-పసునూరు శ్రీధర్ బాబు
దేహంలో ధూపంలా వంకీలు తిరిగే పంచప్రాణాలు
ఆ అరిచేతుల్లో ఏకమై మంచు ఖండాలుగా మారి నను నిమిరినప్పుడు
నేను ఘనీభవించిన అగ్నికీలల పర్వతాన్నయ్యాను-
ఆ రెండు అరిచేతుల్లో పూసిన పుప్పొడిలో
కన్నీటి బిందువునై రాలి
నలుదిక్కులకూ ఎగిరిపోయాను-
ఆ రెండు అరిచేతులూ ఓ సాయం సంధ్య వేళ
నన్ను పావురంలా పొదివి పట్టుకుని అలా గాల్లోకి వదిలినప్పుడు
నేను అస్తమిస్తున్న సూర్యుడిని ముక్కుతో కరచి పట్టుకుని
కాలాన్ని కదలకుండా చేశాను-
కళ్ళల్లో మెత్తగా తడిసే మౌనలిపి
గట్టుతెగి ప్రవహించేది అరిచేతుల్లోంచే
ప్రేమతో నిండుగా నిశ్చలంగా ఉన్న దేహాన్ని తాకి
వలయాలు వలయాలుగా తల్లడిల్లే తటాకంగా మార్చేవి చేతులే-
చేతులే….
దేహం మీద మొదటి ప్రేమ గుర్తును ప్రతిష్ఠిస్తాయి
చేతులే రెండు దేహద్వీపాల మధ్య
తొలి వారథిగా విస్తరించి
సముద్రాల్ని గల్లంతు చేస్తాయి-
ఆ అరిచేతుల స్పర్శతో
దేహం రెండు ఆత్మల విశ్వాసంతో
అక్షరాలకు చిక్కని కవిత్వ వాక్యాల వెంట పరుగులు తీస్తుంది-
పొద్దుటి మేఘంలా ఆ అరిచేయి
నా ఎదను అదిమినప్పుడు
నేనొక ఉద్యానమై ఆ జలరాశిని ఆవాహనం చేసుకున్నాను…
ఆ కొత్త భారం నన్నెంతో తేలిక చేసింది-
ముత్యపు చిప్పలా విచ్చుకునే అరిచేతుల్లో
మిణుకు మిణుకుమనే వెన్నెల పూల ఆకాశం-
తాత్విక గ్రంథంలా తెరుచుకునే అరిచేతుల్లో
నాకు తెలియని నా ప్రపంచం-
నన్ను నాకు అందంగా చూపించే ఆ అపురూప హస్తాల్లో
నా ముఖం దాచుకుని ఎప్పుడూ ఓ కొత్త ముఖంతో గుబాళిస్తుంటాను-
ఆ అరిచేతులు నన్ను పిల్లాడ్ని చేసి ఆడిస్తుంటే
నేనీ భూమ్మీదకు ప్రేమ కోసం వచ్చిన అతిథినని గర్వపడుతుంటాను-
ఆ అరిచేతుల్లో నేను కర్పూరమై జ్వలించి
ప్రేమ ధూపమై అంతటా వ్యాపిస్తాను-
ఆ అరిచేతుల్లో నా అరిచేతులుంచి
ఇసుక తీరాల్లో కావ్యాలు గిలుకుతూ పోతుంటాను-
నా కన్నీళ్ళను తుడిచే అరిచేతులు
నా కలలను బతికించే అరిచేతులు
నా కవిత్వానికి అక్షరాలందించే అరిచేతులు
ముఖానికి ముద్దుగా సంగీతాన్ని అద్దే అరిచేతులు
పెదాల మీద జలపాతాల్ని మీటే అరిచేతులు-
ప్రేమతో ఉనికిని ప్రక్షాళన చేసే
ఆ అరిచేతుల భాషా రహస్యాన్ని విప్పడం కోసమే
నేను కవిత్వాన్ని ఆశ్రయిస్తున్నాను-
భూగోళాన్ని ప్రేమగా పొదివి పట్టుకునే అరిచేతుల్లాంటి కవిత్వం కోసమే
నేను పరితపిస్తున్నాను-
——————
నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన పసునూరు శ్రీధర్ బాబు హైదరాబాదులో డిగ్రీ, ఆ తరువాత ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బి.ఎల్ పూర్తి చేశారు. హైకోర్టులో అడ్వకేట్ గా నమోదు చేయించుకుని… అది తన ప్రపంచం కాదని పాత్రికేయునిగా మారారు. పదిహేనేళ్ళు ఇండియా టుడే పత్రిక (మద్రాసు)లో పని చేసి 2008 లో మళ్ళీ హైదరాబాదుకు వచ్చి, హెచ్.ఎం.టి.వి లో చేరారు. శ్రీశ్రీ, తిలక్, కొడవటిగంటి, గురజాడ, జాషువా, ఇస్మాయిల్, చలం, చండీదాస్ తదితరుల రచనలను ఇష్టపడుతూ ఎదిగారు. 1999లో ఆధునిక కవితా మహావృక్షం ఇస్మాయిల్ ముందుమాటతో “అనేకవచనం” కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఆ తరువాత రాసిన కవితలనతో మరో సంకలనాన్ని ప్రచురించే ప్రయత్నంలో ఉన్నారు.
శ్రీధర్ బాబు అనేకవచనం బ్లాగు రాస్తున్నారు.
చాలా బాగుంది,మీవి రెగ్యులర్ గా చదువుతాను..కూడలి,హారం లో .
అద్బుతంగా ఉంది
చాలా బాగారాసారండి!!
“భూగోళాన్ని ప్రేమగా పొదివి పట్టుకునే అరిచేతుల్లాంటి కవిత్వం కోసమే
నేను పరితపిస్తున్నాను”
కవిత ఆద్యంతం అబ్బురపరిస్తే ఈ ముగింపు ఆనందపారవశ్యన ముంచేసింది. ఇంతకు మించి మాటలు చెప్పాలన్నా నా కొనవేళ్ళు కదలికలేనివవుతున్నాయి. అమోఘం.
శ్రీధర్ బాబు వచనం ఇండియాటుడే రాతల్లో ఎంత అందంగా వుండేదో, ఇప్పుడు కవిత్వం అంతకంటే కూడా సొబగులు అందుకుంటోంది. అభినందనలు.
it’s good.
its very nice .eelanti vi marinni raayandi
we can interact personally.
all the best.
he is my best friend. i know his articals lost 19yrs. he is a good writer, best of luck sreedar babu.
thrlochan from australia
ఆ రెండు అరిచేతులూ ఓ సాయం సంధ్య వేళ
నన్ను పావురంలా పొదివి పట్టుకుని అలా గాల్లోకి వదిలినప్పుడు
నేను అస్తమిస్తున్న సూర్యుడిని ముక్కుతో కరచి పట్టుకుని
కాలాన్ని కదలకుండా చేశాను-
..ఈ వాక్యాలు అద్భుతంగా వున్నాయి.