మూల కథ: పర్వీన్ జైద్ జదాహ్ మలాల్
తెలుగు అనువాదం – కొల్లూరి సోమశంకర్
"సరిగ్గా నాలుగు కిలోలున్నాయమ్మా"
ఈ మాటలు వినగానే ఆమె పెదాలపై ఓ చిరునవ్వు వెలసింది . తన కొడుకుకేసి చూసింది .
కొట్టు యజమానింకా చెబుతునే ఉన్నాడు:
"చెల్లెమ్మా, ఇదుగో డబ్బు తీసుకో . మొత్తం ఎనిమిది రూపాయలు"
తన దుస్తుల్లోంచి ఆమె చేయి బయటకు చాచి, కొట్టతను ఇచ్చిన డబ్బులు తీసుకుంది. ఆ మిట్టమధ్యాహ్నం వేళ తన ఇంటి వైపు గబగబా అడుగులు వేయసాగింది. తను వేగంగా నడవడమే కాకుండా, తన కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె పట్టు ఎంత గట్టిగా ఉందంటే, కొన్ని క్షణాల తర్వాత, ఆమె కొడుకు " అమ్మా , నువ్వు నా చెయ్యిని నొక్కేస్తున్నావ్ " అన్నాడు బాధగా.
"అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది . ఇదిలో నా పట్టుని కాస్త సడలిస్తున్నాను. నీకు ఇప్పుడు బాగుంటుంది." అంటూ ఆమె నిజమైన జాలితో మృదువుగా చెప్పింది.
ఆమె తన మాతృదేశాన్ని వదిలి దాదాపు ఏడాది కావస్తోంది ; ఆమె ఇప్పుడు ఓ పరాయి దేశంలో రాత్రింబవళ్ళు నిరాశానిస్పృహలతో గడుపుతోంది. రోజూ లానే నేడు కూడా ఆమె, ఆమె కొడుకూ పొద్దున్నే తమ శిబిరాన్ని వదిలి నగరంలోని ప్రధాన కూడళ్ళు , ఇరుకు సందులలో మధ్యాహ్నం వరకు తిరిగి, పనికిరాని చెత్త కాగితాలు ఏరారు . సాయంత్రం అయ్యాక , ఓ కొట్టు దగ్గర ఆగి తాము పోగు చేసిన కాగితాలను అమ్మారు . మాములుగా ఆమెకి రోజుకి నాలుగు లేదా అయిదు రూపాయలు దొరుకుతాయి , కానీ ఈ రోజు ఎనిమిది రూపాయలు దొరికేసరికి ఆమెకి చాలా ఉత్సాహంగా ఉంది. కొన్నిసార్లు మధ్యాహ్నం పూట ఆమె ఉత్త చేతులతో నిరాశగా నిలుచుండి పోతుంది , ఎందుకంటే బలమైన గాలులు వీచడంతో కాగితాలు ఎగిరిపోతాయి . గాలి విదేశీ వాతావరణం వైపు ఆకర్షించబడినట్లే , ఆమె సంతోషం కూడా అదే దిశలో సాగుతూంటుంది .
అయితే ఈ రోజు మాత్రం ఆమె తేలికబడిన హృదయంతో తన శిబిరం వైపు నడిచింది. ఇంటికి వెళ్ళే దారిలో ఓ బ్రెడ్ పాకెట్, కొంత టీ పొడి, కొంత చక్కెర కొనుక్కుంది. చేతిలో చూసుకుంటే ఇంకా రెండు రూపాయలున్నాయి. మట్టి రంగు, నల్లరంగు గుడ్డలతో తయారు చేసిన గుడారాల వరుసలను దాటుతూ తన గుడారానికి చేరుకుంది. గుమ్మం దగ్గర అడ్డంగా కప్పి ఉంచిన పాత నల్ల రగ్గుని తొలగించి లోపలికి ప్రవేశించగానే, ప్రార్థన సమయాన్ని సూచిస్తూ గంట మ్రోగింది. చేతులు కాళ్ళు కడుక్కుని ప్రార్థన ముగించింది. దీపం వెలిగిద్దామని హరికేన్ లాంతరుని పైకెత్తగానే, అందులో నూనె లేదని గ్రహించింది. కొడుకు వైపు తిరిగి, "బాబూ , దీపానికి నూనె లేదు. ఇదుగో ఈ డబ్బు , సీసా తీసుకుని వెళ్ళి కాస్త నూనె కొనుక్కురావా?" అని అంది .
"కానీ అమ్మా……." అంటూ ఆ పిల్లాడు ఇంకేదో చెప్పబోయాడు .
"వెళ్ళు నాన్నా , దారిలో మిగతా పిల్లలతో కలిసి ఆటలలో పడి , అసలు విషయం మర్చిపోకేం. త్వరగా, కొంచెం సేపయితే చీకటి పడుతుంది. "
తర్వాత పొయ్యి వెలిగించడానికి కూర్చుంది. నిప్పు రాజుకుంది , మంటలు మెల్లిమెల్లిగా పెద్దదవుతున్నాయి . ఆమె మనసులో ఆలోచనలు ముసురుకున్నాయి. జ్ఞాపకాలు పీడకలల్లా చుట్టుముట్టాయి. కళ్ళలోంచి నీరు జలాజలా కారాయి. నిప్పు సెగలు తమ నాలుకలతో గాలిని స్పృశిస్తూ ; ప్రవాసం , వలస వలన గాయపడిన ఆమె హృదయాన్ని మరింత మండిస్తున్నాయి . తన స్వదేశానికి వెళ్ళిపోతే బాగుండని ఆమె ఆలోచించసాగింది .
రాత్రింబవళ్ళు ఆ చీకటి గుడారంలో కూర్చున్నప్పుడల్లా ఆమెకి తన భవిష్యత్తు అనిశ్చితి పట్ల బెంగ. ఆమె గతాన్ని గుర్తు చేసుకుంటుంది, గతమంటే మరీ చాలా కాలం క్రితం సంగతి కాదు, ఓ ఏడాది క్రితం సంగతే. అప్పట్లో ఆమెకన్నీ ఉండేవి ; ప్రేమించే భర్త, ఇల్లు, మన్ననతో కూడిన బాధ్యతలు, అన్నింటికంటే ముఖ్యంగా తన సొంత దేశం. అయితే ఇప్పుడివేవి లేవు, కొడుకు తప్ప. మిగతా బంధువులు ఏమయ్యారో, ఎక్కడున్నారో, అసలు జీవించి ఉన్నారో లేదో కూడా ఆమెకి తెలియదు. ఆమెని బాధించే అంశమేంటంటే తన కొడుకు విద్యాభ్యాసం సరిగా సాగకపోవడం. తన దేశంలో సొంత ఊరిలో తను ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రోజులు గుర్తొచ్చాయి. ఆమె పది మంది పిల్లలున్న తరగతికి పాఠాలు చెప్పేది, ఇప్పుడు ఆమె కొడుకేమో నిరక్ష్యరాస్యుడు. బిడ్డకి చదువు నేర్పడానికి అప్పుడప్పుడు ప్రయత్నించింది, కాని సాగలేదు. కొడుకుని మంచి బడిలో చదివించాలనేది ఆమె ప్రగాఢమైన కోరిక, బహుశా అది తీరేది కాదేమో! తన సొంతూరిలోని బడిపిల్లలను గుర్తు చేసుకోడంతో ఆమెకి వ్యాకులత కొంత తగ్గింది. ఈ విచారం ఇతర బాధలను మరిపించింది. పిల్లాడితో కలిసి కాస్త ఎంగిలి పడగానే, నిద్ర ముంచుకొచ్చింది, ఆమె కలల్లోకి జారుకుంది .
* * *
తెల్లారింది . ప్రతీరోజూ లానే కొడుకుతో కలిసి బయటకి రాగానే ఆమెని చల్లటి గాలి పలకరించింది. ఆకాశంలో మేఘాలు గర్జిస్తున్నాయి. కొన్ని వాన చినుకులు నేల మీద పడ్డాయి. మబ్బులు కమ్ముకుంటుంటే ఆమెలో ఆందోళన అధికమవుతోంది. వర్షం కురిసే రోజులలో వాళ్లు ఎక్కువ దూరం వెళ్ళలేరు, ఎందుకంటే ఏరుకున్న కాగితాలు తడిసిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రధాన కూడలి వైపు గబగబా నడిచారు. అక్కడికి చేరుకుంటూనే వాన పెద్దదైంది. మూసి ఉన్న ఓ కొట్టు ముందు తడవకుండా నిలుచున్నారు; కొడుకు తల్లిని గట్టిగా హత్తుకుపోయాడు. వర్షం తగ్గడం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక గంట తర్వాత వాన వెలసింది. వాళ్ళిద్దరూ నగరంలోని ప్రధాన వీధులలోకి, ఇరుకు సందులలో మధ్యాహ్నం వరకు తెగ వెదికారు, ఎక్కడైనా పొడి కాగితాలు దొరుకుతాయేమోనని. కాని దురదృష్టం… ఎక్కడా పొడి కాగితాలే దొరకలేదు. వాళ్ళ కా పూట భోజనం లేనట్టే, ఎందుకంటే నిన్నటి డబ్బంతా ఖర్చయిపోయింది.
కొంతసేపయ్యాక, ఆమె కొడుకుకి ఆకలి వేయసాగింది. ఈ ఏడాది ఆమె, ఆమె కొడుకు ఎన్నో మధ్యాహ్నాలు భోజనం లేకుండా గడిపారు, చాలా ఆశ్చర్యంగా ఉందామెకి. చాలా మటుకు క్రితం నిన్నటి రోజు సంపాదించిన డబ్బు ఈరోజుకి ఉండదు, పొద్దున్నెప్పుడో తాగిన ఓ కప్పుడు టీ తో ఆమె కొడుకు మధ్యాహ్నం దాక సర్దుకోవాలి; ఒక్కోసారి సాయంత్రం దాక కూడా, ఏరిన కాగితాలను అమ్మి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళి కాస్త ఎంగిలి పడేదాక. కొడుకుని దీనికి అలవాటు చేసిందామె, కానీ ఈమధ్య కాలంలో పిల్లాడు చాలా చికాకు పెడుతున్నాడు, ఈ పద్దతిని వ్యతిరేకిస్తున్నాడు. ఆకలేస్తోందంటూ మాటిమాటికి ఫిర్యాదు చేస్తున్నాడు. బిడ్డని ఓదార్చడానికి, వివరించడానికి ఆమె చాలా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది.
ఏం చేయాలో ఆమెకి అర్థం కావడం లేదు. ఎవరి సాయం అర్థించాలి? ఏ కొట్టు దగ్గర ఆగాలి? దారిన పోయే వారిలో ఎవరిని బ్రతిమాలాలి? ఈ పనులు చేయాలంటే చాలా ధైర్యం కావాలి, అత్యంత ధైర్యవంతులు కూడా ఈ పనికి వెనుకంజ వేస్తారేమో? కలలో సైతం ఊహించలేని ఈ పనిని నిజ జీవితంలో ఆమె ఎలా చేయగలుగుతుంది? అయితే ఆమె కొడుకు మొండిగా మారాడు. ఇక తప్పదనుకుంది. రెండుమూడు సార్లు ఓ కొట్టుని ఎంచుకుంది , దారినపోతున్న వారిలో కొందరికేసి చూసింది. కానీ ఎవరినీ ఏమీ అడగలేకపోయింది. అదే క్షణంలో ఆమెకి మరో ఆలోచన తట్టింది. తనకి తానే చెప్పుకుంటున్నట్లుగా……"ఎవరి ఇంటి తలుపైనా కొట్టడానికి నేను ధైర్యం చేస్తే చాలు….". ఈ ఆలోచన ఉత్తమం అని ఆమెకి అనిపించింది, ఎందుకంటే సాధారణంగా తలుపు తీసేది ఆడవాళ్ళే అయ్యుంటారు .
చివరికి కాస్త ధైర్యం చేసి దగ్గర్లోని ఓ ఇంటి ముందు ఆగింది. ఆమె చేతులు వణుకుతున్నాయి, శరీరమంతా చెమటతో తడిసి ముద్దయింది. తలుపు తట్టాలా వద్దా అనే సంశయంలో ఉందామె. ఆమె హృదయం ద్వైదీభావంతో నిండిపోయింది – ఒక వైపు తల్లి ప్రేమ, పిల్లాడి పట్ల ఆపేక్ష; మరో వైపు లజ్జ, భయం! అంతా తికమకగా ఉందామెకు. తన గుండెచప్పుడు ఆమెకి స్పష్టంగా వినిపిస్తోంది. ఆమె గొంతెండిపోతోంది. చివరికి, ధైర్యాన్ని కూడగట్టుకుని గడియతో తలుపు చప్పుడు చేసింది. కొన్ని క్షణాల తర్వాత ఓ ముసలావిడ తలుపు తీసింది.
వణుకుతున్న గొంతుతో ముసలావిడతో చెప్పిందామె…."మా అబ్బాయికి బాగా ఆకలేస్తోంది , నా దగ్గర డబ్బు లేదు …దయచేసి కాస్త……"
ఆమె మాటలింకా పూర్తి కాలేదు , ముసలావిడ వెనక్కి తిరిగింది . లోపలికి వెడుతుంటే …… "దానికేం భాగ్యం , ఇది మీ ఇల్లే అనుకో….." అన్న ఆవిడ మాటలు వినిపించాయి.
సగం తెరిచి ఉన్న తలుపులోంచి ముసలావిడ ఒక చేత్తో ఏదో పాత్రని , మరో చేత్తో కొన్ని రొట్టె ముక్కలని తీసుకుని రావడం ఆమెకి కనిపిస్తోంది. అదే సమయంలో ఇంటి లోపలి నుంచి ఓ యువతి హెచ్చు స్వరంలో మాట్లాడడం వినపడింది.
"అమ్మా , ఇలాంటివేవయినా ఉంటే కుక్కలకి వెయ్యి , అంతే కానీ కాబులీలకు మాత్రం ఇవ్వద్దని నీకు చాలా సార్లు చెప్పాను "
ఆ మాటలేవీ పట్టించుకోకుండా ముసలావిడ తలుపు దగ్గరికి వచ్చేసరికి, గుమ్మం ముందు ఎవరూ లేరు. తల్లీ కొడుకులు అక్కడ్నించి వెళ్ళిపోయారు. సగం తెరిచి ఉన్న తలుపుని తోసుకుని ముసలావిడ వీధికిరువైపులా చూసింది. అప్పటికే తల్లీకొడుకులు సందు చివర్లో ఉన్నారు .
(సమాప్తం)
—————————————————————————-
పశ్తో మూలం: పర్వీన్ జైద్ జదాహ్ మలాల్ ఆంగ్ల అనువాదం: ఆండ్రేస్ విడ్‌మార్క్
తెలుగు అనువాదం : కొల్లూరి సోమ శంకర్
మూల రచయిత్రి గురించి : పర్వీన్ జైద్ జదాహ్ మలాల్ కాంధహార్‌కి చెందిన కవయిత్రి, రచయిత్రి. 1988లో ఆమె అఫ్ఘనిస్తాన్ వదిలిపెట్టి పాకిస్తాన్ చేరారు; కొంత కాలం పెషావర్‌లో ఉన్నారు, ఆ తరువాత కరాచీకి చేరి ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు. 1987 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో ఆమె మూడు కవితా సంకలనాలు వెలువరించారు, 1996లో "వైట్ పేజెస్" అనే ఓ కథా సంకలనాన్ని ప్రచురించారు . విద్వేషం అనే ఈ కథకి మూల కథ ఈ కథాసంకలనం లోనిదే.
ఆంగ్లానువాదకుడి గురించి: 1973లో జన్మించిన ఆండ్రేస్ విడ్‌మార్క్ స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉంటారు. స్వీడన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయం " ఉప్సలా యూనివర్సిటీ " వారి లింగ్విస్టిక్స్ అండ్ ఫిలాలజీ డిపార్ట్‌మెంట్‌లో పి.హెచ్. డి పట్టాకై నమోదు చేసుకున్నారు. పర్ష్యన్ భాషని బోధించడం ; పర్ష్యన్ /దారీ/ పశ్తో సాహిత్యాన్ని అనువదించడమే కాకుండా "వాయిసెస్ ఎట్ ది బోర్డర్స్ , ప్రోజ్ ఆన్ ది మార్జిన్స్ : ఎక్స్‌ప్లోరింగ్ ది కాంటెంపరరీ పశ్తో షార్ట్ స్టోరీ ఇన్ ఎ కాంటెక్స్ట్ ఆఫ్ వార్ అండ్ క్రైసిస్ " అనే శీర్షికతో పరిశోధన కొనసాగిస్తున్నారు .