‘తెకాప్లె’ అను బూర్జువా కథ

 

‘చూడండి, మీరు చేసే ప్రొడక్టివ్ పని రోజుకి నాలుగు యూనిట్లు.  వారానికి ఇరవైనాలుగు. ఏడాదికి ఎనిమిది వారాల సెలవలు పోను మీరు చేసేది 1056 యూనిట్ల పని. మీరందులో టాక్సు కట్టేది ఇరవైశాతం. అంటే, 211 యూనిట్లు. మీరే కాదు, ఈ ప్లెటోపియాలో అందరూ అలాగే కడుతున్నారు. మీరు చేస్తున్న ప్రొడక్టివ్ వర్కుతో మీ అవసరాలు అన్నీ తీరుతున్నాయి. నాన్ ప్రొడక్టివ్ వర్కుతో మీకు విద్య, సెక్యురిటీ, ఎంటర్టయిన్మెంటు ఇంకా మిగతావి అన్నీ నడుస్తున్నాయి. మీరు కట్టే టాక్సు తో గవర్నమెంటు నడుస్తోంది. దానితోటే సైన్సు పరిశోధనలు, ట్రావెల్ పరిశ్రమ ఇంకా చాలా నడుస్తున్నాయి. ఇంతవరకు మనం నిర్ణయించుకున్న కోటా ప్రకారం ప్రతీ  మనిషికీ అయిదేళ్ళకోసారి విమానం మీద దూరపు ఊళ్ళకి వెళ్ళే సౌకర్యం ఉంది. ఇప్పుడు హఠాత్తుగా మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి, ఇష్టం వచ్చినన్ని రోజులు ఉంటానంటే ఎలా కుదుర్తుంది?’ అన్నాడు చెఖోవ్.

 
అది ఒక పెద్ద ఆడిటోరియం. వేదిక మీద రెండు పక్షాలుగా ఎదురెదురుగా కుర్చీలు వేసి ఉన్నాయి. ఎడం పక్క లెస్టామా, అతని కేబినెట్, ఇంకా కొంతమంది పోలీసు వలంటీర్లు కూర్చుని ఉన్నారు. కుడిపక్క నాలుగు వరసల కుర్చీలు ఉన్నాయి. మొదటి వరసలో మధ్యలో లెస్టామాకి ఎదురుగా కూర్చున్నాడు అనుమాన్లు. అతని వెనక వరసలో కూర్చున్న వ్యక్తి ఒకడు లేచి నిలబడి చెఖోవ్ కి సమాధానం చెప్తున్నాడు.

నిన్న రాత్రి వాడికో కొత్త ఫార్ములా తట్టింది. అదో కూల్ డ్రింక్ ఫార్ములా. ఇవాళ పొద్దున్న నుంచి వాడు కూల్ డ్రింకు తయారు చేసి అందరికీ రుచి చూపిస్తున్నాడు. అది ఇంతవరకూ మనం ఎరగని రుచి. చాలా బాగుంది. అందులో మాదక పదార్థాలేమీ లేవని పరిశోధనలో తేలింది. కానీ ఫార్ములా ఏమిటో కనిపెట్టలేకపోయాం. వీడు ఎవరికీ చెప్పడం లేదు.

‘కామ్రేడ్ చెఖోవ్, అదంతా మాకు తెలియదు. మాక్కావలసినప్పుడు కావలసిన చోటుకి వెళ్ళి, కావలసినన్ని రోజులు ఉండాలని ఉంది. మా ట్రావెల్ కోటాలో మార్పులు చెయ్యాల్సిందే. కావాలంటే దానికి తగ్గట్టు మా పనుల్లో కూడా మార్పులు చెయ్యండి. ఎక్కువ పని చెయ్యమంటారా? మేం సిద్ధం. లేకపోతే మా పని కాలంలోనే మేం చేసే పనియూనిట్ల కన్నా ఎక్కువ యూనిట్ల విలువని ఇచ్చే పని ఏదన్నా ఉంటే అది మాకప్పగించండి. ఏదైనా మాకు సమ్మతమే. మాకు మాత్రం ఈ ట్రావెల్ హక్కు కావాల్సిందే.’
ఒక్కసారిగా ప్రజాకోర్టు ఆడిటోరియంలో రణగొణధ్వని మొదలైంది.
‘కామ్రేడ్స్! నిశ్శబ్దం’ అన్నాడు లెస్టామా.
‘ఇవన్నీ పచ్చి బూర్జువా ఆలోచనలు. మన ప్లెటోపియాలో అన్ని పనులూ సమానమే. అన్నిటికీ విలువ ఒకటే. సైంటిస్టు చేసే పనికీ, రోడ్లు ఊడ్చే పనికీ ఒకటే విలువ, ఒకటే యూనిట్. పని పవిత్రమైనది అని మనం ఉగ్గుపాలతో నేర్చుకుంటూ పెరిగాం. ఇక్కడ రాకెట్ సైన్సులో పని చేసేవాడు కూడా డ్యూటీ ప్రకారం టాయిలెట్లు క్లీన్ చెయ్యాల్సిందే. ఇక్కడ మనుషులందరూ సమానమే. పని చెయ్యడమే తప్ప, సంపాదన, దాచుకోవడం, ‍ప్రైవేటు ఆస్తి, అన్న కాన్సెప్టే మనకి లేదు. ఎక్కువ పని చేసి ఎక్కువ యూనిట్లు సంపాదించి ఖర్చు పెట్టుకుంటాం అంటే కుదరదు. మీరు చేసే పని మీకు చెందదు. కాబట్టి పనిని సంపాదనగా చూడడం కూడా నేరమే. ఆ నేరానికి మిమ్మల్ని కఠినంగా శిక్షించాల్సొస్తుంది.’

అనుమాన్లు లేచి నిలబడ్డాడు.

‘లెస్టామా, మీ సిస్టం మీద నాకు గౌరవం ఉంది. మీలో అందరూ మేధో శ్రమలూ, భౌతిక శ్రమలూ సమానంగా చేస్తారు. ఆ రకంగా అన్ని పనులకీ సమాన స్థాయిని సాధించారు. అది అద్భుతమైన విషయం. కానీ ఎవరి పని మీద వాళ్ళకి హక్కు లేదనడం అన్యాయం. తమకి కావలసినంత పని చేసుకుని, దాన్ని యూనిట్లుగా మార్చుకుని కావలసినట్టుగా ఖర్చుపెట్టుకుని బతికే స్వేచ్ఛ ఉంటే బాగుంటుంది.’
ఆడిటోరియంలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఒకాయన లేచి నిలబడ్డాడు.
‘స్వేచ్ఛ, ఖర్చుపెట్టుకోవడం, కావలసినట్టుగా బతకడం – ఇవన్నీ బూర్జువా ఆలోచనలు. ఇంతవరకు ఈ ప్లెటోపియాలో ఎవరికీ ఈ ఆలోచనలు సోకలేదు. మేమంతా కార్క్సిస్టు చైతన్యం కలిగినవాళ్ళం. ఎవడి బతుకు వాడిష్టం వచ్చినట్టు బతుకుతానంటే ఇక్కడ చెల్లదు. అందరికోసం అందరూ బతకాలి. నా బతుకు, నా ఇష్టం అనే భావనలు ఆ చైతన్యాన్ని నాశనం చేస్తాయి. ‘సొంత బతుకు కోసం ప్రైవేటు ఆస్తి’ అనే బూర్జువా చీడకి అవి దారి తీస్తాయి. అటువంటి ఆస్తి కోసం మళ్ళీ దోపిడీ మొదలౌతుంది. కార్క్సిస్టు చైతన్యపు జ్వాలలం మేము. మాముందు నీ ఆటలు సాగవు.’
ఆడిటోరియం చప్పట్లతో మార్మోగిపోయింది. ‘పొమ్మనండి బూర్జువా కుక్కని’, ‘అనుమాన్లు గోబ్యాక్’ అన్న నినాదాలు కూడా వినిపించాయి.

‘కామ్రేడ్స్, అనుమాన్లు ఆర్గ్యుమెంటుని సమర్థించేవాళ్ళెవరైనా ఉన్నారా?’ అని గొంతెత్తి అడిగాడు లెస్టామా. ఎవరూ చెయ్యెత్తలేదు. విజయగర్వంతో అనుమాన్లుకేసి చూశాడు. చేసేది లేక ఓటమిని అంగీకరిస్తూ అనుమాన్లు కూర్చుండిపోయాడు.
‘కామ్రేడ్స్, బూర్జువా ట్రావెల్ వైరస్ సోకిన ఈ ముద్దాయిలకి శిక్ష ఏమిటో నిర్ణయించండి’ అన్నాడు.
‘డీ-కంటామినేషన్’ గొంతెత్తి అరిచారు ఆడిటోరియంలో జనాలంతా.
‘ఒక ఏడాది పాటు ఈ ఇరవై తొమ్మిది మందినీ డీ-కంటామినేషన్ కేంపుల్లో ఉంచాలని నిర్ణయించడమైనది’ అని జడ్జిమెంటిచ్చాడు లెస్టామా. మళ్ళీ అన్నాడు, ‘కామ్రేడ్స్, మన ప్లెటోపియా ట్రావెల్ పోలసీల్లోగానీ, మన లోకల్ ట్రావెల్ పోలసీల్లో గాని ఏమైనా మార్పులు కావాలనుకుంటే వచ్చే ఆగస్టులో రానున్న ఇయర్లీ రెఫరెండమ్ లో తెలియజేయవచ్చు. మెజారిటీ అభిప్రాయాన్ని బట్టీ పోలసీలో మార్పులుంటాయి.’ అని ప్రకటించాడు.
అనుమాన్లు పక్కన కూర్చున్నవాళ్ళలో ట్రావెల్ వైరస్ సోకిన ఇరవై తొమ్మిదిమందినీ వలంటీర్లు లాక్కుపోయారు.
‘తర్వాత కేసు సైంటిస్టు ఇవాన్ ది’ అన్నాడు లెస్టామా.కామ్రేడ్ చెఖోవ్ లేచి నిలబడ్డాడు కేసుని వివరించడానికి.

‘కామ్రేడ్స్, సైంటిస్టు ఇవాన్ మన ఫాక్టరీల్లో ఉపయోగించే ఇంజన్లని అభివృద్ధి చెయ్యడానికి పరిశోధిస్తున్నాడు. నిన్న రాత్రే ఇతని పరిశోధన ఫలించి కొత్త డిజైన్ ని కనిపెట్టాడు. కానీ ఇతనికి బూర్జువా గాలి సోకింది. అతను ఏమంటున్నాడో అతని మాటల్లోనే విందాం.’

అనుమాన్లు పక్కనే కూర్చున్నాడు ఇవాన్. లేచి నిలబడ్డాడు.

‘కామ్రేడ్స్. నేను ఫాక్టరీ ఇంజన్ల గురించి చాలా కష్టపడ్డాను. నా టీనేజి నుంచి ఇప్పటివరకూ రాత్రీ, పగలూ మొత్తం ముప్ఫై ఏళ్ళు అదే పనిమీద ఉన్నాను. నేను తయారు చెయ్యబోయే కొత్త ఇంజన్ వల్ల ప్రొడక్టివిటీ యాభైశాతం పెరుగుతుంది. అంటే, దాన్ని ఉపయోగిస్తే ఇప్పుడు మీరు ఉత్పత్తి చేస్తున్న సరుకుల్నే ఉత్పత్తి చెయ్యడానికి ఇప్పుడు చేస్తున్న పనిలో సగం చేస్తే చాలు. మీ పని గంటల్లో సగానికి సగం కలిసొస్తాయి.’
ఆడిటోరియం అంతా చప్పట్లు కొట్టారు.


‘కానీ కామ్రేడ్స్, మిమ్మల్నొక కోరిక కోరుతున్నా. మీ పని గంటల్లో సగం తగ్గిస్తున్నందుకు ప్రతిఫలంగా ఆ తగ్గించిన పని గంటల్లోంచి ఒక పది శాతాన్ని (అంటే ఇప్పుడు జరుగుతున్న మొత్తం పనిలో అయిదు శాతాన్ని) నా శ్రమకి ప్రతిఫలంగా ఇవ్వమని కోరుతున్నా. ఆ ప్రతిఫలాన్ని నాకిస్తే నేను ఇంక రిటైరవుతా. దాన్ని ఉపయోగించుకుని నాక్కావలసిన భూములు, అందమైన ఇళ్ళు, సేవలు మీనుంచి నేను తీసుకుంటాను. నా తర్వాత కూడా నా పిల్లలకీ, వాళ్ళ పిల్లలకీ, తరతరాలపాటు ఈ అయిదు శాతం ప్రతిఫలం దక్కాలి. నిజానికి ఇందులో శ్రమ దోపిడీ ఏమీ లేదు. మీకు తగ్గించిన శ్రమలోనే నేను వాటా కోరుతున్నాను కానీ, కొత్తగా ఏమీ అడగడం లేదు.’
ప్లెటోపియాలో నేల కంపించింది. సుడిగాలులు రేగాయి. ఒక్కసారిగా ఆడిటోరియంలో గందరగోళం చెలరేగింది. లెస్టామా ఎంత ప్రయత్నించినా ఆ గందరగోళాన్ని అదుపు చెయ్యలేకపోయాడు. ఒక పది నిమిషాల తర్వాత మెల్లిగా సద్దు మణిగింది. ఆడిటోరియంలోంచి మరొకాయన లేచి నిలబడ్డాడు.
‘ఇవాన్, కార్క్సిస్టు ద్రోహీ! తెలివీ, క్రియేటివిటీ నీ ఒక్కడి సొత్తూ కాదు. నువ్వు కనిపెట్టిన ఇంజన్ డిజైన్ మాకు అక్కరలేదు. మాలో ఎవడైనా సరే నీలాగా ట్రైనింగు తీసుకుని, పరిశోధన చేసుకుంటూ పోతే నిన్ను మించిపోతాం. నువ్వు కనిపెట్టినదానికన్నా మంచి డిజైన్లే మేమూ కనిపెట్టగలం. మిగతా కార్క్సిస్టు సైంటిస్టులందరూ నీలాగే ఉన్నారా? వాళ్ళు మొత్తం అందరి శ్రేయస్సునీ కోరి, అందరికోసం కార్క్సిస్టు చైతన్యంతో పరిశోధనలు చెయ్యడం లేదా? నీ ఒక్కడికే ఈ బూర్జువా చీడ సోకింది. నీ ప్రతిపాదనలో శ్రమ దోపిడీ లేదని ఎలా అంటున్నావు? ఒకసారంటూ కొత్త ఇంజన్ వాడకంలోకి వచ్చాకా మళ్ళీ అందరి శ్రమా సమానమే అవుతుంది. ఆ కొత్త శ్రమలోంచి నీకు కొంత భాగం కావాలంటున్నావు. మాకేమో పాత శ్రమ తగ్గిందిగా అంటున్నావు. మాటల గారడీని తీసేస్తే నువ్వు చెయ్యదలచుకున్నదీ శ్రమ దోపిడీయే. నీ బూర్జువా జిత్తులు మాకు తెలియవనుకుంటున్నావా?’
ఆడిటోరియంలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఆయనే అన్నాడు మళ్ళీ.

‘కామ్రేడ్ లెస్టామా, ఈ ఇవాన్ గాడు ఇంతకాలం మన అందరి శ్రమతోనూ నిర్మించుకున్న ఈ ప్లెటోపియాలో ఇక్కడి సదుపాయాలన్నీ అనుభవించాడు. మనం పండించిన తిండి తిన్నాడు. మనం ఉత్పత్తి చేసిన సరుకులు ఉపయోగించాడు. వీడి తెలివి మన అందరి సొత్తూ. వీడు కనిపెట్టిన ఇంజన్ డిజైన్ని స్వాధీనం చేసుకోమని కోరుతున్నాను’. ఈసారి ఆడిటోరియంలో కొందరు నిలబడి కేకలు పెట్టారు. ‘అవును, అలాగే చేయాలి’.
అప్పుడు ఇవాన్ అన్నాడు. ‘నేను చావనైనా చస్తాను గానీ ఆ డిజైన్ మీకు ఇవ్వను. దాని ప్రోటోటైప్ ని ఎప్పుడో నాశనం చేశాను. ఇప్పుడా డిజైన్ నా బుర్రలో మాత్రమే ఉంది.’
అప్పుడు అనుమాన్లు లేచినిలబడ్డాడు. ‘కామ్రేడ్స్. ఇవాన్ కనిపెట్టినది సామాన్యమైన ఆవిష్కరణ కాదు. ఇది మీ ప్లెటోపియానే మార్చేస్తుంది. మీ పురోగతిని అతి వేగవంతం చేస్తుంది. ఇతన్ని తగువిధంగా బహుమానిస్తేనే బాగుంటుందేమో. ఇంతకాలం అతను పడ్డ కష్టానికి, మీ కార్క్సిస్టు సమాజానికి అతను చేసిన సేవకి ప్రతిఫలంగా మీరు అందరూ కలిసి అతని కోరికల్లో న్యాయబద్దంగా అనిపించినవాటిని కనీసం కొన్నిటినైనా తీర్చడంలో తప్పు ఉండదేమో’ అన్నాడు.
అప్పుడు మొదటాయన మళ్ళీ అన్నాడు. ‘కార్క్సిస్టు ప్లెటోపియాలో సొంత ప్రయోజనం కోసం ఎవరూ పని చెయ్యకూడదు. మా సంస్కృతిలో కూడా క్రియేటివిటీని సన్మానించడం, బహుమానించడం ఉంది – గుర్తింపు రూపంలో. ఇవాన్ కి అఖండ సన్మానాలు జరుగుతాయి. బిరుదులు ఇస్తాం. కొన్ని వీధులకి అతని పేరు పెడతాం. టీవీల్లో అతని గురించి చెప్తాం. అంతే కానీ, అతని శ్రమ మా మిగతా అందరి శ్రమ కన్నా ఏవిధంగా ఎక్కువ? క్రియేటివిటీ అతని ఒక్కని సొత్తే కాదు, అతను కోరినవన్నీ ఇవ్వడానికి. అతను కోరుతున్న విలాసాలన్నీ మా శ్రమతోనే వస్తాయి. అతని శ్రమా, మా శ్రమా ఒకటే అయినప్పుడు మా శ్రమని ఎందుకు దోపిడీ చెయ్యనివ్వాలి?’
ఆడిటోరియంలో మళ్ళీ గందరగోళం.

‘కామ్రేడ్స్, నిశ్శబ్దం’ అన్నాడు లెస్టామా. ‘ఇవాన్ ని శిక్షించాలనేవాళ్ళు ఎంతమందో చెయ్యత్తండి’ అన్నాడు. డెబ్భైశాతం దాకా చెయ్యెత్తారు. మెజారిటీ కామ్రేడ్స్ అభిప్రాయం ప్రకారం ఇతను శిక్షార్హుడు అని ప్రకటించాడు లెస్టామా.
‘కామ్రేడ్స్, వీడికి శిక్ష ఏమిటో చెప్పండి’ అన్నాడు లెస్టామా.
‘టార్చర్ హిమ్, టార్చర్ హిమ్’ అని ఆడిటోరియంలో కొంతమంది కేకలు వేశారు. ‘టార్చర్ చేసి డిజైన్ని రాబట్టండి’ అని కూడా అరిచారు.
‘కాదు, వాణ్ణి డీ-కంటామినేట్ చేసి మళ్ళీ కార్క్సిస్టుగా మార్చండి’ అరిచారెవరో.

‘కామ్రేడ్స్, ఇతని మెడికల్ రిపోర్టు ప్రకారం ఇతని బుర్రలో సీక్రెట్ గా ఆ ఇంజన్ డిజైన్ ఉన్నంతవరకు ఇతన్ని డీ కంటామినేట్ చెయ్యడం కుదరదు. అది ఇతని ప్రైవేటు ఆస్తి అయి కూచుంది. దాన్ని కక్కించి పబ్లిక్ ప్రోపర్టీగా చేస్తేనే మళ్ళీ వీణ్ణి డీ-కంటామినేట్ చెయ్యొచ్చు’ అన్నాడు చెఖోవ్.
‘కక్కించండి, కక్కించండి’ ఆడీటోరియంలో అందరూ కలిసి అరిచారు.

‘ఈ ఇవాన్ గాణ్ణి తీసుకెళ్ళి ఏళ్ళతరబడి టార్చర్ చెయ్యండి. ఆ డిజైన్ని కక్కించండి. తర్వాత ఖతం చెయ్యండి’ అన్నాడు లెస్టామా.
‘అంత వరకూ నేను రానిస్తేగా’ అని ఇవాన్ చటుక్కున నోట్లో ఏదో వేసుకున్నాడు. నేలమీద పడి ప్రాణాలు వదిలాడు. ఆడిటోరియంలో గందరగోళం చెలరేగింది.

కోర్టుని రెండు గంటలు వాయిదా వేశాడు లెస్టామా.

—-

రెండు గంటలు గడిచాకా మళ్ళీ కోర్టు సమావేశమైంది. ఈసారి యూరీ అనేవాడి కేసు వివరిస్తున్నాడు చెఖోవ్.

‘ఈ యూరీ గాడు నిన్నటిదాకా మనతో ఉన్నవాడే. నిన్న రాత్రి వాడికో కొత్త ఫార్ములా తట్టింది. అదో కూల్ డ్రింక్ ఫార్ములా. ఇవాళ పొద్దున్న నుంచి వాడు  కూల్ డ్రింకు తయారు చేసి అందరికీ రుచి చూపిస్తున్నాడు. అది ఇంతవరకూ మనం ఎరగని రుచి. చాలా బాగుంది. అందులో మాదక పదార్థాలేమీ లేవని పరిశోధనలో తేలింది. కానీ ఫార్ములా ఏమిటో కనిపెట్టలేకపోయాం. వీడు ఎవరికీ చెప్పడం లేదు. జనాలు వెంటబడి ఈ డ్రింకుని అడుగుతున్నారని వీడొక ప్రొపోజల్ పెట్టాడు. ఈ కూల్ డ్రింకు ఫార్ములాని రహస్యంగానే ఉంచుతాట్ట. తన తర్వాత ఆ ఫార్ములాని తన పిల్లలకి మాత్రమే ఇస్తాట్ట. మన ఊరిపక్క దీన్ని తయారు చేసే యూనిట్ పెడతాట్ట. ఇంక తాను రిటైరైపోతాట్ట. ఆ కూల్ డ్రింకుని అందరికీ సప్లై చేసినందుకు ప్రతిఫలంగా ఒక్కో డ్రింకుకి ఒక శ్రమ యూనిట్ చొప్పున ప్రతిఫలం కావాలంటున్నాడు. నిజానికా డ్రింకుని తయారు చెయ్యడానికి అయ్యేది పావు యూనిట్ శ్రమ మాత్రమే. మిగతాదంతా తనూ, తన పిల్లలూ, తనవాళ్ళూ ఎంజాయ్ చెయ్యడానికట. తాము ఆ శ్రమ యూనిట్లతో ప్రత్యేకమైన ఇళ్ళు కట్టించుకుంటాం, పడమటి ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటాం అంటున్నాడు.

కామ్రేడ్స్, ఈ కేసు సీరియస్ నెస్ మీకర్థం కావాలంటే ఎవరైనా సరే ఆ పక్క కౌంటరు దగ్గరకెళ్ళి ఆ కూల్ డ్రింకుని రుచి చూడొచ్చు.’

కొద్దిమంది కామ్రేడ్స్ రుచి చూద్దామని వెళ్ళారు.

‘ఇదీ ఇందాక ఇవాన్ గాడిలాంటి కేసే. కానీ ఇందులో బూర్జువా తత్త్వం పాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి’ అన్నాడు ఒకాయన లేచి నిలబడి.

‘డ్రింకు రుచి అద్భుతం. అద్భుతం’ అని అరుపులు వినబడ్డాయి. ఒకాయన ఆనందంతో గంతులేస్తున్నాడు.
‘ దీన్లో కొంచం ఎరుపు రంగు కలిపి మనం కార్క్స్ కోలా అని చెప్పి మన ప్లెటోపియా పానీయంగా పెట్టుకుందాం’ అన్నాడు రుచి చూసిన కామ్రేడ్ ఇంకొకాయన.
గందరగోళం చెలరేగింది. చాలామంది రుచి చూసి వస్తున్నారు. రుచి చూసినవాళ్ళు ఇంకా ఇవ్వమని గొడవ చేస్తున్నారు. తాగినవాళ్ళు పరవశంతో వెనక్కొస్తున్నారు. రుచి చూసిన వాళ్ళంతా ఫార్ములా రాబట్టాల్సిందే అంటున్నారు.

‘కామ్రేడ్స్, నిశ్శబ్దం’ అన్నాడు లెస్టామా. ‘ప్రజా కోర్టుని తీర్పు చెప్పమని అభ్యర్థిస్తున్నా’.

‘వీడి దగ్గర నుంచి కూడా ఫార్ములాని కక్కించండి, టార్చర్ చెయ్యండి’ అరిచారు కొంతమంది.
‘లేదు, లేదు. ఇవాన్ గాణ్ణి చూశాంగా. కుదరదు. వీడి ఫార్ములాని పోగొట్టుకోవద్దు’ అన్నారు డ్రింకు తాగిన జనాలు కొంతమంది.
‘కామ్రేడ్స్, మన ప్లెటోపియాకి సైన్సు, టెక్నాలజీ అవసరమేగానీ కూల్ డ్రింకులు బొత్తిగా అనవసరం. ఈ చీడపురుగుని ఏరెయ్యడమే మంచిదని నా అభిప్రాయం. ప్రజాకోర్టు అభిప్రాయం కూడా కోరుతున్నా’ అన్నాడు లెస్టామా.
‘అవును, ఏరెయ్యాల్సిందే’ కొంతమంది అరిచారు.

‘ఈ కూల్ డ్రింకు తాగని బతుకు బతుకే కాదు. వొద్దు, వాణ్ణి చంపొద్దు. మంచి కూల్ డ్రింకు తాగలేని ప్లెటోపియా ఓ ప్లెటోపియానేనా? దీనికోసం మనం అందరం మన శ్రమల్లో కొద్దిగా త్యాగం చెయ్యలేమా?’ గట్టిగా ఆక్రోశించాడు పరవశంలో ఉన్న ఓ కామ్రేడ్.
ప్లెటోపియాలో మళ్ళీ నేల కంపించింది. నక్కలు కూశాయి. అరుణ సూర్యుడు ఒక్క క్షణం మాడిపోయాడు. అనుమాన్లు నవ్వుతున్నాడు. లెస్టామా మొహం ఎర్రబడింది.
పోలీసు వలంటీర్లొచ్చి ఆ కామ్రేడ్ చేతులు వెనక్కి కట్టి మోసుకుంటూ బయటకి తీసుకుపోయారు. యూరీని కూడా ఆడిటోరియంలోంచి బయటకి తీసుకుపోయారు.

—-

‘ఇప్పుడు నేను చెప్పబోయేదో విచిత్రమైన కేసు’ అన్నాడు చెఖోవ్.
‘ఇతని పేరు మిఖాయిల్. ఇతను గోచీ పెట్టుకుని ఊరి బయట చెట్లమ్మటా, పుట్లమ్మటా తిరుగుతుంటే మన వలంటీర్లు అరెస్టు చేశారు. ఇతను ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడప్పుడూ పాడుతున్నాడు. నిన్నటివరకు బానే ఉన్నాడు. నిన్న రాత్రి నుంచే ఇలా తయారయ్యాడు. కుటుంబాన్నీ, పనినీ వదిలేశాడు. పెద్దగా ఏమీ తినడం లేదు కూడా. అప్పుడప్పుడూ ఏ చెట్టు కిందైనా ఓ పండు కనిపిస్తే తింటున్నాడు.

ఇతని బ్రెయిన్ స్కాన్ చేయించాం. బ్రెయిన్లో సర్క్యూట్లన్నీ మారిపోయి చాలా విచిత్రంగా తయారయ్యాయి. ఇతని బ్రెయిన్ కి ఇప్పుడు ‘సౌందర్యం-ఆనందం’ తప్ప ఇంకేమీ తెలియడం లేదు. ప్రతీ క్షణమూ ఇతనికి ఆనందమే. ఎందుకు ఆనందం అంటే, ‘తాను ఉన్నానని’ ఆనందపడుతున్నాట్ట. వేరే కారణం ఏమీ లేదుట. అసలితని బ్రెయిన్ ఎంతో కాలం ఉండదు. ఆనందాన్ని తట్టుకోలేక తొందర్లోనే బద్దలైపోతుందని డాక్టర్లు చెప్తున్నారు.’

‘పిచ్చోడు, ఆస్పత్రిలో చేర్చండి’ అరిచారు ఎవరో.
‘అవును. మా అభిప్రాయమూ అదే. కానీ జనాలు ఇతని వెంట పడుతున్నారు. ఇతని దగ్గర కూచుంటే వాళ్ళకీ ఆనందంగా ఉంటోందిట.పన్లు మానేసి చుట్టూ తిరుగుతున్నారు.’
‘పన్లు మానేసి తిరిగేవాళ్ళని అరెస్టు చెయ్యండి’
‘అదిగో వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళకో లీడరున్నాడు, పైకి తీసుకురండి’ అన్నాడు చెఖోవ్.
మిఖాయిల్ శిష్యుడు రఫాయిల్ ని వేదిక మీద నిలబెట్టారు.రఫాయిల్ అన్నాడు –
‘మేం ఇంక ఈ సమాజంలోనూ, దీని పన్లలోనూ పాలు పంచుకోదలచుకోలేదు. ఈ వస్తు సంపద మాకు సంతోషాన్ని కలిగించట్లేదు. మేం కూడా గోచీలు కట్టుకుని కొండలమ్మటా, గుట్టలమ్మటా తిరగాలనుకుంటున్నాం. అందులోనే మాకు ఆనందం ఉంది. కొంపా, గూడూ అక్కర్లేదు. బట్టలూ అక్కర్లేదు. ఎప్పుడేనా తినాల్సిన అవసరం ఉంటే చెట్లనుంచి రాలిపడ్డ పళ్ళూ, ఆకులూ, అలములూ చాలు. మేమూ మిఖాయిల్ వెంట వెళ్ళిపోతాం’ అన్నాడు.
రఫాయిల్ వెనక ఇంకొకాయన వేదిక మీదకొచ్చాడు. ‘మేం గోచీలు పెట్టుకుని తిరగలేం. కానీ మాకు ఈ గోచీవాళ్ల దగ్గర కూచుంటే చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని మాకు కావాలనిపించినప్పుడు ఊళ్ళోకి తీసుకొచ్చి మా ఇళ్ళల్లో పెట్టుకుంటాం. వాళ్ళు చెప్పే మాటలు వింటాం. మా శ్రమలో కొంత భాగం పెట్టి వాళ్ళకి ఆశ్రమాలు కట్టి పోషిస్తాం. అందరం కలిసి పాడుకుంటాం, ఆడుకుంటాం. దీనికోసం ఎక్కువ పని చెయ్యమన్నా మాకు అభ్యంతరం లేదు. మాకు మాత్రం ఈ హక్కు కావాలి’ అన్నాడు.
‘మతం, మతం’ అరిచారెవరో.

‘కామ్రేడ్స్. అవును. ఇది మతమే’ అన్నాడు లెస్టామా.
‘కానీ ఇక్కడ ఒక చిక్కుంది. ఈ గోచీవాళ్ళు శ్రమ దోపిడీ చేస్తాం అనడం లేదు. వాళ్ళు ఎక్కడ ఏ కొండ కోనల్లో తిరిగినా మనకి నష్టం లేదు. ఊళ్ళోకి వచ్చినప్పుడు బూర్జువా లక్షణమైన గోచీని మాత్రం తీసేసి, సారీ, తీసెయ్యక్కర్లేదు కానీ కార్క్సిస్టు లక్షణమైన పూర్తి బట్టలు ధరించమందాం. కానీ చిక్కేంటంటే, కొందరు మన కామ్రేడ్స్ వీళ్ళకి తమ శ్రమని దానం చేస్తామంటున్నారు. అది శ్రమ దోపిడీ అవుతుందో లేదో నాకే అర్థం కావడం లేదు.’

‘కాదు, అది శ్రమదోపిడీయే’ అరిచారు కొంతమంది.

‘ఇది శ్రమదోపిడీ కాకపోవచ్చు కానీ, ఇది మోసానికి దారి తీస్తుంది’ అన్నాడొక కామ్రేడ్ లేచినిలబడి.
‘ఎలాగంటే, ఈ గోచీవాళ్లల్లో కొంతమంది నిజాయితీపరులే కావచ్చు. కానీ బూర్జువా గాలి సోకినవాడెవడైనా గోచీ కట్టుకుని మనవాళ్ళని మోసం చేస్తూ, వాళ్ళ శ్రమని దోపిడీ చెయ్యొచ్చు కదా.’

‘మతం మత్తుమందు. దాన్నసలు ఇక్కడ కాలు పెట్టనివ్వకూడదు. గోచీ గాళ్ళనీ, వాళ్ళ సపోర్టర్లనీ ఏరెయ్యండి’ అన్నాడొకాయన ఆవేశంగా.
‘అవును, ఇది మన ప్లెటోపియా యొక్క పరిశుద్ధతకి సంబంధించిన అంశం. మతవాసన ఇక్కడ ఎంతమాత్రం కూడదు’ అన్నాడింకొకాయన.
మళ్ళీ ఓటింగు పెట్టారు. మతాన్ని మొదట్లోనే తుడిచిపారెయ్యాలని ఎక్కుమంది అభిప్రాయ పడ్డారు. దాంతో గోచీవాళ్ళనీ, వాళ్ళ సపోర్టర్లనీ పోలీసు వాలంటీర్లు లాక్కెళ్ళిపోయారు.

—–

About వాడవల్లి నాగమురళి

అమలాపురంలో పుట్టి పెరిగిన నాగమురళి ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. 2007 నుంచీ బ్లాగుతున్నారు. వీరికి సంస్కృతసాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి, తెలుగుమీద మమకారం, ఫిలాసఫీ అంటే ఇష్టం. పొద్దులో "నాగమురళి బ్లాగు" పరిచయం చదవండి.
This entry was posted in కథ and tagged . Bookmark the permalink.