పెరటిమొక్కలకు నీళ్ళు పోస్తూ
అదిలిస్తూ కాకులను
పదునెక్కే ఎండలో
నాకోసం నా ప్రియురాలు
ఎదురు చూస్తుంది
ముదురునీలపు ఆకాశం
వెదురు పొదల గలగల
కదిలే లాంతరు నీడలు
నాకోసం నా ప్రియురాలు
ఎదురు చూస్తుంది
నదీ తీరాన
మృదువైన చేతులతో
ఇసుకగూళ్లు కడుతూ
సుదూరపు కొండల నడుమ
కుంకుతున్న సూర్యుడు
నాకోసం నా ప్రియురాలు
ఎదురు చూస్తుంది
About తమ్మినేని యదుకులభూషణ్
తమ్మినేని యదుకుల భూషణ్ గారు ప్రముఖ కవి, అనువాదకులు, కవిత్వ విమర్శకులు. ఇస్మాయిల్ కవిత్వాన్ని అమితంగా ప్రేమించే ఈయన తాను స్వయంగా కవిత్వం, కథలు రాయడమే కాకుండా సమకాలీన కవిత్వ ధోరణులపై పరిశోధనాత్మక విమర్శలు చేసి ఉన్నారు. వీరి రచనలతో ఈ కింది పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
నిశ్శబ్దంలో నీ నవ్వులు - కవిత్వం
వాన కురిసిన పగలు - కవిత్వం
చెల్లెలి గీతాలు - కవిత్వం
సముద్రం - కధా సంకలనం
నీ చేయి నా చేతిలో - అనువాదాలు
నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు - విమర్శ