వికృతి నామ ఉగాది పద్యకవితా సదస్సు – మొదటి భాగం

విఘ్ననాయకుడు

కొత్తపాళీ: అందరికీ పెద్దవారు, ఆచార్యులు, చింతా రామకృష్ణారావు గారు చక్కటి గణపతి ప్రార్ధన పద్యం పంపారు.

ఉ:

శ్రీ గణ నాయకా! వికృతిఁ జేర్పను వచ్చెదొ? విశ్వతేజ! రా

వేగమిటున్. ప్రభా కలిత విశ్వ పరిజ్ఞత కావ్య జాల స

ద్యో గుణ సద్విధమ్ మలర; దుర్గుణ బాహ్య మహత్వమొప్ప; రో

జూ గనరా! కృపన్ నగుచు శోభిల జేయుమ! ఆది పూజ్యమై!

కొత్తపాళీ: ఇందులోనే, ఒక కందము, ఒక తేటగీతి గర్భితమై1 ఉన్నాయని వారు సెలవిచ్చారు.

కం:

గణ నాయకా! వికృతిఁ జే

ర్పను వచ్చెదొ? విశ్వతేజ! రావేగమిటున్.

గుణ సద్విధమ్ మలర; దు

ర్గుణ బాహ్య మహత్వమొప్ప; రోజూ గనరా!

కొత్తపాళీ: ఇక తేట గీతి2

వికృతిఁ జేర్పను వచ్చెదొ? విశ్వతేజ!

కలిత విశ్వ పరిజ్ఞత కావ్య జాల

మలర; దుర్గుణ బాహ్య మహత్వమొప్ప;

నగుచు; వర్ధిలఁ జేయుమ! ఆది పూజ్య!

కొత్తపాళీ: ఇందులో, సందర్భానికి తగినట్టు తేటగీతిలో జాల మలర అనడం నాకు బాగా నచ్చింది

రాఘవ: శ్రీమహాగణాధిపతయే నమః

గిరి: కడుపుతో ఉన్న పద్యమెలా ఉంటుందో – ఒక పద్యానికి కడుపునిచ్చి మరీ చూపిన రామకృష్ణ గారికి ధన్యవాదాలు

కామేశ్వరరావు: ఇంత అలవోకగా గర్భ కవిత్వం చెప్తున్నవారిని ఛందస్సు గ్రూపులో మోహన గారిని చూసాను. మళ్ళీ రామకృష్ణగారిని చూసాను!

రాఘవ: బంధకవిత్వం జాలంలో శ్రీ చింతావారు మాత్రమే వ్రాస్తున్నారండీ

చంద్ర: చిత్ర కవితతో చైత్రం ప్రారంభం

కామేశ్వరరావు: వారు ప్రత్యక్షంగా సభలో లేకపోవడం పెద్ద లోటే!

కొత్తపాళీ: కామేశ్వర .. తరవాతైనా చేరుతారని ఆశిద్దాం. ఇంకా నాలుగ్గంటలు ఉన్నాయి కదా

రాఘవ: మోహన గారంటే జెజ్జాల కృష్ణమోహనరావు3 గారేనాండీ?

కామేశ్వరరావు: అవును వారే.

చంద్ర: వినాయకుని ‘జూ’ చూపించారు చింతా వారు!

రాఘవ: గిరిగారూ, కడుపుతో ఉన్న పద్యమా! 😀

ఫణి: ఇలాంటి గర్భ పద్యాలు నేను మొదట చూట్టం రామకృష్ణారావు గారి బ్లాగులోనే

కొత్తపాళీ: కామేశ్వర.. మోహన గారి పద్యాలకీ చింతావారి పద్యాలకీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. మోహన గారి ఆసక్తి ముఖ్యంగా, అక్షరాలలో, గణాలలో ఉండే అమరికలు patterns మీద. అందుకని వారి పద్యాల్లో కవిత్వ భావం కంటే ఆ పద్యపు నడక ఎక్కువగా వెలుగుతుంది. చింతా వారి పద్యాల్లో, భావ చమత్కృతులు, వింత వాడుకలు చమక్కు మనిపిస్తాయి. కవిత్వ భావానికే ప్రాధాన్యం చింతా వారి పద్యాల్లో.

ఫణి:
కం:

వినుతించిరి గణనాథుని

తనువంతయు పులకరించె ధైర్యము వచ్చెన్

తనియగ కవిజన గణమున

వినిపించును శ్రావ్య కవిత వికృతికి వేడ్కన్

రాఘవ: ఫణిగారూ, భలే

కొత్తపాళీ: ఫణీ, బాగు బాగు

ఫణి: ధన్యవాదాలు.

కామేశ్వరరావు: ఫణిగారు, కందం మంచి జోరందుకుంది!

గిరి: అంటే, మోహన గారి పద్యాలు చైనా అమ్మాయిల్లాంటి వన్నమాట

రాఘవ: గిరిగారూ, వసంతానికి మధ్యలో చైనా అమ్మాయిలేండంటీ? మన్మథుడు ఈసారి చైనా మీదినుండి వచ్చాడా ఏమిటీ?

కొత్తపాళీ: కామేశ్వర్రావు గారు, సరస్వతీ నమస్తుభ్యం అంటారా?

కామేశ్వరరావు: తప్పకుండా

వాగ్దేవి
ఈ ప్రార్థన కామేశ్వరరావు స్వరంలోనే వినండి

సీ:

ఆదివేదము నందు “అగ్ని మీళే పురో హిత”మంచు నే దేవి యిలను వెలసె

ఏ దేవి తా “మానిషాద” శ్లోకమ్మున నాదిగా దిద్దె కావ్యాక్షరమ్ము

వాసి నే దేవి “శ్రీవాణీ” స్వరూపాన అడుగిడె తెలుగు కావ్యంపుటింట

జానపదమ్ముగా జాతి గుండియలోన నాదిగా ఏ దేవి నాట్యమాడె

తే.గీ

అట్టి యా దేవి కళలకు నాటపట్టు

విద్యలన్నియు నొసగెడు వెల్లచెట్టు

మనిషి మనుగడ కామెయే యునికిపట్టు

కరుణ జూచుత సభ రక్తికట్టునట్టు

చంద్ర: భళీ!

గిరి: చరిచితి చరిచితి నేను మీకొరకు చప్పట్టు

రాఘవ: లేరు ఇట్టి కవిత వ్రాయలేరు బెట్టు

గిరి: చాల బావుంది కామేశ్వరరావు గారు

సనత్: భళీ కామేశ్వర కవీ, భళీ!

చదువరి: చాలా బావుంది.

కొత్తపాళీ: ఋగ్వేదం నించి, సంస్కృతాంధ్రాల్లో ఆది కావ్యాల్ని స్పృశిస్తూ .. చాలా చాలా బావుంది

కామేశ్వరరావు: 🙂 కృతజ్ఞతలు, నెనరులు.

శ్రీరామ్: మధురమైన పద్యం

ఫణి: చాలా బాగుందండీ.

గిరి: “అగ్ని మీళే పురోహిత ” గురించి వివరిస్తే బావుంటుంది

పుష్యం: వెల్ల చెట్టు == కల్ప తరువు??

కామేశ్వరరావు: అవునండి. వెల్లచెట్టు అంటే కల్పతరువు. సరస్వతి కూడా “సర్వ శుక్ల” కదా మరి!

కొత్తపాళీ: ఋగ్వేదంలో మొదటి ఋక్కు .. అగ్నిమీళే పురోహితం యజ్ఞత్వ దేవ వృత్విజం .. దేవతలకి పురోహితుడు అయిన అగ్నికి నమస్కారం అని అర్ధం

సనత్: అగ్ని మీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్న ధాతమం అని మంత్రం…

కొత్తపాళీ: మనకో శ్రీరాముడు సభలోనే ఉన్నాడు .. ఈతడు బ్లాగుల్లో సమస్యాపూరణలకి తొలి అడుగు వేసిన భగీరథుడని చెప్పుకోవచ్చు.

కొత్తపాళీ: రాఘవ, మీ శ్రీరాముణ్ణి మా కళ్ళముందు సాక్షాత్కరింప చెయ్యండి

రాఘవ: సరేనండీ. మా రాముడు ఆత్మారాముడు.

కామేశ్వరరావు: రాముని ప్రస్తావన రాగానే విశ్వామిత్రులవారు వేంచేశారు!

కోదండరాముడు

రాఘవ:
శా:

అవ్యక్తంబయి వ్యక్తమై తనరి మాయాకల్పితాజాణ్డమై

నవ్యవ్యాహృతియై పరార్థమయి ప్రాణంబై మహావాక్యమై

కవ్యాలాపసుధాకరాబ్ధియయి నైకైకత్వచిహ్నంబునై

దివ్యానన్దము రాముఁడై స్వరససిద్ధిన్నిచ్చుతన్ నిచ్చలున్

శ్రీరామ్: ఏమి ధార!

కామేశ్వరరావు: ఆత్మారాముడే కాదు అద్వైత రాముడు కూడానూ!

రవి: కవ్యాలాపసుధాకరాబ్ధి – ఇటువంటి సమాసాలు రాఘవ గారి పేటెంట్ !

కొత్తపాళీ: ఆహాహా, ఖరహరప్రియలో త్యాగరాజకృతి విన్నంత హాయిగా ఉంది. మాయాకల్పితాజాణ్డమై, నవ్యవ్యాహృతియై – దయచేసి వివరించండి

గిరి: నా నోటి ముందు ప్రశ్నని లాగేసుకున్నారు కొత్తపాళీ గారు

రాఘవ: ఏ దేని మాయచేత నైతే బ్రహ్మాండములు కల్పించబడుతున్నవో ఆ దివ్యానందము

రాఘవ: గుణాతీతమైన అవస్థాతీతమైన దివ్యానందస్వరూపం

శ్రీరామ్: అలాగే మహావాక్యాలు మనకి మూడు కదా…మీరు ప్రస్తావించింది ఏది?

రాఘవ: అటువంటి ఆనందస్వరూపపు మాయచేత బ్రహ్మాండసృష్టి జఱుగుతూంటే… కవిలో నవ్యమైన పదముల సృష్టి జఱుగుతుంది

రాఘవ: అలాంటి నవ్యవ్యాహృతిగా కూడ ఆ దివ్యానందమే వెలుగుతోంది. అందుకే పరార్థమయి, పరా పశ్యన్తీ మధ్యమా వైఖరీ అని మాట నాలుగు రకాలు. అందులో పరా రూపంగా తొలుత నెలకొన్నదీ అదే అని

కొత్తపాళీ: బాగుంది. త్యాగరాజస్వామే ఒక కృతిలో .. నాద బ్రహ్మానంద రూపా .. అన్నారు

రాఘవ: ఔనౌను

సనత్: పరా పశ్యన్తీ మధ్యమా వైఖరీ అని “వాక్కు” నాలుగు రకాలు

రాఘవ: ఔనండీ సనత్‌గారూ

రాఘవ: తర్వాత అలాంటి వెలుగు రాముడై వచ్చి స్వరససిద్ధిన్ ఇవ్వాలీ అని మంగళాశాసనం

మురళి: రాఘవగారూ మీ వివరణ అద్భుతం

కామేశ్వరరావు: “నైకైకత్వచిహ్నంబునై” అద్భుతమైన పదం!

గిరి: బావుంది – ఇంతలా అడిగితే ఎందుకు ఇవ్వడాయన

రాఘవ: ఇక్కడ స్వరస అన్నది కూడ స్వర-స స్వర-స అన్న శ్సేషతో

ఫణి: శ్రీ రామ తత్వాన్ని చక్కగా చూపారండీ.

రాఘవ: ఇక్కడ స్వరస అన్నది కూడ స్వర-స స్వర-స అన్న శ్లేషతో. నైకైకత్వచిహ్నం… ఏకం కానిదానిలో కూడ ఏకత్వాన్ని సూచించే అద్వైతపరంబ్రహ్మస్వరూపం

కామేశ్వరరావు: రామ”చంద్రుడు” కాబట్టి సుధాకరాబ్ధి!

కొత్తపాళీ: నాకు కర్నాటక సంగీతమంటే ఉన్న అభిమానం వల్ల నాకు రాముడంటే ఒక ప్రత్యేకమైన “ఇది”

రాకేశ్వరుఁడు: నాకు అదే కారణం చేత నంతే ఇది!

సనత్: నాకు రాముడంటే ఉన్న అభిమానం వల్ల నాకు కర్నాటక సంగీతమంటే ఒక ప్రత్యేకమైన “ఇది”

రాఘవ: పద్యంలో మాత్రం కవుల ఆలాపమనే సుధాకరునికి తండ్రి అన్న అర్థం ముఖ్యం

రాఘవ: రాముడు అందఱికీ హృదయేశ్వరుడు

సనత్: ఆత్మేశ్వరుడు కూడా..

రాఘవ: ఆ రాముడికీ, రామబంధువులకీ నమస్కారం

కొత్తపాళీ: గిరిధరా మీరు సిద్ధమైతే, మీ మంగళాశాసనంతో ముందుకి వెళ్దాం.

గిరి:
సీ:

చైత్రము కావాలి శాత్రవ నాశని వైశాఖ తేవాలి పైడివెలుగు

జ్యేష్ఠము కావాలి కాష్ఠమత్యాశకు ఆషాఢమాసమ్ము ఐశ్వరియము

శ్రావణమున కొనసాగాలి సందళ్ళు భద్రాయుతే యౌగ భాద్రపదము

ఆశ్వీయుజము తెచ్చు నాశీర్వచనములు కార్తీక కురిపించు కనక వృష్టి

తే.గీ

మార్గశిరపుష్యములు, అల మాఘఫాల్గు

ణములు, జనుల కొసగ సద్గుణపు నిధులను,

మానవాళికి శోభాయమానమైన

వత్సరమ్ము ప్రసాదించు పదుమనాభ

కొత్తపాళీ: నేను లెక్క పెట్టలేదు, పన్నెండు నెలలూ వచ్చేశాయా?

రాఘవ: ఎనిమిదీ నాలుగూను… ఆఁ వచ్చేశాయండీ

మురళి: గిరిగారు నెల తప్పరు లెండి

చదువరి: 🙂

రాఘవ: మురళిగారూ, 😀

కామేశ్వరరావు: 🙂

రవి: 🙂

కొత్తపాళీ: మురళీ .. హహ్హహ్హా

గిరి: పదిపాదాలలోనే వచ్చేసాయి

కొత్తపాళీ: భలే భలే

గిరి: హ హ హ

రాఘవ: పది… నెలలు

చదువరి: సరిగ్గా పదేనని అంటున్నారు గిరిగారు 🙂

రాఘవ: అదేనండీ నేనూ అంటున్నది

గిరి: నిజానికి తొమ్మిదిలోనే వచ్చాయి

పుష్యం: పది పాదాలలో 12 ని ఇరికించారు.. అధికమాసాలు వస్తాయనుకున్నాను ఆఖరి పాదాల్లో 🙂

గిరి: అక్కడా నెల తప్పలేదు

కొత్తపాళీ: ఎంతైనా లెక్కల్లో ఘటికులు కదా

రాకేశ్వరుఁడు: అసలే ఈ చైత్రంతోఁబాటూ అధికం వస్తుందఁట

విశ్వామిత్ర: నూత్నత్వం కోసం తెలుగు నాట ఉపయోగిస్తున్న పేర్లను చూసి మీరు కూడ కార్తీక అన్నట్టున్నారు

గిరి: సభ్యులకో విన్నపము – నా పద్యంలో కార్తీక అన్న చోట కార్తిక అని అచ్చువేసుకోమని మనవి

రాఘవ: ఔనండీ గిరిగారూ, చైత్రంలో శత్రువులు ఎక్కడుంటారండీ?

రవి: ఈసారి వైశాఖం వెలుగుతో బాటు భీకరమైన ఎండనూ తెచ్చేలాగుందండి

కామేశ్వరరావు: విరహార్తులకి, వసంతమే పెద్ద శత్రువు 🙂

విశ్వామిత్ర: ఏ నెలలోనైనా శత్రువులు మనలోనే ఉంటారుట ఆరుగురు

గిరి: రాఘవ గారు ప్రస్తుత పరిస్థితుల్లో శత్రువులు ఎక్కడలేరు!

సనత్ కుమార్: ఇన్‍కంటాక్సు కట్టాకా… కొత్త బడ్జెట్టుతో దాడి జరిగేది చైత్రంలోనే కదండీ…

కొత్తపాళీ: రాఘవ, చైత్రంలో ఉన్నారని కాదు, ఎక్కడో ఉన్నవారు ఈ చైత్రంతో నశించిపోవాలని

రాకేశ్వరుఁడు: అన్నమయ్యయొక్క ఇన్నిరాశులయునికి కీర్తనలా వుంది।

రాఘవ: ఓహో శత్రువులందఱూ వర్షారంభంలోనే నాశనమవ్వాలనా.. బాగు

రాకేశ్వరుఁడు: విశ్వామిత్ర – ఆ ఆరుగురి మాట గుర్తుపెట్టుకోండి 🙂

నరసింహారావు: అందరికీ వందనాలు.

కొత్తపాళీ: సరే, ముందుకి వెళ్దాం. విశ్వామిత్రులు సిద్ధమైనట్టు ఉన్నారు. విశ్వామిత్రుల వారూ, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకండి.

విశ్వామిత్ర: చిత్తం
శా:

శ్రీకారమ్మును జుట్టగా మరలనే శేషాధికోత్కృష్టమౌ

ఆకాంక్షాతతికిన్ ముహూర్త మిదనిన్ అవ్యక్తరూపంబెదో

నాకుంబల్కెను, యంత నిద్ర చెదరెన్; నాందీవచోఘోషలన్

వాకల్సాగెనువేడినెత్తురులు, జీవమ్మొందె నూత్నద్యుతిన్

కొత్తపాళీ: ఎంతైనా విశ్వామిత్రులనిపించారు, వేడి నెత్తురు పొంగిందిట .. ఇంకా ఉన్నట్టుంది మీ పద్యధార?

విశ్వామిత్ర:
సీ:

నాల్గునెలలవాన నదులనిండానీరు, కలుగుగా కదలిరా కర్మ భూమి

గ్రీష్మతాపముతగ్గి రెట్టిభూతాపమున్, తరలిరా తపనులా ధర్మ భూమి

ఎల్లఋతువలందు చల్లగా జనులంత, బ్రతుకగా నడచిరా భరత భూమి

వృక్షజంతుచయము వృద్ధినొందమిగుల, అడుగిడుము రయము ఆర్ష భూమి

ఆ.వె

వికృతములకు వికృతి వీవుగానిలచియే

ప్రకృతి ప్రేమి వయ్యి ఫలములొసగ

విశ్వశాంతి గోరి విడిదిజేయుముస్వామి!

స్వాగతమ్ము నీకు సరస గతిని.

రాఘవ: త్రేతాయుగంలో తపస్సు చెదిరింది. కలియుగంలో నిద్ర చెదిరింది. ప్రమోషన్ అన్నమాట. 🙂

కొత్తపాళీ: బాగు బాగు, పనిలో పనిగా పర్యావరణ రక్షణ అనే లోకకళ్యాణ ఉద్యమాన్ని కూడా ఇందులో తల్చుకున్నారు

ఫణి: హరితాహ్వానం బాగుందండీ.

కామేశ్వరరావు: బాగుంది. విశ్వశాంతిని కోరి మీ విశ్వామిత్ర నామాన్ని సార్థకం చేసుకున్నారు!

విశ్వామిత్ర: స్వామి కార్యం కదా అని “స్వామి” అన్నాను 🙂 3వ పాదం లో

కొత్తపాళీ: విశ్వశాంతిని కోరడం కూడా ముదావహం, సముచితంగా ఉంది

రాఘవ: స్వామ్యలంకారం 🙂

రాకేశ్వరుఁడు: విశ్వామిత్ర గారు, పర్యావరణ పాయింటు కూడా గుర్తు పెట్టుకోండి 🙂

గిరి: బావుంది బావుంది

విశ్వామిత్ర: ఎలాంటి భూమి మీద అడుగుపెడుతున్నావో తెలుసుకో అని ఓ హెచ్చరిక కూడానూ

చదువరి: హెచ్చరిక -ఔను!

రాకేశ్వరుఁడు: నాదో వ్యాకరణ సందేహం

కొత్తపాళీ: రాకేశ్వర, అడగండి

రాకేశ్వరుఁడు: తెలుఁగన్నడల లోప సంధులలో అచ్చుకి అచ్చు పరమైతే మొదటిది నశిస్తుందిగా… ఎల్ల + ఋతువులు = ఎల్లృతువులు అవుతుందా ?

నరసింహారావు: అవదు

కామేశ్వరరావు: అవ్వదండి.

రాఘవ: ఋ అచ్చ తెలుగులో లేదు

విశ్వామిత్ర: రాకేశా – రసపట్టులో వ్యాకరణం కూడదు

చదువరి: 🙂

కొత్తపాళీ: విశ్వామిత్ర .. హ హ్హ హ్హా

నరసింహారావు: తర్కం కూడా కుదరదు

రాకేశ్వరుఁడు: రసపట్టులో రసపట్టైన (వర్తించని) వ్యాకరణం కూడుతుంది, గుణకారం కూడా చేస్తుంది 😀

శ్రీరామ్: అకారానికి సంధి నిత్యం కాదు కదా!

రాఘవ: అచ్చ తెలుఁగు భాషలో ఋ కారం లేదు. అందువల్ల ఋకారం వచ్చిందీ అంటే అది తెలుగు సంధి అవ్వదు. అంటే అకారేకారోకారసంధులు ఏవీ చెల్లవు.

రాకేశ్వరుఁడు: ఋ అచ్చు తెలుఁగులో లేకపోతేనే… కన్నడ వారు ఎల్ల + ఋ + బన్ని = ఎల్లౄ బన్ని అని సంధి చేస్తారే 🙂

కొత్తపాళీ: బాగుంది. అవతారికలకే గంట పట్టింది. ఇంక అసలు కార్యక్రమంలోకి వెళ్దాము

గిరి: కన్నడ వారి వ్యాకరణలోపాల్ని కన్నడించి ముందుకు సాగుదాం

~~~~~

పొద్దు నిర్వహించిన గత కవి సమ్మేళనాల విశేషాలను చదవండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1. బంధ కవిత్వం, గర్భ కవిత్వం, చిత్ర కవిత్వం గురించి పరిచయం కోసం ఈమాటలోని ఈ లింకు చూడండి.
2. కందంలో ఇమిడ్చిన మరో మూడు కందాల గురించిన టపా చింతా రామకృష్ణారావు గారి బ్లాగులో చూడండి.
3. జెజ్జాల కృష్ణమోహనరావు గారు వందలాది గర్భకవిత్వ పద్యాలను రచించిన కవి. ఛందస్సులో వారు చేసిన కృషికిగాను 2009 సంవత్సరపు సి.పి.బ్రౌను పురస్కారం అందుకున్నారు.

——–

(బొమ్మల శ్రేయస్సు: ఆంధ్రావిలాస్)

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

5 Responses to వికృతి నామ ఉగాది పద్యకవితా సదస్సు – మొదటి భాగం

  1. bollojubaba says:

    శబాష్శభాస్
    భలే ఉంది మీ పద్యకవితాఝురి
    మా వచన కవితా ప్రవాహం మీ ముందు మందగించిందనిపిస్తుంది. :*
    కొత్తపాళీగారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి
    బొల్లోజు బాబా

  2. జాన్‌హైడ్ కనుమూరి says:

    wonderful
    wonderful

  3. ఉష says:

    ఆసాంతం బాగుందండి.. అందరి పద్యాలు, వ్యాఖ్యానం, చెణుకులు సంధర్బోచితంగా వున్నాయి. కాకపోతే కవయిత్రులు లేక సమ్మేళనం లో నెలతప్పటం ఒక హాస్యాంశం గా మారిందన్నమాట. 🙂 అందరికీ అభివాదాలు/అబినందనలు.

  4. ఉషగారు, కవయిత్రులు సభలో లేకున్నా, ఆ ప్రస్తావన అసభ్యం కాదనే భావిస్తున్నాము.

  5. sirasri says:

    ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఉత్సాహ’ వృత్తంలో ఒక పద్యం…

    ప్రకృతి మెచ్చి విరియవలయు పచ్చనైన నవ్వులన్
    నికృతి పలికి ముష్కరులకు నిత్య శక్తి చాటుచున్
    ‘వికృతి’ వత్సరమ్ము పలుక వికృతి పాపకోటికిన్
    సుకృతినొంది వెలగవలయు శుద్ధబుద్ధులెల్లరున్

    -సిరాశ్రీ

Comments are closed.