అలనాటి వ్యాసాలు

"గత కాలమే మేలు వచ్చు కాలము కంటే…" అని ఓ కవి గడచిపోయిన కాలం తాలూకుమధురమైన జ్ఞాపకాలలో తేలియాడాడు. గత రాత్రి కురిసిన నీహారికాబిందుసందోహాలనేగా బాలభానుడు కొత్తపొద్దున మెరిపించి, మురిపించి మంచుముత్యాలుగా మార్చేది! అలనాటి తెలుగు సాహిత్యవ్యాసంగాలలో మెరసిన కొన్నిరచనలను "పొద్దు" ఈ తరం పాఠకులకు పరిచయం చేయాలని సంకల్పిస్తున్నది.

Unknown Object
పాతబడేకొద్దీ సోమరసం మాధురి పదునెక్కుతున్నట్టు, రోజులు గడుస్తున్నకొద్దీ తీయందనాలు చిందే అలనాటి ముచ్చట్లు అవి. బామ్మల బాల్యాన్ని, తాతయ్యల "మా కాలంలో అయితే.." కథలను విననివాడు, చాదస్తమనేవాడు ఆధునికుడు కాడు, అరసికుడు! అవి పాతచింతకాయ పచ్చళ్ళు కావు. నూడుల్స్, పిజ్జాలు మరిగిన కొత్తతరానికి బామ్మ పెట్టిన కొత్తావకాయ రుచులు! అంతేనా, గుమ్మడికాయ వడియాలూ, మిరియాల చారులూ, అల్లపు పచ్చళ్ళూనూ.

ఈ వ్యాసాలు, వ్యాసంగాలు స్వాతంత్ర్యం రాకముందు, వచ్చిన కొత్తల్లో ఉన్న సమాజానికి, సాహిత్యంలో వచ్చిన కొత్త ధోరణులకు, వ్యవహార భాషోsద్యమానికి, ఉద్భవిస్తున్న ఇతరత్రా కొత్త సాహిత్య సంప్రదాయాలకు ప్రతిబింబాలు. ముద్రణారంగం కూడా క్రమంగా బలపడుతున్న రోజులవి.

తెలుగు పత్రికల గురించి, తెలుగు సాహితీ వ్యాసంగాల గురించి ముచ్చటించుకొనే వరుసలో అగ్రపీఠం కృష్ణాపత్రికది. కారణజన్ములు ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు ఆయన మహోన్నత వ్యక్తిత్వానికీ, భావుకతకు, విషయవిస్తృతికి, ఆదర్శాలకు, సౌశీల్యానికి, సమాజ చైతన్యానికి, ఆధ్యాత్మికతకు, కళాభిమానానికి, సంస్కరణా దృక్పథానికి నిదర్శనాలు. 1908 లో వందేమాతరం ఉద్యమప్రభావంతో ముట్నూరి వారు "తెల్లదొరలను తుపాకీతో కాల్చుట" అని సంపాదకీయం వ్రాశారుట. ఆ సంపాదకీయం ప్రచురించిన వెంటనే పరిణామాలు దారుణంగా ఉంటాయని, ముద్రించిన ప్రతులను తగులబెట్టించారుట. కానీ, ఒకట్రెండు ప్రతులు ఎలానో తెల్లవాళ్ళకు దొరికి, అవి చదివి వారు కృద్ధులై, కృష్ణారావు గారిని పత్రిక నుంచి తొలగించమని కృష్ణాజిల్లా సంఘాధ్యక్షులు శెడింబి హనుమంతరావు గారిని తీవ్రంగా హెచ్చరించారుట. అలాంటి ఒడిదుడుకులను ఎదుర్కుంటూనే ముట్నూరి వారు 1907 లో పత్రికలో చేరినప్పటి నుంచి 1945 వరకూ అప్రతిహతంగా కృష్ణాపత్రికను, సంపాదకీయాలనూ కూడా సమర్థవంతంగా నిర్వహించారు. ఆ రోజుల్లో గ్రామాలలో రచ్చబండలలో ఈ వ్యాసాల గురించి చర్చించుకుని కర్తవ్యం నిర్ణయించుకునే వారట.

కాటూరి గారు, అడివి బాపిరాజు గారు, పింగళి నాగేంద్రరావు గారు, మల్లాదిరామకృష్ణశాస్త్రి గారు, కొడాలి ఆంజనేయులు గారు, జరుక్ శాస్త్రి గారు, కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు వంటి లబ్ధప్రతిష్టులు కృష్ణాపత్రికను అలంకరించి, తీర్చిదిద్దారు.

ఆ తర్వాత వచ్చిన పత్రికలలో ప్రముఖమైనవి ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రభ, యువ, ఆంధ్రజ్యోతి వగైరా..

తమ స్వీయచరిత్ర "హంపీ నుంచి హరప్పా దాక" లో తిరుమల రామచంద్ర గారు అలనాటిభారతి పత్రిక గురించి ఉటంకిస్తూ – "భారతిలో వ్యాసం పడితే మదరాసు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు పట్టా అందుకున్నంత గొప్ప" అని ఓ మాటంటారు. ఆనాటి వ్యాసాల స్థాయి అది. చర్చలైతేనేం, కవికాలాదుల విషయమైతేనేం, అనువాద కవితలైతేనేమి, కావ్యాల పరిష్కారాలలో జరిగే పొరబాట్లయితేనేం, సాంస్కృతిక రీతులైతేనేం, సామాజిక పరిణామాలైతేనేం.. అవి మీఁగడ తఱగలు, తంగేటి జున్నులు.

"నూటిడి" అనే పదాన్ని పొరబాటుగా "నూబిడి" అని ఓ కావ్యంలో పరిష్కరిస్తూ ఒకాయన రాస్తే, మరొకాయన, అది ముమ్మాటికీ "నూటిడి" అని, అన్నమయ్యనూ, శ్రీనాథుడి ప్రయోగాలను ఉటంకిస్తూ, మా నూటిడి (నువ్వులుండ) ని మాకు కాకుండా చేయడమేంటని అధిక్షేపిస్తాడు. మరొకాయన ఆక్షేపిస్తాడు -"చారు" లో ఉన్నది శకటరేఫమా (ఱ), సాధు రేఫమా అని ఓ వాదన. ఆ వాదన కీచులాట కాదు. సాంబ్రాణి పొగలాటి కమ్మనైన, ఘమ్మనైన పొగ. భవభూతి తెలుగువాడంటాడు ఓ సాహితీవేత్త.

అనడమే కాక, దానికి దృష్టాంతాలు చూపిస్తాడు. "రసో వై సః" లో ఉటంకించిన "రసం" కావ్యాలకు వర్తించదని అభినవ గుప్తుడి వ్యాఖ్యానం ఆధారంగా ఒక పండితుడు నిరూపిస్తాడు. ఆ విషయంలో జగన్నాథపండితరాయల వారి అభిప్రాయంతో విభేదిస్తాడు.

ఆ కాలం సాహిత్యవ్యాసాల తీరూతెన్నూ ఇదీ!

ఇంకా "నారీ జగత్తు" పేరిట ఇల్లిందల సరస్వతీదేవి గారు అరవయ్యో దశకంలో -ఆధునిక సమాజంలో స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలను, శారదాచట్టం వంటిచట్టాలను, స్త్రీలు ఉద్యోగం చేయడం వల్ల జరిగే పరిణామాలను చక్కటి పరిశీలనాదృక్పథంతో వ్రాశారు. విద్వాన్ విశ్వం గారు ఆంధ్రప్రభలో మాణిక్యవీణను మీటితే "ప్రమదావనం" పేరిట మాలతీ చందూర్ గారు ఆంధ్రప్రభలోనే ఎన్నో యేళ్ళు పాఠకులతో ముచ్చటించారు. ఇంకా..జంఘాల శాస్త్రి, గిరీశం, పురాణం సీతా.. ఇలా ఎందరో అలనాటి వ్యాసాలలోని మరువలేని పాత్రలు!

ఆంధ్రపత్రిక 1910 నుండీ యేడాది కొకసారి ఉగాదికి ప్రత్యేక సంచిక వెలువరించి, అందులో ఉద్ధండుల వ్యాసాలను, కథలను ఏర్చి కూర్చి ప్రచురించేది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారు కూడా ఆ ధోరణి ననుసరించారు.

ఈ రచనల మూలకంగా తెలుగు వైతాళికుల గురించి, తెలుగు భాష సాహితీ రీతులగురించి, స్వాతంత్ర్య కాలం నాటి సామాజిక పరిణామాల గురించి, సాహిత్యంలో కొత్త ప్రయోగాల గురించి, ఆంధ్రేతర భాషల విషయంలో ఆంధ్ర సాహితీవేత్తల అభినివేశం గురించి ఇలా ఎన్నో విషయాలు తులనాత్మకంగా తెలుసుకునే వీలున్నది.

ఎంత చెప్పుకున్నా తరగని నాటి కథలను, సాహితీ వ్యాసాలను, వ్యాసంగాలను యూనీకోడీకరించి, పాఠకులకు పాతపొద్దుల మలయసమీరాలను కొన్నిటినైనా పరిచయం చేయడానికి పొద్దు నడుం కట్టింది. కొత్త తరానికి పొద్దు రెండు దోసిళ్ళతోఅందిస్తున్న కానుక ఇది. తనివితీరా అందుకోండి. మీ సూచనల నందించడం మరువకండి!
 

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.