ఇప్పుడేదో అంతా
ఎడారి పరుచుకున్నట్లు
పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో తడి
ఆరినతనం..
దేనిని తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..
కనుల లోయలో
పరచుకున్న
ఎండమావులు….
గాజు కళ్ళుగా
మారిపోయాయన్నట్టు
ఏదీ ఇంకనితనం..
అంతా రంగు రుచి లేని
కషాయంలా గొంతులో
ఏదో విషం దిగుతున్నా
బాధ తెలియని
శిలాజంలా…
ఒంటరితనంవైపు
మొగ్గుతూ బాహ్యాంతరాలలో
ఏదో నిషేధ ఘోష
చుట్టూరా కమ్ముకున్న
ఈ సమ్మె వాతావరణంలో
నాలుక పిడచకట్టి
గొంతెండిన వేసవితనం
వెంటాడుతోంది…
ఎక్కడో దాగిన కాసింత
కన్నీటి ఊట
నన్నింకా ఇలా
మనిషిలా(?)
నీముందు…