండంగుళాల సన్నటి పొడుగు. పలచని ముఖం.
‘మిమ్మల్ని చూస్తే ఎందుకు నాకు ఇంత సంతోషంగా ఉందో చెప్పలేను. ముఖస్తుతి అనుకోకండి. కాని మీలోని శాంతస్వభావం, ఎంతో లోపలికి చూడగలిగే శక్తి, నన్ను మరింత దగ్గరగా లాగుతూంది’ అన్నాడు విశాలమైన కళ్లల్లో మెత్తటి, తెల్లని అమాయకత్వం నీడలా కదులుతూంటే. ‘ఇన్యా’ సరస్సు నీలి అలలు అతని కళ్ళల్లో సున్నితంగా మెదిలాయి.

‘అప్పుడప్పుడు’ అనిపిస్తుంది మన దేశానికి తిరిగి వెళ్ళిపోయి, దేశాన్ని మరమ్మత్తు చేద్దామని. తుడవాలి. ఇనుప చీపుళ్ళు పెట్టి దేశాన్ని తుడవాలి. మిగిలిన చెత్తని కాల్చాలి. ఒకసారి అంతా కాల్చి శుభ్రం చెయ్యాలి’, స్పార్క్ స్ట్రీట్లో తన ఇంటి బాల్కనీ నీడలో నిలబడి కిందకి రోడ్డుమీద ట్రాఫిక్ వేపు చూస్తూ అన్నాడు.
వాగ్నర్‌ ‘లోహెన్‌గ్రిన్‌’ నేపథ్యంగా వినిపిస్తూంది. ‘ఎల్సా’తో, నిజం చెప్పడానికి భయపడుతున్నాడు లోహెన్‌గ్రిన్‌. ఇక్కడి తన కార్గో బోట్ల సామ్రాజ్యాన్ని త్యజించి, దేశం వెళ్లిపోవాలంటాడు వీరాస్వామి. అంతా కొత్తగా, మొదటినుంచి మళ్ళీ మొదలుపెట్టాలి. కాని..

ఎలా వదలి పెట్టడం. ఇంపల్స్ కావాలి. వదలిపెట్టి వెళ్లడానికి కావలసిన పనులు. కాగితాల పనులు, చెప్పవలసిన జవాబులు, రూల్స్, రెగ్యులేషన్స్ ని డబ్బుతో, డబాయింపుతో పక్కకి నెట్టడం, దానిలోని విసుగు, శ్రమ – ఆ భారాన్ని తలచుకుంటే నిస్పృహ. కాని, వదలి పెట్టాలి. జుత్తులోంచి వేళ్ళు గట్టిగా, పిచ్చిగా పీక్కుంటూ అన్నాడు. ‘మా తాత సృష్టించిన సామ్రాజ్యమిది. ఈ దేశమంతా వ్యాపించింది. వేళ్లతో సహా ఎలా పీకడం? ఇంపల్స్ కోసం కాసుక్కూచున్నాను. మీరు….’
సలహా?

విసుగూ, అలసటా వచ్చింది నాకు. నాలో ఉన్న శక్తి అది. అందరిచేతా చెప్పించుకుంటాను. నాలో అద్దంలో చూసుకున్నట్లు  చూసుకుంటారు.

‘అరవయి సంవత్సరాల చరిత్రని మీరు రద్దు చేయలేరు అనుకుంటాను. చేస్తే మాత్రం మిమ్మల్ని సూపర్ మాన్‌ అనుకోవచ్చు.’

ఎందుకోగాని వీరాస్వామికి నవ్వు వచ్చింది.
నవ్వితే, ఎంతో ‘పెద్దగా’ కనిపిస్తాడు. ఆ నవ్వులోనే పెంకితనం మంకుతనం కూడా స్ఫురిస్తుంది. గోదమీద ఎత్తుగా వీరాస్వామి తండ్రి ఫోటో ఉంది. చుట్టూ కాగితం పువ్వుల దండ. గదంతటికీ అదొక్కటే ‘పాత’ దనానికి కన్సెషన్‌ లా కనిపిస్తుంది. తలపాగా కింద వీరాస్వామి తండ్రి కళ్లల్లో అయస్కాంతపు చూపులు. దైవభక్తికి నిదర్శనాలున్నాయి. ఎదురుగా పెడెస్టల్‌ మీద ఒక కార్గో బోటు మోడెల్, ఏనుగు దంతంతో చేసింది ఉంది. వీరాస్వామి రికార్డు చేంబర్ లోంచి రికార్డులు తీస్తూ అన్నాడు;

‘బర్మా ప్రభుత్వం నాకు చిన్నప్పుడు ఒక మెడల్ ఇచ్చింది. ఎందుకనుకున్నారు?  కాలుతున్న ఇంట్లోకి జొరబడి మూడేళ్ల అబ్బాయిని పైకి తీసుకొచ్చాను. మచ్చలు ఇంకా ఉన్నాయి.’

మెడల్ ఇచ్చిన ప్రభుత్వమే అతన్ని ఒక రేప్ కేస్ లో విచారణ చేసింది. అతని క్రూరత్వం భరించలేకే అతని భార్య ఆత్మహత్య చేసుకుందని అక్కడి అందరికీ తెలిసిన విషయం. అతనికింద పనిచేసేవాళ్ళు అతని మూడ్స్ ని గ్రహించలేక, భరించలేక మసి అయిపోయారు.

వీరాస్వామి ముఖంలో ‘బాల్యం’ బాగా కనిపిస్తుంది. గొంగళి పురుగుల్ని సునాయాసంగా చేత్తో నలిపి చంపే బాల్యం. పాలు తాగకుండా పిల్లిపిల్లకు పోసే బాల్యం అది. కోపం కొద్దీ ఖరీదైన గడియారాన్ని నేలకేసి కొట్టడం, ‘అడివి’ తనం.

‘మీరు అదృష్టవంతులు. మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది. ఇవ్వాళిక్కడ. రేపు ఇంకెక్కడో. మీ ఆశయం నాకు నచ్చింది. ఈ సంవత్సరం మాండలేలో బుద్ధిస్ట్ ఫిలాసఫీ టీచ్ చేశారు. ఇక్కడ నుంచి బేంగ్‌కాక్‌కి వెళ్తున్నారు. అక్కడ మొనాస్టరీలో ఉండటానికి..

బాభ్‌ సంగీతం వింత అనుభూతిని కలిగిస్తుంది. స్నేహం ఏర్పడుతుంటే దానిలోని మాధుర్యాల్ని ఎక్కువ చేస్తుంది. వీరాస్వామిని చూస్తే ‘జాలి’ వేస్తుంది. అంతటి సుఖాన్నిచ్చే వాతావరణంలోనూ అసంతృప్తి. ఆశయాలున్నా, వాటివేపు ప్రయాణం చెయ్యడానికి కావలసిన ఉత్సాహాన్ని ఏదో దుష్టశక్తి అరికట్టుతూంది. హరిస్తూంది. ‘ఇంపల్స్’ కాదు అతనికి కావల్సింది. తన్ను తాను తెలుసుకోవాలి. తనకేది కావాలో తెలుసుకోవాలి. తెలుసుకోవచ్చని తెలుసుకోవాలి. తనలోంచి తను వేరుబడి తనని వేరే చూసుకోవడం నేర్చుకోవాలి. ఆ క్షణంలో, అతను ఏమిటి చెయ్యాలో, అతని గమ్యం ఏమిటో అతనికే తెలుస్తుంది. నా జీవిత విధానాన్ని చూసి అతను అసూయ చెందడం కాదు కావలసింది. అదే చెప్పాను అతనికి. ఏదో పుస్తకంలోని పాఠం అప్పజెబుతున్నట్లు అనిపించింది.
‘నిజమే అనుకోండి. కాని మిమ్మల్ని ఇలా దగ్గరగా చూస్తూ మీ మాటలు వింటూంటే మిమ్మల్ని నా గురువుగా చేసుకుని అనుసరించాలని ఉంది.’ అన్నాడు.

అతని మాటల్లో విషాదం నాకు చాలా భయంకరంగా కనిపించింది.

‘మీ ఆఖరి క్షణాలు ఏదో ఉత్తర హిందుస్థానం ట్రెయిన్లో గడుపుతారు. మీ దేహాన్ని చిన్న గుడ్డిదీపం స్టేషన్లో దింపేస్తారు. మిమ్మల్నక్కడ వదిలేసి, మెల్లగా బరువుగా వెళ్ళిపోతుంది పేసెంజర్’ అన్నాడు మళ్ళీ.

…ఒకొక్కప్పుడు తెలుస్తుంది నాకు నన్ను కూడా మిగతా వాళ్ళు ‘స్టడీ’ చేస్తుంటారనీ, నా ‘లోతులు’ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారనీ, నా జీవిత విధానాన్ని, దాని ‘అంతాన్నీ’ ఊహిస్తుంటారనీ, అలా బలంగా, లోతుగా నాకు తెలిసినప్పుడు, దానికి వ్యతిరేకంగా వారి ఊహల్నీ, నిర్ధారణల్నీ తప్పుగా నిరూపించడానికని, ‘మెలోడ్రామటిక్’ గా నా విధానాన్ని మార్చగలిగే ‘బాల్యపు’ ప్రేరణలు అంతర్భూతంగా ఉన్నా, పైకి ఒక్ఖసారిగా వస్తాయని కూడా నాకు తెలుస్తూనే ఉంటుంది. ఈ తెలుసుకోవడంతోనే ఆపగలగడం నా ధ్యానం, నా శిక్షణలో ఒక భాగం అనుకుంటాను. నా జీవితంలోని మలుపులకి కారణాలు ఈ ‘ప్రేరణలే’ అని గట్టిగా చెప్పడానికి నా ప్రయాణాలే నాకు సాక్ష్యం. నా బలహీనతని నిరూపించే చిహ్నాలు… అని కూడా అప్పుడప్పుడు.

నవ్వొచ్చింది. ‘సినిమా చావులు అందరికీ రావు. అయినా, నాకు అలాంటి చావు ఇష్టం లేదు. కొడుకులూ, మనమలూ మంచం చుట్టూ కూచునుంటే వాళ్ల కళ్లలోని భావాల్ని పరిశీలిస్తూ..

‘మీకున్న ఆస్తి ఏమిటి? మనమలూ మనమరాళ్ళూ కూచుని మీరెప్పుడు గుటకేస్తారా అని చూడ్డానికి? ఈ షాన్ బాగూ, అందులోని రెండు పుస్తకాలూ, మీ పాస్‌పోర్టూ కదూ. వాళ్లందరూ వద్దులెండి. ఆ గుడ్డిదీపం కింద రగ్గుతో కప్పబడిన శవం మీదే. నా ఆశని వ్యర్ధం చెయ్యకండి….’

దరిదాపు శవంలాగే చూశాడు నన్ను వీరాస్వామి మొట్టమొదటిసారి.

జ్వరంతోనే డెగోన్‌ మెయిల్ ఎక్కాను మాండలేలో. పిన్‌మనా వచ్చేసరికి సలసల కాగింది దేహం. రాత్రంతా అక్కడే ఆగింది ట్రెయిన్‌. డెలీరియంలో పాతజీవితం అంతా పీడకల రూపంలో పునద్దర్శనం ఇచ్చింది. మర్నాడంతా తోటి ప్రయాణీకులు ఆదుర్దా – కమ్యూనిస్టులు రైలు పట్టాల్ని మైన్ చేశారనీ, ట్రెయిన్‌ ఇక ముందుకు వెళ్ళదనీ. చలిలో, అక్కడక్కడ కాల్చిపారేసిన మొండి గోడల రైలు స్టేషన్లు దాటుకుంటూ డేగోన్‌ మెయిల్ చీమలాగ ప్రయాణం చేసింది రంగూన్‌కి.
వీరాస్వామి ఆప్యాయతా, స్నేహం మొదటిరోజు నుంచీ తెలిసింది. అతని సేవతో నాలుగు రోజుల్లో పోయిన సత్తువ అంతా తిరిగి వచ్చింది. అతని మృదువైన చేతులు దేహానికి ఎంతో ఆహ్లాదం కలిగించాయి.
‘రెండు రోజుల తర్వాత, నాకు స్పంజ్‌బాత్ ఇచ్చి, వాలు కుర్చీలో కూచోబెట్టి, దుప్పటీ మార్చుతూ అన్నాడు. “మీ బుద్ధిస్ట్ ఫిలాసఫీ – వ్యవహారం చూసి గొప్ప జిడ్డుగానో, బట్టతలతోనో ప్రత్యక్షం అవుతారనుకున్నాను. కాని ఇలా టెక్సాస్ కౌబాయ్ లాగ ఉంటారని కలలోనేనా అనుకోలేదు.”
“హామ్‌లెట్ హోరేషియోతో అన్నమాట నిజం” అన్నాను నవ్వుతూ.
“జ్వరం బాగా తగ్గి, బాగయిన తరువాత మీ చేత రంగూన్‌ కి ఎర్రరంగు పూయిస్తాను” అన్నాడు.
స్ట్రౌండ్‌లో కూచుని, రంగూన్‌ రివర్ వేపు చూస్తూ, నీట్లో దీపాల దండలని కదిలిస్తూ లాంచ్‌లూ, స్టీమర్లూ పోతూంటే, విస్కీ తాగాం. జిన్‌ అండ్ బిట్టర్స్. మృదువుగా షెర్రీ, మధ్య మధ్యన సాంపేన్‌.
“దేశాన్నంతటినీ ఊపాలి. ప్రజలు నాకోసం పరితపించాలి. బాల్కనీలో నిలబడి, కిందని గుంపులు గూడిన ప్రజలు చీమ తలకాయల్లా కనుపిస్తూంటే, గ్రేషస్‌గా చెయ్యి ఊపాలి. ” అన్నాడు వీరాస్వామి కుర్చీలో జారబడి, కళ్ళు పెద్దవి చేసి షాంపేన్‌ కలలుకంటూ.
ఓపెల్ కారులో ఇన్యాలేక్‌కి వెళ్ళి అక్కడ చెట్ల కింద చల్లటి చీకటిలో కూచున్నాం.

“నా ముత్తాత ఇక్కడ టింబర్ కూలీగా మొదలుపెట్టాడు. తాత కార్గో బోట్ల మీద వ్యాపారం చేశాడు. నాన్న కార్గో బోట్లే కొన్నాడు. నా చేతుల్లో కార్గో బోట్ల సామ్రాజ్యం తయారయింది. ప్రతి రివర్ పోర్ట్ లోనూ నా బోట్లు ఉన్నాయి. నాన్న స్నేహితుల్ని రూపు మాపు లేకుండా చెయ్యగలిగాను. అడ్డుగా నిలబడ్దవాళ్ళు, పోటీకి వచ్చినవాళ్ళు అడుక్కుతింటున్నారు. కట్టుబట్టల్తో తిరిగి వెళ్ళారు. నేను చెయ్యని అన్యాయం లేదు. ఉపయోగించని అస్త్రం లేదు. హతం చేశాను. కొంతమందిని నా కింద జీతగాళ్లగా పడేసి ఉంచాను.” అన్నాడు. చీకట్లోనించి దూరంగా దీపాలని చూస్తూ.
సరస్సులో దీపాలు, బెంచీల మీద సంభాషణల ఆఖరకు వచ్చిన ప్రేమికులు. జీవితంలో చాలా దూరం ప్రయాణం చేసినట్లనిపించింది. ఎందుకోగాని నా చుట్టూ నిశ్శబ్ధం ఆవరించినట్లయింది. ఎంతోదూరం నుంచి వీరాస్వామి మాటలు వినిపించినట్లు తోచింది. యదార్ధం లేని ఖాళీ ప్రపంచంలో తేలుతున్నట్లుగా, మిక్స్ చేసిన డ్రింకులు తలకెక్కినట్లున్నాయి.
—————

ఇప్పటికీ అనిపిస్తుంది, వీరాస్వామి మాటలు నన్ను ఎడ్రెస్ చేసి చెప్పబడలేదని. తనలో తానే మాట్లాడుకున్నాడు. రిలీజ్ కావలసి వచ్చింది. నన్ను ఉపయోగించుకున్నాడన్న భావం కూడా నా తలలో ఎక్కడో అడుగున నల్లగా రహస్యంగా మెదిలింది.

“రూబీ దగ్గరకు వెళ్దాం, పదండి” అన్నాడి వీరాస్వామి చెట్ల చీకట్లలోంచి లేస్తూ.

ఈ “రూబీ” లు ప్రసాదించే సుఖంలోని విషాదపు లోతులు ఎన్నిసార్లు ఎంత గాఢంగా తెలుసుకున్నా కల్యాణీ, కల్యాణీ అంధకారానికుండే దారుణమైన ఆకర్షణ వెలుతురికి లేదనిపిస్తుంది. భయంకరమైన అందం అది. సర్పానికుండే సౌందర్యం, లావణ్యం ఈ ప్రపంచంలో దేనికుంది.

కల్యాణీ! నీ గొలుసులోని లాకెట్‌లో ఈ జర్కన్‌ రాయి చాలా “శాంతిగా” ఉండేది కల్యాణీ. మిరుమిట్లు గొలపదు. సున్నితంగా మెరుస్తుంది. చల్లని నీటితో దేహాన్ని స్నానం చేయిస్తుంది.’
ముఖ్మల్ మీద పొందిగ్గా అమర్చిన వజ్రాలు, జాస్పర్, గేట్, ఓపల్, జేడ్, ఎమెరల్డ్, రూబీ, గార్నెట్, సెఫైర్, గార్నెట్, అమెథిస్, జాసింథ్, బెరిల్, టర్మిలీన్‌, ఓనిక్స్, టోపాజ్, టర్కిజ్ …… రంగులు, మెరుపులు, కాంతులు, కిరణాలు ….. అన్ని వందల రకాల ‘రాళ్ల’లోనూ ఈ జర్కన్‌ మృదువుగా, మోడెస్ట్‌గా, సిగ్గుగా కనిపించింది నా కళ్లకి. అలా అని అంటే,

“మీ టేస్ట్ కొంచం ఆశ్చర్యకరంగానే ఉన్నా సబ్జెక్టివ్‌గానే ఉంది. ” అన్నాడు వీరాస్వామి జర్కన్‌ ని తీసి ఇటూ అటూ తిప్పి చూస్తూ.

“మీలో ఒక గొప్ప గుణం ఉంది. ఏ అనుభవాన్నీ కాదనరు. కాని వాటిని మీ రక్తంలోకి జొరబడనివ్వరు, అవునా? ” అన్నాడు మళ్ళీ రాత్రి అనుభవం నా కళ్ళల్లో ఇంకా మిగిలి ఉందేమో అని పరీక్షగా చూస్తూ.
అవునో కాదో అప్పుడు చెప్పలేకపోయాను. జవాబు ఇదీ అని ఊహించుకుని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తే, ఒక్ఖసారిగా గర్వం, ‘అహం’ తెలియకుండా వెకపాటుగా ముట్టడి చేసి ….  మాటల్లో విపరీతమైన “ట్విస్ట్‌” అసత్యం …. బంగారు పూత …. వెలిగే అసత్యం. ‘నిజం’ యొక్క కఠోరత్వాన్ని కప్పిపుచ్చే అసత్యపు ఆకర్షణ … ఇవీ, నిజం యొక్క అసలు వెలుగుని చూడలేక బెదరడం భయం; మనస్సుతో ‘తెలుసు’కోగలిగినా, ‘తెలుసుకోవడం’ నా శిక్షణలో ఒక భాగమయినా నేను అన్న మాటలలో ఖంగుఖంగుమని సత్యం ఎప్పుడూ మోగదనీ, ఏది నిప్పులాగ నిజమో, ఏది వేషధారణో చెప్పలేననీ… …
ఈ జర్కన్‌ రాయి, ఆ డిసెంబర్‌ చలిలో తెల్లవారు జామున మొంగ్లడాన్‌ ఏర్‌పోర్టులో నాచేతిలో పెట్టాడు. ఎన్ని వస్తువులు ఇచ్చేశాను. పారేశాను. కాని ఇది ఇన్ని సంవత్సరాలూ నా దగ్గరనే ఉండిపోయింది. ఒక్కసారి మాత్రం వచ్చింది అవకాశం ఇది నా దగ్గర నుంచి పోయేందుకు. కాని ఎంత కఠినంగా వచ్చింది ఆ అవకాశం.
వీపు మీద తట్టి, వెనక్కి తిప్పించుకున్న మనిషి వీరాస్వామి అని పోల్చుకోవడం చాలా కష్టమే అయింది. తిరగేస్తున్న పుస్తకం అలా పరధ్యాన్నంగా బుక్‌స్టాల్ కౌంటర్ మీద పడేసి, ఆశ్చర్యంగా చూశాను. వాల్టేరు స్టేషన్లో నన్ను ఎవరు పలకరిస్తారు.

“భాస్కర్‌గారు కదూ ? ”

గొంతుక పట్టి పోల్చుకోగలిగాను.

రాగి రంగు జుత్తు నుదుర్ని బాగా కప్పి ఉంది. ఖాకీ చొక్కా జేబులు రెండూ చిరిగి వేళ్లాడుతున్నాయి.

నన్ను బలవంతంగా వాల్టేరులో దింపి, రైలి పట్టాల పక్కనుంచి నడిపించుకుపోయాడు. “మీకున్న సామానేమిటి? షాన్‌ బాగూ  పాస్‌పోర్టూ అంతేనా? ఏ ట్రెయినయితే ఏమిటి? ఎప్పుడు వెళ్ళితే ఏమిటి? ” అని బలవంతం చేశాడు.
సందులు, పాకలు, నేలకి అడుగు దూరం దాకా దిగిన ఇళ్ళ తాటాకుల కప్పులు. తాటిచిప్పలు తన్నుకుంటూ పరిగెత్తుతూ ఒంటి మీద బట్టల్లేకుండా నల్లని పిల్లలు. పాకలముందు రాళ్లమీద కూచుని కుండల్లోంచి డబ్బాలతో వేడినీళ్ళు గుమ్మరించుకుంటుంటే కాలవలు సందుకి అడ్డంగా మడుగులు కడుతూ పారుతున్నాయి. కొబ్బరి చెట్ల వెనక సూర్యాస్తమయం. ఎక్కడ్నుంచో అర్ధమవని గుండెలు కోసే స్త్రీ రోదన.

వీరాస్వామి పాకలో నేలమీద చాప, మూలని హరికేన్‌ దీపం చీకటి.

గూళ్లల్లో అగ్గిపెట్టెకోసం వెతికి దీపం వెలిగించాడు. ఒక మూలని చిన్న రాళ్ల కుప్ప., ఇటిక ముక్కలు గులకరాళ్ళు, కోసుగా పదునుగా ఎర్రటి రాళ్ళు.

నాచూపు చూసి అన్నాడు “పందుల్ని కొట్టడానికి”

ఏమిటి మాట్లాడేం.
వీరాస్వామి అడుగులు తేలికగా పడుతున్నాయి అనుకున్నాను. గొంతులో బరువు, ఆదుర్దా వినిపించలేదు అని కూడా అనుకున్నాను.

“నాలోంచి నేను వేరుబడి ఇక్కడకు వచ్చాను” అన్నాడు.

ఎక్కడనుంచో చీమలు ఒక బారు కట్టి ఎక్కడికో వెళ్తున్నాయి. దీపాన్ని తప్పించుకుని పక్కగా ఆ బారు చీకట్లోకి పోతూంది. చీమల తలలు మెరుస్తున్నాయి దీపం కాంతిలో.

“అంతా ఇచ్చేశాను. కొంత వాళ్ళు తీసుకున్నారు. కేంపుల్లో జీవితం దుర్భరం. అందుకని ఇక్కడ చేరాను. ”

“దేశాన్ని మార్చాలి. ఎక్కడనుంచి మొదలుపెట్టాలో తెలియకుండా ఉంది. ఇక్కడ నేనంటే భయం, అసహ్యం. బోధపడ్డం లేదు. ”

పాకలో వేడిగా ఉంది. వేడి ఏ నరానికి నిప్పంటించిందో, వీధిలో గట్టిగా అరుపులు, బూతులు మొదలుపెట్టింది ఒక ఆడగొంతు. ఆ వేడి చీకటిలో ఇనుం మీద మొద్దుబారిన కత్తితో రాసినట్లయింది.

వీరాస్వామికి పరిధులు లేవు. సగం సగం పనులు చేతకావు. అడుగు చూడవలసిందే. శిఖరాల మీదనే నిలబడాలి.
ఏదో బ్రిడ్జ్ కట్టించడానికి కావల్సిన కూలీల గాంగ్ లో చేరాడు.

“అయితే ఒకటి. మెల్లగా, తొందర లేకుండా ఆలోచించడం నేర్చుకున్నాను. మాటలు తగ్గించాను.” అన్నాడు.

“మిమ్మల్ని ఇలా ఇన్నాళ్లకు చూడ్డం ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను.” అన్నాడు మళ్ళీ.
మార్పుని దగ్గరగా కాకుండా దూరంనుంచి చూడడం అలవాటయి పోయింది. మార్పులు మార్పుల్లాగా కనిపించవు.

“ఆరేళ్లయింది. థాయిలాండ్ నుంచి వచ్చిన తరువాత రాశారు నా ఉత్తరానికి జవాబు. నలందా నుంచి అని జ్ఞాపకం. ఇప్పుడు సిలోన్ వెళ్తున్నారు. మీ యాత్రలు ఎప్పుడు ఆపుచేస్తారు? ” అన్నాడు చీమలవేపు చూస్తూ.
ఏది యాత్ర? ఏది “వృత్తి?” భేదం అదృశ్యమయిపోయింది. ఒక దానిలో ఒకటి కలిసిపోయాయి. రెండింటిలోని పదునూ మొద్దు బారినట్లు అనిపిస్తుంది. కాని విరామం లేకుండా జరుగుతూనే ఉంది యాత్ర. మరచిపోయింది ఏదీ లేదు. గంగ ఒడ్డుని సాయంకాలం చుట్టూ మెత్తగా శాటిన్‌ లాగ జారుతూ ఉంటే, రావిచెట్ల మధ్య నుంచి వంకర తిరుగుతూ పోయే ఈ ధూళిబాట మీద మెల్లగా నడుస్తూ ఎన్ని సార్లు నడిచాం, కల్యాణీ, ఈ రెండు సంవత్సరాలలో.
నీ కళ్ళ అమాయకత్వంలోకి చూస్తూంటే, ఆలోచనల గొలుసు ఎక్కడో చీకట్లో ప్రారంభం అయి దూరంగా, చాలా దూరంగా తీసుకు పోయేది. నీ చుట్టూ ఒక ‘గృహం’ ఏర్పడేది. నీతి రంగు చిత్రంలో లాగ, మృదువుగా రంగులు స్పేస్‌లోకి జారుతుంటే, గొలుసు తెగేది. ‘గృహం’ లోకి అడుగు పెట్టలేక పొయ్యాను.
వస్తువులకి గొప్ప శక్తి ఉంది. కల్యాణీ, అవి వెళ్లవు పైకి. పారేసినా, ఇచ్చేసినా, వాటి ‘ప్రాణం’ వాటితో కూడా వెళ్లదు. ఎన్ని పారేశాను? ఎన్ని చేతులతో నిజంగా విసిరేశాను. ఇచ్చేశాను. ఈ రెండేళ్లలోనూ వాటి ‘కసి’ తీర్చుకున్నాయి. ‘పగ’. ఎంత ‘పట్టుదల’ వాటికి, పుస్తకాలు గుట్టలుగా చేరిపడ్డాయి. కుర్చీలు, బట్టలు, ఈ జోళ్ళు. ఇన్ని జోళ్ళు!
అందుకే కల్యాణీ, ఆగృహంలోకి అడుగుపెట్టలేకపోయాను. వీటిని కూడా విసిరేయాలి. పోవాలి.

అంతేకాదు, నీకు బోధపడలేదు. నీ ఇంట్లో నీ కిచ్చిన ‘స్వాతంత్ర్యం’  నాకు అధీనం చేద్దామనుకున్నావు. నీ కళ్ల అమాయకత్వం నీ దేహంలో లేదు. మిరిమిట్లు గొలిపే దేహాన్ని ఒక వస్త్రం లాగ ఉపయోగించదలిచావు నా మీద. అది “పూలబాణం” అవలేకపోయింది కల్యాణీ నామీద.

నీ ఆశయం, నీ ‘కోరిక’ నా బాధ్యతగా తీసుకోలేదు. తీసుకోలేకపోయాను. నిన్ను పారేయడంలో అంత దారుణమైన ఫలితాలు ఉంటాయని ఊహించలేదు, కల్యాణీ.

ఈ ‘జర్కన్‌’ ని తిరగ్గొట్టి పంపించావు. అది నీ లాకెట్‌లో చాలా ప్రశాంతంగా, నమ్రతతో మెరిసేది. కాని వస్తువుల పగ నామీద చాలా తీవ్రం.
ఎర్రటి మధ్యాహ్నపుటెండలో, వాల్తేరు స్టేషన్లో, దీన్ని వీరాస్వామికి తిరిగి ఇవ్వబోయాను. ఏదో పాతకలలోని సందర్భం అకస్మాత్తుగా ఎదురయినట్లు చూశాడు. తీసుకోలేదు. జ్ఞాపకం మెరిసి మాయమయిపోయింది. “అవసరం” లేదు అతనికి. నా దగ్గరే ఉండిపోయింది.
“కొన్నాళ్ళ నుంచీ ఒక “కల” నిజంలాగ వెంటాడుతూంది. ప్రతిరోజూ ఒక్కొక్కప్పుడు మెలకువగా ఉన్నప్పుడే వీరాస్వామి తాతయ్య దగ్గరికి నాలుగేళ్ల చిన్నారి మందుకని వస్తుంది. పొట్లాల మందు. తాతకి తెల్లటి గెడ్డం. ఎడమ జబ్బకి తాయెత్తు. వణుకుతూ, చాపమీద కూచుని, తెల్లటి పొట్లాలేవో కట్టిస్తాడు.” అన్నాడు, వీరాస్వామి విశాఖపట్నం బీచ్ ఇసుకలో పడుకుని నక్షత్రాలవేపు చూస్తూ. “ఆ పిల్ల నా ప్రజలు. వాళ్లకి మందులు ఇవ్వాలి నేను. కాని మందు ఏమిటో, అది ఎలా ఇవ్వాలో, దాని మోతాదేమిటో నాకు కలలో కనిపించలేదు.”

మళ్లీ అన్నాడు నా వేపు వెర్రిగా చూస్తూ “మీతో తీసుకుపొండి నన్ను. ”

“అలాగే” అన్నాను ఆలోచించకుండా.

కొంచెం సేపు ఆగి అన్నాడు. “రాలేను. ఇక్కడే ఉండాలి. ఏదో”
వీరాస్వామి నాతో రాలేదు. “జర్కన్‌”ని తీసుకోలేదు. నా దగ్గరే ఉండిపోయింది. అవకాశం వచ్చినా, నా దగ్గర నుండి వెళ్ళిపోలేదు.

నువ్వు ఆశ్చర్యపోయావు, దీన్ని నీకు ఇచ్చినప్పుడు. నీది ‘మిలియన్‌ డాలర్ల’ ఆశ్చర్యం కల్యాణీ! ‘స్త్రీత్వం’ నీలో పరిపూర్ణత చేకూర్చుకుందికి ప్రయత్నం చేస్తుంది. గొలుసులు గొలుసులుగా ఆలోచనలు మొదలుపెడతాయి నాలో. రావిచెట్ల నీడల్లో గొలుసులు దూరంగా గంగ వొడ్దుని రాసుకుంటూ, మెల్లగా మాట్లాడుకుంటూ ప్రవహిస్తుంటే, ఆకులు స్వగతం చెప్పుకుంటున్న సమయంలో, ఆ ఆకుల్లోంచి వెన్నెల మృదువుగా నీ ముఖం మీద పడుతూంటే ‘ఆత్మ’ దర్శనమే అవుతున్నట్లు అనిపించింది….
….చుట్టూ కనిపించే వస్తువులూ, నా అనుభవాలూ, వాంచలూ అన్నీ నీలోనే వున్నాయి. అవన్నీ కూడా నువ్వే. ఏ వస్తువు కదిలించినా అది నిన్ను కదిలించినట్లే. నేను వాటి వేపు చూస్తూ ఉంటే, అది నువ్వు చూస్తూ ఉన్నట్లే. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆ కళ్ల వెనుక కాదు. ఆ తలలోనూ కాదు. ఆ తలలో మెదలే చీకట్లలో కాదు. అక్కడ ఏమిటౌతుందో తెలియదు నాకు, తెలుసుకోవడం అసంభవం. నా జీవం, నా ఉనికీ, నాలో కాదు, కల్యాణీ, నా ముందు, ఇదిగో, ఇక్కడ, పైని, నా ముందునే వుంది. అక్కడే నువ్వు కూడా. నేనుండే ప్రపంచం మరేదీ కాదు, అదే నా ఆత్మ. ఇదంతా నా ఆత్మదే. అందులోనే నేనున్నాను. అందుకే నేను నీలోనే వున్నాను. ఇంతకంటే వేరే నిజం లేదు. నువ్వు…నువ్వు నీ శరీరం ముసుగుల వెనక ఎక్కడో లేవు. ఇక్కడ….ఇక్కడ, నీ కాన్‌షస్‌నెస్ అంతటితోనూ నన్ను అదుముతూ నన్ను అందులో ‘కలిగి’ ఉంచుతూ, నా సర్వస్వాన్ని అందులో మిళితం చేస్తూ….
….గొలుసులు

…గొలుసులు, విశాలంగా చెదరి, పెరిగే అవలయాలు, విష వలయాలు. వెన్నెల గంగ ఇంద్రజాలం… ఆకుల స్వగతంలో మార్దవంగా ప్రమత్తత.

నీ బాధ్యత నా భుజాల మీద వేసుకోలేదు. కల్యాణీ, వీరాస్వామి నాతో మొదట వెర్రిగా వస్తానన్నా నాతో రాలేదు. ఇలా చుట్టూ ఏర్పడే వలయాలు దాటుకుంటూ వెళ్తూంటే, యేదో బాధ. అకస్మాత్తుగా, అనుకోని సమయాల్లో బలంగా, గాఢంగా, లోతుగా, తన ఉనికిని వెక్కిరిస్తూ తెలియజేస్తూనే వుంది. కెరటాలలో కదిలేవి నీళ్ళేనా?
ఈ జర్కన్‌ నాతోనే వుండిపోయింది.

ఎందుకు తీసుకుంటాడు మళ్ళీ వీరాస్వామి దీన్ని? అమ్మి, కొన్నాళ్ళు కష్టం లేకుండా గడుపుతాడా? ఇంకెవ్వరికేనా ఇవ్వగలడా? దీనికీ అతనికీ యే విధమైన అనుబంధం లేదు. నాలుగేళ్ల పసిపిల్లకి యేదో మందు ఏదో మోతాదులో ఇస్తాడు.
నాగార్జున కొండ వెళుతూ వాల్టేరు స్టేషనులో వీరాస్వామి జ్ఞాపకం వచ్చి, మూడేళ్లలో ఏమి మార్పులు వచ్చేయో చూద్దామని దిగేను. వెన్నెలలో కొబ్బరిచెట్లు సంగీతం వింటున్నట్లు తలలూపుతుంటే, మేఘాల్లేని ఆకాశంలో నక్షత్రాలు పండుగ చేసుకుంటున్నాయి. సందు చివర్లో ఎవరిదో పెళ్ళి. భయంకరమైన శబ్ధంగా వస్తూంది రికార్డుల సంగీతం పాడయిన ఏంప్లిఫయర్స్‌లోంచి. పందిరిచుట్టూ పందిపిల్లలూ, పిల్లలూ. యేవి మనిషి పిల్లలో, యేవి పంది సంతానమో తెలియకుండా. నడుస్తూ పోయాను. బాగా జ్ఞాపకం లేదు, వీరాస్వామి పాక ఎక్కడ ఉందో. ఇదే అని అనుకున్నచోట చిన్న మిద్దె ఉంది. గేటుకి ఎర్రరంగు ఇనపగేటు. వీధిలో గేదె. వెనక్కి తిరిగి పెళ్ళి పందిరి దగ్గరగా వెళ్ళి నిలబడి చుట్టూ చూశాను. గాఢమైన రంగుల సిల్కు చీరలు, చాలా వేడిగా ఉంది. ఆరేళ్ల చిన్నారి, గట్టిగా లాగేసిన జడలు రెండిట్నీ ఆకుపచ్చ రిబ్బన్లుతో కట్టించుకుని, పందిరి చివర రాటకు ఆనుకుని పరధ్యాన్నంగా చూస్తూంది.
“వీరాస్వామి తాతయ్య తెలుస్తునా? ” అని అడిగాను.
చూపు మరల్చి, నా వేపు జాగ్రత్తగా చూస్తూ అంది ‘పైసియ్యి’. చెంపదెబ్బ తిన్నట్లనిపించింది. జేబులోంచి ఒక కాయిన్‌ తీసి ఇచ్చాను.

మెరిసే తెల్లటి అర్ధరూపాయిని చిన్న చేతితో పట్టుకుని, రెండుసార్లు అటూ ఇటూ తిప్పి, చూసి, హఠాత్తుగా యేదో జ్ఞాపకం వచ్చినట్లు వెనక్కి తిరిగి పంది పిల్లల్ని తన్నుకుంటూ, తోసుకుంటూ, సగం చీకటి సందులోకి పారిపోయింది. రెండు జడలూ చైతన్యం వచ్చినట్లు ఇటూ అటూ నవ్వుతూ ఎగురుతుంటే, సిల్కు పరికిణీ చుట్టూ నాట్యం చేస్తుంటే, చీకట్లోకి అదృశ్యం అయిపోయింది.
ఇస్త్రీ చేసిన గళ్ల లుంగీ వ్యక్తి ఒకడు దగ్గరగా వచ్చి అనుమానంగా చూశాడు. నా వేపూ, చిన్నారి పారిపోయిన సందుచివర వేపూ. వీరాస్వామిని గురించి అడిగాను.
ఎవరికి ఎవరు కాపలా అని హోరు పెట్తోంది రికార్డు. చుట్టూ గోలలో, వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు పాట పాడుతుంటే, తనని తాను వెక్కిరించుకుటున్నట్లు ధ్వని వినిపిస్తోంది. కొబ్బరిచెట్లు వెన్నెలలో తలలూపుతుంటే, ఎవరికి ఎవరూ కాపలా లేరనో ఉన్నారనో వెక్కి వెక్కి ఏడుస్తూంటే, మనుషులు పందుల్ని కసిగా కర్రతో అప్పుడప్పుడు బాదుతూంటే, ఎర్రగళ్ల లుంగీ వ్యక్తి వీరాస్వామి గురించి చెప్పాడు.
బర్మా ప్రభుత్వం చిన్నప్పుడు వీరాస్వామి సాహసానికి మెడల్ ఇచ్చింది. కాని ఆ పేతని కాల్చిన దావానలంలో వీరాస్వామి ఏడుమందిని రక్షించినా, రక్షిస్తూ ఒళ్లంతా కాలి మసి అయిపోయాడు.

‘బతికున్నప్పుడు గీరగాడని ఒగ్గేసినాం. సచ్చి భస్మం అయ్యాక ఆణ్ణి తలసుకోని రోజు నేదు. పట్టుమని ముప్ఫయి యేళ్ళు నేవు’ అన్నాడు ఎర్రటి కళ్ళల్లో కన్నీరు కదులుతుంటే.
గంగ అవతలి ఒడ్డున దీపాలు ఒకటీ ఒకటీ వెలుగుతున్నాయి, మౌనంగా, నీలిగా ప్రవహిస్తూంది గంగ.

ఇక్కడనుంచి కూడా వెళ్ళిపోవాలి, ‘వృత్తి’ పదును పోయింది. యాత్ర సాగాలి. ఈ సంధ్య వెలుగులో – ధూళితో నిండిన బాట తెల్లగా, సున్నితంగా తెలియని దూరంలోకి అదృశ్యమౌతోంది.

‘ఆలోచన’కీ’ తెలుసుకోడాని’కీ మధ్య అఖాతం. ఆలోచిస్తే తెలియదు. తెలియడానికి ఏమిటి చెయ్యడం?
‘జెన్‌’ సూక్తి ఒకటుంది, మాండో రూపంలో. టకటక మని వేసిన ప్రశ్నలకు ఠకఠకామని ఇచ్చిన జవాబులు’ మాండో’లు.

‘సీసాలో బాతు ఉంది. చంపకుండా, గాయం తగలకుండా ఎలా తీస్తావ్?’

‘ఆలోచించి’ లాభం లేదు. దానికి ఒకటే జవాబు: ‘అదిగో, అదిగో? పైకి వచ్చేసింది.’ ఆశ్చర్యార్ధకాలు అక్ఖర్లేదు. ‘ఆలోచన’కీ, ‘తెలుసుకోడాని’కి మధ్య ఉన్న అఖాతాన్ని వంతెన వేసి దాటలేవు. ఒక్కసారి గెంతాలి. దుమికితే, దుమకగలిగితే బాతు పైకి వచ్చేస్తుంది. గెంతగలిగితే ‘తెలుసు’కుంటావు. కాని మానవమాత్రులకు సాధ్యమేనా?
వలయాన్ని దాటుకుని వెళుతూంటే, దూరంగా అదృశ్యమౌతున్న బాట చివరకు వస్తూంటే, అఖాతం దగ్గరౌతున్న కొలదీ జ్ఞాపకాలు, ఆలోచనలు, జ్ఞాపకాల భారాలు, ఆలోచనల గొలుసులు తేలికయి బలహీనం అయి, అఖాతంలో హోరుపెట్టే జలపాతం తెలుపులు, నురగల తెలుపులు రాళ్లమీద హోరు, వినిపిస్తుంటే, కనిపిస్తుంటే, చెవులలో ఈ అఖాతం భయంగా ఆనందంగా గర్జిస్తూంటే, అఖాతం అంచు దగ్గరకు వచ్చినప్పుడు అవతల ఒడ్డుకి గెంతి వేయగలననీ, మానవమాత్రుణ్ణి కాదనీ…
కాని,కాని.., అసలు మానవుణ్ణేనా అని కూడా అనిపిస్తూనే ఉంది. లోపల లోలోపల ఎంతో లోతుల్లో..

About త్రిపుర

త్రిపుర అసలు పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (RVTK Rao). 2-9-1928 న గంజాం జిల్లా పురుషోత్తమపురంలో(ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది) జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీషు లిటరేచర్ చదువుకున్నారు. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా మదనపల్లి, జాజ్ పూర్, బర్మా ఇంకా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాల్లో పని చేసారు. రిటైరై గత ఇరవై యేళ్ళుగా విశాఖపట్నంలో ఉంటున్నారు. "త్రిపుర కథలు" అనే కథా సంకలనం, "బాధలు - సందర్భాలు", "త్రిపుర కాఫ్కా కవితలు" కవితా సంకలనాలు, segments అని ఆంగ్ల కవితలు (వీటిని వేగుంట మోహనప్రసాద్ తెలుగులోకి అనువదించారు) పుస్తకాలుగా వచ్చాయి. అనితర సాధ్యమైన రీతిలో మనిషి అంతరపు లోతుల్ని చిత్రించి కేవలం పదిహేను కథలతో తెలుగు కథకి ఒక కొత్త Dimension తెచ్చిన కథకుడు త్రిపుర. కథలో autobiographical elements తో పాటు ఒకరకమైన confession ఉండాలని బలంగా నమ్ముతారు. తను రాసిన కథల్లో "భగవంతం కోసం", "జర్కన్" తనకి ఇష్టమైనవట. మదనపల్లిలో ఉండగా త్రిపుర జిడ్డు కృష్ణమూర్తికి పెర్సనల్ శిష్యుడు కూడా!
This entry was posted in కథ. Bookmark the permalink.