‘తెకాప్లె’ అను బూర్జువా కథ

 

గట్టిగా సైరన్ మోగుతోంది ఊళ్ళో. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మోగుతోంది. మొత్తం ఆరుసార్లు మోగింది. ఎవరో గది తలుపు దబదబా బాదుతున్నారు. ఉలిక్కిపడి లేచాడు అనుమాన్లు. తలుపు తియ్యగానే బిలబిలమంటూ మనుషులు లోపలికొచ్చేశారు. ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అని చెప్పి వెంటనే బయల్దేరమన్నారు. ఎక్కడికి అని కూడా అడక్కుండా బయల్దేరాడు అనుమాన్లు.

స్కూల్లో ఆర్టు క్లాసు నడుస్తోంది. ‘శ్రమైకజీవన సౌందర్యం’ అని రాసి ఉంది బోర్డు మీద. పిల్లలందరూ గుంపులు గుంపులుగా చేరి బొమ్మలు గీస్తున్నారు. ‘పని చేస్తూ జీవించడంలో ఉన్న ఆనందం,’ ‘అందరూ అన్ని పనులు నేర్చుకోవాలి’ అన్న థీములమీద పిల్లలు బొమ్మలు గీస్తుంటే వాళ్ళ టీచరు అన్ని గుంపుల మధ్యనా తిరుగుతూ వాళ్ళకి సలహాలిస్తూ, ఉత్సాహపరుస్తోంది.

 
అనుమాన్లకి క్లాసులోకి వెళ్ళడానికి అనుమతిలేదు. అసలు స్కూల్లోకి టూరిస్టులని రానివ్వమన్నారు కానీ, కొంచం బతిమాలితే దూరం నుంచే అన్నీ చూసే కండిషన్ మీద లోపలికి వదిలారు.పిల్లలతో మాట్లాడ్డం కానీ, కనీసం దగ్గరకి పోవడం గానీ చెయ్యకూడదు. క్లాసంతా కలయ చూశాడు. అన్ని గోడలమీదా విజ్ఞాన శాస్త్ర పాఠాల చార్టులు ఉన్నాయి. ఇంకో క్లాసులోకెళ్ళాడు. అక్కడ కూడా  బోర్డుమీద ‘శ్రమైకజీవన సౌందర్యం’ అనే రాసి ఉంది. ఒకాయన పిల్లలచేత పాటలు ప్రాక్టీసు చేయిస్తున్నాడు. పాటలన్నీ మళ్ళీ ‘శ్రమైక జీవన సౌందర్య’మే. డ్రామా క్లాసూ అంతే. పరమ బోరుగా అనిపించింది స్కూలు అనుమాన్లకి. హెడ్మాస్టర్ ఆఫీసు బయట నుంచి నడుస్తూ లోపలికి తొంగి చూశాడు.

‘ఎవరు కావాలండీ?’ అడిగిందొకావిడ లోపల్నించి.
‘హెచ్ ఎం గారున్నారా?’
‘నేనే, లోపలకి రండి’. లోపలికొచ్చి ఎదురుగా కూర్చున్నాడు అనుమాన్లు.
‘నేను టూరిస్టునండి, నా పేరు అనుమాన్లు.’
‘అలాగా, టూరిస్టులకి స్కూల్లో పూర్తి ప్రవేశం లేదు. ఏమిటి ఈ గదిలోకి తొంగి తొంగి చూస్తున్నారు?’
‘చెప్తాను గానీ, మీ పేరేంటండీ?’
‘నా పేరు నోనా. చెప్పండి మీకేం కావాలి’.
‘ఏం లేదండీ మీ రూములోనన్నా ‘దాన్ని’ కొంచెం దగ్గరనుండి చూద్దామని. క్లాసురూముల్లో సరిగ్గా కనబడలేదు.’
‘ఏంటది?’
‘అదేనండీ గ్లోబు. ప్రపంచపటం.’
నోనా మొహంలో ఒక్కసారి రంగులు మారాయి. ఏం మాట్లాడలేదు.

‘కనీసం ఈ ప్లెటోపియా మాప్ అయినా ఉంటే చూపిస్తారా?’ మళ్ళీ సమాధానం లేదు.
నోనా మొహం చాలా సీరియస్ గా ఉంది.
‘మీ ట్రావెల్ డాక్యుమెంట్లొకసారి చూపిస్తారా?’ అని అడిగింది. డాక్యుమెంట్లలో బుల్గానీ ఇచ్చిన కవరు ఒక్కటే తీసుకుని చాలాసేపు చూసింది.
‘క్షమించండి, మీకేమన్నా అనుమానాలుంటే నన్నడగండి, చేతనైనంతవరకు చెప్తాను. ప్లెటోపియా మాపుని బూర్జువాలకి చూపించడం నిషేధం’ అంది.

‘అదేంటండీ, ఇది చాలా బేసిక్ కదా. సరే, పోనీయండి. మీదే దేశం? మొత్తం ఎన్ని దేశాలున్నాయి ఈ ప్లెటోపియాలో? ఆ దేశాల్లో సాంఘిక, రాజకీయ పరిస్థితులెలా ఉంటాయి? మీరు వేరే దేశాలకి ప్రయాణాలు చేస్తారా?’
‘చూడండి మిస్టర్. ఇది ఒకే ప్రపంచం. ఇక్కడ దేశాలు ఉండవు. ‘దేశం’ అనేది బూర్జువా మాట. అది ఇక్కడ నిషిద్ధం. ఇక్కడ ఊళ్ళే ఉంటాయి. అన్ని ఊళ్ళల్లోనూ కార్క్సిస్టు సమాజమే ఉంటుంది. అన్నిచోట్లా అందరూ మాలాగే అన్ని పన్లూ కలిసి చేసుకుంటారు. మాకూ సెలవలుంటాయి. సెలవలకి వేరే ఊళ్ళు వెడుతూనే ఉంటాం. మీలాగే టూరిస్టుల్లా అప్పుడప్పుడు ఒక్కో ఊరికి వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేస్తూ ఉంటాం.’

‘ఎలా వెళతారు?’
‘బస్సులో’.
‘మరి చాలా దూరంగా ఉన్న ఊరికి? అంటే ఉదాహరణకి మా భూమ్మీద ప్రస్తుతం అమెరికా ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు?’
‘మీలాగే్. విమానంలో.’
‘విమానాలు నడిపేదెవరు?’
‘చూడండి, మీకెక్కువ వివరాలివ్వలేను. ఈ ప్లెటోపియా కంతకీ కలిపి ఒక ప్రభుత్వం ఉంది. మొత్తం ప్లెటోపియాని కూడా సదుపాయం కోసం కొన్ని జోన్లుగా విభజించారు. ప్రతీ జోన్ కీ ఒక ప్రాంతీయ ప్రభుత్వం ఉంటుంది. ఇవి మీ దేశాల్లాంటివి కావు. ఇక్కడ జాతీయతలు ఉండవు. ఒక ఊరంతా కలిసి ఒక యూనిట్ గా చెయ్యలేని పెద్ద పెద్ద పనుల్ని ఈ ప్రభుత్వాలు చూస్తాయి. ఉదాహరణకి రైళ్ళు, విమానాలు తయారు చెయ్యడం, నడపడం లాంటివి. ప్రతి ఊరివాళ్ళూ తమ శ్రమ విలువలో కొంత భాగాన్ని ఆ ప్రభుత్వానికి ఇస్తారు.’

‘అంటే మీరూ పన్ను కడతారు!’
‘అవును. ఆ పన్నుని ఉపయోగించి ప్రభుత్వమే మాకు కావల్సిన సదుపాయాలు కల్పిస్తుంది. మాకు ప్రభుత్వమే సెలవల్లో ప్రయాణాలకి అవకాశం కల్పిస్తుంది, కోటా ప్రకారం.’

‘కోటా ప్రకారమా!!!’ అనుమాన్లు మొహం ఆనందంతో వెలిగిపోయింది.

‘ఇంకో చిన్న ప్రశ్న. ప్లెటోపియాలో ఉండేది కూడా మాలాంటి మనుషులే కదా?’
‘అవును’.
‘మాలో ఎన్ని వైవిధ్యాలున్నాయో మీలో కూడా అన్నీ ఉంటాయి కదా? అంటే భాషా భేదాలూ, రూపంలో భేదాలూ వగైరా?’

‘అవుననుకోండి,’ అని నోనా ఇంకా ఏదో చెప్పబోతోంది. హఠాత్తుగా బయటనించి ఒకతను లోపలికి దూసుకొనివచ్చాడు – ‘నోనా, నీతో మాట్లాడాలి’ అంటూ. ఇతనెవరోగానీ తన్ను ఆ పోలీస్ స్టేషన్ నుంచీ వెంటాడుతున్నాడా అని అనుమానం కలిగింది అనుమాన్లకి. నోనా అతనితో బయటకి వెళ్ళింది. పది నిమిషాల్లో వెనక్కొచ్చింది.

‘క్షమించండి అనుమాన్లూ. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, వెళ్ళాలి. మీకు ఆసక్తి ఉంటే కాసేపట్లో ఆడిటోరియంలో ఒక డ్రామా ఉంది. వెళ్ళి చూడొచ్చు.’
‘సరే’, అని సెలవు తీసుకున్నాడు అనుమాన్లు.
ఆడిటోరియం ముందు ఆగి డ్రామా గురించి వాకబు చేశాడు. ఒక కరపత్రం ఇచ్చారు. నాటకం పేరు ‘శ్రమ విజయం’. సారాంశం కూడా ఇచ్చారు క్లుప్తంగా. కార్క్సిస్టు ప్లెటోపియా నుంచి కొంతమంది భూమిమీద‌కి వెళ్తారు. భూమి అనేది ప్రత్యక్ష నరకం. ఎందుకంటే అది, తాను శ్రమ చెయ్యకుండా మరొకడి శ్రమని దోచుకు బతికే బూర్జువా రాక్షసుల కబంధ హస్తాల్లో ఉంది. అది చూసి ప్లెటోపియా వాసులు దోపిడీకి గురి అవుతున్న భూమి శ్రమజీవులని చైతన్యపరచి, దోపిడీని అరికట్టి, భూమిని కూడా ప్లెటోపియాగా మారుస్తారు.
‘ఇక్కడ ఆర్టంతా ఇలాంటి థీములే కాబోలు. సినిమాలున్నాయో లేవో ఇక్కడ’ అనుకున్నాడు అనుమాన్లు. నాటకం హాల్లోకి వెళ్ళబోతున్న ఒకాయన్ని ఆపి, ‘ఏమండీ సినిమా హాలేమైనా ఉందా ఈ ఊళ్ళో’ అని అడిగాడు. ‘ఉందండీ, ఇదే డ్రామాని సినిమాగా కూడా వేస్తారు. కానీ లైవ్ చూడ్డంలో మజా వేరు కదండీ’ అనేసి ఆయన చక్కపోయాడు. ‘సినిమా కూడా ఇదేనా?’ అని నిరాశ పడ్డాడు అనుమాన్లు. అప్పటికే పొద్దు పోయిందని మళ్ళీ టౌనుహాలుకెళ్ళి అక్కడ కమ్యూనిటీ కిచెన్ లో భోజనం చేసేశాడు. భోజనం హాల్లో పెద్దగా ఎవరూ తనతో మాట్లాడలేదు. కొంచం తనకేసి అనుమానంగా చూస్తున్నారా అని కూడా అనుమానం కలిగింది అనుమాన్లకి.

—-

కమ్యూనిటీ హాల్లో రెండో అంతస్తులో తన రూములోకి వచ్చి పడుకున్నాడు అనుమాన్లు. టీవీ ఉంది!! అమ్మయ్య, అనుకుని టీవీ పెట్టాడు. ఒక ఛానల్ అంతా వ్యవసాయం. ఒక ఛానల్ అంతా ఫేక్టరీ పన్ల సమాచారం. ఒక ఛానల్లో డ్రామాలు. మరొక ఛానల్లో ఆ డ్రామాలే సినిమాలుగా వస్తున్నాయి. ఇంకో ఛానల్లో సంగీతం, శ్రామికుల పాటలు.

 

‘కామ్రేడ్ డోరా, ఆ సినిమాల్లో ఎస్. నరసింహ మూర్తి సినిమాలు కూడా తప్పకుండా ఉండేలా చూడండి’. ‘అలాగే కామ్రేడ్, అవి లేకుండా వైరస్ ని నిర్మూలించడం అసాధ్యం కదా.’ ‘సరే. ఇంతవరకు బూర్జువా వైరస్ సోకిన వాళ్ళెంతమంది?’ అడిగాడు లెస్టామా. ‘ముప్ఫై నాలుగుమంది’ అన్నాడు జురెక్.

‘న్యూస్ ఛానల్సేవీ?’

 

కిందకి వెళ్ళాడు. ఎవరూ లేరు. మూడో ఫ్లోర్లో ఎవరో ఉన్నట్టు అలికిడి ఉంటే వెళ్ళి చూశాడు. ఒకాయన కనపడ్డాడు. ‘న్యూస్ ఛానల్స్ రావాండీ ఇక్కడ టీవీలో’ అని అడిగాడు.

‘ఉన్నది ఒకటే న్యూస్ ఛానల్. రావాలే…’, అని ఆయన ఒకసారి అనుమాన్లకేసి ఎగాదిగా చూసి, ‘మీరు టూరిస్టా? టూరిస్టులకి న్యూస్ ఛానల్ నిషేధం’ అన్నాడు.
‘అదేంటి, అసలు అందులో ఏం వస్తుంది?’ అన్నాడు అనుమాన్లు.
‘ఏముంది, ప్రభుత్వం చేస్తున్న పన్ల గురించి సమాచారం, ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాల్లాంటివి జరిగితే వాటి సమాచారం అంతే. అంతకన్నా ఏముండదు లెండి’ అన్నాడాయన.
‘సరే’, అని తన రూముకెళ్ళిపోయాడు అనుమాన్లు మళ్ళీ.

నిద్ర రావడం లేదు. కాసేపు పచార్లు చేశాడు. సాయంత్రం నోనా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
‘హారినీ, వీళ్ళకి ట్రావెలింగు కూడా కోటాలమీద నడుస్తుందా?’ అని నవ్వుకున్నాడు.
‘వీళ్ళూ మనలాంటి మనుషులే. మన జీన్సే వీళ్ళలోనూ ఉన్నాయి. మరి ఇంత ప్లెటోపియాని ఎలా సాధించారో?’ బుర్ర తీవ్రంగా పని చెయ్యడం మొదలెట్టింది అనుమాన్లకి. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఎప్పుడో పడుకున్నాడు.

—-
గట్టిగా సైరన్ మోగుతోంది ఊళ్ళో. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మోగుతోంది. మొత్తం ఆరుసార్లు మోగింది. ఎవరో గది తలుపు దబదబా బాదుతున్నారు. ఉలిక్కిపడి లేచాడు అనుమాన్లు. తలుపు తియ్యగానే బిలబిలమంటూ మనుషులు లోపలికొచ్చేశారు. ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అని చెప్పి వెంటనే బయల్దేరమన్నారు. ఎక్కడికి అని కూడా అడక్కుండా బయల్దేరాడు అనుమాన్లు.
బయట ఇంకా పూర్తిగా  తెల్లవారలేదు. సందేహం లేదు, రాత్రి ఎఫెక్టే. అనుకున్నంతా అయ్యింది. కమ్యూనిటీ హాల్ బయట ఒక వేన్ ఆగి ఉంది. అందులో కూచోబెట్టి కళ్ళకి గంతలు కట్టారు. రెండు గంటల ప్రయాణం తర్వాత దిగమన్నారు. పెద్ద ఆఫీసు బిల్డింగొకదాన్లోకి నడిపించారు. పెద్ద పెద్ద స్తంభాలు, వరండాలు, హాల్సు, గదులు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అధినేతల ఫొటోలు. గుండ్రటి బిల్డింగ్ మధ్యలో ఖాళీ స్థలం. అక్కడ పెద్ద కార్క్స్ విగ్రహం ఉంది. ఇది వీళ్ళ రీజినల్ గవర్నమెంటు ఆఫీసు అయ్యి ఉంటుంది అని ఊహించాడు అనుమాన్లు.
బిల్డింగులో ఓ మూల గదిలోకి తీసుకెళ్ళి వదిలేశారు అనుమాన్లుని. గది తలుపు బయటనుంచి తాళం వేశారు. గదిలో కాఫీ మేకర్, బ్రేక్ ఫాస్ట్ అయిటమ్సూ ఉన్నాయి. అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉండడంతో మెల్లిగా కాలకృత్యాలు తీర్చుకుని బ్రేక్ ఫాస్ట్ కి ఉపక్రమించాడు అనుమాన్లు. టెన్షన్ తీరిపోయింది. అతని ముఖంలో ఆనందం తాండవిస్తోంది.

అదే బిల్డింగ్ లో మరో మూల ఒక పెద్ద కాన్ఫరెన్స్ రూమ్ లో సమావేశం జరుగుతోంది. లోకల్ గవర్నమెంటు అధ్యక్షుడు లెస్టామా, అతని కాబినెట్లో సీనియర్ మంత్రులు అయిదుగురూ ఒకే వరసలో కూర్చున్నారు. వాళ్ళకెదురుగా బుల్గానీ, నికితా, పోలీస్ వలంటీర్ జురెక్ కూర్చుని ఉన్నారు.
‘కామ్రేడ్స్’, అన్నాడు లెస్టామా. మనిషి పొట్టివాడు. బట్టతల. అతని ముఖం చూస్తే ‘పని కానీ, మాటలు తర్వాత’ అంటున్నట్టుంటుంది.

‘పొరపాటు నాదే. బుల్గానీ పంపిన మెసేజీ నేను ఇప్పటిదాకా చూడలేదు. నిన్ననే వైరస్ నిరోధక వ్యవస్థల్ని అలెర్ట్ చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. బూర్జువాని రానివ్వడంలో తప్పు లేదు కానీ, అతని కండిషన్ని ఒకసారి మన డాక్టర్లచేత కూడా వెరిఫై చేయించాల్సింది. అతని రక్తంలో, గాలిలో బూర్జువా వైరస్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. లేకపోతే ఒకేసారి ఇంతమంది ఈ వైరస్ పాలపడ్డమేంటి? ఊళ్ళో థాట్ పొల్యూషన్ రాత్రికి రాత్రే ప్రమాద స్థాయికి పెరిగిపోయింది. కామ్రేడ్ మాక్సిమ్, ఒకసారి పరిస్థితి మళ్ళీ కనుక్కోండి’ అన్నాడు.
ఇంటర్నల్ సెక్యూరిటీ మినిస్టర్ మాక్సిమ్ కాన్ఫరెన్స్ ఫోన్ డయల్ చేశాడు.

‘కామ్రేడ్ డోరా, పరిస్థితి అప్ డేట్ చెయ్యండి’ అన్నాడు ఫోన్లో.
‘కామ్రేడ్ మాక్సిమ్, ఊర్లో రెడ్ అలెర్ట్ ప్రకటించాం. ఊరికి బయట ప్రపంచంతో కమ్యూనికేషన్స్ కట్ చేశాం. ఊళ్ళో ఉన్న ప్రతి వ్యక్తీ డీ-కంటామినేట్ అవ్వాలని ఆదేశాలు జారీ చేశాం. తాత్కాలికంగా ఫాక్టరీ వర్కర్లకి సెలవు ప్రకటించాం. స్కూళ్ళు, కమ్యూనిటీ హాల్సు డీకంటామినేషన్ పన్లోనే ఉన్నాయి. కార్క్సు గారి బుక్సు ఆడియో వెర్షన్లు ఊరంతా మైకుల్లో ప్రసారం అవుతున్నాయి. ఊళ్ళో ప్రత్యేకమైన టీవీ ప్రసారాలు ఏర్పాటు చేశాం. అందులో భూమ్మీద పరిస్థితులగురించిన విప్లవ సినిమాలు వేస్తున్నాం.’

‘కామ్రేడ్ డోరా, ఆ సినిమాల్లో ఎస్. నరసింహ మూర్తి సినిమాలు కూడా తప్పకుండా ఉండేలా చూడండి’.
‘అలాగే కామ్రేడ్, అవి లేకుండా వైరస్ ని నిర్మూలించడం అసాధ్యం కదా.’
‘సరే. ఇంతవరకు బూర్జువా వైరస్ సోకిన వాళ్ళెంతమంది?’ అడిగాడు లెస్టామా.
‘ముప్ఫై నాలుగుమంది’ అన్నాడు జురెక్.
‘వాళ్ళల్లో ట్రావెల్ వైరస్ సోకిన వాళ్ళు?’
‘ఇరవై తొమ్మిది’

‘సరే, ట్రావెల్ గాళ్ళందర్నీ ఒకేసారి హేండిల్ చేద్దాం. మిగతావి కొంచం గడ్డు కేసుల్లా ఉన్నాయి. వాళ్ళని ఒక్కొక్కణ్ణీ విడి విడిగా హేండిల్ చేద్దాం. ప్రజాకోర్టు మెంబర్లని రేండమ్ గా సెలెక్టు చేసి మధ్యాహ్నం రెండుకల్లా వచ్చెయ్యమని మెసేజీ పంపించండి’.

‘కామ్రేడ్ లెస్టామా, అనుమాన్లుగాణ్ణి ఏం చేద్దాం? నాకైతే వాణ్ణి చంపెయ్యాలన్నంత కసిగా ఉంది’ అన్నాడు బుల్గానీ.

‘కామ్రేడ్ బుల్గానీ. ఇందులో వాడి తప్పేం లేదు. మీకందరికీ తెలుసు. మనం ఉన్నది ప్లెటోపియాలో. ప్లెటోపియాల్లోకి ఎవర్నీ రాకుండా నిరోధించడం సాధ్యం కాదు. ప్లెటోపియాల గురించి భూమ్మీద జనాల్ని ఊరించాలి, కానీ వాళ్ళని లాజిక్కులు తియ్యనియ్యకూడదు. సరే, జరిగిందేదో జరిగింది. ఈ అనుమాన్లు గాడు పుస్తకాలు చదివి వీసా సంపాదించాడు. దాన్ని మనం కేన్సిల్ చెయ్యలేం. కానీ భవిష్యత్తులో వీడిలాంటి చీడపురుగులు ఇక్కడికొచ్చి వాతావరణాన్ని కలుషితం చెయ్యకుండా జాగ్రత్త పడాలి.’

‘అలాగే కామ్రేడ్’ అన్నాడు బుల్గానీ. ‘అయితే ఇప్పుడు మరి వాణ్ణి ఏంచేద్దాం? వెంటనే వెనక్కి పంపేద్దామా?’

‘లేదు. ఇప్పటికే వాడు మన ప్లెటోపియాని చాలా పొల్యూట్ చేశాడు. ఇలాగే వెనక్కి పంపితే కష్టం. కామ్రేడ్స్, నేనొక రిస్కు తీసుకోదల్చుకున్నాను. అనుమాన్లు గాడిని ప్రజాకోర్టుకి రానిద్దాం. అంతేకాదు. నాకింకో ఆలోచన ఉంది. వీడు కాకపోతే పనిలేనోడు వీడిలాంటివాడు ఇంకోడు తయారౌతాడు తర్వాత. ఇలాంటి వాళ్ళ బెడద శాశ్వతంగా వదలాలంటే, వీడు వెతుకుతున్న కన్నాల్ని వీడి చేతే మూయించాలి. ఏమంటారు?’

‘ఎలా?’ అన్నాడు మాక్సిమ్.

‘ప్రజాకోర్టులో బూర్జువా గాలి సోకిన జనాల పక్షాన అనుమాన్లు గాణ్ణి కూచోబెడదాం. చేతనైతే వాళ్ళ తరపున వాదించమందాం. బూర్జువా సినిమాల్లో కోర్టు సీన్లు చూసీ, చూసీ ఉంటాడు. మనం ఈ మాట అనగానే ఎగిరి గంతేస్తాడు. అప్పుడు మనం మన ప్రజాకోర్టు మెంబర్లలో ఉన్న కార్క్సిస్టు చైతన్యాన్ని చూపించి, వాడి వాదనల్ని ఖండించి, వాడిచేతే కార్క్సిజాన్ని ఒప్పిద్దాం. అప్పుడు మన వేల్యూ పెరుగుతుంది. వాడి నోరూ మూతపడుతుంది. వాడి బూర్జువా వైరస్ క్యూర్ అయ్యి వాడూ కార్క్సిస్టుగా మారినా మారొచ్చు.’
‘కామ్రేడ్ లెస్టామా. భూమ్మీద ఉన్న అనుమాన్లుగాడి వర్గం గురించి నీకు పూర్తిగా తెలుసు అనే అనుకుంటున్నాను. అది మనకి శత్రువర్గం. ఆ వర్గం మన కార్క్సిజాన్ని ఒప్పుకోవడం కల్ల. ఏదో ఒక పిడివాదం చెయ్యకుండా ఉండదు. ఇంత రిస్కు తీసుకోడం అనవసరమేమో. ఇంకొక్కసారి ఆలోచించు’ అన్నాడు కమ్యూనికేషన్స్ మినిస్టర్ చెఖోవ్.

‘కామ్రేడ్స్, మిగతా అందరూ మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి’ అన్నాడు లెస్టామా.
‘కాబినెట్లో మిగతా అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో’ అన్నాడు ఒకాయన. మిగతావాళ్ళు కూడా అదే అన్నారు.
‘సరే, అరగంటలో మొత్తం కాబినెట్ ని సమావేశపరచండి. ఆ తర్వాత వెంటనే తె.కా.ప్లె. ప్రపంచాధినేత్రి కామ్రేడ్ అరుణజ్యోతితో హాట్ లైన్ సమావేశం కూడా ఏర్పాటు చెయ్యండి. ఆవిడ అనుమతి కూడా తీసుకునే ముందుకెళ్దాం’ అన్నాడు లెస్టామా.

About వాడవల్లి నాగమురళి

అమలాపురంలో పుట్టి పెరిగిన నాగమురళి ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. 2007 నుంచీ బ్లాగుతున్నారు. వీరికి సంస్కృతసాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి, తెలుగుమీద మమకారం, ఫిలాసఫీ అంటే ఇష్టం. పొద్దులో "నాగమురళి బ్లాగు" పరిచయం చదవండి.
This entry was posted in కథ and tagged . Bookmark the permalink.