మనకున్న అరవైనాలుగు కళల్లో చోరకళ ఒకటి. మిగతా కళల్లో నాట్యం, శిల్పం, చిత్రలేఖనం తదితరమైనవి ఇంద్రియాలకు, తద్వారా మనసుకు ఆహ్లాదం చేకూరుస్తాయి కాబట్టి వాటిని కళలు అన్నందుకు మనకే తంటా లేదు. చౌర్యం అనగానే ఇదేమి కళ అనే ప్రశ్న రావాలి. పైగా చౌర్యం అనగానే చోరుని గురించి కాక, నష్టపోయిన వాని గురించిన ఆలోచనలు ముప్పిరిగొనడం కద్దు.
మీ ఇంట్లో దొంగతనం జరిగిందా? నీ పర్సు కొట్టేశారా? అయ్యో.. ఎప్పుడు, ఎలా జరిగింది? -సానుభూతి! అంతే కానీ, ఆహా, ఆ దొంగ ఎవడో గానీ ఎంత సమర్థంగా కొట్టేశాడు? ఎంత బాగా పని నిర్వహించాడు? ఇలాంటి ప్రశ్నలు రావు. వచ్చినట్లైతే వాడు జీనియస్సు, పిచ్చివాడు లేదా మహా జ్ఞాని, తాత్వికుడు అయి ఉండాలి.
కానీ, ప్రతి విషయానికి మినహాయింపు ఉంటుంది, ఉండాలి. అదొక ప్రపంచ నియమం.
చిన్నతనంలో చందమామలోనో బాలజ్యోతిలోనో చదువుకున్న కథ ఒకటి గుర్తొస్తూంది. ఒక పోకిరీ పిల్లల గుంపు రాజావారి మామిడితోటలో మామిడికాయలు దొంగతనంగా కోసుకుందుకు ఎలానో జొరబడ్డారు. పేదపిల్లకాయలు కదా పాపం! ఇళ్ళల్లో మామిడిపళ్ళు కొనే తాహతు లేదాయె.
పాలేరు దూరం నుండి చూసి పిల్లల వెనుక బడ్డాడు. పిల్లలందరూ హడావిడిగా మామిడి కాయలేఱుకుని పారిపోయేరు. ఆ గుంపులో ఒకబ్బాయి మాత్రం పట్టుబడిపోయేడు పాపం! వాడిని పాలేరు రాజావారి వద్దకు తీసుకొచ్చేడు. ఆ అబ్బాయి భయంతో బిక్కచచ్చి ఉన్నాడు. రాజావారు గుబురు మీసాల చాటున గుంభనంగా నవ్వేరు. ఒక గంప మామిడి పళ్ళు తెప్పించేరు. భయంతో వణికి పోతున్న పిల్లవాడి ముందు పెట్టేరు. "ఊ తినరా" ఇవన్నీ తింటేనే నీకు విడుదల అన్నారు. అంతే.. పిల్లవాడికి ఒక్కసారిగా మేను ఉప్పొంగింది. ఇందాకటి పిల్లకోతి ఆంజనేయావతారం దాల్చేడు. విశ్వరూపం ఎత్తి ఆ గంపెడు పళ్ళు లాగించేడు. రాజావారి గుబురుమీసాల చాటు నవ్వు పెదవులమీదికి జారింది. మరో గంప తెప్పించి, ఆ పిల్లవాణ్ణి భుజం తట్టి పాలేరుతోడుగా ఇంటికి సాగనంపేరు. పిల్లవాని తల్లిదండ్రులు జరిగింది విని భయపడుతున్నారు. ఇంతలో జైత్రయాత్రలో జయించిన రాజులా అబ్బాయి, యాగాశ్వంలా వెనుక పాలేరూ వచ్చేరు. ఆ తల్లిదండ్రుల కళ్ళలో కాంతి పిల్లవాని చిఱునవ్వై వెలిసింది. దొంగతనానికి ఒక నగిషీ కుదిరింది.
మనలో మనమాట. ఈ కథ ముల్లా నసీరుద్దీన్ కథల్లో ఒక కథకు కాపీ (చోరీ) అని అభిజ్ఞవర్గాల భోగట్టా.
మరో కథ. అదొక నీరవ నిశీధి. ఒకానొక జెన్ గురువు ఆశ్రమంలోకి దొంగ జొరబడ్డాడు.ఆ దొంగకు పాపం కొన్ని రోజులుగా పని జరుగట్లేదు. ఆకలిదప్పులతో ఉన్నాడు. గురువుగారి గదిలోకి రాగానే నీరసమెక్కువై పడిపోయేడు. గురువుగారు ఆ చప్పుడుకు నిద్రలేచారు. చూచారు. దొంగమీద అంతులేని జాలి కలిగిందాయనకు. ఇంతలో అలికిడి విని శిష్యులు లేచేరు. గురువు గారు శిష్యులతో నిశ్శబ్దంగా, దొంగకు నిద్రాభంగం కావించవద్దని చెప్పి, వాడు నిద్రలేచిన తర్వాత భోంచేస్తాడేమోనని భోజనం తెప్పించేరు. తమ శిష్యుల వద్ద ఉన్న సరుకులు అన్నీ ఒకచోట మూటకట్టించేరు. ఏవీ ఎఱుగనట్టు అందర్నీ పంపి నిద్రకుపక్రమించారు. దొంగ నిద్ర లేవనే లేచేడు. తన అదృష్టానికి పొంగిపోయేడు. ఆశ్రమంలో ఎవరూ తనను చూడలేదు. పైగా సొమ్మంతా పక్కనే ఉంది. ఆ మూటనెత్తుకున్నాడు. పక్కన భోజనం ఊరించింది. చీకట్లో చేతులు పెడితే ఏదో తెల్లని పొడి మొదటిగా తగిలింది. అదేవిటోనని నాలుకకు తగిలించి రుచి చూసేడు. ఇంతలో బయట నగారా మోగింది. భోజనం సంగతి మాని, సొమ్ముతో బయటకు పరిగెత్తేడు. మఱుసటి రోజు ఆ దొంగను రాజావారి భటులు పట్టుకుని రాజు ముందు హాజరు పర్చేరు. చేసింది దొంగతనం, పైగా గురువు గారి ఆశ్రమంలో. గురువునూ రప్పించేరు. అభిప్రాయం అడిగేరు. గురువు, "రాజా, ఆ దొంగ దొంగతనానికి వచ్చిన మాట నిజం, కానీ అతడు మా దగ్గర దొంగతనం చేసింది అబద్దం. నేనే ఆతనికి దానమిచ్చేను, అతణ్ణి శిక్షించకండ"న్నాడు. రాత్రి బయటనుండి తెప్పించిన భోజనంతో సహా ఆనవాళ్ళు చూపేరు. దొంగమనసు కరిగింది. ఎంతైనా గురువు గారి ’ఉప్పు’ తిన్నాడు. (గురువు గారింట్లో తను రుచి చూసింది ఉప్పు) తనను శిక్షించమని రాజును అర్థించేడు. ఆ గురువుకు రాజు, దొంగా ఇద్దరూ శిష్యపరమాణువులుగా మారి తరించిపోయేరు.
కథ జపాను నుంచి కంచికి..
మన భారతీయ సాహిత్యంలో చౌర్యాన్ని కళగా గుర్తించిన సందర్భాలు మృచ్ఛకటికం, దశకుమారచరితమ్ కావ్యాలలో కనిపిస్తాయి.
మృచ్ఛకటికకర్త చౌర్యం గురించి తన చోర పాత్ర శర్విలకునితో ఏమని చెప్పిస్తాడో కాస్త చూద్దాం.
విశ్వస్తేషు చ వంచనాపరిభవశ్చౌర్యం న శౌర్యం హి తత్ |
స్వాధీనా వచనీయతాపి హి వరం బద్ధో న సేవాంజలిః
మార్గో హ్యేష నరేంద్రసౌప్తికవధే పూర్వం కృతః ద్రౌణినా ||
"చీకట్లో చేసేపని కాబట్టి నీచమైనదని, వంచనతో కూడుకున్నది కాబట్టి శౌర్యం కాదని లోకులు అనవచ్చుగాక. అయితే ఇందులో ఎదుటివానికి తల ఒగ్గి చేసే దాస్యత్వం లేదు. అంతెందుకు, అశ్వత్థామ అంతటి వాడు సౌప్తికవధకు ఇదివరకు ఇదే మార్గం అవలంబించేడు."
చౌర్యం ఒక self-employment అని ఆనాడే గుర్తించేడతను. అంతటితో ఊరుకోడా దొంగ. ఎవడు కన్నం వేస్తే ఉజ్జయినీవాసుల దిమ్మతిరిగిపోతుందో వాడే శర్విలకుడు అనే చందాన కన్నం వేస్తానంటాడు. అన్నంతపనీ చేస్తాడు. పొద్దున ఆ ఇంటి యజమాని చారుదత్తుడు నిద్దుర లేవగానే ఆయన ఆ కన్నం చూసి ఇలా అనుకుంటాడు.
ఉపరితలనిపాతితేష్టకో2యం
శిరసి తనుర్విపులశ్చ మధ్యదేశే |
అసదృశ జన సంప్రయోగభీరోః
హృదయమివ స్ఫుటితం మహాగృహస్య ||
"ఈ కన్నం చూడదగ్గది సుమా! గోడ ఉపరితలం నుంచి ఒక్కొక్క ఇటుక తొలగిస్తూ పోయాడు. పైన సన్నగానూ, మధ్యలో విశాలంగానూ ఉంది. కానివాళ్ళు నివసించడంతో భయపడ్డ ఒక సుందరమహాభవనం పగిలిన గుండెలా ఉంది"
ఇంత చక్కగా కన్నం వేసిన దొంగ నా ఇంటికి వచ్చి వట్టిచేతులతో వెళ్ళలేదు కదా అని సంతోషిస్తాడతను!
మొదటి కథలో కుఱ్ఱవాడు – కడు పేదవాడు. తన ఆశ తీర్చుకోవడం కోసం తోటలోకి జొరబడ్డాడు.
రెండు – ఇక్కడా దొంగ పేదవాడు. చదువులేదు కాబట్టి దొంగతనం వాడి వృత్తి అయింది. పెళ్ళాం, పిల్లల పోషణ కోసం ఈ పని చేస్తూ ఇక్కడ జొరబడ్డాడు.
మూడవ కథలో శర్విలకుడి దొంగతనం వెనుక ఉద్దేశం తన చెలికత్తె, వసంతసేన యొక్క క్రీతదాసి మదనికను విడిపించడం మాత్రమేనని రూపకకర్త పేర్కొన్నాడు.
ఈ కథలనుండి మనకు చూచాయగా తెలిసొస్తున్నదేమంటే, మనుషులలో సహనం, క్షమ అనేవి ఉన్నంతవరకూ, చెడుగా కనిపించే విషయాన్ని కూడా భరించే ఔన్నత్యం అలవడుతుంది. చెడుగా కనిపించేపని నిజమైన చెడు కానవసరం లేదు. ఆర్తి, నిస్సహాయత, ఆశ ఆయా చర్యలకు ప్రేరణ. సహనం, క్షమ, వలన మనిషి తను ఎదగడమే కాక, సాటిమనిషిని కూడా ఎదగనివ్వగలడు.
కళకు వివిధ రూపాలు. నాట్యకళనే చూస్తే, నాట్యం, వేఱు, నృత్యం వేఱు (నాట్యం రసాశ్రితమైతే, నృత్యం భావాశ్రితమని సూత్రకారుడి ఉవాచ), తాండవమొకటి, లాస్యమ్ మరొకటి, నృత్యరీతులు అనేకం, కూచిపూడి, కథక్, భరతనాట్యం, కథకళి, మణిపురి, ఒడిస్సీ….మళ్ళీ కథకళిలో భాగంగా మోహినీయాట్టం, కృష్ణాట్టం, తిరనోట్టం, కూడియాట్టం, తుల్లాల్…ఇలా ఒకదానిపై మరొకటి.
ఇలా కళలన్నీ కళకళలాడిపోతుంటే, చౌర్యంలో కూడా వివిధ రూపాలు చూడవలసిన బాధ్యత, మనమీద ఉంది. ఈ బాధ్యతను క్రితం తరంలో కొందరు సున్నితంగానూ, ఈ తరం వారు సిగ్గు లేకుండానూ (పడకుండా కాబోలు) నిర్వర్తిస్తున్నాయి.
సంజీవదేవ్ గారింట్లో దొంగతనం జరిగిందట. అప్పుడు చలం గారు సంజీవదేవ్ గారిని పరామర్శిస్తూ, దొంగను గుర్తు పట్టావా? లేక మృచ్ఛకటికంలో చారుదత్తుడిలా అతడి దొంగతనం మెచ్చుకుంటూ నిలబడిపోయావా అని ఉత్తరం రాసేరట. అదే ఉదంతం జరుక్ శాస్త్రి గారి పరామర్శగా మరోచోట వచ్చింది. చోరకళ మరో రూపం కనబడటం లేదూ!
ఇలాంటివి మరికొన్ని. ఎవరో అబ్బాయిని వాళ్ళమ్మ రామకృష్ణపరమహంస వారి దగ్గరకు తీసుకొచ్చిందిట. మా అబ్బాయి అదే పనిగా బెల్లం తింటున్నాడు స్వామీ కాస్త చెప్పి మాన్పించండి అని. ఈయన సరేనమ్మా రెండువారాల తర్వాత రమ్మన్నాడట. ఈ రెండువారాల్లో ఈయన ఆ అలవాటు మానడం కోసం కృషి చేశాడట. ఇదే కథ మీరు గాంధీ గారి ఉదంతంగా విని ఉంటే ఆ తస్కరశిఖామణికి వీరతాడొకటి వేసేయండి.
తెలుగు సాహిత్యంలో స్ఫూర్తి/ప్రేరణ సందర్భాలకు కొదువే లేదు. కావ్యప్రబంధసాహిత్యాలలో ప్రతి కవీ ఇతర కవులపై ఏదో విధంగా ప్రభావం చూపడం, ప్రభావితం చెందడం రెండూ ఉన్నాయి. అలా ప్రభావితం చెందడంతో సాహిత్యం కొత్తపుంతలు తొక్కి, సాహిత్యవికాసానికి దోహదపడింది కాబట్టి ’అనుసరణ’ కూడా కళారూపంగానే చెప్పుకోవచ్చు.
మరోపక్క.. స్ఫూర్తి, ప్రేరణ, అనుకరణ, కాపీరైటు వయొలేషను, ఉదాత్త పాత్రలకు సొంత వ్యాఖ్యానాలు, ప్లాజరిజమ్ … ఇలా చౌర్యాన్ని వివిధరంగాలకు విస్తరింపజేసి కొత్తపొంతలు తొక్కిస్తున్న ఘనతా నేటి కాలానిదే.
పేటెంట్ అనబడే చౌర్యప్రక్రియ కూడా యథాశక్తి విషవీచికలను చిమ్ముతోంది నేడు. ఎవడు మొదట తెగబడితే వాడిదే భోజ్యం. ఏదో విధంగా విమానం నుండి సామాన్యుని నోటి కూడు వరకూ పేటెంటు చేసి పారేస్తే ఆ తర్వాత దక్కినవాడికి దక్కినంత.
చౌర్యం కళ రూపాన్ని కోల్పోయి ఒక దౌర్భాగ్యంగా రూపుదిద్దుకుంటూంది. ఆ దౌర్భాగ్యాన్ని అరికట్టలేకపోయినా, గుర్తించడం మన కర్తవ్యం.
గౌతమబుద్ధుని పంచసీలలో రెండవ నియమం ఇది.
(చౌర్యానికి పాల్పడను అన్న నియమాన్ని పాటింతును)
అదిన్నాదానం అంటే ఇవ్వనిదాన్ని తీసుకొనడం. అడవిలో పండు రాలిపడితే దాన్ని కూడా ఒకరివ్వకుండా భిక్ఖువు తీసుకోరాదు. ఇదే సూత్రాన్ని లోకానికి అన్వయిస్తే – "మోసం, వంచన, కాపట్యం, దౌర్జన్యం వంటి దుర్మార్గపద్ధతుల ద్వారా సంపాదించిన సొమ్ము క్లేశానికి దారితీస్తుంది" అని తథాగతుని భాష్యం.
చౌర్యాన్ని మన మనసుల్లోంచి తుడిపేద్దాం. చోరకళను గౌరవిద్దాం.
బహుదానందం మీ రచనా శైలి, ద్రుష్టాంతాల వివరణ ప్రస్తావణ, కొనసాగింపు, శుభం.
సురేష్
భారతి గారి చోరకళ కధలు అద్భుతంగా ఉన్నాయి. మరి ఆ లెఖ్ఖన నవయుగ ఘనచోరులకు తినడానికి కారాగారములలో అన్నము బదులు బంగారము పెట్టా లేమో !