నీల గ్రహ నిదానము – 1

తెలుగులో నాటకరచన నల్లపూసైపోతున్న కాలంలో ఎ. శ్రీధర్ గారు చక్కటి నాటకాలు నాటికలను రచిస్తూ, కొత్త రచనలను సాహిత్యలోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. గతంలో వారు రచించిన “చీకటి చకోరాలు” అనే సాంఘిక నాటికను పొద్దులో ప్రచురించాం. ఇప్పుడు వారే రచించిన నాటకం “నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము” మొదటి భాగాన్ని మీముందుకు తెస్తున్నాం. చదివి మీమీ అభిప్రాయాలను తెలుపవలసినదిగా మనవి.

—————————————————-

-ఎ శ్రీధర్

నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము

ప్రథమాంకము

ప్రథమ దృశ్యము

(చంద్రలోకంలోని శివాలయం)

(రోహిణి శివపూజ చేస్తూ ఉంటుంది)-

రోహిణి:

ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం, మోక్షదం తస్మా దోంకారాయ నమో నమః

ఓం ‘నం’ నమంతి మునయ స్సర్వే నమంత్యప్సరసాం గణాః
నరాణా మాది దేవానాం ‘నకారాయ’ నమో నమః

ఓం ‘మం’ మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞాన ప్రదం పరం
మహాపాప హరం దేవం తస్మా ‘మకారాయ’ నమో నమః

ఓం ‘శిం’ శైవం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం
జ్ఞానదం, పరమం, తస్మా ‘శ్చికారాయ’ నమో నమః

ఓం ‘వాం’ వాహనం, వృషభం, యస్య వాసుకీ కంఠ భూషణం
వామ శక్తి ధరం, దేవం ‘వకారాయ’ నమో నమః

ఓం ‘యం’ యకారో సంస్థితో దేవో యకారం పరమం శుభం
యన్నిత్యం పరమానందం ‘యకారాయ’ నమో నమః

(ప్రవేశం :: చంద్రుడు)

(చంద్రుడు ధ్యానముద్రలో ఉన్న రోహిణి వంక తమకంతో చూస్తూ పిలుస్తాడు)

చంద్రుడు: ప్రియే, రోహిణీ!

రోహిణి: (ధ్యానం భంగమవగా, చంద్రుని వంక చిరుకోపంతో చూస్తుంది) “ఏమందురు స్వామీ?”

చంద్రుడు: రోహిణీ! చంద్రశిలా నిర్మిత, అంతఃపుర ప్రసాద హర్మ్యాల్ని, నీ చిరునవ్వు హారతులతో వెలిగించకుండా–

రోహిణి: -శివుని ముందు హారతి వెలిగించడం దేనికి, అంటారు, అంతేనా స్వామీ?-

చంద్రుడు: అవును దేవీ! చిలుకల కొలుకలైన నీ కంటి కొనలు, అనురాగ రాగ రంజితాలు అయితేనే తప్ప, ఈ చిరుకోపంతో శోభిల్లడం లేదు సుమా!

రోహిణి: (శివుని ముందు నుంచి లేచి) స్వామీ! ఇది శివపూజా సమయం, ప్రణయానికి —

చంద్రుడు: సమయా సమయాల ప్రసక్తి లేదు రోహిణీ! పద! పూజ ముగిసినట్లే కదా! – (అంటూ ఆమె చెయ్యి పట్టుకొంటాడు)

రోహిణి: (విడిపించుకొని) కాసేపు నన్నంటకండి స్వామీ! నేను మీ ఆలినే అయినా –

చంద్రుడు: ఇప్పుడు మాత్రం శివ పూజా ‘పరురాలి’ నంటావ్! (‘పరురాలి’ అన్న పదాన్ని వత్తి పలుకుతూ)

రోహిణి: (చంద్రుని నోటి దగ్గర చేయి పెట్టి వారిస్తూ) మీ ఇల్లాలిని అంత మాట అనకండి స్వామీ! ఈ రోహిణి మనో వాక్కాయ కర్మల చేతనే కాక, రూప వయో లాచణ్యాదుల చేత కూడా-

చంద్రుడు: (అడ్డుపడి, ఆమె చుబుకాన్ని ఎత్తి పట్టుకుంటూ) నాకు తెలుసు రోహిణీ! నువ్వీ రాకా సుధాకరుని అనుంగు ప్రియురాలివి

రోహిణి: (తన్మయత్వంతో, చంద్రుని కౌగిలిలో చేరి) ధన్యురాలుని ప్రభూ!

(ఇద్దరూ ప్రణయోన్మత్తతలో పరిసరాలను మరిచిపోతారు)

(ప్రవేశం :: దక్ష ప్రజాపతి)

{దక్షుడు వస్తూనే ఆ దృశ్యాన్ని చూసి, వెనకడుగు వేస్తాడు. అదే సమయానికి– (తెరలోంచి) కొన్ని స్త్రీ కంఠ స్వరాలు — ‘ అశ్చిన్యాది తారకల కంఠ స్వరాలు వినిపిస్తాయి.}

నక్షత్ర కాంతలు: (తెరలోంచి) చూసారా తండ్రీ! ఆ రోహిణీ శశాంకుల ప్రణయ పరవశం! చంద్రుడింక రోహిణికే కైవసం-

దక్షుడు: చూసానమ్మా, చూసాను ఇప్పుడు అర్థమయింది నాకు, మీ కలవరంలోని ఆక్రోశం! శాంతించండి, నేను రోహిణికి నచ్చ చెపుతాను— (అని రోహిణి వంక చూసి) రోహిణీ! !! (బిగ్గరగా పిలుస్తాడు)

(రోహిణీ చంద్రులిద్దరూ ఆ కేకకి తెప్పరిల్లి విడిపోతారు)

రోహిణి: (తండ్రి వంక చూసి, సిగ్గు పడుతుంది) నాన్నాగారూ! రండి, ఈ సమయంలో మీ ఆగమనం

దక్షుడు: నీ ఆలింగనానికి అంతరాయం, అంతేనా?

చంద్రుడు: మామగారూ! నమస్కారం! అదికాది రోహిణి అభిప్రాయం

దక్షుడు: 0సమర్థించబోకు శశాంకా! సమయా సమయాలు పాటించక, నేను పిలిచిన పిలుపు కావచ్చుకాక, మీ ప్రణయావేశానికి ప్రొద్దు గుంక! అయినా నీ పని మాత్రం ఏమంత సమంజసం చంద్రా!? పవిత్రమైన శివసన్నిధిలో శివపూజా తత్పరురాలైన తరుణిని తమకంతో గవయడం.. ?

రోహిణి: నాన్నాగారూ! అది మా స్వవిషయం

దక్షుడు: నిజమేనమ్మా! రోహిణీ! మన స్వవిషయాలు మరి కొందరికి కాకూడదమ్మా విష తుల్యాలు

చంద్రుడు: మా దంపతుల ఆంతరింగిక విషయాలు మరికొందరి మనసులకి విషతుల్యాలా మామయ్యా?

రోహిణి: ఎవరా ఇచ్చగించని పరులు తండ్రీ?

దక్షుడు: వారు మీ కిరువురికీ కావలసిన వారేనమ్మా! చంద్రా! ఈ రోహిణితో పాటు అదే నక్షత్ర యోనిలో అయోనిజలు, అపరంజిబొమ్మలు అయి జన్మించిన వారిని కన్న, తండ్రిని కూడ నేనేనయ్యా!

రోహిణి: ఓహో! ఇప్పుడు అర్థమయింది, నా సవతులు మాత్సర్యంతో మీకు చెప్పిన మాటలు విని..

చంద్రుడు: మీరు మమకారంతో మమ్మల్ని మందలించడానికి వచ్చారన్న మాట!

రోహిణి: (గర్వంతో చంద్రుని వంక చూస్తుంది) విన్నారా నాన్నగారూ! మా ఇద్దరిదీ ఒకే బాట, ఒకటే మాట! ఈ రాజు, రోహిణికి మాత్రమే రేరాజు! చంద్ర సదనమను యీ తామర కొలనులో, రోహిణి మాత్రమే కలువ బాల!!

దక్షుడు: (కోపాన్ని అణచుకొంటూ) రోహిణీ! విచక్షణ లేక మాట్లాడుతున్నావు. అశ్విన్యాది నక్షత్ర కాంతలు నీకు సపత్నులే కాదు, సోదరీ మణులు కూడ! (ఆమె దగ్గరకు వెళ్లి అనునయంతో) చూడమ్మా! వారిలో అశ్విని, భరణి, కృత్తికలు ముగ్గురూ నీకు అక్కలు. మృగశిరాది రేవతి పర్యంతం నీ చెల్లెళ్లు – ఇందులో పరాయి వారెవరమ్మా? నువ్వు వారితో పాటు పుట్టింట పెరిగావు, వారందరితో కలసి మెట్టినింట మసలడం ధర్మం! నీ నాధుడు వారికి మాత్రం అనాధుడవడం ఈ తండ్రి భరించలేడమ్మా! నీతల్లి ‘ వీరిణి’ యీ వార్త విన్నప్పటి నుండి శోకాకులయై నిద్రాహారాలు వదిలి పెట్టింది. అందుకనే నేను నీకడకు కార్యార్థినై వచ్చాను.

రోహిణి: (వినరాని మాటలు వింటున్నట్లు) నాన్నగారూ! అనునయ వినయాలతో కలిపే కాపురాలు ఎంత కాలం నిలుస్తాయి? ప్రాణనాథుని తలలో నాల్క అయి, అతని ననుక్షణం, కనుసన్నలలో మెలిగేలా చేసుకో గలగడం ఒక కళ! (ఆగి, తండ్రి వంక ఓరగా చూస్తూ వ్యంగ్యంగా) నాన్నగారూ! సోదరీమణులే అయినా, సపత్నులుగా మారిన వారితో, (చంద్రునికి దగ్గరగా వెళ్లి) నే నీ చంద్రకళను ఎలా పంచుకోగలను?

దక్షుడు: అర్థమయిందమ్మా నీ సహృదయం! ఇక నీతో మాటలాడి ప్రయోజనం లేదు. (చంద్రునితో) చంద్రా! అందగాడవని, షోడశ కళా పూర్ణుడవనీ నిన్ను చూసి నా కన్నియలు ముచ్చటపడితే కాదనలేక నీ కాళ్లు కడిగి వారి నందరినీ నీకు దానం చేసాను. నీ పెళ్లినాటి ప్రమాణాలైనా గుర్తు తెచ్చుకొని వారిని ఏలుకోవయ్యా! !

చంద్రుడు: ఆగండి మామగారూ! అదే మీరు చేసిన పొరపాటు. మీ కన్నియలందరూ నన్ను చూసి ముచ్చట పడడం, అది నా గ్రహపాటు! నేను మాత్రం వారందరిలో తొలుదొల్త చూసినది రోహిణిని, మనసిచ్చింది కూడా ఆమెకే! ఆమె చేయి నందుకోవాలని మీ దగ్గరికి వస్తే, ఒకే యోనిలో పుట్టిన కన్నెలని వారిని విడదీయడం సాధ్యం కాదని మాయ మాటలు చెప్పి, ఇరువది ఆరు గుదిబండలని నా మెడకి కట్టబెట్టారు. పెళ్లినాటి ప్రమాణాలంటూ నే నెవరికైనా చేసి ఉన్నట్లయితే అవి కేవలం రోహిణికే! (పద్యం)
చం||

ఇరువదియారు కన్యలను యేర్పడ గట్టిరి నాదు కుత్తుకన్
వరుసకు వారు భార్యలవవచ్చును కాని ప్రియంబు రోహిణే
పొరబడి తక్కువారలతొ పొందొనరించిరి మాయ మాటలన్
విరసము తోడ బల్కుచును వెర్రినిఁచేయుచు మోసగించరే!

దక్షుడు: చంద్రా! నీవు రోహిణిని దక్క తక్కిన చుక్కలను చేపట్టడం..

చంద్రుడు: రోహిణి కొరకే మామగారూ!

దక్షుడు: పెళ్లయినాక వారిని పరిత్యజించడం..

చంద్రుడు: అది కూడ రోహిణి కొరకే!

రోహిణి: (కిలకిలా నవ్వి) విన్నారా నాన్నగారూ! అందచందాలకి సాటిలేని యీ వన్నెకాడు, షోడశ కళాప్రపూర్ణుడైన యీ శృంగార నాయకుడు, ప్రియురాలి అంగాంగాలను అమృత పూరితం చేయగల యీ అమృతాంశుడు, రోహిణికే ప్రాణ నాయకుడు. పాల సముద్రంలో పుట్టి, వెన్నలాంటి వెన్నెలను వెదజల్లే యీ జాబిల్లికి..

చంద్రుడు: ఈ రోహిణి మాత్రమే ఏకైక నాయిక!

దక్షుడు: (కాస్త కోపంతో) చంద్రుడా! ప్రేమ మత్తులో పడి ఉన్మత్తుడివి అయిపోయావు. రోహిణీసౌందర్య జాలంలో పడి అంధుడివి కూడా అయినావు. నా ఇరువది ఆరు ఆడబిడ్ఢలను నిష్కారణముగా, తోడు లేకుండా చేసావు. (మెత్తబడి) వాళ్ళలో ఎవరినైనా, ఏనాడైనా అనురాగ దృష్టితో చూసావా చంద్రా? పిల్ల నిచ్చిన మామగా నీ హితవు కోరి చెప్పే మాట విను – అశ్విని కన్న కమ్మని కంఠమా రోహిణిది! భరణి కన్న సమున్నతమా ఈమె కుచద్వయము! కృత్తిక శరీర కాంతులు అగ్నికైన తేగలవు కదా తలవంపులు!! మృగశిర మృగ నయనాలు కురిపించ లేవంటావా వలపు హరి చందనాలు?

రోహిణి: నాన్నగారూ, చాలించండి యీ స్తోత్ర పాఠాలు. వారు మీకు కన్నబిడ్డలైతే కావచ్చు గాక, నాకు మాత్రము భయంకర సపత్నులు!

చంద్రుడు: దేవీ! ఆవేశపడకు. నేనుండగా నీ కెందుకీ వ్యర్థ వార్తాలాపాలు? నీ సవతులు ఎంతెంత సుందరాంగులైనా, ‘అష్టవిధ నాయికా లక్షణాలు నీలోను, షోడశ కళలు నాలోనూ మూర్తీభవించి ఉన్నాయి. ముసలివాళ్ల కేం తెలుసీ కాముక విశేషాలు! నీవు మందిరంలోకి వెళ్లి విశ్రాంతి తీసుకో! (దక్షునితో) మామగారూ! మీరు వచ్చిన పని ముగిసిందనుకొంటే మాకు సెలవియ్యండి. ఇప్పటికే మా ఏకాంతం చాల వరకు వ్యర్థమయింది.

దక్షుడు: (ఉగ్రుడయి) చంద్రా! ఏమి నీ దురహంకారము!! నీవు ఇంద్రుని కన్న అందగాడివా? నారాయణుని మించిన నాయకుడివా? శివుని తలదన్నిన కామశాస్త్ర పారంగతుడివా? ఏమిరా నీ కండకావరం! పిల్ల నిచ్చిన మామనని ఒదిగి ఒదిగి మాట్లాడినందులకా యీ మిడిసిపాటు!! నేను సకలకార్య సుదక్షుడనైన దక్షప్రజాపతినని, ఉప బ్రహ్మనని మరచితివా??

(రోహిణి, దక్షుని ఆగ్రహం చూసి భయంతో అతని దగ్గరకు వెళ్తుంది.)

రోహిణి: నాన్నాగారూ! ! శాంతించండి, రండి లోపలికి వెళ్లి మాట్లాడుకొందాం. (చెయ్యి పట్టుకొంటుంది.)

దక్షుడు: (చెయ్యి విదిలించుకొని) ఛీ! ధూర్తురాలా!! నీవే దీని కంతటికీ మూల కారణము. (రోహిణికి చెంప దెబ్బ కొడతాడు)

(రోహిణి ఆ దెబ్బకి క్రింద పడుతుంది. చంద్రుడు ఆమెను లేవనెత్తేందుకు వస్తాడు. ఆమె లేచి, మోకాళ్ల మధ్య తల దూర్చి ఏడుస్తుంది. చంద్రునికి ఆమె కన్నీరు భరించరాని దవుతుంది. అతడు ఆవేశానికి లోనవుతాడు)

చంద్రుడు: దక్షా! నీ వెంత సుదక్షుడవో నాకు తెలియనిది కాదు. చంద్రునికి సరిపోలు వారు సురాసురులలోనే లేరు తెలుసా? నా ఇంటికి వచ్చి, నా ఇల్లాలిని చెంపదెబ్బ కొట్టిన వాడు, బ్రహ్మ ఉపబ్రహ్మలలో ఎవరైనను నేను సహించునది లేదు, ఆ! మామగారివి కాబట్టి క్షమించి వదిలి పెడుతున్నాను. ఇక మీరు దయచెయ్యండి. (రోహిణి దగ్గరగా వచ్చి) రోహిణీ! నా సఖీ!! దుఃఖించకు దేవీ, పద మన మందిరానికి పోదాం (బ్రతిమాలుతాడు)

(దక్షునికి ఆ దృశ్యం భరించ రానిదవుతుంది ఆవేశంతో ఉచితానుచితాలు మరచి పోతాడు.)

దక్షుడు: (రోషావమానాలతో శపిస్తాడు) చంద్రా! యుక్తాయుక్త జ్ఞాన శూన్యుడవై నన్ను అవమానించావు. ఈ రోజుతో నీ షోడశ కళలు నీలో హరించి పోవును గాక! నీవు కళా విహీనుడవై, నిస్తేజుడవై, మృత ప్రాయుడ గుదువు గాక!!

గీ||

మామ నజ్ఞానమున చందమామ నీవు
పరిభవించితొ మఱి దాని ఫలిత మిదిగొ
కళల గోల్పోయి నీ దగు కాంతి నుడిగి
పండి యుందువు జీవచ్ఛవంబు పగిది.

(అని వెళ్లిపోతాడు)

(దక్షుడు వెళ్లిపోగానే చంద్రుడు నిస్తేజుడై నిస్సత్తువతో క్రింద పడిపోతాడు. రోహిణి చంద్రుని వంక దిగులుతో చూస్తూ ఉంటుంది.)

(స్టేజి క్రమంగా చీకటయి పోతుంది. తెర వెనుక లైట్లు వెలుగుతాయి. శివలింగానికి వెనుక నున్న వైట్ కర్టెన్ మీద ఒక నీడ పడుతుంది. అలాగే 16 నీడలు ఒక దాని వెనుక ఒకటి కనబడి వెళ్లి పోతూ ఉంటాయి.)

1వ నీడ: చంద్రా! నేను ప్రథమ కళను, అమృతను! నిను వీడి వెళ్లి పోతున్నాను.

2 వ నీడ: శశాంకా! నేను ద్వితీయను, మానదను సెలవా మరి!

3వ నీడ: మృగాంకా! నేను తృతీయను, పూషను పోవుచున్నాను.

4 వ నీడ: సుధాంశా! నేను చతుర్థిని, తుష్టిని, దక్ష శాపవశమున నిన్ను వీడుతున్నాను.

5 వ నీడ: అమృతాంశా! ! నేను పంచమిని, సృష్టిని. పోవుచున్నాను.

6 వ నీడ: రాజా! నేను షష్టిని, రతిని నిన్ను పరిత్యజిస్తున్నాను.

7 వ నీడ: రేరాజా! నేను సప్తమిని, ధృతిని, సెలవియ్యి.

8 వ నీడ: చలువల రేడా! నేను అష్టమిని, శశిని, వెళ్లనా మరి!

9 వ నీడ: కలువల రేడా! నేను నవమిని, చంద్రికను వివశనై పోతున్నాను.

10 వ నీడ: తమ్ముల పగవాడా! నేను దశమిని, కాంతిని. నిను వీడిపోతున్నాను.

11 వనీడ: తపసి కనుపాపా! ! నేను ఏకాదశిని, జ్యోత్స్నను, దశమితో పాటు పోతున్నాను.

12 వ నీడ: జాబిల్లీ! నేను ద్వాదశిని, ‘శ్రీని’ నీలో నిలువ లేక పోతున్నాను.

13 వ నీడ: చుక్కల దొరా! ! నేను త్రయోదశిని, ప్రీతిని, నీకు అప్రియనై పోతున్నాను.

14 వ నీడ: చందమామా! నేను చతుర్దశిని అంగదను నీకు తిలోదకము లిచ్చు చున్నాను.

15 వనీడ: సోమా! నేను పంచదశినైన పూర్ణను నీలో ఇమడలేక శూన్యను కానున్నాను.

16 వ నీడ: శశీ! ! నేను షోడశిని, పూర్ణామృతను నాకు సెలవియ్యి.

(షోడశి నిష్క్రమణతో, తెర వెనుక లైట్లు ఆరి, రంగస్థలం పైన వెలుగుతాయి.)

చంద్రుడు: (సగం లేచి) ఓ నా షోడశ కళలారా! నన్ను విదిలి వెళ్లకండి, మీ నిష్క్రమణతో నా బ్రతుకు సమాప్తమవుతుంది. (అంటూ మళ్లీ క్రింద పడిపోతాడు.)

రోహిణి: నాథా, అమంగళము ప్రతిహత మగుగాక! మీరు అలా మాట్లాడితే నేను భరించ లేను.

చంద్రుడు: రోహిణీ! కళా విహీనుడ నైన నేను, నీ కెందులకూ కొరగాను, నన్ను విడిచి వెళ్లిపో! పొండి, ఈ చంద్రున్ని చీకటికి కబళం చేసి పారిపోండి. (మళ్లీ లేవబోయి పడిపోతాడు) (రోహిణి దుఃఖంతో శివుని ఆశ్రయిస్తుంది.)

రోహిణి: బావా! సతీ వల్లభా!! శివా!!! ఇక నీవే చూపించాలి త్రోవ!!!!

చంద్ర శేఖర చంద్ర శేఖర, చంద్ర శేఖర పాహిమాం! చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్రశేఖర, రక్షమాం!

(రోహిణి ప్రార్థన విని, చంద్రుడు ఉత్సాహం తెచ్చుకొని లేచి శివ సన్నిధికి వస్తాఢు)

చంద్రుడు:

రత్నశాను శరాసనం. రజతాద్రి శృంగ నికేతనం
శింజినీ కృత పన్నగేశ్వర మంబుజానన సాయకం
క్షిప్ర దగ్ధ పురత్రయం, త్రిధ శాలయై రభివందితం
చన్ద్రశేఖర మాశ్రయేమమ, కింకరిష్యతివై యమః

రోహిణి:

చంద్ర శేఖర, చంద్ర శేఖర, చంద్ర శేఖర, పాహిమాం,
చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం.

చంద్రుడు:

కుండలీకృత కుండలేశ్వర కుండలం వృష వాహనం
నారదాది మునీశ్వర స్తుత వైభవం, వృష వాహనం
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్ర శేఖర మాశ్రయేమమ కింకరిష్యతివై యమః

రోహిణి:

చంద్ర శేఖర, చంద్రశేఖర, చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర, చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం

చంద్రుడు:

విశ్వసృష్టి విధాయకం, పునరేవ పాలన తత్పరం
సంహరం తమసి ప్రపంచ, మశేష లోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశం, గణనాధ యూధ సమన్వితం
చంద్ర శేఖర మాశ్రయేమమ కింకరిష్యతివై యమః

రోహిణి + చంద్రుడు:

చంద్ర శేఖర, చంద్ర శేఖర చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర, చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం

(శివ లింగం దేదీప్యమాన మవుతుంది)

(తెరలోంచి శివుని కంఠస్వరం వినిపిస్తుంది.)

శివుడు: రోహిణీ చంద్రులారా! విచారించకండి. దక్షుని శాపం అప్రతిహతమే అయినా, దాని నుంచి తప్పించుకొనే మార్గం ఉంది.

ఇద్దరూ: సెలవియ్యండి ప్రభూ! !

శివుడు: చంద్రా! శాపోక్తి ప్రకారము, నీ వెన్నటికీ షోడశ కళాప్రపూర్ణుడవు కాలేవు. నీ షోడశీ కళయైన పూర్ణామృతను నా తలయందున్న నీ బింబమందు నిలుపుకొని, నిన్ను పంచాదశ కళా సమేతున్ని చేస్తాను.

చంద్రుడు: ధన్యోస్మి శివా! నన్ను పదిహేను కళలతో, తిరిగి వెలుగందేలా చేసి, నాకు పునర్జీవితాన్ని ప్రసాదించు. (నమస్కరిస్తాడు)

శివుడు: మూర్ఖుడా! నీకు స్వయముగా వెలుగందే భాగ్యమెక్కడిది?

గీ:

స్వయముగా వెల్గ గల్గెడి భాగ్యమేడ
పద్మ మిత్రుని తేజంబు ప్రతిఫలింప
వెల్గుచుందువు నీవు రేవెల్గు వగుచు
కాని వృద్ధి క్షయమ్ములు కల్గుచుండు

దక్షుని శాపం వల్ల నీవు నిస్తేజుడవు కూడ అయినావు. విచారింప వలదు సుమా! సూర్యుని తేజాన్ని నీలో నిలుపుకొని, ప్రతిఫలింప చేసే వరాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. మరియును వినుము- పంచాదశ కళలు కూడ నీలో నిండి ఉండుటకు వీలు లేదు! అందుకని రోజుకొక కళా లాభముతో వృద్ధి పొందుతూ, పదిహేను కళలతో పున్నమి రేడువై, మరల రోజుకొక కళా విహీనుడవై వృద్ధి క్షయాలు పొందుతూ ఉండు.

రోహిణి: బావా! నా నాథుని నేను మరల షోడశ కళలతో చూసుకోలేనా?

శివుడు: రోహిణీ! నీ నాథుడు నీతో కూడినప్పుడే ఉచ్ఛగతిని పొందగలడు. నీకు మాత్రము పరిపూర్ణుడై కన్పింపగలడు.

ఇరువురూ: ధన్యోస్మి మహాదేవా! (అని ప్రణమిల్లుతారు)

(మొదటి దృశ్యం సమాప్తం)

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

5 Responses to నీల గ్రహ నిదానము – 1

  1. nskartik says:

    very interesting what next?

  2. Rohiniprasad says:

    ఎవరికైనా దేన్ని గురించయినా రాసే హక్కు ఉంటుంది. అయితే నేటి సమాజంలో ఇన్ని సమస్యలూ, సంఘటనలూ కనబడుతూ ఉంటే నాటకానికి ఇంతకన్నా ఉచితమైన ఇతివృత్తం రచయిత ఎన్నుకోకపోవడం ఆశ్చర్యమే.

  3. chavakiran says:

    నాటకం బాగుంది.

  4. శ్రీ రోహిణీ ప్రసాద్ గారూ ! మీరు బహుముఖ ప్రతిభావంతులు. మీ నోట ఏ మాట వెలువడినా, దాంట్లో వివేకము, దిశానిర్దేశము ఉంటాయని నమ్మే అభిమానిని నేను. కష్టాలు, కడగండ్లు శని దేవుని వల్లనే అనే , ప్రగఢమైన నమ్మకం ప్రజా బహుళ్యంలో ఉంది !
    దాని నిదానానికి సూచించే పరిష్కారమే ఈ నాటక సారాంశం ! ఆ విధంగా దీనికి సామాజిక ప్రయోజనం ఉంది. నా రచనలొ సామాజిక స్ప్రుహ లేదనీ, ఫస లేదనీ మీరు భావించడం దురద్రుష్టం ! కాని పస లేని రచనని, ’పొద్దు’ ఎలా ప్రచురిస్తుందనుకొన్నారు ? నిదానించి, నాటకాన్ని పూర్తిగ చదవండి, ఆ తరువాత మీరు అను ( ఆ ) గ్రహం , ఏదైనా నాకు సమ్మతమే !

  5. Rohiniprasad says:

    * ‘నా రచనలొ సామాజిక స్ప్రుహ లేదనీ, ఫస లేదనీ మీరు భావించడం దురద్రుష్టం ! ‘
    శ్రీధర్‌గారూ, నేను అనని మాటలను మీరు ఊహించుకోవడం నా దురదృష్టమేమో!

    * ‘కష్టాలు, కడగండ్లు శని దేవుని వల్లనే అనే , ప్రగఢమైన నమ్మకం ప్రజా బహుళ్యంలో’ ఉంటే దాన్ని ఖండించే ప్రయత్నం చెయ్యాలని నేననుకుంటాను. అందరిదీ నా వైఖరి కాకపోవచ్చునని నాకు తెలుసు.

    * ‘ఆగ్రహం, అనుగ్రహం’ వగైరాల ప్రస్తావన చూసి నేనేదో దూర్వాసమహర్షిని అనుకుంటారేమో. నేనుకూడా మామూలు పాఠకుణ్ణే.

Comments are closed.