-కొడవటిగంటి కుటుంబరావు
ఎనిమిదవ ప్రకరణం
చిచీకవ్ చేసిన క్రయం గురించి మాట్లాడుకున్నారు. నగరంలో చర్చలు జరిగాయి. ఒకచోటకొన్న కమతగాళ్లని మరొకచోటికి తరలించటం లాభసాటి బేరము కాదా అన్న విషయమై ఎవరికి తోచినట్టు వారు చెప్పారు. వాగ్వాదాల ధోరణినిబట్టి చాలామందికీ విషయం క్షుణ్ణంగా తెలిసినట్టు స్పష్టమయింది. “అది సరి అయిన పనేలెండి. ఇది మాత్రం నిజం: దక్షిణాది పొలాలు మంచివీ, సారవంతమైనవీనూ, కాని చిచీకవ్ మనుషులు నీరు లేకుండా ఎలా జరుపుకుంటారా అని! “అక్కడ నదిలేదు, తెలుసా?” అన్నారు కొందరు.
“నీరు లేకపోతే ఏమీ ఫరవాలేదు. ఏమీ ఫరవాలేదు, స్తిపాన్ ద్మీత్రెవిచ్. కమతగాళ్లని అక్కడికి చేర్చటంలోనే ఉంది చిక్కంతా. కమతగాళ్ళ సంగతి మనకు తెలుసుగా. వాళ్ళకి ఒక గుడిసెగాని, వంట చెరుకుగాని ఏమీ ఏర్పాటు చెయ్యకుండా కొత్త పొలాలమీద పెట్టి దున్నమంటే, ఇంకేముందీ, కాలికి బుద్ధిచెప్పి అయిపూ అంతూ లేకుండా అదేపోత పోతారు.”
“కాదు, అలెక్సేయ్ ఇవానవిచ్, క్షమించాలి. చిచీకవ్ మనుషులు పారిపోతారంటే నేను ఒప్పుకోను. రష్యను ఉన్నాడే ఏదైనా సాధించగలడు, ఏ ఎండకైనా తట్టుకోగలడు. వాణ్ణి కంచాత్క పంపి చేతులకు చలితొడుగు లిచ్చారంటే, చేతులు చరుచుకుని, గొడ్డలి తీసుకుని, కొత్త ఇల్లు కట్టుకునేందుకు కలప కొట్టుకు రాబోతాడు.”
“కాని, ఇవాన్ గ్రిగెర్యెవిచ్, మీరొక విషయం మరిచిపోతున్నారు: చిచీకవ్ కమతగాళ్లు ఎలాటివాళ్లూ అన్నది మీరు ప్రశ్నించుకోలేదు; ఏ యజమాని అయేది మంచి మనుషులను చచ్చినా అమ్మడన్న సంగతి మీరు మరిచారు. చిచీకవ్ కమతగాళ్లు దొంగలూ, వట్టి తాగుబోతులూ, సోమరిపోతులూ, అల్లరివెధవలూ కాకపోతే తల తీసేయించుకుంటాను!”
“సందేహం లేదు, సందేహంలేదు. మీరన్నది నిజమే. మంచి కమతగాణ్ణి ఎవరూ అమ్మరు. చిచీకవ్ మనుషులు తాగుబోతులే. కాని ఇందులో ఒక నైతిక విషయంకూడా ఉన్నదని మీరు గమనించాలి, ఇది నైతిక సమస్య; వాళ్ళు ఇప్పుడు పనికిమాలిన వెధవలే, కాని కొత్తచోట పెట్టాక వాళ్ళు మంచి పనివాళ్ళుగా మారిపోవచ్చు. అలాటి నిదర్శనాలు నిత్యజీవితంలోనూ, చరిత్రలోనూ కూడా కనిపిస్తాయి.
గవర్నమెంటు ఫ్యాక్టరీల సూపర్నెంటు, “వట్టిది, వట్టిది! నా మాటనమ్మండి, అలా ఒక్కనాటికి జరగదు. చిచీకవ్ మనుషులకు రెండు ప్రబల ప్రమాదాలెదురవుతాయి: ఒకటేమిటంటే చిన్న రష్యా అక్కడికి చాలాదగ్గిర, అక్కడ సారా వర్తకంమీద కంట్రోలు లేదు. నే చెబుతున్నా, ఒక్కపక్షంలోపల వాళ్లంతా తప్పతాగేస్తారు. రెండో ప్రమాదమేమిటంటే, వాళ్ళు ప్రయాణం మూలంగా చరజీవితానికి అలవాటయిపోతారు. అందుచేత చిచీకవ్ విడవకుండా వాళ్లని వెయ్యికళ్ల కనిపెట్టి ఉంటూ గట్టి అదుపులో ఉంచాలి, ప్రతి చిన్న తప్పుకూ గట్టిగా శిక్షించాలి. ఈ పనివాళ్ళకీ, వీళ్లకీ వదిలి లాభం లేదు. అవసరమైనప్పుడల్లా తన చేత్తోనే వాళ్ళ మొహాలు పగలగొట్టాలి, మాడు పగలగొట్టాలి” అన్నాడు.
“చిచీకవ్ తన చేత్తోనే వాళ్లను కొట్టవలసిన అగత్యమేమిటీ? మేనేజరును పెట్టుకుంటాడు!”
“అలాగేం? మేనేజరును తీసుకురండి! అంతా దొంగ వెధవలు!”
“యజమానులు ఏదీ పట్టించుకోకపోతే వాళ్లు దొంగ వెధవలే అవుతారు.”
“అదీ సంగతి. యజమానికి నిర్వహణ చాతనయి, మనుషులను అర్థంచేసుకోగలవాడయితే మేనేజరు మంచివాడు దొరుకుతాడు,” అన్నారు అనేకమంది.
“అయితే, అయిదువేల రూబుళ్ళయినా పోస్తేనేగాని మంచి మేనేజరు దొరకడని సూపర్నెంటు అన్నాడు. మూడు వేలిస్తే చాలు వస్తాడన్నాడు అధ్యక్షుడు. “వాడెక్కడ దొరుకుతాడు? ముక్కు సూటిగా లేడుగా?” అనిసూపర్నెంటు అభ్యంతరం చెప్పాడు.
“ముక్కు సూటిగా లేకపోతేనేం? జిల్లాలోనే ఉన్నాడు. నా మనసులో వున్నాడు ప్యోతర్ పెత్రోవిచ్ సమాయిలవ్. చిచీకవ్ మనుషులకు సరి అయిన నిగామాను అతనే!” అన్నాడు అధ్యక్షుడు.
చాలామంది తామే చిచీకవ్ స్థానంలో ఉన్నట్టు భావించుకుని ఇంతమంది మనుషులను తరలించటంలోగల చిక్కులను తలుచుకుని ఎంతో కంగారుపడ్డారు. చిచీకవ్ మనుషుల్లాటి దుడుకుపిండాలు ఏకంగా తిరగబడవచ్చునని వారికి భయం కలిగింది. అలా తిరుగుబాటు జరిగే భయం ఏమీలేదనీ, పోలీసు అధిపతికి అధికారాలున్నది అలాటివి జరక్కుండా ఆపటానికేననీ, పోలీసు అధిపతి స్వయంగా వెళ్ళవలసిన అవసరంకూడా లేదనీ, ఆయన టోపీని పంపితే అదే వాళ్ళను కొత్తచోటికి తీసుకుపోతుందనీ పోలీసు అధిపతి అన్నాడు. చిచీకవ్ మనుషులలో రగిలే తిరుగుబాటుతత్వాన్ని అరికట్టడానికి అనేకమంది సూచనలు చేశారు. అవి నానారకాలుగా ఉన్నాయి. కొన్ని కేవలం మిలిటరీధోరణిలో కర్కశంగానూ, క్రూరంగానూ ఉన్నాయి, మరికొన్ని సౌమ్యంగా ఉన్నాయి. చిచీకవ్ పాటించవలసిన పవిత్రధర్మం ఒకటివున్నదనీ, అతను తన కమతగాళ్ళపట్ల తండ్రిలాగా ఉండి, వాళ్ళకు జ్ఞానోదయం కలిగించటం తన కర్తవ్యంగా పెట్టుకోవాలనీ, ఈ సందర్భంలో లంకాస్టర్ విద్యావిధానం ఎంతైనా ప్రశంసనీయమనీ పోస్టుమాస్టరు చెప్పాడు.
ఈవిధంగా నగరంలో చర్చలుసాగాయి. చాలామంది ఎంతో సానుభూతితో యీ సలహాలు కొన్నిటిని చిచీకవ్ కు అందజేశారు. కమతగాళ్ళను గమ్యస్థానం చేర్చటానికి తోడు పంపుతామని కూడా కొందరు మాటఇచ్చారు. సలహా లిచ్చినవారికి చిచీకవ్ ధన్యవాదాలు తెలిపి, అవసరమైతే ఆ సలహాలను అమలుచేస్తానన్నాడు. తోడుమాత్రం అవసరంలేదన్నాడు. ఎందుకంటే తాను కొన్న మనుషులు అమిత సాత్వికులు, వలసవెళ్ళాలని వాళ్ళకీ ఎంతో ఉబలాటంగా ఉన్నది. వాళ్ళలో విద్రోహబుద్ధి ఏ మాత్రమూ లేదు.
అయితే ఈవాగ్వాదాల ఫలితంగానూ, చర్చల ఫలితంగానూ చిచీకవ్ ఊహించగలిగినదానికన్న కూడా ఎక్కువలాభమే కలిగింది: అతను కోటీశ్వరుడన్న పుకారుపడింది. నగరంలోని వాళ్ళు చిచీకవ్ ను ఎంతో ఆదరభావంతో చూసినట్టు మనం మొదటనే తెలుసుకున్నాం. అతను కోటీశ్వరుడని విన్నాక వారి ఆదరం మరింత అయింది. నిజానికి వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, కలిసికట్టుగా ఉండేవాళ్ళు, సఖ్యతగా ప్రవర్తించేవాళ్లు; వారి సంభాషణలో కూడా ఎంతో సుహృద్భావమూ, ఆప్యాయతా వుండేవి: “మిత్రమా, ఇల్యా ఇల్యాయిచ్”, “ఇదుగో, ఏమోయ్, అంతీపతర్ జఖార్యెవిచ్”…ఇంతెందుకు, అందరూ ఏక కుటుంబంలాగా ఉండేవారు. వారిలో చాలామందికి అంతో ఇంతో సంస్కారం వుంది. న్యాయస్థానాధ్యక్షుడికి ఝుకోవ్ స్కీ రచించిన “లుద్మిలా” కంఠతావచ్చును. అందులోనుంచి ఆయన చాలా భాగాలు చక్కగా చదివి వినిపిస్తుండేవాడు; ముఖ్యంగా “కనులు మూసిన అడవి, కలలు గనులోయ” అని చదివితే అడవీ లోయా నిద్రలో ఉన్నట్టే తోచేది, ఈ భావం మరింత బాగాకలగటాని కాయన ఆ పంక్తి చదువుతూ తానే కళ్లు మూసుకునేవాడు. పోస్టుమాస్టరుకు తాత్వికవిషయాలంటే చాలా ఇష్టం. ఆయన రాత్రివేళ కూడా యంగ్ రచించిన “నిశాభావములు,” ఎక్కార్జ్ హౌజెన్ రచించిన “ప్రకృతి రహస్యపరిశోధిని” శ్రద్ధగా చదవటమేగాక, వాటిలోనుంచి పేజీలతరబడి కాపీచేసుకునే వాడుకూడా; కాని వాటిలో ఉన్న విషయమేమిటో ఎవరికి తెలియదు. అయితే ఆయన మంచి మాటకారి, అలంకారయుక్తంగా, మాటలలో “మసాలా” చేర్చి మాట్లాడేవాడు. ఇందుకుగాను ఆయన వివిధరకాల ఊతపదాలు చేర్చేవాడు: “అయ్యా, మీకు తెలుసు, మీరు గ్రహించగలరు, ఊహించుకోవచ్చు, ఆయొక్క సందర్భంలో, వతుగా ఒకవిధంగా చూస్తే ఇత్యాదిప్రయోగాలు విరజిమ్మేసేవాడు. ఆయన తన సంభాషణలో చేర్చే “మసాలా” కింద సమయోచితంగా కన్నుకొట్టి, ఒక కన్ను చిలికించి, తన వ్యంగ్యప్రసంగానికి మరింత పదును పెట్టేవాడు. మిగిలినవాళ్లు కూడా కొద్దో గొప్పో సంస్కారంగలవాళ్ళే; ఒకడు “కరమ్జిన్” చదివేవాడు, మరొకడు “మాస్కోవార్త” చదివేవాడు, ఏమీ చదవనివాళ్ళుకూడా కొందరు ఉండేవారు. కొందరు తావు తగిలితేగాని లేచి కదిలేవారు కారు. మరికొందరు యెలాటి సోమరిపోతులంటే, సామెతచెప్పినట్టు అస్తమానం ఒకేపక్క పడుకునేవారు; వాళ్ళని లేపి నిలబెట్టటంకూడా వృథా, ఏమంటే వాళ్లు చచ్చినా నిలబడేరకం కాదు. ఆరోగ్యానికీ, ఆకారాలకూ మళ్ళీ ఏలోటూ లేదు. వారిలో ఒక్కడూ క్షయాపాత్తుకాడు. భార్యలు ముద్దుగా సరసాలాడేటప్పుడు తమ భర్తలకు “బొద్దు”, “లావు”, “దిబ్బ”, “కుడుము”, “జవజవ” అనే మాటలు వాడతారే, ఆరకం మనుషులు వాళ్ళందరూ. కాని మొత్తంమీద అందరూ మంచివాళ్లె, అతిథులను ఎంతో బాగా చూసేవారు. ఒకసారి వాళ్ళ ఉప్పుతిన్న వాళ్ళూ, ఒకసాయంకాలం వారితో పేకాడినవాళ్ళూ వారికి ఎంతో ఆప్త స్నేహితులయిపోయేవాళ్ళు. చిచీకవ్ విషయం చెప్పనే అక్కర్లేదు, అతను ఆకర్షణీయమైన లక్షణాలూ, నడవడీ గలవాడు. ఇతరులను సంతోషపెట్టే విద్య అతనికి బాగా తెలుసు. వాళ్ళకి అతనిపైన ఎలాటి మమకారం ఏర్పడిందంటే, ఆ ఊరునుంచి తెంచుకుపోవటం ఎలాగో చిచికవ్ కు బోధపడలేదు. ఎవరిని చూచినా, “కనీసం ఇంకొక్కవారం ఆగండి పావెల్ ఇవానవిచ్! అనేవాళ్ళే, బ్రహ్మరధం పట్టటమంటారే, అలా అయిందతనికి. ఇంతకన్న కూడా చెప్పుకోదగినది (నిజంగా అద్భుతమే!) స్త్రీలకు చిచీకవ్ మీద ఏర్పడిన గురి. దీన్ని కొంతవరకైనా సమర్థించాలంటే ఆ స్త్రీలను గురించీ వారి సమాజ పరిసరాలనుగురించీ ఎంతో చెప్పాలి, వారి ఆధ్యాత్మిక గుణాలను సజీవమైన రంగులతో చిత్రించాలి; ఇది ఈ రచయితకు సాధ్యమయే పనికాదు. ఒకవంక అతడికి ఈ అధికారుల భార్యలపట్ల గల గౌరవభావం అడ్డుతగులుతుంది, ఇంకొకవంక… ఇంకొకవంక అది చాలా కష్టమైనపని. ఈ నగరపు మహిళలు…వద్దు, నిజంగా నావల్ల కాదు: నాకు చెడ్డసిగ్గుగా ఉన్నది. ఈ నగరపు మహిళలలో ఘనంగా చెప్పుకోదగిన విశేషమేమంటే…నా కలం కదలకపోవటం చాలా వింతగాఉన్నది. పోనివ్వండి, ఈ స్త్రీలను చిత్రించేపని మరొకడికి, మంచిమంచి రంగులు గలవాడికి వదిలేస్తాను; నేనుమాత్రం వారిని బాహ్యంగా వర్ణించి, వారిలోని అముఖ్యలక్షణాలను పేర్కొంటాను. ఈ నగరపు మహిళామణులు “చూడ ముచ్చటైన” వారుగా చెప్పదగినవారు, ఈ విషయంలో వారిని ఇతరులకు ఆదర్శంగా చూపవచ్చు. నడవడికలో, గొతెత్తటం విషయంలో, మర్యాదలు పాటించటంలో, నాగరికసమాజంలో ఉండే సవాలక్ష నియమాలు పాటించటంలో, అన్నిటినీమించి సరికొత్త ఫాషనులను తూచాతప్పకుండా అనుసరించటంలో పీటర్స్ బర్గు స్త్రీలుగాని, మాస్కో స్త్రీలుగాని వారికి ఈడు రాలేరు. వారు చక్కని అభిరుచిగల పద్ధతిలో దుస్తులు వేసుకుని, బళ్ళలో నగరం వెంబడి తిరిగేవారు, వెనక ఒక బంట్రోతు ఉద్యోగదుస్తులు ధరించి ఉండేవాడు. వాడి దుస్తులకు సరొకొత్త ఫాషను అనుసరించి సరిగ ఉండేది. వాళ్లవెంట విజిటింగ్ కార్డులు-ఏ కళావరు రెండుముక్కమీదనో, డైమను ఆసుమీదనో రాసినవే అవుగాక- అతిముఖ్యంగా ఉండేవి. కార్డు కారణంగా, ఎంతో మైత్రీ, బంధుత్వమూగల ఇద్దరాడవాళ్ళమధ్య, ఎదురుపిలుపు లేనందు చేత ఎడబాటు సంభవిస్తూండేది. ఇద్దరిలో ఏ ఒకరో కార్డుఇచ్చి వెళ్ళటం జరగనందున ఇద్దరిమధ్యా స్పర్థేకలగాలిగాని, వారిని రాజీపరచటానికి వారి భర్తలూ, బంధువులూ తల్లకిందుగా తపస్సుచేసికూడా ఫలితం ఉండదు-అదితప్ప ఇంకేదైనా సాధించవచ్చు. ఆ తరువాత ఆ ఇద్దరు మహిళలూ ఒకరినొకరు “సుస్తీ”గా ఉంటారు, అది ఆ నగరపు సంఘంలో అమలులో ఉన్నమాట. ఎవరుముందు, ఎవరు తరువాత అనే సమస్యను గురించికూడా తీవ్రమైన ఘర్షణలు జరిగేవి, ఒక్కొక్కప్పుడు వారిభర్తలు వారిని సమర్థించటం తమ ఉత్తమ ధర్మంగా భావించటంకూడా జరిగేది. ఆ పెద్దమనుషులు సివిలు ఉద్యోగస్తులు కావటంమూలాన ద్వంద్వయుద్ధాలు జరిగేవికావు, కాని వాళ్ళు ఒకరిమీద ఒకరు అవకాశం దొరికినప్పుడల్లా దుష్కర్మలు చేసుకునేవారు. అంతకంటె ద్వంద్వయుద్ధాలే నయం. నీతి నియమాల పట్ల ఈ నగరపు మహిళలు మహాపట్టుదల గలవారై, అవినీతి అన్నా, వెలికితనమన్నా మండిపడి, ప్రతి దౌర్బల్యాన్నీ నిర్దయగా శిక్షించే వాళ్ళు. ఏదైనా “ఒకటీ, అరా” సంభవించటం జరిగితే, అది జరిగినట్టు పైకి తెలియరాకుండా కప్పిపెట్టేవాళ్ళు, బెట్టు నిలబెట్టేవాళ్లు; భర్త కూడా ఎలాటి తరిఫీదు తిని ఉంటాడంటే అతను కళ్ళారా “ఒకటీ, అరా” చూసినా, లేక విన్నా, ఆటే తొణకక, బాప్తిజం చేయించిన తండ్రి బాప్తిజం చేయించిన తల్లితోపోతే ఇతరులకేమిటి అన్న సామెతతో సరిపెట్టుకునేవారు.
ఈ నగరపు మహిళలనుగురించి చెప్పుకోదగిన మరొకవిషయమేమంటే వారు, పీటర్స్ బర్గ్ మహిళల్లాగే అనుచితమైన మాటలు గాని, నుడికారాలుగాని నోటంట ఎన్నడూ రానివ్వక మహా నాజూకుగా మాట్లడేవారు. “నేను చీదాను, నాకు చెమటపోసింది, ఉమ్మేశాను” అని ఎన్నడూ అనేవారుకారు; దానికి మారుగా “చేతిరుమాలు ఉపయోగించుకున్నాను” అనేవారు లేదా అలాటిదే మరొకటి ఏదన్నా అనేవారు. ఎట్టి పరిస్థితులోకూడా “ఈ గ్లాసు, లేక ప్లేటు కంపుకొడుతున్నది” అనరాదు, “ఈ గ్లాసు కొంచెం ఇబ్బందిగా ఉంది” అనిగాని, అలాటిదే మరోటిగాని అనాలి. రష్యనుభాషను శుద్ధి చేసిపైకి తీసుకురావటానికిగాను వారు భాషలోనుంచి పూర్తిగా సగం మాటలను లాగిపారేశారు. అందుచేత వారు తరుచు ఫ్రెంచిభాషను ఆశ్రయించవలసి వచ్చేది. ఫ్రెంచిదారి ఎలాగైనా వేరు; పైనచెప్పిన భావాలకన్న కూడా మొరటైనవి ఫ్రెంచిలో పలకటానికి వారికి అభ్యంతరం ఉండేదికాదు. ఈ నగరపు మహిళలను గురించిన పై పై విషయాలివి. లోతుగా చూసే పక్షంలో ఇంకా అనేకవిషయాలు కనిపిస్తాయనుకోండి, కాని స్త్రీ హృదయంలోకి మరీలోతుగా చూడటం ఎంతైనా ప్రమాదకరం.
అందుచేత మనం పై పై విషయాలకే అంటిపెట్టుకుని ఉపక్రమింతాం. లోగడ ఈ మహిళలు, చిచీకవ్ నలుగురిలోనూ ప్రవర్తించే పద్ధతిని మెచ్చుకున్నప్పటికీ, అతన్నిగురించి విశేషంగా చెప్పుకోలేదు, కాని అతను కోటీశ్వరుడని పుకారుపుట్టినది లగాయతు వారు అతనిలో ఇతర సుగుణాలను కనిపెట్టసాగారు. అయితే నిజానికి ఈ మహిళలు డబ్బుపై వ్యామోహం గలవారు కారు. తప్పంతా కోటీశ్వరుడనే మాటదేగాని, కోటీశ్వరుడిది కాదు. డబ్బు సంచుల ప్రమేయం లేకుండానే ఆ మాటలోనే ఏదో ఉంది; దాని ప్రభావం దుర్మార్గుల పైనా, ఏదీ కాని వాళ్లపైనా, సజ్జనులపైనా కూడా, అనగా అందరి పైనా ఉంటుంది. కోటీశ్వరుడైనవాడికి ఎప్పుడూ అడుగులకు మడుగులొత్తే వాళ్ళు తటస్థ పడతారు. వారి దాస్యబుద్ధి స్వార్ధరహితమైనది, స్వచ్ఛమైనది. దానివెంట ఎలాటి ఆశయాలూ ఉండవు. అతనినుంచి తమకు చిల్లిగవ్వ ముట్టదని, ముట్టాలని ఆశించే హక్కు తమకులేదనీ స్పష్టంగా ఎరిగికూడా అనేకమంది అతనికి కావలసి రాబోయేది ముందరే అందిస్తారు. అతని హాస్యపుమాటలకు నవ్వుతారు, టోపీలు తీసేస్తారు, అతను ఏ విందుకైనా వెళుతున్నాడని తెలిస్తే ఆ విందుకు ఆహ్వానం ఎలాగో సంపాదిస్తారు. ఇలాటి దాస్యబుద్ధి స్త్రీలలో ఉంటుందనటానికి వీల్లేదు. అయినప్పటికీ అనేక డ్రాయింగ్ రూములలో చిచీకవ్ గొప్ప మన్మధుడు కాకపోయినప్పటికీ, మనిషంటే అతనిలాగే ఉండాలనీ, అతను ఇంకొంచెం బలిసినా, లావెక్కినా బాగుండదనీ నలుగురూ అనుకోవటం జరిగింది. ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా పుట్టింది-ఇది సాధారణంగా సన్నగా ఉండేవాళ్లమీద సొడ్డు-వాళ్లు మనుషులల్లే ఉండక పళ్ళు గుచ్చుకునే పుల్లలాగా ఉంటారని. ఆడవాళ్ల దుస్తులలో అనేక రకాల కొత్త సొబగులు కానవచ్చాయి. వాహ్యాళి బజారు (ఆర్కేడ్)లో గుంపు, ఇంచుమించు తొక్కిడి, ఏర్పడింది. అక్కడికి వచ్చి చేరే బళ్లు ఒక ఊరేగింపులాగా తయారయాయి. సంతలో ఖరీదు పెట్టుకొని హెచ్చుధర మూలాన అమ్ముడు కాకుండా ఉన్న కొన్ని సరుకులు ఆకస్మికంగా గిరాకీవచ్చి అంతులేని ధరలకు అమ్ముడుపోవటం చూసి దుకాణాల వాళ్లు నిర్ఘాంతపోయారు. ఒకనాడు చర్చిలో ఆరాధనల సమయంలో ఒక ఆవిడ తన పావడా అంచుకు ఎలాటి గట్టిపట్టీ వేసుకున్నదంటే ఆమె దుస్తు ఆమె చుట్టూ చాలాదూరం పరుచుకున్నది. ఆ పేటకు చెందిన పోలీసు అధికారి సమయానికి అక్కడ తటస్థించి, ఆవిడగారి దుస్తు పగిలిపోకుండా ఉండగలందులకు జనాన్ని వెనక్కు జరగమన్నాడు. చిచీకవ్ కూడా తనపట్ల అందరూ చూపే శ్రద్ధాసక్తులు గమనించాడు. ఒకనాడతను ఇంటికి తిరిగివచ్చి బల్లమీద పెట్టి ఉన్న ఒక ఉత్తరం చూసుకున్నాడు. అది ఎవరు పంపినదీ, ఎవరు తెచ్చినదీ, అతనికి అంతుచిక్కలేదు. అది పంపిన వాళ్ళు తమ ఆచూకీ తెలపవద్దని తెచ్చిన మనిషికి ఉత్తరు విచ్చినట్టు వెయిటరు చెప్పాడు. ఆ ఉత్తరం గొప్పతీర్మానంతో, ఈవిధంగా ఆరంభమయింది. “అవును, నేను మీకు ఇది రాయకతప్పదు.” ఆ తరువాత ఆత్మలమధ్య ఉండే అనిర్వచనీయమైన అనుబంధం గురించి ఏదో రాసివున్నది. ఈ పరమసత్యాన్ని ధ్రువపరచటానికి సగం పంక్తి చుక్కలతో నించి ఉన్నది. ఆ తరవాత ఎలాటి గొప్పసత్యాలు ప్రవచించబడ్డాయంటే వాటిని ఉదహరించటం అవసరమని తోస్తుంది. “మన జీవితం ఏమిటి? దుఃఖం నివాసం ఏర్పరచుకున్న ఒకలోయ. ప్రపంచం ఏమిటి? జాలి లేని మూక.” ఆతరవాత రచయిత్రి, ఇరవై అయిదుసంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన తన మాతృ దేవతకొరకు స్రవించే అశ్రువులతో ఈ పంక్తులకు అభిషేకం చేస్తున్నానన్నది. అధ్యాత్మిక గోడలమధ్య ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చటానికి లేని ఈ పట్టణం విడిచి పెట్టి ఏ ఎడారికో పారిపొమ్మని లేఖకురాలు చిచీకవ్ ను హెచ్చరించింది. లేఖయొక్క చివరిభాగం బొత్తిగా నిరాశాపూరితంగా ఉండి ఒక పద్యంతో ఆఖరయింది. దాని భావం ఏమంటే:
“జంటగువ్వలు చూపుతాయి నా చల్లని అస్థికలుండే చోటు నీకు. గాద్గదికంగా నీతో చెబుతాము నేను అశ్రువులతో నే నెలా మరణించానో”.
ఈ పద్యంలో ఆఖరుచరణంలో ఛందస్సుపోయింది. అయినా ఫరవాలేదు; ఆ ఉత్తరం ఆనాటి ధోరణిలో రాయబడింది. ఉత్తరానికి సంతకం లేదు, పేరులేదు, ఇంటిపేరులేదు, తేదీకూడా లేదు. కాని ఒక”తాజాకలం” ఉన్నది: ఆ ఉత్తరం ఎవరు రాసినదీ అతని హృదయమే గ్రహిస్తుందనీ, తాను మర్నాడు గవర్నరుగారింట జరగబోయే నృత్యోత్సవానికి హాజరవుతుందనీ అందులో ఉన్నది.
ఇదంతా అతనికి చాలా ఆసక్తికలిగించింది. అది ఎవరు రాసారో తెలుసుకోవాలనే తహతహవల్లా, అందులో ఉన్న ఆకర్షణవల్లా అతను ఆ ఉత్తరాన్ని పైనుంచికిందికి రెండోసారీ, మూడోసారీ చదివేసి చివరకు, “ఇది ఎవరురాశారో తెలిస్తే బాగుండును!” అనుకున్నాడు, నిజానికి వ్యవహారం ముదురుపాకాన పడుతున్న సంగతి తెలుస్తూనే ఉంది. అతను దీన్ని గురించి గంటకుపైగా ఆలోచించాడు. చివరకు చేతులు ఎగరేసి తల ఆడించి, “ఇది చాలా తమాషాగారాసిన ఉత్తరం!” అనుకున్నాడు. తరవాత అతను ఆ ఉత్తరాన్ని మడిచి పెట్టెలో, ఏడేళ్ళుగా అందులో పడిఉన్న ఒక ప్రకటనతోనూ, విందు ఆహ్వానంతోనూ కలిపి పెట్టేశాడు. తరవాత నిజంగానే గవర్నరుగారింట నృత్యోత్సవానికి అతనికి ఆహ్వానం అందింది. ఇలాటి నగరాలలో అది రివాజే; గవర్నరంటూ ఉన్నాక నృత్యోత్సవాలుండాలి, లేకపోతే కులీనులు ఆయనను ఖాతరు చెయ్యరు.
మిగతా ఆలోచనలన్నీకట్టిపెట్టి పక్కకునెట్టేసి అతను తన మనస్సునంతా నృత్యోత్సవానికి సిద్ధంకావడంపైన కేంద్రీకరించాడు, ఎందుకంటే ఈ నృత్యోత్సవంతో ఎన్నో సరదాసంగతులు ముడిపడి ఉన్నాయి. ముస్తాబుకావటానికి భూమిపుట్టాక ఎవరూ అంతశ్రమగాని కాలంగాని వ్యయంచేసి ఉండరు. అద్దంలో ముఖం చూసుకోవటానికే ఒక గంటపట్టింది. రకరకాల ముఖభంగిమలు పెట్టటానికి ప్రయత్నాలు జరిగాయి. ఒకసారి గంభీర భంగిమా, మరొకసారి మర్యాదతో గూడిన మందహాసమూ మరొకసారి మందహాస రహితమైన మర్యాదా. అతను అద్దంముందు అనేకసార్లు వంగి ఫ్రెంచిలాగా ధ్వనించే అస్పష్టమైన శబ్దాలు పలికాడు, కాని నిజానికతనికి ఫ్రెంచి భాష ఏమీరాదు, అతను కొన్ని కొత్తట్రిక్కులూ, వింతట్రిక్కులూ కూడా ప్రయత్నించి చూశాడు: కనుబొమలనూ, పెదవులనూ వంకరతిప్పాడు, నాలుకతో కూడా ఏదో చెయ్యటానికి ప్రయత్నించాడు, ఏకాంతంగా ఉన్న సమయంలో, తాను అందంగా ఉంటాననుకుంటే మనిషి, కంతల్లోనుంచి తనను ఎవరూ గమనించటంలేదని రూఢిగా తెలిశాక చేసే పనులకు అంతుండదు మరి. చిట్టచివరకు అతను తనగడ్డంమీద కొట్టుకుని, “ఓయబ్బ, ఏం మొహం!” అనుకుని దుస్తులు వేసుకోనారంభించాడు. డ్రెస్ చేసుకుంటున్నంతసేపూ అతను మహాగొప్ప హుషారులో ఉన్నాడు. అతను చాలా చలాకీగా వంగాడు, పాదాలు నేలమీద ఈడ్చాడు. జన్మలో ఎన్నడూ నృత్యం చేసిన పాపానపోకపోయినా, గెంతాడు. ఈ గెంతుమూలంగా జరిగేదేమంటే సొరుగులపెట్టె అదిరి బ్రష్ కిందపడింది.
నృత్యోత్సవానికి అతనిరాక అక్కడ గొప్ప సంచలనాన్ని కలిగించింది. అందరూ అతనికేసి తిరిగి పలకరించబోయారు; ఒకరి చేతిలో పేకముక్కలున్నాయి, మరొకరు అతి ముఖ్యఘట్టం మాట్లాడుతూ, “అందుకు దిగువకోర్టు ఏమంటుందంటే…” అంటున్నారు. కాని ఆ మనిషి దిగువకోర్టు ఏమన్నదీ తేల్చక, మాట్లాడడం కట్టిపెట్టి, చిచీకవ్ ను పలకరించటానికి వచ్చేశాడు. “పావెల్ ఇవానవిచ్! అరెరే, పావెల్ ఇవానవిచ్! ప్రియమైన పావెల్ ఇవానవిచ్! ఘనమైన పావెల్ ఇవానవిచ్! నాప్రాణం, పావెల్ ఇవానవిచ్! వచ్చారా, పావెల్ ఇవానవిచ్? ఇరుగో, పావెల్ ఇవానవిచ్ వచ్చారు! ఒక్క కౌగిలి ఇవ్వండి, పావెల్ ఇవానవిచ్! నా వరహాల పావెల్ ఇవానవిచ్ పంపించండి, ఒక్కమంచి ముద్దుతీసుకుంటారు!” వెంటనే చిచీకవ్ అనేకమంది బహుబంధాలలో చిక్కిపోయాడు. అతను అధ్యక్షుడి ఆలింగనంనుంచి పుర్తిగా బయటపడ్డాడో లేదో పోలీసు అధికారికి చిక్కిపోయాడు; పోలీసు అధిపతి అతన్ని మెడికల్ బోర్డు ఇంస్పెక్టరుకు అందించాడు; మెడికల్ బోర్డు ఇంస్పెక్టరు అతన్ని సర్కారు కంట్రాక్టరుకు అందించాడు. ఆ పెద్ద మనిషి వాస్తుప్రవీణుడికి అందించాడు… ఆ సమయానికి గవర్నరు కొందరు స్త్రీల చెంత నిలబడి, ఒక చేతిలో ఏదో కాగితంముక్కనూ, రెండో చేతిలో బుల్లి కుక్కనూ పట్టుకొని ఉన్నాడు, అతన్ని చూస్తూనే రెంటినీజారవిడిచాడు. కుక్క కంయో మన్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చిచీకవ్ అపరిమితమైన ఆనందోత్సాహానికి కేంద్రమైనాడు, ప్రతిఒక్క ముఖానా సంతోషమో లేక అందరి సంతోషం తాలూకు ప్రతిబింబమో కనిపించింది. తమ ఆఫీసులను తణిఖీ చెయ్యటానికి ఉన్నతాధికారులు వచ్చినప్పుడు సర్కారు గుమస్తాల మొహాలు ఇలాగే ఉంటాయి: మొదట్లో కలిగిన గాభరా తగ్గిపోతుంది, ఆయన అంతాచూచి తృప్తిపడి, కాస్త దిగి వచ్చి ప్రసంగంలో పడిఏదో ఛలోక్తి విసురుతాడు, అంటే ఇకిలిస్తూ కొద్ది మాటలంటాడు, ఆయనకు దగ్గిరిగానిలబడి ఉన్న గుమాస్తాలు దానికి ఇబ్బడిగా నవ్వుతారు. ఆయన ఏమన్నదీ సరిగా వినపడనివాళ్లు కూడా మనస్ఫూర్తిగా నవ్వుతారు, చిట్టచివరకు దూరంగా ద్వారం వద్దనిలబడి ఉన్న పోలీసువాడు జన్మలో ఎన్నడూ నవ్విన పాపాన పోనివాడే అయినా దాటరాని ప్రతిఫలన సూత్రానికి కట్టుబడి వాడిముఖంకూడా ఒక చిరునవ్వును ప్రదర్శిస్తుంది. అప్పుడు వాడి ముఖం ఘాటైన పొడుంపట్టు పీల్చి తుమ్మబోతున్నట్టుగా అవుతుంది.
మన కథానాయకుడు ప్రతి ఒక్కరి పరామర్శా స్వీకరించాడు. అతని మనసు ఎంతో తేలికగా ఉన్నది. అతను అటూ ఇటూ తిరిగి, తన అలవాటు ప్రకారం కొంచెం ఒక పక్కగా వంగాడు. అతని సోయగం అందరినీ ముగ్ధుల్ని చేసింది. అందాలు వెల్లివిరుస్తూ ఆడవాళ్ళు అతనిని చుట్టుముట్టారు. వారి ఘుమఘుమ అంతటా ఆవరించింది. ఒకతె గులాబీల వాసన, మరొకతె “వసంత”పుష్పాల వాసన, “ఊదా”పూల వాసనా, మరొకతె ‘మిన్యోవెట్’ అత్తరవులో మునిగి తేలుతూంది. చిచీకవ్ తప్పనిసరి అయి ముక్కు పైకెత్తి సువాసనలను ఆఘ్రాణించాడు. వారి దుస్తులు ఎంతో రమ్యంగా ఉన్నాయి, మజ్లిన్ వలిపెములూ, శాటిన్లూ, షిఫాన్లూ ఎలాటి నాజూకై తెలికరంగుల్లో ఉన్నాయంటే వాటికి పేర్లు పెట్టటం కూడా సాధ్యంకాదు; ఈనాటి ఫాషన్లు అంత నాజూకైనవి! వారి దుస్తులపైన అక్కడక్కడా రిబ్బను “పూలూ”, పూల గుత్తులూ ఒక పద్ధతిలేకుండా అమర్చి ఉన్నాయి; అయితే ఇలా పద్ధతిలేకుండా వాటిని అమర్చటానికి పద్ధతి తెలిసినవాళ్ళు ఎంతో శ్రమపడవలసి వచ్చింది. వారు తలలలో ధరించిన తేలిక ఆభరణాలు వారి చెవులకు మాత్రమే తగిలి ఉండి, “ఏయ్, నేను పారిపోతున్నాను, చిక్కేమిటంటే ఈ అందగత్తెను ఎత్తుకుపోవటం నాకు సాధ్యంకాకుండా ఉంది!” అంటున్నట్టుగా ఉన్నాయి. వారి నడుములు బిర్రుగా బిగించి, ఎంతో బిగువుగానూ, పొంకంగానూ ఉన్నాయి. (ఈ నగరపు మహిళలు సాధారణంగా కొంచెం బొద్దుగా ఉంటారు, అయితే నడుములు బిగించి ఎంత ఒయ్యారంగా మసులుతారంటే వారు లావనిపించరు.) వాళ్ళు ప్రతి చిన్న విషయం గురించీ ఎంతో ఆలోచించి శ్రద్ధ తీసుకున్నారు; మెడలూ, భుజాలూ ఎంతవరకు ప్రదర్శించ వచ్చునో అంతకుమించి ప్రదర్శించలేదు, ప్రతి స్త్రీకూడా తన శోభను ఎంతగా వ్యక్తంచేస్తే తన పురుషుడి ప్రాణాలట్టిట్టవుతాయని తన అంతరాత్మలో అనిపిస్తే అంతగానే వ్యక్తం చేసింది. మిగిలిన శరీరాలు వింతవింత అభిరుచులను వ్యక్తం చేస్తూ కప్పబడ్డాయి. కొందరు నాజూకుగా మెడలకు రిబ్బను పట్టీలు పెట్టుకున్నారు, మరికొందరికి భూజాలవెనకగా దుస్తుల అడుగు నుంచి “బాడీ”లు కనిపిస్తున్నాయి. ఈ “బాడీ”ల చాటున మగవాళ్ళ హృదయాలను తలకిందులు చేసేదేమీ లేనప్పటికీ, అసలు ఆకర్షణ అంతా అక్కడే ఉన్నట్టు భ్రమకలిగిస్తాయి. పొడుగైన చేతి తొడుగులకూ జాకెట్ల చేతులకూ మధ్యకొంత ఖాళీ ఉంచబడి, మోచేతికి ఎగువ నుండే ఆకర్షణీయమైన జబ్బలు కనిపించేలాగు చేయబడ్డాయి. ఇంతెందుకు? ఎక్కడ చూసినా, “ఇది మారుమూల పట్టణం కాదు; ఇది పీటర్స్ బర్గ్, ఇది పారిస్!” అని లిఖించినట్టుగా ఉన్నది.అయితే అక్కడక్కడా ఒక కుళాయి, ప్రపంచంలో మరెక్కడా కానరానిది, లేక ఒక ఈక, ఏ నెమలిదో, ఫాషనును ధిక్కరించి, “వ్యక్తిగత” మైన అభిరుచిని వ్యక్తం చేస్తూ కనపడింది. అయితే ఇది అనివార్యం; మారుమూల పట్టణంలో ఈ వ్యక్తిత్వం ఎక్కడో ఒకచోట బయటపడి తీరుతుంది. చిచీకవ్ స్త్రీల ఎదుట నిలబడి, వారిలో తనకు లేఖరాసిన మనిషి ఎవరో అని ఆశ్చర్యపడ్డాడు. అతను మెడనిక్కించి ఇంకా బాగా కలయ చూద్దామనుకునేటంతలో అతని పక్కగా మోచేతులూ, “కఫ్”లూ, చొక్కా చేతులూ, రిబ్బన్ల అంచులూ, సువాసనలు వెదజల్లే ఆడవాళ్ల షిమీజులూ పరిగెత్త సాగాయి. పరుగు మహా తీవ్రంగా ఉన్నది. పోస్టుమాస్టరు భార్యా, పోలీసు అధికారీ, తేలిక నీలం ఈకపెట్టుకున్న యువతీ, తైల ఈక ధరించిన యువతీ, జార్జియా రాజకుమారుడు చిఫాయిఖిలిద్జెవ్, ఒక పీటర్స్ బర్గు అధికారి, ఒక మాస్కో అధికారీ, కూకూ అని పేరుగల ఒక ఫ్రెంచి పెద్దమనిషీ, పెర్ఖూనవ్ స్కీ, బెరెబేందవ్ స్కీ, అందరూ పైకీ కిందికీ ఎగురుతూ పక్కగా పరిగెత్తారు…
“అయింది, అందరూ సాగించారు!” అనుకుంటూ చిచీకవ్ నృత్యంచేసే వాళ్లకు ఎడంగా తొలిగాడు. స్త్రీలంతా వచ్చి యథా స్థానాలలో మళ్ళీ కూచున్నాక అతను తన అన్వేషణ సాగించి, ఏ స్త్రీ మొహంలోగాని, కళ్లలోగాని తనకు లేఖరాసిన మనిషి జాడలు తెలుస్తాయోమోనని పరికించాడు. కాని ముఖభంగిమనుబట్టీ, చూపును బట్టీ తనకు లేఖ రాసిన మనిషిని పోల్చటం అసాధ్యమయింది. ఎవరికేసిచూసినా ఏదో వ్యక్తమవుతున్నట్టే ఉంది, ఏదో అంతుచిక్కని సూక్ష్మం-అమితసూక్ష్మం!…
“లాభం లేదు. ఈ ఆడ వాళ్ళుందే…భలేవాళ్ళు…” అనుకుని చిచీకవ్ అసహాయుడల్లే చెయ్యి ఉపాడు “మాటలు చెప్పటం కాదు, వాళ్ళ మొహాలలో మెదిలే భావాలూ, వాళ్ళ డొంకతిరుగుడు ధోరణీ నర్మోక్తులూ చాతనయితే వర్ణించు…నీతరంకాదు. వాళ్ళకళ్ళే అంతులేని అగాధాలు, వాటిని తరచటానికి దిగినవాడు మరిపైకిరాడు! వాణ్ణి గాలాలు వేసి కూడా పైకి చేదటం సాధ్యంకాదు. వాళ్ళకళ్ళలో ఉండే కాంతిని మాత్రమే వర్ణించి చూడు తెలుస్తుంది; మృదువుగా, మధురంగా కరిగిపోయే లాగుంటుంది; క్రూరంగా, సాధువుగా, బద్ధకంగా కూడా ఉంటుంది: కొందరన్నట్టు సమ్మోహనకరంగా ఉంటుంది. లేదాసమ్మోహనకరంగా ఉండదు, కాని అది ప్రత్యేకించి సమ్మోహనకరంగా ఉన్నప్పుడు-గుండెను పట్టేసి ఫిడేలు కమానులాగా దాన్ని పలికిస్తుంది. దాన్ని వర్ణించటానికి మాటలు చాలవు-మానవ కోటిలో సగం “ఫైన్ ఫ్ల్యూర్”, అంతే!”
నన్ను క్షమించాలి! అంతకుముందే వీధిలో వినపడిన మాటలు నా కథానాయకుడి నోటంట వెలువడ్డాయిలాగుంది. నేనేం చేసేది? రష్యాలో ఇదే రచయితల దుర్గతి! నిజానికి, వీధిలో వినిపించిన మాటలు పుస్తకంలోకి దొర్లితే అది రచయిత తప్పు ఎంతమాత్రమూ కాదు, పాఠకులది, ముఖ్యంగా ఉత్తమ కుటుంబాలకు చెందిన పాఠకులది; మిగిలిన వాళ్ళకంటె కూడా వారినోటనే ఎన్నడూ ఒక ముచ్చటైన రష్యనుమాట వినిపించినిది; వద్దు బాబో అంటున్నా వాళ్ళు ఏకధాటిగా ఫ్రెంచి, జర్మను, ఇంగ్లీషు పదజాలం ఏకరువు పెట్టేస్తారు; ఉచ్చారణకూడా నానారకాలుగా ఉంటుంది-ఫ్రెంచి మాటలను ముక్కుతో మాట్లాడుతూ తొస్సుగా పలుకుతారు, ఇంగ్లీషు మాట్లాడితే అచ్చగా పిట్టలు కిచకిచలాడి నట్టుంటుంది, ఆ సమయంలో వాళ్ళ మొహాలు పిట్టలల్లే ఉంటాయి కూడానూ, అలా పిట్ట మొహాలు పెట్టలేని వారిని చూసి వాళ్ళు నవ్వుతారు. వాళ్ళకి రష్యను సంప్రదాయాలేవీ పట్టవు. వారి జాతీయాభిమానం మహావెళితే, తమ వేసవికుటీరాలను రష్యను పద్ధతిలో కట్టుకునేవరకూ పోతుంది. గొప్పకుటుంబాలకు చెందిన పాఠకులు అలాటివాళ్ళు, తాముకూడా వారి అంతవాళ్ళమే అనుకునే వాళ్ళు వారిని అనుకరిస్తారు. మళ్ళీ వీళ్లే ఎన్నో కట్టుబాట్లు పెడతారు! ప్రతి రచనా నిర్దుష్టంగా, స్వచ్ఛంగా, నాజూకైన భాషలో రచించబడాలంటారు-అంటే, రష్యను భాష శుద్ధిపొంది మబ్బుల్లోనుంచి దిగివస్తే వారు శ్రమలేకుండా నోళ్ళు తెరిచి, నాలుకలు తెరిచి ఆస్వాదిస్తారన్న మాట. మానవ కోటిలో అర్థభాగమైన స్త్రీలను అవగాహన చేసుకోవటం సులభంకాదన్న మాట నిజమేగాని, మన పాఠక మహాశయులు ఒక్కొక్కసారి మరింత అర్థంకాకుండా ఉంటారు.