-ద్వీపరాగ
మందు పాతరల జీవితం
అడుగడుగునా పొంచి ఉన్న మందు పాతరలు..
ఎప్పుడు ఏ విస్ఫోటనం జరుగుతుందో!
ఏ ప్రశాంతత ఎలా ముగిసిపోతుందో!
ఊపిరి బిగబట్టి
ఆచి తూచి వేసే అడుగులు.
చావు లాంటి బ్రతుకు
చావులోనే బ్రతుకు
మళ్లీ మళ్లీ అలా చావకపోతేనేం?
చస్తూ బ్రతక్కపోతేనేం?
ఎవరో నాటి,
మరెవరి స్పర్శకో పేలిన మందు పాతర
నిన్ను ముక్కలు చేసి ఆకాశంలోకి విరజిమ్మితే..
అక్కడే అలా చుక్కల్లో మిగిలిపోక
మళ్లీ భూమ్మీదకు జారి ఒక్కటవుతావేం?
మరొక్కసారి ఛిద్రమయి ఎగసిపోయే అనుభవాన్ని సొంతం చేసుకోవడానికా?
శిధిలమయింది బ్రతుకయితే
ముక్కలయింది మనసయితే
అతుకులేయగలిగే ఆశ ఏది?
నువ్వంటే!
మర్చిపోవాలన్న పట్టుదలలో
మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటాను.
తరిమెయ్యాలన్న ప్రయత్నంలో
అనుకోకుండానే ఆహ్వానిస్తుంటాను.
నీ నుంచి దూరంగా పారిపోవాలన్న
నా పరుగు
తిరిగి తిరిగి నిన్నే చేరుకుంటుoది.
జ్ఞాపకంతో పోరాటం,
మనసుతో భీకర యుద్ధం,
నా పై నేనే చేసుకునే విధ్వంస రచన.
ఇదీ నువ్వంటే…