– హెచ్చార్కే
రెండుగా చీలిన
ఒక వేదన
ముట్టడించిన మసక వెన్నెల
చిట్టచివరి విందులో ఇద్దరు
ద్రోహం ద్రోహం
అలలెత్తి అరిచిన దుర్బల సముద్రం!
ఎన్ని ఎండలల్లో
ఇంకెన్ని వెన్నెలల్లో
తగలెట్టుకోగలరు తమను తాము?
ఎవరినెవరు పంపారు శిలువకు?
వారిలో క్షమార్హు
లెవరో చెప్పలేని సందేహ సముద్రం!!
ఒక్కో రాత్రిగా
ఒక్కొక్క పగలుగా
పుట్ట లోంచి ఎటూ వెళ్లలేని పాముల్లా
తమలో తాము వాళ్లెన్నాళ్లు తిరిగినా
నిష్క్రమణ మార్గం
చూపించ లేని నిష్ఫల దుఃఖ సముద్రం!!!
మీ రొదలోకి వొచ్చాను. నిష్క్రమణ కోసం కొట్టుకుపోలేక అలల మధ్య తేలుతున్నాను. తేలిపోయాను. తడారిపోయాను. వొడ్డుకి చేరాలని లేదు. అయినా ద్రోహం ద్రోహమే. సందేహం సందేహమే.
దుర్భర,నిష్పల దుఖ సముద్ర కెరటాలు నన్ను తాకాయి.
భిన్న దృవాలు భిన్న అంశాలు…..
రాజీలేని మహాసంగ్రామం
ఒకదాంట్లోంచి మరోటి,
ఒకదాన్ని చీల్చుకుంటూ మరోటి
ఆ భిన్నాల మధ్య అభిన్నత… ఐక్యత
ఒకదాన్నొకటి హరిస్తూ సాగే పరస్పర హననోద్యోగం
ఒకటి అస్తిత్వాన్నికి….. మరోటి అంతర్ధానానికి…..
ఒకటి ధృవీకరణకు… మరోటి అభావానికి..
రెండూ అవసరమే…. అనివార్యమే….
తేల్చుకున్నా,.. తేల్చుకోకున్నా….
ద్వైతం.. అద్వైతాల.. అభిన్నత
సత్యం బహుముఖమే అయినా..
ఆ క్షణంలో ప్రయాణం ఏకోన్ముఖమే…
అర్థం గర్భంలోనే పరమార్థం
గతం కడుపులోనే ఆగతం.. అనాగతం
భిన్నాలు, అభిన్నాలుగా సాగే అనంత కాల ప్రవహం..
ధృవీకరణ… అభావం… ధృవీకరణల్లో… సత్యం
ఇదే సత్యం … తెల్చుకోవాల్సిందే… అదీ అనంతం …….
(‘రొద’ తో నాలో రగిలిన తాత్విక రొద)
నిజానికి నాకు ఇదేమీ అర్ధం కాలేదు, క్షమించండి….!!!
రొద ప్రేరేపించిన తాత్విక రొద కదా. అందుకే మీకు అర్థం అయి ఉండదు. దంతేవాడలో జరుగుతున్న సంకుల సమరాన్ని గుర్తుతెచ్చుకోండి. కాస్త అర్థం అవుతుందనుకుంటాను. ఒక కవికి మరొ తాత్వికుడికి మధ్య భావప్రసారంగా ఇది మారిందనుకుంటాను.
“ఒకదాన్నొకటి హరిస్తూ సాగే పరస్పర హననోద్యోగం
ఒకటి అస్తిత్వాన్నికి….. మరోటి అంతర్ధానానికి…..
ఒకటి ధృవీకరణకు… మరోటి అభావానికి..
రెండూ అవసరమే…. అనివార్యమే….”
మనకాలపు నిజం ఇదే అయినా చాలామందికి మీ స్పందనసారం జీర్ణం కాకపోవచ్చు. అడవిపై, సహజవనరులపై హక్కు ఆదివాసులదా, లేదా బహళజాతి కంపెనీలదా అనే ప్రపంచ వ్యాప్త సమస్య తేలనంతవరకు ఈ ‘రొద’దాని తాత్విక రొద ఎవరికీ అర్థం కాకపోవచ్చు అనేకన్నా, జీర్ణం కాకపోవచ్చు అంటేనే బాగుంటుందేమో..
సముద్రం ఒడ్డున నిలబడి లోతును అంచనా వేయాలనుకోవడం వలన ఏర్పడిన భావ సంఘర్షనిది. నిష్క్రమణ మార్గం చూపకపోతే ఆ అలల కల్లోలం ఇంత కాలం సాగేదా? సత్యావిష్కరణ కోసం సాగే ఓ సుదీర్ఘ స్వప్నావిష్కరణ అభావం కాదెన్నడు. అ౦తా మిధ్యలా కనిపి౦ప చేయడానికి ఇదేమి ‘చిద౦బర’ రహస్యం కాదు. అస్తిత్వం కోసం అలుపెరగని పోరాటం. చి౦తనా చర్చలకి ఇది సమయం కాదు. చాప కి౦ద నీరులా అ౦దరి ఉనికి అభావం చె౦దకము౦దే కత్తి పట్టకపోతే ఉనికిని కోల్పోయే ప్రమాద౦ పొ౦చి వు౦ది. ఇదే సత్య౦.
పద్యానికి స్పందించిన మితృలందరికీ కృతజ్ఙతలు, వందనాలు.
కవిత పాఠకులలో ఎవరు ఎదుర్కొంటున్న ద్వైదీ భావాన్ని వారిలో నిద్ర లేపింది. అది సహజం. ద్వైదీభావం నిద్ర లేవడానికి ఎవరి సందర్భం వారికి ఉంటుంది. అందులో ప్రతి ఒక్క సందర్భం కవికి ఉండక్కర్లేదు. కవితలోని రొద జీవితానికి సంబంధించినది. న్యాయబద్ధ ద్వైదీభావం ఉన్న ప్రతి సందర్భానికి సంబంధించినది. ఇది ప్రత్యేకించి ఒక దంతెవాడకు సంబంధించినది కాదు.
దంతెవాడలో గిరిజన ప్రజా ప్రయోజనాలకు, మల్టినేషనల్స్ ప్రయోజనాలకు మధ్య వైరుధ్యంలో… సత్యం/న్యాయం గిరిజనప్రజలదే. ఇది నిస్సందేహం.
ఆ సమస్య పరిష్కారానికి మావోయిస్టులు అనుసరిస్తున్న పద్ధతుల విషయంలో ద్వైదీభావం తప్పదు. ఇక్కడ నిస్సందేహం సాధ్యం కాదు.