మార్పు

బళ్ళు తెరిచి, చూస్తుండగానే నాలుగు నెలలు గడిచాయి. అప్పుడే క్వార్టర్లీ పరీక్షలొచ్చేశాయి. నగరంలో ఆంగ్లపాఠశాలలో, అప్పుడప్పుడే మాటలు నేర్చిన చిన్నపిల్లలు కేజీల్లెక్కన చదువుకుంటున్నారు.
ఎస్ ఫర్ స్పైడర్
ఎస్ ఫర్ స్పైడర్
వల్లె వేయిస్తూంది టీచరమ్మ, కాదు కాదు “మేడమ్”. ఆ పిల్లల్లో ఓ బుల్లెమ్మకి “స్పైడర్” అంటే హేవిటో అర్థం కాలేదు. ఎదురుగా పుస్తకంలో రంగుల్లో బొమ్మ కనిపిస్తూంది. బొమ్మ బావున్నా, ఆ బొమ్మను ప్రాణంతో ఎప్పుడూ చూడకపోవడంతో, అదేమిటో సరిగా తెలియడం లేదు. అడగాలో వద్దో తెలీదు. పైగా మేడమ్ ఇంగ్లీషులో మాట్లాడమని ఆదేశించిందయ్యె. ఎలా అడగాలో ఒక ఇబ్బందైతే ఏం అడగాలో అనేది మొదటి ఇబ్బంది. ఇంతలో గంట కొట్టడంతో ఆ వేళ బడి ముగిసింది. తర్వాత రెండు రోజులు బడి లేదు! ఇంట్లో నాన్ననడిగింది పాప. ఏం చెబుతాడు? పుస్తకమూ, పుస్తకంలో బొమ్మ, మరోమారు చూపించేడు. సాలీడు కోసం చూసేడు. ఇంట్లో బూజదీ లేక ఫ్లాటు కళకళ్ళాడుతోంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాలే అని తప్పుకున్నాడు.
పాప హోమ్ వర్క్ చేస్తూ చేస్తూ అలానే నిద్దరోయింది.పాప నిద్దట్లో ఓ కల!

………………………………………………………..

బడికి సెలవులిచ్చారు. మ్యూజిక్ క్లాసులు తప్పిపోతాయని, అయిష్టంగానే అయినా.. ఓ వారం రోజులు పాపని పల్లెటూళ్ళో తాతయ్య ఇంట్లో గడపటానికి దింపి వచ్చాడు నాన్న.
తాతయ్య పొద్దున తీరికవేళలో పెరడు శుభ్రం చేస్తున్నాడు. పాప కూడా వచ్చిందక్కడికి. ఏదో పాట పాడుకుంటూ, తన పని చేసుకుంటున్నాడు తాతయ్య. పాపాయికి స్పైడర్ అంటే ఏమిటో తాతయ్యను అడుగుదామనిపించింది. తాతకు ఇంగ్లీషు రాదుగా, పుస్తకం తీసుకు వచ్చి చూపించింది. తాత నవ్వి, పాపకు ఓ చిన్న పొడుపు కథ పాటగా చెప్పేడు.

 

చిక్కుల మేడలో చిలుకల కొలికి
తూగుటుయ్యాలలో ఊగుతూ ఉంటుంది
ఆకలి కూటి ఆగంతకుల్ని
పీక పిసికి చంపి మింగేస్తుంది

పాపకర్థం కాకపోతే తాతయ్యే సాలెగూడును చూపిస్తూ విడమర్చేడు. “భలే”, “భలే”  అంది పాప. మరో పొడుపు కథ అంటూ చెప్పాడు.

 

జనక్ జనక్ పిల్లగాడు
వాడి నడుముకు మూరెడుతాడు
వాడు లేకుంటే ఊరంతా పాడు

ఆ వస్తువిక్కడే పెరట్లోనే ఉంది వెతుక్కోమన్నాడు. తడుముకుంటుంటే తాతయ్యే సమాధానం చెప్పేడు. పని ముగించి లోపలకొచ్చేరు తాత,  మనవరాలు. బడిలో ఇంతవరకు ఏం నేర్చుకున్నావో చెప్పమన్నాడు తాతయ్య. పాప ఉత్సాహంగా పార్ట్స్ ఆఫ్ బాడీ గురించి చెప్పింది. head, face, chest, legs ఇలా. తాతయ్య దానికీ ఓ గమ్మత్తైన పాట చెప్పేడు.

 

అంభాలు (పాదాలు)
అంభాల మీద కుంభాలు (మోకాళ్ళు)
కుంభాల మీద కుడితిబాన (పొట్ట)
కుడితిబాన మీద ఈరబలక (ఎదరొమ్ము)
ఈరబలక మీద ఇనపగుండు (తల)
ఇనపగుండు మీద ఎదురుమోసులు (వెంట్రుకలు)
ఎదురుమోదుల్లో రేచుకుక్కలు (పేలు)

ఇంకా –

 

అక్కాచెల్లెళ్ళు పక్కపక్కనే ఉంటారు
అక్కింటికి చెల్లెలు పోదు – చెల్లెలింటికి అక్క రాదు.

సమాధానం చెప్పుకోమన్నాడు. పాప తడబడుతుంటే, ముఖంలో భాగం అంటూ అందించేడు. ఈసారి సమాధానం చెప్పేసింది పాప.

ఆ కొన్ని రోజుల తర్వాత పాపాయి ఊరికొచ్చేసింది. కాన్వెంటు తిరిగి మొదలయ్యింది. ఆ రోజు రాత్రి అమ్మ వడిలో తలబెట్టుకుని అడిగింది పాప, “అమ్మా తాతయ్య ఏం చదువుకున్నాడమ్మా?”
“తాతయ్య చదువుకోలేదమ్మా! అందుకే ఇప్పటికీ పల్లెలో ఉన్నాడు.నువ్వు బాగా చదువుకుని బాగా పైకి రావాలే” అంది అమ్మ.

టీవీలో గాంధీ గురించి, గ్రామస్వరాజ్యం గురించి ఏదో ప్రోగ్రాము వస్తోంది.
తాతయ్య చదువుకోలేదా? చదువంటే ఏమిటి?

……

చప్పున మెలకువ వచ్చింది పాపకు.

…………………………………………………..

మనస్తత్వ శాస్త్రం (psychology) ప్రకారం ఓ మనిషి బాల్యం కాస్తంత అటూ ఇటూగా ఏడు యేళ్ళట. అంటే పసితనం, అమాయకత్వాలకు ముగింపు ఏడేళ్ళు. సాంకేతిక అభివృద్ధి పుణ్యమా అని అది కూడా రానురాను కుంచించుకుపోతోంది. ప్రపంచంలో అనేక దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఐదేళ్ళకు గానీ ప్రాథమిక విద్య మొదలవదు. ఈ విషయంలో మనం ప్రగతి సాధించాం. మూడేళ్ళకు ముందే స్కూలో, స్కూలో అంటూ పరుగులు. అంతకు ముందే ప్లే స్కూలు. రెండేళ్ళ నుండే, అరువు భాషలో అరగతీత కార్యక్రమాలు వెరసి బాల్యం బరువు పెరుగుతూ పోతోంది.
భారతదేశ ప్రాచీన విద్యావిధానంలో చదువుచెప్పడం ఎనిమిది యేళ్ళకు మొదలయేది. వృత్తి విద్య సాధారణంగా తండ్రి నుండి సంక్రమిస్తుంది కాబట్టి, ఉద్యోగం వెతుక్కునే అవస్థ, ఉద్యోగం కోసం చదువు అన్న అవసరమూ ఉండేది కాదు. చదువు అలా పాటలా, ఆటలా ఆనందంగా ఉండేది. సరే ఇప్పటి చదువులిలాగే తగలడ్డాయి, తగలడతాయి. వాటినలానే ఏడవనిద్దాం. ఆ చదివే చదువైనా, అలా అలవోకగా పిల్లల మీద వత్తిడి లేకుండా ఉంటోందా? అంటే అదీ లేదు. ప్రాథమిక విద్యలో హోం వర్కుల భారం, మార్కులు, ఆ తర్వాత ఏదో సెట్టు. మధ్యే మధ్యే టీవీలు, క్రికెట్టూ, సినిమా సమర్పయామి.
ప్రభుత్వాన్ని తిడుతున్నాం, చదువులను విమర్శిస్తున్నాం. ఫీజుల గురించి వాపోతున్నాం. మనలో మాత్రం మార్పు రావట్లేదు. ఆ మార్పు మన ఆలోచనా మూలాల్లోంచి రావాలి. ఎందుకు రావట్లేదో?

This entry was posted in సంపాదకీయం and tagged , , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *