ఈ లోపల తనకు లేఖరాసిన యువతీమణిని ఎంతమాత్రమూ గుర్తించలేక తికమక పడ్డాడు. అతను తీక్షణంగా చూడటంలో అవతల స్త్రీలుకూడా దీనమానవుడి హృదయంలో తీయనైన బాధ రేకెత్తించ జాలిన చూపులు పరవటం కానవచ్చింది. అతను చివరకు, “ఉఁహు! ఊహించటానికి లేదు!” అనుకున్నాడు. అయితే ఇందువల్ల అతని ఉల్లాసం భంగంకాలేదు. అతను విశృంఖలంగా కొంతమంది స్త్రీలతో సరసోక్తులాడుతూ అండుగులో అడుగు వేసుకుంటూ ఈ స్త్రీ దగ్గిరికి నడిచాడు; కొంతమంది పొట్టి, ముసలి షోకిలాలు – వాళ్లని “పొట్టిగిత్తలు” అంటారు – ఆడవాళ్ల మధ్య చలాకీగా తిరుగుతూ ఇలాగే నడుస్తారు. అతను ఒక కాలిని తోకలాగా నేలమీద ఈడుస్తూ, కుడిపక్కకూ, ఎడమపక్కకూ గిరుక్కున తిరుగుతూ ముందుకు సాగాడు. స్త్రీలు అతన్ని ఎంతో ఆదరంతో చూడటమేగాక, అతనిలో ఎన్నో మంచిగుణాలూ, ఆనంద దాయకమైన గుణాలూ ఉన్నట్టు తెలుసుకోవటమేగాక, అతని ముఖభంగిమలో ఒక విధమైన వీరలక్షణంకూడా ఉన్నట్టు కనిపెట్టారు; వీరలక్షణం స్త్రీలను ఎంత బాగా ఆకర్షించేదీ మనకు తెలుసు. అతన్ని గురించి వారిలో తగాదాలుకూడా బయలుదేరాయి. అతను ఎక్కువగా వాకిలి ప్రాంతాల నిలబడి ఉండటం గమనించి కొందరు స్త్రీలు ఆకస్మాత్తుగా కొందరు స్త్రీలు ఆకస్మాత్తుగా వాకిలి సమీపంలో ఉండే ఆసనాలలో చేరటానికి ఎగబడ్డారు, వారిలో ఒకతె ముందు ఆసనం సంపాదించేసరికి అసహ్యకరమైన పోట్లాట జరిగినంత పని అయింది; తాము చేయదలచిన పనే ఇతరులు చేసేయ్యటం చూసి కొందరు, ఇంత వెలికితనమా అని చీదరించుకున్నారు కొందరు.
చిచీకవ్ స్త్రీలతో సంభాషించటంలో నిమగ్నుడై ఉన్నాడు, అంతకంటె, స్త్రీలే అతన్ని తమ సంభాషణలో నిమగ్నుణ్ణిచేసి పరవశుణ్ణి చేశారనటం యుక్తం. వారు తమ సంభాషణలో ఎన్నో నర్మోక్తులూ, ద్వంద్వార్థాలతో కూడిన మాటలూ చొప్పించారు; వాటి అంతరార్థం గ్రహించే ప్రయత్నంలో అతని నుదుట చెమటలుపోశాయి. ఈ గొడవలో అతను ఇంటి యజమానురాలిని పలకరించటం తన ధర్మమన్న సంగతికూడా మరిచాడు. కొన్ని నిమిషాలుగా అతని దగ్గిరనే నిలబడివున్న గవర్నరుగారి భార్య గొంతువినపడినాకనే అతనికాసంగతి స్ఫురణకు వచ్చింది. ఆవిడ కొంటెగా తలపంకించి, మృదువుగానూ నిష్ఠురంగానూకూడా, “ఓహో, మీరిక్కడే ఉన్నారన్నమాట పావెల్ ఇవానవిచ్!” అన్నది. తరువాత ఆవిడ అన్న మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పటం నాకు సాధ్యంకాదు. కాని, గొప్పవాళ్ళ పద్ధతులు తమకు తెలుసునని గర్వపడే సాంఘిక నవలా రచయితలు తమ రచనలలో డ్రాయింగ్ రూమ్ సన్నివేశాలు చిత్రించేటప్పుడు గొప్ప స్త్రీలూ, పురుషులూ సంభాషించే విధంగా, ఆమె అత్యంత మర్యాదగా ఏదో అన్నది; అది ఈ ధోరణిలో ఉండవచ్చు- “మీరు నిర్దయతో స్మరించటం మానుకున్న వారికి ఏ మాత్రమూ, ఒక మూల ఇంత చిన్నస్థానమైనా లేకుండా మీ హృదయాన్ని వారు అంత సమగ్రంగా తస్కరించారా?” మన కథానాయకుడు వెంటనే గవర్నరు భార్యకేసి తిరిగి, ఫాషనులో ఉన్న నవల్లోని జ్వోన్ స్కీలూ, విన్ స్కీలూ, లీదిన్లూ, గ్రేమిన్లూ, తదితర సమర్థులైన సైనికాధికారులూ ఉచ్చరించే భాషకు ఏ మాత్రమూ తీసిపోని భాషలో జవాబివ్వబోతూ కళ్ళెత్తి చూసి నుంచున్న వాడు నుంచున్నట్టే కొయ్యబారిపోయాడు.
అతని ఎదట ఉన్నది గవర్నరుగారి భార్య ఒక్కతే కాదు, ఆవిడ చేతిమీద చెయ్యివేసి ఒక పదహారేళ్ళ పిల్లకూడా ఉన్నది. మిసమిసలాడే ఆ పిల్ల జుట్టు తేలికరంగుగా వున్నది, ఆమె ముఖాంగాలు సుకుమారంగానూ, నాజూకుగాను ఉన్నాయి. గడ్డం కోసగా ఉన్నది. ముఖం అండాకృతిగలిగి ఆకర్షణీయంగా ఉన్నది. ఆవర్తులమైన ముఖాన్ని ఏ చిత్రకారుడైనా మెడోనా చిత్తరువు చిత్రించటానికి నమూనాగా తీసుకుని ఉండవచ్చు; కొండలూ, అడవులూ, మైదానాలూ, ముఖాలూ, పెదవులూ, పాదాలూ, సమస్తమూ విశాలంగా ఉండే రష్యాలో అలాటి ముఖం అరుదని చెప్పాలి. అతను నజ్ ద్రోవ్ ఇంటినుంచి వచ్చేటప్పుడు బండివాడి బుద్ధి తక్కువవల్ల నైతేనేం గుర్రాలబుద్ధి తక్కువవల్ల నైతేనేం బళ్లు ఒకదాని కొకటి తాకి, జీనుల చిక్కుపడి మిత్యమామా; మిన్యాయ్ మామా సహాయం చెయ్యటానికి వచ్చారే అప్పుడు కనిపించిన పిల్లే ఈ పిల్ల.
చిచీకవ్ ఎంతగా వివశుడైనాడంటే అతనిచోట అస్పష్టంగా ఏ మాటలు వెలువడ్డాయో దేవుడికే తెలియాలి; ఒక గ్రేమిన్ గాని, జ్వోన్ స్కీ గాని, లీదిన్ గాని అలా ఒక్కనాటికి మాట్లాడి ఉండరు. “మీకు మా అమ్మాయి తెలియదా? ఇప్పుడే బడి పూర్తి చేసింది” అన్నది గవర్నరు భార్య. కాకతాళీయంగా అదివరకే తనకు ఆమె పరిచయభాగ్యం కలిగినట్టు చిచీకవ్ చెప్పాడు. అతను ఇంకా ఏదో అందామనుకున్నాడు కాని ఆ అనుకున్నది పైకిరాలేదు. గవర్నరుగారి భార్య మరి రెండు మూడు మాటలు మాట్లాడి ఇతర అతిథులను పలకరించటానికి గది రెండో చివరకు తన కుమార్తెతో సహా వెళ్ళిపోయింది. షికారుకని బయలుదేరి వీథిలోకి వచ్చిన మనిషి అన్నివైపులా చూసేసమయంలో ఏదో మరిచాననుకుని కొయ్యబారి నిలబడిపోయిన వాడిలాగా చిచీకవ్ అక్కడే నిలబడిపోయాడు. అటువంటిమనిషి పరమచవటలాగా కనిపిస్తాడు, అంతలోనే అతని ముఖాన ఉండిన నిర్విచారభావం కాస్తా మారి పోతుంది; తాను మరిచినదేమిటా అని తన్నుకుంటాడు; చేతిరుమాలా? చేతురుమాలు జేబులోనే ఉంది; డబ్బా?-డబ్బుకూడా జేబులో ఉంది; అన్నీ దగ్గిర ఉన్నట్టే ఉన్నాయి, కాని ఏదో అశరీరవాణి ఏదో మరచిపోయినట్టు చెబుతుంది. అతడు అర్థంలేకుండా, పరధ్యానంగా కదిలే జనంకేసీ, పరిగెత్తేబళ్ళకేసీ, మార్చ్ చేస్తూ వెళ్ళే సైనికుల టోపీలకేసీ, తుపాకీలకేసీ, దుకాణాలమీది సైన్ బోర్డుల కేసీ చూస్తాడు; దేన్నీ స్పష్టంగా చూడడు. అదేవిధంగా చిచీకవ్ తన చుట్టూ జరిగేదానికంతకూ దూరమైపోయాడు. ఈ లోపుగా స్త్రీల సుగంధితాధరాలు నవనాగరికతతోనూ, మర్యాదతోనూ నిండిన సూచనలు పలుకుతున్నాయి, ప్రశ్నలు వేస్తున్నాయి; అవి ఈ ధోరణిలో ఉన్నాయి: “ఈ ప్రపంచంలో ఉండే సామాన్యమనుషులం మీరు దేన్ని గురించి కలలుకంటున్నారో అడగ సాహసించటానికి అనుమతిస్తారా?” “మీ భావన ఏ సుఖమయ ప్రపంచంలో విహారం చేయబోయినదీ తెలుసుకో వచ్చునా?” “మిమ్మల్ని ఆనందసాగరంలో ఓలలాడించే ధన్యురాలెవరో!” అయితే ఇంత చక్కని కవిత్వమూ వృధాఅయిపోయింది, అతను ఒక్కముక్కా వినలేదు. పైపెచ్చు అతను అమర్యాదగా అక్కడి నుండి కదిలి, గవర్నరుగారి భార్య తన కుమార్తెతో సహా ఎటువెళ్ళినదీ చూడటానికి గది అవతలి వేపు వెళ్ళిపోయాడు. అయితే ఆ స్త్రీలు అతన్ని అంతసులువుగా వదిలిపెట్టదలచలేదులాగుంది, వారిలో ఒకతె పురుషుల మనశ్శాంతిని భంగపరిచే ప్రతి ఒక అస్త్రాన్నీ ప్రయోగించి, తనలోగల ఆకర్షణలనన్నిటినీ సమగ్రంగా ఉపయోగించ నిశ్చయించుకున్నది. ఒక్క విషయం చెప్పాలి: కొందరు స్త్రీలు-కొందరు మత్రమే, అందరూ కాదు-ఒక దౌర్బల్యాన్ని ప్రదర్శిస్తారు. తమలో తమకు ఏదైనా ఒక అందం-పెదవులో, నుదురో, చేతులో-ఉన్నదనితోస్తే, దాన్ని అందరూ చూస్తున్నారనీ, ముక్తకంఠంతో, “చూడు, చూడు, ఆమె ముక్కు గ్రీకు ముక్కులాగా అందంగా ఉంది కాదూ?… ఎంత చక్కని పాలరాతి వంటి నుదురో?” అని చెప్పుకుంటున్నారనుకుంటారు. చక్కని భుజాలు గలది, యువకులంతా వాటిని చూసి సమ్మోహితులవుతున్నారనీ, తాను పక్కగా వెళ్ళినప్పుడల్లా, “ఆమె భుజాలెంత అద్భుతంగా ఉన్నాయి!” అనుకుంటున్నారనీ, వాళ్ళు తన మొహం కేసి గాని, జుట్టుగాని, ముక్కుగాని, నుదురుగాని చూడటంలేదనీ, ఒకవేళ చూసినా వాటిని పరిగణించరనీ అనుకుంటుంది. కొంతమంది స్త్రీలు అలా అనుకుంటారు. నృత్యాలప్పుడు సాధ్యమైనంత ఆకర్షణీయంగా ఉండాలనీ, తనలో విశిష్టంగా ఉన్న వాటిని జేగీయమానంగా ప్రదర్శించాలనీ ప్రతి స్త్రీ కూడా తన మనస్సులో శపథం చేసుకున్నది. వాలెట్జ్ నృత్యం చేస్తూ పోస్టుమాస్టరు భార్య తన తలను ఒక పక్కకు ఎంత ఒయ్యారంగా వంచిందంటే ఆమె ఇంకో ప్రపంచం నుంచి దిగి వచ్చిన దానిలాగా కనబడింది. పాపం, ఒక ఇల్లాలు నృత్యం చెయ్యాలనుకుని రాలేదు, ఎందుకంటే ఆమెకుడిపాదంమీద కాయి రూపంలో చిన్న “ఇబ్బంది” ఏర్పడింది, అందుకని ఆవిడ మెత్తని పాద రక్షలు ధరించింది కూడానూ అయినా ఈ యిల్లాలు, కేవలం పోస్టుమాస్టరు భార్య తాను గొప్పదాన్ననుకుని పోకుండా ఉండగలందులకు ఆ మెత్తని పాదరక్షలతోనే నృత్యంలో చేరిపోయి కొద్దిచుట్లు తిరిగింది.
కాని ఇవేవీ చిచీకవ్ మీద పారతాయనుకున్న విధంగా పారలేదు. అతను ఆడవాళ్ళు చుట్లుతిరగడం కూడా గమనించలేదు, తనను ఆకర్షించిన సుందరి ఎక్కడ ఉన్నదోనని అతను చీటికీ మాటికీ మునివేళ్ళ మీద నిలబడి మనుషుల తలలమీదుగా చూస్తున్నాడు; వీపులమధ్యగా భుజాలమధ్యగా చూడటానికి వంగుతున్నాడుకూడా. చివరకు అతని అన్వేషణ ఫలించింది, తల్లి కూతుళ్ళు ఒకచోటకూచుని కనిపించారు, తల్లి నెత్తినపెట్టుకున్న తలపాగా, అందులోఉన్న ఈకా దర్జాగా ఆడుతున్నాయి. అతను వారిమీదికి దండయాత్ర చేసేవాడులాగా బయలుదేరాడు. వసంతకాల ప్రభావమో, అతన్ని ఎవరన్నా వెనకనుంచి తోశారోగాని, అతను ఏదీ లక్ష్యపెట్టకుండా ముందుకు తోసుకుంటూ వెళ్ళాడు. అతని తోపుతో సారాపన్ను కంట్రాక్టరు పడినంతపని అయి ఒంటికాలిపైన బాలెన్సు కాపాడుకున్నాడు, ఆయనే పడితే ఆయనతో బాటు చాపకట్టగా ఇంకా ఎందరో పడి ఉండేవారు. పోస్టుమాస్టరు సమయానికి వెనక్కు తగ్గి దారి ఇచ్చి అతనికేసి వింతగానూ, కొంచెం వ్యంగ్యంగానూ చూశాడు. కాని అతను వీళ్ళను గమనించనేలేదు; అతనికి దూరాన ఉన్న ఆ అందమైనపిల్ల తప్ప ఇంకేమీ కనపడటం లేదు. ఆమె చేతికి పొడుగుపాటి తొడుగు వేసుకుంటున్నది, బహుశా నృత్యం చెయ్యాలని ఆమె హృదయం తహతహలాడుతూ ఉండి ఉంటుంది.
అప్పటికే నాలుగుజంటలు మడమలతో తాళం వేస్తూ మజుర్కా నృత్యం చేస్తున్నారు. ఒక మిలటరీ కాప్టెను దీక్షగా నృత్యంచేస్తూ, ఎవరూ కలలోకూడా చెయ్యలేనివిధంగా పాదవిన్యాసాలు చేస్తున్నాడు. చిచీకవ్ మజుర్కా నృత్యాలుచేసే వాళ్ళకాళ్ళను దాదాపు తొక్కుకుంటూ గవర్నరుగారి భార్యా, కుమార్తే కూచుని ఉన్న చోటికి చేరుకున్నాడు. అతను వారిని సమీపించటం మాత్రం పిరికిగానే ఉన్నది, షోకిలాలాగా అడుగులో అడుగు వేస్తూ, నడవటం ఏమీ లేదు. అతను కాసేపు ఒక కాలిమీద, కాసేపు రెండో కాలిమీద బరువు వేస్తూ ఏమీసరిగా చేయటం చాతగాని వాడిలాగా కూడా కనిపించాడు.
మన కథానాయకుడి హృదయాన్ని ప్రేమభావం ఆవహించిందని నమ్మకంగా చెప్పటానికి లేదు. ఆ మాటకు వస్తే అతనిలాటి మనుషులు, లావూ సన్నమూ కూడా కానివాళ్లు, ప్రేమించగలరనేది అనుమానాస్పదం. అయినప్పటికీ ఇదేదో వింతవికారం, అది అతనికే సరిగా అర్థం కాలేదు. ఈ నృత్యోత్సవమూ, సందడీ, సంభాషణలూ కొన్ని నిమిషాలసేపు అతనికి ఎక్కడో దూరాన ఉన్నట్టుగా తోచింది, ఈ సంగతి తరవాత అతనే తెలుసుకున్నాడు; ఫిడేళ్ళూ, ట్రంపెట్లూ దూరంగా మోగుతున్నట్టనిపించింది, అజాగ్రత్తహా చిత్రించిన బొమ్మలో దూరపు వివరాలు అలుక్కుపోయినట్టుగా, అంతా మంచు తెరకప్పిన విధంగా కనబడింది. కెలుకుడుగా చిత్రించిన ఈ మసక దృశ్యంలో స్పష్టంగా కనిపించినది ఆ సుందరాంగి సుకుమారముఖాంగాలే: చిన్న కోలముఖమూ అప్పుడే బడి చదువు మానేసిన ఆడపిల్లల కుండదగిన సన్నని, సుకుమారమైన శరీరమూ, అందమైన ఆమె అవయవాలను కప్పి, వాటి ఆకారాన్ని ప్రస్ఫుటం చేసే తేలికైన తెల్లని, దాదాపు నిరాడంబరమైన దుస్తులూనూ. ఆమె దంతంమలిచి చేసిన ఆటవస్తువులాగా ఉన్నది; కళాకాంతులు లేని ఆమూక మధ్య ఆమె ఒక్కతే తెల్లగా, స్వచ్ఛంగా, కాంతులీనుతూ కనబడింది.
ఇది కూడా సాధ్యమేలాగ కనిపిస్తుంది; చిచీకవ్ లుకూడా తమ జీవితంలో కొద్ది క్షణాలపాటు కవులై పోతారులాగుంది; కాని “కవి” అన్నమాట అతిశయోక్తి కావచ్చు. ఏమైనా అతను యువకుడు లాగా, దాదాపు అశ్విక సైనికుడిలాగా, అయిపోయాడు. వారి పక్కన ఖాళీకుర్చీ ఉండటం చూసి చప్పున అందులో కూచున్నాడు. మొదట్లో సంభాషణ సాగలేదు, కాని తరవాత పరిస్థితి కొంచెం బాగుపడింది. అతనికి ఆత్మ విశ్వాసంకూడా తిరిగి రాసాగింది… ఈ సందర్భంలో నేను విచారపూర్వకంగా ఒక విషయం చెప్పవలసి ఉంది; అదేమంటే పెద్ద హోదాలలో ఉన్న గొప్పవాళ్లు ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త భారీ ప్రసంగాలు చేస్తారు; ఈ విషయంలో లెఫ్టినెంటులు చాలా సమర్థులు, కాప్టెనుకు మించిన హోదా గలవాడు ఇందుకు పనికేరాడు. వాళ్లకది ఎలా చాతనయేదీ దేవుడికే తెలియాలి: వాళ్లు మామూలుగానే మాట్లాడుతున్నట్టుంటారు, కాని వినే యువతి పట్టలేకుండా నవ్వేస్తూ ఉంటుంది. అదే ఏ సివిలు కౌన్సిలరో అయితే రష్యను సామ్రాజ్యంయొక్క విస్తృతిని గురించి ప్రసంగిస్తాడు, ఒకవేళ చమత్కారంగా ఆమెను ప్రశ్నిస్తున్నా ననుకుని మాట్లాడినా అది పుస్తకాలలో రాసినట్టుంటుంది; నిజంగానే హాస్యంగా ఏదన్నా అన్నాడంటే వినేమనిషికన్న తానే గట్టిగా నవ్వేస్తాడు. మన కథానాయకుడు మాట్లాడుతుంటే గవర్నరుగారి కుమార్తె ఎందుకు ఆవలించినదో పాఠకుడికి అర్థం కాగలందులకు ఈ విషయం ఇక్కడ ప్రస్తావించటమయింది. అయితే అతను ఈ సంగతి గమనించక, అతను ఎన్నోచోట్ల ఎన్నోసార్లు చెప్పిఉండిన అనేక తమాషా సంగతులు ఏకరువు పెట్టాడు; వాటిని అతను లోగడ సింబిర్ స్క్ రాష్ట్రంలో సోఫ్రన్ ఇవానవిచ్ బేజ్ పెచ్నీ ఇంటివద్దా, అది లాయిదా సోఫ్రనన్నా ముగ్గురు ఆడబిడ్దల ఎదటా, ర్యజాన్ రాష్ట్రం లో ఫ్యదోరవిచ్ పెరిక్ట్రోయెవ్ ఇంటా, అతని తమ్ముడు ప్యోతర్ వసీల్వెనిచ్ ఇంటివద్దా, అతని వదినె మొదలైన స్త్ర్రీల ఎదటా, వ్యాత్క రాష్ట్రంలో ప్యోతర్ వర్సనో ఫ్యెవిచ్ ఇంటా, అతని చెల్లెలు వగైరా స్త్ర్రీల ఎదటా చెప్పి ఉన్నాడు.
చిచీకవ్ ప్రవర్తన మహిళలెవరికీ కొంచెం కూడా నచ్చలేదు. ఈ విషయం అతనికి తెలిసిరాగలందులకు ఒక మహిళ పనిపెట్టుకుని అతని పక్కగా నడిచిపోవటమేగాక, గవర్నరు కుమార్తెను అలక్ష్యంగా రాసుకుంటూ వెళుతూ, తన భుజంమీదుగా వెళ్ళాడే స్కార్ఫ్ ఆమె ముఖానికి కొట్టుకునేటట్టు చేసింది, అదే సమయంలో అతనివెనకనున్న ఒక స్త్రీనుంచి “ఊదా” పూలవాసనతో బాటు ఏవో మత్సరపు మాటలు కూడా వెలువడ్డాయి. అతను ఆ మాటలను వినలేదో, వినికూడా వినినట్టు నటించాడోగాని, ఎలాగైనా పొరబాటేచేశాడు; ఎందుకంటే ఆడవాళ్ళ అభిప్రాయాలను పాటించాలి; ఇందుకతను తరువాత పశ్చాత్తాప పడ్డాడు, కాని అప్పటికి మించిపోయింది.
చాలామంది ముఖాలలో ఆగ్రహం కనిపించింది, అందుకు తగిన కారణంవుందికూడానూ. చిచీకవ్ కు సంఘంలో గొప్పపలుకుబడే ఉండుగాక, అతను కోటీశ్వరుడుగాని, అతని ముఖంలో వీరుల లక్షణాలుంటే ఉండనీ, ఎవడిలోనైనా స్త్ర్రీలు క్షమించలేని విషయాలు కొన్ని వున్నాయి; వాళ్ళు క్షమించకపోయిన ఆ మనిషిని ఖర్చు రాయ వలసిందే! మామూలుగా స్త్రీ పురుషుడి కంటె బలహీనురాలూ, అసహాయురాలూ అయినప్పటికి, కొన్నికొన్ని పరిస్థితుల్లో మగవాడి కన్నా, మరి దేనికన్నా కూడా దృఢంగా తయారవుతుంది. చిచీకవ్ అనుకోకుండా చూపిన తృణీకారభావం మూలాన, అతని సమీపంలో ఆసనాలు సంపాదించటానికి పోటీ పడటంలో తమ మధ్యగల ఐక్యతా సామరస్యాలను దాదాపు నాశనం చేసుకున్న మహిళలు వాటిని తిరిగి నిలబెట్టుకున్నారు. అతను మామూలుగా అన్న మాటలలో వెటకారం ఉన్నట్టు అర్థాలు తీశారు. దీనికితోడు నృత్యంచేసిన వారిమీద కొందరు యువకులు వ్యంగ్యకవిత్వం చెప్పేసరికి ఆ పద్యాలను చిచీకవ్ కు అంటగట్టారు. (మారుమూల పట్టణాల్లో నృత్యోత్సవాలు జరిగినప్పుడు ఇటువంటి వికటకవిత్వం సృష్టి అవుతూనే ఉంటుంది.) అంతకంతకూ ఆగ్రహం రెచ్చిపోయింది. మూలమూలలచేరి స్త్రీలు అతన్ని గురించి అమర్యాదగా మాట్లాడుకున్నారు. ఇక ఆ పసిదాని సంగతి వేరే చెప్పనవసరం లేదు, ఆమె అదివరకే వారి శాపానికి గురిఅయింది.
ఇప్పుడు మనకథానాయకుడికి అత్యంత విషాదకరమైన అనుభవం తటస్థించనున్నది. ఆ పిల్ల ఒకవంక ఆవలిస్తూఉంటే అతను తనకు అనేక సందర్భాలలో కలిగిన అనుభవాలను చెప్పుకుపోతున్నాడు. ఒక సందర్భంలో గ్రీకు వేదాంతి అయిన డయోజినిస్ నుకూడా ప్రస్తావించాడు. ఇంతలో దూరాన ఉన్న గదినుంచివస్తూ నజ్ ద్ర్యోవ్ కనిపించాడు. అతను తాగే చోటినుంచి తెంచుకుని అయినా వచ్చి ఉండాలి, జోరుగా భారీఎత్తున పేకాట సాగుతున్న మరొక గదినుంచి తనకు తానైగాని, ఇతరులచేత గెంటబడిగాని వస్తూ ఉండవచ్చు. ఏమైనా అతను భలే జలసాగా ఉన్నాడు, ప్రాసిక్యూటరు చెయ్యిపట్టుకుని వేళ్లాడుతున్నాడు. అయినను పాపం అతను అలా ఎంతసేపటినుంచీ అంటిపెట్టుకుని తిరుగుతున్నాడో గాని, ఈ చెట్టపట్టావదిలించుకుని ఎలా బయట పడదామా అని చూస్తున్న వాడిలాగా ప్రాసిక్యూటరు తన కనుబొమలు అన్ని వైపులకూ ఆడిస్తున్నాడు. నిజానికి ఆయనది దుర్భర పరిస్థితే. నజ్ ద్యోవ్ రెండుకప్పుల టీతో బాటు రమ్ కూడా కలిపి తాగి ఉత్సాహం తెచ్చుకుని అడ్డమైన కట్టుకథలూ చెబుతున్నాడు. చిచీకవ్ అతన్ని అంతదూరాన చూస్తూనే త్యాగం చెయ్యటానికి తలపడ్డాడు, అంటే ఆనందదాయకంగా ఉన్న ఆస్థలంనుంచి శీఘ్రంగా పరారీ అయిపోదామని నిర్ణయించుకున్నాడు; రానున్న సమావేశం అతనికి శుభప్రదంగా తోచలేదు. కాని దురదృష్టవశాన సమయానికి గవర్నరుగారు చక్కావచ్చి, ఎలాగైతేనేం పావెల్ ఇవానవిచ్ ని పట్టుకునేందుకు హర్షం వెలిబుచ్చాడు; స్త్ర్రీలప్రేమ చంచలమా, అచంచలమా అనేదాన్ని గురించి తనకూ, మరి ఇద్దరు మహిళలకూ జరుగుతున్న వాగ్వాదంలో అతన్ని తీర్పు చెప్పమని కోరాడు. ఇంతలో నజ్ ద్ర్యోవ్ అతన్ని చూసి దగ్గిరికి రానేవచ్చాడు.
“ఓహో, ఖెర్యోన్ భూస్వామిగారే, ఖేర్యోన్ భూస్వామిగారే!” అని అతను కేకలు పెడుతూ సమీపించి, పెద్దపెట్టున నవ్వుతూంటే, గులాబీల్లాటి అతని బుగ్గలు అదిరాయి. “ఏం చాలామంది చచ్చిన కమతగాళ్ళనుకొన్నావా ఏమిటి? మీకు తెలీదనుకుంటాను. గవర్నరు గారూ, ఇతను చచ్చిన కమతగాళ్ళబేరం చేస్తాడు! ఒట్టు! ఇదిగో. చిచీకవ్! నే చెబుతున్నాగదా, ఇక్కడ అందరమూ నీ మిత్రులమే గవర్నరుగారుకూడా ఇక్కడే ఉన్నారు-నిన్ను నిజంగా ఉరితీయాలి, ప్రమాణపూర్తిగా, ఉరితీయాలిసిందే!”
తాను తలమీద నిలబడి ఉన్నదీ, కాళ్లమీద నిలబడి ఉన్నదీ కూడా చిచీకవ్ కు తెలియలేదు.
“చెబితే నమ్మరుగాని, యువర్ ఎక్సెలెన్సీ, నాతో ఇతను చచ్చి పోయిన నా కమతగాళ్లను కొంటానన్నప్పుడు నవ్వలేక చచ్చాను. ఇతను ముప్ఫై లక్షల ఖరీదుచేసే కమతగాళ్లను కొని ఎక్కడో పెట్టబోతున్నాడని వస్తుంటే తెలిసింది. బలే కమతగాళ్లు! మరి అతను నాతో బేరమాడింది చచ్చినవాళ్లకోసం. ఇదుగో, చిచీకవ్, నువు వట్టి పశువ్వి, ప్రమాణపూర్తిగా నువు పశువ్వి! ఇదుగో గవర్నరు గారు కూడా ఇక్కడే ఉన్నారు…ఉన్నారు గదూ, ప్రాసిక్యూటర్?” అన్నాడు నజ్ ద్యోవ్.
కాని ప్రాసిక్యూటరూ, చిచీకవ్, గవర్నరుగారుకూడా ఎలా దిగ్భ్రాంతులయిపోయారంటే, వారికి ఏమనాలో తెలియలేదు. నజ్ ద్ర్యోవ్ వారిస్థితి గమనించకుండా సగం నిషాలో మాట్లాడుకుపోయాడు.
“ఇదుగో, అబ్బీ, నువు, నువు…చచ్చిన కమతగాళ్లను ఎందుకు కొంటున్నావో తెలిపినదాకా నిన్ను వదలను. ఇదుగో, చిచీకవ్, నిజంగా నువు సిగ్గుపడాలన్నమాట, నాకంటె నీకు ఆప్తమిత్రుడు లేడు, ఆ సంగతి నీకూ తెలుసు…ఇరుగో, గవర్నరుగారు కూడా ఇక్కడే ఉన్నారు…ఉన్నారుగదూ, ప్రాసిక్యూటర్? మే మెలాటి స్నేహితులమో మీరు ఊహించలేరు, యువర్ ఎక్స్లెన్సీ. వాస్తవం అంతే, మీరు నాతో ఇక్కడున్న నాతో, ‘నజ్ ద్ర్యోవ్, నిజం చెప్పు, నీకు మీ నాన్న ఎక్కువా, చిచీకవ్ ఎక్కువా?’ అంటే చిచీకవే అంటాను. ప్రమాణపూర్తిగా… బుగ్గమీద ఏదీ ఒక్క ముద్దు! యువర్ ఎక్స్లెన్సీ, అతన్ని ముద్దు పెట్టుకొనటానికి మీరు అనుమతిస్తున్నారు. అవును చిచీకవ్, మొరాయించి లాభంలేదు, నీ పాల బుగ్గమీద ఒక్క చిన్న ముద్దుకావాలి.”
నజ్ ద్ర్యోవ్ ముద్దు ఎంత తీవ్రంగా ప్రతిఘటించబడిందంటే అతను దాదాపు నేలపై పడపోయాడు. అతని సంభాషణ వినటం ఇష్టంలేక అందరూ ఎడంగా వెళ్లిపోయారు. కాని అతను చచ్చిపోయిన కమతగాళ్ళ కొనుగోలు గురించి అతను ఎంతగట్టిగా అరిచి, నవ్వాడంటే అది ఆగదిమారుమూలల కూచున్న వాళ్ళుక్కూడా స్పష్టంగా వినపడింది. ఈ విడ్డూరమైన వార్త చెవిని పడేసరికి అందరికీ చెక్క మొహాలుపడి, వాటిలోనుంచి మతిమాలిన ప్రశ్నార్థకపు చూపులు వెలువడ్డాయి. అనేకమందిస్త్రీలు కసిగా, ఒకరినొకరు చూసుకుని వికటంగా మందహాసాలు చేసుకోవటం చిచీకవ్ గమనించాడు; కొందరి ముఖాలలోగల అర్థంగాని చూపులు అతని కంగారు మరింత చేశాయి. నజ్ ద్ర్యోవ్ వట్టి ఝాఠాఖోరని అందరికీ తెలుసు, అతను ఎంత అసంగతమైన విషయాలు చెప్పినా ఎవరూ ఆశ్చర్యపడరు. అయినా మనుష్యమాత్రుడు-మనుష్యమాత్రుణ్ణి దేనితో చేస్తారో ఊహించటం కష్టం. మనుష్యమాత్రుడు ఒక కొత్తసంగతి విన్నట్టయితే, అది ఎంత మతిమాలిన కబురైనా సరే, కొత్తసంగతి అయితే చాలు, వెంటనే ఇంకొక మనుష్యమాత్రుడికి చెప్పేస్తాడా; అంతా చెప్పినా, “చూశావా, ఎలాటి వెర్రికబుర్లు పుడతాయో!” అంటాడే అనుకోండి. ఆప్పుడు రెండో మనుష్యమాత్రుడేం చేస్తాడంటే, అంతా ఆత్రంగా వినేసి తానుకూడా, “అవును, వట్టి పిచ్చికబురు , మనం పట్టించుకోవాలిసిందే కాదు”, అనేసి, మూడో మనుష్యమాత్రుణ్ణి వెతుకుతూ బయలుదేరతాడు-వాడితో ఈ కబురు చెప్పి, “ఎంత పిచ్చికబురో చూశావా?” అనటానికి. ఇలా ఈ వార్త ఊరు ఊరంతా చుట్టేసి, ప్రతివాడిచేత విసుగుపుట్టేదాకా చర్చించ బడుతుంది. ప్రతి ఒక్కడూ చర్చించి ప్రాణం విసిగాక అందరూ దాన్ని అర్థంలేని వార్త అనీ, పట్టించుకోనవసరం లేదనీ ఒప్పుకోవటం జరుగుతుంది.
పైకి అర్థరహితంగా కనబడే ఈ సంఘటన మన కథానాయకుణ్ణి చాలా కలవరపరిచింది. మూఢుడి మాటలు ఎంత పిచ్చిగా ఉన్నప్పటికీ ఒక్కొక్కప్పుడు అతి బుద్ధిమంతులనే కలవరపరుస్తాయి. చక్కగా పాలిష్ చేసిన బూట్లు ధరించి మురికిగుంటలోకి దిగినవాడిలాగా అతను అసంతృప్తిచెంది ఆరాట పడసాగాడు – ఇది అతనికి పరమ అసహ్యకరంగా తోచింది. అతను ఆ విషయం ఆలోచించ వద్దనుకున్నాడు, తన అలోచనలను మళ్లించటానికి ప్రయత్నించాడు, తన మనసును అన్యాయత్తం చేద్దామని పేకాటకు కూచున్నాడు, కాని అతని మనస్సు మెలితిరిగిన చక్రంలాగా వంకరగా నడుస్తున్నది; రెండుసార్లు ముక్కలుంచుకుని కూడా రంగు అందించలేదు, ఒకసారి మరచిపోయి మూడో చేతిన కోతపెట్టాడు, మంచిముక్కలు తగలేసి తన ఆట పాడు చేసుకున్నాడు. ఆట చాలానేర్పుగా ఆడగల పావెల్ ఇవానవిచ్ ఇలాటి తప్పులు ఎలాచేశాడో, తాను ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్న ఇస్పేటురాజు మీద ఎందుకు కోతపెట్టాడో అధ్యక్షుడికి కొంచెం కూడా బోధపడలేదు. సహజంగా, పోస్టుమాస్టరూ, అధ్యక్షుడూ, చివరకు పోలీసు అధిపతి కూడా చిచీకవ్ ను కొంచెం వేళాకోళం పట్టించారు: ప్రేమలో పడ్డావా అని అడిగాడు; పావెల్ ఇవానవిచ్ హృదయం గాయపడిందన్నారు, అతన్ని గాయపరిచిన బాణం ఎవరు వేసినదో తమకు తెలుసులెమ్మన్నారు; ఇదంతా వింటూ అతను నవ్వటానికీ, హాస్యం తిప్పికొట్టటానికీ ప్రయత్నించాడుగాని అందువల్ల అతనికి సుఖం లేకపోయింది. రాత్రి భోజనాలదగ్గిరకూడా అతను కోలుకోలేదు. నిజానికి అతని పంక్తినకూచున్న వారంతా బుద్ధిమంతులే, నజ్ ద్ర్యోవ్ ను అంతకుమునుపే సాగనంపారు, ఎందుకంటే అతను బొత్తిగా దుష్టుగా ప్రవర్తిస్తున్నాడని ఆడవాళ్ళు ఆక్షేపించారు. ఒక నృత్యం మధ్యలో అతను నేలపై చతికిలబడి నృత్యం చేసే స్త్రీల లంగాలు పట్టుకు లాగ సాగాడు. స్త్రీలు అన్నట్టు అది “అన్నిటినీ మించిపోయింది.”
భోజనాల దగ్గిర మహావైభవంగా ఉన్నది. మూడుకొమ్మల కొవ్వొత్తి స్టాండ్లముందు కదిలే ముఖాలలోను, మిఠాయీలలోనూ, బుడ్డీలలోనూ సంతృప్తి వెల్లివిరుస్తుంది. ఆఫీసర్లూ, స్త్రీలూ, డ్రెస్ కోట్లు ధరించిన పెద్దమనుష్యులూ – సమస్తమూ మర్యాద ఓడుతున్నది. పెద్ద మనుషులు ఎగిరి గంతేసి నౌకర్లవద్దనుండి వంటకాలుగల పళ్లాలు అందుకుని వాటిని స్త్రీ జనానికి అందించారు. ఒక కర్నలుగారు కత్తిదూసి, దానిచివర ఒక పళ్ళెంపెట్టి ఒక స్త్రీకి అందించాడు. వయసుమళ్లిన పెద్దమనుష్యుల మధ్య చిచీకవ్ కూచున్నాడు; వారు గట్టిగా వాదోపవాదాలు చేస్తూ, ఆవగుప్పించిన చేపలతో, మాంసంతో బాటు వ్యవహార విషయాలుకూడా ఆరగించారు. అతను చర్చించిన విషయాలన్నీ మాములుగా అతనికి ఇష్టమైనవే, కాని అతను దీర్ఘప్రయాణంతో సొలసి, ఏ విషయమూ ఆలోచించకలేక, ఏ చర్చలోనూ పాల్గొనలేని స్థితిలో ఉన్న వాడిలాగా అయిపోయాడు. భోజనాలు పూర్తి అయిన దాకానైనా ఉండకుండా అతను మామూలుకన్న త్వరగా ఇంటికి వెళ్లిపోయాడు.
తలుపుకు అడ్డంగా పెట్టిన సొరుగులపెట్టే, మూలనుంచి తొంగిచూసే బొద్దింకలూగల చిచీకవ్ గది అదివరకే పాఠకులెరుగుదురు. అందులో ఒక వాలుకుర్చీలో కూచున్న చిచీకవ్ మనస్సు కుర్చీలాగే సౌఖ్యరహితంగా ఉంది. అతని మనస్సులో అసహ్యంతో కూడిన అయోమయస్థితి ఏర్పడి ఉన్నది. అతని హృదయం డొల్ల అయినట్టుగా వుంది. అతను కోపావేశంతో ఇలా అనుకున్నాడు: “ఈ నృత్యోత్సవం ఏర్పాటుచేసిన వాళ్ళు కూలిపోను! ఆ పిచ్చిముండా కొడుకులకు ఏం చూసుకుని ఆనందం? రాష్ట్రమంతటా పంటలు పాడయాయి, క్షామంగా వున్నది, వీళ్ళను చూడబోతే నృత్యోత్సవాలు! మంచి పనే! ఆడంగి రేకులాళ్ళలాగా దుస్తులూ వీళ్ళూనూ! ఆడది వెయ్యి రూబుళ్ళు దుస్తులుకోసం తగలెయ్యటం దారుణం! కమతగాళ్ళు సంపాదించుకుంది కొల్లగొట్టటమే, లేదూ, అంతకంటె మరీఘోరం మనమిత్రుల అంతరాత్మలనే కొల్లకొట్టటం. మనుషులు తమ అంతరాత్మల నోళ్ళుకట్టేసి లంచాలెందుకు గుంజుతారో మనకందరికీ తెలుసు; తన భార్యకు ఒక శాలువో, పైన కప్పుకున్నదో, వల్లకాడుది మరేదో కొనటానికి! అది మాత్రం దేనికీ? ఎవతో నీచురాలు పోస్టుమాస్టరు భార్య ఇంకా మంచిదుస్తులు వేసుకున్నదని పోతుందేమోనని వెయ్యి రూబుళ్లు ధారపొయ్యటమే. “నృత్యోత్సవం, నృత్యోత్సవం! బలే బలే!” అని చంకలెగరేస్తారు! నృత్యోత్సవం వట్టి చెత్తది, అది రష్యను జాతీయతకూ, రష్యను స్వభావానికీ అనుగుణమైనదికాదు. దాన్ని చూసి ఏమనుకోవాలి? గ్రాహికంవచ్చినవాడు వయస్సుమళ్లుతున్న నల్లటి దుస్తులుధరించి, చెంగునదూకి కాళ్లు విసరటం మొదలు పెడతాడు. జంటలు జంటలుగా ఏర్పడ్డప్పుడు ఒక మనిషి ఇంకొకడితో ఏదో ముఖ్యవిషయం ముచ్చటించనారంభిస్తాడు, కాని అతని కాళ్ళు మేకకాళ్ళలాగా కుడిపక్కకూ, ఎడమపక్కకూ గెంతుతూనే ఉంటాయి…అనుకరణ, అంతా అనుకరణ! ఫ్రెంచివాడు పదిహేనో ఏట ఎంత కుర్రగాఉంటాడో, నలభయ్యో ఏటకూడా అంతకుర్రగానూ ఉంటాడు గనక మనమూ అలాగే ఉండాలి! అవును, నిజంగా, ఈ నృత్యోత్సవం అయినాక ఏదో పాపంచేసినట్టనిపిస్తుంది, దాన్ని గురించి ఆలోచించ బుద్ధిపుట్టదు. సంఘంలో ఈ పెద్దవాళ్లతో మాట్లాడినాక బుర్ర ఎంతఖాళీగా ఉంటుందో అంత ఖాళీగానూ ఉంటుంది. వాళ్ళు అన్నిటినీగురించీ ప్రసంగిస్తారు, అన్నిటిని పైపైన తడువుతారు, పుస్తకాలలోనుంచి కాజేసినదంతా తెలివిగానూ, ఆకర్షవంతంగానూ వప్పగిస్తారు, కాని వాళ్ళ బుర్రల్లో ఏమీఉండదు. ఈ పోచుకోలు రాయుళ్లతో మాట్లాడినదానికన్న తన వర్తకంగురించి క్షుణ్ణంగా తెలిసిన ఒక మామూలు బేరగాడితో మాట్లాడటం లక్షరెట్లు నయం.
ఈ నృత్యోత్సవంలో దక్కుటేమిటో చెప్పు చూస్తాం! ఏ రచయితలయినా దాన్ని ఉన్నదున్నట్టుగా వర్ణిస్తే ఏమవుతుంది? అది వాస్తవంగా ఎంత నిరర్థకంగా ఉంటుందో పుస్తకంలో కూడా అంత నిరర్థకంగానే ఉంటుంది. అందులో నీతా, అవినీతా, దాన్ని గురించి ఏమనుకోవాలో దేవుడికే తెలియాలి. చదివేవాడు ఛీ అని పుస్తకం మూసేస్తాడు.”
చిచీకవ్ నృత్యోత్సవాలన్నిటినీ ఈవిధంగా ఖండించాడు; అయితే అతని ఆగ్రహానికి మరొక కారణంకూడా ఉన్నదనుకుంటాను. అతని చిరాకుకు కారణం నృత్యోత్సవంకూడా కాదు, తనకందులో మర్యాద దక్కకపోవటం, తన గతి ఎలా కావాలో అలాకావటం, తాను వహించినపాత్ర అనుమానాస్పదంగా పరిణమించటం. ఇంగితం గలవాడుగా ఆలోచిస్తే అదంతా అర్థంలేనిదేమరి; తన పని విజయవంతంగా ముగిసింది గనక బుద్ధి తక్కువమాట వచ్చినా అందువల్ల నష్టం ఏమీలేదు కూడానూ. కాని – మానవస్వభావం చిత్రమైనది. తాను గౌరవించని మనుషులు తనపట్ల అమర్యాదగా ప్రవర్తించారని అతను ఎంతో నొచ్చుకున్నాడు; వాళ్ళ అతిశయమూ, దుస్తుల వ్యామోహమూ తాను నిరసించాడుకూడానూ. కొంచెం ఆలోచించినమీదట తనవల్ల కూడా తప్పు కొంత ఉన్నట్టు స్పష్టమైనాక అతనికోపంమరింత అయింది. అతనికి కోపంవచ్చినది తనమీదకాదు – కాకపోవటం సబబేకూడానూ. మనని మనం నిందించుకోకపోవట మనే దౌర్బల్యం మన ఆగ్రహానికి గురిచెయ్యటానికి మరెవరినైనా మాటవరసకు మనకందరికీ వున్నది. మన నౌకరునో, ఆఫీసులో సమయానికి ఎదురైన మనకింది ఉద్యోగినో, పెళ్ళాన్నో, ఆఖరుకు ఒక కుర్చీనో చూసుకుంటాం. మన ఆగ్రహానికి కుర్చీయే గురికావటం జరిగితే దాన్ని ఎక్కడికి తన్నేస్తామో మనకే తెలియదు, అది ఏ తలుపుకో తగిలి, కోడో, వీపో విరిగి చక్కాపోతుంది – మన ఆగ్రహాన్ని దానికి రుచిచూపిస్తాం. అందుచేత చిచీకవ్ తన ఆగ్రహాన్ని వెళ్ళబోసుకునేటందుకు త్వరలోనే ఒకణ్ణి సంపాదించాడు. అది నజ్ ద్ర్యోవ్. అతను ఘోరమైన శాపనార్థాలన్నిటికీ గురిచేయబడ్డాడని వేరేచెప్పనవసరం లేదు. అలాటి శాపనార్థాలకు సాధారణంగా గురి అయ్యేది లుచ్ఛా పనులు చేసే గ్రామ పెద్దలూ, ఆరితేరిన సైనికాధికారులు ప్రయాణాలు చేసేటప్పుడు బళ్ళు తోలేవాళ్ళూనూ; ఈ సైనికాధికారులు అనాదిగా అమలులో ఉన్న తిట్లను మాత్రమేగాక అనేక కొత్తవికూడా ప్రయోగిస్తారు. వాటిని సృష్టించినకీర్తి న్యాయంగావారికే దక్కాలి. నజ్ ద్ర్యోవ్ బంధువర్గానికంతకూ అక్షింతలు పడ్డాయి, అతని కుటుంబంలో వారు ఘోరమైన శాపనార్థాలకు గురి అయారు.
మన కథానాయకుడు గట్టి వాలుకుర్చీలో చేరగిలబడి, నిద్రలేమితోనూ, తన ఆలోచనలతోనూ బాధపడుతూ, నజ్ ద్ర్యోవ్ నూ అతని వంశాన్నీ శాపనార్థాలు పెడుతున్నాడు; అతని ఎదట వెలుగుతున్న కొవ్వొత్తి కొడిగట్టి ఏ క్షణానఅయినా ఆరిపోయేలాగున్నది; కిటికీలోనుంచి కనిపించే నల్లని ఆకారం నీలంరంగుకు మారే సూచనలు తెల్లవారబోతున్నట్టు తెలియజేస్తున్నాయి, దూరాన కోళ్ళు ఒకదాన్నొకటి పిలుచుకుంటున్నాయి; నిద్రావస్థలో ఉన్న నగరంలో రహదారి వెంబడి ఒక అభాగ్యుడు తన దారితప్ప మరొకటి తెలియకుండా నడుస్తున్నాడు – రష్యాలో ఉండే త్రిమ్మరులు నడిచి అరగదీసిన రహదారి. ఇదేసమయంలో నగరం ఇంకోమూల మరొకసంఘటన జరుగుతున్నది, ఈ సంఘటన మన కథానాయకుడి కష్టాలను మరింత చెయ్యనున్నది. ఈ సంఘటన ఏమంటే: నగరంలోని మారుమూల వీధులగుండా, గొందులగుండా కిరకిరలాడుతూ ఒక వింతవాహనం వస్తున్నది, దానికొక పేరుపెట్టటంకూడా కష్టమే. అది ఒక కోచికాదు; బండికాదు, బగ్గీకాదు, బుగ్గలు వెళ్ళుకొచ్చిన పుచ్చకాయకు చక్రాలు తగిలిస్తే ఎలా ఉంటుందో ఆ వాహనం అలాఉన్నది. ఈ పుచ్చకాయ బుగ్గలు, అనగా తలుపులు, పచ్చరంగు జాడలు కలిగిఉండి, సరిగా మూసుకోవటం లేదు-ఎందుకంటే వాటి బందలూ, బీగాలూ శిథిలావస్థలో ఉన్నాయి; వాటిని తాళ్లువేసి బిగించారు. ఈ పుచ్చకాయనిండా అనేక మొత్తాలున్నాయి, వీటిలో కొన్ని సంచుల్లాగా, మరికొన్ని అప్పడాలకర్రల్లాగా, మరికొన్ని దిళ్ళలాగా ఉన్నాయి; వాటిమీద గోతాలలో రకరకాల రొట్టెలూ, అప్పచ్చులూ ఉన్నాయి. వీటిపైన చేపలతోనూ, కోడి మాంసంతోనూ తయారు చేసిన వంటకాలు తొంగిచూస్తున్నాయి. బండి మెట్టుమీద ఒక బంట్రోతు ఉన్నాడు. అతని గడ్డంమాసి, అక్కడక్కడా నెరసిఉన్నది; అతను పొట్టి చేనేతజాకెట్టు, మెరిసేరంగుది ధరించాడు. ఈ బండిచేసే రణగొణధ్వనికి నగరం అవతలిచివర ఉండే పహరావాడు తన ఈటెగొడ్డలి చేతిలోకి తీసుకుని నిద్రమత్తులో, “ఎవరావెళ్ళేది?” అరిచాడు; కాని ఎవరూ వెళ్ళటంలేదని గ్రహించి, చప్పుడు ఎక్కడో దూరాన అవుతుందని తెలుసుకొని, తన మెడమీద వాలిన ఏదో ప్రాణిని పట్టుకుని, లాంతరుస్తంభందగ్గరికి తీసుకొనిపోయి, దానిమీద పెట్టి ఆ ప్రాణిని తన గోటితో హత్యచేసి, ఈటెగొడ్డలి కిందపెట్టి, తన వీరధర్మాన్ని అనుసరించి మళ్ళీ నిద్రపోయాడు. బండి గుర్రాలకు లాడాలు లేనందున అవి పడుతూ లేస్తూ నడుస్తున్నాయి. అదీగాక అవి నగరపు వీధులలో పరచిన రాళ్ళకు అలవాటు పడినవికావు. ఈ విడ్డూరమైన వాహనం ఒక వీధిలోనుంచి మరొక వీధిలోకి అనేకసార్లు తిరిగి, చిట్టచివరకు సంత్ నికోలై చర్చి పక్కన గల ఒక చీకటి సందులో ప్రవేశించి, పెద్ద ప్రీస్టువాకిలి ముందునిలిచింది. పొట్టి చలిజాకెట్టు తొడుక్కుని, నెత్తికి రుమాలు చుట్టుకున్న ఒక పిల్ల బండిలోనుంచి దిగి, తలుపుమీద రెండు చేతులతోనూ ఎవరో మనిషిని కొట్టుతున్నట్టుగా కొట్టింది. (బంట్రోతు గాఢనిద్రలో ఉండటం చేత వాణ్ణి తరవాత కాళ్లుపట్టుకుని జరజరా కిందికి ఈడ్చారు.) కుక్కలు మొరిగాయి; తలుపులు బార్లా తెరుచుకున్నాయి. వికారమైన బండి చిట్టచివరకు లోపలికి అంతర్థానమయింది.
ఆవరణ ఇరుకుగా వున్నది. దానినిండా కట్టెల గుట్టలూ, కోళ్ళ కొట్టాలూ ఉన్నాయి. అందులో బండి ప్రవేశించింది. అందులోనుంచి ఒక ఆవిడ దిగింది; ఆవిడ మరెవరో కాదు, కరబోచ్క సతి. మన కథానాయకుడు వెళ్ళిపోయాక, ఆవిడకు పెద్ద బెంగ పట్టుకున్నది: అతను తనను మోసగించాడేమో! ఈ బెంగతో ఆవిడ మూడురాత్రులు నిద్రపోక, గుర్రాలకు లాడాలు వెయ్యలేదన్నదికూడా లక్ష్యపెట్టకుండా పట్నానికి బయలుదేరింది. చచ్చినవాళ్లు ఏ ధరకు అమ్ముతున్నారో, కొంపతీసి తాను న్యాయమైన ధరలో మూడోవంతుకే అమ్మిందేమో కనుక్కుందామని ఆవిడ ఉద్దేశం. ఈ సంఘటనయొక్క ప్రభావం పాఠకుడికి ఇద్దరు స్త్ర్రీల మధ్య జరిగిన సంభాషణ స్పష్టం చేస్తుది. ఈ సంభాషణ – దీన్ని గురించి మరొక ప్రకరణంలో తెలుసుకుందాం.