సమస్యాపూరణములో అర్థశక్త్యుద్భవధ్వని చర్చ

ధ్వని సిద్ధాంతములో అవివక్షితవాచ్యధ్వని అని ఒకటి ఉన్నది. వాచ్యార్థముచేత మాత్రమే కాక లక్ష్యార్థము వల్ల అర్థాంతర స్ఫూర్తి కలిగితే అది అవివక్షితవాచ్యధ్వని అంటారు(ట). అది రెండు విధాలు. అర్థాంతరసంక్రమితవాచ్యధ్వని, అత్యంతతిరస్కృతవాచ్యధ్వని అని ధ్వన్యాలోకం.

అర్థాంతరసంక్రమితవాచ్యధ్వని కి ఉదాహరణగా ఒక శ్లోకం చెబుతాడు సూత్రకారుడు. రామ శబ్దానికి సాధారణంగా ఉన్న అర్థంలో కాక, ఇంకో అర్థంలో (మాటలలో చెప్పలేని రాజ్యభ్రంశాది అనేక దుఃఖములను పొందిన రాముడను – అని శ్లోకంలో రాముడంటాడు) లక్ష్యార్థాన్ని చెబుతాడు కాబట్టి ఇది అర్థాంతరసంక్రమిత వాచ్యధ్వని అట.

శివున్ స్మరింప….కు కామేశ్వరరావు గారి పూరణ:

శివమ్మటన్న వేదమౌను శ్రీశుభప్రదాయియౌ
నవాంబుజాక్షు నా సహస్రనామవార్ధి గల్గదే
శివాయటన్న భవ్యనామశీకరమ్ము! విష్ణువౌ
శివున్ స్మరింప పాపముల్ నశించు, నాయబద్ధమే!

పై పద్యంలో “శివుని” వాచ్యార్థంలో కాక లక్ష్యార్థంలో విష్ణువును సూచిస్తున్నారు కనుక ఇది కూడా ధ్వనికి ఉదాహరణగా పరిగణించవచ్చని నా అనుకోలు. ఇది సమంజసమేనా?-రవి

రవీ,

ఒకటి – లక్షణార్థం ఉన్నంత మాత్రాన అక్కడ “ధ్వని” ఉంటుందని లేదు. ఉదాహరణకి – “అన్నం ఉడుకుతోంది.” అన్న వాక్యం తీసుకుందాం. “అన్నం” అంటే ఉడికిన బియ్యం, ఆహారం ఇలాంటివి వాచ్యార్థాలు. కాని ఈ వాక్యంలో ఆ అర్థాలు పొసగవు. ఎందుకంటే అక్కడ ఉడుకుతున్నది బియ్యమే. ఆ వాక్యంలో “అన్నం” అనే పదానికి లక్షణార్థం బియ్యం. అయితే యీ వాక్యంలో ఎలాంటి ధ్వని లేదు. అలాగే “ఈ రైలు విజయవాడ మీదగా హైదరాబాదు వెళుతుంది” అన్న వాక్యంలో “మీద” అనే పదానికి వాచ్యార్థమైన “పైన” (above) అన్న అర్థం పొసగదు. హైదరాబాదు వెళ్ళే దారిలో విజయవాడ ఉంటుంది అనే లక్షణార్థాన్ని యిక్కడ గ్రహించాలి. ఈ వాక్యంలో కూడా “వ్యంగ్యం” కాని “ధ్వని” కాని ఏదీ లేదు. లక్షణార్థం వలన వ్యంగ్యం కలిగే ఉదాహరణ చూద్దాం. ఒకావిడ ఉదయాన్నే ఇంటి ముందు చిమ్మి ముగ్గుపెడుతోందనుకుందాం. పక్కింటావిడ, “పిన్నిగారు, ఏమిటివాళ మీ కోడలుకాకుండా మీరు ముగ్గేస్తున్నారు?” అని అడిందనుకుందాం. దానికావిడ, “ఆఁ, మా కోడలికింకా తెల్లవారలేదమ్మా” అని అన్నాదనుకోండి. ఇక్కడ “తెల్లవారలేదు” అన్నదాన్ని ఉదయం అవ్వడం అనే వాచ్యార్థంలో తీసుకోడం కుదరదు. ఎందుకంటే ఉదయం అన్నది అందరికీ ఒకేసారి అవుతుంది. ఆవిడ కోడలికి ప్రత్యేకంగా అవ్వడముండదు. “మా కోడలికింకా తెల్లవారలేదు”, అంటే “మా కోడలింకా నిద్రలేవలేదు” అని అర్థం. ఇది లక్షణార్థం. అయితే “మా కోడలింకా నిద్రలేవలేదు” అని అనడానికి బదులు, “మా కోడలికింకా తెల్లవారలేదు” అని అనడంలో ఒక ఆక్షేపణ ధ్వనిస్తోంది. ఆ అత్తగారికి కోడలిమీద కాస్త తిరస్కారభావం ఉందని తెలుస్తుంది. ఇది వ్యంగ్యార్థం. ఆ వాక్యంలో నేరుగా కనిపించని అర్థమది. కాబట్టి ఇక్కడ లక్షణ వ్యంగ్యానికి దోహదమయ్యింది.

ఇప్పుడు చెప్పండి, నా పద్యంలో, “శివుడు” అన్నది మాములుగా వాడే “పార్వతీపతి” అనే అర్థంలో కాక “శుభాలనిచ్చేవాడు” అనే అర్థంలో వాడినందువల్ల ఇందులో “ధ్వనిస్తున్న” (నేరుగా కనిపించని) విషయం వేరే ప్రత్యేకంగా ఏదయినా ఉందా? నాకలాంటిది ఏదీ కనిపించడం లేదు. కాబట్టి అందులో “ధ్వని” అంటూ ఏమీ లేదు.

రెండు – ఇక్కడ “శివ” అనే పదానికి “శుభములనొసగేవాడు” అనే అర్థం అసలు లక్షణార్థమే కాదు. అది దాని వ్యుత్పత్తి మూలంగా వచ్చిన అర్థం. “పార్వతీపతి” అన్నది రూఢ్యర్థం (అంటే ప్రజా వ్యవహారంలో ప్రసిద్ధి పొందినది). ఈ రెండర్థాలూ ఆ పదానికి వాచ్యార్థాలే. వాడిన సందర్భాన్ని బట్టి ఒకో అర్థాన్ని మనం తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకి “రాజు” అనే పదానికి “ప్రజలని పాలించేవాడు”, “చంద్రుడు” అనే రెండర్థాలు ఉన్నాయి. ఆ రెండూ వాచ్యార్థాలే. ప్రయోగించిన వాక్యాన్ని బట్టి ఏ అర్థం తీసుకోవాలన్నది నిర్ణయమవుతుంది. వాచ్యార్థానికీ, లక్షణార్థానికీ తేడా తెలుసుకోడానికి ఒక సులువైన పద్ధతి ఏమిటంటే – పదానికి ఒక అర్థం నిఘంటువులో ఉంటే అది కచ్చితంగా వాచ్యార్థమే అవుతుంది. లేదంటే అది లక్షణార్థం అవుతుంది. “శివుడు” అనే పదానికి నిఘంటువులో “పార్వతిపతి”, “శుభములనిచ్చేవాడు” అనే రెండర్థాలూ ఉంటాయి. అదే “అన్నం” అనే పదానికి “బియ్యం” అనే అర్థం కాని, “తెల్లవారడం” అంటే “నిద్రలేవడం” అనే అర్థాం కాని నిఘంటువుల్లో ఉండదు.

సరే, మీరు అలంకారశాస్త్రాన్ని తిరగేస్తున్నట్టున్నారు కాబట్టి, మీకొక చిన్న పరీక్ష. :)

నా పద్యంలో “అర్థశక్త్యుద్భవ అలంకారకృత వస్తుధ్వని” ఉంది. అదేమిటో చెప్పగలరా? అలంకారశాస్త్రం తెలిసిన పెద్దలింకెవరయినా కూడా చెప్పవచ్చు. దాని ద్వారా నా పరిజ్ఞానమెంతో కూడా నేను తెలుసుకోగలుగుతాను. -కామేశ్వరరావు

కామేశ్వరరావుగారు, నాకు అలంకారశాస్త్రం బొత్తిగా తెలియదు. కానీ నాకు తట్టిన ఒక విషయం చెపుతాను. సరియో కాదో మీరే నిర్ణయించాలి. మొదటి పాదంలో బ్రహ్మను, రెండవపాదంలో విష్ణువును, మూడవ పాదంలో శివుణ్ణీ స్ఫురించేలా ఉన్నది మీ పద్యము. ఆఖరి పాదం, వారందఱూ ఒక్కరే అని చెప్పే విధంగా ఉన్నది – గిరి

గిరి గారూ,

అర్థశక్త్యుద్భవ ధ్వని” – అంటే ప్రయోగించిన శబ్దం (శబ్దాలు) ధ్వనన వ్యాపారాన్ని (మాత్రమే) బోధిస్తూ, తాత్పర్యాన్ని బోధించలేక, తాత్పర్యార్థం (లోక వ్యవహారాదుల) వల్ల బోధపడితే అట్టి ధ్వని అర్థశక్త్యుద్భవ ధ్వని(ట).

ఉదాహరణ తెలిస్తే అవగతమవుతుంది. (ధ్వన్యాలోకం)

ఏవంవాదిని దేవర్షౌ పార్శ్వే పితురధోముఖీ
లీలాకమలపత్త్రాణి గణయామాస పార్వతీ.

(-కుమారసంభవం)

దేవర్షి ఆంగీరసుడు ఇలా పలుకుచుండగా, తండ్రిపక్కన నుంచుని ఉన్న పార్వతి తలను వంచి విలాసార్థములైన తమ్మి రేకులను లెక్కపెడుతూంది.

-అంటే పార్వతి లజ్జ చెందుతూంది అని తాత్పర్యార్థం. ”లజ్జ”, “వ్రీడ” ఇత్యాది శబ్దాలు శ్లోకంలో ఉపయోగించకుండా లజ్జను ఉద్యోతించాడు కాబట్టి ఇది అర్థశక్త్యుద్భవ ధ్వని. నాకు రఘువంశం షష్టస్సర్గలో ఇందుమతీ స్వయంవరంలో రాజులు పడే పాట్లు గుర్తొస్తున్నాయి. ఆదిభిక్షువు వాడినేది కోరేది? ..బూడిదిచ్చేవాడినేది అడిగేది? – ఈ సినిమా పాట కూడా అర్థశక్త్యుద్భవ ధ్వనికి ఉదాహరణ అని అనుమానంగా ఉంది.

కామేశ్వరరావు గారు మరో రెండు ఉపమలు జోడించి – “అర్థశక్త్యుద్భవ అలంకారకృత వస్తుధ్వని” అంటున్నారు. :) (పూర్తి అర్థమేమిటో అర్థం కాలేదు) అంటే ఆ పద్యంలో శబ్దం (పదముల) ద్వారా కాక, వేరే ఏదైనా తాత్పర్యం కనిపిస్తుందా అని చూడాలి.

ఈ విషయంలో గిరి గారు చెప్పినదే ఎక్కువ సమంజసంగా అనిపిస్తున్నది. – రవి.

రవీ, “అర్థశక్త్యుద్భవ అలంకారకృత వస్తుధ్వని” అన్న పదాన్ని అట్నుంచి నరుక్కురావాలి. :-)

ఇది ముందుగా “వస్తుధ్వని” – అంటే వస్తువుని ధ్వనిస్తుంది. ధ్వనించే విషయం వస్తువు కాని, అలంకారం కాని, భావం కాని, రసం కాని కావచ్చు. ఏదైతే అది ఆ
ధ్వని. ఇక ఇది అలంకారకృతము – అంటే అలంకారం చేత వచ్చిన ధ్వని. అంటే ఒక అలంకారం ఒక వస్తువుని ధ్వనిస్తోందన్న మాట.

ధ్వని “శబ్దశక్తి” వలన కాని, “అర్థశక్తి” వలన కాని ఉత్పన్నం కావచ్చు. కేవలం శబ్దాల వలన ఉత్పన్నమయితే అది “శబ్దశక్తి-ఉద్భవం”. అంటే ఉదాహరణకి “ఆ దుష్యంతుడు అనంతసత్త్వుడు” అని అన్నప్పుడు, “అనంతసత్త్వుడు” అనే పదం రెండర్థాలని ఇస్తుంది. అనంతమైన బలం కలవాడు అని ఒకటి. అనంతుని వంటి (ఆదిశేషువువంటి) బలం కలవాడు అని మరొకటి. దీని వలన దుష్యంతుడు బలంలో అనంతుడివంటి వాడు అనే అలంకారం ధ్వనిస్తోంది. ఇక్కడ ధ్వనిస్తున్నది అలంకారం కాబట్టి ఇది అలంకారధ్వని. ఈ ధ్వనికి కారణం “అనంత” శబ్దం. కాబట్టి ఇది “శబ్దశక్తి ఉద్భవ అలంకార ధ్వని”.

ప్రత్యేకమైన ఒక శబ్దం ప్రధానం కాక, చెపుతున్న అర్థం ద్వారా ఒక విషయం ధ్వనిస్తే అది “అర్థశక్తి ఉద్భవ” ధ్వని అవుతుంది. ఒక అలంకారములోని అర్థంశక్తి ద్వారా ఒక వస్తువుని ధ్వనింప చేస్తే అది “అర్థశక్త్యుద్భవ అలంకారకృత వస్తు ధ్వని” అవుతుంది.

“నవాంబుజాక్షుని సహస్రనామవార్థిన్” – విష్ణువునకున్న సహస్రనామాలనే సముద్రంలో”కల్గదే శివాయటన్న భవ్యనామశీకరము” – శివా అన్న పవిత్రనామం అనే  బిందువు ఉన్నది కదా. విష్ణు సహస్రనామాలని సముద్రంతోనూ, శివ నామాన్ని అందులోని ఒక బిందువుతోనూ పోల్చిన రూపకాలంకారం. ఇది విష్ణు తత్త్వం యొక్క మహత్వాన్ని, ఆ మహాతత్త్వంలో “శివ” తత్త్వం కేవలం సముద్రంలో ఒక బిందువంత చిన్నది అనీ ధ్వనించడం లేదా?
శ్రీవైష్ణవుల దృష్టిలో విష్ణువే పరమాత్మ, పరమేశ్వరుడు. ఇతర దేవతా స్వరూపాలన్నీ అతనివే, అతనిలోనివే. శివ స్వరూపం కూడా అందులో భాగమే. విష్ణుభక్తి పరంగా పూరించాలని అన్నారు కదా అని విష్ణు తత్త్వ మహత్వాన్ని ధ్వనించాలని అలా సహస్రనామాలని సముద్రంతోను, అందులో శివ నామాన్ని ఒక బిందువుతోనూ పోల్చాను. ఇది అర్థాలంకారం, అంటే అందులోని అర్థమే కాని వాడిన శబ్దాలకి ప్రాముఖ్యం లేదు. “శీకరము” అని వాడింది యతికోసమే కాని ఆ శబ్దానికి ప్రత్యేకమైన ప్రయోజనం వేరేదీ లేదు.

ఈ అలంకారం ధ్వనిస్తున్న విషయం విష్ణు మహత్వం. అది వస్తువే కాని అలంకారమో, రసమో కాదు. కాబట్టి ఇది వస్తుధ్వని. అర్థశక్తి ఉద్భవ అలంకారకృత వస్తుధ్వని అని నా ఉద్దేశం. -కామేశ్వరరావు

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

2 Responses to సమస్యాపూరణములో అర్థశక్త్యుద్భవధ్వని చర్చ

 1. సంపత్ కుమార్ శాస్త్రి says:

  కవి మిత్రులకు వందనములు.

  అర్థశక్త్యుద్భవ ధ్వని అలంకారమును గూర్చి తెలిపినందులకు ధన్యవాదములు. నాకు ఒక చిన్న సందేహము.

  మీరు చెప్పిన ఉదాహరణలను పరిశీలించినచో, రూపకాలంకారములన్ని కూడా ఈ అర్థశక్త్యుద్భవ ధ్వని క్రిందకే రావచ్చని అనుకుంటాను. సమంజసమేనా??

 2. కామేశ్వరరావు says:

  అలంకారము (అది ఉపమా అయినా, రూపకమైనా) ఉన్నంత మాత్రాన అక్కడ ధ్వని ఉంటుందని చెప్పలేం.

  ఉదాహరణకి “గురువుగారి పాదపద్మాలకి నమస్కారం” అని ఎవరైనా అన్నారనుకోండి. అక్కడ పాదపద్మాలు – పద్మముల వంటి పాదములు – ఉపమాలంకారముంది. కాని అందులో ప్రత్యేకమైన ధ్వని ఏదీ లేదు. “పాదాలకి నమస్కారం” అనడం కన్నా “పాదపద్మాలకి నమస్కారం” అనేది ఎక్కువ భక్తిని ధ్వనిస్తోంది అని చెప్పలేం.

  అలాగే మరొక ఉదాహరణ:

  “ఆమె కురులమేఘాల మధ్య సిరిమల్లె జాబిల్లి దోబూచులాడుతోంది”

  అన్న వాక్యంలో కురులమేఘాలు, సిరిమల్లె జాబిల్లి అనే చోట్ల రూపకాలంకారముంది. ఇందులో ఆ యువతి జడలోని సిరిమల్లెని అందంగా చిత్రించడం/వర్ణించడం మాత్రమే ఉంది కాని ధ్వని లేదు. మామూలుగా ఏ అలంకారమైనా చేసే పని అదే, చెప్పే విషయానికి అందాన్ని/సొగసుని ఇవ్వడం. వేరే ప్రత్యేకమైన విషయమో, అలంకారమో, రసమో ధ్వనిస్తేనే అక్కడ ధ్వని ఉన్నట్టు. సాధారణంగా ధ్వని ఉండాలంటే ఒక సందర్భం ఉండాలి.

  ఈ ఉదాహరణ చూడండి:

  ఒక భర్త తన భార్యతో “నీ తలలో సిరిమల్లె జాబిల్లి లేని రాత్రి నాకు అమావాస్యే!” అన్నాడనుకోండి. ఇందులో ధ్వని ఉంది. అదే రూపకాలంకారం ఇక్కడ ధ్వనికి ప్రోద్బలమయింది. ఇక్కడ ధ్వనిస్తున్నది ఏమిటో సహృదయుల ఊహకి వదిలేస్తున్నాను :-)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *