పాత్రలు : బావ, బావమరిది, స్వామి, ఆమె.
ప్రదర్శన సమయం: ఒక గంట మాత్రమే
(దృశ్యం కోరికలు తీర్చే బాబాగారి సమాధి. సమాధిపైన వేలాడుతూ ఒక గంట! దానిని బయటి నుంచి కూడ మ్రోగించేందుకు వీలుగా ఒక తాడు. వింగ్ వరకు)
(ప్రవేశం బావ, బావమరిది)
బావమరిది: బావా! ఇదే బాబాగారి సమాధి!
బావ: అలాగా! ఏమిటో దీని ప్రఖ్యాతి!
బావమరిది: కోరుకున్నవారికి కొంగు బంగారమన్న ఖ్యాతి! ఎలా కోరుకోవాలో తెలుసా బావా! వెన్నెల రాత్రి, కోరికను మనసులో తలచుకొని ముమ్మారు గంట కొట్టి…
బావ: అబ్జెక్షన్ బామ్మరిదీ! ఈ గంట కొట్టడమనే పదాన్ని మనవాళ్లు ఎలా వాడతారో తెలుసా? “రాముడు చదువుకు గంట కొట్టి ఆటలో పడ్డాడు” అన్న విధంగా! కోర్కెకి ముమ్మారు గంట కొట్టేస్తే, బాబాని అడిగేందుకు ఏముంది?
బావమరిది: కొట్టేది కోర్కెకి కాదు బావా! కోర్కెని మనసులో తలచుకొని అహానికి, అభిమానానికి, అనేకాగ్రతకి —వెరసి ముమ్మారు గంట కొట్టాలి!
బావ: ఈ అనేకాగ్రత ఏమిటంట!?
బావమరిది: ఏకాగ్రతకి వ్యతిరేక వాచకంట!
బావ: నయమే! బహువచనమని అనలేదు! కథ కానియ్! వెన్నెల రాత్రి కోర్కెని మనసులో తలచుకొని ముమ్మారు గంట కొట్టి…
బావమరిది: (సమాధికి ఉన్న చిన్న దీపం గూటిని చూపిస్తూ) కోర్కెను తనకొచ్చిన భాషలో కాగితం మీద వ్రాసి, ఈ గూట్లో పెట్టి, ప్రక్కనే ఉన్న దీపం వెలిగించాలి.
బావ: సరే! తరువాత ఏమవుతుంది?
బావమరిది: అదుగో, సమాధి వెనుక నున్న తలుపు తెరచుకొంటుంది! (మధ్య ద్వారం వింగ్ చూపిస్తాడు)
బావ: తమాషాగా ఉందే! తలుపులు తెరచుకొని…
బావమరిది: బాబాగారి శిష్యులు, పరమ నిష్టాగరిష్టులు అయిన ‘స్వామిగారు’ వేంచేస్తారు.
బావ: వచ్చి ఏం చేస్తారు?
బావమరిది: గూట్లో పెట్టిన కాగితం మీద ఉన్న కోర్కెని, చూడకుండానే ఉన్నదున్నట్లు చెప్పి, మీరు ‘కోరుకొన్నది ఇదేనా’ అని అడుగుతారు.
బావ: నిజంగానా?
బావమరిది: నిజమే బావా! భక్తులు అవునని ఒప్పుకొన్న మీదట వారి కోర్కెలని బట్టి, పూజావిధానం, దక్షిణ చెప్పి చెల్లించిన పిదప, బాబాగారి ఆత్మని మేల్కొలిపి, వారికి విన్నవిస్తారు.
బావ: ఆ విన్నపాలు బూడిద పాలు కావు గద!
బావమరిది: కాలేదు. కావు, కాబోవు! వచ్చిన వారెవరూ రిక్త హస్తాలతో పోలేదని, ఈ సమాధి చరిత్ర చాటి చేప్తోంది! నీ వేదైనా కోరిక కోరుకో బావా!
బావ: ఒక మహాపురుషుని ఆత్మకి విన్నవించుకొనే కోర్కెలు నా కేమున్నాయి బామ్మరిదీ! అయినా చెల్లెలు ఇక్కడుందని చెప్పి గదా, నన్నింత దూరం తీసుకొచ్చావు, ఏది?
బావమరిది: చెల్లి రావడానికి ఇంకా చీకటి పడాలి బావా! ఆ లోగా నీ కేమైనా కోర్కెలుంటే…
బావ: లేవని చెప్పాను కదా! అయినా ఆవిడ వచ్చేదాకా ఈ సమాధి దగ్గర కాలక్షేపం దేనికి? పద, పోదాం!
బావమరిది: (ఆపి) చిత్రంగా మాట్లాడుతావేం బావా! నువ్వు ఈ రోజే డిల్లీ నుంచి వచ్చావు కదా!
బావ: అవును, దిగీ దిగగానే, ఇంట్లో ఇల్లాలికి బదులు నువ్వు దర్శన మిచ్చావు! ఇక్కడుందని చెప్పి, తీసుకు వచ్చావు. ఆమె కేదైనా కోర్కెలున్నాయి కాబోలు, నేనుండడం అవసరమేమోనని ఇంత వరకీ తలనొప్పిని భరించాను.
బావమరిది: నువ్వు డిల్లీలో ఉండగా చెల్లి ఒక ఉత్తరం వ్రాసింది. అందలేదా?
బావ: అవును బయలుదేరే ముందు అందింది. బండిలో చదవ వచ్చని, జేబులో పెట్టి మరచి పోయాను. (జేబులోంచి ఉత్తరం తీస్తాడు)
బావమరిది: నువ్వా ఉత్తరం శ్రద్ధగా చదువు బావా! ఈ లోగా నీ కాలక్షేపానికి చక్కని ఏర్పాట్లు నేను చేస్తాను. (వెంట తెచ్చిన బేగులోంచి విస్కీసీసా, పేక ముక్కలు, గ్లాసులు తీస్తాడు) (బావ పచార్లు చేస్తూ ఉత్తరం చదువుకొంటాడు)
బావ: అయితే బామ్మరిదీ! ఇదన్న మాట సంగతి?!
బావమరిది: కూర్చో బావా! (పేక ముక్కలు కలుపుతూ) కంపీవా! రమ్మీవా! ఏది ఆడుదాం? మూడా, పదమూడా ఎన్ని పంచమంటావు?
బావ: పంచే ముక్కలు మూడైనా, పదమూడైనా, ఇద్దరి మధ్య మూడ్స్ కుదరవు, కనీసం ముగ్గురైనా ఉండాలి.
బావమరిది: ఇవాళ అమావాస్య నీకు తెలుసా?
బావ: అవును అమావాస్యే! అయితే ఏం?
బావమరిది: వెన్నెల రాత్రి అయితే బాబాని వరమడగడానికి ఎవరైనా భక్తులు ఊడిపడవచ్చు! అమావాస్య నాడు వరాలిచ్చే ప్రసక్తి లేదు గనుక, ఎవరూ వచ్చే అవకాశం లేదు. మనలో మనమే ఆడుకోవాలి.
బావ: అంటే, అమావాస్యనాడు, బాబాగారి ఆత్మకి విశ్రాంతి అన్నమాట!
బావమరిది: పోనీ, అలాగే అనుకో!
బావ: రెస్టు గనుక, మన్తో కాలక్షేపానికి అతనే రావచ్చు కదా!
బావమరిది: అదేంటి బావా! ఆత్మతో పేకాటా?
బావ: తప్పు, తప్పు! ఆత్మతో కాదు, పరమాత్మతో, వరాలిచ్చే వేల్పుతో! (విస్కీ గ్లాసులోకి పోస్తాడు)
బావమరిది: అడిగి చూస్తావేమిటి? (విస్కీ గ్లాసు చేతితో పట్టుకొని)
బావ: అవును అదే అడగ దలచుకొన్నాను. (సమాధి దగ్గర మోకాళ్ల మీద కూర్చొని నమస్కారం చేస్తాడు)
బావ: బాబా! పరమ పితా! పేకాట ఆడడానికి- మన్లో మన మాట, మందు కొట్టడానికి కూడ – మాకు మూడో మనిషి కంపెనీ కావాలి. బామ్మర్దీ! ఏదీ, ఆ పేకలో జోకర్ ఇలా ఇయ్యి.
బావమరిది: (ఇచ్చి) ఏం చేస్తావు?
బావ: కోర్కె కాగితం మీద వ్రాసి పెట్టాలన్నావు కదా! వేరే కాగితం దేనికి? ఈ జోకర్ జానీవాకర్ రెంఢింటినీ గూట్లో పెట్టి దీపం వెలిగిస్తే, ఏలిన వారికి మన కోరిక తెలియదంటావా? (రెండూ గూట్లో పెట్టి దీపం వేలిగిస్తాడు)
బావమరిది: బావా! ముమ్మారు గంట కొట్టాలి.
బావ: అవును, గంట కొట్టి, గూట్లో దీపం ముట్టించాలి కదూ! అంతా తారుమారుగా చేద్దాం. (తాడు పట్టుకొని గంట ముమ్మారు కొట్టి, తిరిగి మోకాళ్ల మీద కూర్చొని నమస్కారం చేస్తాడు) (కాసేపు నిశ్శబ్దం)
బావ: (లేచి) వెనుక తలుపు తెరచుకోలేదేం?
బావమరిది: అమావాస్య కదా! దానికి కూడా రెస్టు అయి ఉంటుంది.
బావ: సరే! మరేం చేస్తాం! మనిద్దరమే ఆడుకొందాం! ఈ సమాధి చరిత్రలో, నేటికి నేను రిక్త హస్తాలతో తిరిగి వచ్చాను. ఈ కళంకాన్ని ఏ అక్షరాల్తో రాయాలి బామ్మరిదీ! నల్ల సిరా అక్షరాల్తోనా?
బావమరిది: నువ్వు వ్రాసినా పబ్లిక్ ఒప్పుకోదు బావా! అమావాస్య నాడు అడిగిన తప్పు నీదేనంటారు. అయినా అల్లా ఉద్దీను దీపం లాగ, బాబాగారు వెంట వెంటనే కోర్కెలు తీర్చేస్తారేమిటి?
బావ: మరేంటి?
బావమరిది: కాలక్రమాన తీరుబడిగా తీరుస్తారు. సపోజ్ ఒక భక్తురాలు, పిల్లలు కావాలని కోరుకుందనుకో! వెంటనే రబ్బరు బొమ్మలాంటి పిల్లడు సమాధి గర్భం నుండి వస్తాడా బావా! కనీసం ఆమె గర్భం నుండి రావడానికైనా పదిమాసాలు గడవాలా లేదా?
బావ: నిజమే ననుకో! కాని నా కోరిక ఆ కేటగిరీలోకి రాదు. అది తీరాలంటే ఇప్పుడే తీర్చాలా లేదా?
బావమరిది: నువ్వన్నదీ నిజమే! నీ కోరిక తీరలేదంటే…
బావ: తప్పు అమావాస్యది అంటావు.
బావమరిది: అంతే ననుకొంటాను! ముందా జోకర్నీ జానీవాకర్నీ గూట్లోంచి తీసేసి రా! మనిద్దరమే ఆడుకొందాం. (బావ తీసి వచ్చి కూర్చొంటాడు)
బావమరిది: (పేక కలుపుతూ) ఎన్ని! మూడా, పదమూడా?
బావ: పదమూడే! ఇద్దరి మధ్య కాలక్షేపానికి రమ్మీనే బాగుంటుంది.
(బావమరిది పేక కలిపి, పంచి, జోకర్ కట్ చేస్తాడు) (“ఆగండి!” అన్న కంఠ స్వరం వినిపిస్తుంది తెరలోంచి.) (ఇద్దరూ ఆశ్చర్యంతో ధ్వని వినిపించిన వైపు చూస్తారు) సమాధి లోంచి స్వరం ఆగండి! ‘కంపెనీ’ కావాలని అడిగి రెండు చేతులే పంచారేం? మూడోది కూడా పంచండి.
బావ: మీరే స్వయంగా ఆడతారా బాబా?!
స /స్వరం : అవును, ఆడితే ఏం?
బావ: అహ! మరేం లేదు! సమాధి లోంచే ఆడతారా, అని?!
స/స్వరం: అవును. (బావ విస్కీ గ్లాసు గూటి దగ్గరకి చేర్చి)
బావ: సమాధి లోంచే అయితే ఈ రసగ్రహణం ఎలా చేస్తారు? నేను అడిగిన కంపెనీ పేకాటకీ, మందుకీ కూడా!
స/స్వరం: హు! మీతో కంపెనీకి నా శిష్యుణ్ని పంపిస్తాను. కాని ఒక షరతు! ఇంకెవరైనా వచ్చేవరకే ఈ ఆట సాగాలి. మళ్లీ మరోసారి ఇలా కోరకూడదు.
బావ: మహా ప్రసాదం! బాబా! అలాగే కానివ్వండి! (మధ్య వింగు లోంచి స్వామి ప్రవేశం)
స్వామి: (వస్తూనే) గుర్వాజ్ఞ వల్ల మీకు తోడుండడానికి అంగీకరించి వచ్చాను. నాకీ విషయాసక్తి ఎంత మాత్రమూ లేదు. మీరు ఆడండి, నేను చూస్తూ ఉంటాను.
బావ: తగదిది స్వామీ!
బావమరిది: తమకిది ఎంత మాత్రమూ తగదు!
బావ: ఆడడానికని వచ్చి..
బావమరిది: చూడడమే చేస్తాననడం
బావ: రస గ్రహణానికని వచ్చి
బావమరిది: కర గ్రహాణం కూడా చేయననడం…
బావ: తగదిది స్వామీ!
బావమరిది: తమకిది ఎంత మాత్రమూ తగదు.
స్వామి: ఏమిటిది! వంది మాగధుల్లాగ నా వెనుక పడ్డారు. గుర్వాజ్ఞ గనుక బ్రతికిపోయారు గాని, లేకపోతే.. పవిత్రమైన సమాధి ప్రాంగణంలో త్రాగి, తందనా లాడాలన్న కోరికకే, మిమ్మల్ని..
బావమరిది: మాడ్చి, మసిచేయాల్సిందంటారు, అంతేనా?
బావ: స్వామీ, మీ కోపంతో మమ్మల్ని మాడ్చకండి! ఇదుగో ఈ సిగరెట్టు కాల్చి బూడిద చేయండి. (సిగరెట్టు, అగ్గి పెట్టి ఇస్తాడు)
స్వామి: (తీసుకొని) హు! గుర్వాజ్ఞ గనుక స్వీకరిస్తున్నాను. (బావ, బావమరదులిద్దరూ స్వామి చేతులు పట్టుకొని, కూర్చో పెడతారు. బావమరిది పేక కలుపుతాడు.)
బావమరిది: స్వామీ, ఎన్ని పంచమంటారు?
స్వామి: తప్పదంటారా?
బావ: గుర్వాజ్ఞ గనుక తప్పదు మరి! (విస్కీ గ్లాసు చేతికిస్తాడు)
స్వామి: అమ్మమ్మ! ఇది కూడానా?!
బావ: అదేమిటి, స్వామీ అలా గాభరా పడతారు! దీనికీ (సమాధిని చూపిస్తూ) దానికీ, తేడా ఎంత మాత్రమూ లేదు.
స్వామి: ఏమిటీ! ఈ రెండింటికీ పోలికా?!
బావ: అవును స్వామీ! గుణ గ్రహణ పారీణులైన తమరు, రస గ్రహాణానికి ఎంత మాత్రమూ సందేహించకండి! ఇది భక్తుల కన్న తల్లి!
బావమరిది: ఆశ్రితుల కల్పవల్లి!
బావ: శాంతి సుధా పిపాసుల జాబిల్లి!
స్వామి: ఓహ్! గుర్వాజ్ఞ గనుక దొరకదిక మళ్లీ, మళ్లీ! తిరగ తోడకండీ స్తోత్ర పాఠాల్నిక గిల్లి, గిల్లి.! (ఒక్క గ్రుక్కలో త్రాగేసి) ఆడతాము మేము కాస్త ఒత్తిగిల్లి. (సమాధికి చార బడతాడు)
బావ: ధన్యులం స్వామీ! (విస్కీ గ్లాసులో పోస్తాడు.) బామ్మరిదీ! ఆలస్యం చేయకు! పంచు పదమూడు ముక్కల్ని! (బావమరిది పేక పంచుతాడు. బావ స్వామి గ్లాసు నింపుతాఢు. ముగ్గరూ ఛీర్స్!)
బావమరిది: స్వామీ! తమ పూర్వాశ్రమ నామమేమి?
స్వామి: అప్పల సామి!
బావ: ఏ ఊరు?
స్వామి: సింవాచెలం.
బావమరిది: ఏం జోకేసావు గురూ! నువ్వు సింవాచలం అప్పలసామి అయితే, మరా కొండ మీద ఉన్నోడెవడంట!?
బావ: పొరపాటు బామ్మరిదీ! ఈ సమాధిలో ఉన్నదెవరు?
బావమరిది: బాబాగారు! కాదు, బాబాగారి ఆత్మ!
బావ: సమాధిలో ఆత్మలు, ఆలయాల్లో దేవుళ్లు ఉండరు బామ్మరిదీ అక్కడుండేవి ఎముకలు, రాళ్లే!
బావమరిది: మరా బాబాలు, దేవుళ్లు ఎక్కడుంటారు?
బావ: మన మధ్యనే మనలోనే ఉంటారు. వాళ్లే కాదు, గంధర్వులు, కిన్నెరలు, రాక్షసులు, గాంధీలు, గాడ్సేలు, అందరూ మన మధ్యనే ఉన్నారు. మీరేమంటారు స్వామీ?
స్వామి: ఇదుగో నా ఆట! (షో చేస్తాడు)
బావమరిది: ఆట మాట సరే! మా బావ మాట కేటంటావు?
స్వామి: గురుని ఆజ్ఞ ఆటకీ, (గ్లాసు నింపుకొని) ఈ గొంతు తీటకీ తప్ప మాటలకి లేదు. (తాగుతాడు)
బావ: బామ్మరిదీ! గంటకొట్టి, స్వామిగారిని మాట్లేడందుకు గుర్వాజ్ఞ అడుగు. (బావమరిది లేస్తాడు)
స్వామి: ఆగాగు! నేను మాట్లాడడమే కదా కావలసింది. సరే! ముందు ముక్కలు పంచు!
బావమరిది: (పంచుతూ) ముందు బావ మాటకి…
స్వామి: మీబావ ఏంటన్నాడు! సమాధిలో ఎముకలు, ఆలయాల్లో రాళ్లు తప్ప మరేవీ లేవన్నాడు. రాముడు, రావణుడు, గాంధీ, గాడ్సే అన్నీ మనవే నన్నాడు! ఆ గాంధీలో మాత్రం ఏమున్నదంట! 65 శాతం ఆక్సిజను, 18 శాతం కార్బను, 10 శాతం హైడ్రోజను, 3 శాతం నైట్రోజను, 2 శాతం కాల్షియము, 1 శాతం భాస్వరం, మిగిలిన ఒక శాతం పొటాషియం, సోడియం, క్లోరీను, మెగ్నీషియము, ఇనుము, ఇసుక ఇవే కద ఉన్నాయి! ఇంకేమున్నాయి?
బావమరిది: వండర్ ఫుల్! గురూ, గాంధీగారి గురించి, ఇంత చక్కటి డిఫినెషన్ చెప్పినవారు లేరంటే నమ్ము!!
బావ: గాంధీ మేథస్సనే ధాతువుల సంపత్తి, సడలని ఖనిజాల ఆత్మ స్థైర్తం ప్రాణ వాయువుల నైతిక శక్తి, అతని జీవితం, అతని వ్రాతలు, నవ సమాజ నిర్మాణానికి నివాళి గీతికలు!
స్వామి: ఏం బామ్మర్దీ! ఏ గాంధీ రైటంటావ్? మీ బావదా! లేక నాదా?
బావమరిది: బావ రెండిటినీ కలిపే చెప్పాడు!
స్వామి: అలాగే , సమాథుల్లో ఎముకలతో పాటు ఆత్మలు, ఆలయాల్లో రాళ్లతో పాటు దేవతలు ఉంటారు! తార్కిక దృష్టితో చూస్తే ఎముకలు రాళ్లు, పారలౌకిక దృష్టితో చూస్తే పరమాత్మలు కనిపిస్తారు!
బావమరిది: అంటే?
బావ: అంటే, కుళ్లిన ఎముకల్లాంటి ఆత్మలు సమాథుల్లోను, రాళ్లలాంటి దేవుళ్లు ఆలయాల్లోను ఉంటారు.
స్వామి: కాదు, తప్పు చూసే కర్తది, చూడబడే కర్మది కాదు. అందరూ వాటిని చూడలేరు, చూసిన వాళ్లలో కూడ కొందరే వాటిని స్పందించ జేయ గలరు!
బావమరిది: బావా! దీనర్థం ఏమిటి?
బావ: అప్పలసామి లాంటి పూజార్లే వాటిని చూసి, స్పందింప జేయ గలరు! తక్కిన వాళ్లు యీ పూజార్లు ద్వారానే దాన్ని అందుకోగలరు!
స్వామి: పూజార్లు కాదు, ప్రవక్తలు! వాళ్లే పరమాత్మ స్వరూపాన్ని చూసి స్పందింప జేయగల సైంటిస్టులు! బుధ్ధుడు, శంకరుడు, నానకు మహమ్మదు, ఏసు అలాంటి ప్రవక్తలే!
బావమరిది: స్వామీ మరి మీ లాంటి పూజార్లో!
స్వామి: అలాంటోల్ల శిష్యులం!
బావ: కాదు, ఆళ్ల పెంపుడు సిలకలు, తెలిసిందా బామ్మర్దీ! ప్రవక్తలు గాంధీ లాంటి నాయకులయితే, యీ పూజార్లు గాంధేయులమని చెప్పుకొనే గాంధారేయులు!
బావమరిది: ఇదుగో, నా ఆట! (షో చేస్తాడు) (స్వామి ముక్కలు పంచుతాడు, విస్కీ రౌండ్)
స్వామి: మీ బావకి పూజార్ల మీద చిన్న చూపున్నా, ప్రవక్తల మీద మంచి యావే ఉంది
బావ: ఉంది! ప్రవక్తలు సెప్పింది మతం గురించే అయినా సేసిన మరమ్మత్తు మాత్రం సమాజాన్నే! డబ్బు వల్ల సీలికలొచ్చి, పీక్కుతినే రాబందు ల్లాంటి బుగతలొక పక్క, రగతాన్ని సెమట సేసి, ఆళ్లకి సంపాయించి పెట్టే బారిక గాళ్లొక పక్కా తయారయి, సమాజం కుండలోని ఎసర్లా కుతకుతలాడి నప్పుడు, పుట్టుకొచ్చిన పెద్ద మడుసులు వాల్లు!
బావమరిది: వాళ్లొచ్చి చేసిందేమిటి బావా!?
బావ: దేవుల్ల పేరుమీద సెరొక మతాన్నెట్టుకొని, దాన దర్మాలు సేసి పున్నెం మూటకట్టుకోమని, ‘బుగతలకి’, తిరుగుబాటు పాపమని ‘ బారికోల్లకి’ సెప్పి, మిట్ట పల్లాలు సరిసేసి, సమాజాన్ని మరమ్మత్తు సేయాలని సూసారు.
బావమరిది: అయినా యీ సమాజం, ఎక్కడేసిన గొంగళి, అక్కడేలా ఉంది!
బావ: దానికి కారనం యీ అప్పలసామిలాంటి, పెంపుడు సిలకలే! ప్రెవక్తల మాటల్నేర్సిన యీ సిలకలు, రానురాను ‘బుగతల’ గూల్లు సేరి, ఆ గూటి పలుకులు పలికి, పేదోళ్ల మనసులనే మారేడు కాయలకి మతం మసి పూసి, దేవుడి పేరు మీద, దోపిడీకి, సాయం సేస్తున్నారు.
బావమరిది: అయితే ఈ అప్పలసాములు, జిత్తులమారి దొంగలంటావు?
బావ: అవును, వీళ్లు మాయల మారీచులు, లంకాపురి జింకలు!
స్వామి: కాదు, లంకాపురి జింకలు మీరే! సమాధి దగ్గర పేకాటకి సేరినట్లు సేరి, యింకేదో మాయ సేయాలని సూస్తున్నారు! మీ వాటం సూస్తంటే నా కనుమానంగా ఉంది!
బావమరిది: అవును అప్పలసామీ! నీ సమాధి క్రింద అండర్ గ్రౌండు, గూట్లో పెరిస్కోపు, ఉన్నాయని, మా కనుమానంగా ఉంది! అందుకే గూట్లో పెట్టిన కాయతాన్ని, ఉన్నదున్నట్లు సదివి సెప్పగలుగుతున్నావు!
స్వామి: లోపలున్నవి పెరిస్కోపులు కావు. తంత్ర సాధనాలు, పుర్రెలు, బొమికలు. సూడగల దమ్ముంటే, నాతో పాటు రావచ్చు. (స్వామి లేచి నిలబడుతాడు. తక్కిన ఇద్దరూ కూడ లేస్తారు.) (అదే సమయానికి గంట మ్రోగుతుంది)
స్వామి: ఎవరో భక్తులు వచ్చినట్లున్నారు! ముందీ సరంజామాని కట్టి పెట్టండి. వాళ్లని పంపించాక మీరు నాతో లోపలికి రావచ్చు. (లేచి నిలబడతాడు. తక్కిన ఇద్దరూ కూడ లేస్తారు.) (అదే సమయానికి మళ్లీ గంట మ్రోగుతుంది.)
స్వామి: ఊ! త్వరగా! (బావ, బావమరుదులిద్దరూ, పేక దస్తా, సారా సీసాలు, సమాధి వెనుకకి చేరుస్తారు) (ప్రవేశం ‘ఆమె!’ వచ్చి గంట కొట్టబోయి, స్వామివారిని చూసి ఆగిపోతుంది)
ఆమె: మీరిక్కడే ఉన్నారా స్వామీ! అయితే నా కోరిక నెరవేరినట్లే!
స్వామి: అమావాస్యనాడు ఎందుకు వచ్చావమ్మా?
ఆమె: గతంలోని చీకటి మబ్బులు ముసురుకొని, బ్రతుకే అమావాస్య అయినప్పుఢు, కాలభేధం ఎలా పాటించను స్వామీ?
స్వామి: నీ బ్రతుకులో నీలి నీడలా! చల్లని సంసారం, అనుకూలుడూ అనురాగవంతుడూ అయిన భర్త! నీకు లోటేమిటి తల్లీ?!
ఆమె: స్వామీ! మీరు సర్వజ్ఞులు! మీ దగ్గర దాపరికం ఏముంది? అనురాగవంతుడు, అనుకూలుడు అయిన భర్త, అష్ట ఐశ్వర్యాలు ఇష్ట సంపదలు గల సంసారం అన్నీ ఉన్నమాట నిజం! అయినా అవన్నీ రేపటితో రేపటితో ఆఖరయే పరిస్థితి దాపురించింది! స్వామీ! నాకీ బాబాగారి చరణాలే శరణ్యం. స్వామీ! ఆరునూరయి, చుక్క ఎదురై, సంసారం చెదిరి నే నిక్కడికి చేరితే, చేరదీయగలరా?
బావ: ఎక్స్యూజ్ మీ మేడం! నేనొక సైకాలజీ ఫ్రొఫెసర్ని! మీ మాటల్ని బట్టి చూస్తే, మీరేదో తీరని అశాంతితో బాధ పడుతున్నట్లుంది! మీ సమస్య ఏదో వివరిస్తే, విప్పగలనన్న నమ్మకం నాకుంది.
ఆమె: మీ సైకాలజీలు, సైన్సులు, నా బ్రతుకుని బాగుపరచ లేవు ఫ్రొఫెసర్! గతంలో నేను చేసిన నేరం నన్ను వెంటాడి, ఈ రోజు కత్తి మొనపై నిలబెట్టింది! మీ మాటల మీద నమ్మకంతో నేనీ కత్తిమీద సాము చేయలేను! అయినా నాకు తెలియక అడుగుతాను, ఇతరుల అశాంతి పోగొట్టగల మీరు మీరీ బాబాగారి సమాధి దగ్గర ఎందుకున్నారు ఫ్రొఫెసర్!
బావమరిది: మేడం! మా బావని అంత తేలికగా తీసిపారేయకండి! మా బావ సవ్యసాచి! అటు సైన్సు, ఇటు సైకాలజీ రెండూ తెలిసిన వాడు! అసలీ రోజు, సమాధి దగ్గరకు ఎందుకు వచ్చాడంటే …
స్వామి: హుష్! గుర్వాజ్ఞ! మీరెందు కిక్కడ వచ్చారన్నది అనవసరం! ఆమె నా క్లయింటు! నన్ను మాట్లడ నివ్వండి. చూడమ్మా! చేసిన పాపం చెప్తే పోతుందన్న విషయం నీకు తెలియనిది కాదు! గంటకొట్టి, నీ చరిత్ర బాబాగారికి చెప్పు. అమావాస్య కాబట్టి నేను జపం చేసి, అతని ఆత్మని మేల్కొలుపుతాను. పరిష్కారం అతనే ఛెప్తారో. ఈ సైకాలజీ ఫ్రొఫెసర్ తో చెప్పిస్తారో. వేచి చూద్దాం!
ఆమె: సరే! మీ ఆజ్ఞ అయింది కాబట్టి చెప్తాను, కాని ఏ ఆఢదీ బయటికి చెప్పుకోలేని జుగుప్సాకరమైన గతాన్ని, మీ ముందు మీ అందరి ముందు ఎలా విప్పి చెప్పేది?
స్వామి: అది కాదమ్మా! చెప్పనిదే..
ఆమె: తప్పదు గనుక చెప్తాను. కాని ఒక షరతు!
స్వామి: దీనురాలివై, వరమడగ వచ్చిన నీవు, షరతులు పెట్ట కూడదు. అహాన్ని, అభిమానాన్ని, వదులుకొని, వరమడగాలి!
ఆమె: షరతు మీతో కాదు స్వామీ! వీళ్లతో! కథ చెప్పేది బాబాగారికే అయినా, వినే శ్రోతలు వీరే కదా!
బావమరిది: పొరపాటు మేడం! వీరు కూడా కదా, అనాలి.
ఆమె: అవును, అదుగో అదే నేనడిగిన షరతు.
బావమరిది: అంటే?
ఆమె: ఇందాకల నేనన్న మాటలోని పాయింటుకి మీరొక చిన్న జాయింట్ జోడించంరా లేదా! అలాగే నే చెప్పబోయే ఆత్మకథని కూడా మీరే పొడిగించాలి!
బావమరిది: ఎక్కడెక్కడ పొడిగించాలి మేడం?
ఆమె: నేను నా కథని చెప్తూ, అభిమానం అడ్డువచ్చి, ఆగోపోయిన చోట! నా లోని ఆడతనం నా నోరు నొక్కి ఆపేసిన చోట! అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే, నాకు సిగ్గేసి, ఒగ్గేసిన చోట!
బావమరిది: ఎలా?!
ఆమె: ఎలాగో అలా! మీ బావగారు సవ్యసాచి అయినప్పుడు, మీ మీరు అతనికి సారథి కాకుండా పోతారా? బుద్ధకి పదును పెట్టి, ఊహించి, జోడించండి!
బావ: అర్థమయిందా బామ్మరిదీ! ఆమె ఆత్మ కథ లోని పురుష పాత్రలలో మనం, పరకాయ ప్రవేశం చెయ్యాలి. చేసి, కథలోని చిక్కు ముళ్లని విప్పాలి!
స్వామి: విప్పి బాబాగారి నిర్ణయానికి ఎదురు చూడాలి. నీ షరతుకి వాళ్లు అంగీకరించినట్లే నమ్మా! కథ మొదలు పెట్టు! (ఆమె గంటకొట్టి సమాధికి నమస్కరిస్తుంది)
ఆమె: అవి, నేను ఇంటర్ చదివే రోజులు, బాపు మెమోరియల్ జూనియర్ కాలేజీలో నా కొక ప్రత్యేక స్థానం ఉండేది! (బావమరిది వైపు తర్జని చూపిస్తూ) వినయ్! చెప్పవూ, అప్పట్లో నేనెలా ఉండేదాన్ని
బావమరిది: సౌందర్య ప్రదర్శన శాలకి, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ లా, చూపుల తోనే అందాన్ని అవపోశన పట్టే, అగస్త్య భ్రాతల థర్స్ట్ ఎయిడ్ సెంటర్లా. అందులో నా ఫేవరేట్ గోల్డుస్పాటులాగ ఉండేదానివి!
ఆమె: నిజంగానా వినయ్! నేనంత అందంగా ఉందేదాన్నా?
బావమరిది: జీన్సుకే అందాన్నిచ్చే టీన్సులో, ట్రిమ్ గా, ఇంద్రుని నందన వనం విల్లాలో విరిసిన బోగెన్ విల్లాలా, నోరూరించే రసగుల్లాలా, ముళ్లపూడి రెంజెళ్ల సీతకు బొమ్మేసిన బాపూలా, ఉండేదానివి. (బావతో) బావా ఎలాగుంది నా కవిత్వం?
బావ: కపిత్వంలాగ ఉంది. బొమ్మేసిన బాపులాగ కాదు. బాపు వేసిన బొమ్మలాగ అనాలి.
ఆమె: (కిలకిలా నవ్వి) నో… నో… నో! వినయ్ అలాగే అనేవాడు. ఆ వర్ణనకి నేను నవ్వితే
బావమరిది: (ఆమె ముందు దోసిలి పట్టి) ఎన్ని ముత్యాలు రాలాయో …
ఆమె: …అనేవాడు! ఆ వర్ణన శృతి మించి నేను సిగ్గుపడితే…
బావమరిది: అమ్మబాబోయ్! ఎన్ని కెంపులు విరిసాయో!
ఆమె: అనేవాడు! అంతే కాదు, ఆ ముత్యాలు, కెంపులు దండ గ్రుచ్చి నా మెడలో వేస్తాననేవాడు!
స్వామి: వండర్‌ఫుల్! గుండేల్లో జానీవాకర్ మత్తు, కళ్ల ముందు పసందైన గమ్మత్తు! ఈ అమావాస్య దీపావళి అమావాస్యలాగ కలర్ ఫుల్ గా ఉంది!
ఆమె: స్వామీజీ! మీకేమయింది
బావ: స్వామీజీ జపం మత్తులో ఆత్మని మేల్కొలిపి, మాట్లాడుతున్నారు! మరేం ఫరవాలేదు, మీరు కానివ్వండి! (అని—- బావమరిది, ఆమెల సంభాషణ ఇంకా జరుగుతూ ఉండగా, చల్లగా మిడిల్ వింగ్ లోకి స్వామీజీ వచ్చిన దారి గుండా, జారుకొంటాడు.)
ఆమె: నేను, వినయ్ పరస్పరం దగ్గరై ప్రేమించుకొన్నాం! మా ప్రేమ…
బావమరిది: మూడు పువ్వులు, ఆరు కాయలవడం, మామా తల్లి తండ్రులకి ఇష్టం లేకపోయింది.
ఆమె: అమ్మ నన్ను గదిలో పెట్టి మూడు రోజుల పాటు తాళం వేసింది.
బావమరిది: నాన్న నన్ను టూర్ నెపంతో, పదిహేను రోజుల పాటు బయటికి పంపేసాడు. తిరిగి వచ్చేసరికి…
ఆమె: అంతా తారుమారు అయింది! నన్ను చదువు మాన్పించేసారు!
బావమరిది: నా చదువు మరో ఊరి కాలేజీకి బదిలీ అయింది.
ఆమె: కాని మా గుండెల్లో ప్రేమ గుడి కట్టుకొని పదిలమయింది.
బావమరిది: ఒకరి నొకరం విడిచి ఉండలేమని, ఒకరి కోసమే ఒకరని నిర్ణయానికి వచ్చాం! పరస్పరం ఉత్తరాలు వ్రాసుకొని ధైర్యం చెప్పుకొన్నాం.
ఆమె: వినయ్ రహస్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు! చివరకి బాబా సమాధికి దగ్గరగా ఉన్న పట్నంలో, చిన్న పని దొరికింది!
బావమరిది: పారిపోదామనుకొన్న పక్షికి రెక్కలు వచ్చినట్లయింది!
ఆమె: ఇద్దరం కలిసి రైలెక్కి, వచ్చేసాం! ఇల్లు దొరకక లాడ్జిలో బస చేసాం! వినయ్ పనిలో చేరాడు, వెల్డింగు పని చేసేవాఢు. ఉదయం పది నుండి, రాత్రి ఆరు వరకు పని చేసేవాడు! ఆరునుండి రాత్రి పదివరకు,
బావమరిది: మేమిద్దరం ప్రేమ పక్షుల్లా ఊరంతా విహరించేవాళ్లం!
ఆమె: ఒక రోజు ఈ సమాధి ప్రఖ్యాతి విని, ఇక్కడికి వచ్చాం. కాగితం మీద మా కోరిక వ్రాసి, సంతకాలు చేసాం, అడ్రెస్సు లాడ్జిదే ఇచ్చాం! తరవాత ఇక్కడికి మూడు మైళ్ల దూరంలో ఉన్న మంజీరా నదీ తీరానికి వెళ్దామని వినయ్ పట్టు బట్టాడు. నదీ స్నానం చెయ్యక తప్పదన్నాడు. కాదనటానకి-
బావమరిది: నీ మనస్సు వ్యతిరేకిస్తే కదా! కాకపోతే చీకటి అయిపోతుందని ఒకసారి, నలుగురూ చూస్తారని ఒకసారి సొడ్డు పెట్టావు. నీ సొడ్లన్నీ నది ఒడ్డున పెట్టుకోమనీ, చెయ్యి పట్టి లాక్కెళ్లాను.
ఆమె: దార్లో…
బావమరిది: వేరు శనక్కాయలు కొన్నాను.
ఆమె: కాదు వినయ్! న్యూస్ పేపర్ కుర్రాడు వెంట పడితే వాడి బాధ పడలేక పేపరు కొన్నావు. కాని చదవనిస్తేనా! కట్ట గట్టి సంచీలో దోపావు! తరువాత నదీ తీరం చేరుకొన్నాం. నే నను కొన్నట్లు అక్కడ జన సమ్మర్థం లేదు.
బావమరిది: మా ఇద్దరికీ చక్కని ఏకాంతం దొరికింది. నదిలో స్నానం చేసి ఇసక తిన్నెల మీద దొర్లాం. దొర్లివెళ్లి, మళ్లీ స్నానాలు చేసాం. జలక్రీడ లాడుకొన్నాక, ఒడ్డుకొచ్చి, ఒకరి తడి, మరొకరు తుడుచుకొన్నాం. పొడి బట్టలు కట్టుకొన్నాం.
ఆమె: అయినా మంజీరని విడిచి పెట్ట బుద్ధి పుట్టలేదు! ఒకరినొకరం ఆనుకొని కాసేపు సేదతీర్చుకొన్నాం. అప్పుడే వినయ్ సంచీలోంచి పేపరు తీసాడు. విప్పి చూస్తే, మా ఫొటోలు అందులో ఉన్నాయి!
బావమరిది: కనబడుట లేదు, అన్న కాలం క్రింద! ఆచూకీ పట్టి ఇచ్చిన వారికి బహుమతి కూడా ప్రకటింపబడింది!
ఆమె: అది చూసేసరికి, నా కోసం వెతుకుతున్న అమ్మ జాలి కళ్లు గుర్తుకొచ్చి , నాకు కన్నీళ్లాగలేదు!
బావమరిది: నాన్న మీసాలు గుర్తొచ్చి నా వెన్ను జలదరించింది
ఆమె: సరిగా అదే సమయానికి…
బావమరిది: అదే సమయానికి…
ఆమె:: అదే సమయానికి…
బావమరిది:: అవును, అదే సమయానికి…
ఆమె:: అదే సమయానికి…
బావమరిది: అవునవును, అదే సమయానికి… (అదే సమయానికి, ఇద్దరి మీద కెమేరా ఫ్లేష్ పడుతుంది. స్వామి ఇద్దరికీ ఎదురుగా కాస్త దూరంలో, ఉత్తుత్తి కెమేరా పట్టుకొని ఫొటో తీసిన భంగిమలో నిలబడతాడు.)
స్వామి: (క్లిక్ చేసి) అదే సమయానికి, నా కెమేరా మీ మీదకి మెరుపులా మెరిసి, ముద్దరేసింది! మీ ఇద్దరి మైకం ఇరిగిపోక ముందే, మరి నాలుగయిదు పుటోలు లాగించేసిసాను!
ఆమె: నాకూ, వినయ్ కీ ఆ ఫోటోగ్రాఫర్ మీద కోపం వచ్చేసింది. వినయ్ గభాలున వెళ్లి, అతని కాలర్ పట్టుకోబోయేడు. (బావమరిది వెళ్లి స్వామి కాలర్ పట్టుకొంటాడు.)
బావమరిది: స్టుపిడ్! మేనర్స్ లెస్స క్రీచర్! మా పొటోలు ఎందుకు తీసావు? తీయడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు?
స్వామి: ఏటన్నావు, పర్ మిసనా! పుటోలు తీసేవోడి కెమేరా ఇంకో నాకొడుకు మాట ఇంటాదేటి? ఈ ఊరు, ఏరు, ఆకాసం, సుక్కలు, సక్కటి పిట్టలు, సూపు కానినంత మేర పుటోలు తీసెయ్యడమే దాని పని! దాని పని దాన్దే! దాని కంటికి మీరిద్దరూ ఒకరి కౌగలింతలో మరొకరు సక్కగా గువ్వల జంటలా కనిపించారు, అంతే! దానంతటదే మెరిసి పోనాది!
బావమరిది: హు! దానంతట అదే క్లిక్ మందా? డామిట్! నీకూ నీ కెమేరాకీ ఇవాళ గుణపాఠం చెప్తాను. (బావమరిది స్వామి మీదకి కలబడతాఢు)
స్వామి: ఆగాగు! తొందర పడిపోమాకు! పోలీసోళ్లని పిల్సీగలను!.
బావమరిది: పిల్చుకోరా! నా కెందుకు భయం! తప్పు చేసింది నువ్వు!
స్వామి: అవునవును, తప్పు సేసేన నాకొడుకుని నేనే! మైనారిటీ తీరని బుల్లిని లేవ దీసుకు వచ్చింది నేనే! పేమ పాటాలు తల కెక్కించి, పబ్లిక్ ప్లేసులో కోకిప్పించి తానమాడించిందీ తైతెక్కలాడించిందీ నేనే! పిల్సీమంటావా పులీసోల్ని? నేక నువ్వే పిలుస్తావా? (బావమరిది రెండడుగులు వెనక్కి వేస్తాడు. ఆమె బావమరిది దగ్గరగా వచ్చి, భుజం మీద చెయ్యి వేస్తుంది.)
ఆమె: వినండి, ఫొటోగ్రాఫర్ గారూ! వినయ్ నన్ను లేవ దీసుకొని రాలేదు! మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్న దంపతులం! నాకు మైనారిటీ తీరిందీ లేనిదీ, చెప్పగలిగేది నేనూ, నా తల్లీ మాత్రమే! మీరూ, మీ కెమేరా కాదు. ఇకపోతే ఏకాంతంలో దంపతుల రాసలీలలు, చూసిన వాళ్లది, ఫొటోలు తీసిన వాళ్లదే తప్పు! పిలవండి పోలీసుల్ని, జవాబు నేను చెప్తాను.
స్వామి: సెహబాస్! సానా బాగుంది! పేమించి పెళ్లి సేసుకొన్నా వన్నమాట! ఏది సిట్టీ! నీ తాళిబొట్టేదమ్మా? (ఆమె గభాలున మెడ తడుముకొంటుంది!)
ఆమె: ఇటిజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్! మాది ఏ సూత్రాలకీ కట్టుబడని పెళ్లి
స్వామి: ఏటన్నావు సిట్టీ! బిజెనెస్ అని కదూ! అవునవును, అందుకే మీ పుటోలు లాగించేసినాను! సమాధి దగ్గర, మిమ్మల్ని సూసినప్పుడే నా కనుమానం వచ్చేసినాది! పేపర్లో పడ్డ పారిపోయినోళ్ల బాపతని!. వెంటనే కెమేరా లోడుసేసి మీ ఎంట పడ్డాను. పడ్డందుకు బుల్లే! మంచి సీన్లే లాగించేసినాను. పులీసోళ్లని పిలుస్తే నట్టబోయేది ఎవురో, మీకీ పాటికి ఎరికయి పోనాదను కొంటాను! సూడమ్మాయ్, ఇదుగో అబ్బాయ్! నువ్వు కూడా ఇనికో! పులీసోళ్లకి గాని, మీ అమ్మానాన్నలకి గాని నేను నేను మీ ఆసూకీ ఇవ్వను!
ఇద్దరూ: నిజంగానా సార్!
స్వామి: అవును, ఇప్పుడు తీసిన పుటోలు కూడా, మీకే ఇచ్చేస్తాను సక్కగా ఆల్బంలో దాసుకోడానికి!
ఆమె: రియల్లీ! మీ రెంత మంచివారండి!
బావమరిది: గురూగారూ! మీలో చాల సేన్సాఫ్ హ్యుమర్ ఉందండి!
స్వామి:అయితే నాకు కొంత సొమ్ము అవసరం!
బావమరిది: ఫొటోలు తీసినందుకేనా? తప్పకుండా! (పర్సు తీసి) ఎంతవుంది గురూ?!
స్వామి: ఇప్పటి కయిదొందలు సాలు!
ఇద్దరూ: ఏమిటీ! అయిదు వందలే!?
స్వామి: అవును, తొలికిస్తీ అయిదొందలు సాలు! బొమ్మలెంటనే ఇచ్చేస్తాను. ఇద్దరూ బసలో సేరి, ఆయిగా ఉండొచ్చు! ఇద్దరూ పేమించుకొంటూ పేమని నంజుకొంటూ, తియ్యగా, కాలం గడిపెయ్యవచ్చు! పెతీ నెలా నాకు వంద రూపాయలు పడేస్తే చాలు! అయి! మరెందుకూ కాదు, నెగిటెవ్ లు నా కాడ ఉన్నందుకు!
బావమరిది: యూ ఛీట్! డర్టీ బ్లాక్ మెయిలర్!
స్వామి: ఎలా పిల్సినా ఏటీ అనుకోను! నాకు కావల్సింది సొమ్ము! అదిప్పుడు నీ కాడ నేదు గనుక రేపు లాడ్జీ కొచ్చి తీసుకొంటాను. గూడొదిలి పారొచ్చిన పిట్టలు ఇంకెక్కడికో ఎగిరిపోతాయనే బయం నాకు నేదు వస్తాను, గుడ్ నైటు! (స్వామి తన స్థానానికి వచ్చి కూర్చొంటాడు)
ఆమె: వినయ్! ఇప్పుడేం చేద్దాం?
బావమరిది: రేపు అయిదువందలు ఫస్ట్ ఇన్ స్టాలుమెంటు ఇచ్చేద్దాం ఆ తరువాత నెలనెలా వంద!
ఆమె: వద్దు, వినయ్! నీ కొచ్చే జీతం మూడువందలు. నెలకి వంద చొప్పున ఖర్చు పెడితే, సంవత్సరానికి బోల్డు చీరలు వస్తాయి!
బావమరిది: రెండేళ్ల పాటు దాచుకొంటే నీ మెడలోకి నెక్లెసు వస్తుంది.
ఆమె: (దగ్గరగా జరిగి) నిజమా, వినయ్! తప్పక వస్తుందంటావా?
బావమరిది: ఖచ్చితంగా రాదు! ఎందుకంటే యీ చీరలు, నెక్లెసులూ వాడి పెళ్లాం ఒంటి మీదకి వెళ్తాయి గనుక!
ఆమె: ఒక పని చేస్తే?
బావమరిది: ఏమిటది?
ఆమె: తెల్లారేలోగా మరో ఊరు పారిపోదాం.
బావమరిది: ఈ ఊర్లో మూడొందలొచ్చే ఉద్యోగం ఉంది. ఇంకో చోట అది ఉంఢదు! ఉత్త గాలి భోంచేసి పాముల్లా పెనవేసుకొని పడుకోవాలి!
ఆమె: ఛీ! ఫో! వినయ్! నే నెంతో సీరియస్ గా ఆలోచిస్తుంటే నీకు ఎగతాళిగా ఉంది.
బావమరిది: నేను నీ కన్న సీరియస్ గా ప్రాక్టికల్ గా ఆలోచుస్తున్నాను, తెల్సా?
ఆమె: సరే! ఏం చేద్దామో చెప్పు!
బావమరిది: -ఈ ఊరొదిలి పారిపోదాం!
ఆమె: పాముల్లా బ్రతకడానికా? ఛీ! నేను రాను! (ఆమె గడ్డం పట్టుకొని, వినయ్ బ్రతిమాలే ధోరణిలో అంటాడు.)
బావమరిది: నే చెప్పింది వింటావా?
ఆమె: చెప్పు!
బావమరిది: మనూరు పారిపోదాం! నువ్వు మీ అమ్మ దగ్గరకి. నేను నా నాన్న దగ్గరకి!
ఆమె: అమ్మ చీపురుకట్ట వీపు మీద తిరగేస్తుంది!
బావమరిది: పర్లేదు! ముందు కొట్టినా తరువాత కాపడం పెట్టి కనికరిస్తుంది!
ఆమె: నిజమే! మా అమ్మకి నేనంటే ప్రేమే! అసలు నన్నొదిలి ఇన్నాళ్లు ఎలా ఉందో!
బావమరిది: నువ్వెలా ఉన్నావు?
ఆమె: – నీతో కాబట్టి ఉన్నాను.
బావమరిది: (నవ్వి) అందుకే ఆ విషయం అర్థం చేసుకొని ఎలాగూ పారిపోయిన పక్షులం గనుక నిన్ను నా చేతిలో పెడుతుంది!
ఆమె: మా అమ్మ కెప్పుడూ పేద్ద అభ్యంతరం లేదు, చిక్కంతా మీ నాన్నతోనే!!
బావమరిది: ఫరవాలేదు, హాకీ స్టిక్కు దెబ్బలు నా వీపు భరించ గలిగితే చాలు! అంతా సర్దు కుంటుంది. (ఇద్దరూ చేతులు పట్టుకొని లేచి, నవ్వుకొంటారు)
ఇద్దరూ: పద అయితే! మన ఊరు వెళ్లి పోదాం! (నవ్వుకొంటూ ఒక వింగునుంచి మరొక వింగు వరకు పచార్లు చేస్తారు) (ఆమె ఒక వింగులోకి, బావమరిది మరొక వింగులోకి, తప్పుకొంటారు (ప్రవేశం బావ మిడిల్ వింగు లోంచి)
స్వామి: ఏరీ యీ సిలకా గోరింకలు! ఏడికి పోనారో తర్వాతేటయిందో! సెప్పినారు కాదు?
బావ: ఇంకేటవుతాది! సిలక ఆల్లమ్మ చేతి సీపురు దెబ్బలు తిని, మరో ఊరి సుట్టపోళ్లింటికి సేరుంటుంది! ఆ సుట్టం దాన్నింకా చదివిస్తూ, సంబంధాలు సూసి ఉంటాడు!
స్వామి: సెటిల్ అయిపోయిందంటావా?!
బావ: పెళ్లెలాగవుద్ది! పారోపోయిన బాపతు కద! అందుచేత సుబ్బరంగా సదూకొంటూ సకిరీలో సేరుంటాది!
స్వామి: అంతేనంటావా? మరా గోరింక సంగతేటి?
బావ: ఆడూ అంతే! ఆడి బాబు చేతి బడితె దేబ్బలు తినలేక సదూకోడానికి, పోయుంటాడు, ఇలాంటి పిట్టల ఎవ్వారాలింతే! (ప్రవేశం—- ఆమె)
స్వామి: ఎక్కడికి వెళ్లావమ్మా, తర్వాత ఏమయింది?
ఆమె: మంచి నీళ్లు త్రాగి వచ్చాను. తరువాత ఏముంది! నేనీ సమాధికి దగ్గరలో ఉన్న పట్నంలోనే లెక్చరర్ గా ఉద్యోగంలోకి చేరాను. పెళ్లి మాట ఎత్తకూఢనే అనుకొన్నాను. కాని ఒక రోజు కాలేజి లైబ్రరీలో నా ఋతురాణి పుస్తకానికి బదులు, గంధర్వ రాజు అన్న పుస్తకం తెచ్చాను. తెరచి చూద్దును కదా, అందులో “ఋతురాణీ!” అంటూ మొదలు పెట్టి వ్రాసిన-
బావ: ప్రేమ లేఖ ఉంది!
ఆమె: మీ కెలా తెలుసు?
బావ: తెలుసు, అది వ్రాసింది నేనే గనుక!
ఆమె: అయితే పుస్తకాలు మార్చిన పెద్దమనిషి మీరే నన్న మాట!
బావ: అవును నా పేరు గోపాలకృష్ణ! కాలేజీ క్రొత్త లెక్చరర్ని.
ఆమె: మీలో ఇంకా స్టూడెంటు లక్షణాలు పోలేదు! ఇలా ప్రేమలేఖ వ్రాయడం తప్పు కాదా?
బావ: కాదు, ప్రేమ ప్రకటన తప్పు కానే కాదు. మిమ్మల్ని చూడగానే, నా హృదయ నందనంలో వసంతాగమనం అయింది! వసంతం ఋతువుల రాణి! అందుకే నా ఋతురాణికి ప్రేమలేఖ వ్రాసాను. మీ చేతికి ఇద్దామనే వచ్చాను. కాని లైబ్రరీలో మీరు ఋతురాణి పుస్తకాన్నే ఎన్నుకోవడంతో నా దగ్గరున్న గంధర్వరాజు పుస్తకంలో ప్రేమలేఖని పెట్టి, వాటిని మార్చేసాను. ఇదుగో మీ ఋతురాణిని తీసుకొని నా గంధర్వరాజుని అందుకోండి.
ఆమె: చూడండి! ప్రేమలేఖ చూసి ఉప్పొంగిపోయి, మీ ఒళ్లో వాలి పోవడానికి నే నింకా చిన్నపిల్లని కాను. లేఖ తీసుకొని, మీ హృదయాన్ని స్పందింపజేసే మరో ఋతురాణినికి ఇవ్వండి
బావ: కోపగించుకోకండి ఋతురాణీ! అలాగే వెళ్తాను. నా హృదయంలో వసంతాగమనం మీ దర్శనంతోనే అయింది! మీరు తిరస్కరించాక దానికి గ్రీష్మమే మిగుల్తుంది!…వస్తాను.
ఆమె: ఉండండి! ఏమన్నారు, నేను తిరస్కరిస్తే …?
బావ: నా హృదయంలో గ్రీష్మమే ప్రభవిస్తుంది!
ఆమె: అలాంటప్పుడు, నన్ను…
బావ: మంగళ సూత్రం కట్టి, ఇల్లాల్ని చేసుకోగలను.
ఆమె: నమ్మమంటారా?
బావ: సందేహించ వద్దంటాను!
ఆమె: అయితే అందుకోండి, మీ లేఖతో పాటు నా చేతిని కూడా
బావ: వద్దు, లేఖ మీ దగ్గరే ఉంచండి!పాణి గ్రహణం కూడ ఇప్పుడే వద్దు, ఆ శుభ సమయం నాడు, సూత్రబంధం వేసాకే, స్వీకరిస్తాను.!
ఆమె: థేంక్స్! గంధర్వరాజా!
బావ: కాదు, ఋతురాణీ! థేంక్స్ చెప్పాల్సింది నేను వెళ్లొస్తాను, సెలవా మరి!? (బావ లెఫ్టు వింగులోకి వెళ్లిపోతాడు.)
ఆమె: మా దాంపత్యం ఋతురాణి గంధర్వరాజుల కలయిక లాగే భవ్యమై, దివ్యమై నడుస్తూండగా, వారం రోజుల క్రిందట, గతంలోని కార్చిచ్చు, మ్రుచ్చులా నా గడప త్రొక్కి, తలుపు తట్టింది! (తలుపు కొట్టిన చప్పుఢు)
ఆమె: ఎవరది? … (తలుపు చప్పుడు)
ఆమె: ఎవరు, ఎవరది? … (తలుపు చప్పుడు)
ఆమె: ఎవరంటే, పలకరేం? … (తలుపు చప్పుడు)
ఆమె: ఎవరో, ఏమిటో? … (తలుపు చప్పుడు)
ఆమె: తలుపు తీసే ఉంది, రండి! … (తలుపు చప్పుడు)
ఆమె: లోపలికి రండి. … (తలుపు చప్పుడు)
ఆమె: అయ్యా! మహాశయా! స్వామీ! తలుపు తీసే ఉంది, లోపలికి దయచేయండి! (స్వామి లేచి ఆమెకి ఎదురుగా వస్తాడు)
స్వామి: ఇదుగో సిట్టీ! వచ్చాను, నన్ను పోల్సినావా?
ఆమె: ఎవరండీ మీరు?
స్వామి: నేనే! నీ గతాన్ని! అవున్లే! ఇయ్యాల్టి పైరు పైలా పచ్చీసులాగుంటే, నిన్నటి బీడు ఎవరికి యాదుంటది?!
ఆమె: ఏమిటా పిచ్చి వాగుడు?
స్వామి: పిచ్చోన్నే! యాపారంలో నెత్తిన కొంగేసుకు పోయినోడికి పిచ్చి కాక ఇంకేమిటి మిగుల్తాది?
ఆమె: అంటే, నువ్వు?!
స్వామి: నిన్నూ, నీ గోరింకనీ, పుటోలు తీసినోన్నే సిలకా!
ఆమె: ఎందుకొచ్చావు?
స్వామి:ఆ రోజు మీరిద్దరూ నా కిస్తీ సెల్లుకట్టకుండానే ఎల్లిపోనారు! దాని వడ్డీ విప్పుడెంతయిందో తెలుసా? అసలుకి నాలుగింతలయింది. వసూలు సేసుకొందారని!
ఆమె: అంటే?!
స్వామి: అచ్చరాల రెండువేల అయిదొందలయింది! సెల్లు కట్టేస్తే,
ఆమె: ఇవ్వక పోతే?
స్వామి: వారం రోజుల తరువాత కేంపు నుంచి వచ్చే నీ మొగుడి సేతికి నీ బొమ్మలిచ్చేసి, ఆడి దగ్గరే వసూలు సేసుకొంటాను!
ఆమె: అంటే గడువు…
స్వామి: వారం రోజులు.
ఆమె: ఈ లోగా నేనే ఇచ్చేస్తే!
స్వామి: పుటోలు నీకే ఇచ్చేస్తాను, మాటంటే మాటే!
ఆమె: నెగిటివ్ లు?
స్వామి: మరో రెండువేలకి అయు కూడా ఇచ్చేస్తాను, అంతే కాదు, ఇంకో అయిదొందలకి , మీ సిలకా గోరింకలు సమాధి గూట్లో ఎట్టిన కోర్కెల కాగితం కూడా ఇచ్చేస్తాను.
ఆమె: కోర్కెల కాగితం ఏమిటి?
స్వామి: మర్సిపోనావా? బాబాగారి సమాధి గూట్లో మీ ఇద్దరూ సంతకాలు సేసి ఎట్టిన కాగితం!
ఆమె: అది నీ చేతికి ఎలా వచ్చింది?
స్వామి: ఆ కాయితాల్ని, పూజా కమిటీ వోళ్లు, ఫైల్లో దాస్తారు. అందులోంచి తీసేసాను., అదే దొంగలించాను.
ఆమె: … అంటే, నువ్వు మామూలు మనిషివి కాదు, ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్ వి , క్రిమినల్ వి!
స్వామి: ఎలాగైనా పిలు, నానేటీ అనుకోను! మొత్తం అయిదు వేలకి నీ గత సెరిత్రని, రుజువుల్లేకుండా అమ్మేస్తాను.
ఆమె: వినయ్ ఎక్కడున్నాడో తెలుసా?
స్వామి: తెల్దు.
ఆమె: సగం ఢబ్బులు అతని దగ్గర వసూలు చెయ్యలేవూ?
స్వామి: ఆడెందుకిస్తాడు?
ఆమె: ఏం?!
స్వామి: ఎంత పిచ్చి సన్నాసివి! మొగోడి కథలోని నిన్నటి అమ్మాయి, ఇయ్యాల్టి బ్రతుకుకి ఎసరెట్ట లేదు.
ఆమె: నా గతం కూడా వర్తమానాన్ని కెలకలేదు!
స్వామి: నీ కంత దమ్ముంటే సరే! మరో వారం రోజుల పాటు ఆయిగా, రుతురానిలాగ కాలం గడుపు.
ఆమె: ఆగు! నీకీ ఋతురాణి పేరెలా తెలుసు?
స్వామి: ఎందుకు తెల్వదు? నీ బంగళా పేరు రుతురాని అని రాసుంటే!
ఆమె: ఓహ్! అదా సంగతి! ఇంకేమో అనుకొన్నాను. అది మా ఆయన ఇంటికి పెట్టుకొన్న పేరు.
స్వామి: ఇంటి పేరో, ఇల్లాలి పేరో నా కెందుకు? నువ్వు పచ్చగా పదికాలాల పాటు రుతురానిలాగ గడపాలంటే …
ఆమె: ఊ! గడపాలంటే?
స్వామి: మల్లీ వారం రోజులకి ఇదే సమాయానికి, అయిదువేలు రెడీ సెయ్యి! (స్వామి తిరిగి తన స్థానానికి వెళ్లబోతాడు. బావ, బావమరిది చెరో వింగు లోంచి ప్రవేసిస్తారు)
ఆమె: ఆగండి! స్వామీజీ! ఇదీ నా కథ! రేపే, ఆ పశువు ఆ బ్లాక్ మెయిలర్ వచ్చే రోజు! నా గంధర్వరాజు రెక్కలు కట్థుకొని వాలేది కూడా రేపటి రోజే! రేపు… రేపు… రేపు చెప్పండి స్వామీజీ రేపు ఏమవుతుందో! చెప్పండి నేనేం చెయ్యాలో?
స్వామి: చూడమ్మా! నువ్వూ, నీ భర్త ఇద్దరూ లెక్చరెర్లు! మీకో కారు, ఇల్లు, బేంక్ బేలన్సు, అన్నీ ఉన్నాయి. ఆ పశువుకి అయిదు వేలు పడేస్తే, హాయిగా నీ గంధర్వరాజ్యాన్ని ఏలుకోవచ్చు కదా?
ఆమె: నిజమే స్వామీజీ! అయిదువేలు నా కొక లెక్క కాదు. ఇచ్చి ముప్పు తప్పించుకోగలను. కాని, మరో రోజు మళ్లీ వాడొచ్చి ఇంకేవేవే కాపీలు, చూసించి బేరం పెడ్తే! దీనికి అంతు ఎక్కడ ఉంది. స్వామీజీ!
బావ: మేడమ్! మీ సమస్యకి శాశ్వత పరిష్కారం ఒక్కటే ఉంది.
ఆమె: ఏమిటది?
బావ: పదివేల రూపాయలు తెచ్చి, ఈ సమాధి గూట్లో పెట్టండి.
బావమరిది: ఏమిటి బావా! నీ చచ్చు సలహా? గూట్లో పెట్టిన డబ్బు బ్లాక్ మెయిలర్ కి ఎలా అందుతుంది?
బావ: గూట్లో పెట్టిన కోర్కెల కాగితం అతని కెలా అందింది?
బావమరిది: అది రికార్డ్ ల లోంచి దొంగలించ బడింది.
బావ: ఇదీ అలాగే చేరుతుంది. నువ్వూరుకో బామ్మరిదీ! మేడమ్! మీరు బాగా ఆలోచించండి. గతంలోని మీ కథని, మీరిచ్చిన సూచనలని బట్టి, మేము ముగ్గురం పొడిగించాం. నేను నా బావమరిది ఆ పాత్రలలో చెప్పినవి కేవలం ప్రేమ డైలాగులు. కాని స్వామీజీ చెప్పినవి బిజినెస్ డైలాగులు!ఆ విషయాలు అతనంత ఖచ్చితంగా ఎలా చెప్ప గలిగాడు? ఆలోచించండి మేడం! బాగా ఆలోచించండి!
ఆమె: స్వామీజీ తన మహిమతో జరిగిన సంఘటనలని దివ్యదృష్టితో చూసి చెప్పగలిగారు.
బావ: పొరపాటు మేడం! మీ కథ రెండు సార్లు ఆగినప్పుడు అంటే, మీ కథలోని బ్లాక్ మెయిలర్ రెండు సార్లు ప్రవేశించి నప్పుడు, మీ నుండి ఎలాంటి హింట్ లేకుండా, ఈ స్వామీజీ తనంత తానుగా ప్రవేశించాడు. లెక్కలు ఉన్నదున్నట్లు చెప్పగలిగాడు అవునా?
ఆమె: అవును!
బావ: ఈ సంఘటన కాక, ఇంకేదైనా అబినయించి చెప్పమనండి! అతని కున్న మహిమలు బయటపడుతాయి!
ఆమె: ప్రొఫెసర్! వాట్ డు యూ మీన్?
బావ: ఆ బ్లాక్ మెయిలరు, ఈ స్వామీజీ ఇద్దరూ ఒకే వ్యక్తి!
ఆమె: స్వామీజీ! మీరు మీరు దీనికి జవాబు చెప్పరేం?
స్వామి:: ఈ సమాధి క్రింద అండర్ గ్రౌండ్ ఉందనీ, గూట్లో పేరిస్కోపు ఉందనీ, అన్న మనిషి, నన్ను బ్లాక్ మెయిలర్ అనడంలో ఆశ్చర్యమేముంది?! నాస్తికుడి నాలికకి, పిచ్చివాడి చేతి రాయికి ఆడ్డేముంది? చూడమ్మా! నీ కథని పొడిగించిన వీళ్లిద్దరిలో ఈ బావమరిది నీ మాజీ ప్రియుడనీ, ఈ ప్రొఫెసర్ నీ భర్త అనీ నేనంటాను, దానికి నువ్వేమంటావు?
ఆమె: మీ మాటల్లో కొంత నిజం ఉందని ఒప్పుకొంటాను. ఈ ప్రొఫెసర్ గోపాలకృష్ణే నా గంధర్వరాజు! నా భర్త! కాని వినయ్ మీరు అనుకొన్నట్లు నా మాజీ ప్రియుడు కాదు, నా అన్నయ్య!!
స్వామి: అన్నయ్యా??!!
బావమరిది: అవును అప్పలసామీ! ఆమె అదే రాణి, నా చెల్లెలు!
స్వామి: మరయితే ఈమెతో నువ్వు పారిపోయి, లాడ్జిలో కాపురం పెట్టింది?
బావమరిది: నీ మెదడు అంతే ఊహించింది అప్పలసామీ! రాణి నా చెల్లెలే! మా ఇద్దరికి తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే! మా నాన్న ఆమె తల్లిని రహస్యంగా పెళ్లాడి, సెకండ్ ఫేమిలీ పెట్టారు. మా ఇద్దరికీ ఈ రహస్యం తెలిసే నాటికి, నా తల్లి చనిపోయింది. మేమిద్దరం కలిసి రాణి తల్లిని ఇంటికి తెచ్చి, అమ్మ స్థానంలో నిలబెట్టమని నాన్నగారిని అడిగాం. తన జమీందారీ పరువు పోతుందని నాన్నగారు అందుకు అంగీకరించ లేదు.
ఆమె: నాన్నగారిని ఒప్పించేందుకే నేను, వినయ్ ఇల్లొదిలి పారిపోయాం! లాడ్జిలో మకాం పెట్టాం! వినయ్ ఉద్యోగం చెయ్యడం, అవసరమయితే కొన్ని నెలల పాటు ధైర్యంగా బ్రతకానికే! చివరకి అమ్మ నాన్న కలిసి పత్రికలో ప్రకటన ఇచ్చారు. మేము దాన్ని చూసే లోపల…
స్వామి: … నేను దాన్ని ముందుగా చూసాను! అది సరే! సమాధి గూటిలో మీరు వ్రాసిన కోర్కెల కాగితం?!
బావమరిది: అందులో తప్పేముంది? అప్పలసామీ! మేమిద్దరం ఒక ఇంటివార మవాలని అందులో రాసాం! అమ్మానాన్న ఒకే చోట ఉంటేనే కాదా అది సాధ్య పడేది!
బావ:: ఇప్పుడర్థమయిందా అప్పలసామీ! నీ బ్లాక్ మెయిల్ ఎందుకు ఫెయిలయిందో?
స్వామి: ఓస్! నా సేత నిజం సెప్పించడానికి ఇంత తోలుబొమ్మలాట ఎందుకంట? రేపు సందె కాడ డబ్బులొట్టు కెళ్లడానికి వచ్చినప్పుడే సెప్పొచ్చు కదా?
బావమరిది: అద్గదీ! ఇప్పుడూ అసలు అప్పలసామి అవతారం ఎత్తావ్! డబ్బు కోసం నువ్వే వస్తావన్న నమ్మకమేంటి? ఒక వేళ వచ్చి మా చేతికి చిక్కినా, ఈ మంత్రాల గుహకి నువ్వే మాయల మరాఠివి అన్న సంగతి పబ్లిక్కి ఎలా తెలుస్తుంది? అందుకే నేనూ, రాణీ కలిసి యీ పథకం వేసాం! బావకి ముందుగా ఈ సంగతి తెలియక పోయినా సమయాను కూలంగా సహకరించి నిన్ను సమాధి లోంచి బయటికి లాగి ముగ్గులోకి దింపాడు.
స్వామి: ఓసోస్! ఈ అప్పలసామి అవతారాల సంగతి నీ కెక్కడెరిక! మొసలిని పట్టుకోడానికి వల మొలకి సుట్టుకొని నీట్లో దూకి నట్టుంది నీ ఎవ్వారం! (స్వామి పగలబడి నవ్వి జేబులోంచి పిస్తోలు తీస్తాడు)
స్వామి: పిచ్చి సన్నాసుల్లారా! ఇప్పుఢీ మాయల మరాఠీ మీ యిద్దరినీ తాతల కాడి కంపి బాల నాగమ్మని సెరబట్ట బోతున్నాడు కాచుకోండి! (అంటూ బావమరిదిని షూట్ చేస్తాడు)
బావ: వినయ్! (బావ వినయ్ అంటూ ముందుకు దూకబోతాడు) (స్వామి బావని కూడా షూట్ చేస్తాఢు) (బావమరిది, బావ లిద్దరూ అమ్మా! అంటూ ఆర్తనాదం చేస్తూ, అక్కడి కక్కడే పడిపోతారు) (ఆమె గాభరాతో ఏవండీ అంటూ బావ దగ్గరకి వస్తుంది) (స్వామి ఆమె జడ దొరక పుచ్చుకొని గుంజుతాడు)
స్వామి: ఏమే సిట్టీ!! పాసిక లెయ్యడంలో గట్టిదానివే! ఇంకెక్కడికి పోతావ్? నీ తోడు, నీ మొగుడు ఇద్దరూ నాకు ఇస్కీతో అమావాస తర్పణం సేసి సొరగానికి ఎల్లిపోనారు! నువ్వు నీ అందాన్ని నాకు విందు సేసి ఆళ్లని కల్సుకొందువు గానిలే! రా! రాయే! (అంటూ ఆమెని సమాధి మీద పడుకోబెట్టి ఒక చేతితో పిస్తోలు పట్టుకుని, రెండో చేత్తో విస్కీ సీసాని బద్దలు కొట్ఠి, బద్దలయిన ఆ బాటిల్ నెక్కుతో ఆమెని బెదిరిస్తాఢు)
స్వామి: ఈ ఇరిగిన గాజు పెంకుని సూసావా , ఎంత పదునుగుందో!! నీ మెత్తని కండల్ని, దీంతో సీల్సి, నంజుకుంటానే! నన్ను పట్టించాలని అనుకొన్నందుకు ఇదే నీకు పెతిఫలం!! (అంటూ బాటిల్ నెక్ ని ఆమె మీదకి మీద మీదకి తెస్తాడు) (అదే సమయంలో ఒక కెమేరా ఫ్లేష్ వాళ్ల పైన పడుతుంది)
ఆమె: గంధర్వరాజా! లే! ఈ దుర్మార్గుడు నిజంగానే దీన్ని నా గుండెల్లో దించేలాగ ఉన్నాడు!
బావ: (అదే పొజిషన్లో) వాడి చేతిలో పిస్తోలుండగా నన్నెలా లెమ్మంటావ్? ఋతురాణీ!? (స్వామి ఆశ్చర్యంతో బాటిల్ నెక్ ని క్రింద పడేస్తాడు)
స్వామి: ఏంటీ! నువ్వు సవ్వలేదా? ఈ పిస్తోలు… (అంటూ మళ్లీ షూట్ చెయ్యబోతాడు)
బావమరిది: అప్పలసామీ ఆగు! నీ పిస్తోలు నా చేతిలో ఉంది! నీ చేతిలోని నా పిస్తోలు అరుస్తుందే గాని కరవదు! దాన్ని క్రింద పడేసి చేతులు పైకెత్తి నిలబడు!! (స్వామి పిస్తోలు క్రింద పడేస్తాడు, ముగ్గురూ లేచి నిల్చొంటారు)
బావమరిది: ఇప్పుడు చెప్పు మొసలి వలలో పడిందా లేదా? (స్వామి మాట్లాడడు)
బావ: ప్రజల మనసులలోని అజ్ఞానమనే నీలినీడలని శాశ్వత మని భ్రమసి, భ్రమరించే నీ లాంటి చీకటి చకోరాలు ఎప్పుడూ దారుణంగా శిక్షింప బడుతూనే ఉంటారు.
బావమరిది: చీకటి చకోరాలంటే ఏమిటి బావా!
బావ: చకోరాలనేవి ఒక రకం పక్షులు! అవి వెన్నెల్లోనే విహరిస్తాయి! అలాగే చీకటిని ప్రేమించే పక్షులు లేకపోలేదు!
ఆమె: గబ్బిలాలు, గుడ్లగూబలూ అంతేనా?
బావ: అంతే! బామ్మరిదీ! ఇంక ఆలస్యం దేనికి? నీ బలగాన్ని పిలిచి అతన్ని అప్పగించు!
స్వామి: బలగమా!!
బావమరిది: అవును వాళ్లిద్దరూ లెక్చరర్లు అన్న సంగతి నీకు తెలుసు. నేనెవరో తెలియదు కదూ! విను, నేను హేతువాద క్రాంతి సంఘ అధ్యక్షున్ని! నా సంఘ సభ్యులు ఈ సమాధి చుట్టూ హంగ్రీ స్టోన్స్ లాగ కాచుకొని ఉన్నారు! ఇప్పుడు జరిగిన తతంగమంతా పొటోలు తీసారు, మాటలు రికార్డు చేసారు. నేను విజిల్ ఊదగానే వచ్చి నీ పని పడతారు. (అంటూ జేబులోంచి విజిల్ తీసి ఊదుతూ ఉండగా తెర పడుతుంది)
— శ్రీధర్, క్షీరగంగ బ్లాగు రచయిత
మధ్యలో స్వామివారు ఆమె గత చరిత్రను ఎలా చెప్పగలుగుతున్నారో అనుకున్నాను.
నాటిక చివరి దాకా చదివాకా అర్థమయింది!
చాలా బాగుంది.
బాగుంది.
good fine
Dear writer
really good …… i like the flow in this play. speed, continuity, economy of words and thoughts ….. ooh… good to have such a play.
poddu… really great …. encourage dramas, playlets…. because the only form in telugu literature that was overshadowed is drama. go to kannada… they like play / drama very much…
thank u very much for munching us with such a good play….
swarup
Okay. Not bad or boring
But needs patience to read it