-కొల్లూరి సోమశంకర్
“వీల్లేదు” నేను పట్టుపట్టాను. “జాతకాలు కలవకుండా పెళ్ళి జరగడం నేను ఉహించలేను. స్వయానా నేను జ్యోతిష్కుడిని, జాతకాలు పక్కాగా కలవడం ఎంత ముఖ్యమో తెలిసినవాడిని. నీకు తెలియదు. నువ్వింకా చిన్న పిల్లవి. జ్యోతిషం ఓ శాస్త్రం. దాని గురించి నీకు అవగాహన లేదు” అన్నాను నా కూతురితో. మా అమ్మాయి ఓపికగా వింటోంది.
“నాన్నా… జాతకాలు కలవడం గురించి నాకు తెలియదు. కాని నేను రవిని తప్ప వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోను.అతని జాతకంతో నా జాతకం కలుస్తుందా లేదానేది నాకవసరం లేదు. మేమిద్దరం ప్రేమిచుకున్నాం. అంతే” అంది.
“రవిని అతని జాతకం తెమ్మని చెప్పు. జాతకాలు కలిస్తే మీ పెళ్ళి జరుగుతుంది. లేకపోతే లేదు”
“నాన్నా, నువ్వో గొప్ప జ్యోతిష్కుడివి. కాదనను. అంత మాత్రాన నా జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు” నా కూతురి మాటలు తీక్షణంగా ఉన్నాయి. తను చికాకుగాను, కోపంగాను ఉంది.
“చూడమ్మా, నాకు కులమతాల, జాతి బేధాల, ధనిక-పేద… పట్టింపులు లేవు. నేను జ్యోతిష శాస్త్రంలో నిష్ణాతుడిని కాబట్టి, దాన్నెలా ఉపయోగించాలో తెలిసినవాడిని కాబట్టే, నా కూతురు సరైన వ్యక్తిని పెళ్ళాడాలని తాపత్రయపడుతున్నాను. అంతే” అంటూ ఓ క్షణం పాటు ఆపాను. మా అమ్మాయి నా మీద నుంచి దృష్టి మళ్ళించి ఎక్కడో చూస్తోంది. నా మాటలు వినడానికి ఇష్టపడడం లేదు.
“జ్యోతిషం ఓ శాస్త్రం రా…అర్థం చేసుకో…అదో శాస్త్రం…” బ్రతిమాలాను.
“నాన్నా, రవి జాతకం ఉందో లేదో నాకు తెలియదు…”అంది విసుగ్గా.
“పరవాలేదు. అతను పుట్టిన తేది, సమయం తెలుసుకో. అతని జాతక చక్రం నేను వేస్తాను. నీ జాతకానికి నప్పితే, మీ పెళ్ళవుతుంది. నప్పకపోతే, ఈ విషయాన్ని మీరు ఇక్కడితో ఆపేయాలి. పెళ్ళయ్యే వరకు ప్రేమ బానే ఉంటుంది. అందుకే నిలకడలేని భావాలకు ప్రాముఖ్యతనీయకు” చెప్పాను.
“నాన్నా, రవి పట్ల నా ప్రేమ అశాశ్వతమైనది కాదు, నిలకడ లేనిదీ కాదు. అయితే ఇద్దరి పెద్దల అనుమతితోనే మేము పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. రవి వాళ్ళ అమ్మా నాన్నా ఒప్పుకున్నారు. నువ్వే అడ్డుచెబుతున్నావు. నువ్వు మనస్పూర్తిగా ఇష్టపడితేనే మా పెళ్ళి జరుగుతుంది, లేకపోతే……” మా అమ్మాయి గొంతులో దుఃఖం పొంగుకొస్తోంది.
“తల్లీ, నీకెలా చెప్పాలో నాకర్థం కావడం లేదు. నాకు పొగరని, నేను మొండిపట్టు పడుతున్నానని నువ్వు అనుకోవచ్చు. కాని నాకు జ్యోతిషం, జాతకాల ప్రాముఖ్యత తెలుసు. నేను జోస్యం చెప్పిన ప్రతీది కచ్చితంగా జరిగింది. దాని ప్రాముఖ్యత తెలిసినవాడిని కాబట్టే, నా కూతురి జీవితంతో ఆటలాడాలనుకోవడం లేదు. నా వాదన సరైనదేనని నిన్నెలా ఒప్పించాలో నాకు అంతుబట్టడం లేదమ్మా” అన్నాను.
“సరే నాన్నా, రవి పుట్టిన తేదీ నాకు ముందే తెలుసు, సమయం తెలుసుకుని నీకు చెబుతాను…”అంది.
* * *
రవి పుట్టిన తేదీ, సమయము లభించాయి. నేను వాడే పంచాగం ప్రకారం అతని జాతక చక్రం వేసాను. దాని ద్వారా రవి నడవడిక, విద్య, ఇంకా ఇతర వివరాలు అర్థం చేసుకున్నాను. అమ్మాయిని పిలిచి అతని చదువు, ప్రవర్తన, కుటుంబం గురించి నేను గ్రహించినవి సరైనవేనా అని అడిగాను. అంత సరిగ్గా చెప్పగలిగినందుకు నా కూతురు ఆశ్చర్యపోయింది. రవి గురించి నాకు కొంత ముందే తెలుసు కాబట్టి ఈ వివరాలు చెప్పగలిగానని అంది. నేను మరింత స్పష్టమైన వివరాలు చెప్పాను. అవి కచ్చితంగా సరిపోయాయి.
“చూసావా, జాతకం ఆధారంగా మనిషి వివరాలు ఎలా తెలుసుకోవచ్చో, ఇక ఇప్పుడు నీ జాతకంతో పోల్చి చూడాలి” అన్నాను ఉత్సాహంగా.
“నా జాతకం కూడా ఉందిగా. నా వివరాలు ఎప్పుడూ చెప్పలేదే?” అంది మా అమ్మాయి కొంచెం సంశయంగా. “నిజానికి, నీ జాతకం నేనింకా రాయలేదు. నీకు 18 ఏళ్ళు నిండాక రాద్దామని ఆగాను. నా దగ్గర అన్ని వివరాలు ఓ పుస్తకంలో ఉన్నాయిలే” నా కూతురు మొహంలో ఆతృత కనపడుతోంది. తన ప్రేమ భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం వ్యక్తమవుతోంది.
* * *
మా అమ్మాయి పుట్టినప్పుడు నేను ఆసుపత్రి నుంచి మా అక్కకి ఫోన్ చేసి చెప్పాను. ఆ రోజు తేదీ, జనన సమయం, తిథి, నక్షత్రం వంటి వివరాలు మా అక్క తన చేతి రాతతో ఓ నలభై పేజీల పుస్తకంలో రాసిపెట్టింది. విఘ్నేశ్వరుడిని ప్రార్ధించి నేను ఆ పుస్తకాన్ని తీసుకుని, మా అమ్మాయి వివరాలతో జాతకం రాయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత, రవి జాతకంతో పోల్చి చూసాను. పొంతన కుదరలేదు. రవి జాతకం అమ్మాయి జాతకం పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ పెళ్ళి జరగదు, జరిగినా ఆ బంధం కలకాలం నిలవదు. ఏం చేయాలో నాకర్థం కాలేదు. జాతకాలు కలవాలని ఇంతకు ముందు నేను దేవుడినెంతో ప్రార్థించాను. అది నాకెంతో ముఖ్యం. ఒకరికి ఒకరుగా బ్రతకాలనుకున్న ఓ జంటని నేను విడదీయాలనుకోలేదు. కానీ ఏం చేస్తాం? విధి విలాసం మరోలా ఉంది. వాళ్ళ పెళ్ళి జరగడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడి సంకల్పానికి విరుద్ధంగా మనమేం చేయగలం? ఈ విషయాన్ని మా అమ్మాయికి చెప్పక తప్పదు. నాకు ఇంతకంటే మరో మార్గం లేదు. నా జోస్యం ఎన్నడూ తప్పు కాదు.
* * *
అనుకున్నట్ట్లుగానే, ఈ విషయం చెప్పగానే అమ్మాయి నామీద ఎగిరిపడింది. “చూడమ్మా, నేనేం చేసేది, మీ వివాహానికి విధి అడ్డుచెప్పింది. లేకపోతే, జాతకాల పొంతన ఇంత దారుణంగా ఉండేది కాదు. నేను కచ్చితంగా చెబుతున్నాను, ఈ పెళ్ళి జరగదు. ఒకవేళ జరిగినా, మీరు కలకాలం కాపురం చేయలేరు”
“నానా, మా పట్ల విధి క్రూరంగా లేదు. దేవుడి సంకల్పం ఇదేనని నువ్వెలా చెప్పగలవు? నువ్వేమీ దేవుడివి కాదు. ఈ చెత్త జాతకాలని నేను నమ్మను…. ”
“నా జోశ్యం ఎప్పటికీ తప్పు కాదు. ఇదే దైవ సంకల్పం. మీ పెళ్ళికి నా ఆశీస్సులు ఉండవు, నన్ను క్షమించు”
మా అమ్మాయి ధుధుమలాడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఏమైనా, నా అభీష్టానికి వ్యతిరేకంగా నడిచేందుకు అమ్మాయి ఇష్టపడలేదు. రవి తనకి నచ్చజెప్పడానికి చూసాడు, కాని అతని ప్రయత్నం వృధా అయ్యింది. చాలా రోజులు ఎదురు చూసాక, అతను వేరే వివాహం చేసుకున్నాడు. అప్పటికి నాకు ఉపశమనం కలిగింది.
* * *
ఓ రోజు మా అక్క మా ఇంటికొచ్చింది. మాటల సందర్భంలో మా అమ్మాయి పెళ్ళి ప్రస్తావన వచ్చింది. రవితో పెళ్ళి కుదరనప్పటి నుంచి మా అమ్మాయి పెళ్ళి సంబంధాలంటేనే విముఖత వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని అక్కతో చెబుతూ, అమ్మయి ప్రేమ గురించి చెప్పాను.
“అక్కా, అదే దైవ సంకల్పం! దైవ సంకల్పమే జ్యోతిషం. రవితో అమ్మాయి పెళ్ళి జరగదని చెప్పాను, అదే నిజమైంది. అమ్మాయి పొద్దున్న 10గం.20ని.లకి ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టింది. కనీసం 10గం.25ని.లకి పుట్టినా, వాళ్ళ జాతకాలు కలిసేవి. ప్రాప్తం లేదు.మనిషి ఒకలా తలిస్తే, దైవం మరోలా తలుస్తాడు” అన్నాను నిట్టూరుస్తూ.
మాట్లాడుతూ, అక్క చేతి రాతతో అమ్మాయి జనన వివరాలు రాసున్న పుస్తకం అక్కకి అందించాను. దాన్నందుకుంటూ అక్క “మనం చేయగలిగినదేం లేదు” అంటూ నిట్టూర్చింది. పుస్తకంలోని పేజీలు అటూఇటూ తిప్పుతూ అక్క జ్ఞాపకాలలోకి జారుకుంది. ఉన్నట్లుండి………
“అమ్మాయి పుట్టిన సమయం ఎంతన్నావు? నేను 10గం.29ని. అని రాసాను. 10.20 కాదు. నా చేతి రాత నీకు గుర్తు లేదూ? నేనెప్పుడు తొమ్మిది తోక చిన్నగా రాస్తాను. అది సున్నాలా కనపడుతుంది. చిన్నప్పుడు మీరంతా నన్ను వెక్కిరించేవాళ్ళు కదా, మర్చిపోయావా?” అని అంది.
(రాజారామ్ బాలాజీ రాసిన Horro(r)scope కథకు ఇది అనువాదం. ఇది సులేఖ.కామ్‌లో ప్రచురింపబడింది. )
————————————–
కొల్లూరి సోమశంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలను హిందీలోకి అనువదించారు. కొన్ని దినపత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి. 2006లో “మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో “4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు. వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు.
సోమశంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com బ్లాగు చూడచ్చు.
అనువాదం సరళంగా బావుంది. కానీ కథ చివరి ట్విస్టు ముందే తెలిసిపోతోంది
కథ , అనువాదం రెండూ బాగున్నై. జ్యోతిష్యం పై వ్యంగ బాణాలు చక్కగా వేసినదీకథ. 28 అంశాలు కలిసిన జంట సంవత్సరం కాకుండానే విడాకులు తీసుకోవటం చూశాను. ఈ మూఢ నమ్మకాలనుంచి ఎప్పుడు బయటపడగలమోకదా!
కథ, అనువాదం రెండూ బాగున్నై. ఐతే cbrao గారూ, ఈ కథలో జ్యోతిష్యంపై విమర్శ/వ్యంగ్యం ఎక్కడుందో ఎంత వెదికినా నాకు కనిపించలేదు. అసలు కథాంశం వేరు. జోతిష్యం వాళ్ళిద్దరూ పెళ్ళి “చేసుకుంటే” వారి వైవాహిక జీవితం బాగుంటుందని సూచించిందే గానీ (జాతకాలు కలవడమంటే అదే కదా? ఒకరి జాతకాన్ని వెయ్యిమంది జాతకాలతో పోల్చిచూస్తే వారిలో వందమందితో జాతకాలు కలవొచ్చు. అంతమాత్రాన అందర్నీ పెళ్ళి చేసుకోరు కద?) “చేసుకుంటారని” ఈ కథలో ఎక్కడైనా చెప్పిందా? జోతిష్యం చెప్పనిదాన్ని దానికి ఎందుకు ఆపాదిస్తున్నారు?
ఈ కథలో ఒక పెద్ద లోపం ఉంది. జ్యోతిషం నిజమా కాదా అన్న శాస్త్ర చర్చల్ని పక్కనపెట్టి కథని కథగానే చూద్దాం.
ఈ కింది పేరా చూడండి:
>రవి పుట్టిన తేదీ, సమయము లభించాయి. నేను వాడే పంచాగం ప్రకారం అతని జాతక చక్రం వేసాను. దాని ద్వారా రవి నడవడిక, విద్య, ఇంకా ఇతర వివరాలు అర్థం చేసుకున్నాను. అమ్మాయిని పిలిచి అతని చదువు, ప్రవర్తన, కుటుంబం గురించి నేను గ్రహించినవి సరైనవేనా అని అడిగాను. అంత సరిగ్గా చెప్పగలిగినందుకు నా కూతురు ఆశ్చర్యపోయింది. రవి గురించి నాకు కొంత ముందే తెలుసు కాబట్టి ఈ వివరాలు చెప్పగలిగానని అంది. నేను మరింత స్పష్టమైన వివరాలు చెప్పాను. అవి కచ్చితంగా సరిపోయాయి.
> అమ్మాయి పొద్దున్న 10గం.20ని.లకి ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టింది. కనీసం 10గం.25ని.లకి పుట్టినా, వాళ్ళ జాతకాలు కలిసేవి.
అంటే – తనకి పెద్దగా పరిచయం లేని రవి జీవితంలోని సంఘటనలని కేవలం జన్మ సమయం ఆధారంగా చెప్పగలిగిన పెద్దమనిషి, పద్ధెనిమిది సంవత్సరాలపాటు తన కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి జీవిత విశేషాలతో 10:20 అన్న జన్మ సమయం సరిపోతోందో లేదో చెప్పలేకపోయాడు అన్నమాట.
రవి జాతకం చూడగానే అతని జీవిత విశేషాలు అర్థమైనట్టుగానే తన కూతురు జాతకం చూడగానే అది ఆమె జీవితాన్ని ప్రతిబింబిస్తోందో లేదో తెలిసిపోవాలి కదా? జన్మ సమయంలో తప్పు ఉంటే జాతకం అమ్మాయి జీవితంతో సరిపోలక తికమకపడాలి కదా. వెంటనే birth time rectification చెయ్యాలేమో అని అనుమానం రావాలి కదా.
రవి విషయంలో ఖచ్చితంగా చెప్పగలిగినది అమ్మాయి విషయంలో చెప్పలేకపోవడం చాలా విచిత్రం కదూ!
naga murali garu … manchi point ..it perfectly makes sense 🙂
@naga murali garu ….i just got a counter argument for your comment.you said her father should have verified ,by making a study, the way he did, for the boy.
he could have, but the author jumps to the point that he( her father) has found mismatch in the horoscopes.So,we can assume that he might have studied, JUST, if their horoscopes match.hence.. the case 🙂
i have another question.Does the difference of 9 min , really matters in horoscope? (i got no knowledge of horoscope. correct me if , i am wrong)
P.S. naaku lekhini ni vadi telugu rayadam kastamga anipinchindi . and telugu ni english lo type kanna, direct ga english lo rayadame melu ani pinchindi . ila rayatam , mee blog rules ki virudham aithe , am sry 🙂
ఆదిత్య గారూ,
నాకు జ్యోతిషంతో గట్టి పరిచయం ఉంది (నేను జ్యోతిష్కుణ్ణి కాకపోయునా). మీరడిగిన ప్రశ్నలకి నా సమాధానాలు.
1) పద్ధెనిమిది సంవత్సరాలు వచ్చేంతవరకూ ఒక వ్యక్తి జాతకం చూడకూడదు అన్న నియమం ఎక్కడా ఉండదు. ఉంటే మాత్రం అది చాలా అరుదు. జ్యోతిషం బాగా వచ్చిన వ్యక్తులు తమకి బాగా తెలిసిన, మరీ ముఖ్యంగా సొంత కుటుంబంలోని వ్యక్తుల జాతకాలు చూడకుండా నిగ్రహించుకోలేరు. పోనీ అంతకాలం నిగ్రహించుకున్నా పద్ధెనిమిదో యేడు వచ్చాకా జాతకాన్ని ముందేసుకుని కేవలం వివాహ పొంతన ఒక్కటీ చూసి వదిలెయ్యలేరు. వివాహ పొంతన చూడాలంటే జాతక చక్రం కూడా చూడాలి కదా. పైగా జాతకం కూడా ఆయనే వేశాడు కథ ప్రకారం. అందులో లగ్నం, గ్రహస్థితులూ, రాశి చక్రం, నవాంశ చక్రం, దశలూ మొదలైనవన్నీ లెక్కలు కట్టాలిగా. అలా జాతకం వేస్తూ ఉండగానే మొత్తం జీవితం కళ్ళకు కట్టాలి కదా. జాతకంలోని మిగతా వివరాలన్నిటిమీదా కళ్ళు మూసేసుకుని కేవలం వేరే జాతకంతో పొంతన కుదుర్తోందో లేదో మాత్రమే చూస్తాడా? అందులోనూ సొంత కూతురు జాతకం; పద్ధెనిమిదేళ్ళపాటు చూడకుండా నిగ్రహించుకున్న జాతకం!
2) అవును, జ్యోతిషం ప్రకారం జన్మ సమయంలో కొద్ది నిమిషాల తేడా వచ్చినా జాతకం మొత్తం మారిపోవాల్సిందే. పైగా ఆయనే చెప్పాడు కదా: “కనీసం 10గం.25ని.లకి పుట్టినా, వాళ్ళ జాతకాలు కలిసేవి” అని.
బ్లాగు/పొద్దు రూల్సుకి విరుద్ధం కాదేమో కానీ మీరిలా తెలుగుని ఇంగ్లీషులో టైప్ చేస్తే చదివేవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేఖిని ఉపయోగించడం చాలా తేలిక. ప్రయత్నించండి.
The father character is very much diluted. He, being a very good astrologer and has conviction about his findings,not having his very daughter’s correct time of birth and not drawing the horoscope even after 18 she had attained the age of marriage; is something ridiculous. This is the weakest point in the plot. The twist is not new. The writer (original) has no positive attitude.
నిజమే. కథ ముగింపు తెలిసిపోతోంది.
అనువాదానికి ఈ కథ ఎందుకు ఎంచుకున్నారో రచయిత చెప్పి ఉండవలసింది…
పొద్దువారికి ఓ రిక్వెస్టు: ఈసారి అనువాద కథలు వేసేటప్పుడు ఆ కథ ఎంచుకోడానికి గల నేపథ్యం కూడా రాయిస్తారా అనువాదకుల చేత??