పుష్పగంధి

-డా. వేలూరి (వెలమకన్ని) సీతాలక్ష్మి

కావ్యమాల – నన్నయ నుండి నిన్నటివరకూ తెలుగు సాహితీ నందనవనంలో విరబూసిన సుగంధభరిత పద్యసుమాల మాల. ప్రతీ యుగములోను కొందరు కవులనెంచుకుని వారి రచనల్లోని అద్భుతమైన కొన్ని పద్యాలను ఉటంకిస్తూ, కీ.శే. కాటూరి వెంకటేశ్వరరావుగారు మాలికగా కూర్చి, “కావ్యమాల” పేరుతో తెలుగువారికి కానుకగా సమర్పించారు. సాహిత్య అకాడమీ పనుపున అల్లిన ఈ పద్య సుమమాలలో సహజంగానే కవిత్రయము, శ్రీనాథుడు, పోతనాదులు చోటుచేసుకున్నారు. ఈ సంకలనంలో వీరితో సమాన స్థానాన్ని పొందిన కవీశ్వరుడు -అనంతామాత్యుడు. భాస్కరుడు, కేతన, మంచనాదుల వంటి తన పూర్వీకులు, జక్కనాదులవంటి సమకాలీనులూ పొందలేని సముచిత గౌరవాన్ని “కావ్యమాల” లో అనంతుడు పొందాడు.

ఆంధ్ర వాఙ్మయమున శ్రీనాథుని కాలము సంధియుగము. ఇతిహాస రచనానంతరమూ, ప్రబంధరచనకు పూర్వమూ ప్రవర్తిల్లిన యుగమే ఈ సంధియుగము. ఈ యుగములో శ్రీనాథుని తరువాత సంస్మరింపదగిన సంస్కార సంపన్నుడగు సత్కవీశ్వరు డనంతామాత్యుడు. ఈతని కృతి భోజరాజీయము. ఇది కథాకథన కావ్యములలో అగ్రగణ్యము, స్వతంత్రతాప్రతిపత్తిని సముపార్జించుకున్న కావ్యరాజము.

కవి తన కావ్యమున అనేక పాత్రలను కల్పించును. అతను తన భావనాబలముతో వానిని పరిపోషించి ప్రాణము పోయును. చైతన్యమును గూర్చును. సహృదయుడైన పాఠకునికి, ’ఇవి లోకములో సాధారణముగా ఎదురుపడు నిజమైన ప్రజలే’ యని నమ్మిక పుట్టించును. ఇట్టి నమ్మకమును కల్గించు శక్తినే పాత్రచిత్రణము లేదా శీలచిత్రణమని అందురు.

కావ్యగత పాత్రలను పఠిత అనురక్తితో పరిశీలించును, పాత్ర ప్రతి చర్య పట్లా ఆసక్తి చూపును. కొన్నిసార్లు తనకు నచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశము చేసి తాదాత్మ్యము చెందుట కూడా కద్దు. పాత్ర ఆంగిక వాచిక సాత్వి కాహార్యాదు లన్నింటియందునూ పఠితకు పట్టరాని తమకము. దృశ్యకావ్యముల కంటే శ్రవ్యకావ్యములం దట్టి పాత్ర సాక్షాత్కారము అతి క్లిష్టము. అట్టిదానిని యెంతగా అక్లిష్టముగావించిన, అంతగా కవి కృతకృత్యుడైనట్లు భావింపనగును. భాషాక్లేశము గల కావ్యములం దిట్టిది మరింత క్లేశమే అగును. కానీ అనంతుని భోజరాజీయమం దిట్టి క్లేశము లేని కారణముగా పాత్రలు స్వేచ్ఛగా సమ సజీవముగా పఠితుల మనోరంగమందు మసలును. పాత్రల ద్వారముననే సంఘటనలు పుట్టును. పాత్రలు లేని సంఘటనలే ఉండవు.

భోజరాజీయ కావ్య మనేకోపాఖ్యాన సంపుటి. ఉపాఖ్యానములలో ఉపకథలు. ఉపకథలలో తిరిగి ఉపోపకథలు చోటు చేసుకొన్న కారణముగా దృశ్యకావ్యము లందువలే ప్రధాన, అప్రధాన పాత్ర నిర్ణయము కష్టమగును. మానవ మానవాతీత పాత్రలే కాక, వివిధములగు పశుపక్ష్యాదులు స్వభావోచితముగా తమతమ పాత్రలను నిర్వహించి కావ్యమున కద్భుతత్వమును చేకూర్చినవి. అందుచే నిది అద్భుత జగత్తుగా రూపొందింపబడెను.

ఇట్టి అద్భుత కథోపేతమైన భోజరాజీయమున అన్నదాన మహాత్మ్యము, సత్యవాక్య మహిమ, తీర్ధయాత్రల మహిమలను వక్కాణించు అనేక కథలు కలవు. అందు అన్నదాన మహిమ నుగ్గడించు వృత్తాంతములలో రత్నమండన పుష్పగంధుల కథ ఒకటి. ఎన్నెన్నో ఉపకథలతో పెనవేసికొన్న అద్భుతమైన కథ ఇది. ఈ వృత్తాంతమును ఒక ప్రత్యేక కావ్యమా అనున ట్లనంతుడు రూపొందించెను. ఇందు పుష్పగంధి నాయిక. భోజరాజీయములో జననమాది వివాహ పర్యంతముగా అభివర్ణితమైన పాత్ర పుష్పగంధి ఒక్కతియే. ఆనాడు యమునితో వాదించి భర్త ప్రాణములను పొందిన సావిత్రితో పోల్చదగిన మహత్తర శీలవతి పుష్పగంధి. అపురూప సౌందర్యవతిగా అద్భుత ప్రజ్ఞాపాటవములు కలిగిన మనోహర మూర్తిగా, విద్యావతిగా, ధైర్యశాలినిగా పుష్పగంధి పఠితల నలరిస్తుంది. తెలుగు సాహిత్యములో ఇట్టి స్త్రీమూర్తి అరుదుగా దర్శనమిస్తుంది.

పుష్పగంధి రాజకుమార్తె. తన్ను వివాహమాడినవాడు వివాహమైన తొమ్మిదినాళ్ళకు బ్రహ్మరాక్షసుని పాల్బడునను జాతక దోషముతో జన్మించిన దురదృష్టవంతురాలు. సద్గుణశీలుడు, ఆచారవంతుడు, నిత్య సత్యధనుడు, పుండరీక పురాధీశుడు అయిన సంపాతి మహారాజుకు, పరమ పతివ్రతయైన చంద్రరేఖకు వరప్రసాదినిగా ఆమె జన్మించింది. దోషజాతకురాలైన కూతురైననూ, ఆ దంపతులు తమ బిడ్డను మిక్కిలి గారముతో పెంచిరి. ఆమె అద్భుత సౌందర్యరాశి.

“చూత నవీన పల్లవము శుధ్ధ సువర్ణ పునీతదోచి తం
జాతరజంబుపై గలయజల్లి మెఱుంగులు దోమిదోమి ల
క్ష్మీతనయుండు వేడ్కపడి చేసిన పుత్తడిబొమ్మ”

పుష్పగంధి. ఆమె చక్కదనము, సౌశీల్యములతో తండ్రి సంపాతియే ధన్యుడైనాడు.

“గౌరియు సిరియు నిజాంక వి
హారిణులగునట్టి హిమ నగాబ్ధుల భంగిన్
ధీరత్వ గభీరత్వము
లారంగా విభుడు మెఱసె నాత్మజతోడన్”

విద్యావిలాసంబులందునూ పుష్పగంధి మేటియే.

“భారతియుండె నొండె నలపార్వతి గాని తలంచి చూడ నీ
నీరజ నేత్ర యొక్క ధరణీపతి పుత్రిక మాత్రగాదు”

అని సజ్జన కదంబము, గురువు మెచ్చునట్టుగా అతి శీఘ్రముగా విద్యలను గ్రహించిన సునిశిత బుద్ధిశాలి పుష్పగంధి. లలితకళలను సైతమూ, సునాయాసముగా స్వంతము చేసికొన్న సుగంధిని.

“పాటయు జదువును వ్రాతయు
నాటయు వాద్యంబు నాదియగు విద్యలకున్
మేటియని పొగడదగియడు
పాటిగ దా నభ్యసించె బాలిక పేర్మిన్”

ఆమె కుమారుడనే భావన తలిదండ్రులకు ఆమె జాతకమే కలిగించింది. పుష్పగంధి పెంపకమటులే సాగినది. ఆమె సౌందర్య మసామాన్యము. యవ్వనవతియైన ఆమె సుకుమార సుందర సురుచిరవదనము, చంద్రుని సైతము కుందునట్లు చేసినది.

ఆ లోలాక్షి లలాట వక్త్ర సదృశత్వాకాంక్ష జంద్రుండు దా
బాలత్వంబు వహించి చూచియు నొగిం బ్రౌఢత్వమున్ బొందియున్
బోలంచాలక జాలిపొంది వగలం బొల్పేది లోగుందె గా
కాలోకింప దదీయబింబపు కురంగాకారముం గూరునే.

ఆ నయనము లా నునుగురు
లా నగుమొగ మా మృదూక్తు లా గాంభీర్యం
బా నడుపు లా విలాసము
లా నెలతకె యొప్పు నొరుల కలవడవెందున్

ఇట్టి సౌందర్యరాశి, రాజకుమార్తెలకు సహజమైన జలక్రీడ పుష్పచయాది నిత్యకృత్యములను చెలికత్తెలతో వనములో సంబరముగా జరుపుకొను సందర్భమున ఒకనాడు రత్నమండనుడను రాజకుమారుడు డేగవేట నిమిత్తమచటకు వచ్చుట సంభవించెను. డేగను వెదకుచు వచ్చిన రత్నమండనునికి చెలువంబుల ప్రోక, విలాసలక్ష్మికింజొచ్చిన ఇల్లు, సౌఖ్యముల చోటు, వికాసము తానకంబు, కన్నిచ్చల యుంకిపట్టు, కుసుమేషుని నికారము జన్మభూమి అన్నట్లున్న చపలాయత నేత్ర, పయోరుహానన అయిన పుష్పగంధి దర్శనమైనది. పుష్పగంధి కూడ రత్నమండనుని తనోవిలాసమును సందర్శించినది. ఒకరిపట్ల మరియొకరు గాఢానురక్తులైరి. పుష్పగంధి కడుముద్దరాలు. తనను గమనించి సౌధములకు మరలిపోదుమని హెచ్చరించిన చెలికత్తెను చూసి ఆమె సిగ్గిల్లినది.

“అనిన నయ్యింతి సిగ్గున నవనతాస్య
యయ్యె నేమిసేయుదు నల్ల యవనినాధ
తనయుడిందు ప్రవేశించెననుచు దనదు
హృదయ మా వయస్యకు జూపునదియపోలె”

ఆమె ప్రవర్తనలోని ఉదాత్తత కిదియొక తార్కాణము. తన్ను వీడి అంతఃపురమున కేగిన పుష్పగంధిని తలచితలచి మూర్ఛబోయి పలుమార్లు ఆమె సౌందర్యమునే ప్రస్తుతించిన రత్నమండనుని మాటలే పుష్పగంధి మనోహర సౌందర్యమునకు తార్కాణములు. పిమ్మట పుష్పగంధి రత్నమండనునిపై ఉదయించిన ప్రేమచే చెలికత్తెతో కొంత దూరము నడచి మనోజాత శరాఘాతయై సోలి వ్రాలిపోయినది. పుష్పగంధికి సౌందర్యముతో పాటు సాహసము, సంస్కారము మిక్కుటము. రత్నమండనుని పంపుపై తన్ను రోయుచు వచ్చిన అతని చెలికాడు ఇంద్రదత్తుని ఆమె పిలిపించి తదానన దర్శనము ‘రోగికి సుహ్రుదుల గంగొనగా గుణమెట్టిదగునట్టి కైవడిజేతో రాగ మెలర్పగ” ప్రవర్తించి ఆతనితో చెలికత్తెలచే సంభాషింపజేసినది. ఇంద్రదత్తునిద్వారా రత్నమండనుని వివరములు సేకరించినది. రత్నమండనుడు మాళవ దేశాధీశుడు, రత్నపురి వాసుడూ నగు నందుని పుత్రుడనియూ, అవివాహితుడనియూ, పుష్పగంధి తెలిసికొనినది. ఇది సాహసమే కదా!

పుష్పగంధిని వివాహమాడినచో వివాహమైన తొమ్మిదినాళ్ళకు తాను బ్రహ్మరాక్షసుని చేతిలో మరణింతునని జాతక ఫలము తెలిసి కూడా రత్నమండనుడు మనస్సు మరల్చుకోలేదనిన, ఆమె ఆతని హృదయము నందెంత పటిష్టముగా నిలచినదో, ఆమె యెంతటి అద్భుత సౌందర్యరాశియో మరొకమారు స్పష్టమగును. అంతియే కాదు, రత్నమండనుడు తన తండ్రితో పల్కిన పలుకులు దీనికి మరో నిదర్శనము.

“.. తక్కటి విచారములేటికి పుష్పగంధికై
తనువెటులైననేమి వసుధం బెఱరాజ తనూజలేల య
య్యనిమిషనాధుపుత్రి దెస నైనను నా హృదయంబు నిల్చునే”

పుష్పగంధి అలౌకిక సౌందర్యమున కీవాక్యమొక్కటి చాలును.

పుష్పగంధి జాతకమురీత్యా దురదృష్టవంతురాలిగా లెక్కింపబడిననూ, రత్నమండనుని హృదయాధిదేవతయై అతడు కోరి వివాహమాడుటచే గొప్ప అదృష్టజాతకురాలైనది.

పుష్పగంధి ఉపాయశీలి. ప్రజ్ఞాపాటవములూ, ధీరత్వమూ కలిగిన అతివ. ఆమె జాతకములో చెప్పినట్లుగానే, వివాహమైన తొమ్మిదవనాడు రత్నమండనుడు వనమున ఏకాంతముగా సంచరించునపుడు, రాక్షసుని చేజిక్కును. గోవ్యాఘ్ర సంవాదమువంటి అద్భుతమైన సత్యవాక్యమహిమను వక్కాణించు కథల నా రక్కసునకు జెప్పి, తనవారిని చూచి మరలి వచ్చుట కా రాక్షసునినుండి అతి ప్రయత్నము మీద అనుమతిని పొంది పుష్పగంధి కడకు వచ్చును.

బ్రహ్మరాక్షసున కాహారముగా పోవుటకు సిద్ధపడుచున్న భర్తను చూచి పుష్పగంధి సామాన్యస్త్రీ వలె రోదింపలేదు. తన జాతకఫలమే ఆతని నిట్లు మృత్యుముఖమునకు త్రోయుచున్నదని తన్ను తాను దూషించుకొనలేదు. ఇచ్చిన మాట ప్రకారము తాను బ్రహ్మరాక్షసున కాహారముగా పోవుచుంటినని నవ్వుచు పల్కుచున్న భర్తను చూసి పుష్పగంధి-

“…. అనిష్టముల్ గని యుపాయ బలంబున ద్రోచుగాక స
జ్జనుడథముండువోలె గనుసన్నను జావ నుపక్రమించునే
విను నృపనందనుండవు, వివేకివి, చక్కనివాడవార్తయౌ
వనుడవు నేడు నీకు దగవా యిటు పల్కగ నాదు సన్నిధిన్”

అనుటలో ఆమె చిత్త స్థయిర్యము, భర్త పట్లగల అమిత విశ్వాసము, అంతర్గతమైన బాధా సుస్పష్టముగా గోచరించును.

తాను బ్రహ్మరాక్షసునకు శపథములు చేసి వచ్చినాడుగాన, తిరిగి ఆతని కాహారముగా వెడలుట తప్పదన్న రత్నమండనునితో పుష్పగంధి, రక్కసునితో ఏమి శపథముచేసి వచ్చెనో తెలుపమన్నది. అట్టి హృదయవిదారక సన్నివేశమున సైతము పుష్పగంధి కనబరచిన ఆత్మ స్థైర్యము శ్లాఘనీయము. పుష్పగంధిని కావ్యనాయిక వలె అనంతుడు రూపకల్పన చేసిననూ ఆమెచే అతిస్వల్పముగా మాత్రమే మాటలాడించును. ఆమె హృదయమును కేవలము ఆమె చేష్టల ద్వారమున మాత్రమే వ్యక్తము చేయించును.

పుష్పాపచయ సందర్భమున సఖులతో ’పట్టెదను డేగను’ అని మాత్రమే తొలుతగా మాటలాడిన పుష్పగంధి ఇచ్చో కొంత ఎక్కువగా మాటలాడినది. ఇది అవుసరము. కావుననే పుష్పగంధి, రత్నమండనుడు రక్కసుని కిచ్చిన మాటను తెలుపమని కోరినది. అందులకు రత్నమండనుడు

“కుడువదొడగునెడ నాకట
గడుదూలుచు నతిధివచ్చి గ్రాసమడిగినం
గడపునతడు పడుపాటుల
బడుదుననును పోయి మరలబడి రాకున్నన్”

నేను ఇంటికి వెడలి తిరిగి నీవద్దకు రాకపోయినచో, భోజనసమయాన మిక్కిలి ఆకలితో వచ్చి ఆహారమడిగిన అతిధిని వెళ్ళగొట్టువాడు ఎట్టి పాపము అనుభవించునో అట్టి పాపమును నేననుభవింతును’ -అని తనచేత రాక్షసుడు ప్రమాణము చేయించుకొనిన సంగతిని రత్నమండనుడు తెలియచేసెను. అది వినిన పుష్పగంధి ముఖము వికసిత కమలమే అయినది. సౌందర్యమును మించిన బుద్ధికౌశల్యమామె సొత్తు. ముగ్ధవలె సృజించిన పుష్పగంధి నోట, కవి ప్రౌఢోక్తులాడించుట సందర్భోచితము. తన మమనున తోచినది వ్యక్తీకరించక, చాల నిబ్బరముగా పుష్పగంధి “పొమ్ము నృపాల పుత్ర! తల పువ్వులు వాడక యుండ నెమ్మదిన్ రమ్మ”న్నది. భార్య మాటలలోని అంతరార్థ మాత డెరుగడు. ఆమె పల్కిన మాటలకు ‘దరహాస భాసురాస్యమ్మలరగ ‘ అతండు బ్రహ్మరాక్షసుని కడకు బయల్దేరెను. మాటకు కట్టుబడి రక్కసుని చేరుటయే అతని లక్ష్యము.

పుష్పగంధి గంభీర హృదయ. స్థిరచిత్త. కానీ భర్తను రక్కసుని కాహారముగా పొమ్మని తానే పంపుచున్న కఠినాత్మురాలిగా పౌరకాంతల దృష్టిలో నిలచినది.

“…….. అమ్మరో చూచితే యాతనియాలికి నారయనెట్టిగుండెయో…” అనువారు కొందఱు.

“రోగయుతుడు గాడు, రూపహీనుడుగాడు
వృద్ధుగాడు దుర్వివేకిగాడు
పడయరాని రాచపట్టి నేమని పుచ్చె
బ్రహ్మరాక్షసునకు భక్షణముగ”

అనువారు ఇంకొందఱు.
పుట్టినపుడె యింత పుట్టూమీదటనని యిట్టు చెప్పితె పురోహితులరాజ

కడిది మృత్యువు పుష్పగంధియై చనుదెంచి, నృపతనూజుని ప్రాణములపహరించుచున్నద
’ని వాపోవువారు మరికొందఱు. ఎవ్వరేమనుకున్ననూ పుష్పగంధి చలించలేదు. రత్నమండనుడు వివాహ గమనోన్ముఖుండునుంబోలె” పెద్దలకు నమస్కరించి ఒంటరిగా సత్యవాక్పరిపాలనకై రక్కసుని కాహారముగా వనమునకు బయల్దేరెను.

పుష్పగంధి సునిశిత బుధ్ధిశాలిని. ఈ లోకనింద కతీతముగా భర్తృ ప్రాణరక్షణార్థము భర్తకు కూడ తెలియకుండ, ఒంటరిగా వాని వెనుకనే అరణ్యమున ప్రవేశించిన ధైర్యశాలిని. తనవద్దకు మరలివచ్చిన రత్నమండనుని చేరి రాక్షసుడు భుజించుట కారంభించు సమయమును జూచి, పుష్పగంధి తన పతి ప్రాణభయంబు తప్పింప నిది యవసరంబని ఊహించి, తనకు తోచిన ఉపాయము నమలుపరచినది.

ఇచ్చట సమయమునకు పుష్పగంధి చూపిన చొరవ, ధీశక్తి, వాక్చాతుర్యము, ధైర్యసాహసములు సామాన్య స్త్రీలకే కాదు, రాచవనితలకు సైతము మార్గదర్శకమే. ఆపదలు కల్గినపుడు తాల్మి వహించి వాని నధిగమించు ఉపాయము వెదకుట సామాన్యము కాదు. తొలుత ముగ్ధలా కనిపించి వివాహానంతరము ప్రౌఢలా దర్శనీయమై, ఈ క్షణములో అపార ధీవిశేషాన్వితయైన ధీరురాలిగా ’ఇంతింతై వటుడింతయై’ వెలిగినది.

భిక్షాందేహి యనుచు గమ
లాక్షి యతని యెదుర నిల్చి హస్తములెత్తన్
వీక్షించి యతడు నీకే
భిక్షమనిన బెట్టు పురుషభిక్షంబనినన్

పుష్పగంధి “భిక్షాందేహీ” యని రాక్షసుని యాచింపగా, ఆతడు “ఏమి భిక్షకావాలో కోరుకొమ్మ” నిన పుష్పగంధి “పురుష భిక్ష” కావలననెను. ఇది ఒక అద్భుతమైన సాహసోపేతమైన వ్యక్తిత్వమును ప్రకటించు స్త్రీ స్వభావము. ఏ శపథము చేయించుకొని బ్రహ్మరాక్షసుడు తన భర్తను తన వద్దకు పంపెనో, అదే మాటతో ఆ రాక్షసుని గెల్చి తన పతిప్రాణములను దక్కించుకొని సావిత్రికి సాటిగా నిలచిన సౌశీల్యవతి పుష్పగంధి.

పుష్పగంధి మాటలకు అంతటి రక్కసుడే చోద్యపడెను. తనమాట తనకే వప్పగించిన పుష్పగంధిని మెచ్చి రత్నమండనుని వదిలివేసెను.

స్త్రీ బుద్ధి ప్రళయాన్ని సైతం శాసించి సౌఖ్యాన్ని నెలకొల్పగలదని పుష్పగంధి ఋజువు చేసెను. నాలుగైదు మార్లు మాత్రమే మాటాడింపజేసి, పుష్పగంధిని పాఠకుల మానస ఫలకముల మీద చెరగనిముద్ర వేయునట్లు తీర్చిదిద్దిన అనంతుడు శ్లాఘనీయుడు.

—————————————

డా. విన్నకోట రాఘవమ్మ, డా. వేలూరి సీతాలక్ష్మి, డా. అయ్యగారి విజయలక్ష్మి గార్లచే ఇటీవల ప్రచురింపబడిన ’నవ పారిజాతాలు’ పుస్తకము నుండి. ప్రాచీన కావ్యాలలోని విశిష్ట మానవ, మానవేతర పారిజాతాల మనోవికాస పరిమళాల సమాహారం, ఈ పుస్తకం. ఈ పుస్తకావిష్కరణ 2010, మార్చి 28 న విశాఖపట్నంలో సద్గురు శ్రీ శివానందమూర్తిగారి అశీస్సులతో జరిగింది. వివరాలకు, భారతదేశంలో డా. రాఘవమ్మ – ఫోన్: 9703048458 లేక అమెరికాలో డా. సీతాలక్ష్మి – లను సంప్రదించవచ్చు.

ఉపయుక్త గ్రంధములు:

భోజరాజీయము
కావ్యమాల

అనంతామాత్యుడు

క్రీస్తుశకం (సామాన్యశకం) 1425, 1434 ల మధ్య అనంతామాత్యుడు ‘భోజరాజీయం’ అనే కథా కావ్యం, ‘ఛందోదర్పణం’ అనే ఛందశ్శాస్త్రం ‘రసాభరణం’ అనే అలంకార శాస్త్రం రాశాడు. ‘భోజరాజీయం’ మహుడనే పేరుగల రాజు చరిత్రతో మొదలవుతుంది. తర్వాతి కథలలో భోజుని పూర్వజన్మ వృత్తాంతం, భోజరాజుగా జన్మించడం, సిద్ధుడి ద్వారా ‘ధూమవేధి’ విద్యను పొందడం వంటి కథలున్నాయి. ఈనాడులో భోజరాజీయం గురించిన వ్యాసం. వికీపీడియాలో అనంతామాత్యుడు పేజీ.

కొండూరు రాఘవాచార్యులు సంగ్రహించిన భోజరాజీయం

—————————————

డా. వేలూరి సీతాలక్ష్మి

చెన్నైలో పుట్టి, బాపట్లలో పెరిగిన డా. వేలూరి (వెలమకన్ని) సీతాలక్ష్మి విశాఖ జిల్లా అనకాపల్లిలో 32 సంవత్సరాలకు పైగా తెలుగు అధ్యాపకురాలిగా, రీడరుగా పనిచేసి, ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంగారి పర్యవేక్షణలో అనంతామాత్యునిపై ఆమె రచించిన “భోజరాజీయ కావ్యానుశీలనం” గుంటూరు నాగార్జునా విశ్వవిద్యాలయంలో ఉత్తమ పరిశోధనాగ్రంధంగా ఆచార్య తూమాటి దోణప్ప బంగారు పతకం పొందింది. భమిడిపాటి రామగోపాలం (భరాగో) గారితో కలిసి తెలుగు చిత్రగీతాలపై ఆమె రచించిన “మరో నూటపదహార్లు” అనే పుస్తకం ప్రాచుర్యంలో ఉంది. ప్రఖ్యాత గాయని పద్మవిభూషణ్ శ్రీమతి పి. సుశీలపై “వెండివెన్నెల జాబిలి” అనే శీర్షికతో వ్రాసిన వ్యాసం భరాగో, ఇతరులు రూపొందించిన ఒక అభినందన సంచికలో భాగంగా వెలువడింది. ఇవికాక అనేక పుస్తక సమీక్షలు, సాహిత్య ప్రసంగాలు చేశారు.

ప్రస్తుతం ఆమె ఆంధ్ర పద్యకవితా సదస్సు విశాఖజిల్లా శాఖకు ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె అభిరుచులు -రసరమ్య గీతాల, రసాలూరే పద్యాల శ్రవణం, పఠనం.

About డా. వేలూరి (వెలమకన్ని) సీతాలక్ష్మి

చెన్నైలో పుట్టి, బాపట్లలో పెరిగిన డా. వేలూరి (వెలమకన్ని) సీతాలక్ష్మి విశాఖ జిల్లా అనకాపల్లిలో 32 సంవత్సరాలకు పైగా తెలుగు అధ్యాపకురాలిగా, రీడరుగా పనిచేసి, ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంగారి పర్యవేక్షణలో అనంతామాత్యునిపై ఆమె రచించిన “భోజరాజీయ కావ్యానుశీలనం” గుంటూరు నాగార్జునా విశ్వవిద్యాలయంలో ఉత్తమ పరిశోధనాగ్రంధంగా ఆచార్య తూమాటి దోణప్ప బంగారు పతకం పొందింది. భమిడిపాటి రామగోపాలం (భరాగో) గారితో కలిసి తెలుగు చిత్రగీతాలపై ఆమె రచించిన “మరో నూటపదహార్లు” అనే పుస్తకం ప్రాచుర్యంలో ఉంది. ప్రఖ్యాత గాయని పద్మవిభూషణ్ శ్రీమతి పి. సుశీలపై “వెండివెన్నెల జాబిలి” అనే శీర్షికతో వ్రాసిన వ్యాసం భరాగో, ఇతరులు రూపొందించిన ఒక అభినందన సంచికలో భాగంగా వెలువడింది. ఇవికాక అనేక పుస్తక సమీక్షలు, సాహిత్య ప్రసంగాలు చేశారు.

ప్రస్తుతం ఆమె ఆంధ్ర పద్యకవితా సదస్సు విశాఖజిల్లా శాఖకు ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె అభిరుచులు -రసరమ్య గీతాల, రసాలూరే పద్యాల శ్రవణం, పఠనం

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

4 Responses to పుష్పగంధి

  1. వేణు says:

    అనంతామాత్యుడి భోజరాజీయంలో ‘ఆవు-పులి’కథ బాగా ప్రాచుర్యం పొందింది. ఆ ఉపాఖ్యానంలో, పులి దగ్గరకు బయలుదేరేముందు ఆవు తన లేగదూడకు మంచిమాటలు బోధిస్తూ లోకరీతిని వివరిస్తుంది. ఈ ఘట్టంలో అనంతుడు చాలా హృద్యమైన పద్యాలు రాశాడు. ఆరో తరగతిలో అనుకుంటాను, తెలుగు పాఠ్యపుస్తకంలో చదువుకున్న ఆ పద్యాలు ఇప్పటికీ గుర్తున్నాయి.

    ఇక సావిత్రిని పోలిన పుష్పగంధి గురించి ఈ వ్యాసం ద్వారానే తెలిసింది. వ్యాసంలోని భాష గ్రాంథికచ్ఛాయల్లో ఉన్నప్పటికీ ‘మనోజాత శరాఘాతయై ’లాంటి ప్రయోగాలు బావున్నాయి!

  2. రాఘవ says:

    చక్కటి పరిచయమండీ. ఈ కావ్యం సంపాదించి చదవడానికి ప్రయత్నిస్తాను.

    నమస్సులతో
    భవదీయుడు

  3. బాగున్నదండీ.
    వచనంలో గ్రాంధిక వ్యావహారిక శైలులు కలగలిసిపోయి కొంచెం గందరగోళంగా ఉన్నది కానీ మంచి కావ్య కథను చక్కగా చెప్పారు.

  4. రవి says:

    చక్కటి వ్యాసం. ఈ కావ్యం చదవాలనిపించేలా వ్రాశారు.

Comments are closed.