శ్రీఖర ఉగాది కథలపోటీలో మొదటి బహుమతి పొందిన కథ.
————————————————————-
టక.. టక.. టక.. లయబద్ధమైన చెప్పుల చప్పుడు. పాదాల క్రింద నలిగే ఎండుటాకులు! అంతిమ యాత్ర సాగుతోంది. మోసే నలుగురిలో విషాదం. వారికి నాలుగడుగులు వెనుక నడుస్తున్నాడు ‘సాధు’. నింగికీ, నేలకీ నడుమ సాగుతున్న పల్లకీ మీద గాలికి రెపరెపలాడుతున్న ఆకుపచ్చని బట్ట.
“రజియా! ఒకనాడు నీ భర్తగా నీ మీద సర్వాధికారాలూ ఉన్నవాణ్ణి. ఈరోజు? నిన్ను కడసారి చూసే అర్హతనీ పోగొట్టుకున్నాను. ‘నేను మారాననీ, నీ ఇష్టప్రకారమే నడుచుకుంటానన్న’ ఆఖరి మాటైనా చెప్పలేకపోయిన దురదృష్టం నాది. ‘నన్ను క్షమించమనే నా తుదివిన్నపం నిన్ను చేరగలదా….?”
వేగంగా కొట్టిన గాలికి బట్ట కదిలింది.
పల్లకీలో, కఫన్‌లో చుట్టబడిన ఇర్ఫాన్ కళ్ళ నుండి అశ్రుధారలు. ‘ఎలాటిరోజును చూస్తున్నాను? ప్రాణం దక్కించుకునేందుకు కలుగులోని ఎలుకలా పారిపోతున్నాను. ఆనాటి ప్రియనేస్తం సాధు, ఈ రోజు శత్రువై వెంటాడుతున్నాడు. నాకు ఆయువు ఉందా? తప్పించుకుని నదిలోని నావను చేరుకోగలనా…?’
ఎగురుతున్న ఆకుపచ్చని బట్టని సర్దాడు సులేమాన్! అడుగు ముందుకు వేస్తూనే, భుజం మార్చుకున్నాడు. ఓరగా సాధుని చూశాడు. ‘సాధుని ఇక్కడితో ఆపేయాలి. శ్మశానాన్ని చేరకముందే అడ్డుకోవాలి. ఇర్ఫాన్‌ని ఒడుపుగా తప్పించాలి. నావను అందుకునేలా చేయాలి. సాయం చేయడం తప్ప, పొందడం తెలీని ఇర్ఫాన్, మొట్టమొదటిసారి తనముందు మోకరిల్లాడు. “రక్తం చిందనీయకుండా, సాధు నుండి తప్పించి నావకు చేర్చు” అని అర్థించాడు.
నా స్నేహితుడి కోరిక తీర్చగలనా…?’
* * * * *
ఆకుపచ్చని గ్రామం. ఒక్కంగ దాటితే ఉత్తరం, క్రిందికి జారితే దక్షిణం అన్నట్లు దేశం నడుమన మాణిక్యంలా మెరుస్తుంటుంది. ఎందరో స్వాతంత్ర్యయోధులు తమ దేశభక్తిని చాటుకున్న ప్రాంతం. అక్కడ చరిత్ర కెక్కిన వారికన్నా ఆ పుటలు తాకని వారే ఎక్కువ. వీరత్వాన్ని ప్రదర్శించే ధీరులు, వాళ్ళ చాటున ఉండే సామాన్యులు, బ్రిటిష్‌ని ఎదిరించే వారు, ప్రభుత్వోద్యోగులు, ఉద్యమకారులు… -అందరి సమ్మేళనం ఆ ఊరు.
* * * * *
స్కూలు వార్షికోత్సవం! బ్రిటిష్ అధికారి అతిథిగా వచ్చాడు. ఆయన గురించిన ప్రశంసలను కవితలాగ వ్రాసి బట్టీ వేయించిన మాస్టారు, ఇర్ఫాన్ ను స్టేజిపైకి పంపించాడు. “దొరగారికి శాల్యూట్ చేయడం మర్చిపోకు” మరోసారి హెచ్చరించారు. ఇర్ఫాన్ దొరగారి వంక చూస్తూ "ఓ బ్రిటీష్ వెళ్ళిపో… మా దేశం నుండి వెళ్ళిపో… మీ పాలన మాకొద్దు వెళ్ళిపో… మేం గాంధీ ప్రేమికులం… వెళ్ళిపో” చకచకా చదివేశాడు. టీచర్లంతా అదిరిపోయారు. ప్రాంతీయభాష తెలియని ఆ బ్రిటీష్ వ్యక్తి చిరునవ్వుతో ‘ఏంట’ని అడిగారు. సర్దిచెప్తున్నారు టీచర్. “రజియా, ఇంగ్లీష్ లో రాశావా” సాధు అడిగాడు. “ఇదిగో” అందించింది రజియా. సాధు పరుగున స్టేజీ ఎక్కాడు. “ఐ విల్ ట్రాన్స్‌లేట్” వచ్చి నిలబడ్డాడు. “ఓ బ్రిటిష్, గో ఎవే.. ఫ్రం అవర్ కంట్రీ గో ఎవే.. విడోంట్ నీడ్ యువర్ రూల్ గో ఎవే.. వి లవ్ గాంధీ గో ఎవే” తలూపుతూ, చదివేశాడు. ఆగ్రహంగా లేచాడా అధికారి. పెద్ద గొడవ, సంప్రదింపులు, సర్దుబాట్లు జరిగాయి. సాధు, ఇర్ఫాన్‌లు స్కూల్‌నుండి బహిష్కరింప బడ్డారు.
* * * * *
పసికూనలు యువసింహాలయ్యారు. వయసుతో పాటు దేశభక్తి మరింతగా ఇనుమడించింది. సాధు బి.ఎ పూర్తి చేశాడు. ఆవేశపూరితమైన రక్తం. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని, అమలు చేసేయడం సాధు ప్రత్యేకత. ఏ విషయాన్నైనా తర్కంతో ఆలోచించడం అతడి ప్రవృత్తి. మత ఛాందసవాదం, మూఢ నమ్మకాలు, అర్థం తెలీని సంప్రదాయాలకు సాధు వ్యతిరేకి. రజియాతో చిన్ననాటి స్నేహం, ప్రేమబంధమై అతణ్ణి పెనవేసుకుంది.
రజియా ఇప్పుడు ఒంటరిదైంది. తన ఆఖరి తమ్ముడు హబీబ్ బాధ్యత ఆమె మీద ఉంది. బుద్ధిమాంద్యంతో పుట్టిన హబీబ్ ని కన్నతల్లిలాగ సాకుతుంది. పదమూడేళ్ళ హబీబ్, శారీరకంగా, మానసికంగా ఎనిమిదేళ్ళ ఎదుగుదలతోనే ఉన్నాడు. అతడి మాట కూడ స్పష్టంగా ఉండదు. రజియాతో పాటు హబీబ్ అన్నా ప్రాణం పెట్టేస్తాడు సాధు.
ఇర్ఫాన్ ఆర్.ఎం.పి డాక్టర్ అయ్యాడు. గాంధీ మాటే అతడి బాట. గవర్నమెంట్ ఉద్యోగాన్ని తృణీకరించేశాడు. మాతృభూమి విముక్తి అతడి లక్ష్యం. భారతీయుల సేవే ధ్యేయం. కాంగ్రెస్ కార్యకర్తగా మనసా వాచా కర్మణా శ్రమిస్తాడు. ఇర్ఫాన్ కవి, వక్త, నాటకరచయిత. ఆ కలంపోటుకీ, వాగ్ధాటికీ ఎదుటివారు చిత్తరువులు కావల్సిందే. ఫుట్‌బాల్ ఆటలో ఇర్ఫాన్ ఓ చిరుతపులి. చుట్టుపక్కల ఊళ్ళలోని కాలేజీలలో ఇర్ఫాన్ ఆట, ప్రసంగాలు, నాటకాలు, రచనలు మారుమ్రోగిపోయి, యువతను అతడి అభిమానులుగా చేసేశాయి.
తన నాటకాలలో భారత చరిత్రలోని ఖిలాఫత్, సహాయనిరాకరణ, శాసనోల్లంఘన, ఖాదీ ఉద్యమం లాంటివెన్నో రాసి ప్రదర్శించి, ప్రజలని ఉత్తేజితుల్ని చేసి ప్రభావితం చేస్తాడు ఇర్ఫాన్. అతడిచ్చే సందేశం ప్రేక్షకుల హృదయంలో నాటుకుంటుంది. సాధు, ఇర్ఫాన్ గొప్ప స్నేహితులు. సాధు అన్నిటికీ ఇర్ఫాన్ సలహా తీస్కుంటాడు.
* * * * *
“ఇర్ఫాన్! బ్రిటిష్ ఆఫీసు ప్రాంగణంలో మనం మొక్కలెందుకు నాటాలి” కోపంగా అడిగాడు సులేమాన్. ఇర్ఫాన్ గొప్పులు తవ్వుతున్నాడు. “మట్టిమనది. దేశం మనది. వాళ్ళు వెళ్ళిపోతారు. అయినా కాలేజీ పనిమీద వచ్చాం. ఈ పనీ అవుతుందిగా” అంటూ లేచి సంచి నుండి కొన్ని మొక్కలు బైటికి తీశాడు. అతడి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. వాటిని వరుసలుగా అమర్చాడు. ఆకులు విరిసి ఉన్న జానెడు ఎత్తు మొక్కలవి.
“ఇర్ఫాన్! నీ చేతికి దెబ్బ తగిలింది. రక్తం వస్తోంది” సులేమాన్ చెప్పాడు. ఇర్ఫాన్ చూసుకున్నాడు. బంకమట్టి ముద్దని అరచేత్తో తీస్కుని గాయం మీద రాస్కున్నాడు. “గాంధీ వైద్యమా” సులేమాన్ మందహాసం చేశాడు. “అణువణువులో తననే నింపుకున్న నిన్ను చూసి గాంధీ ఏమంటారో? ఆయనని చూడాలన్న నీకోరిక తీరాలి. త్వరగా తీరాలి”!
ఆ మాటలకి ఇర్ఫాన్ కళ్ళు మెరిశాయి. “గాంధీ మహాసాగరం. నాలాటి నీటిబొట్లు ఎందరో! ఈ శరీరం నేను, హృదయం గాంధీ. కలం నాది కవనం గాంధీ. మాట నాది, భావం గాంధీ. ప్రయత్నమే నాది, ఉద్యమం గాంధీ”!
కంపిస్తున్న ఆ కంఠంలోని ఆర్తి సులేమాన్ కళ్ళని తడిచేసింది. ఇర్ఫాన్ నవ్వాడు. “గాంధీకి ఉత్తరం వ్రాశాను. జవాబు కోసం వెయ్యి కళ్ళతో చూస్తున్నాను. పిలుపునివ్వకపోతారా? రెక్కలు కట్టుకుని వాలిపోతాను. ఒక్కసారి ఆ పాదాలు తాకాలి. అంతే”. తల ఊపాడు సులేమాన్. “అటు చూడు” ఇర్ఫాన్ చూపించిన వైపు చూశాడు. “అరె! ఏంటా రంగులు” ఆశ్చర్యంగా అన్నాడు సులేమాన్. ఇర్ఫాన్ అమర్చిన మొక్కలు ఒక వరుస నారింజ రంగు, మధ్యలో తెలుపు, క్రింది వరుస ఆకుపచ్చలో మెరుస్తున్నాయి. “రంగులు అద్దితెచ్చాను. ఇవి ఒక విధమైన దురద మొక్కలు. తాకితే దద్దుర్లు వస్తాయి. వాటిని ఎవరూ పీకలేరు. అవి అలాగే ఎదుగుతాయి. చూసేందుకు అందంగా లేవూ?”
సులేమాన్ అలాగే చూస్తుండిపోయాడు. చుట్టూ నాటిన ఎన్నో మొక్కల మధ్య ఒదిగినట్లుగా ఉన్న మూడు వరసలు. చిరుచీకట్లు ముసిరే ఆ సాయంత్రం వేళ, ఆ మొక్కలు జెండాని సూచిసుంటే, సులేమాన్ హృదయం ఉప్పొంగింది. అప్రయత్నంగా శాల్యూట్ చేశాడు. “ఇక పద! ఈరోజు శెలవు. ఆఫీస్ మూసి ఉండడంతో మనపని సులువైంది. సాధు వాళ్ళంతా ఊరిచివర పనిలో ఉంటారు. మనమూ వెళ్దాం”.
ఇద్దరూ నడవసాగారు. ఎదురుగా ఒక కారు వస్తోంది. "ఇర్ఫాన్ ఆ కారులో ఉన్న స్త్రీలని చూడు. ఒకరు ఆఫీసర్ భార్య తెలుసుగా? మరొకరు ఆమె అక్క. లండన్ నుండి వచ్చిందట. చాలా గర్విష్టి అని మొన్నఎవరో అన్నారు” గుసగుసలాడాడు సులేమాన్.
మోటర్ కార్ వీరి పక్కన ఆగింది. జెన్ని ముందుగా నడుస్తున్న ఇర్ఫాన్ని చూసింది. ఆరడుగుల పొడవు, దేహదారుఢ్యం, నిలువెల్లా చెమటలు కక్కుతున్న దేహం. ఒక్క క్షణం అతణ్ణి ఎగాదిగా చూసిందామె. భుజాల కంటిన మట్టిని దులుపుతూ ముందుకి కదిలాడు ఇర్ఫాన్.
“ఏయ్ ఆగు! నాకు శాల్యూట్ చేయండి” ఇంగ్లీష్‌లో అందామె.
ఆ అధికారానికి కోపంగా ఇర్ఫాన్ వంక చూశాడు సులేమాన్. ఇర్ఫాన్ ఆగాడు. ప్రశాంతంగా చూస్తూ “వందేమాతరం” అన్నాడు.
జెన్నిఫర్ ముఖం జేవురించింది. “యూ బ్లడీ ఇండియన్ డా..” ఆమె మాట పూర్తికాకముందే అరచేయి చూపించి ఆపాడు ఇర్ఫాన్.
“జెన్నీ” ఆమె చెల్లెలు వారించింది. జెన్ని అహం దెబ్బతింది. కార్ వెనక డోర్ తెరిచింది. ఒళ్ళు విరుచుకుంటూ లేచిందో పెద్ద కుక్క. జెన్నీ సూచన అందుకుని ఇర్ఫాన్ మీదికి ఉరికింది. “ఏయ్” అడ్డురాబోయిన సులేమాన్ మ్రాన్పడిపోయాడు. మీది మీదికి కలబడిపోతోంది ఆ కుక్క. పంటిగాట్లు ఇర్ఫాన్ భుజాల మీద, ఛాతీ మీదా గాయాలు చేస్తున్నాయి. తప్పించుకుంటున్న ఇర్ఫాన్ వంక చూసి పగలబడి నవ్వసాగింది జెన్ని. కొన్ని నిముషాల పోరాటం తర్వాత, కుక్క ముందరి కాళ్ళని అరచేతిలో బంధించాడు ఇర్ఫాన్. నోటిని, రెండో అరచేత్తో గట్టిగా అదిమి పట్టేశాడు. గిలగిలలాడింది కుక్క. నాలుక రెండు దవడల మధ్య పడడంతో పొలికేక పెట్టింది. రక్తం కారసాగింది. చప్పున పట్టు వదిలాడు ఇర్ఫాన్. మోకాళ్ళ మీద కూర్చుని దాని నోరు తెరిపించి, నాలుకను సర్దాడు. నోటి నుండి కారే రక్తాన్ని తుడిచి, నడుముకున్న మరచెంబు తెరిచి, దోసిట్లో నీళ్ళని ఒంపుకుని దానికి పట్టించాడు. దాని తల మీద ప్రేమగా తట్టాడు. ఆ స్పర్శకి, అతడి సాయానికి వశమైపోయి, ‘కుయ్’ ‘కుయ్’ మంటూ స్నేహభావాన్ని ప్రదర్శిస్తూ ఇర్ఫాన్ కాళ్ళదగ్గర ఒదిగిపోయింది కుక్క. జెన్ని నిర్ఘాంత పోయింది. చప్పట్లు కొట్టే ఆ చేతులు గాల్లోనే ఆగిపోయాయి. నవ్వు మటుమాయమైంది.
కుక్కని రెండు చేతుల్తో ఎత్తి ధనధన అడుగులేస్తూ కార్‌ని సమీపించి, సీట్లో కుదేశాడు ఇర్ఫాన్ తీవ్రంగా చూస్తున్న ఆ కళ్ళని చూసి హడలి పోయారు జెన్నీ, ఆమె సోదరి. ఆమె ముఖానికి సమీపంగా వచ్చి, కళ్ళు మరింత పెద్దవి చేశాడు. రహస్యం చెప్తున్నట్లు ఒక్కో అక్షరమే ఒత్తి పలికాడు “వం..దే..మా..త..రం”! జెన్నీ చేతులు వణకసాగాయి. ఆమె చూపులు స్టీరింగ్ పక్కనున్న రివాల్వర్ను చూస్తున్నాయి. అందుకునే ధైర్యం చేయలేకపోతుంది. చప్పున రివాల్వర్ అందుకున్నాడు ఇర్ఫాన్. “నో” చేతులెత్తేసింది జెన్నీ. ఆ రివాల్వర్ ఆమెకందించాడు. “ఫైర్! కమాన్ ఫైర్ మి” గుండెని చూపించాడు. సులేమాన్ రెండడుగులు ముందుకొచ్చి ఇర్ఫాన్ పక్కన్ నిలబడ్డాడు. అతడి కళ్ళు విస్ఫులింగాలు కురిపిస్తున్నాయి. కండలు తిరిగిన ఆ ఇద్దర్నీ చూసి బోరుమని ఏడుపొచ్చేసింది జెన్నీకి. తుపాకీ పక్కన పెట్టేసి ఏడుస్తూ కారుని పరుగుపెట్టించింది.
“హే… మా కొదమసింహం” సులేమాన్ చెప్పింది విని ఆనందంతో ఇర్ఫాన్ ని చేతుల మీద ఎత్తేశారు సాధు, ఫ్రెండ్స్. “ఇక త్వరగా పదండి. ఈరోజు పట్నంలో మీటింగ్ ఉన్నందువల్ల, ఊరిలో బ్రిటిష్ ఆఫెసర్స్ లేరు. జెన్నికి మనదే ఊరో తెలీదు. ఏ పోలీస్‌నో పంపితే, ఇర్ఫాన్ కు ప్రమాదం. మన ఊరు చేరుకోవాలి. త్వరగా” గబగబ నడిచాడు సులేమాన్. వెన్నెల్లో విజయధ్వానాలు చేస్కుంటూ పరుగుపెడ్తున్నారంతా. “ఆ! అరెస్టుకి భయపడతామా? ఉద్యమకారుడి జీవితమే అంత. మూడు నినాదాలు, ఆరు అరెస్ట్‌లు.” నవ్వుకుంటూ పరిగెత్తసాగాడు ఇర్ఫాన్.
బోర్లా పడుకున్న సాధు దెబ్బలకి మందు రాస్తోంది తల్లి విశాలాక్షి. “వంశంలో చెడబుట్టాడు. ఆచారవ్యవహారాలు లేవు, పూజా, పునస్కారం లేదు. అంతా మేనమామ పోలిక” తండ్రి తిట్లకి నవ్వుతున్నాడు సాధు.
“అవునండీ! కమలాపండు ఛాయ, చెయ్యెత్తు విగ్రహం, ఉంగరాల జుత్తు, కళకళలాడే ముఖవర్ఛస్సు, అచ్చం మా అన్నయ్యే”
మురిసిపోతున్న ఆమె మీద విరుచుకు పడ్డాడు సాధు తండ్రి. “నీ ముఖం. అందం రాగానే సరా? ఆయనగారు వితంతు వివాహం చేస్కుని వంశం నుండి వెలివేయబడ్డాడు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడుగా? అండమాన్ జైలుకి పోయాడు, అక్కడే పోయాడు” భర్త మాటలకి చిన్నబుచ్చుకుంది విశాలాక్షి. “నీకొడుకు” హరిజనులను వెంటేస్కుని ఆలయప్రవేశం చేయబోయాడు. జనం దేహశుద్ధి చేశారు. మతం, సంప్రదాయం మంటగలుపుతాడట”
తండ్రి కోపానికి విసురుగా లేచాడు సాధు. “నాన్నా, మతాలు భౌగోళికంగా ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంలో దొరికే వనరులు, ఆహారం, వసతులని బట్టి జీవన విధానం, ఆచారాలు ఏర్పడ్డాయి. ఒకచోట క్షత్రియుడిగా అభివర్ణించబడిన దేవుడు, మరోచోట గొర్రెల కాపరిగా ఉన్నాడు. మనమే ప్రపంచానికి మరో మూల పుట్టి ఉంటే, ఇంకో మతంలో ఉంటాం. దానికింత రాద్ధాంతం దేనికి”?
“అలాగా నాన్నా?”, విస్ఫారిత నేత్రాలతో అడిగింది విశాలాక్షి.
“అవునమ్మా! మతం సామాజికం. ఆచారాలు భౌతికం, భగవంతుడు భావపరం. దేవుడిని ఏ పద్ధతిలో భాషలో ఏ పేరుతో పిలిస్తే ఏం? మీ సంప్రదాయం ఇరుకైనది. కానీ, ధర్మం విశాలమైనది. విశ్వజనీనమైంది. కులమత భేదాలెంచేది ధర్మమే కాదు”.
“ఆ!” ఆశ్చర్యానందాలతో గడ్డానికి చేతులు ఆనించుకుంది విశాలాక్షి.
“చాల్లేవే! సన్నాయి నొక్కులు నొక్కకు. ఈ వితండవాదానికేంగానీ.. అన్నయ్యలు ఉత్తరం వేశారు. నీకు కలకత్తాలో ఉద్యోగం చూశారట. ఇక చాలు నీ వేషాలు. మనవాళ్ళంతా ఈ ఊరు విడిచిపోతున్నారు. తాతగారి స్థలాలకీ మంచి బేరం వచ్చింది. ప్రయాణం అవ్వండి తల్లీ, కొడుకు!”
తండ్రి మాటలు పూర్తి కాకముందే లేచి తలసవరించుకున్నాడు సాధు. “నాన్నా! తాతగారు మా ముగ్గురికీ స్థలాలు పంచారు. నా వాటా అమ్మకండి. అది గ్రంథాలయానికి ఇచ్చేస్తున్నాను. బైటకి నడవబోయాడు.
“అలాగే, పో! నీ స్థలం చూసే అవధాన్లుగారు పిల్లనిస్తానంటున్నారు. అదీ లేకపోతే నీ ముఖానికి పిల్లనెవరిస్తారు? ఇక సన్యాసమే” కేకలు వేశాడు తండ్రి.
“స్థలం చూసి వచ్చే పిల్ల నాకు వద్దు” తలుపు దాటబోతూ వెనక్కిచూశాడు. ఆ కళ్లలో చిరునవ్వు పొంగుతోంది. “ఈ ఇంటి మూడో కోడలు హిందువు కాదు” స్థాణువైన తండ్రిని ఒక్క క్షణం చూసి, నవ్వుకుంటూ బైటకి కదిలాడు.
“ఇదేం గొడవే”
ఆవేశంతో కంపించే భర్తని చూసి భయంగా “వాడి మనసు ఆ రజియా మీద ఉందండీ” నసిగింది విశాలాక్షి.
“ఆ… నీకూ తెలుసన్న మాట! ఇదేం దరిద్రం…” భర్త అరుపులకి భయపడ్తూ వంటగదిలోకి జారుకుంది.
* * * * *
A great convincing fact. Keep good to people, your life will be alright.
Chaalaa baguMdi
Excellent… Stunning story..