ఒలికిన పాలు

సమయం తొమ్మిది దాటింది. టేబుల్ మీద ఒక ఆకారం. జీవం ఉంది అన్నదానికి సూచనగా చిన్న మూలుగు … కాదు.. అస్పష్టమైన మాటలు. కలవరింతలు. నిత్యం సెలైన్ బాటిల్ పై బ్రతికే రోగిలా ఉన్న టేబుల్ ఫేన్ టకటకలాడుతూ ఆగింది. సెలైన్ అయిపోయింది. కరెంటు పోయింది. కొద్ది సేపటికి లేచాడు భవానీ శంకర్.  మెల్లగా కనులు తెరిచాడు. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది అతనికి. అదే టేబుల్, అదే ఫేను, అదే హాలు, అదే తను! ఏం మార్పులేదు. బెడ్రూం వైపు చూశాడు. చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలు, పేపర్లు. సర్దాలి… వీలు చూసుకుని.

మెల్లగా లేచి బయట తలుపు తీశాడు.. తలుపు దగ్గర క్రిందంతా బంక బంకగా ఉంది. తెల్లని చారలు చారలు. చిరిగిన పాలపాకెట్ ను ఎత్తి చూశాడు. కాస్త పాలు ఇంకా ఉన్నాయి. క్రిందన ఇంకొక పాకెట్ ఉంది. ప్రక్క ప్రక్కనే ఉన్న రెండు పాలపాకెట్లలో ఒకటి మాత్రమే చిరిగింది. ‘ఎదురింటి పిల్లికి ఈ పాకెట్టునే చింపాలని ఎందుకు అనిపించింది. ఎందుకు ఈ పాలపాకెట్టుకే ఈ గతి పట్టింది? ఎందుకు తన జీవితమే ఇలా తగలడింది?’ చిరిగిన పాకెట్లో మిగిలిన పాలను కూడా అక్కడే ఒలకబోసి రెండవపాకెట్తో లోపలికి వచ్చాడు. మొబైల్ తీసి డయల్ చేశాడు. రింగవుతోంది. ‘ మీరు డయల్ చేసిన చందాదారుడు స్పందించుటలేదు…’ కసిగా నొక్కి ఆఫ్ చేశాడు. స్పందన… ఎందుకు స్పందించదు. తనకే ఎందుకు స్పందించదు. ఫోను పడేసి ఫ్రెష్ అయ్యాడు.  పాలు స్టౌ మీద పెట్టి కబోర్డ్ లో వెతికితే, సగం అయిపోయిన బ్రెడ్ ప్యాకెట్ కనిపించింది. అతను ప్రయత్నిస్తున్నాడు.  పాలల్లో బ్రెడ్డు ముంచుకుని తినడం . పాలచుక్క క్రింద పడకూడదు. బ్రెడ్డుముక్క పాలల్లో పడకూడదు. అతని దురదృష్టం ఈరోజు రెండూ జరిగాయి. ఛ! కనీసం ఈ పని కూడా చాతకాదు.

గత ఆరేళ్ళుగా రిసెర్చ్ స్కాలర్ గా ప్రముఖ ఐ.ఐ.టి లో చేస్తున్నాడు భవాని. ఏడాది బట్టీ క్యాంపస్ బయటన ఉంటున్నాడు. సింగిల్ బెడ్రూం హాల్ కిచెన్. ఐదేళ్ళ గడువు పూర్తికాగానే హాస్టలు ఖాళీ చెయ్యాల్సి వచ్చింది. పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వస్తుందని అందులోకి తీసుకుంటానని ఆరునెలల నుండీ ఊరిస్తూనే ఉంది అతని గైడ్ స్పందన. పరిశోధన సాగటం లేదు. కావలసిన పరికరాలు తెప్పించడం కష్టంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా స్పందన నుండి స్పందనలేదు. తనతో చేరిన వాళ్ళందరూ ఇప్పటికే ఫారెన్లో సెటిల్ అయ్యారు. తానేమో ఇలా.. ! ఏకంగా మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిదేమో. చిరిగిన పాకెట్లో మిగిలిన పాలు కనులముందు కదలాడాయి. ఉపయోగంలేదు. ఒంపేయాలి… తన జీవితాన్ని కూడా..!. ఎంతకాలం ఇలా ఉండగలడు. అసలు తనకు పి.హెచ్.డి వస్తుందా? గత ఆరేళ్ళు చేసినదంతా గుర్తుచేసుకుంటున్నాడు. ఏమాత్రం ఉత్సాహం కలగటంలేదు. ఏం చేశాడో ఎందుకు చేశాడో అసలేం చెయ్యాలనుకున్నాడో.. అన్నీ కనిపిస్తున్నాయి. అయితే మసక మసకగా కనుమరుగవుతున్న నక్షత్రాలలా…. అతని కలలు. తిట్టుకున్నాడు. గుర్తొచ్చినవాళ్ళందరినీ తిట్టుకున్నాడు.  ప్రొఫెసర్ స్పందనని తిట్టుకున్నాడు. ఐ.ఐ.టి ని తిట్టుకున్నాడు. భారత విద్యావిధానాన్ని తిట్టుకున్నాడు. పాలబ్బాయిని తిట్టుకున్నాడు. ‘అసలు ఏమిటి వాడి ఉద్దేశ్యం? అంతప్రొద్దున్నే పడేయకపోతే ఏంపోయింది. కాస్త ఆలస్యంగా రమ్మని ఎన్నిసార్లు చెప్పాడు. ఫోన్ తీశాడు. పాలవాడి నెంబర్ కి చేశాడు.

“హలో శేఖరేనా”

“ఆఁ! అవునండి.”

“నేను భవాని ని”

“చెప్పండిసార్ ”

“పాలపాకెట్లు ఎన్ని గంటలకు పెట్టావు? ”

“ఏడుగంటలకండి ”

“నీ కసలు బుద్ధుందా? నాకు ఆలస్యంగా తెమ్మని ఎన్ని సార్లు చెప్పాను? ఇంకెన్ని సార్లు చెప్పాలి ”

“అది కాదు సారు.. ”

“ఏది కాదు. ఈ రోజు నీవల్ల ఒక పాకెట్ పాలు నేలపాలయ్యాయి. నువ్వేమో తొందరగా తెచ్చి పడేస్తావు. ఆ ఎదురింటి పిల్లి వచ్చి పాకెట్టు కొరికి పడేస్తుంది.”

“….. ”

“ఏం మాట్లాడవేం? నీకు ఈ మధ్య బుఱ్ఱ తిరుగుడు ఎక్కువై పోయింది.”

“నేను ఆలస్యంగానే వచ్చానుసార్. అందరికీ ముందే ఆరు గంటలకే ఇచ్చేస్తాను. ఏడు గంటలకి బయలుదేరితే గానీ నేను పనిలోకి వెళ్ళలేను. బస్సు మిస్సైపోతుంది.”

“ఎదో వంక చెప్పి తప్పించుకోవడమే గానీ ఎదుటివాడి కష్టాలని అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు నా పరిస్థితేంటి?”

“సరే సారు, ఈసారి నుండీ లేటుగా పెడతాను ”

“అలాగే అంటావు. మళ్ళీ మామూలే ”

“లేదు సార్, ఈ సారి నుండీ తప్పకుండా లేటుగా వస్తా ”

ఫోను పెట్టేశాడు. రెండవ బ్రెడ్డుముక్కను తీసాడు. ఈసారి పాలల్లో ముంచలేదు. అన్యమనస్కంగా ఒక ముక్క కొరికి నోట్లో పెట్టుకున్నాడు.  అప్పుడు గుర్తొచ్చి పాలను కాస్త త్రాగాడు. బాగుందే! అదే రుచి. తేడా ఏమిటి? రుచిని ఆస్వాదిస్తూ ఆలోచిస్తున్నాడు. తేడా ఒక్కటే.. పద్ధతి! పాలల్లో ముంచి తీసుకుంటే తన నాలుక ఆ రెంటినీ ఒకేసారి గ్రహిస్తుంది. ఆ రుచి తనకిష్టం. కేవలం బ్రెడ్డు ముక్క పెట్టుకుని పాలకై వేచి చూడడం…తన నాలుక ఇష్టపడదు. కానీ క్షణం ఓపిక పడితే వాటి కంబైండ్ రుచిని అది పొందుతుంది. బ్రెడ్డుముక్కా క్రిందపడదు. పాలూ క్రింద పడవు. బహుశా జీవితం కూడా అంతేనేమో. ఏదో అర్థమయ్యీ అవ్వకుండా మనసులో మెదలసాగింది.

మన చేతిలో కొన్నుంటాయి బ్రెడ్డు ముక్కలా. కొన్ని పరిస్థితుల చేతిలో ఉంటాయి. మన చేతులోవి చేజారకుండా పరిస్థితులను మనకనుకూలంగా తెచ్చుకుని జాగ్రత్తగా … ఊహూఁ, తనకది రాదు. కుదరటంలేదు. పరిస్థితులను పట్టించుకోకుండా తన చేతిలో పని తను చెయ్యగలడా? అహం ఒప్పుకోదు. ఒకదానితో సంతృప్తి చెందదు. ఎవరినో ఒకరిని తిట్టుకోవాలి. దోషిని చెయ్యాలి. మనిషి తన సమస్య గురించి కన్నా దానికి ఎవరిని బాధ్యులను చెయ్యాలనేదానిమీద ఎక్కువ దృష్టి పెడతాడు. అహంకారం, ముందు వేలెత్తి బయటవైపు చూపిస్తుంది.  నిజానికి  పాలు ముఖ్యమే. అయితే ఇక్కడ పరిస్థితులు తన చేతుల్లో లేవు. ఎంతసేపు బ్రెడ్డుముక్క నోట్లో పెట్టుకుని ఎదురు చూడగలడు. చూడాలి. తప్పదు. తనకిష్టమైన రుచి ని ఆస్వాదించలేకపోవచ్చు. ఒకవేళ పాలు అయిపోయినా … కడుపులోకి ఏదో కాస్త వెళ్తుంది. ఆకలి తీరుతుంది. ఇక్కడ తన చేతుల్లో ఉన్నది తను ఇప్పటి వరకూచేసిన పరిశోధన. అవును. దానికి ఒక రూపు తీసుకురావాలి. ప్రోజెక్ట్, పేటెంట్, పేపర్స్ …

తను చేరినప్పుడు లక్ష్యం  ఏం పెట్టుకోవాలో స్పందన చెప్పింది. “మనమంతా ఒక టీం. నన్ను మీ ఫ్రెండ్ గానే ట్రీట్ చెయ్యండి.. ఈ మర్యాదలు అవీ నాకు పెద్ద ఇష్టంలేదు. కాల్ మీ స్పందన. దట్సాల్ ” మొదటిరోజు ఆమె మాటలు. ప్రోజెక్ట్ తన చేతుల్లో లేదు. కానీ పేపర్స్, పేటెంట్ల కోసం ప్రయత్నించగలడు. రిసెర్చ్ అవుతుందోలేదో. ప్రోజెక్ట్ వస్తుందోలేదో. వాటికి పరిస్థితులు అనుకూలించాలి. తన చేతిలో ఉన్నది ముందు మొదలెట్టాలి. కనీసం బ్రెడ్డైనా తింటే కాస్తైనా కడుపు నిండుతుంది. అంతే ఒక్కసారిగా అతనిలో ఒక వెల్లువ పొంగింది. సగం కొరికిన బ్రెడ్డు ముక్కను అలానే వదిలేసి, ఇన్స్టిట్యూట్ కి రివ్వున దూసుకుపోయాడు.

ల్యాబ్ లో పనిచేస్తున్నాడు భవాని శంకర్. తన దగ్గర ఉన్న డేటాని గ్రాఫ్లుగా మారుస్తున్నాడు. వాటికి సంబంధించిన విశ్లేషణ చేస్తున్నాడు. చేస్తున్నకొద్దీ అతనికి ఉత్సాహం పెరగసాగింది. కనీసం నాలుగు పేపర్లకు సరిపడా రిసల్ట్స్ అప్పటికే వచ్చాయి. ఏమో … పి.హెచ్.డికే సరిపోవచ్చేమో!  పేపర్లు తయారు చేస్తున్నాడు. ఆరోజు భవానీ నైట్ ఔట్ చేస్తున్నాడు. భవానీ శంకర్ జీవితంలో ఎన్నో నైట్ ఔట్లు ఉన్నాయి. మరెన్నో నైట్ ఔట్లు ఉంటాయి. భవానీ శంకర్  ప్రత్యేకమైన వ్యక్తి కాదు. అతని పరిశోధనా ప్రత్యేకమైనది కాదు. ఆ రాత్రికి కూడా ఏ ప్రత్యేకతా లేదు.

ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి  మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రినుండీ టేబుల్ పైన ఫాన్‌ తిరుగుతూనే ఉంది.

About భైరవభట్ల విజయాదిత్య

’చిన్నప్పటినుండీ ఇంట్లో ఉన్న వాతావరణం వల్ల సాహిత్యంలో కలిగిన ప్రవేశం, కుదిరినంతవరకూ నాలో కలిగే భావాలను అక్షరాలలో ఆవిష్కరింపజేయాలనే తాపత్రయం, ఇతరుల ప్రోత్సాహం … ఇవి నా చేయి పట్టి అడుగులు వేయిస్తున్నాయి.’ అని చెప్పే భైరవభట్ల విజయాదిత్య గారు విజయనగరానికి చెందిన వారు.

ఆంద్రభూమి లో మూడు కథలు ప్రచురితమయ్యాయి. రంజని – నందివాడ భీమారావు కథల పోటీలో ప్రత్యేక బహుమతి, బొబ్బిలి రచన సంస్థవారి కవితల పోటీలో ద్వితీయ బహుమతీ అందుకున్నారు. సంపుటిలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. కృష్ణబిలం (krishnabilam.blogspot.com) అనే బ్లాగు రాస్తూంటారు.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.