తుది విన్నపం

సాధు వేగంగా పరిగెత్తసాగాడు.  చిన్ననాటి ఆటలు, యవ్వనంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో కలిసి చేసిన నినాదాలు, పాలు పంచుకున్న ఉద్యమాలు అడుగడుగునా వెన్నుతట్టి నడిపిన ఇర్ఫాన్. ప్రజల అయోమయాన్ని దూరంచేసి సరైన పంథాని సూచించే అతడి కలం! “ఒక్క తీవ్రవాది మారినా కొన్ని మరణాలు ఆగుతాయి.  మరెన్నొ జీవితాలు పుష్పిస్తాయి”.

 

“అతడు చంపాడని నువ్వు, నువ్వు చంపావని మరొకడు, చివరికి ప్రారంభించిందెవరో, ఎక్కడో మర్చిపోయి తన కొమ్మనే నరుక్కునే పిచ్చివాళ్ళు!  మీరు చంపేది ఒక మతస్థుడిని కాదు.  ఎందరో వ్యక్తుల భావావేశాన్ని. అ ఫలితంగా రేపు పసి కూనలూ ఖడ్గాలు పడ్తారు దేశ భవిష్యత్తుని రక్తసిక్తం చేస్తారు”. ఇర్ఫాన్ వాక్యాలు చెవుల్లో మ్రోగుతున్నాయి.  చెవులు మూసుకొని తల విదిలించాడు.

 

“ఇర్ఫాన్! ఇక ఎవరు చెప్తారు నేను చేసింది తప్పని? ఎవరు నన్ను మేల్కొలుపుతారు?  ఈ జాతిని ఉత్తేజితం చేసే కలాన్ని చంపేసి వచ్చాను.  నాకిప్పుడు భయంగా ఉంది.  పారిపోవాలని ఉంది.  మారాలనీ ఉంది.  నేను ఒంటరిని.  తోడెవరూ లేరే” సాధు కదిలిపోతున్నాడు.  తట్టుకోలేని దుఃఖం అతణ్ణి కుదిపేస్తోంది.

 

“సాధూ” పిలుపు. తనని తాను నిలవరించుకుంటూ చూశాడు.  వెనకే భీమా.  “సాధూ! ఇర్ఫాన్‌ని పేల్చేశావట కదా”.  భీమా ముఖంలో విజయోత్సాహం.  “నువ్విలా కూర్చో.  నీకు ఆహారం తెస్తాను. 

భీమా వెళ్ళాడు.  చెట్టుని ఆనుకుని కూర్చున్నాడు సాధు. ‘ఏంటి తనలో ఈ మార్పు?  అర్థం తెలియని ఉద్వేగం కుదిపేస్తోంది.  ఇర్ఫాన్‌ని అంతం చేశాక, ఇక తనైనా ఎందుకు బ్రతకాలి అన్న నిర్వేదం. ఎలా చంపగలిగాడు?  ఏడి ఆనాటి సాధు?’

 

కళ్ళు మూసుకున్న సాధు తలమీద దెబ్బ పడింది.  ఊపిరి బిగబట్టాడు.  “చంపేయనీ, ఇక బ్రతికీ ప్రయోజనం లేదు.  ఈ రక్తపాతం ఇక తన వల్ల కాదు”  మరో దెబ్బ పడింది.  ఆ దెబ్బలో ప్రాణం తీసే బలం లేదు, మెత్తటి దెబ్బ.

తిరిగి చూశాడు.  ఎదురుగా ప్రాణాలు తీయగల వీరుడు కాదు, పాలుగారే పసివాడు.  నెత్తిన తెల్లటిటోపీ, వదులుగా ఉన్న పైజామా లాల్చీ.  కన్నీటితో తడిసిన ముఖం.  “మా నాన్నని చంపేశారు.  చాల రక్తం వచ్చింది.  నేనూ చంపాలి” ఉర్దూలో ముద్దు మాటలు. 

సాధు కదిలిపోయాడు.  చప్పున వాడిని ఎత్తుకున్నాడు.  “మా నాన్నని ఎవరు చంపారు?  నీకు తెలుసా?”

ఆ ప్రశ్న సాధు గుండెల్లో గుచ్చుకుంది.  “ఎవరో? ఎందుకో? తెలీదు బాబూ” కన్నీటితో అన్నాడు. 

“అటు పద” కొండవంక చూపించాడు. సాధు అటునడిచాడు.  అక్కడో సొరంగం ఉంది.  లోనికి వెళ్ళాడు.  భరించలేని దుర్గంధం.  అక్కడ స్త్రీలు, పిల్లలు, గుంపుగా ఉన్నారు.  వాళ్ళంతా ముస్లింలని తెలుస్తోంది.  ఒక పక్కన ముసలామె చనిపోయి ఉంది.  ఒంటిమీద ముసిరే ఈగలు.  పక్కగా మూత్రవిసర్జన చేసే పిల్లలు.  మరో వైపు ఏదో తింటున్న వాళ్ళు. కడుపు కదిలిపోతోంది సాధుకి.  భళ్ళున వాంతి అయింది.  “అమ్మీ.. ఈయన మంచివాడు రండి” పిల్లాడి కేకకి ఇటు చూశాడు. 

భయభ్రాంతులై పెద్ద పెట్టున ఏడుస్తూ సాధు కాళ్ళమీద పడ్డారు.  “అయ్యా! మేం ముస్లింలం కాదు, హిందువులమూ కాదు.  మనుష్యులం.  చంపకండయ్యా! మాబిడ్డల్ని బ్రతకనీయండి”

సాధు పెదవులు బిగబట్టాడు. “వీళ్ళా తన శత్రువులు?  ఈ నిస్సహాయుల మీదా ఖడ్గం ఝలిపించాడు?  కేవలం తమ జాతి కాదనేగా?  “నీ పోరాటం బాధితుల కోసం చెయ్యి.  నిస్సహాయులను కాపాడడమే ఉద్యమం.  తీవ్రవాదం ఏ మతంలో ఉన్నా ఆమోదం కాదు.  మంచి, చెడు ప్రతివర్గంలో ఉంటాయి. చెడు మీద విజయం సాధించడమే లక్షం” మళ్లీ ఇర్ఫానే!

“సాధూ! ఆలోచించకు నరుకు”.  భీమాకంఠం!

ఉలిక్కిపడి చూశాడు సాధూ.  “భీమా ఆగు”  గర్జించాడు. 

భీమా సాధుని తోశాడు.  “సాధూ! ఏంటి ఆలోచన ? ప్రతిజ్ఞని గుర్తుచేసుకో.  ఈ పసివాళ్ళలో రేపు జాతిని నిర్మూలించే రాక్షసులు దాగి ఉన్నారు.  ఆడవాళ్లని సైతం ఊచకోత కోసిన కలకత్తా దాడులు మర్చిపోయావా”.  ఒక చేత్తో పిల్లలని ఒడిసి పట్టాడు భీమా. మరో చేత్తో ఖడ్గాన్ని తీసాడు. 

సాధు ఇక ఆలోచించలేదు.  అరచేతిని బలంగా బిగించి భీమా వెన్నుపూస ప్రారంభంలో దెబ్బ వేశాడు.  భీమా ఖడ్గం జారింది.  చేయి పట్టు తప్పింది.  “నువ్వు వీళ్ళకోసం? నన్ను..” అంటూనే నేలకొరిగిపోయాడు. 

ఆ ఖడ్గాన్ని అందుకున్నాడు సాధు.  “పదండి” అంటూ ఒక్కొక్కరినే బయటకు రప్పించాడు.  అడివిలో జంతువులు తిరిగే మార్గం ఉంది.  అటు ఎవ్వరూ రారు.  తన తుపాకీనీ సరిచూస్కుంటూ ఆడవాళ్ళనీ, పిల్లలనీ, ఆ దారి పట్టించాడు.  వాళ్ళ పక్కనే నడుస్తూ కాపు కాచాడు.  తెలతెలవారుతుంటే అడవి దాటారు. 

“అదుగో, ఆ ఆఫీసుకి చేరుకుంటే మీకు ఆశ్రయం దొరుకుంది” కనుచూపు మేరలోని కార్యాలయాన్ని చూపించాడు. 

స్త్రీలంతా ఆనందబాష్పాలు రాల్చారు.  “బాబూ! మీరు ఆ గాంధీ మహాత్ములే”

వాళ్ళ మాటకి వెన్ను చరిచినట్లైంది సాధుకి.  “నీ హృదయంలోని గాంధీని వెలికి తీయి, ఆ క్షణాన నువ్వే గాంధీవౌతావు” మనసులోని ఇర్ఫాన్.  సాధు వెనుదిరిగాడు.  కళ్ళలో అశ్రుధారలు.   “గాంధీ నేను మారిపోయాను.  నా కుటుంబం నాశనమైందని కత్తి పట్టాను.  నాలోని మానవత్వాన్ని చంపేశాను.  ఈ రోజు నేను కాపాడిన యీ అసహాయులలో నా తల్లి, తండ్రి, అన్నదమ్ములు కన్పిస్తున్నారు.  నువ్వే నిజం, నీ సిద్ధాంతమే నిజం.  హిందూ, ముస్లిం భాయీ, భాయీ ఇక నాకు శత్రువులే లేరు. నిన్ను చూడాలి, నీ పాదాలు తాకి నేను చేసిన ఒక్కో హత్యకీ క్షమార్పణ చెప్పాలి.  నీ ప్రతిబింబమైన ఇర్ఫాన్ ను పొట్టన బెట్టుకున్న దుర్మార్గుడినని నీ ముందు మోకరిల్లాలి”

కత్తిని నడుముకి దోపుకున్నాడు సాధు.  అక్కడేదో తగిలింది, తీశాడు. ఒక మడిచిన కాగితం. ఆశ్చర్యంగా తీశాడు.రజియా చేతివ్రాత.  విద్యుద్ఘాతం తగిలినట్లైంది.  కళ్ళు మూసుకున్నాడు.  ‘శిబిరంలో తన నడుముని పెనవేసిన చేతులు! రజియానా’! ఆత్రుతగా చదవసాగాడు.

 

“సాధూ! మీ తండ్రి మరణం తర్వాతైనా మీరు మీ కుటుంబానికి దగ్గరవ్వాలని, కొడుకుగా కర్తవ్యం నెరవేర్చాలని ఆశించాను.  పాకిస్థాన్ వెళ్తున్నట్లు అబద్ధం చెప్పి మీ జీవితం నుండి దూరమయ్యాను.  ఒక చిన్న ఊళ్ళో నేను, హబీబ్ తలదాచుకున్నాం.  ఇంతలో నా కడుపులో గడ్డ ఉందనీ, నేను మరణానికి దగ్గరౌతున్నాననీ తెలుసుకున్నాను.  “రజియా” సాధు కళ్ళనుండీ నీటిబొట్లు.

“ఈ రహస్యం నాతోనే భూస్థాపితం అయ్యేదే! కానీ, ఒకరోజు రైలు కట్టలని పేల్చేస్తున్న తీవ్రవాదులగుంపుని చూశాను. అందులో మీరున్నారు.  ‘సాయుధపోరాటం చేపట్టారా’ అని కృంగిపోయాను.  మీలోని ఆ తీవ్రతత్త్వానికి నేనే కారణం అన్పించింది.  ఆ క్షణమే మీ కంటపడాలని నిశ్చయించుకున్నాను. మరో విషాద వార్త.  హబీబ్ మరణించాడు” 

సాధు గుండె ఎగసింది.  “ఆ..బ్బూ.. పాయా” చిరునవ్వులు కళ్ళలో కదిలాయి. “ఎవరి చేతులలోనో తెలుసా? ముస్లిం తీవ్రవాదుల చేతిలోనే.  హిందూగుంపును వేటాడ్తున్న వాళ్ళు “హబీబ్‌ని నువ్వు హిందువా” అని అడిగారు.  కాదన్నాడు.  ఖురాన్ వాక్యాలు చెప్పమన్నారట.  నోరు స్పష్టంగా తిరగని హబీబ్ వాళ్ళ కత్తులకి బలయ్యాడు.

 

చూశారా సాధూ? ‘ఎవరి చేతిలో ఎవరు మరణిస్తున్నారు?  ఏ కారణంగా హతం అవుతున్నారనే’ స్పృహ ఎవరికీ లేదు.  కత్తికి కావల్సింది రక్తం.  ఆ కత్తిని పట్టుకునే మనిషి మారితే, ప్రజలు బ్రతుకుతారు.  జాతి చిగురిస్తుంది.  దేశం పచ్చగా ఉంటుంది.  ప్రపంచం శాంతిమయం అవుతుంది.  నేను మన ఇంట్లో నా తుది శ్వాస విడవాలన్న కోరికతో వచ్చేశాను.  మిమ్మల్ని చూడాలి.  నా తుది విన్నపం విన్నవిస్తాను.  “మీరు తీవ్రవాదిగా కాదు, గాంధేయవాదిగా ఉండాలి – మీ రజియా”.


ఉత్తరాన్ని గుండెలకి హత్తుకున్నాడు సాధు.

 

* * * * *

 

ఇర్ఫాన్ సుడిగాలిలా నడుస్తున్నాడు.  అంగలేస్తూ అతణ్ణి అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు సులేమాన్.  “ఇర్ఫాన్! అతి కష్టం మీద నిన్ను బ్రతికించుకున్నాం.  నువ్వు బ్రతికావని బాబాజీకి తెలిసిందట.  మన గ్రామం పరిస్థితి బాలేదు.  రేడియో వ్యవస్థ, కమ్యూనికేషన్‌ని పేల్చేశారు.  బైటి వార్త లోనికి రావడం లేదు.  లోపలి మనుష్యులు తప్పించుకోలేరు.  రజియా ఎటూ బ్రతకదు.  నా మాట విను” అంటున్న సులేమాన్, ఇర్ఫాన్ చిరునవ్వుని ఆశ్చర్యంగా చూశాడు. 

“గాంధీ నాకు కొన్నాళ్ళ క్రితం ఉత్తరం రాశారట.  మానవ్ సందేశం పంపాడు.  ‘నన్ను చూడాలనుందనీ, వచ్చి కలుసుకొమ్మని, కబురు పంపారట”.  ఇర్ఫాన్ మాటలకి సులేమాన్ హృదయం ఉరకలేసింది, ఇల్లు చేరారు.


* * * * *


“రజియా చావు బ్రతుకుల్లో ఉంది.  ఆఖరి ప్రయత్నంగా సర్జరీ చేస్తాను", తలుపు వేయబోతున్నాడు ఇర్ఫాన్.

“ఇర్ఫాన్!” పెద్దగా కేక! రొప్పుతూ వస్తున్నాడో వ్యక్తి.  సులేమాన్ అడ్డుకోబోయాడు. “ఇర్ఫాన్‌కి అతి ముఖ్యమైన సమాచారం తెచ్చాను” అన్నాడు.  సులేమాన్ లోనికి పంపాడు.  ఆ వ్యక్తి చెప్పింది విని హతాశుడయ్యాడు ఇర్ఫాన్. 

వెళ్తున్న ఆ వ్యక్తి వంకే ఆందోళనగా చూశాడు సులేమాన్.  ‘ఏంటా సందేశం? ఇర్ఫాన్ ఎందుకలా అయిపోయాడు?

* * * * *

సాధు గ్రామంలోకి అడుగుపెట్టాడు.  మట్టివాసనతో కూడుకున్న శీతల పవనం సాధుని చుట్టేసింది.  “రజియా!  ఈ మట్టిలో మన బాల్యం దాగుంది.  తొలిప్రేమ గుభాళింపు నన్ను బంధిస్తోంది.  నీ అనురాగం, మన దాంపత్యం కళ్ళముందు కదుల్తున్నాయి.  నన్ను అన్యాయం చేయకు.  వదిలి వెళ్ళకు.  నీ ఒడిలో తల దాచుకుని మనసారా ఏడ్వనీ! నీ సాధుగా తిరిగొచ్చానని ఎలుగెత్తి చాటనీ!”

* * * * *

దాదాపు నలభై నిముషాల తర్వాత తలుపు తెరిచాడు ఇర్ఫాన్.  అతణ్ణి పోల్చలేనట్లు చూశాడు సులేమాన్.  జీవాన్ని కోల్పోయిన తిత్తిలా ఉన్నాడు.  కన్నీటి సముద్రంలా ఉన్నాడు.  అతడి స్వయం తేజం, ధైర్యం, ప్రకాశం మచ్చుకైనా లేవు. “ఇర్ఫాన్! ఏమైంది? ఏదయిన చెడువార్త విన్నావా? ఆ సందేశం ఏమిటి? రజియా ఎలా ఉంది?” భయంగా ప్రశ్నలు కురిపించాడు సులేమాన్.


“సులేమాన్! సాధు ఊళ్ళోకి వచ్చాడని తెలిసింది.  నన్ను చంపేస్తాడు.  రక్తం చిందనీయకుండా నన్ను సాధునుండి తప్పించు.  నన్ను నావ కెక్కించు” మోకరిల్లాడు ఇర్ఫాన్. 

అతడి కన్నీటిని చూసి సులేమాన్ కంఠం పెగలడంలేదు ‘సాధు వచ్చాడని ఇర్ఫాన్ ఇంతగా కదలిపోయాడా!  నమ్మశక్యంగా లేదే!”.

 

* * * * *

 

“సాధూ..” ఒకనాటి స్నేహితుడు ఎదురొస్తున్నాడు.  ‘ఏదో చెడువార్తే’ కలవరంగా ఆగిపోయాడు సాధు. ‘రజియా చనిపోయింది.  నీ పేరే కలవరించింది.  నువ్వు వస్తావనుకోలేదు.  ఆమె కఫన్‌లోకి వెళ్ళిపోతోంది.  త్వరగా వెళ్ళు, ఆఖరి చూపుదక్కించుకో” వగరుస్తున్నాడు. 

నిముషం తర్వాత ఆ మాటలు అర్థం అయ్యాయి.  “రజియా” పెద్దగా ఏడుస్తూ పరిగెత్తాడు సాధు. ఇల్లు చేరాడు.  ఎదురుగా తెల్లటి బట్టలో చుట్టేసిన మృతదేహం! “ఆగండి! ఆమె నా భార్య.  ఆఖరి చూపు కూడా దక్కనీయకుండా చేస్తారా.  తొలగించండి ఆ కఫన్ ని”

పెనుకేకలు పెట్టే సాధుని అడ్డుకున్నాడు సులేమాన్.  “సాధూ! రజియా సిసలైన ముస్లిం.  ఎందరో ముస్లింలను పొట్టన బెట్టుకున్న నీకు ఆమెను చూసేందుకు, తాకేందుకు అర్హత ఉందా?” గద్దించాడు. 

స్థాణువయ్యాడు సాధు.  లేదన్నట్లు తలాడిస్తూ, నేలమీదికి ఒరిగిపోయి రోదిస్తున్నాడు.

 

* * * * *

 

 

టక.. టక.. టక.. లయబద్ధమైన చెప్పుల చప్పుడు.  పాదాల కింద నలిగే ఎండుటాకులు, నింగికీ, నేలకీ నడుమన సాగే పల్లకీ.  రెపరెపలాడ్తున్న ఆకుపచ్చని బట్ట.  “సాధూ ఇక నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఇది రజియా కోరికే” సులేమాన్ కంఠం తడబడింది. 

పెనుగాలి వీచింది.  బట్ట ఎగిరింది.  సాధు కళ్ళు చురుగ్గా చూశాయి.  భృకుటి ముడిపడింది.  “ఆగండి” పెద్దగా అరిచాడు.  లోపలున్న ఇర్ఫాన్, మోస్తున్న సులేమాన్‌ల గుండెలు క్షణం ఆగిపోయాయి.

 

“సులేమాన్! కఫన్ రక్తంతో తడిసి పోతోంది.  మృతదేహం నుండి రక్తం కారదు.  దింపండి, దింపండి” సాధు మాటలకి సులేమాన్ తప్ప, మిగిలిన వారు ఆశ్చర్యంతో భయంతో దించేశారు.

“సాధూ.. ఆగు.. నా మాట విను” అడ్డొచ్చిన సులేమాన్‌ను తోసేసి, కఫన్ ని చేతులతో చించేశాడు. 

“ఇర్ఫాన్!” నిర్ఘాంతపోయాడు సాధు.  ఇర్ఫాన్ లేచాడు.  రక్తం స్రవిస్తున్న పొట్టని అదిమిపట్టుకుని ముందుకు నడవసాగాడు.  “ఇర్ఫాన్! నువ్వు బ్రతికే ఉన్నావా” సంభ్రమంగా అడిగాడు సాధు. 

“సాధూ! ఇర్ఫాన్ కొన ఊపిరితో బ్రతికాడు.  తన ప్రాణానికి తెగించి రజియాకి సర్జరీ చేశాడు.  నీ రజియా బ్రతికింది.  ఇంకా స్పృహలోకి రాలేదు. నీకు అబద్దం చెప్పాం” సులేమాన్ మాటలకి ఆనందంతో కౌగిలించుకున్నాడు సాధు.  క్షణం తరువాత “ఇర్ఫాన్” అంటూ కేక వేశాడు.

 

“సాధూ! ఆగు రక్తం చిందనీయనని వాగ్దానం చేశాను.  లేదా ఇక్కడే నిన్ను నరికేసేవాడిని.  ఇర్ఫాన్ మీద చేయివేశావా, ఖబడ్దార్!”

సులేమాన్ ఆగ్రహాన్ని పట్టించుకోలేదు సాధు. నడవలేక నడుస్తున్న ఇర్ఫాన్‌ని చూశాడు. “ఓ కొదమ సింహమా”! ఆ కంఠంలో వ్యంగ్యం, ఆగ్రహం. ఇర్ఫాన్ వెనుదిరిగాడు.  “ఒక్క తుపాకీగుండు తాకిడితో, మృత్యుభయం తెలిసి వచ్చిందా? నిన్ను చంపాలని రాలేదులే.  ఒక ఆడదాని ‘కఫన్’ చాటుచేస్కుని పారిపోతున్న ధీరుడా! వెళ్ళు” సాధు కేకలతో  శ్మశానం మారుమ్రోగింది.

 

ఇర్ఫాన్ ఆగాడు.  “సాధూ! నాకు ప్రాణం మీద తీపి లేదు.  ఇక జీవితం మీద ఆశ కూడాలేదు.  కానీ, ఈ ఒక్కరోజు నన్ను వదిలెయ్యి.  నా ప్రాణాన్ని ఇప్పటి కోసం నిలుపు”.

గుండెలు బద్దలయ్యేలా రోదిస్తున్న ఇర్ఫాన్ ని చూసి స్తంభించిపోయాడు సాధు. “ఏం? ఎందుకు” అస్పష్టంగా అడిగాడు.

 

“గాంధీ పిలుపు అందింది.  నా చిరకాల వాంఛ నెరవేరబోతుందనుకున్నాను. అదే నా ఆఖరి కోరికగా మారింది.  ఆ పాదాలను కడసారి తాకనివ్వు” ఇర్ఫాన్ మాటలకి సాధుతో పాటు సులేమాన్ కూడా చకితుడయ్యాడు.  “ఇంత క్రితమే తెలిసింది.  గాంధీ వెళ్ళిపోయారు.  నాథూరాం గాడ్సే చేతిలో హతమయ్యారు.  బాపూ ఈజ్ ఫైర్డ్”  పిచ్చివాడిలా అరుస్తూ కుప్పకూలాడు ఇర్ఫాన్. 

దుమ్మురేపుకుంటూ గాలి వీచింది. స్మశాన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏడుపులు మారుమ్రోగాయి.  దేశం రోదనలతో దద్దరిల్లుతోంది.

“గాంధీ" అరుస్తూ మోకరిల్లాడు సాధు. ”బాపూ.. నన్ను మన్నించు.  ఇన్నాళ్ళు నిన్ను నీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేకపోయాను.  అపార్థాల చిచ్చుకి బలయ్యావా!" సాధు ఆవేశంతో గుండెల మీద చరచుకున్నాడు.  కన్నీటి వర్షంతో మట్టి తడిసిపోతోంది.

 

“పదండి! మహాత్ముడిని చూద్దాం.  తొలిసారి, తుదిసారి ఆ పాదాలు తాకుదాం” నడవలేకపోతున్న ఇర్ఫాన్ ని చేతుల మీద ఎత్తుకుని, నావ వంక పరుగుతీశారు సాధు, సులేమాన్.


1948… జనవరి 30

About రమ గమిని

శ్రీమతి రమ గమిని 2003 లో రాసిన మొట్టమొదటి నవల ’నా తీర్పు’ కు స్వాతి వారపత్రిక వారి అనిల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత రెండు నవలలు నవ్య పత్రికలోను, ఒక నవల ఆంధ్ర భూమిలోనూ ప్రచురితమయ్యాయి. ’ద్వారం’ అనే కథకు అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ప్రథమ బహుమతి లభించింది. ’కారణం’ కథకు సి.పి. బ్రౌన్ అకాడమీ వారి బహుమతి పొందారు. ’నా తీర్పు’ నవల టీవీ సీరియల్ గా రాబోతోంది. వివిధ పత్రికలలో ఆమె కథలు ప్రచురితమయ్యాయి. రచనా వ్యాసంగంతో పాటు, సంగీతంలో కూడా రమ గారికి ప్రవేశం ఉంది. వయొలిన్ వాదనలో డిప్లొమా పొందారు. సంగీత దర్శకత్వం ఆమెకు హాబీ. రొటీన్ కథలకు భిన్నంగా ప్రయోజనాత్మక రచనలు చెయ్యాలని రమ గారి సంకల్పం.
This entry was posted in కథ. Bookmark the permalink.

11 Responses to తుది విన్నపం

  1. vbdmrao says:

    A great convincing fact. Keep good to people, your life will be alright.

  2. sarma says:

    Chaalaa baguMdi

  3. రాజేష్ మారం says:

    Excellent… Stunning story..

Comments are closed.