ఇన్‌ఫార్మర్

"మీ ముఖంలో ఏంటా ఆందోళన? దేని గురించి అంత బెంగ?" అని అడుగుతూ "దేవుడిపై విశ్వాసం ఉంచండి. అన్నీ సర్దుకుంటాయి" అంది అరుంధతి.

"నాది ఆందోళన కాదు అరు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి,  మనం ఇది వరకు ఎరుగని విధంగా దారుణంగా ఉన్నాయి. యముడు తన మహిషంపై ప్రతీ వీధీ తిరుగుతున్నాడు. ఆయనకి మాత్రమే తెలుసు –  ఎప్పుడు ఏమవుతుందో" అంటూ వాస్తవాలను వివరించాడాయన.

సరిహద్దులకు ఆవలి వైపు నుంచి ఆటవిక జాతుల వాళ్ళు దాడి చేసి మానభంగాలకి, హత్యాకాండకి పాల్పడిన రోజులు అరుంధతికి గుర్తున్నాయి. అప్పుడామె వయసు పద్దెనిమిది సంవత్సరాలు. నిత్యకృత్యమైన ఆ మానభంగాల, హత్యాకాండల వివరాలు హృదయవిదారకంగా ఉండేవి, వెన్నులో చలి పుట్టించేవి. ఊరీ నుంచి బారాముల్లా వరకు నిరాయుధులైన సామాన్య ప్రజలను ఆక్రమణదారులు కిరాతకంగా చంపేసారని శ్రీనగర్‌కి వార్తలందాయి. బారాముల్లా పట్టణంలోని స్థానిక క్రైస్తవ మఠంలోని సన్యాసినులను సైతం కిరాతకులు వదల్లేదట. వాళ్ళు శ్రీనగర్ వైపే వస్తున్నారని తెలిసింది. మహిళలు….. ముఖ్యంగా యువతులు విద్యుత్ఘాతంతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు, కానీ వాళ్ళ దురదృష్టం…. నగరానికి విద్యుత్ సరఫరా రోజుల తరబడి నిలిచిపోయింది. వాళ్ళు నిస్సహాయులైపోయారు. వాళ్ళ ఆత్మహత్యల ప్రణాళిక విఫలమైంది,  ప్రతీ క్షణం మృత్యు ఘంటికలు మ్రోగిస్తోంది. మరణం క్రమక్రమంగా సమీపిస్తోంది.

ఇంతలో ఒక రోజు భారత సైన్యం ఆక్రమణదారులని తరిమేసిందని, వారు తిరుగుముఖం పట్టారనే శుభవార్త తెలిసింది. ప్రతీ ఒక్కరు హమ్మయ్య అంటూ నిట్టూర్చారు. అరుంధతి ఆ రోజుల్లో ఎంతో తెగువని ప్రదర్శించింది.  ఈ రోజు వరకు కూడా ఆమెకి తనంటే గర్వంగా ఉండేది.  మళ్ళీ అటువంటి పరిస్థితే ఇప్పుడు ఎదురైతోంది.  "ఎందుకా బెంగ? ఆటవిక జాతుల వాళ్ళు దాడి చేసినప్పటి నరకాన్నే తట్టుకుని నిలిచాం, దీన్ని కూడా దాటేస్తాం……. క్రుంగిపోవడం ఎందుకు ?" అంటూ భర్తకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది .

భార్య చెబుతున్న ధైర్యవచనాలు విని, నీలకంఠ గట్టిగా నిట్టూర్చాడు. అదే సమయంలో ఆవిడ అమాయకత్వానికి, సరళతకి ఆయనకి జాలేసింది.

ప్రతీ రోజు ఉదయం పూట దినపత్రిక లోని ప్రతీ వార్తని జాగ్రత్తగా చదువుతాడాయన.  బాహ్య ప్రపంచంతో ఆయనకున్న ఏకైక సంబంధం దానితోనే.  సమాచారం తెలుస్తోంది, కాని కొద్ది కొద్దిగా మాత్రమే. ఒక్కో వార్త పాత దాని కన్నా భయం గొలుపుతోంది. రెక్కలు తెగిన పక్షులలాగా వాళ్ళిద్దరూ వేదనతో విలవిలలాడిపోయారు.

"ఇదంతా మీ వల్లే. ఇప్పుడు అనుభవిస్తున్నాం. అబ్బాయి వీరూ మనల్ని అమెరికా వచ్చేయమని ఎన్ని సార్లు అడిగాడు? మీరేమో ప్రతీసారి తిరస్కరించారాయె. ఈ ఊరికే మీరెందుకు అతుక్కుపోతున్నారో ఆ దేవుడికే తెలియాలి. కోడలు అమెరికనే కావచ్చు, కానీ మనల్ని ఇంట్లోంచి బయటకి తోసేయదుగా? వాడింట్లో మనం ఓ మూల పడి ఉండేవాళ్ళం, వీరూ పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళం. మనకి ఈ ముసలితనంలో పిల్లలే కదా ఆనందాన్నిచ్చేది" అంటూ అరుంధతి తన మనసులోని బాధని వెళ్ళగక్కింది.

"సమస్య కోడలితో కాదు అరు, విషయం నీకర్థం కావడం లేదు. ఈ వయసులో ఇల్లు వదిలి వెళ్ళాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది.  మన జీవితకాలంలో మనమెన్నడు జవహర్ కాలువ దాటి వెళ్ళలేదు, మరి మహాసముద్రాలని దాటి అక్కడి వెళ్ళి ఎలా ఉండగలమో ఆలోచించు.  ఆ దేశమెలాంటిదో, మనకెదురయ్యే జనాలు ఎటువంటి వారో, వారి జీవన విధానం ఎలాంటిదో ఎవరికి తెలుసు? మరి నిందంతా నా మీద మోపుతావేం? ఈ ప్రాంతం వదిలి వెళ్ళడం నీ మనసుకి కూడా ఇష్టం లేదు……."

"సరే, అబ్బాయి విషయం పక్కన పెట్టండి. అమ్మాయి కిరణ్ మనల్ని ముంబయికి రమ్మని పిలిచిందిగా? కూతురు ఇంట్లో ఎంగిలి పడడం అంటే  గోమాంసం తిన్నట్లే అంటూ అక్కడికి వెళ్ళడానికి కూడా ఒప్పుకోలేదుగా? మర్చిపోయారా?"

"నీకు అర్థం కావడం లేదు.  వాళ్ళిద్దరికి నిజంగా మన మీద ప్రేమ ఉంటే, వచ్చి మనల్ని వాళ్ళతో తీసుకువెళ్ళేవారుగా? అప్పుడు మనం కాదనలేము కదా?"

"రావడానికి వాళ్ళిద్దరూ ఎప్పుడూ సిద్ధమే, మీకు భయపడే రావడం లేదు. మీ నిర్ణయమే అంతిమం. మిమ్మల్నో పట్టాన ఒప్పించలేము. వాళ్ళని ఇక్కడికి రావద్దని మీరు ఉత్తరాలు కూడా రాసారు. గుర్తుందా?"

ఆ మహానగరాలలో వీరూ , కిరణ్ తమ తమ కుటుంబాలతో తీరిక లేకుండా ఉంటారు. లోయలో ఈ వృద్ధులు రోజులు లెక్కబెట్టుకుంటూ ఉంటారు. ఎన్ని గడిచాయో, ఇంకెన్ని మిగిలాయో దేవుడికే ఎరుక.

"ఈ రోజు శ్రావణ్ శుద్ధ సప్తమి. వీరూ కొడుకు పుట్టిన రోజు కదూ. పులిహోర చెయ్యాల్సింది"

"కాదు, ఈ రోజు జన్మాష్టమి. కిరణ్ కూతురు పుట్టిన రోజు.  శుభాకాంక్షలు పంపి ఉండాల్సింది"


భార్యాభర్తలిద్దరు కొడుకుని, కూతురిని, మనవడిని, మనవరాలిని తలచుకోని క్షణం ఉండదు.  వాళ్ళ దగ్గరి నుంచి ఉత్తరాలొచ్చి ఏళ్ళయి పోయినట్లుంది. వృద్ధాప్యం, ఒంటరితనం వారిని కృంగదీస్తున్నాయి. పిల్లల్ని చూడాలని తహతహలాడిపోతారు, కాని పిల్లల పట్ల తమది స్వార్ధపూరితమైన ప్రేమ అని అనుకుంటారని భయపడతారు.  దగ్గరి వారు, సొంతవారు లేకుండా ఎవరైనా జీవించగలరా?

"అబ్బాయికి రేపే ఉత్తరం రాయండి. మన ప్రయాణానికి టికెట్లు పంపమనండి" అంటూ ఆదేశించింది అరుంధతి.

"నేను అదే అనుకుంటున్నాను. కిరణ్‌కి ఈ రోజు ఫోన్ చేస్తాను. కొన్ని రోజులు ముంబయిలో ఉండి తరువాత అబ్బాయి దగ్గరికి వెడదాం"

"ఏది మంచిదని మీకనిపిస్తే అదే చేయండి. సరే, ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. ఇక పడుకోండి"

పెద్ద దీపాలన్నింటిని ఆర్పేసి, బెడ్ లాంప్‌ని వెలిగించింది అరుంధతి. నీలకంఠ ఇంకా చిరాగ్గానే ఉన్నాడు. మంచం మీద నుంచి లేచి వెళ్ళి అన్ని తలుపులు కిటికిలు జాగ్రత్తగా వేసున్నాయో లేదో సరిచూసుకున్నాడాయన. అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకునే వరకు ఆయన గదిలో తిరిగాడు. ఆ తర్వాతే వెచ్చని పక్క మీదకి వచ్చాడు. గదిని వెచ్చగా ఉంచే నిప్పు కుండని తీసి దాన్ని జాగ్రత్తగా ఓ పక్కన పెట్టమని భార్యకి అందించాడు. తర్వాత వెచ్చని రగ్గు కింద దూరాడు. నిద్రాదేవి ఆయనని కరుణించడం లేదు. పక్కమీద అటు ఇటు పొర్లసాగాడు.  అదే సమయంలో బయటి తలుపుని ఎవరో గట్టిగా కొట్టినట్టయింది. ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారో? భయంతో వణికిపోతూ, మంచాలకి అతుక్కుపోయారు వాళ్ళిద్దరూ.  పెద్ద శబ్దంతో బయటి తలుపు తెరుచుకోడం విన్నారు. కొన్ని క్షణాల తర్వాత తమ పడకగదిని కాలితో తంతూ తెరుస్తున్న శబ్దం వినబడింది. శరీరానికి గాయమైనట్లుగా,  తలుపు తెరుచుకుంది.  ముఖాలు కనిపించకుండా మఫ్లర్‌లు వేసుకుని చేతుల్లో స్టెన్‌గన్‌లు ధరించిన ఇద్దరు యువకులు లోపలికి వచ్చారు.

క్షణం కూడా ఆగకుండా వాళ్ళిద్దరూ విచక్షణారహితంగా కాల్పులు ఆరంభించారు. ముసలాళ్ళిద్దరి ఊపిరి భయానికే ఆగిపోయింది. వాళ్ళ ఆత్మలు ఎప్పుడో శరీరాన్ని వదిలేసాయి, కానీ శరీరాలు మాత్రం బుల్లెట్ల దెబ్బలకి రక్తం స్రవించాయి. రగ్గులు రక్తంతో తడిసిపోయాయి. ఆగంతకులిద్దరూ ఓ క్షణం పాటు ఆగారు, చుట్టూ చూసి ,  మృత్యువుని , నిశ్శబ్దాన్ని అక్కడ వదిలేసి వెనుదిరిగారు .

మర్నాడు స్థానిక దినపత్రికలో మొదటి పేజీలో పెద్ద శీర్షికతో వార్త ఇలా ప్రచురితమైంది:

"ముజాహిద్దీన్లు హబ్బాకదల్‌లో నీలకంఠ, అరుంధతి అనే ఇద్దరు ఇన్‌ఫార్మర్‌లని కాల్చి చంపారు. వాళ్ళిద్దరూ భారత సైన్యం తరపున రహస్యంగా గూఢచర్యం చేస్తున్నారని అనుమానించారు"


 


* * *సమాప్తం* * *

ఉర్దూ, ఆంగ్ల మూలం: దీపక్ బద్కీ

 
దీపక్ బద్కీదీపక్ బద్కీ సుప్రసిద్ధ ఉర్దూ రచయిత. ఆయన 1971 నుంచి రచనలు చేస్తున్నారు . ఆయన మొదటి కథ 'సల్మా' శ్రీనగర్ నుంచి వెలువడే హమ్‌దర్ద్ అనే దినపత్రికలో అచ్చయింది. 1976లో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కి ఎంపికై దాదాపు ఇరవై సంవత్సరాలు రచనలకి దూరమయ్యారు .  1996 నుంచి మళ్లీ రచనా వ్యాసాంగాన్ని చేపట్టారు. అనంతర కాలంలో ఆయన దాదాపుగా 60 కథలు రాసారు, అవన్నీ భారత ఉపఖండం, బ్రిటన్  మరియు ఉర్దూని చదివి అర్ధం చేసుకునే ఇతర ప్రాంతాలలో ముద్రితమయ్యాయి.   ఈయన కథలు హిందీ, తెలుగు, కశ్మీరీ భాషలలోకి అనువాదమయ్యాయి. 1999లో "అధూరే చెహెరే" అనే కథా సంకలనం, 2005లో "చినార్ కే పంజే" అనే కథా సంకలనం వెలువడ్డాయి. మూడో సంకలనం త్వరలో విడుదలవనుంది.ఉర్దూ సాహిత్యంలోని సుప్రసిద్ధ రచయితలు, విమర్శకులు – సుల్తానా మెహర్, వారిస్ అల్వీ, హర్‌చరణ్ చావ్లా, సయ్యద్ జాఫర్ హష్మీ, అన్వర్ సాదీద్ వంటి లబ్దప్రతిష్టులు ఈయన రచనలని ప్రస్తుతించారు . కథలను ఎంతో నైపుణ్యంతోను, కళాత్మకంగాను అల్లుతారు దీపక్ బద్కీ. ఈయన కథలు మానవ జీవితాలలోని వ్యథలని చిత్రిస్తాయి, వాటిని చదివాక పాఠకులు సమాజంలో ఎక్కడ తప్పు దొర్లుతోందని ఆలోచించకుండా ఉండలేరు. deepak.budki@gmail.com

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.