‘తెకాప్లె’ అను బూర్జువా కథ

మీకు అ.భౌ.వాదం, అంటే, అతితార్కిక భౌతికవాదం తెలుసా?’
‘తెలుసు’
‘తెలిస్తే ఇలా మాట్లాడేవారు కారు’
‘తెలుసంటే సిద్ధాంతంగా తెలుసు. కానీ నాకు దేనిమీదైనా నమ్మకం కుదరడం కష్టం

అనుమాన్లు లేచి నుంచున్నాడు.

‘కామ్రేడ్స్, నన్ను కొంచెం మాట్లాడనిస్తారా?’ అని అడిగాడు.
‘ఏం, అప్పుడే ఓటమిని అంగీకరిస్తున్నావా? ఇంకా రెండు కేసులున్నాయి. ఈలోగానే ఓటమిని అంగీకరిస్తున్నాను అంటే మాట్లాడొచ్చు’ అన్నాడు లెస్టామా.

‘అవును, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను’ గట్టిగా అన్నాడు అనుమాన్లు.
ఒక్కసారిగా ఆడిటోరియం అంతా కరతాళధ్వనులతో నిండిపోయింది.
‘మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు’ అరిచారెవరో.
‘అవును కామ్రేడ్స్, నేను ఓటమిని అంగీకరిస్తున్నా’ ఇంకా గట్టిగా అన్నాడు అనుమాన్లు.
‘అయితే పో, పో,  వెళ్ళిపో’ అన్నారు కొందరు.
‘పో, పో, వెళ్ళిపో’ కేకలు మిన్నుముట్టాయి, రిథమిక్ గా.
‘వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ ఉత్తినే వెళ్ళిపోవాలని లేదు. మా భూమ్మీద కూడా మీ ప్లెటోపియా అవతరించాలి. దానికోసం నేనేం చెయ్యాలో తెలుసుకుని వెళ్ళాలనుకుంటున్నాను.’

ఒక్కసారిగా ఆడిటోరియంలో అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ‘బ్రావో, బ్రావో’ అని అరుస్తున్నారు కొంతమంది.
‘నిశ్శబ్దం’ అన్నాడు లెస్టామా. అతని ముఖంలో విజయగర్వం తొణకిసలాడుతోంది.
‘కామ్రేడ్స్, టూరిస్టుగా వచ్చిన భూమి జీవి అనుమాన్లు ఓటమిని అంగీకరించడం చాలా సంతోషం. ఇతను, ఇతని వర్గం వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని, వచ్చి తాము కూడా కార్స్కిస్టులుగా మారాలని, మారి తమకి చేతనైనంతమందిని మార్పించాలని, ఆ విధంగా భూమ్మీద మన ప్లెటోపియాని అవతరింపజేయాలని ఆశిస్తూ అనుమాన్లని అభినందిస్తున్నాను’ అన్నాడు.

‘కామ్రేడ్స్!’ మాట్లాడడం మొదలుపెట్టాడు అనుమాన్లు.
‘నేను ఇక్కడికొచ్చేటప్పుడు కొన్ని అనుమానాలతో వచ్చాను. కానీ ఇక్కడ మీ జీవితాలు, పరిస్థితులూ చూశాకా నా అనుమానాలు చాలామటుకు పటాపంచలైపోయాయి. స్వర్గం అంటూ ఏదైనా ఉంటే అది ఈ ప్లెటోపియానే’ అన్నాడు.
మళ్ళీ గట్టిగా కరతాళధ్వనులు.
‘కానీ కామ్రేడ్స్, నాకింకా కొన్ని అనుమానాలు మిగిలిపోయాయి. మీరు దయచేసి నా వీసా గడువు మరో రెండ్రోజులు పొడిగిస్తే మీ సమాజం గురించి ఇంకా తెలుసుకుని, నా సందేహాలు తీర్చుకుని, పూర్తి స్థాయి కార్క్సిస్టుగా మారి వెళ్ళిపోతాను. దయచేసి అనుమతించండి’ అన్నాడు అనుమాన్లు.

అందరూ మళ్ళీ పెద్దయెత్తున చప్పట్లు కొట్టారు. ఈలలు వేశారు. లెస్టామా కొంచం ఆలోచించి అన్నాడు. ‘కామ్రేడ్స్, ఇప్పటికే సాయంత్రం అయింది. అనుమాన్ల వీసా గురించి కాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజాకోర్టును రేపటికి వాయిదా వేస్తున్నాం’ అని ప్రకటించాడు.

‍‍‍_____
ఆ రోజు సాయంత్రం కేబినెట్ మీటింగ్ లో అనుమాన్లకి మరొక్క రోజు కన్నా ఎక్కువ వీసా గడువు పొడిగించకూడదని నిర్ణయించారు. అతను పుట్టిస్తున్న థాట్ పొల్యూషన్ వల్ల చాలా శ్రమయూనిట్లు వృధా అయిపోతున్నాయనీ, అందువల్ల ఒక్కరోజు కన్నా ఎక్కువ అతన్ని ఉంచుకోకూడదనీ అందరూ అభిప్రాయపడ్డారు. ఆ ఒక్కరోజూ కూడా అతన్ని ప్లెటోపియాలో తిరగకుండా గృహనిర్బంధంలో ఉంచాలని కూడా నిర్ణయించారు. మర్నాడు రోజంతా అతనితో మాట్లాడి అతని అనుమానాల్ని తీర్చడానికి ఇద్దరు మేధావుల్ని కూడా నియమించారు.
ఈ సంగతి తెలిసాకా ఊళ్ళో తిరగడానికి లేదని కొంచం నిరుత్సాహపడ్డాడు అనుమాన్లు. సెంట్రల్ ఆఫీసులోనే ఒక రూములో అతనికి పడక ఏర్పాటయింది. బయట సెక్యూరిటీ. రోజంతా బుర్ర వేడెక్కి ఉండడం మూలాన తొందరగా పడుకున్నాడు అనుమాన్లు. పొద్దున లేచి, తెమిలి, బ్రేక్ ఫాస్ట్ కూడా అయ్యాకా ఒకమ్మాయి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంది. పేరు మోస్క్వా. ఇంటలెక్చువల్ ఆఫీసులో కోఆర్డినేటర్ గా పనిచేస్తోంది.
ఒక చిన్న లైబ్రరీలాంటి రూములోకి తీసుకుపోయింది. టేబుల్ వెనక కుర్చీలో కూర్చుని అతన్ని ముందు కూర్చోమని చెప్పింది. కాఫీ ఆఫర్ చేసింది. ‘ఇప్పుడు చెప్పండి కామ్రేడ్, ఏమిటి మీ అనుమానాలు?’ అని అడిగింది. ‘ఏం లేదు, మోస్క్వా. మీ ప్లెటోపియా మా భూమి మీద అవతరించాలంటే ఏం చెయ్యాలి?’

‘మా ప్లెటోపియా మీ భూమిమీద అవతరించడం అనివార్యం. అరచేతులు అడ్డుపెట్టి దాన్ని ఎవరూ ఆపలేరు’ అంది మోస్క్వా ఆవేశంగా.
బల్లమీద పెట్టిన చేతులు చటుక్కున వెనక్కి తీసుకున్నాడు అనుమాన్లు.
మళ్ళీ తనే అంది. ‘మీవంతుగా మీరు కార్క్సిస్టుగా మారితే మంచిది.’
‘దానికి నేనేం చెయ్యాలి?’

‘మొదటగా మీరు భూమ్మీద శ్రామిక వర్గం, అంటే ప్రధానంగా బీదలు పడుతున్న బాధల్ని దగ్గరనుంచి చూడాలి. వాళ్ళు ఎందుకంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించాలి. మరోపక్క పెట్టుబడిదారులు, అంటే ధనికుల దగ్గర అంత సంపద ఎందుకు మూలుగుతోందో తెలుసుకోవాలి. ఇందులోని అన్యాయాన్ని గమనిస్తే మీకు రక్తం ఉడికిపోవాలి. అప్పుడు, ఆ విధంగా మీ హృదయం శ్రమజీవుల పట్ల‌ సానుభూతితో పరిశుద్ధమయ్యాకా మళ్ళీ కార్క్సు రాసిన అరుణమ్ చదవండి. వద్దనుకున్నా మీరు కార్క్సిస్టు అయిపోతారు.’

‘మోస్క్వా, మీరేమనుకోనంటే నేనొక మాట చెప్తాను. నేను శ్రమజీవుల బాధని పట్టించుకోని పాషాణ హృదయుణ్ణి కాను. బీదల అభ్యున్నతికోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానుభావుడు ఒకాయన నాకు గురువు. ఎప్పటికైనా ఆయన చూపిన మార్గంలో నడుద్దామనేదే నా జీవితాశయం.’
‘ఆయన కార్క్సిస్టా?’
‘కాదు. గురువుగారు.’
‘అంటే?’
‘ఆయన ఒక సన్యాసి. ఒక ఆశ్రమాన్ని స్థాపించి, జనాన్ని పోగుచేసి పేదలకి సేవ చేస్తూ ఉంటాడు. అనేకమంది ఆయన బోధలవల్ల ప్రేరణ పొంది దానధర్మాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.’

‘చూడండి అనుమాన్లూ. ఇలాంటి పైపై పూతల్లాంటి పనులవల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మీరు ఒకసారి అరుణమ్ చదివినా మీకు కార్క్సిజం ఏమాత్రం బోధ పడినట్టు లేదు. అసలు మీతో మాట్లాడ్డం కూడా నాకు టైము వేస్టనిపిస్తోంది. మీరు దయచేసి ఇక్కడినుంచి వెళ్ళిపోండి. మీ వర్గంలో పుట్టినవాళ్ళు కార్క్సిస్టులు అవడం కష్టం.’
‘అలా అనకండి మోస్క్వా. నాకూ శ్రమజీవుల పట్ల సానుభూతి ఉందనడానికే ఇదంతా చెప్పాను. నాకు అరుణమ్ అర్థమైంది. మీ ప్లెటోపియాకి వచ్చాకా ఇంకా కనువిప్పైంది. మా భూమ్మీద కూడా కార్క్సిజం నిజంగా ఆచరణలోకి వచ్చి, మా భూమికూడా మీ ప్లెటోపియాలాగా మారాలనే నా కోరిక. అందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందామనే నా ప్రయత్నం. నిన్న జరిగిన ప్రజాకోర్టు నాకు దిమ్మతిరిగేలా చేసింది. ఇక్కడి ప్రజల్లోని మెజార్టీకి కార్క్సిస్టు చైతన్యం పరిపూర్ణంగా ఉందని అర్థమైంది. అదే చైతన్యం భూమ్మీద కూడా మెజార్టీకి కలగాలంటే ఏమి చెయ్యాలి?’
‘భూమ్మీద మెజార్టీ కార్మిక వర్గం. వాళ్ళ శ్రమని మైనారిటీ అయిన‌ పెట్టుబడిదారీ వర్గం దోచుకుంటోంది. కాబట్టి ఎప్పటికైనా మెజార్టీ అయిన కార్మిక వర్గం కార్క్సిజాన్ని తెలుసుకుని కళ్ళు తెరుచుకోవడం ఖాయం. మీరేమీ బెంగ పడకండి’ అంది మోస్క్వా.
‘‍అందరికీ కళ్ళు తెరుచుకోవాలంటే అందరూ అరుణమ్ చదివి అర్థం చేసుకోవాలిగా. అప్పుడేగా వాళ్ళలో కార్క్సిస్టు చైతన్యం కలిగేది. మా గురువుగారు కూడా గట్టిగా నమ్మిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తీ, ప్రతి రోజూ గాయత్రీ మంత్రం చెయ్యాలని. అలా చేస్తే అందరిలోనూ చైతన్యం వికసించి, అందరూ మంచిగా, సమానంగా మెలుగుతారుట. అప్పుడీ ఆర్థిక అసమానతలన్ని అవే మాయమైపోతాయిట. నేనూ కొంతకాలం ప్రచారం చేశాను కానీ నమ్మకం కుదరక మానేశా. పోనీ గాయత్రీ ప్రచారం బదులు అరుణమ్ ప్రచారం చెయ్యడం మొదలుపెట్టనా?’
ఒక్క క్షణం నివ్వెరపోయింది మోస్క్వా. ఆమె ముఖం ఎర్రబడింది. అనుమాన్లు వేళాకోళం చేస్తున్నాడని అనుకుంది. తీక్ష్ణం గా అతనికేసి చూసింది. ‘మిస్టర్, మీరు ఈ జన్మకి మారరు. తక్షణమే మీరు ఇక్కడినించి వెళ్ళిపోవడం మంచిది’ అని లేచి నిలబడింది.

అనుమాన్లు దీనంగా ఆమెకేసి చూశాడు. ‘క్షమించండి మోస్క్వా. మిమ్మల్ని నేను వేళాకోళం చెయ్యడం లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మతం మీద పూర్తిగా నమ్మకం కుదరకే కదా ఇక్కడికొచ్చింది. నేను అరుణమ్ చదవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ప్లీజ్ నన్ను నమ్మండి’ అని బతిమాలుతూ అన్నాడు.
కొంచం మెత్తబడింది మోస్క్వా. ‘మీకు అ.భౌ.వాదం, అంటే, అతితార్కిక భౌతికవాదం తెలుసా?’
‘తెలుసు’
‘తెలిస్తే ఇలా మాట్లాడేవారు కారు’
‘తెలుసంటే సిద్ధాంతంగా తెలుసు. కానీ నాకు దేనిమీదైనా నమ్మకం కుదరడం కష్టం’.

‘చూడండి. మీరు ఎప్పటికీ కార్క్సిస్టు కారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎంత చదివినా వర్గ స్వభావాన్ని వదులుకోలేరు. నా టైము దండగ చేస్తున్నారు.’ అంది మోస్క్వా.
‘లేదండీ. నేను భౌతికవాదిగా మారగలను. అంటే, ఈ సమాజంలో, ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికీ కేవలం భౌతికకారణాలు మాత్రమే ఉన్నాయని నమ్మగలను. ఆ నమ్మకమే ఆధారంగా నాస్తికుణ్ణి కాగలను. హేతువాదినీ కాగలను. అయినా కార్క్సిజం మీద నాకు నమ్మకం కుదరడం లేదు. మీ ప్రజల్లాగా మా భూమ్మీద ప్రజలందరిలోనూ కూడా కార్క్సిస్టు చైతన్యం ఉదయిస్తుందని నమ్మలేకపోతున్నా.’

‘ఎందుకనో?’

‘చూడండి. నామటుకు నేను ఒక్కణ్ణీ భౌతికవాదిని కాగలను, హేతువాదిని కాగలను. కానీ ఈ ప్రపంచంలో అందరూ నాలాగే దేముణ్ణీ, దయ్యాన్నీ నమ్మకూడదు, అందరూ నాలాగా హేతువాదులే కావాలి,  చైతన్యవంతులు కావాలి అంటే ఎలా అవుతారు?’
గట్టిగా నవ్వింది మోస్క్వా.

‘మీ పేరుకి తగ్గట్టుగానే మాట్లాడారు’ అంది. ‘అందరూ చైతన్యవంతులు అవక తప్పదు. ఎందుకంటే మనుషులమధ్య ఉన్న సంబంధాల్లో వైరుధ్యాలు, అంటే, అసమానతలు ఉన్నాయి.’

‘అవును, శ్రమదోపిడీ గురించేగా మీరు మాట్లాడుతోంది’ ఉత్సాహంగా అన్నాడు అనుమాన్లు.

‘అవును. అ.భౌ.వాదం ‍ప్రకారం ఆ వైరుధ్యం తొలగిపోక తప్పదు. అంటే ప్రజలు చైతన్యవంతులై శ్రమదోపిడీ గురించి తెలుసుకుని దాన్ని తొలగించుకోక తప్పదు.’

‘అక్కడే డౌటొస్తోంది నాకు. శ్రమదోపిడీ అంటే ఏమిటి? ఒక మానవుడు యజమాని అయ్యి, మరొకడు వాడికి పని చేసేవాడు కావడం. యజమాని పనిచేసినవాడికి కొంత ఇచ్చి, ఆ పనినే ఎక్కువకి అమ్ముకుని లాభం తియ్యడం. ఆ లాభాన్నే మీ కార్క్సిస్టులు శ్రమ‌ దోపిడీ అంటున్నారు. సరే, ఒప్పుకుంటున్నాను. మరి శ్రమదోపిడీ పోవాలంటే ఏమి చెయ్యాలి?’

‘ఏముంది? పనిచేసేవాళ్ళు తాము దోపిడీకి గురి అవుతున్నామని తెలుసుకోవాలి. తెలుసుకుని దోపిడీ లేని వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి.’

‘అంటే పని చేసేవాళ్ళందరూ కలిసి తమంత తామే దోపిడీ లేని వ్యవస్థని ఏర్పరచుకోగలిగేటంతగా చైతన్యవంతులు కావాలి’

‘సరిగ్గా చెప్పారు’ అంది మోస్క్వా.
‘మీరు చెప్పింది బానే ఉంది కానీ, అసలు మనుషులంటేనే అనేక స్వభావాలుంటాయి కదా. ఒక్కోడికీ ఒక్కో సామర్థ్యం ఉంటుంది. ఒకడికి తెలివి బాగా ఉంటుంది. ఒకడికి బలం గట్టిగా ఉంటుంది. అంతే కాకుండా ప్రతీవాడికీ స్వార్థం ఉంటుంది. వాటిల్ని బట్టి ఇతరుల్ని నియంత్రించి తన సంపదలు పెంచుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇవన్నీ పోయి శుద్ధంగా చైతన్యవంతులు అయిపోవాలంటే ఎలా కుదుర్తుంది?’
‘అవును బలవంతులు బలహీనుల్ని పీడిస్తూనే ఉన్నారు. జరిగిన చరిత్ర అంతా అదే. కానీ ఇప్పుడు కార్క్సిజాన్ని తెలుసుకుని బలహీనులంతా ఏకమై పీడన లేని సమాజాన్ని స్థాపించుకోవాలి.’
‘బలహీనులంతా ఏకమయ్యాకా మళ్ళీ వాళ్ళల్లో కొందరు నాయకులు అవుతారుగా. అధికారులు అవుతారుగా. వాళ్ళల్లోనూ కొందరు తెలివైనవాళ్ళూ, బలమైనవాళ్ళూ ఉంటారుగా. వాళ్ళు మిగతావాళ్ళని పీడించకుండా చైతన్యవంతులుగానే మిగిలిపోతారని నమ్మకం ఏమిటి? అందరూ మనుషులేగా. అందరిలోనూ ఉన్నవి ఒకే జీన్సు కాదా? అధికారం వచ్చాకా కొంతమందిలో స్వార్థం తలెత్తదనీ, ఇతరుల్ని పీడించర‌నీ హామీ ఏమిటి?’
‘అడ్డగోలుగా వాదిస్తే ఉపయోగం లేదు’ అంది మోస్క్వా విసుగ్గా మొహం పెట్టి. ‘ఆఖరిసారి చెప్తున్నా వినండి. కార్క్సిజం చదివితే చైతన్యవంతులౌతారు. స్వార్థం తలెత్తదు, చాలా?’ అంది.

——-

హఠాత్తుగా లైబ్రరీలో అలారం మోగింది. తలుపులు తెరుచుకున్నాయి. బిలబిల మంటూ కొంతమంది వలంటీర్లు వచ్చారు. అనుమాన్లని గట్టిగా పట్టుకుని బయటకి ఈడ్చుకుపోయారు. బయటంతా పెద్ద తుఫానులాగా గాలి వీస్తోంది. దుమ్ము రేగుతోంది. గాలికి పేపర్లు ఎగిరిపోతున్నాయి. తలుపులు కొట్టుకుంటున్నాయి. కుర్చీలు తిరగబడిపోతున్నాయి.
గబగబా అనుమాన్లని మెట్లమీదుగా అండర్ గ్రవుండులోకి తీసుకుపోయారు వలంటీర్లు. ఒక పెద్ద కాన్ఫరెన్సురూములోకి తీసుకెళ్ళి తలుపులు బలంగా వేసేశారు. చాలా విశాలమైన గది అది. సుమారు ఒక వందమంది వరకు ఉన్నారు అందులో. అందరి మొహాల్లోనూ టెన్షన్. ఎదురుగా ఒక పెద్ద తెర ఉంది. దానికి దగ్గరగా నిలబడి, తెరమీద కనిపిస్తున్న కామ్రేడ్ అరుణజ్యోతితో మాట్లాడుతున్నాడు లెస్టామా.
అనుమాన్లని తీసుకెళ్ళి తెరముందు నిల్చోబెట్టారు. తెరమీద కనిపిస్తున్న కామ్రేడ్ అరుణజ్యోతి వైపు చూశాడు అనుమాన్లు. ఆవిడ మొహం బిగుసుకుపోయి చాలా టెన్షన్ గా ఉంది. అనుమాన్లకేసి కోపంగా చూస్తూ ఇలా అంది. ‘మిస్టర్ అనుమాన్లూ, నిన్ను చాలా తక్కువగా అంచనా వేశాం. పొరపాటు మాదే. నిన్నసలు ఇక్కడికి రానివ్వకుండా ఉండాల్సింది’.
‘క్షమించండి మేడమ్. తెలిసి నేనే తప్పూ చెయ్యలేదు. నావల్ల ఏం జరిగింది? నేనూ కార్క్సిస్టుగా మారాలనేగా ప్రయత్నిస్తున్నాను’ అన్నాడు అనుమాన్లు.
‘మిస్టర్ అనుమాన్లూ. ఇవాళ నువ్వు మా ప్లెటోపియా పునాదుల్నే ప్రశ్నించావ్. ఇది క్షమించరాని నేరం. నువ్వూ ప్లెటోపియావాసివే అయి ఉంటే ఈపాటికి అంతం చేసి ఉండేవాళ్ళం. లేకపోతే నువ్వు మారేవరకూ డీ‍కంటామినేషన్ కాంపులో బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళం. నువ్వు భూమి నుంచి వచ్చిన టూరిస్టువి కాబట్టి బతికిపోయావ్. అయినా మా పునాదుల్ని కదిలించే సాహసం చేశావ్. మొత్తం ప్లెటోపియా అంతా థాట్ పొల్యూషన్ తుపాను వచ్చింది. అయినా మాకిదేం పెద్ద లెక్క లేదులే. నీ నోరు మూయించడం ద్వారా ఈ తుపానుని మేం కంట్రోల్ చెయ్యగలం. లేకపోయినా మా ప్లెటోపియాని ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు.’

‘క్షమించాలి. మీ పునాదుల్ని కదపడం నా ఉద్దేశ్యం కాదు. నా మానాన నా సందేహాలేవో నేను మోస్క్వా దగ్గర‌ వెలిబుచ్చాను, అంతే’ అన్నాడు అనుమాన్లు.
‘అనుమాన్లూ, ఇది ప్లెటోపియా. ప్లెటోపియాలు ఆలోచనల్లోనే ఉంటాయి. నీ అనుమానాల ద్వారా మా ప్లెటోపియాని కంపు చేస్తున్నావు. సరే, నీ ద్వారానే దీన్ని సరిచెయ్యడానికి ఆఖరిసారి ప్రయత్నిస్తాను. ఇందాకా మోస్క్వాతో అన్నావు కదా, కార్క్సిజం చదివినా స్వార్థం తలెత్తదని హామీ ఏమిటని? దానికి సమాధానం నేను చెప్తాను, విను. మనిషకంటూ ప్రత్యేకంగా చైతన్యం ఏమీ లేదు. ప్రతి మనిషీ తెల్లకాగితం ముక్కలాంటోడు. ఆ కాగితం మీద సమాజం ఏం రాస్తే అలాగే తయారౌతాడు. కాబట్టి మొదటగా బూర్జువా వర్గాన్ని నిర్మూలించి, కార్మిక వర్గ నియంతృత్వాన్ని ఏర్పాటు చేసి సమసమాజాన్ని ఏర్పాటు చేస్తే, ఆ సమాజం ప్రభావం వల్ల వ్యక్తి కూడా కార్క్సిస్టుగానే – ‍ అంటే నిస్వార్థపరుడిగానే – మారిపోతాడు. చాలా?’
అనుమాన్లు మొహం ఆనందంతో వెలిగిపోయింది. ‘చాలు, మహాతల్లీ, చాలు. నాకు ఇవాళ గొప్ప కనువిప్పు కలిగింది. నేను అర్జంటుగా భూలోకానికి వెళ్ళిపోతా.’

‘ఏమిటి నీకు కలిగిన కనువిప్పు?’

‘మా గురువుగారు చాలా రైటని. నేను అర్జంటుగా వెళ్ళి గాయత్రీ మంత్రాన్ని ప్రచారం చెయ్యడం మొదలెట్టాలి.’

నిర్ఘాంతపోయింది కామ్రేడ్ అరుణజ్యోతి. ‘ఏమన్నావ్?’ అంది.
‘అవును తల్లీ, అవును. నువ్వే నాపాలిటి గాయత్రీ మాతవి. మా గురువుగారు కొన్ని వేలమందిని నిస్వార్థ‌ సమాజాలుగా ఏర్పరిచి గాయత్రీ మంత్ర సాధన చేయిస్తున్నారు. ఆ సమాజాల్లో చేరేవాళ్ళందరూ కూడా తెల్లకాగితం ముక్కల్లాంటి మనుషులే. నువ్వు చెప్పినప్రకారం ఆ సమాజాల ప్రభావం వల్లనే వాళ్ళందరూ నిస్వార్థపరులు అయిపోతారు. నేను కూడా అర్జంటుగా వెళ్ళి అటువంటి సమాజాల్ని ఇంకా ఏర్పరిచి, అనేక వేలమందిని నిస్వార్థపరులుగా మార్చెయ్యాలి. మా భూమిమీద కూడా మీలాగా అందరూ నిస్వార్థపరులుగా అయిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. పదండి ముందుకు, పడండి తోసుకు…’ అని అనుమాన్లు ఆనందంతో గెంతడం మొదలుపెట్టాడు.
హఠాత్తుగా పెద్ద పేలుడు. ఎర్రటి వెలుగు. ఎర్రటి ధూళి. అంతా ఎరుపుమయం. ఎరుపు తప్ప ఏమీ కనిపించ‍డం లేదు.

About వాడవల్లి నాగమురళి

అమలాపురంలో పుట్టి పెరిగిన నాగమురళి ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. 2007 నుంచీ బ్లాగుతున్నారు. వీరికి సంస్కృతసాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి, తెలుగుమీద మమకారం, ఫిలాసఫీ అంటే ఇష్టం. పొద్దులో "నాగమురళి బ్లాగు" పరిచయం చదవండి.
This entry was posted in కథ and tagged . Bookmark the permalink.