‘తెకాప్లె’ అను బూర్జువా కథ

ఏయ్, ఎవర్నువ్వు? ఇక్కడికెందుకొచ్చావ్?’
‘నా పేరు అనుమాన్లు. ఇదిగో పాస్‍స్పోర్టు, ట్రావెల్ డాక్యుమెంట్లు.’
‘హనుమాన్లా? అనుమాన్లా?’
‘అనుమాన్లే.’

తె.కా.ప్లె. (తెలుగు కార్క్సిస్టు ప్లెటోపియా) లో వీధి వీధికీ  కమ్యూనిటీ కిచెన్లుంటాయి. ఆ వీధిలో వాళ్ళంతా జట్లుగా ఏర్పడి రోజుకో జట్టు చొప్పున వీధంతటికీ వంట చేస్తారు. ఒకవేళ వేళగాని వేళలో ఎవరరైనా వెళ్ళి, అక్కడ తినడానికి ఏమీ మిగలకపోతే తమ వంట తామే చేసుకుని కూడా తినొచ్చు.

ఎగాదిగా చూశాడు బుల్గానీ. ముప్పై అయిదేళ్ళుంటాయి. చారల టీషర్టు, జీన్సు, నైకీ షూ. చిరు బొజ్జ. చక్రాల సూట్కేసు, లాప్టాప్ బేగ్గు. అనుమానం లేదు, ఆ బాపతే. హాలీడేకి వచ్చినట్టున్నాడు.

 
‘నీలాంటోళ్ళు రాకూడదయ్యా ఇక్కడికి. ఎందుకు మీ టైమూ, మా టైమూ వేస్ట్ చేస్తారు?’ మొహం విసుగ్గా పెట్టి అన్నాడు బుల్గానీ.
‘ఊరికే చూసి పోదామని వచ్చానండి, వేలిడ్ వీసా కూడా ఉంది.’
‘ఊరికే చూసి పోయే చోటు కాదయ్యా ఇది. చెప్తే అర్థం కాదా?’
‘ఊరికే’ అన్న పదం వింటే బుల్గానీకి చిర్రెత్తుకొచ్చింది. భూమ్మీద ఊరికే గడపడానికి ఉన్న ఎంటర్టయిన్మెంటు సరిపోలేదు కాబోలు ఈ బూర్జువా గాళ్ళకి. ఇక్కడక్కూడా తయారవుతుంటారు అనుకున్నాడు. మన సమయం రానీ, అప్పుడు చెబ్దాం వీళ్లపని అనుకుని, ‘ఆ పక్కన వెయిట్ చెయ్యి. నీ డాక్యుమెంట్లన్నీ చూసి అవసరమైతే పిలుస్తా’  అన్నాడు.
పాస్‍పోర్టు తీసి చూశాడు. పేరు అనుమాన్లే, అనుమానం లేదు.

ఇంటిపేరు? గాలి. సరిపోయింది!
వర్గం? మధ్యతరగతి.
తత్త్వం? గోడ మీద పిల్లి. సిగ్గులేకుండా రాయించుకున్నాడు. ఎంత పొగరు వీడికి!
ఎంతకాలం నుంచీ తిరుగుతున్నాడు ఊహల్లో? ఊహ తెలిసినప్పట్నుంచీ. వీడికి వేరే పన్లేదల్లే ఉంది.

‘ఎక్కడెక్కడ తిరిగొచ్చాడో చూద్దాం’ అని పాస్‍పోర్టు పేజీలు తిరగేశాడు. ఒక్కసారిగా మొహం ఎర్రబడింది. గబగబా లోపలికెళ్ళాడు. ఆఫీసు మెయిన్ హాల్లో అధినేత ‘లెస్టామా’ ఫొటో ఉంది. దాని పక్కనే గోడకి ఉన్న ఎర్ర రంగు ఇంటర్ కాం ఎత్తి ఎవరితోనో మాట్లాడాడు  బుల్గానీ. కోపంతో అతని చెయ్యి వణుకుతోంది.

పది నిమిషాల తర్వాత… తెలుగు కార్క్సిస్టు ప్లెటోపియా … ఇంటలెక్చువల్ ఆఫీస్… కాన్ఫరెన్స్ రూమ్…

రౌండు టేబుల్ చుట్టూ నలుగురు కూర్చుని ఉన్నారు. బుల్గానీ టేబుల్ మీద డాక్యుమెంట్లు పెట్టి మాట్లాడుతున్నాడు.

‘కామ్రేడ్స్! మీ అందరి పనీ చెడగొట్టి ఈ మీటింగుకి పిల్చినందుకు క్షమించండి. కానీ అవసరమైన పరిస్థితి ఒకటి వచ్చింది. ఒక బూర్జువా చీడపురుగు ట్రావెల్ వీసా మీద వచ్చింది. వీడి ప్రొఫైల్ చూస్తేనే కంపరంగా ఉంది. వీణ్ణి రానిస్తే  ప్రమాదం వచ్చేట్టుంది. అందుకే ఈ సమావేశం.’
‘ఏమిటి కామ్రేడ్! అంత గొప్పవాడా? ఏమిటి వీడి ప్రత్యేకత?’
‘అబ్బే, వీడికసలు ఏ ప్రత్యేకతా లేదు. ఒట్టి గాలిగాడు. స్థిరత్వం లేదు. ఊరికే  ప్లెటోపియాల్లో తిరుగుతూ ఉంటాడు.’
‘మరి?’
‘వీడితో ఓ పెద్ద చిక్కుంది. వీడిదివరకు చాలా ప్లెటోపియాల్లో తిరిగాడు. తిరిగినచోటల్లా కంపు చేశాడు.’
‘ఏం చేశాడు?’
‘వీడి పేరే అనుమాన్లు. వీడు తిరిగిన ప్రతి చోటా కన్నాలు వెతుకుతాడు. దాంతో అక్కడ థాట్ పొల్యూషన్ పుడుతుంది. కన్నం దొరగ్గానే వీడికి గాలి మళ్ళుతుంది. మరో చోటకి పోతాడు. కానీ ఆ ప్లెటోపియా మాత్రం శాశ్వతంగా కంపవుతుంది.’
గొల్లున నవ్వారు కామ్రేడ్స్ అందరూ.

‘బుల్గానీ. ఈ ప్లెటోపియా అలాంటిలాంటిది కాదని మనందరికీ తెలుసు. ఒక దశలో భూమండలం మొత్తం మన అధీనంలోకి వచ్చే పరిస్థితి అనుకున్నాం. ఇప్పటికీ భూమ్మీద మన ప్రభావం చాలా పెద్దది. బచ్చాగాడు. అసలింతకీ వీడెవడు? వీడికి మన గురించి ఎలా తెలిసింది? ఇక్కడికెలా వచ్చాడు? వీడికి ట్రావెల్ వీసా ఎవరిచ్చారు?’
‘వీడో అతిసాధారణ మధ్యతరగతి బూర్జువా. వీడి సర్కిల్లో పనికిమాల్నవాళ్ళందరికన్నా పనికిమాల్నోడు. పరమ భయస్తుడు. ఊహలు తప్ప వీడికి చేతనైంది మరేం లేదు. బతకడమూ రాదు, చావడమూ రాదు. జీవచ్ఛవం లాంటోడు.’
‘ఆ వర్గంలో చాలామంది అంతే కదా? వింతేముంది?’
‘ఏమీ లేదు. కానీ వీడి బ్రెయిన్ స్కానింగ్ రిపోర్టు చూశాను. స్వార్థం కౌంటు మామూలు బూర్జువా లెవెల్లోనే ఉంది. ఆవేశం కౌంటు మాత్రం నెగటివ్ లో ఉంది. ఆదర్శం కౌంటు సున్నాకి దగ్గర్లో ఉంది.  ఇలాంటి వాడి గాలి సోకడం ఇక్కడ కూడా పొల్యూషన్ కి కారణమౌతుందేమో అనీ…’
‘ఇది వరకు ఏ ప్లెటోపియాల్లో ఎక్కువ తిరిగాడు?’
‘మతం, ఫిలాసఫీ, అమెరికా.’
గొల్లున నవ్వారు మళ్ళీ అందరూ. మీటింగయిపోయిందన్నట్టుగా కొంతమంది కుర్చీల్లోంచి లేచి నిల్చున్నారు.

‘బుల్గానీ, కామ్రేడ్! ప్రస్తుతం మధ్యతరగతి వాళ్ళకి పడమటి గాలి బాగా సోకింది. వాళ్ళ ఆదర్శం కౌంటు చాలా ప్రమాదకరమైన రీతిలో పడిపోయింది. ఇదేం కొత్త విషయం కాదు. మనకి మధ్యతరగత్తో ప్రస్తుతానికి పని కూడా లేదు. కానీ నాకర్థం కానిది ఒక్కటే. ఆదర్శం కౌంటు పడిపోయినవాళ్ళు అసలిటుకేసే చూడరు. వాళ్ళకి బోల్డన్ని వ్యాపకాలున్నాయి. తెలుగు సినిమాలున్నాయి. హాలీవుడ్ సినిమాలున్నాయి. టీవీ చానల్సున్నాయి. పబ్బులున్నాయి. రెస్టారెంట్లున్నాయి.  వీడిక్కడికెందుకొచ్చాడు?’ అన్నాడు కామ్రేడ్ నికితా.
‘గాలిగాడని ముందే చెప్పా కదా. వీడెటుగాలేస్తే అటు పోతాడు. సినిమాలు బాగా చూస్తాడు కానీ వాటిల్లో కన్నాలు చూస్తాడు. పుస్తకాలు చదూతాడు, వాటిల్లో కూడా కన్నాలే చూస్తాడు. ఈమధ్య కార్క్సు రాసిన అరుణమ్ పుస్తకం చదివాడు.  దాంతో వాడికి ఇక్కడికి వీసా దొరికింది. రెండ్రోజులు తిరిగి, ఇక్కడ  కూడా కన్నాలు వెతికి వెళ్ళిపోదామని వచ్చాడు.’
కామ్రేడ్లందరూ ఆలోచనలో పడ్డారు.

‘కన్నాలు వెతకడానికే వచ్చాడని తెలిసీ, ఇదివరకు మిగతా ప్లెటోపియాల్ని కంపుచేశాడని తెలిసీ కూడా ఇక్కడికి రానిచ్చామంటే చారిత్రిక తప్పిదం అవుతుందేమో అని భయంగా ఉంది కామ్రేడ్’ అన్నాడు బుల్గానీ మళ్ళీ .

నికితా కి ఒక ఆలోచన తట్టింది.

‘బుల్గానీ, ఒక మాట అడక్కపోయావా? ఆ పుస్తకం చదివాకా నువ్వు కార్క్సిస్టువయ్యావా? బూర్జువాగానే మిగిలిపోయావా అని కనుక్కుంటే బాగుంటుందేమో.’

‘అదీ అడిగాను. ఇంకా తేల్చుకోలేదన్నాడు. అది తేల్చుకోడానికే లోపలకొచ్చి రెండ్రోజులుందామని వచ్చాట్ట’.

‘బుల్గానీ, కార్క్సిస్టు ప్లెటోపియాలో సభ్యుడివైయుండీ ఇంత పిరికివాడిలాగా ఆలోచిస్తావేంటీ? ఏం, మన ప్లెటోపియామీద నీకు నమ్మకం పోయిందా? ఆప్టరాల్, ఓ మధ్యతరగతి బూర్జువాగాడికి భయపడతావా? రానీ, వెతుక్కోనీ. ఏం కన్నాలు కనిపెడతాడో మనమూ చూద్దాం’ అన్నాడు కామ్రేడ్ డిమిత్రీ ఆవేశంగా.

మిగతా కామ్రేడ్స్ కూడా అవును, అవునన్నారు. ఆ మాటతో బుల్గానీక్కూడా ధైర్యం వచ్చింది.

‘సరే, వాణ్ణి ట్రావెలర్ గా రానిస్తాను. ఎందుకైనా మంచిది, లెస్టామాకి వీడి ప్రొఫైల్ తో మెసేజీ పంపుతాను. తర్వాత మనకి మాట రాకుండా ఉంటుంది.’

ఎర్రరంగు టాక్సీ ఒకటి వచ్చి ఆగింది.
‘దిగండి, ఇదే కమ్యూనిటీ హాలు.’ అన్నాడు టాక్సీ డ్రైవరు. వింతగా చూస్తున్నాడు అనుమాన్లు.
‘హొటలుకి తీసికెళ్ళమంటే కమ్యూనిటీ హాలుకి తీసుకొచ్చావేంటి?’
‘ఇక్కడ హొటళ్ళుండవు. వేరే ఊళ్ళనుంచి ఎవరైనా వొస్తే ఇక్కడే ఉంటారు’.

‘సర్లే’, అని దిగాడు అనుమాన్లు. టాక్సీవాడికి డబ్బులివ్వబోయాడు.

‘మీరు పాత అలవాట్లు మర్చిపోవాలి. ఇక్కడ డబ్బులు ఉండవు’.
‘అవును కదా, మర్చేపోయాను. మరి నీ శ్రమకి ప్రతిఫలంగా ఏమివ్వాలి?’
‘ఏమివ్వక్కరలేదులే. రెండ్రోజులు మటుకు ఉండడానికి, తిరగడానికి అంతా ఫ్రీయే. అంతకన్నా ఎక్కువ ఉంటానంటే మాత్రం వలంటరీ వర్కు చేయాల్సి ఉంటుంది.’
‘చాలాబాగుందోయ్ మీ పద్ధతి’ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అనుమాన్లు.
సూట్కేసు తీసుకుని కమ్యూనిటీ హాల్లోకి నడిచాడు. టాక్సీ డ్రైవరు కూడా పక్కనే ఉన్న పబ్లిక్ పార్కింగ్ ప్లేసులో టాక్సీని వదిలేసి కమ్యూనిటీ హాల్లోకి వచ్చాడు. అతని టాక్సీ డ్యూటీ అయిపోయింది. పొద్దున్న ఎనిమిదీ టూ పదకొండు మాత్రమే అతను టాక్సీ నడుపుతాడు. తర్వాత ఒక గంట కమ్యూనిటీ హాల్లో క్లీనింగ్ పని చేస్తాడు. భోజనం చేసి గంట విశ్రాంతి. తర్వాత స్కూల్లో లెక్కలు పాఠాలు చెప్తాడు. సాయంత్రం ఆర్టు స్కూల్లో డ్రాయింగు నేర్చుకుంటున్నాడు.
అతని క్లీనింగ్ పని పూర్తయ్యేసరికి అనుమాన్లు కూడా పైన రూములో లగేజీ పెట్టుకుని, రిఫ్రెష్ అయ్యి కిందకొచ్చాడు. టాక్సీ డ్రైవర్ని చూసి పలకరించాడు.
‘ఇక్కడ భోజనం సంగతి ఎలాగ మరి?’.
‘వీధి చివర కమ్యూనిటీ కిచెన్ ఒకటి ఉంది. పద, నాకూ భోజనం టైం అయింది.’ అన్నాడు డ్రైవరు. టాక్సీ డ్యూటీ దిగిపోయాకా కూడా అతన్ని డ్రైవరనడం పచ్చి బూర్జువా లక్షణం. అతని పేరు అకీం.
తె.కా.ప్లె. (తెలుగు కార్క్సిస్టు ప్లెటోపియా) లో వీధి వీధికీ  కమ్యూనిటీ కిచెన్లుంటాయి. ఆ వీధిలో వాళ్ళంతా జట్లుగా ఏర్పడి రోజుకో జట్టు చొప్పున వీధంతటికీ వంట చేస్తారు. ఒకవేళ వేళగాని వేళలో ఎవరరైనా వెళ్ళి, అక్కడ తినడానికి ఏమీ మిగలకపోతే తమ వంట తామే చేసుకుని కూడా తినొచ్చు. అకీం ని చూడగానే కిచెన్ హాల్లో అందరూ పలకరించారు.

‘కామ్రేడ్ అకీం, రా, రా. ఇవాళ పడమటి జట్టు వాళ్ళ వంట. పడమటి వంటలు అదిరాయి.’.
‘ఔనా, నిన్న తూర్పు భోజనంలో కొద్దిగా కారం ఎక్కువైంది కానీ, మొత్తంగా అదిరింది. ఏం చేశారేంటి పడమటి వంటలివాళ?’ అంటూ మెనూ రాసి ఉన్న బోర్డు దగ్గరకెళ్ళి నిలబడ్డాడు అకీం.

అనుమాన్లు కొంచం మొహమాటంగా కొంచం భయంగా దిక్కులు చూస్తూ నిలబడ్డాడు.

‘కామ్రేడ్స్, ఇతని పేరు అనుమాన్లు. టూరిస్టు’ అని పరిచయం చేశాడు అకీం.
‘హలో ఫ్రెండ్స్’ అన్నాడు అనుమాన్లు. ‘హలో’ అన్నారు కామ్రేడ్స్.
‘ఎలా ఉందండీ, మీ ఆంధ్రా? అక్కణ్ణించేనా రావటం?’ అన్నాడొకాయన.
‘అవునండీ, బానే ఉంది’.
‘మీ వర్గానికి బానే ఉంటుంది లెండి. అవడానికి ఆంధ్రా అయినా మీరు ఉండేది అమెరికన్ ప్లెటోపియానే కదూ’ అన్నాడాయన మళ్ళీ.
‘అవునండీ, మావాళ్ళల్లో చాలామంది అక్కడే ఉంటున్నారు చాలాకాలంగా’ అన్నాడు అనుమాన్లు.
‘మరి మీరేంటి, ఇలా వచ్చారు? అక్కడ బోరు కొట్టిందా?’ అంది ఒకమ్మాయి.
‘నిజం చెప్పాలంటే అంతే అనుకోండి. దీని గురించి కూడా తెలుసుకోవాలనిపించి…’ నసిగాడు అనుమాన్లు.
‘తెలుసుకుంటే మంచిదే లెండి. ఇదిగో ఇవాళ మీకు నచ్చే వంటలే. సలాడ్ తో ప్రారంభించండి’ అంటూ ప్లేటు అందించిందా అమ్మాయి.
మిగతావాళ్ళతో పాటూ వెళ్ళి కావలసిన పదార్థాలు వడ్డించుకుని వచ్చి కూర్చున్నాడు అనుమాన్లు. అకీం కూడా వచ్చి తన పక్కనే కూర్చున్నాడు.
‘అకీం భాయ్’ అన్నాడు అనుమాన్లు.
‘ఇక్కడ భాయ్, ఫ్రెండ్, బ్రదర్ అనం. కామ్రేడ్ అంటాం’ అన్నాడు అకీం.
‘తెలుసనుకో. అయినా ఇంకా అలవాటు కాలేదు. సరేగానీ, నాక్కొంచం ఇక్కడ టూరిస్టు ప్లేసుల గురించి చెప్పుదూ.  ఎలా వెళ్ళాలో కూడా చెప్పు’.
‘ఇక్కడ ప్రత్యేకంగా టూరిస్టు ప్లేసులంటూ ఏమీ లేవు. ఆసక్తి ఉన్నవాడికి ఇక్కడ ప్రతీ విషయం ఒక అధ్యయన వస్తువే. ఒక పని చెయ్. భోజనం అయ్యాకా ఫాక్టరీ కి వెళ్ళు. బయటే బస్టాపు ఉంది. ఇంకో గంటలో బస్సొస్తుంది. నేరుగా ఫాక్టరీకి తీసుకెళ్తుంది. అక్కడ అంతా తెలుసుకున్నాక సాయంత్రం స్కూలుకి వెళ్ళు’.
‘సాయంత్రం స్కూళ్ళు కట్టెయ్యరా?’
‘ఇక్కడ స్కూళ్ళ పద్ధతి వేరు. వాటిల్లో పగలు పిల్లలకి పాఠాలు చెప్తారు. సాయంత్రం అందరికీ ఆర్టు నేర్పుతారు. ఆటలు ఆడుకుంటారు. డ్రామాలు మొదలైన ఎంటర్టయిన్మెంటు కూడా అక్కడే. నీకు నచ్చిన ఏక్టివిటీని చూడు. లేదంటే నువ్వున్న కమ్యూనిటీ హాల్లోనే సాయంత్రం ఏదో ఒక లెక్చరు ఉంటుంది. దానికి వెళ్ళు. మళ్ళీ రాత్రికి ఇక్కడే భోజనం.’

గుబురు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలోంచి శుభ్రమైన రోడ్డు మీద ఒదిగి, ఒదిగి వెళ్తోంది బస్సు. ఊరు చివర ఎక్కడ చూసినా పచ్చదనం. ఒత్తుగా గడ్డి పెరిగిన మైదానాలు, పొలాలు. వాటిల్లో పని చేస్తున్న మనుషులు. పక్కనే మేస్తున్న ఆవులు, గొర్రెలు. ఎక్కడా చెత్తా, చెదారమూ లేదు. అంతా స్వచ్ఛంగా అద్దంలా ఉంది. బస్సులో కిటికీ పక్కన కూచుని ప్రకృతిని చూస్తూ తన్మయుడైపోతున్నాడు అనుమాన్లు. ఫాక్టరీ రానే వచ్చింది. విశాలమైన ఆవరణలో పెద్ద బిల్డింగు. పక్కనే గొడౌను. ఫాక్టరీ అనగానే పొగ గొట్టాలు ఉండాలి కదా, ఏవీ అని చూశాడు అనుమాన్లు. గొట్టాలు లేవు. పొగా లేదు. ఏవో పాటలు వినిపిస్తున్నాయి. లోపలికెళ్ళాడు. కార్మికులంతా గుంపులు గుంపులుగా ఒక్కో పని చేస్తున్నారు. అప్పుడప్పుడు దగ్గరగా ఉన్న గుంపులంతా కలిసి గొంతెత్తి పాడుకుంటున్నారు. ఉషారుగా, సరదాగా పని చేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలు కూడా ఉన్నాయి. కానీ వాటిల్లోంచి శబ్దం, పొగా రావడం లేదు. కంట్రోల్ పేనల్స్ దగ్గర కూర్చుని కొందరు వాటిని ఆపరేట్ చేస్తున్నారు. కొంచం సేపయ్యాకా ఒక గుంపులో కార్మికులు మరో గుంపులోకి మారుతున్నారు. అందరూ అన్ని పన్లూ చేస్తున్నారు. ఒక గుంపులో లీడర్ గా పని చేసిన కార్మికుడు రెండు గంటలు పోయాకా మరో గుంపులో తక్కువ స్థాయి పనిలోకి మారుతున్నాడు.
తయారైన సరుకంతా గొడౌన్లలోకి చేరవేస్తున్నారు కొందరు. అక్కణ్ణించి ట్రాక్టర్లలో వేర్వేరు ఊళ్ళకి పోతుంది. ఏ ఊరికి కావలసిన సరుకుల అవసరాలు ఆ ఊరి కమ్యూనిటీయే జాబితా తయారు చేసి పంపుతుంది. జాబితాని బట్టి సరుకు ఆ ఊర్లో మార్కెట్ హౌసులకి పోతుంది. మార్కెట్ హౌసులంటే మన షాపింగ్ బజార్ల లాటివే. కానీ ఊరికొక్కటే ఉంటాయి. వాటిల్లో అమ్మేవాళ్ళు, కాపలావాళ్ళూ ఎవరూ ఉండరు. ఎప్పటికప్పుడు ఎవరికి కావలసింది వాళ్ళు పోయి తెచ్చుకుంటారు. తెచ్చుకునేటప్పుడు తమ వివరాలు, తీసుకున్న సరుకుల వివరాలు అక్కడ అకౌంటు పుస్తకంలో రాస్తారు. దాన్ని బట్టే కావలసిన సరుకు ప్లానింగ్ అంతా జరుగుతుంది. అద్భుతం కదూ, అనుకున్నాడు అనుమాన్లు. గొడౌనంతా తిరిగి చూశాడు. సరుకంతా మంచి నాణ్యమైన సరుకు. ఎక్కడా పాడైపోయినదీ, తక్కువరకందీ లేదు.
కార్మికులంతా షిప్టుల్లో పని చేస్తారు. ప్రతి ఫాక్టరీలోనూ అన్ని ఊళ్ళవాళ్ళూ పని చేస్తారు. ఒక్కో షిప్టూ నాలుగ్గంటలే. ప్రతీ గంటకీ ఒక షిప్టు మొదలౌతుంది. అందుకే ఫాక్టరీకి చుట్టుపక్కల చాలా ఊళ్ళనుంచి బస్సులు గంట గంటకీ తిరుగుతూ ఉంటాయి. ఓ రెండు గంటలు ఫాక్టరీలో గడిపాకా మళ్ళీ ఊరికి బయల్దేరాడు అనుమాన్లు. టౌన్ హాల్ దగ్గర బస్సు దిగి, వీధుల్ని చూసుకుంటూ స్కూలు కేసి బయల్దేరాడు. వీధులన్నీ అద్దాల్లాగా ఉన్నాయి. ఎక్కడా మరక అన్నది లేదు. అందరూ వంతులవారీగా శుభ్రం చేసేవాళ్ళే. ఇళ్ళన్నీ ఎక్కువ ఒకే తీరుగా ఉన్నాయి. అక్కడక్కడా డిజైన్లలో మార్పులున్నా ఏవీ ప్రత్యేకంగా లేవు. అన్నీ సమానంగానే ఉన్నాయి.
దార్లో ‘కమ్యూనిటీ పోలీస్’ అని కనబడింది. అదేంటీ, నిజానికసలు ఇక్కడ పోలీసులంటూ ఎవరూ ఉండకూడదే అనుకున్నాడు. లోపలికెళ్ళాడు. అక్కడా వలంటీర్లే పని చేస్తున్నారు. ఇందాకా ఫాక్టరీలో చూసిన మొహాలు కూడా ఒకట్రెండు కనిపించాయి. కొందరు ఏవో ఫైల్సు చూస్తున్నారు. ఒక్కో గదిలో ఒక్కో వలంటీరు కూర్చుని మిగతా వాళ్ళతో ఏవో మాట్లాడుతున్నాడు. గది బయట ‘నిశ్శబ్దం’ అని రాసి ఉంది.
అంతా చూసి బయటకొచ్చాడు అనుమాన్లు. ఒక వలంటీరు లోపలకొస్తున్నాడు. అనుమాన్లు పలకరించాడు. ‘కామ్రేడ్ సర్’. అతను ఆశ్చర్యంగా చూశాడు.
‘సర్ అనక్కర్లేదు, కామ్రేడ్ అంటే చాలు. నా పేరు జురెక్’.
‘సారీ, ఏమనుకోకండి. ఈ ప్లెటోపియాలో పోలీసులు ఉండరని చదివానే. మరి ఇదేంటి?’ అని అడిగాడు.
అతను, ‘ఆంధ్రానుంచొచ్చారా?’ అని అడిగాడు. ‘అవును’ అన్నాడు అనుమాన్లు.
‘వీళ్ళు మీ పోలీసుల్లాంటివాళ్ళు కాదు, వలంటీర్లు. ఊళ్ళో ఎక్కడైనా చిన్న చిన్న వివాదాలొస్తే అందర్నీ పిలిచి మాట్లాడతారు. పరిష్కారాలు సూచిస్తారు. అలాగే ఈ ఊరికొచ్చే టూరిస్టులమీద ఓ కన్నేసి ఉంచుతారు.’

అనుమాన్లుకి కొంచం భయం వేసింది.

 

‘ఎలా వెళతారు?’
‘బస్సులో’.
‘మరి చాలా దూరంగా ఉన్న ఊరికి? అంటే ఉదాహరణకి మా భూమ్మీద ప్రస్తుతం అమెరికా ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు?’
‘మీలాగే్. విమానంలో.’
‘విమానాలు నడిపేదెవరు?’
‘చూడండి, మీకెక్కువ వివరాలివ్వలేను. ఈ ప్లెటోపియా కంతకీ కలిపి ఒక ప్రభుత్వం ఉంది. మొత్తం ప్లెటోపియాని కూడా సదుపాయం కోసం

‘మరి పెద్ద, పెద్ద వివాదాలొస్తే?’
‘పెద్ద వివాదాలంటే?’
‘దొంగతనాలూ, భూ కబ్జాలూ, ఆస్తి తగవులూ.’
‘మిస్టర్, నీకీ ఊరికి వీసా ఉందా? ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? వీసా కేన్సిల్ చేసి డిపోర్ట్ చెయ్యమంటావా?’
‘అయ్యయ్యో, ఏమనుకోకండి. తెలుసు. అసలు శ్రమ దోపిడీ అన్నదే లేని చోట, ప్రైవేటు ఆస్తి అన్నదే లేని చోట అటువంటివి ఎందుకుంటాయి? ఊరికే కన్ఫర్మ్ చేసుకుందామని అడిగా. క్షమించండి.’ అన్నాడు అనుమాన్లు.

 

‘మరింకేం. దయచెయ్యండి.’
‘కానీ నాదో చిన్న సందేహం అండి.’
‘ఏంటి?’
‘ఆస్తుల్తో గొడవులండవు. సరే. కానీ, రేపులుంటాయా?’
‘ఏమిటీ?’
‘అదేనండీ, మానభంగాలుంటాయా? లేకపోతే కనీసం అక్రమ సంబంధాలైనా? శ్రమ దోపిడీ లేకపోయినా అవి ఉండచ్చేమో అని అనుమానంగా ఉంటేను…’ నసిగాడు అనుమాన్లు.
‘మీ టూరిస్టులందరూ అడిగే ప్రశ్నే ఇది. ఉంటాయి. చాలా అరుదుగా. అంతే కాదు, హత్యలు కూడా ఉంటాయి, ఇంకా అరుదుగా. సాధారణంగా అవి పిచ్చి కేసులే అయి ఉంటాయి.’ చెప్పాడు జురెక్.
‘మరి వాళ్ళనేం చేస్తారు?’
‘పిచ్చని తేలితే పిచ్చాసుపత్రిలో పెడతాం.’
‘లేకపోతే?’
‘లేకపోతే ప్రజాకోర్టులో విచారిస్తాం’.
‘బాబ్బాబు, నాకు అటువంటి విచారణ ఒకటి చూడాలని మహా కోరికగా ఉంది. కొంచం చూపించకూడదూ?’

జురెక్ ఒక్క నిమిషం ఆలోచించాడు. ‘మీ కుతూహలాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రస్తుతం అలాంటి కేసులేమీ లేవు. అయినా టూరిస్టులకి ఆ సమాచారం నిషిద్ధం.’ అన్నాడు.
ఇంతలో పోలీస్ స్టేషనంతా అలారం మోగింది. గబగబా వలంటీర్లంతా బయటికొచ్చేశారు. జురెక్ కంగారు పడ్డాడు. వాళ్ళలో కొంచం పెద్దాయన జురెక్ దగ్గరకొచ్చి, అతన్ని పక్కకి తీసుకెళ్ళాడు. తర్వాత అనుమాన్లు దగ్గరకి వచ్చాడు. ‘మిస్టర్, ఏమిటి ఇక్కడ థాట్ పొల్యూషన్ చేస్తున్నారు? మీ పాస్‍పోర్టు, వీసా ఒకసారి చూపిస్తారా?’ అని అడిగాడు. అనుమాన్లు జేబులోంచి పాస్‍పోర్టు, ట్రావెల్ డాక్యుమెంట్లు, దాంతోపాటూ పొద్దున్న బుల్గానీ ఇచ్చిన కవర్ ఒకటి ఆయన చేతికిచ్చాడు. ఆయన అవి తీసుకుని, ‘కామ్రేడ్స్, ఇతని సంగతి నేను చూస్తాను, మీరు మీ పనుల్లోకి వెళ్ళండి’ అన్నాడు. అనుమాన్లుని లోపలికి తీసుకెళ్ళి ఒక గదిలో కూచోబెట్టాడు. తాను డాక్యుమెంట్లు పట్టుకుపోయి ఒక పావుగంట తర్వాత తిరిగి వచ్చాడు.

‘మిస్టర్ అనుమాన్లూ, మీ వీసా గడువు రేపటితో ముగుస్తుంది. అంతవరకూ మీరు మా అతిథి. ఈలోగా మీరు థాట్ పొల్యూషన్ చెయ్యకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే మీ వీసా వెంటనే కాన్సిల్ చెయ్యాల్సి ఉంటుంది.’
‘అయ్యా, ఈ థాట్ పొల్యూషన్ అంటే ఏంటో నాకు తెలియదు. కానీ నాకేవో అనుమానాలొస్తూ ఉంటాయి. అవి రాకూడదంటే ఎట్లా?’
‘మీకు అనుమానాలొస్తాయనీ, వస్తే వీలైనంత తొందరగా, క్లుప్తంగా వాటిని తీర్చమనీ మాకు ఆర్డర్సు ఉన్నాయి. ఏమిటి మీ అనుమానం?’
‘అదేనండీ, ఎవరైనా ఇక్కడ నేరం చేస్తే ఎలా విచారించి శిక్షిస్తారా అని. ఏం శిక్ష వేస్తారో కూడా చూడాలని ఉంది’
‘ఆ వివరాలు మీకు చెప్పలేం కానీ, ఒక ప్రశ్న. ఇక్కడ నేరాలు అతి తక్కువ అని మీకు నమ్మకం కుదిరిందా?’
‘కుదిరిందండి’
‘ఒకటో అరో ఉన్నా కంట్రోల్ చెయ్యడం సులభమే అని కూడా నమ్మగలరా?’
‘ఆ, నమ్మొచ్చనుకోండి.’
‘అయితే మీ అనుమానం తీరినట్టే, ఇక మీరు ఇక్కణ్ణించి వెళ్ళిపోవచ్చు’
సరేలెమ్మని బయటకొచ్చేశాడు అనుమాన్లు. నిజమే, ఇదో పెద్ద అనుమానమేమీ కాదులే అని సద్దిచెప్పేసుకున్నాడు.
‘ఇప్పుడెక్కడికెళ్దాం? ఆఁ.., స్కూలు అటువేపుగదూ.’

—–

 

About వాడవల్లి నాగమురళి

అమలాపురంలో పుట్టి పెరిగిన నాగమురళి ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. 2007 నుంచీ బ్లాగుతున్నారు. వీరికి సంస్కృతసాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి, తెలుగుమీద మమకారం, ఫిలాసఫీ అంటే ఇష్టం. పొద్దులో "నాగమురళి బ్లాగు" పరిచయం చదవండి.
This entry was posted in కథ and tagged . Bookmark the permalink.