వసంతసుమశేఖరం మూడవ భాగాన్ని ఆస్వాదించండి.
కామేశ్వరరావు: ముందుకి సాగుదామా?
రవి: ఘంటశాల వారు పాడారు. గూగిలిస్తే తెలిసింది. సరే ముందుకు వెళదాం
రవి: శ్యాం గారు వేదికమీదికి రావాలి.
పుష్యం: చెప్పండి
రవి: ఐటీ (సాఫ్ట్వేరు) మేనేజరు నరకానికి వెళితే, అతనికీ యమునికీ మధ్య సంభాషణ – ఎలా జరుగుతుందో చెప్పండి
ఐ.టీ.మేనేజరు:
ఆ.వె ||
నరక ప్రాప్తి ఏల నాకు పట్టె
చిత్రగుప్తగారి చిట్టాల యందున
అచ్చుతప్పు ఒకటి వచ్చెనేమొ
యముఁడు:
ఓరీ!మానవా! నీ సాఫ్ట్వేర్ బగ్గులమూలానె కదరా గణనయంత్రములందు నీలితెరలు వచ్చి, చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. అందుకే నీకీ శిక్ష..
ఐ.టీ.మేనేజర్:
అయ్యా,
కం||
బగ్గులవి లేని సాఫ్ట్వేర్
దగ్గులు రానట్టి తాత, తగ్గెడి ధరలున్,
రిగ్గింగు లేనెలక్షను,
డ్రగ్గుకి తగ్గేటి జలుబు, మృగ్యంబిలలో!!
సవరణ: డ్రగ్గుకి తగ్గేటి జలుబు, లభ్యంబవునే!!
అంతేకాక,
సీ||
కోడింగు సమయాన కూర్చుండ గంటలు – వెన్నుపూసల యందు దన్ను తగ్గె
కంట్రోలు బటనొత్త కడమ వేలుని చాప – కార్పల్లు టన్నెల్లు కంది పోయె
పగలు రాత్రని లేక పండగలని లేక – పనియె దైవ మనుచు బ్రదికినాడ
ఆ.వె||
చేసినట్టి పనియె శిక్షఁగాద
నరకమింకవలదు, నాయందు దయయుంచి
ధర్మమెంచి చూడు, ధర్మ రాజ!!
యముడు:
కం ||
నరుడా! నిజమే కదరా
తెరిచితివి నాదు కనులు తెలివిగ నీవున్
వరమొక్కటినిచ్చెద పో
సురలోకము కేగి నీవు సుఖముగ నుండోయ్
మురళీమోహన్: చిత్రగుప్తుల వారికి ఒక అకౌంట్స్ ప్యాకేజీ నేర్పిస్తే పోయేది 🙂
మిస్సన్న: అద్భుతంగా ఉంది సంభాషణ చివర మరీ బాగుంది.
నచకి: బగ్గులవి లేని సాఫ్ట్వేర్ ->> ఈ పద్యం అదరహో!
నచకి: కంట్రోలు బటనొత్త కడమ వేలుని చాప – కార్పల్లు టన్నెల్లు కంది పోయె -> =D>
రవి: నీలితెరలు – మైక్రోసాఫ్టువాడిని ఏకారుగా :))
కామేశ్వరరావు: హహహ… ఐ.టీ. మేనేజరు పద్యంలో కూడా బగ్గుండక మానదు:-)
కామేశ్వరరావు: రెండో పద్యం చివరి పాదంలో యతి తప్పింది.
వసంత్ కిషోర్ : భళీ !
పుష్యం: “సిగులనొలకబోయు సినిమాతారల్”
గన్నవరపు నరసింహమూర్తి: బగ్గు లుంటే చేయని పాపానికి నూనెలో వేయించేస్తాడే యముడు !
రవి: చెప్పులోని ముల్లు చెవిలోని జోరీగ – కు సాఫ్టువేరు భాష్యం- బాగ్గులవి లేని సాఫ్ట్వేర్..
పుష్యం: సిగ్గులనొలకబోయు సినిమాతారల్ కూడా మృగ్యమే 🙂
నచకి: అటు యిటూ తిఱిగి మళ్ళీ హీరోయిన్సొచ్చేసారోచ్!
రవి: "డ్రగ్గుకి తగ్గేటి జలుబు, లభ్యంబవునే!!" అంటే సరిపోతుంది
పుష్యం: ఈరోఇన్నులు లేకపోతే తెలుగోడు నడిచేదెలా 🙂
పుష్యం: @రవి– సవరణకు నెనరులు
రవి: మొత్తానికి సాఫ్టువేరు మేనేజరు (డేమేజరు) ను చూస్తే యమునికీ వణుకంటారు.
శ్రీపతి: ర-ఋ లకు యతి సరిపోదా?
నచకి: (ఆశువు)
కం ||
మీరన్నది నిజమే, శ్యామ్!
రారే తెలుగులకు సాటి రైటో రాంగో
హీరోయిన్లే శ్వాసై
హీరో స్టయిలే తమదయి యిలలో మనరే
శ్రీపతి: డ్ర-మృ లకు యతి సరిపోదా?
కామేశ్వరరావు: రి,రె – ఋ లకి సరిపోతుంది
కామేశ్వరరావు: నచకిగారి ఆశువు అదరహో!
రవి: హల్ సామ్యము లేదనుకుంటానండి
పుష్యం: నచకి – మొదటి ఆశువు – అదుర్స్
శంకరయ్య: సరిపోదు. రి-ఋ లకు యతి ఓకే …
శ్రీపతి: అలాయితే "డ్రగ్గుకి తగ్గేటి జలుబు, లభ్యంబవునే" ఎలా సరిపోతుంది?
కామేశ్వరరావు: ర, ల – యతి ఉంది
శ్రీపతి: ఓహో ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. 🙂
నచకి: శ్యామా, నెనరులు! నెనరులు
రవి: శ్రీపతి గారు, నేను ఇదే విషయం క్రితం యేడాదే తెలుసుకున్నాను.
నచకి: కామేశా మీకు కూడ! కానీ నిజమే…
గన్నవరపు నరసింహమూర్తి: డ్రగ్గుకి తగ్గేటి జలుబు డాక్టరు కెరుకే !
శ్రీపతి: నచకి గారూ, హీరోయిన్లనగానే ఆశువు ఆటోమెటిగ్గా భలే వచ్చేసిందే…
పుష్యం: ల – డ లు కూడా అభేధ్యము లనుముంటా?
నచకి: (ఆశువు)
కం ||
ఈ మాటల స్ఫూర్తి నాకు హీరోయిన్లే!
రవి: (ఆశువు)
మోమాటము లేదు మరిక ముందుకు పొండోయ్
శ్రీపతి: మోమాటము లేక మీరు ముందుకు పొండోయ్
కామేశ్వరరావు: హీరోయిన్లస్ఫూర్తితో నచకిగారికి ఆశువులు ఉప్పొంగిపోతున్నాయి 🙂
కామేశ్వరరావు: సరే ముందుకు సాగుదామయితే
నచకి: మొదలెట్టినప్పటి నుంచీ వీరోయిన్లొస్తుంటేనూ…
సంధికే సంహిత అని పేరు. అంటే రెండు వర్ణాల కలయిక అని. ఎప్పుడెప్పుడు సంధి జరుగుతుంది అన్నదానికి ఈ క్రింది శ్లోకం చెబుతారు:
సంహితైకపదే నిత్యా నిత్యా ధాతూపసర్గయోః నిత్యా సమాసే వాక్యే తు సా వివక్షామపేక్షతే
ఒకేపదంలో రెండు వర్ణాలు కలిసినప్పుడు (వర్ణం అన్న పదంలో ర్ + ణ = ర్ణ),
ఉపసర్గ యొక్క చివరి వర్ణమూ ధాతువు యొక్క చివరి వర్ణమూ కలిసేటప్పుడూ (వి + ఆకరణ = వ్యాకరణ),
సమాసంలో మొదటి పదం చివరి వర్ణమూ రెండవ పదం మొదటి వర్ణమూ కలిసేటప్పుడూ (సాంకేతిక + అజ్ఞాన = సాంకేతికాజ్ఞాన)
సంధి తప్పనిసరిగా జరుగుతుంది. ఐతే వాక్యంలో చెప్పేవాని ఇచ్ఛను (వక్తుం ఇచ్ఛా వివక్షా) అనుసరించి సంధి జరుగవచ్చు, జరుగకపోవచ్చు (ఇచ్ఛను అనుసరించి, ఇచ్ఛననుసరించి). అచ్చ తెలుఁగుపదాలు కలిపేటప్పుడు తెలుఁగుసంధులు, సంస్కృతపదాలు కలిపేటప్పుడు సంస్కృతసంధులు వాడుతాం. [ఇప్పుడు విద్య అధర అని సవర్ణదీర్ఘసంధి చేస్తున్నాం అంటే రెండూ సంస్కృతపదాలని అంగీకరించినట్టే కదా.] సంస్కృతంలో విద్య అన్నది స్త్రీలింగ శబ్దం, అంటే విద్యా అన్న రూపమే ఉంటుంది. కాబట్టి విద్యాధర అంటే సహజంగానే విద్యా ధర అనే తీసికొంటాం కానీ, విద్యా అధర అని కాదు. విద్యా అధర కలిసినపుడు కూడా సవర్ణదీర్ఘసంధి జఱిగి [పలకటానికీ వినటానికీ] విద్యాధర అన్న రూపమే సిద్ధిస్తుంది కానీ అది విశేషార్థంలో మాత్రమే తీసుకుంటాం. మఱి ఈ రెంటికీ అర్థాలు వేఱు కదా, ఎలాగ? అంటే, ఇలాంటి సందేహాలు రాకూడదనే వేదంలో స్వరం వాడుతారు. కానీ లోకంలో స్వరం వాడుక పోయింది కాబట్టి, వ్యంగ్యం వంటి విషయాలలో తప్పితే తప్ప మిగతా సందర్భాలలో ఈ స్వరానికి లోకంలో ప్రాధాన్యత పోయింది కాబట్ట్టీ (ఉదా. దయచేయండి), ఏదేమిటో రూఢిగా తెలియటం కోసం లిపిలో అకారప్రశ్లేషను (అవగ్రహం) ఆధారం చేసుకోవచ్చు. ఆకారంపై వచ్చే అకార ఆకారాలకు ೭ మఱియు ೭೭ చిహ్నాలతో పెద్దలైనవారిచే సూచించటం జరుగుతోంది. అంటే విద్యా + ధర = విద్యాధర, విద్యా + అధర = విద్యా೭ధర. విద్యా + నాథ = విద్యానాథ. విద్యా + అనాథ = విద్యా೭నాథ. గంగ కూడ స్త్రీలింగ శబ్దమే కనుక, గంగాధర అన్నపుడు కూడ ఇదే వర్తిస్తుంది. ఐతే, సాంకేతిక అన్నది విశేషణం కనుక, దానికి సంస్కృతరూపం సాంకేతిక అనే కనుక, సాంకేతికాజ్ఞానం అంటే సాంకేతిక అజ్ఞానం అని మాత్రమే అర్థం. సాంకేతికా೭జ్ఞానం కూడా సాధ్యమే. ఎప్పుడు? సాంకేతికా అని వాడినప్పుడు. సాంకేతికా అని వాడామంటే విశేషణంగా కాక నామవాచకంగానో సర్వనామంగానో వాడామని అర్థం. సాంకేతిక విశేషణరూపానికి సాంకేతికః (పుం) సాంకేతికా (స్త్రీ) అన్నవి కర్తృరూపాలు. అపుడు సాంకేతికాజ్ఞానం = సాంకేతిక + అజ్ఞానం అని విడగొట్టుకుంటే సాంకేతికుని అజ్ఞానం అని అర్థం. Technical ignorance అని కాక technologist's ignorance అన్న అర్థం వస్తుంది! – రాఘవ"
రవి: కామేశ్వరరావు గారు మీదే వంతు.
రవి: ఈ యేడాది విశ్వకవి రవీంద్రులవారి 150 వ జన్మవత్సరం
నచకి: ఈసారి సాగు బాగానే ఉంది, నిజమే
నచకి: ఓహో, అందుకా వాఱి(కి) గీతాంజలి!
రవి: ఆ సందర్భంగా గీతాంజలి పద్యానువాదం, కామేశ్వరరావు గారి కలం నుండి కురిపించండి.
కామేశ్వరరావు: అలాగే. అందుకొనుడోయి నాదు గీతాంజలులను
తెలుసులే నాకు, ప్రియతమా!
తలిరుటాకు కొసల నర్తనమాడు ఈ పసిడి మిసిమి,
చదల మెలమెల్ల తూగాడి సాగిపోవు
ఆ మొయిలుగమి,
చెక్కిలినంటి ఒక్క చలువగిలిగింత నిడిపోవు
మలయవీచి,
ఎదనుదోచిన నీ ప్రేమయే యిదెల్ల!
కనుల దడిపెను ప్రాభాతకాంతిఝరిణి
వినపడెను ప్రాణమునకు నీ ప్రేమవాణి
వంచి నీమోము కనులు చుంబించితీవు
అంటె నా గుండె నేడు నీ అంఘ్రియుగళి
—
నచకి: ప్రాభాతకాంతిఝరిణి -> చాలా అందంగా ఉంది
వసంత్ కిషోర్ : దేవులపల్లి వారిని గుర్తు చేశారు !
నచకి: తలిరుటాకు కొసల నర్తనమాడు ఈ పసిడి మిసిమి -> ఇది కూడా చాలా బాగుంది
రవి: చెక్కిలినంటి ఒక్క చలువగిలిగింత నిడిపోవు – భళీ
నచకి: మాకు అర్ధరాత్రి పసిడి కాంతిఝరిణిని కళ్ళకి కట్టించారు!
గన్నవరపు నరసింహమూర్తి: కామేశ్వర రావుగారూ మీకు బెంగాలీ బాగా వచ్చా
మిస్సన్న: అందమైన భావుకత
కామేశ్వరరావు: ధన్యవాదాలు
కామేశ్వరరావు: మూర్తిగారు, బాగా అని చెప్పలేను కాని వచ్చండి
కామేశ్వరరావు: ప్రాభాత్ ఆలేర్ ధారా – ఇది బెంగాలీలో రవీంద్రుని మాటలు
గన్నవరపు నరసింహమూర్తి: చాలా బాగుంది
నచకి: ఆ బెంగాలీ మాటల్లో ఉన్న ధార ఆంగ్లంలోకి రాలేదు, నిజమే!
రవి: విశ్వకవికి సముచిత నివాళి! కామేశ్వరరావు గారూ, మీకు బెంగాలీ భాష వచ్చా! అందుకనేమో ఇంత అందంగా తెనిగించారు.
కామేశ్వరరావు: ఇంగ్లీషులో లేని అంత్యప్రాస సౌందర్యం బెంగాలీ గీతాల్లో కనిపిస్తుంది (వినిపిస్తుంది)
నచకి: కానీ ఆంధ్రంలోకి అద్భుతంగా వచ్చింది
శ్రీపతి: అత్యద్భుతంగా ఉంది ఊహ, గీతమూ,
గన్నవరపు నరసింహమూర్తి: మన భాషలకు ఆంగ్లలో అనువాదాలు కష్టమే
కామేశ్వరరావు: ప్రేమవాణి కూడా రవీంద్రుని మాటే
రవి: ఓహో!
నచకి: అవునా నేనా పంక్తిని పొఱపాటున పరిహరించాను అసలు!
కామేశ్వరరావు: కలకత్తాలో ఉన్నప్పుడు గీతాంజలి బెంగాలీలో చాలాసార్లు వినే అదృష్టం కలిగింది
గన్నవరపు నరసింహమూర్తి: కాంతి ఝరిణి ఇంకా బాగుంది. ధార కంటే
నచకి: నాకూ ఆ ఝరిణి అన్నదే నచ్చింది
కామేశ్వరరావు: "వాణి"తో ప్రాసకోసం వేసినదిది 🙂