వసంతసుమశేఖరము

రవి :  ఖరనామసంవత్సర జాలకవిసమ్మేళనం – వసంతసుమశేఖరానికి కవివర్యులందరికీ సుస్వాగతం

రవి :  ఆనవాయితీ ప్రకారం గణేశ స్తుతి, దుర్గాస్తుతులతో సభను ఆరంభించుదాము. పెద్దలు చింతా రామకృష్ణారావు గారు కంద, గీతి గర్భిత చంపకమాల పంపారు.


చం.

అతి కలకంఠి! యాశ్రిత జనావళిఁ బ్రోవుమ! శ్రీ గణేశ ప్రా

ర్థిత జననీ! సుధా మధుర ధీయుత సత్ కృతి మాకుఁ గొల్పి, స

ద్గతి వెలయించుమా. సుకవిగా నొలరించి, విశుద్ధ కీర్తి, ను

ద్ధతి నిడు మా కృపన్! సరసతన్, కలిగించుమ! సత్ స్వభావమున్.

 

గర్భిత గీతి:

శ్రిత జనావళిఁ బ్రోవుమ! శ్రీ గణేశ!

మధుర ధీయుత సత్ కృతి మాకుఁ గొల్పి,

సుకవిగా నొనరించి, విశుద్ధ కీర్తి

సరసతన్ కలిగించుమ! సత్ స్వభావ!

 

గర్భిత కందము:

కలకంఠి! యాశ్రిత జనా

వళిఁ బ్రోవుమ! శ్రీ గణేశ ప్రార్థిత జననీ!

వెలయించుమా. సుకవిగా,

నొలరించి, విశుద్ధ కీర్తి నుద్ధతి నిడుమా!

 

రవి :  పై పద్యంలో విశేషమేమంటే – చంపకమాల దుర్గాస్తుతి అయితే గర్భిత గీతం గణేశ స్తుతిగా కూర్చారు గురువుగారు

విశ్వామిత్ర :  చంపకంలో జనని ప్రార్ధన, గర్భం లో గణేశ ప్రార్ధన – బాగు బాగు

నచకి :  ఆహాహా!

కామేశ్వరరావు :  అద్భుతం! ఒకే కాన్పుకి ముగ్గురు రత్నాలని ప్రసవించారు చింతావారు! 🙂

మురళీమోహన్ :  చప్పట్లు

గన్నవరపు నరసింహమూర్తి :  అద్భుతం

వసంత్ కిషోర్ : అద్భుతం

శ్రీపతి :  జనని గర్భం నుండి రాలేదన్న వెలితి గణేశుడికి లేకుండా తీర్చారు చింతావారు . బాగు బాగు

మిస్సన్న :  నిజంగా అద్భుతమండీ

రవి :  ప్రసవింతురు గురువుగారు పదివే లైనన్ ..

మిస్సన్న :  అవును అందుకు సమర్థులు వారు.

కామేశ్వరరావు :  మరో విశేషం, "కలకంఠి" పదంతో పద్యం మొదలుపెట్టడం. కలకంఠి అంటే కోకిల అని కూడా అర్థం ఉంది కదా.

శంకరయ్య :  శ్రీ గణేశాయ నమ …. శ్రీ చింతా రామకృష్ణాయ నమః

గన్నవరపు నరసింహమూర్తి :  చింతా విజయ ఆయనేనండీ, లేక వారి సుతులా?

రవి :  చింతా రామకృష్ణారావుగారండి.శంకరయ్య :  "విజయ" వారి భార్య గారి పేరు.

కామేశ్వరరావు :  కోకిల కూజితంతో ఉగాదిసభ చక్కగా మొదలయ్యింది!


రవి :  కామేశ్వరరావు గారు, మీరు ఉగాదిని స్వాగతించండి

కామేశ్వరరావు :  అలాగే

ఉ.

శ్రీకరమై, రసజ్ఞవరచిత్త వశీకరమై, మనోజ్ఞ భా

వాకలితాంధ్రపద్య కుసుమాకరమై, సుకవీంద్ర భృంగ బృం

దా కృత ఝంకృతీ మధుసుధాకరమై, నవ వర్ష హర్షవ

చ్ఛీకరమై, వసంతసుమశేఖరమై సభ వెల్గు గావుతన్!

 

రవి :  నిజంగానే ఒక్క వెలుగు వెలిగిందండి.

శ్రీపతి :  అనుప్రాసతో పద్యం అద్భుతంగా ఉంది.

మిస్సన్న :  చక్కని స్వాగతం పలికేరండీ కామేశ్వర రావు గారూ

శ్రీపతి :  పోతన స్టైలు కాపీ…… 😉

గన్నవరపు నరసింహమూర్తి :  చాలా బాగుంది కామేశ్వరరావు గారూ

వసంత్ కిషోర్ : కిల కిలా రావాలు !! !

కామేశ్వరరావు :  నెనరులు. పూర్వకవులు పెట్టిన భిక్షే కదండీ ఇదంతా!

నచకి :  సభకూ, వసంతానికీ స్వాగతం పలికారు, శుభం!

పుష్యం :  రాకేశ్వరుఁడు, పుష్యం పున ప్రవేశం

కామేశ్వరరావు :  రాక రాక వచ్చారు రాకేశ్వరులు. స్వాగతం!

నచకి :  శ్యామ్ గారికి పునఃస్వాగతం, రాకేశ్వరునికి స్వాగతం!

గన్నవరపు నరసింహమూర్తి :  క్రొత్త సంవత్సరానికి స్వాగతము పలికేరు

రాకేశ్వరుఁడు : సభకు నమస్కారములు.

రవి :  చంద్రోదయం అయింది

మిస్సన్న :  అంతేగా మరి


రవి :  సనత్ గారు వసంతసుమశేఖరాన్ని సింహాసనారూఢను చేయబోతున్నారు. కానివ్వండి, సనత్ గారూ.

మిస్సన్న :  శుభం

శ్రీపతి :  తప్పకుండా

 

కం.

కవనమ్ముల సంతర్పణ

నవతర కవి సరసులీయ  నైవేద్యమయెన్ !!

భువినీ విశేష సభను ఖ

ర విభవమున్ తెలియ రండు కాంక్షలుతీరన్ !!

 

రవి :  పై పద్యం చూశాక ఈ బొమ్మ చూడండి.

 


(చిత్రంలో పద్యచివరి పాదంలోని యతిలోపం సవరించబడినది పొద్దు)

 

శ్రీపతి :  సింహాసన బంధంలో కందమిది

నచకి :  నవతరకవులు 🙂

విశ్వామిత్ర :    ఓహొహో అద్భుతం

వసంత్ కిషోర్ : అద్భుతం !

మిస్సన్న :  అత్యద్భుతమండీ

నచకి :  వచ్చే సభ నాటికైనా యీ బంధకవిత్వాన్ని ఓ పట్టు పట్టాలి… ఈసారి సమయాభావము, ప్రజ్ఞాభావము 🙁

గన్నవరపు నరసింహమూర్తి :  సింహాసనము అందంగా ఉంది

శంకరయ్య :  చివరి పాదంలో యతి తప్పినా మా మతి సమ్మతిని తెలుపుతున్నది.

విశ్వామిత్ర :  @నచకి మీరు తెరకవులని వారికి తెలియదనుకుంటా

నచకి :  ఇంకా తెఱ చిఱగలేదు లెండి!

శ్రీపతి :  అంటే ఆఖరు నిమిషంలో ఖగ వినుతుణ్ణి ఖర విభవంగా మార్చేసరికి

పుష్యం :  ఈ పద్యాన్ని విభవ సంవత్సరానికి కూడా వాడొచ్చనుకుంటా? 🙂

రాకేశ్వరుఁడు: బంధకవిత్వంలో కాలువేయడం అంత తేలికకాదండి!

కామేశ్వరరావు :  "తెలియ రండు రసముప్పొంగన్" అంటే సరిపోతుంది.

శ్రీపతి :  వహ్వా.. భేషుగ్గా ఉంది… అట్లానే మారుస్తా…

విశ్వామిత్ర :  రయముగ మీరల్ !

నచకి :  యతి సింహాసనంలో ఆసీనులైతేనే శుభం! ఇక్కడికి దిగి రాకున్నా…

కామేశ్వరరావు :  "ఖర విభవమే" బాగుంది. అధ్యక్షులవారిని కూడా అందులో బంధించారు కదా!

రవి :  అధ్యక్షుల వారెక్కడున్నారండి? :))

విశ్వామిత్రరవి దాగుండటమ్ వారికి నచ్చి ఉండవచ్చు

శ్రీపతి :  ఖర – రవి అవిభాజ్యులు కదండీ… 😉

నచకి :  రవిఁ గాంచని చోట కామేశ్ గారు రవిని చూపించారు 🙂

కామేశ్వరరావు :  ఖ"రవి"భవమున్

చదువరి :  కామేశ్వరరావు గారూ.. 🙂

రవి :  చిత్రకవిత్వంతో శ్లేషకవిత్వం చూపించారు కామేశ్వరులు 🙂

శ్రీపతి :  ఓకే. అయితే… సవరించిన పద్యపాదం "ర విభవమున్ తెలియ రండు రసముప్పొంగన్"

 

కం.

కవనమ్ముల సంతర్పణ

నవతర కవి సరసులీయ  నైవేద్యమయెన్ !!

భువినీ విశేష సభను ఖ

ర విభవమున్ తెలియ రండు రసముప్పొంగన్ !!

 

విశ్వామిత్ర :  వసంతం వచ్చీ రాగానే యతుల గురించి ఎందుకులేండి, ఆ సంగతి నాకొదలి, కాంక్ష దీర అడుగులు వేయండి


రవి :  సరేనండి. తరువాతి సమస్యకెళదాము.

కామేశ్వరరావు :  అలాగే

రవి :  శివుని గుణ గణనమున చెడు గుణము కలుగున్ – ఎలాగో శంకరులవారే చెప్పాలి


కంది శంకరయ్య:

అతివినయ వృత్తము:

భవహరము శుభకరము పరమపద మొసఁగన్

కవయు చిర సుఖము మన కవనమునను సదా

శివుని గుణ గణనమున; చెడు గుణము కలుగున్

భువి జనులు తమ వ్యసనములు వదల కునికిన్.

 

గన్నవరపు నరసింహమూర్తి :  గురువు గారి పూరణ చాలా సుందరంగా ఉంది

మిస్సన్న :  గురువుగారూ మనోజ్ఞంగా చెప్పారు.

కామేశ్వరరావు : అతివినయముగా అడిగిన అధ్యక్షులవారికి శుభకరముగా జవాబిచ్చారు శంకరులవారు! 🙂

పుష్యం :  అన్ని లఘువుల వలన 'అతివినయం' సార్ధక నామధేయం 🙂

రవి :  రెండవ పాదంలో – కవయు, కవనము చాలా అందంగా చెప్పారు.

విశ్వామిత్ర :  సదా – భలే గా కుదిరింది- రెండో పాదానికీ ఒప్పుతోంది, ఒక విరుపులో

నచకి :  నిజమే

పుష్యం :  పద్యం చాలా బాగుంది

పుష్యం :  కవయు??

శంకరయ్య :  అందరికీ ధన్యవాదాలు.

విశ్వామిత్ర :  భవహరము శుభకరము పరమపద -> ఈ వరుస కూడా – గమనించదగినది – జీవి – శివుని వైపు మళ్ళేది ఈ క్రమం లోనే

కామేశ్వరరావు :  విశ్వామిత్రులవారి దృష్టి అమోఘం!

శ్రీపతి :  బాగా సెలవిచ్చారు.

శంకరయ్య :  కవయు = కలియు, సంభోగించు

నచకివిశ్వామిత్ర సృష్టి మాత్రమే అనుకున్నాను, దృష్టీ అమోఘమే, అవును! 🙂

వసంత్ కిషోర్ : శలవిచ్చిందే !శంకరులు గదా !

రవి :  ఆయన విశ్వానికి మిత్రులు కదండి. పైగా అనుభవజ్ఞులు. ఇహము, పరము రెండూ ఆయనకు తెలుసు

శ్రీపతి :  అవునవును వారికి 'ఆ' అనుభవం కూడా ఉంది కదూ !!

నచకి :  పరానుభవం కూడానా! ఇహ చెప్పేదేముంది!

కామేశ్వరరావు :  ఈ పద్యంలో చక్కని లయ శివతాండవంలా వినిపిస్తుంది. "తకిటతక తకధిమిత" అని!

నచకి :  గణములలోని నడక గురువుగారి పదములతో అతివినయంగా నడిచింది


రవి :  సరేనండి, మిస్సన్న గారి పూరణను కూడా విందామా?

కామేశ్వరరావు :  తప్పకుండా!

మిస్సన్న :  చిత్తగించండి

అతివినయ వృత్తము:

భవము భవమని వలదు భయమిక నెవరికిన్

భువిని భవ తరణమును మునులు గనరె సదా

శివుని గుణ గణనమున! చెడు గుణము కలుగున్

శివుని మఱచిన యతడు చెడు నుభయములకున్

 

పుష్యం :  చెడుగుణాలను విఱిచేసారుగదా

నచకి :  భవతరణము, వాహ్!

వసంత్ కిషోర్ : భళి ! భళీ !

కామేశ్వరరావు :  "భవసాగరం" కాబట్టే తరణం. బాగుంది!

రవిశంకరయ్య మాస్టారు గారి ప్రభావం అనుకుంటాను, రెండవపాదం లో "సదా" వచ్చింది.

శంకరయ్య :  "చెడు నుభయ ములకున్" అనడం బాగుంది. మంచి పూరణ.

మిస్సన్న :  గురుకృప అందులో సందేహం లేదు

కామేశ్వరరావు :  ఈ మధ్యన వెండి తెర మీద కనుమరుగైనా, ఈ పొద్దు తెరపై కనిపిస్తోంది, సదా 🙂

విశ్వామిత్ర :     రవి గారి చూపు హీరోయిన్ల మీద పడినట్టుంది?

పుష్యం :  అంతేనా, 'సదా' సినిమా చూసారనుకున్నాను 🙂

నచకి :  ఒక్క సదా యేమిటి, అధ్యక్షులు తలచుకుంటే దుర్గాస్తుతిలో నలుగురు నవనాయికలు వస్తారు!

శంకరయ్య :  వాణీ "దాస" జనులం కదా ….  సదా రావడం సహజమే…

మిస్సన్న :  సదా అనే ఆవిడ హీరొయిన్ అని ఇప్పుడే తెలిసింది

నచకి :  అవకాశాలు పొద్దు వాలిన తఱువాతనే వచ్చింది లెండి  సదా మఱి

రవి :  రామరామ ! మరీ తెరమరుగైన హీరోయిన్లపైనా?:)

విశ్వామిత్ర :  మరుగుంటే మీకే మేలనుకున్నాం, తరువాత మీ ఇష్టం 🙂

రవి :  విశ్వామిత్ర :))

శ్రీపతి :  కొన్నిట్లకి తెర 'మరుగు' అవసరమే కదా…

కామేశ్వరరావు :  శంకరయ్యగారు, అవునండి సదా దాసులము

గన్నవరపు నరసింహమూర్తి :  మిస్సన్న గారూ మీ సినిమా జ్ఞానం నా లాగే ఉంది

నచకి :  ఇక్కడ రవి కాంచే దాకా యే కవి కాచుకునేలా కనబడటంలేదు!

వసంత్ కిషోర్ : అసలు విషయం మరుగవుతోంది

విశ్వామిత్ర :  శివుడిని వదిలి – చెడుగుణమునే పట్టుకున్నాము 🙂

నచకి :  :))

నచకి :  స్వధర్మే నిధనమ్ శ్రేయ (మఱో హీరోయిను, బాబోయ్!) శ్రేయా ధన్వంతరి, శ్రేయా రెడ్డి ఉన్నారండీ

రవి :  ఈ ప్రయత్నం (చెడు గుణగణన) లో మరింత ముందుకెళ్దామని మనవి చేసుకుంటున్నాను. (చంద్రబాబు స్వరంలో చదువుకోండి)

రవి :  రాఘవ గారు మౌనం వహించారు, ఆయనచేత ఒక పద్యం ప్రసవింపజేద్దాం.

చదువరి :  నచకి, కానివ్వండి కానివ్వండి ఉత్సాహంగా ఉంది 😉

పుష్యం :  శ్రియ అనుకుంటా

నచకి :  మరుగేలరా, ఓ రాఘవా!

శ్రీపతి :  హ హ్హహా

కామేశ్వరరావు :  సరే ముందుకు సాగుదాం.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.