తుది విన్నపం

“సాధూ! ఈ పెళ్ళి నాకు మంచే చేస్తుంది.  కానీ నువ్వెన్నో త్యాగాలు చేయాలి.  కుటుంబంతో, సమాజంతో పోరాడాలి.  నన్నే కాకుండా హబీబ్‌ని భరించాలి.  ఇప్పుడు నాకేం తక్కువ? నీ స్కూల్ నడిపేది నేనే.  నీకూ, ఇర్ఫాన్ కీ ఉద్యమంలో ఉడుతసాయం చేస్తున్నాను.  అండగా నువ్వున్నావ్.  మీ అమ్మా నాన్నలని నొప్పించకు” రజియా కాటుక కళ్ళలో విషాదం.  సాధు అలాగే చూస్తుండి పోయాడు.  “నువ్వు ఏరోజైనా నీ నిర్ణయానికి పశ్చాత్తాప పడ్డావంటే, అది నాకు రంపపుకోతే.  ఆ క్షణం రాకూడదు” రజియా చేప కళ్ళు రెపరెప లాడాయి. 

సాధు నవ్వాడు.  “నీ మొహం!" అంతలో హబీబ్ వచ్చాడు.  అమాయకంగా మెరిసే చిన్న చిన్న కళ్ళు.  “దాదూ” విశాలంగా నవ్వుతున్నాడు.  చేయి చాచి పిలిచాడు సాధు.  చిరుమొలకల్లా గుచ్చుకుంటున్న వాడి జుత్తుని ఆప్యాయంగా తడిమాడు.  “సాధూ కాదురా.. ఇక నుండి నువ్వు నా కొడుకువి. ‘అబ్బూ’ అను” రజియా వంక చూశాడు.  రజియా చకితురాలైంది.  ఆ ముఖంలో సిగ్గుదొంతరలు విరిశాయి.  “ఆ..బ్బూ” ఒత్తి పలికాడు, హబీబ్.  “ఆ.. అదీ.. అబ్బూ” ఉచ్చరిస్తూ ఒక చేత్తో హబీబ్ నీ మరో చేత్తో రజియానీ చుట్టేశాడు సాధు.

 

సాధు రైల్వేస్టేషన్‌కు పరుగున చేరుకున్నాడు.  “సాధూ” కదిలే రైలు నుండి తల్లికేక.  చప్పున అటు వెళ్ళాడు. కిటికీ ఊచలు పట్టుకుని నడవసాగాడు.  తల్లి అతడి తల నిమిరింది.  “మీ నాన్నగారి కోపం ఇట్టే పోతుంది.  క్షమార్పణ అడుగు” కన్నీళ్ళతో అంది. 

ముఖం తిప్పుకున్న తండ్రి చెయ్యి పట్టుకున్నాడు.  “మీ మనసు నొప్పించినందుకు క్షమించండి నాన్నా. దిక్కులేని ఆడపిల్లకు నేనున్నానని వాగ్దానం చేశాను.  మాట తప్పమంటారా” రైలు వేగం పుంజుకుంటుంది.  తండ్రి సాధుని చూడ్డం లేదు.  కానీ కన్నీటిని ఆపలేకపోతున్నాడు.  “మతం కన్నా మానవత్త్వం గొప్పది.  నా నిర్ణయం మార్చుకోలేను.  నన్ను మన్నించినట్లు ఒక్క ఉత్తరం రాయండి.  మీ పాదాల దగ్గర వాల్తాను.”  సాధుకీ కన్నీరొచ్చింది.  రైలు వెళ్ళిపోయింది.  కదిలే రైలు నుండి తండ్రి చూడ్డం కన్పించింది. “నాన్నా” ఉద్వేగంతో కొంతదూరం పరిగెత్తి ఆగిపోయాడు.  “చాలు నాన్నా! ఈ చూపే చాలు.  మీరు నన్ను తప్పక క్షమిస్తారు.  నాకా నమ్మకం ఉంది”.

* * * * *

స్నేహితుల సమక్షంలో రజియాని భార్యగా స్వీకరించాడు సాధు. “నీ స్నేహితుడినవడం గర్వంగా ఉంది” గాఢంగా కౌగిలించుకుని అభినందించాడు ఇర్ఫాన్.  “ఆ..బ్బూ” దాక్కున్న హబీబ్ వెనకనుండి సాధుపైకి దూకాడు.  భయపడిపోయినట్లు నటించాడు సాధు.  హబీబ్‌కి మహదానందమైంది.  “అబ్బూ.. పాయా” నవ్వుతూ అర్థించాడు హబీబ్.  ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు సాధు.  “ఇదుగోరా నీ పాయా”  పొట్లం అందించాడు.

 

“రజియా” కేకవేశాడు.  చెట్టునుండి బెండకాయలు కోస్తున్న రజియా, చప్పున వచ్చింది.  సాధు చేతిలోని సంచులు అందుకుంది.  అతడికి మజ్జిగ తెచ్చిచ్చింది.  రజియాని చూశాడు సాధు.  అంతులేని ఆనందం చేతికందినట్లు ధగధగలాడ్తోంది ఆ వదనం.  మల్లెలు మెరిసినట్లు నవ్వింది.  రజియా మితభాషి.  ఆ కళ్ళే ఎన్నో ఊసులు చెప్తుంటాయి.  “నేను, ఇర్ఫాన్ చుట్టుపక్కలి గ్రామాలకు వెళ్తున్నాం.  సామాన్లు జాగ్రత్తగా వాడుకో.  హబీబ్ జాగ్రత్త”  సాధు మాటలకి తలఊపింది.

* * * ** *


నాటకం జరుగుతోంది ప్రేక్షకులు లీనమైపోయి చూస్తున్నారు.  ఇర్ఫాన్ రచించిన డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి.  సులేమాన్ బ్రిటిష్ అధికారి వేషంలో కూర్చున్నాడు.  ఉద్యమకారుడైన వ్యక్తి, ప్రశ్నలు సంధిస్తున్నాడు.  అవి అస్త్రాల్లా ప్రజల్ని కుదిపేస్తున్నాయి.  సాధు గాంధీ వేషంలో చిరునవ్వుతో కూర్చున్నాడు.  తెరవెనక ఉన్న ఇర్ఫాన్, పోలీసుల రాకని గమనించాడు.  ‘ఇక నాటకాన్ని సాగనీయరు’!

చకచకా స్టేజీని సమీపించాడు. “సాధు! పోలీసులొచ్చారు! ఆపేస్తారు.  త్వరగా గాంధీ సందేశం విన్పించెయ్యి.  ఆ డైలాగులే ప్రధానం” తొందర చేశాడు.  సాధు పోలీసులవంక చూశాడు.  జనాన్ని దాటుకుంటూ వస్తున్నారు. 

సాధు చప్పున లేచాడు.  సులేమాన్ ఒంటి మీది కోటు, నెత్తిమీద క్యాప్ నీ లాగేసి కింద వేశాడు.  బిత్తరపోయిన సులేమాన్ ఒంటిని చేతుల్తో కప్పుకుని పక్కన నిలబడ్డాడు.  సాధు ఇర్ఫాన్ వంక చూస్తూ “ఏంటి నీ డైలాగుల వర్షం?  సందేశం నేనిస్తాను.  నాలుగు తగిలిస్తాను” అంటూనే కోటుని తొక్కసాగాడు. “ఫోండి! మా దేశం నుండి పోండి” పళ్ళుబిగువున కదం తొక్కుతున్నాడు.

“సాధు! గాంధీ వేషంలో ఉన్నావురా.  ఆవేశం వద్దు” తల పట్టుకున్నాడు ఇర్ఫాన్. 

పోలీసులు సాధుని కిందికి లాగారు.  “వాణ్ణి వదలండి.  నాటక రచయితని నేను” ముందుకు వచ్చాడు ఇర్ఫాన్, ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు.  నాలుగు రోజుల తర్వాత ఒంటి మీది దెబ్బలతో విడుదలయ్యారు.

 

* * * * * * *
 


కాలం పరుగులు పెడ్తోంది.  ప్రపంచ యుద్ధాలు, వాటి పరిణామాలు దేశపు రాజకీయస్థితిని ప్రభావితం చేస్తున్నాయి.  భారత చరిత్ర పుటల్లో ఎన్నో ఉద్యమాలు, నినాదాలు, సంస్కరణలు, ఎందరో దేశభక్తులు, విప్లవవీరులు, ఉద్యమకారులు, మరెన్నో సమర్థనలు, వ్యతిరేకతలు అన్నీ తమ ముద్రలను మరింత గాఢతరం చేస్కున్నాయి.

 

దశాబ్దాల మహత్తరపోరాటం, ఎట్టకేలకి స్వాతంత్రాన్ని సాధించింది.  ఆ వెలుగు రేఖలు విచ్చుకోకముందే విభజన భారత దేశాన్ని ముక్కలు చేసింది.  రక్తపాతంతో దేశాన్ని తడిపేసింది.

* * * * * * *

 

రచ్చబండ దగ్గర కూర్చుని ఉన్న సాధు చేతిలో ఉత్తరం నలుగుతోంది.  “సాధూ! ఘోరం జరిగిపోయింది.  మీ నాన్నని తీవ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు.  నిన్నే కలవరిస్తూ ప్రాణాన్ని విడిచారు. “సాధూ.. సాధూ..” అంటూ ఊపిరి వదిలేశారు.  పెద్దన్నయ్య జాడలేదు.  ఎటు వెళ్ళాడో ఏమైయ్యాడో మేమంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉన్నాం.  నీవు వెంటనే రావల్సింది”. 

“నాన్నా” సాధు అంతరంగం దుఃఖంతో గుక్కపెడ్తోంది. కళ్ళనుండి ఒక్క అశ్రువు కూడా రావడం లేదు.  ఈ వార్త తెలిపిన స్నేహితులు, చుట్టు పక్కలివాళ్ళు భయభ్రాంతులైయ్యారు.  మౌనమూర్తిలా ఇంటివంక నడిచాడు సాధు.  అతణ్ణి పలకరించే సాహసం ఎవరికీ లేదు.

 

“అబ్బూ” వెనక నుండి సాధు మెడని కౌగిలించుకున్నాడు హబీబ్.  ఉలిక్కిపడ్డాడు సాధు.  ఒక్క క్షణం గుర్తించనట్లు చూశాడు.  ఎవరి మీదో తెలియని కసి, కోపం, నిస్సహాయత పెల్లుబికాయి.  పళ్ళ బిగువున హబీబ్ చేతులు విదిలించి, ఒక్క నెట్టు నెట్టాడు.  ఆ విసురుకి అదిరిపోయాడు హబీబ్.  కిందపడడంతో కాలు మెలితిరిగి నొప్పిపుడ్తోంది. ఆ మాట చెప్పే ధైర్యం చేయలేకపోయాడు.

 

లేచి నిటారుగా నడుస్తూ అరుగుమీదికి చేరాడు.  “అబ్బూ.. పాయా” నోటినుండి వెలువడిన మాటని చేత్తో మూసేస్తూ కన్నీళ్ళతో ఆకాశం వంక చూస్తుండిపోయాడు.

 

రజియాకి వార్త తెలిసింది.  ఆమె నమాజ్ లో ఉంది.  మూసిన కళ్ళనుండి కన్నీటిధారలు చాచిన అరచేతులతో అర్థించింది “మౌలా! నా భర్తకి ప్రశాంతతని ఇవ్వండి.”

* * * * * * *

రజియా ఎవరో తట్టినట్లే లేచింది.  ‘ఎందుకు మెలకువ వచ్చింది’.  అటు ఇటు చూసింది.  నిద్రలోనే దుఃఖిస్తున్న సాధు.  తల మీద చేయి వేయబోతోంది.  “అమ్మా! కొడుకుగా నాన్నకీ, నీకూ ఏం ఇచ్చాను? మనస్తాపాన్ని, కన్నీళ్ళని కానుక ఇచ్చిన నన్ను నాన్న కలవరించారా! ఆ ఋణం తీర్చుకునేందుకు ఏదో చెయ్యాలన్న ఆత్రుత నాలో ఉప్పొంగుతోంది.  కానీ నా కాళ్ళకి సంకెలలున్నాయి.  నేనే కోరి వరించి వేస్కున్న సంకెల”

సాధు కలవరింతలకి సర్పద్రష్టలా చేతిని వెనక్కిలాక్కుంది రజియా.  ఉదరాన్ని తిప్పేసే దుఃఖం. శబ్దం చేయకుండా వసారాలోకి వచ్చింది.  మిణుకుమిణుకు మనే తారలు, చల్లని వెన్నెల, వీచేగాలి ఆహ్లాదాన్ని కల్గించక పోగా హృదయాన్ని మండిస్తోంది.  ‘ఆయన పశ్చాత్తాపపడ్తున్నారు.  ఆయన దుఃఖానికి నేనే కారణం, తనవాళ్ళ దగ్గరికి వెళ్ళాలని తహతహలాడ్తున్నారు.  ఆపుతున్న సంకెల నేనే చేతుల్లో ముఖం దాచుకుంది.

* * * * * * *

 

రైలు వేగంగా వెళ్తోంది.  రాజకీయ పరిణామాలు, దేశ విభజన జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.  పారే నీటిలా ఒక ప్రాంతం నుండి మరోచోటికి వలస వెళ్ళేవాళ్ళు, ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయేవాళ్ళూ, తప్పిపోయిన తమవారిని వెతికే వాళ్ళు, కడసారి చూపు కోసం కలవరించేవాళ్ళు… వివిధ రకాల విషాదాలతో క్రిక్కిరిసి ఉంది రైలు.  రజియాని, హబీబ్‌ని కూర్చోబెట్టాడు సాధు.  తనకు నిలబడేందుకైనా స్థలం దొరకడం లేదు.  మధ్యన దూరే జనం, స్త్రీలు, పిల్లలు, కనుచూపు చివర్లో నిలబడ్డాడు సధు.  దుఃఖం, అలసట, ఆకలి, నిద్ర కమ్ముకుంటున్నాయి.  నిద్రకళ్ళతో రజియాని చూశాడు.  కిటికీనుండి అస్తమించే సూర్యుణ్ణి చూస్తోంది.

 

తన బాధ ఆమె కళ్ళలో ప్రతిఫలిస్తోంది.  ‘రజియాతో రెండు రోజులుగా తనొక్క మాటైనా మాట్లాడలేదు.  ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది.  తెలుసుకున్నట్లు అన్నీ సర్దేసింది.  తన వెంటే నడిచింది.’ ఆ క్షణం రజియా ఒడిలో తలవాల్చి కరువుదీరా ఏడ్వాలనిపించింది. చెమర్చిన కళ్ళతో హబీబ్ ని చూశాడు.  అప్పటిదాక సాధునే చూస్తున్న హబీబ్ తత్తరపడ్తూ చూపుతిప్పుకున్నాడు.  సాధు మనసు ద్రవించింది.  ‘నిన్నటి తన కోపానికి భయపడిపోయాడు’!  వాడిని గుండెలకి హత్తుకోవాలన్న పితృప్రేమ పెల్లుబికింది.  మగత ఆవరిస్తోంది. 

ఎంతసేపు గడిచిందో! కలకత్తా వచ్చేసింది.  జనం తోపులాట! ‘హబీబ్‌ని తొక్కేస్తారేమో! అటు చూశాడు.  రజియా ఒక్కతే పడుకునుంది.  ముఖాన చెంగు.  “రజియా హబీబ్ ఏడి” దగ్గరగా వచ్చాడు.  చెంగు తొలగించిన ఆమెని చూసి అదిరిపడ్డాడు.  ఆమె రజియా కాదు. “రజియా.. హబీబ్” కేకలు వేస్తూ వెతకసాగాడు. ‘అరె! తనొక్కడి బట్టల మూటే ఉందేంటి’ అందుకొని చూసాడు.  అందులో చెక్కిన కాగితం.  ఆత్రంగా తెరిచాడు.

“పాకిస్థాన్‌లోని దూరపు చుట్టాల నుండి పిలుపు వచ్చింది.  రెండురోజులుగా చెప్పాలని చూశాను.  ధైర్యం చాలలేదు.  నన్నీ బంధం నుండి విముక్తురాల్ని చేయండి.  వెళ్తున్నాను.  రజియా” నమ్మలేనట్లు మళ్ళీ మళ్ళీ చదివాడు.  రైలు కూత వేస్తోంది.  నిస్త్రాణగా తన మూట అందుకుని దిగాడు.  అన్నయ్య ఇంటివంక అడుగులు వేయసాగాడు.  శరీరంలోని ఒక్కో రక్తపు బొట్టు వేడెక్కసాగింది.  కదిలే అగ్నిగుండంలా ఉన్నాడు.  “రజియా! వెన్నుపోటు పొడిచావు.  నీకోసం నా తల్లిదండ్రుల్నీ, వంశాన్నీ తృణప్రాయంగా వదిలేశాను.  నన్నో గడ్డిపోచలా తీసేశావు.  నీకు.. కాదు, మీకు మనసు లేదు.  ఇన్నాళ్ళూ ఒక తల్లి బిడ్డలుగా కలిసి ఉన్న దేశంలో విభజన రేఖ గీశారు.  మా దేశంలో, మమ్మల్ని ఊచకోత కోస్తున్నారు.  మా హృదయాలతో, భావాలతో, రక్తంతో ఆడుకుంటున్నారు.  నాకిక ఈ బంధం వద్దు.."

వీధిలో ఆక్రందనలు.  పోలీసుల ఈలలు.  లాఠీ దెబ్బలు.  చెలరేగే నల్లటి పొగలు.  చెవులు చిల్లులు పడే తుపాకీ శబ్దాలు.  మనసు కీడు శంకిస్తోంది.  ఇంట్లోకి అడుగుపెట్టాడు.  ఒక్కక్షణం ఊపిరి ఆగింది.  ఇల్లంతా రక్తం, చెల్లాచెదురైన శవాలు.  “అమ్మా.. అన్నయ్యా.. అయ్యో”, దుఃఖంతో ఆక్రందనలు చేశాడు సాధు. పిచ్చివాడిలా కేకలు వేస్తూ వీధిలోకి వచ్చాడు. 

ఎవరో ఎవర్నో తరుముతున్నారు.  భయం భూతంలా వెంటాడుతోంది.  గుండెలు పగిలేలా ఏడుస్తూ ఒక చెట్టు చాటున దాక్కున్నాడు.  ఎవరో వచ్చే అలికిడి.  వెక్కిళ్ళ శబ్దాన్ని చేత్తో గట్టిగా నొక్కాడు.  భుజాన్నెవరో తట్టారు.  “వద్దూ. వద్దూ” కన్నీళ్ళతో ప్రాధేయపడ్డాడు సాధు. 

అవతలి వ్యక్తి సాధుని లేపి గుండెలకి హత్తుకున్నాడు.  “నువ్వెవరి కొడుకువి” గంభీరమైన కంఠం. 

తండ్రి పేరు ఉచ్చరించాడు సాధు.

“నీ పేరు”?  అడిగాడు ఆ వ్యక్తి ఏడుస్తూనే చెప్పాడు సాధు.

“కళ్ళు తుడుచుకో! ఇదే నువ్వు రాల్చిన ఆఖరి అశ్రువులు. ఇక ముందు నువ్వు చిందించేది కన్నీళ్ళని కాదు, ప్రత్యర్ధుల రక్తాన్ని.  తీర్చుకోవలసింది, నీ గుండెబరువుని కాదు., నీ జాతి ఋణాన్ని.  అందుకో”

పొడవాటి ఖడ్గాన్ని అందించే ఆయన వంక అదురుపాటుతో చూశాడు సాధు. “కానీ.. నేను.. ఇంతక్రితం.” తడబడ్డాడు.

“క్షణం క్రితం నాకెదురైన సాధు మరణించాడు.  నా ముందున్నది సరికొత్త వీరుడు.  అణచివేయబడ్తున్న జాతిని నిలబెట్టే ధీరుడు. ఈ బాబాజీ సరికొత్త వారసుడు”

సాధు కళ్ళు మూస్కున్నాడు.  ప్రతీకార జ్వాలతో హృదయం మండిపోతోంది. “అవును. ఈ అన్యాయాన్ని తుదముట్టిస్తాను.  ఈ దురాగతాన్ని అంతం చేస్తాను. ఈ దుష్టత్వానికి చరమగీతం పాడతాను.  మండుతున్న నా గుండెని, నా శత్రువుల రక్తంతో చల్లబరుస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం! ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’, సాధు కేకలు అతడి అంతరంగంలో ప్రతిధ్వనించాయి.

 

* * * * * * *

 

ఇర్ఫాన్ ప్రెస్ లో ఉన్నాడు.  తను రాసిన కాగితాలన్నిటినీ జాగ్రత్తగా సర్దాడు.  “మానవ్” పిలిచాడు.  మానవేంద్ర వచ్చి ఆ కాగితాలని అందుకుని చదివాడు.  “నీలోని గాంధి! అవును, ఆ ఉపన్యాసాలు జైల్లోని ఖైదీలకి చేరాలి.” అలసటగా కళ్లు మూస్కున్నాడు ఇర్ఫాన్. 

మానవేంద్ర ఇర్ఫాన్  భుజం మీద చేయి వేశాడు.  “ఇర్ఫాన్! ఇన్నాళ్ళూ బ్రిటిష్‌పైకి ఝుళిపించిన నీ కలం, ఇప్పుడు మతోన్మాదం మీదికి ఎక్కుపెట్టబడింది.  అటు హిందూ ఉగ్రవాదులు ఇటు నీ మతస్థులు కూడా నీవంటే మండిపడ్తున్నారు.  నీ పత్రిక చదివిన సామాన్యప్రజలు నీ వాదనకే వస్తున్నారు.  మొన్న భయభ్రాంతులైన హిందువులకి ఆశ్రయం ఇచ్చి తెప్పలెక్కించావు.  ఔన్న ముస్లిం బాధితులని హిందూఖడ్గానికి బలి అవకుండా కాపాడావు.  ఆ ఖడ్గాలూ, తుపాకీలు, బాంబులు నీమీదకి మళ్ళుతున్నాయి. తెలుసు కదా”

ఆ మాటలకి అవునని తలాడించాడు ఇర్ఫాన్. “తెలుసు మానవ్! నాకెంతో వయసు ఉంది. బలమైన శరీరం, అంతకన్నా ధృఢమైన మనోశక్తి తోడున్నాయి.  వీటన్నిటికన్నా గొప్ప స్ఫూర్తి, గాంధీ నా హృదయంలో ఉన్నారు.  నేను సాధ్యమైనంత వరకూ తీవ్రవాదుల చేతికి చిక్కకుండా కాపాడుకుంటాను. నా ప్రతి రక్తపుబొట్టునీ, భారతీయుల రక్షణకీ, సేవకీ ఉపయోగిస్తాను” ఇర్ఫాన్ లేచి కొన్ని పుస్తకాలను కాగితాలను భద్రం చేశాడు. 

“మానవ్! నా సంపాదకీయం, ఆర్టికల్స్ ‘బాబాజీ’ని రెచ్చిపోయేలా చేస్తున్నాయి.  వాళ్ళ కార్యకలాపాల మీద నేనూ నిఘాపెట్టాను. మరోనాలుగురోజుల్లో మారణహోమం సృష్టించబోతున్నారు. వాళ్ళ స్థావరానికి వెళ్ళగలిగితే, వాళ్ళు సేకరించిన ఆయుధాలనీ, వాళ్ళ పథకాలనీ చిత్తు చేయగలిగితే ఎందరినో కాపాడిన వాణ్ణౌతాను.”

 

“కానీ.. అది నీ ప్రాణానికే ప్రమాదం” ఆందోళనగా అన్నాడు మానవ్. 

ఇర్ఫాన్ సమాధానం చెప్పలేదు.  “ఇదుగో, ఈ పుస్తకాలలో నేను రాసిన గాంధీ సంభాషణలు, సందేశాలు పొందుపరిచాను.  ఈ పరిస్థితుల్లో ఈ ఉపన్యాసాలు అత్యవసరం.  ఇవి చదివితే, మతోన్మాదులుగా మారబోయే కొందరిలోనైనా మార్పువస్తుంది. గాంధేయవాదం ఈ దేశప్రజలకి ఊరటనిస్తుంది.  కొత్త ఆశలు, ధైర్యం చిగురించేలా చేస్తుంది.  మన ప్రెస్ మీద దాడి జరగవచ్చు. ఈ ఖరీదైన మెషినరీని కొన్నాళ్ళు దాచేయాలి.  చేతి వ్రాతతోనే పత్రికను విడుదల చేయాలి”. 

మానవ్ తల ఊపాడు.  ఇర్ఫాన్ మానవ్ ను కౌగిలించుకున్నాడు.  “నేను తిరిగివచ్చినా రాకపోయినా పత్రికను కొనసాగించు”! మానవ్ కి దుఃఖం వచ్చింది.

 

* * * * * * *
 

About రమ గమిని

శ్రీమతి రమ గమిని 2003 లో రాసిన మొట్టమొదటి నవల ’నా తీర్పు’ కు స్వాతి వారపత్రిక వారి అనిల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత రెండు నవలలు నవ్య పత్రికలోను, ఒక నవల ఆంధ్ర భూమిలోనూ ప్రచురితమయ్యాయి. ’ద్వారం’ అనే కథకు అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ప్రథమ బహుమతి లభించింది. ’కారణం’ కథకు సి.పి. బ్రౌన్ అకాడమీ వారి బహుమతి పొందారు. ’నా తీర్పు’ నవల టీవీ సీరియల్ గా రాబోతోంది. వివిధ పత్రికలలో ఆమె కథలు ప్రచురితమయ్యాయి. రచనా వ్యాసంగంతో పాటు, సంగీతంలో కూడా రమ గారికి ప్రవేశం ఉంది. వయొలిన్ వాదనలో డిప్లొమా పొందారు. సంగీత దర్శకత్వం ఆమెకు హాబీ. రొటీన్ కథలకు భిన్నంగా ప్రయోజనాత్మక రచనలు చెయ్యాలని రమ గారి సంకల్పం.
This entry was posted in కథ. Bookmark the permalink.

11 Responses to తుది విన్నపం

  1. vbdmrao says:

    A great convincing fact. Keep good to people, your life will be alright.

  2. sarma says:

    Chaalaa baguMdi

  3. రాజేష్ మారం says:

    Excellent… Stunning story..

Comments are closed.