1989 వ సంవత్సరం, కడప పట్టణం (అప్పుడది పట్టణమే), జిల్లా కేంద్ర గ్రంధాలయం దగ్గరున్న ఓ వీధి మూలనున్న ఇంటిముందు నేను, నా మిత్రుడు రియాజ్ బాషా బెరుగ్గా తలుపులు తట్టాము. తెరచి, ప్రశ్నార్థకంగా చూసిందొకావిడ. ’పుట్టపర్తి వారిల్లిదేనా?’ సంకోచంగా అడిగాను. ’ఔను. రండి లోపలికి’ అని అహ్వానించిందామె. సాధారణమైన మధ్యతరగతి జీవనాన్ని ప్రతిబింబిస్తున్న ఇల్లు. హాల్లో నులకమంచంపై సరస్వతీ పుత్ర, పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. వృద్ధాప్యంచే శుష్కించిన శరీరం, చేతిలో బీడీ. శివతాండవ కర్త ఈయనేనా అనిపించిందొక్క క్షణం. ’ఎవుర్రా మీరు? పిలకాయలు, మీకు నాతో ఏంపని?’ అన్నారు. ’మేం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులమండీ. మీరిక్కడున్నట్లు తెలిసి చూడ్డానికొచ్చాం. మీ శివతాండవం చదివానండీ’ అన్నాను. ఆయన ముఖంలో ప్రసన్నత తొంగి చూసింది. ’అవునా, శివతాండవం చదివినారా, అర్థమయిందా? ఇంకేం చదివినారు?’ అన్నారు. ’ఇంకేం చదవలేదండి’ అన్నాను. ’పోన్లే. నేన్రాసింది ఒక పుస్తకమైనా ఈ కాలం పిల్లకాయలు చదివినారంటే అది మంచిదే’ అని నిట్టూర్చారు.
అలా మొదలైన నా పరిచయం దాదాపు రెండేళ్ళు, పుట్టపర్తి వారి మరణం దాకా కొనసాగింది. తరచుగా కాకపోయినా వీలైనప్పుడల్లా వారింటికి వెళ్ళడం, ’ఆ మంచం బైట వెయ్యిరా’ అని ఆయన అనడం, వేసి, ఆయనతో బాటు వసారాలో కూర్చొని ఆయన చెప్పే కబుర్లు వినడం. నా స్వభావమో, చిన్నతనం వల్లనో గాని ఆయన ఎవరింట్లో వున్నారో, ఆ ఇంట్లోని ఇతరులెవరో ఎప్పుడూ తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. మా మాటల్లోనూ ఆ ప్రసక్తి ఎప్పుడూ రాలేదు. ఆ యింట్లో మా ప్రపంచంలో మేమిద్దరమే. అలాగే ఎవరూ మమ్మల్ని కదిలించేవారు కారు. వయసు పైబడడంతో, ఆయన మాట్లాడటానికి కొంత శ్రమ పడేవారు. ఎక్కువ మాట్లాడితే దగ్గు, పైగా ఆ బీడీలొకప్రక్క. ఐనా ఓపిక తెచ్చుకొని మాట్లాడేవారు. చిదంబరం వెళ్ళి నటరాజు ఆలయంలో చూసిన శివతాండవ నృత్యం, అది కలిగించిన ప్రేరణ, తమిళం అభ్యసించి అక్కడి పాటలను మూలంలో అధ్యయనం చేయడం గురించి… నేను తమిళ పిలకాయ అని తెలుసు. దివ్యప్రబంధం చదవమని చెప్పేవారు. ఒకసారి మాటల్లో అడిగాను. ’మీకు చాలా భాషలు వచ్చునట కదండీ. తమిళంకూడా బాగా వచ్చని విన్నాను’ అని. ’ఎవుర్రా చెప్పింది నీకు. భాష రావడం అంటే అక్షరాలు, గుణింతాలు, కొన్ని పదాలు వచ్చేయడం కాదు. సంప్రదాయం తెలియాలి. భాష మూలాన్ని పట్టుకోవాలి. అదీ రావడమంటే’ అన్నారు. అందుకో ఉదాహరణ చెప్పారు – ’మీ తమిళమే తీసుకో. ఒకసారి ఒక తమిళ కుటుంబం ఇంట్లో భోజనానికి కూర్చున్నాను.. అక్కడో పిల్లి వచ్చింది. ఆ యిల్లాలితో “పోర్చు వందదు, పోర్చు వందదు” అన్నాను. ఆమెకేం అర్థం కాలేదు. అయ్యా ఏం చెబుతున్నారు – అని అడిగింది. ఇక లాభంలేదని ఆమెకు ఆ పిల్లిని చూపించాను. “ఓ! పూనైయా” అందామె. అప్పుడుగానీ నాకు ’పోర్చు’ అన్న పదం నేటి తమిళంలో లుప్తమైందని తెలియలేదు. నేను నేర్చుకొన్న తమిళం శివతాండవ స్తుతుల్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చిందిగాని ఒక ఇంటి ఇల్లాలితో మాట్లాడటానికి పనికి రాదన్న విషయం తెలిసింది’ అన్నారు. అన్నారు కానీ, చాలా మంది తమిళులకంటే వారికి ఎక్కువే తమిళం తెలుసన్న విషయం నాకు తెలుసు. “మానాడ మయిలాడ…” అంటూ చిదంబరంలో కనకసభాపతి ముందు నర్తించే బ్రాహ్మణోత్తములనుండి ఎంతో శ్రమకోర్చి ఆ తమిళ కావ్యాల సారాంశాన్ని అధ్యయనం చేశారు. దాన్ని మూలానికి తీసిపోని విధంగా తెలుగు, సంస్కృత భాషల మిశ్రమంగా రచించారు. కేరళ నుండి ఢిల్లీ వరకు ఊరూరా తిరిగి గానం చేశారు. వారు ఎన్నో గ్రంధాలు వ్రాసినా నిలిచిందీ, జనుల మనసులు గెలిచిందీ శివతాండవమే.
’ఇంగ్లీషు భాషకున్న గ్రామరే తక్కువ. ఆ ఉన్న గ్రామరుకు కట్టుబడి ఉండే ఇంగ్లీషు ఇంకా తక్కువ. ఆ భాషతో మన భాషలను పోల్చలేం’ అన్నారు మరొకసారి. తెలుగులో శ్రీనాథుడన్నా, సంస్కృతంలో శ్రీహర్షుడన్నా చాలా అభిమానం ఉండేది వారికి. అప్పటికే శ్రీనాథుని వీరాభిమాని ఐన నేను శ్రీహర్షుని కూడా చదవడానికి పుట్టపర్తివారు కారణం. హర్షనైషధానికీ, శ్రీనాథుని నైషధానికీ పోలికలను, తేడాలను సోదాహరణంగా చెప్పేవారు. ఎక్కడ శ్రీనాథుడు మక్కీకి మక్కీగా అనువాదం చేశాడో, ఎక్కడ సొంత తెలివిని ప్రదర్శించాడో చూపించేవారు (వారు శ్రీనాథునిపై వ్రాసిన వ్యాసం ఒకటి అంతకు ముందెప్పుడో యువభారతి వారి ప్రచురించారు).
ఆయన చివరిరోజుల్లో, ఒకసారి ఆటోగ్రాఫ్ పుస్తకం ఇచ్చి ’నాకోసం ఏమైనా వ్రాయండి ’ అన్నాను. వణుకుతున్న చేతులతో సంతకం చేసి ’ఈ చేవ్రాలు చేసేంత శక్తిని మాత్రమే మిగిల్చాడురా దేవుడు’ అన్నారు. పోనీ మీరు చెప్పండి నేను వ్రాసుకొంటాను అని అడిగాను. కొంతసేపు మౌనంగా ఉండి, ’ఊహూఁ, మనసు ప్రశాంతంగా లేదు. ఏమీ చెప్పలేను. ఇంకెప్పుడైనా చెప్తాన్లే’ అన్నారు. మళ్ళీ నేనెప్పుడూ అడగలేదు, ఆయనా చెప్పలేదు. ఆయన సంతకం ఒక్కటీ నాకు మిగిలింది ఆయన జ్ఞాపకంగా. ఆయనతో కలిసి నేను తీయించుకొన్న ఫోటో ఒక్కటి మా కాలేజీ మాగజైన్లో ప్రచురించడంకోసం తీసుకొన్నారు. నాకు తిరిగి రాలేదు, ప్రచురితమైందిగానీ.
వారి కవితా వ్యాసంగం వారికి ఆర్థికంగా ఏమాత్రం లబ్ధి చేకూర్చక పోగా రావలసిన కీర్తి కూడా రాలేదు. ఆ విషయంలో వారికి కొంత అసంతృప్తి ఉండేది. సరస్వతీ పుత్ర బిరుదాంకితులైన వారి యింట లక్ష్మీ కటాక్షం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. జ్ఞానపీఠ పురస్కారం పరిశీలనకు వారి పేరు వెళ్ళింది. మీకు వచ్చినట్లే అని అక్కడి ముఖ్యులెవరో చెప్పారట కూడాను. చివరికి అది సినారె కు వచ్చింది. ఆ ఆశాభంగం వారిని కొంత బాధపెట్టింది. ఏమిటండీ ఇలా అయింది అనుకొంటుంటే అన్నారు. ’అవార్డు రానందుకు కాదు గాని, దాంతో బాటు వచ్చే లక్షరూపాయలతో నా జనప్రియ రామాయణం వ్రాతప్రతులు వెలుగు చూసేవిరా. అంత డబ్బు వచ్చే మార్గం నాకు ఇంకొకటి లేదు’ – కళ్ళలో నీళ్ళు తిరిగాయి గాని, ఏంచేయాలో తెలియని ప్రాయం నాది. లక్షరూపాయలంటే అప్పటికి నేనూ కంటచూడని మొత్తమే. ’పోన్లెండి అయ్యగారూ, మరో సారి వస్తుందేమో’ అంటే ’లేదురా, ఇప్పట్లో తెలుగుకు మళ్ళీ ఇయ్యరు. అంతవరకూ నేనుండను’ అన్నారు. అన్నట్లు గానే మరో సంవత్సరంలోపే ఆయన మరణించారు. సెలవులకు ఊరెళ్ళి వచ్చేలోగా ఆయన మరణ వార్త. నేను కడప చేరుకొనే సరికి దహన సంస్కారాలు ముగిసిపోయాయి. ఆయన లేని ఆ ఇల్లు శివుడులేని కైలాసంలాగా అనిపించింది. “ ఆడెనమ్మా శివుడు… పాడెనమ్మా భవుడు” అని పరవశంతో పాడిన ఆ శ్రీవైష్ణవుడు నాకు ఈశ్వరార్చన కళాశీలుడైన శ్రీనాధుని మరో జన్మలాగా తోచారు. బహుశ కైలాసంలో శివతాండవం చూస్తుంటారేమో, తను వ్రాసింది సరిచూసుకొంటున్నారేమో!
“ఢక్కా రవముల పిక్కటిల్ల దశ
దిక్కులు మారుత దీర్ఘీ కృతములు
ఝణఝణఝణత స్వనములకును బ్రతి
నినదము లీనఁగ వనధి భంగములు
శూలంబున నాభీలత లేవఁగఁ
గీలాచయములు లేలిహానములు
ధగధగితములై నిగుడఁగ నగవులు
గగన తలస్థులు బెగడ దేవతలు
నీ నృత్తములో నిఖిల వాఙ్మయాము
తానముగా మఱి గానము గాగను
తాండవింపఁగా తరుణంబై నది
ఖండేందుధరా! గదలుము నెమ్మది”
“ఈ సెల కన్నెల కెవ్వరు జెప్పిరొ!
యాసర్వేశ్వరు నభినయమహమును
కుచ్చెళులెల్లడ విచ్చలవిడిగా
దుసికిళ్ళాడఁగ నసమునఁ బరుగిడు
ఓ హో హో హో! యూహాఽతీతం
బీయానందం బిలాతలంబున!”
“ఛటచ్ఛటనదచ్ఛిఖాపటలపోషణం భీషణం
బహిర్హుత వహం సృజన్విషమలోచనాఽభ్యంతరాత్
ప్రమత్తఇవ నృత్యతి ప్రచలితాఽఖిలాంఽగస్స య
స్సమాఽఽపతతు మానసే తుహిన శైల కూటోచ్ఛ్రిత: “
శివతాండవం చదవకుంటే తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప రచనను మీరు కోల్పోయినట్లే. ఒక గొప్ప అనుభూతి మీ అనుభవంలోనికి రానట్లే. చదవండి. గట్టిగా చదవండి. లయబద్ధంగా చదవండి. లయ అందులోనే ఉంది. మీరు చేయాల్సిందేమీ లేదు. చదవడమే! ఆ ఆనందాన్ని అనుభవించండి.
పుట్టపుర్తి వారితో ఆయన ఇంట్లోనే పరిచయ భాగ్యం పెట్టుకుని రెండేళ్లు కొనసాగించిన భాగ్యం కలిగినందుకు చంద్రమోహన్ గారికి అభినందనలు. వారి గురించి ఎంత మంచి కథనాలను, అరుదైన స్మృతులను మీ వెబ్‌సైట్లో చూస్తున్నానో వర్ణించలేను. ఇప్పటికే ఆన్‌లైన్‌లో కొడవటిగంటి కుటుంబరావు గారిపై వచ్చిన కథనాలను చాలావరకు సేకరించి లింకులతో సహా భద్రపర్చాను. ఈ వెబ్‌సైట్‌లో శివతాండవ కర్త విశేషాలను చదువుతుంటే ఆయనపై అంతర్జాలంపై వచ్చిన అన్ని కథనాలను సేకరించి భద్రపర్చాలనిపిస్తోంది. పొద్దు నిర్వాహకులకు నిండు కృతజ్ఞతలు..