నీల గ్రహ నిదానము – 2

నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము

(ద్వితీయాంకము)

(ప్రథమ దృశ్యము)

(దశరథ మహారాజు శయన మందిరం)

(తెర తీయగానే సన్నని వెలుగులో దశరథుడు పాన్పు లేదా తూగుటుయ్యాలపై పడుకొని ఉన్నట్లు చూపించి, అతడు కాస్త ఒత్తిగిల్లగానే లైట్లు ఆఫ్ చేయాలి)

(తెర వెనుక లైట్లు ఆన్ అవుతాయి)

(దుస్వప్నాలు ఒక దాని వెనుక ఒకటిగా షేడో రూపంలో చూపించాలి)

1వ నీడ: ఒక మనిషిని కోతి తరుముతున్నట్లు..

2వ నీడ: ఒక స్త్రీ జుత్తు విరబూసుకొని, రోదన చేస్తూ తిరుగుతున్నట్లు..

3వ నీడ: ఒక మనిషి, ఎనుబోతును ఎక్కి దక్షిణ దిశగా వెళ్తున్నట్లు..

4వ నీడ: ఒక మనిషి చెరసాలలో బందీ అయినట్లు..

(వరుసగా ఇన్ని దుస్వప్నాలు కనిపించిన తరువాత దశరథుడు పాన్పుపై లేచి కూర్చొంటాడు,)

(రంగస్థలం పైన లైట్లు వెలుగుతాయి.)

(దశరథుడు తెప్పరిల్లి పాన్పు దిగుతాడు)

దశరథుడు: (జనాంతికముగా) ఏమిది! ఇంద్రజాలము వలె కన్పట్టుచున్నది! చతుర్దిశలయందు, సరయు, నర్మద, గంగ, సింధు నదీజల పరీత భూమండలమును, ఏకచ్ఛత్రము క్రింద పరిపాలించిన, అకళంక కీర్తిచంద్రులు, అయోధ్యాపురీ రమారమణులైన మాంథాత, రఘు, దిలీప, అజ చక్రవర్తుల వంశజుడనైన, దశరథ రాజేంద్రుడనేనా నేను! (చెయ్యి గిల్లి చూసుకొని) అవును! నేను దశరథుడనే!! (చుట్టుప్రక్కల కలయజూసి) ఇది నా ఆలోచనా మందిరము వలె కన్పట్టుచున్నది. రాత్రి చాలసేపటి వరకు, అమాత్య సుమంత్రులవారితో మంతనములాడి, నే నిచటనే శయనించి యుండవలె! అవునవును, ఇచ్చోటనే శయనించితిని! అనగా.., ఇంద్రజాలము వలె కన్పట్టిన ఈ దృశ్యములన్నియు, స్వప్న దృశ్యములా! ఇసీ!! స్వప్నమునకా నేనింత కలవర పడినది!!! (చప్పట్లు కొడతాడు) ఎవరక్కడ?

(ప్రవేశం :: అకంపనుడనే భటుడు. నిలువెల్లా వణుకుతూ)

అకంపనుడు: (కంపిస్తూ) జ.. జ.. జ జయము జయము మహారాజా!

దశరథ: ఎవరు నీవు?

అకంప: మ.. మ.. మహారాజా! నేను అకంపనుడను.

దశరథ: కాదు, నిశ్చయముగ నీ వకంపనుడవు కావు!

అకంప: అయ. య్యయ్యో మ.. మహారాజా! నేను.. నేను అకంపనుడనే!

దశరథ: ఊఁహు! నేను నమ్మజాలను

అకంప: మ.. మ.. మహారాజా! ఎ.. ఎట్లా రుజువు చేసేది! నేను అకంపనుడనే!

దశరథ: నీవు అకంపనుడవే అయిన, ఇట్లు భయకంపితుడవు కానేల?

అకంప: (తేరుకొంటాడు) క్ష.. క్షమించండి మ.. మహారాజా! నేను ముమ్మాటికీ అకంపనుడనే! ఇలా.. ఇలా.. వణుకు పట్టడానికి తగినంత కారణం ఉంది మహారాజా! నేను చూసిన దృశ్యాలని మీరు చూసినా -క్షమించండి, ఇంకెవరు చూసినా, ఇలాగే వణుకు పుట్టి కంపించి పోవలసినదే!

దశరథ: ఏమంటివి అకంపనా! నీవు భయాందోళనలకు గురిచేయు దృశ్యములను చూసితివా?

అకంప: అవును మహారాజా! నేనే కాదు, అర్ణవ ష్ఠీవి కూడా చూసాడు. వాడు అక్కడికక్కడే రాయిలా నిలబడిపోయి, ‘ఉప్పుటేరులా’, ‘చెమట’ కార్చేసుకొంటున్నాడు. ఇంతలో మీ పిలుపు వినిపించినది.

దశరథ: ఏ దృశ్యములు? అకంపనా, కలలోనివా?

అకంపన: అయ్యయ్యయ్యో! మహారాజా! క్షమించండి క్షమించండి, క్షమించండి. కాపలా కాసే భటులం మేము కలలు కంటే, తలలు ఎగిరిపోవా మహాప్రభూ! మేమా దృశ్యాలను మా కళ్లతోనే చుసాం. కావాలంటే అర్ణవ ష్ఠీవిని కూడా పిలిచి అడిగి చూడండి.

దశరథ: వెళ్లి తీసుకొని రా!

(అకంపనుడు వెళ్లి రెండవ భటునితో వస్తాడు)

అర్ణవ ష్ఠీవి: జయము జయము మహారాజా! నేనే అర్ణవ ష్ఠీవిని!

దశరథ: చిరంజీవీ! నీకీ పేరు నీ తల్లితండ్రులు పెట్టినదేనా?

అకంప: అవును, మాహారాజా! వీడు వరప్రసాది, సార్థక నామథేయిడు!

దశరథ: (నవ్వుతూ) ఏమి! సార్థక నామథేయుడా? నిజమేనా అర్ణవ ష్ఠీవీ! నీవు చెమటతో ఉప్పుటేరులు సృష్టించగలవా?

అర్ణవ: అవును, మహాప్రభూ! మా తలిదండ్రులకు నేనును, నా అన్న సువర్ణ ష్ఠీవియును కవలలము. మమ్ము నిరువురను మా తల్లి, నారద మహర్షి వర ప్రసాదము వలన కనెనట!

అకంప: చిన్నప్పటినుంచి వీరిద్దరి చేష్టలు వింతగా ఉండేవట మహారాజా! వీడి అన్న సువర్ణ ష్ఠీవి కన్నీళ్లు కార్చినా, చెమట కార్చుకొన్నా, మల మూత్రములు విసర్జించినా, చివరకి కక్కుకున్నా ఆ విసర్జకము లన్నియు బంగారముగా మారిపోయేవట!

దశరథ: ఏమేమి, ఆశ్చర్యముగ నున్నదే!

అర్ణవ: మహాప్రభూ! నా దురవస్థ ఏమని చెప్పను. నా విసర్జకము లన్నియు, తటాక ప్రమాణములో నుండేవట! నా చెమటకి పరుపు తడిసి, ఎండ పెట్థిన తరువాత-

అకంప: ఉప్పు, రాశులు రాశులుగా రాలేదట మహారాజా!

దశరథ: పాపము! అర్ణవ ష్ఠీవీ, నీ అన్నమాట ఎట్లున్నను, నీ విషయమున మాత్రము, వరము శాపము వలె పరిణమించినదన్న మాట!

అర్ణవ: లేదు మహాప్రభూ! మా అన్న వరము కూడ వానికి దౌర్భాగ్యము అయినది! వాని కన్నీరు బంగారమగుట చూచి, చుడవచ్చినవారు పొత్తళ్లలో శిశువును గిల్లి గిచ్చి ఏడ్పించెడి వారట!

అకంప: దాది పాలెక్కువ పట్టి, నోట వేలు పెట్టి కక్కంచి ఆ కక్కును మూటకట్టుకు పోయేదట!

అర్ణవ: వాని మల మూత్రముల సంగతి సరేసరి మహాప్రభూ! మా తల్లితండ్రులే వాటి అధికాధిక సేకరణకు వానికి ఏవేవో తినిపించెడి వారట!

దశరథ: అభోద శిశువు పట్ల ఎంతటి అత్యాచారము! ఇప్పుడతడు ఎక్కడ నున్నాడు అర్ణవా!

అర్ణవ: ఇంకెక్కడ ఉన్నాడు మహాప్రభూ! వాని కఢుపులో బంగారముందని, అదే అలా బయట పడుతోందని నమ్మిన కొందరు దొంగలు మా ఇంట పడి-

అకంప: ఆరునెలల వయసులోనే వాన్ని ఎత్తుకుపోయి ఇంటి వెనుక తోటలోనే, పొట్టకోసి బంగారము కనపడక పారేసి పోయారట!

దశరథ: ఇసీ! మనుజుల లోభగుణము ఎంత చెడ్ఢది! అర్ణవా, నీవు ఇదివరకు ఎచట నుండెడివాడవు?

అర్ణవ: చిన్న మహారాణి కైకమ్మగారి వద్ద కాపలా కాసేవాణ్ని మహాప్రభూ!

అకంప: నెల రోజులలోనే వీడు కార్చిన చెమట చెరువయి పోవడం చూసి, కైకమ్మగారు, సుమంత్రుల వారితో ఆలోచించి బహిర్భూమిలోని మీ ఆలోచనా మందిరానికి మార్చారు మహారాజా! నన్నడిగితే వీడు – వీడు, కోట కవతల కందకం దగ్గర కాపలా కాస్తే బాగుంటుంది మహారాజా!

దశరథ: తప్పు అకంపనా! ఒరుల బలహీనతను చూచి ఓర్మి వహింపవలెను గాని, పరిహాసము సేయుట తగదు. అది సరియే! మీరిద్దరు కలిసి చూసిన దృశ్యముల మాట ఏమి?

అర్ణవ: మహాప్రభూ! రాత్రి రెండుఝాములు దాటిన తరువాత, నేనును అకంపనుడునూ కలిసి, పహరా తిరుగుతూ వాటిని చూసాము మహాప్రభూ! ఒక కోతి – మిమ్ములను- క్షమించండి మహారాజా! మీ వంటి పురుషాకృతిని తరుముతున్నట్లును..

అకంప: ఒక దేవతా స్త్రీ తల విరబోసుకొని మనకోట నాలుగు బురుజుల మీదుగా తిరుగుచున్నట్లును..

అర్ణవ: మహాప్రభూ! మీ వంటి పురుషాకృతి – ఒక ఎనుబోతు నెక్కి, ఆకాశంలోకి దక్షిణ దిశగా వెళ్లుచున్నట్లును..

దశరథ: ఆ పిమ్మట నేను, అదే నా వంటి పురుషాకృతి చెరసాలలో బందీ అయినట్లునూ… ఇవియేనా మీరు చూసిన దృశ్యములు?

ఇధ్దరూ: అవునవును మహారాజా!

దశరథ: నేను కూడ వాటిని చూచితిని, కాని నా కవి స్వప్న దృశ్యముల వలె కన్పట్టినవి.

అకంప: (కంపిస్తూ) మే.. మేము మాత్రం వాటిని కంటితోనే చూసాము మహారాజా! కలలో కాదు.

అర్ణవ: అవును మహాప్రభూ! కల కాదు, నిజంగానే చూసాం.

దశరథ: అకంపనా! రాత్రి చాలసేపటి వరకు మాతో మంతనము లాడిన సుమంత్రులవారు ఇంటికి మరలి ఉండరు. ఇక్కడే, రాజప్రసాదమునందే విశ్రమించినారేమో నీకు తెలియునా?

అకంప: నిజము మహారాజా! వా రీ మందిరములోనే విశ్రమించి ఉన్నారు.

దశరథ: వారిని మేల్కొలిపి, రాజాజ్ఞ నెరిగించి తోడ్కొని రమ్ము.

(అకంపనుడు వణుకుతూ వెళ్లబోతాడు.)

దశరథ: ఆగుమాగుము అకంపనా! నీ మేని కంపనములు ఇంకను తీరినట్లు లేదు. నీ విచ్చోటనే యుండుము అర్ణవ ష్ఠీవీ, నీవు వెళ్లి అమాత్యులవారిని తోడ్కొని రమ్ము.

అర్ణవ: చిత్తము మహాప్రభూ! (వెళ్తాడు)

దశరథ: అకంపనా!

అకంప: ఆజ్ఞ మహారాజా!

దశరథ: అర్ణవుని యీ దురవస్థ నుండి తప్పించుటకు మార్గమేదైనను కలదా?

అకంప: తపశ్శాలులైన మహాత్ములెవరో మాయందు దయయుంచి దీవించిన నాడే యీ దురవస్థల నుండి బయట పడుట!

దశరథ: ‘మా’ అనుచున్నావేమి అకంపనా! నీవును ఆపదల పాలైతివా?

అకంప: మహారాజా! మీ కడ ఎటుల చెప్పుకోగలను. నా అత్త కూతురు ‘మిత్తి’ వోలె నా గడప తొక్కి, నన్ను ఆపదల పాలు చేయుచున్నది.

దశరథ: ఇల్లాలిని మృత్యుదేవతతో పోల్చుట తగని పని అకంపనా!

అకంప: మహారాజా! నా ఇల్లాలు ఆ మృత్యుదేవతకే మృత్యువు! పగలు చూసిననే రాత్రి కలలోకి వచ్చు సౌందర్య విశేషము కలది. ఇక రాత్రి చూసిన వేరు చెప్పవలెనా? నేను రాత్రి కొలువులు చేసేది అందుకే మహారాజా!

దశరథ: ‘భార్యా రూపవతీ శతృః’ అన్న ఆర్యోక్తి వినలేదా అకంపనా? ‘నగుమోముగల చాన, నల్లనిదైనా మగనికి లోకాన మరుపాల వాన’ కురిపింప గలదు సుమా!

అకంప: మహారాజా! అది నల్లని తుమ్మమొద్దు అయినను నేను భరింపగల వాడనే గాని, కణకణ మండే బొగ్గుల కుంపటి యైన, ఎట్లు సహింప గలను?

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

2 Responses to నీల గ్రహ నిదానము – 2

  1. Ravi Kumar says:

    Waiting for further scenes

    Curious to know what the writer wants to say

Comments are closed.