కవికృతి-౫

కౌగిలించుకుందాం..రండి..!
అనుసృజన: పెరుగు.రామకృష్ణ
Source: M.V.Sathyanarayana poem “Let us embarrace”

కౌగిలించుకుందాం..రండి..!
కౌగిలింతలో ఎంత అందమైన పులకింత
అన్ని దిగుళ్ళను కరిగించే ఆహ్లాదపు గిలిగింత
విషాదవదనులైన ప్రేమికుల కు
స్నేహంచెదరిన స్నేహితులకు
కరడుకట్టిన శత్రువులకు
అసలు ఒకరికొకరు తెలీని
అపరిచితులకు మధ్య
దూర తీరాలని చెరిపేస్తుంది..
ఒక కౌగిలింత..

కౌగిలించుకుందాం..రండి..!
గాలి సైతం దూరలేన్తగా
బిగి కౌగిలిలో హత్తుకుందాం..
ఒకరిలోన్చిమరోకరిలోకి ప్రవహిద్దాం
మనసుల్ని ఏకం చేస్తూ
హృదయాల్ని ముడివేస్తూ
ఒకరిలో ఒకరుగా
ఒకే ఆత్మ సంతకం గా
మిగులుదాం..
మరెవ్వరూ విడదీయలేనంత గట్టిగా
కౌగిలించుకుందాం..రండి .!

కత్తి మహేష్:
Embrace కు తెలుగు పదం కౌగిలింత కాదండీ…హత్తుకోవడం.

పెరుగు రామకృష్ణ:
Ya..i know ..Its a transcreation poem.. హత్తుకోవడం కంటే ఇది బావుంటుందని. original writer also said its fine..

కత్తి మహేష్:
కనిపించిన అందరినీ “కౌగిలించుకుందాం..రా!” అంటే కొంచెం ఇబ్బందిగా ఉండదూ! కౌగిలి చాలావరకూ రొమాంటిక్ ఆలింగనానికి ప్రయోగిస్తాం. హత్తుకోవడం ఎలాంటి
ప్రేమనైనా తెలపడానికి. అందుకే కౌగిలికన్నా హత్తుకోవడం బెటరేమో అనిపించింది. Its OK.

పెరుగు రామకృష్ణ:
మహేష్ గారి సూచన మేరకు మార్చిరాసిన కవిత:

మనసారా హత్తుకుందాం రండి..!
మనసారా హత్తుకుందాం రండి ..!
సందిగ్దాలన్నిటినీ స్తబ్దం చేస్తూ..
విషాదవదనులైన ప్రేమికుల కు
స్నేహంచచెదరిన స్నేహితులకు
కరడుకట్టిన శత్రువులకు
అసలు ఒకరికొకరు తెలీని
అపరిచితులకు మధ్య
దూర తీరాలని చెరిపేస్తుంది..
ఒక కౌగిలింత..

హత్తుకుందాం ..రండి..!
గాలి సైతం దూరలేన్తగా
బిగి కౌగిలిలో హత్తుకుందాం..
ఒకరిలోన్చి మరోకరిలోకి ప్రవహిద్దాం
మనసుల్ని ఏకం చేస్తూ
హృదయాల్ని ముడివేస్తూ
ఒకరిలో ఒకరుగా
ఒకే ఆత్మ సంతకం గా
ప్రతిబింబిద్దాం..
మరెవ్వరూ విడదీయలేనంత గట్టిగా
మనసారా హత్తుకుందాం రండి…!

———–

గరికపాటి పవన్ కుమార్:
మూలానికి దగ్గరగా ఉన్నప్పుడే అనువాదం తన ధ్యేయాన్ని సాధిస్తుంది. ఈ కవిత మూలం నాకు రచయిత ద్వారా పంపిన ఇంగ్లీషు అని భావించి ఈ కింది విశ్లేషణ, అసలు మూలం ఇంగ్లీషు కాక వేరే భాష అయి ఉంటే కింది విశ్లేషణ వర్తించదు:

ఇంగ్లీషులోని మూలం:

Come on! Let us embrace
How beautiful is this embrace
It melts down
All embarrassments
Between estranged lovers,
Between broken friends
Between bitter enemies;
Why not?
Even between utter strangers

ఉరామరికగా తెలుగులో అర్థం:

రా కౌగిలిద్దాం!
ఎంత అందమైనదీ కౌగిలింత
కరగించును
కలతలన్ని
విడిపోయిన ప్రేమికుల మధ్య
చెదిరిన స్నేహితుల మధ్య
ఆగర్భ శత్రువుల మధ్య
ఎందుకు కాకూడదు?
పూర్తి అపరిచితుల మధ్యైనా?

పెరుగు రామకృష్ణ గారి అనువాదం:

మనసారా హత్తుకుందాం రండి ..!

మనసారా అనేది అనవసరమైన పదం, మూలం లో లేనిది, అనువాదంలో పాటించవలసిన నియమం: మూలంలో లేనిది ప్రవేశ పెట్టకూడదు, అందుకే అలస్తైర్ రీడ్ మాటల్లో, సఫల అనువాదకుడు కావడనికి నువు సన్యాసివైనా కావాలి లేదా మూఢమతివైనా (నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు – తమ్మినేని యదుకుల భూషణ్) . హత్తుకుందాం? కౌగిలింత (రామకృష్ణ గారు పాఠకుల వ్యాఖ్యల వల్ల మార్చారు) Embrace కు దగ్గరి తెలుగు పదం

సందిగ్దాలన్నిటినీ స్తబ్దం చేస్తూ..

ఈ లైను తప్పు అనువాదం

విశాదవదన్నులైన ప్రేమికుల కు

Estranged అంటే 1. separated and living apart from one’s spouse 2. no longer friendly; alienated ఇంకా కొన్ని అర్థాలు ఉండవచ్చు కానీ విషాద వదన్నులు మాత్రం కాదు

స్నేహంచేదరిన స్నేహితులకు

’కు’ కాదు, ’మధ్య’ అని ఉండాలి

కరడుకట్టిన శత్రువులకు
అసలు ఒకరికొకరు తెలీని
అపరిచితులకు మధ్య

ఒకరికొకరు తెలియకపోవడమే అపరిచితం – పునరావృత్తి అనవసరం

దూర తీరాలని చెరిపేస్తుంది..

మూలంలో లేనిది

ఒక కౌగిలింత..

ఒకచోట కౌగిలింత మరొక చోట హత్తుకోవడం – కౌగిలింత బాగుంది.

——————–

మౌన ఘోష
-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

మాస్టారి ప్రశ్నకు జవాబుగా
ఆ పిల్లాడు
మౌనంగా చేతుల్ని చాస్తాడు
పెదాల రేకులు విప్పలేని
వాడిన మొగ్గలాంటి –
చిరిగిన మేఘవస్త్రం మాటున
చిదిమిన అశృకణం లాంటి –
ఆ పసివాడు
రూళ్ళకర్రకు నిశ్శబ్దంగా అచేతుల్ని అప్పగిస్తాడు.
వాడి హోంవర్క్‌ పేజీల్నిండా
ఉపవాస రేఖాచిత్రాలే.
వాడి ఖాళీ పలకనిండా
కన్నీరంటిన ముంజేతిముద్రలే.
వాడి చూపుల్ని మీటితే చాలు
విషాద సంగీతపేటికలెన్నో విచ్చుకొంటాయి.
దారెంట నీరసం చెక్కిన మోకాటిగాయాల వెనక కొంతసేపు వాడు-
ఆకలిచిచ్చును దాచుకొంటాడు.
బడిముందు పిల్లల దవడకదలికల్లోని మర్మరధ్వనుల్లోంచి ఆ కల పచ్చిపుండై
పునరుద్భవిస్తే –
శిధిల వీణాతంత్రినిలా వణకిపోతాడు.
వాడెపుడూ-
మాస్టారి చూపుల్ని తడిజేసే
మంచు మేఘంలా వుంటాడు.
చదువులతల్లి కనుకొలుకుల్లోంచి జారే
కాటుకంటిన విషాదబిందువులా వుంటాడు.
సెలవులు కూలిదినాలై
వాడి అరచేతులకంటించిన బొబ్బలఫలాలు
మాస్టారు సంధించిన రూళ్ళకర్రకు
ప్రశ్నార్ధకాలవుతాయి.
ఇప్పుడు మాస్టారిముందు –
మొగ్గవికసించేందుకు వాడే ఉత్ప్రేరక బోధనలకన్నా వేరు జీవించేందుకు అందించే
సహాయహస్తాల అధ్యయన సమస్యలే విస్తృతమవుతాయి.

———
పవన్ కుమార్:
మౌన ఘోష మీద విశ్లేషణ :
చర్విత చర్వణం కవిత్వంలో నిషిద్ధం. ఒకే భావాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఎన్నో ఉపమానాలను ఒక్క భావం కోసం గుప్పించడం వల్ల కవిత పాఠకుడి హృదయాన్ని చేరకుండా “తిలకాష్ఠ మహిష బంధనం” అవుతుంది.

మాస్టారి ప్రశ్నకు జవాబుగా
ఆ పిల్లాడు
మౌనంగా చేతుల్ని చాస్తాడు
పెదాల రేకులు విప్పలేని
వాడిన మొగ్గలాంటి –
చిరిగిన మేఘవస్త్రం మాటున
చిదిమిన అశృకణం లాంటి –
ఆ పసివాడు
రూళ్ళకర్రకు నిశ్శబ్దంగా అచేతుల్ని అప్పగిస్తాడు

మొదటి మూడు పంక్తులూ చాలు మిగిలిన భాగం అనవసరం.

మాస్టారి ప్రశ్నకు జవాబుగా
ఆ పిల్లాడు
మౌనంగా చేతుల్ని చాస్తాడు
తర్వాతి లైన్లు
వాడి హోంవర్క్‌ పేజీల్నిండా
ఉపవాస రేఖాచిత్రాలే.
వాడి ఖాళీ పలకనిండా
కన్నీరంటిన ముంజేతిముద్రలే.
వాడి చూపుల్ని మీటితే చాలు
విషాద సంగీతపేటికలెన్నో విచ్చుకొంటాయి

ఈ పైన చెప్పిన పంక్తుల భావాలాన్ని చక్కని కింద పంక్తుల్లో ఇమిడిపోయాయి

సెలవులు కూలిదినాలై
వాడి అరచేతులకంటించిన బొబ్బలఫలాలు
మాస్టారు సంధించిన రూళ్ళకర్రకు
ప్రశ్నార్ధకాల్లా!

అలా అనవసరమైన పదాలు పంక్తులు పక్కన పెడితే మొత్తం కవిత ఈ కింద:

ఆ పిల్లాడి పుస్తకాల్నిండా
ఉపవాస రేఖాచిత్రాలు
కన్నీరంటిన ముంజేతిముద్రలు
మాస్టారి ప్రశ్నకు జవాబుగా
వాడు
మౌనంగా చేతుల్ని చాస్తాడు
సెలవులు కూలిదినాలై
వాడి అరచేతులకంటించిన బొబ్బలఫలాలు
మాస్టారు సంధించిన రూళ్ళకర్రకు
ప్రశ్నార్ధకాల్లా!

ఖచ్చితంగా ఒక కవి రాసిన కవితను ఇలా సంపాదకత్వం చేయడం సాహసమే కాని క్లుప్తత సాధించే వరకూ ఈ సాహసాలు చెయ్యాల్సిందే.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

3 Responses to కవికృతి-౫

  1. పొద్దు వారికి,
    వెంకటరెడ్డి గారి మౌనఘోష బాగున్నది, బొబ్బలఫలాలు ఎబ్బెట్టుగా ఉన్నవి..
    ఒక భావానికి ఒకటికి మించిన ఉపమానములు వాడటానికి – “తిలకాష్ఠ మహిష బంధనం” కు సంబంధం ఏమిటో కాస్త క్లుప్తంగ విశదీకరిస్తారా.

    భవదీయుడు

    ఊకదంపుడు

  2. గరికపాటి పవన్ కుమార్ says:

    ముందుగా అందరికి తెలుసుననుకున్న తెనాలి రాముని కథ:
    ఒక సారి శ్రీ కృష్ణ దేవరాయని ఆస్థానానికి ఒక పెద్ద మరాఠీ పండితుడు వస్తాడు. సాహిత్య వాదాల్లో అతన్ని ఓడించిన కవులు పండితులూ లేరని ఎవ్వరినైనా ఓడిస్తానని తెల్పుతాడు. అందరు పెద్ద పెద్ద పండితులూ అతని చేతిలో ఓడిపోవటంతో రాయలు తెనాలి రాముని అతనితో వాదుకు నిలుపుతాడు. అతని ప్రజ్ఞను గమనించిన తెనాలిన రాముడు, మర్నాడు తన చేతిలో ఒక తాళ పత్ర గ్రంథాన్ని పోలిన వస్తువును చేతిలో పట్టుకొని ప్రవేశిస్తాడు. పండితుడు అదేమిటని ప్రశ్నిస్తే ఇది “తిల కాష్ట మహిష బంధనం” అని చెపుతాడు ఇప్పుడు జరగబోయే చర్చ దానిమీదనే అనగానే, ఆ పండితుడు తానా గ్రంథమే చదవలేదు కాబట్టి తన ఓటమిని ఒప్పుకుంటాడు. రాయలు అయినా అతనిని సత్కరించి పంపుతాడు. తర్వాత రాయలు తెనాలి రామ కృష్ణుని “తిల కాష్ట మహిష బంధనం” అంటే ఏమిటని అడుగగా అది పలుపు తాడు (మహిష బంధనం) తో కట్టిన నువ్వుల కట్టె (తిల కాష్ట ) అని తెల్పుతాడు. అంత పెద్ద పండితుడిని మాములుగా గెలవలేక రాయల కొలువు గురవాన్ని నిలబెట్టేందుకు ఐ పని చేసానని చెపుతాడు.
    ఇది కథ.

    ఇక నే వాడిన సందర్భం:
    ఒక్క చోటే వేర్వేరు ఉపమానాలు ఉపయోగించడం వల్ల కవిత నేరుగా చదువరిని చేరదు. ఏదో కవితనుకుంటారు కానీ అది కవితను పోలిన తిల కాష్ట మహిష బంధనమే. అలా చెయ్యడం నిషిద్ధమని నే చెప్పడం లేదు. ఇది నిషిద్ధమని కవిత్వంలో దేన్నీ చెప్పలేము కానీ ఇలా చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిత్రకారుడు ఒక చిత్రంలోనే నాలుగు చిత్రాలు గీస్తే? చూపించగలిగితే గొప్ప చిత్రకారుదవుతాడు, లేకపోతె మామూలు చిత్రం కూడా గీయలేక, చిత్రించడానికి ప్రయత్నించినవాడవుతాడు.

  3. పొద్దు వారికి,
    మౌనఘోష పై మీరు ప్రచురించిన విశ్లేషణకు సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి గారి ప్రతిస్పందన అడిగినారా? వారి స్పందన మీ వద్ద ఉంటే పాఠకులతో పంచుకోగలరా?

    గరికపాటి పవన్ కుమార్ గారు,
    తొలి విశ్లేషణ లో మీరు “చర్విత చర్వణం కవిత్వంలో నిషిద్ధం” అన్నారు.
    ఇప్పుడు “ఇది నిషిద్ధమని కవిత్వంలో దేన్నీ చెప్పలేము” అన్నారు.
    నాకు నా పరిధి లో అర్ధమైనంత వఱకు, మీ దృష్టి లో అకవిత్వాన్ని కవిత్వం చేయటం “తిల కాష్ట మహిష బంధనం”.
    [మీ అభిప్రాయము ఇదికానిచో నా తప్పును సరిదిద్దగలరు]
    ఈ కవిత లో కవి పలుపుతాడు, నువ్వులకట్టే చూపి గ్రంధమని నమ్మ బలికినారా? తెలుపగలరు.
    ఒక కవితలో ఒక వర్ణన కోసం ఒకటికి మించిన ఉపమానములు వాడితే అది పునరుక్తి అవుతుందా, తెలుపగలరు.
    భవదీయుడు
    ఊకదంపుడు

Comments are closed.