-స్వాతీ శ్రీపాద
రాయలసీమ ప్రాకృతిక లక్షణం కరవు. ఇక్కడి మనుషుల స్వాభావిక లక్షణం కరకుదనం. ఈ రెండింటి మధ్య గల కార్య కారణ సంబంధం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన “తడి” కథలో స్పష్టమౌతుంది. ఇది కొత్త దుప్పటి కథాసంపుటిలోని ఆరవ కథ.
కుటుంబ కలహాలు, తిండి కోసం పాడి పశువుల అవస్థలు, ఎండిపోయి వానకు కుళ్ళి పోయిన పైరు, వాన రైతు కళ్ళ చెరువుల్ను అలుగులు పొంగేలా నింపి వెళ్ళడం – ఇవీ కథ ఆరంభానికి పునాదులు. కరువుకుతోడు మనుషులమధ్య ఆరిపోని పగలు. కడుపు నిండకున్నా కసి తీరాలి, పైరు పండకున్నా పంతం నెగ్గాలి – ఇదీ చెన్నమ్మ కుటుంబ పరిస్థితి. ఆమె కొడుకు సుబ్బన్న కేసు గెలవాలి, లాయర్ కు ఫీజ్ కట్టాలి. అందుకు ఆమె చేతి కడియాలు కావాలి. తల్లి మౌనాన్ని ఆశ్రయించింది. అవుననదు, కాదనదు. కళ్ళలో తడి చెంపలపైకి జారింది. తిండి సొక్కలేదు. కంటికి నిద్ర రాలేదు. అక్క కుటుంబానికీ తమ కుటుంబానికీ మధ్య అనుకోని వైరం. శనక్కాయల పైరుకు కావలసిన తడి కారణంగా తగువులు. ఒకడ్ని చూసి ఒకడు పొలాల్ను తడి చేసుకున్నారు. ఏదైతేనేం పది రోజుల్లో మరోసారి నీటి తడి అవసరం పైరుది. సగం నేలకు కూడా చాలలేదు ఏటి నీళ్ళు, ఇంజన్లు తెచ్చి చెరువు మొత్తం ఎండబెట్టారు. ఒట్టి చేసారు. వాన కోసం ఎంత ఎదురు తెన్నులు చూసినా నీళ్ళ దారి కనబడలేదు.
ఊళ్ళో ఉన్న ఒక్కబావి నరసింహారెడ్డిది. అతనితో బేరం కుదుర్చుకున్నారు. చెరువులో తమ పొలం పక్కనున్న గుండంలో ఉన్న కొన్ని నీళ్ళు అక్కకొడుకూ అడిగాడు. తన్నుమాలిన ధర్మానికి పోలేదు సుబ్బన్న- ఆమె కొడుకు. ఆమె అక్క కొడుకు రంగన్నకు ఎదిగొస్తున్న పైరు కళ్లముందే ఎండుతోందనే ఆవేదన ఒకపక్క, గుండంలోని నీళ్ళు ఏ ఒక్కరి సొత్తూ కాదన్న ఉక్రోషం ఇంకొక పక్క. దాంతో మొదలు అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న ఆ రెండు కుటుంబాల మధ్య – కొట్టుకోవడాలు, తలలు పగలగొట్టుకోవడాలూ. దాంతో మనవడూ రెచ్చిపోయి పెద్దమ్మ కొడుకు, అతని కొడుకు తలలు పగలగొట్టాడు. ఇక ఇరుపక్షాల వారు కేసులు పెట్టుకున్నారు. పెద్దిరెడ్డి, రామిరెడ్డి కొమ్ముకాసి ఇరుపక్షాలకు అండగా నిలబడ్డారు – నిప్పుల్లేకుండా కొంపలు కాల్చేందుకు.
ఇన్నిరోజులూ అన్యోన్యంగా సంసారాలు నెట్టుకొచ్చిన అక్కాచెల్లెళ్ళు ఒకరి నొకరు ఓదార్చుకోలేరు. ఒంటిమీద గాయాలు మానినా తడిలేక పైర్లు ఎండినా నీటి గుండాలు ఒట్టిపోయినా ద్వేషాలు మాత్రం ఇంకిపోలేదు. చెరొక నాయకుణ్ణి వెంటేసుకుని లాయర్ల చుట్టూ తిరిగారు రంగన్న, సుబ్బన్న. రంగన్న కూతురి పెళ్ళికని కొనిపెట్టిన బంగారం అమ్మేస్తే అరెకరం మడి కయ్యను నష్టానికి అమ్ముకున్నాడు సుబ్బన్న. మళ్ళీ వానల సమయం వచ్చినా కేసు సాగుతూనేవుంది. పెట్టుబడులకు అప్పులు తెచ్చారు. వాన రాక, పంట లేక అప్పులపాలయారు ఇద్దరూ. అర్ధరాత్రి నిద్ర రాక కడియాలు తీసుకుని అక్క ఇంటికి పడుతూ లేస్తూ బయల్దేరింది చెన్నమ్మ. నర్సింహా రెడ్డి ఇంటి వరకు వచ్చేసరికి దీని కంతటికీ కారణమైన అతన్ని శాపనార్థాలు పెట్టింది. అతని బోరుబావి మీద రైతులంతా ఎగబడటం వల్లే అతనికి ముప్పై వేల ఆదాయం వచ్చింది. ఈ సారీ అదే ఉపాయం ఆలోచించినా రైతులకు అర్థమైంది. చీకట్లో అక్కను నిద్రలేపి ఇంట్లోకి పిలిచింది. రంగన్నకు మెళుకువ వచ్చి ఇద్దరు తల్లులనూ చూసి ఆశ్చర్య పోయాడు. కడియాలు అక్క చేతిలోపెట్టి రంగన్నకు జెప్పి కేసు కొట్టేయించమని కోరింది చెన్నమ్మ. కడియాలమ్మి లాయర్ కిచ్చి పగలు పెంచుకునే బదులు కేసు కొట్టేస్తే పగలుండవు. ఎవరూ గెలవవద్దు ఎవరూ ఓడనూ వద్దు.. అక్క చెల్లెళ్ళిద్దరూ బావురుమన్నారు. ఆమె రాక ఎండిపోతున్న బ్రతుకుల మీద చివరి తడిలా తోచింది రంగడికి. కడియాలు చెన్నమ్మ చేతులకు తొడిగింది ఆమె అక్క.
ఇదీ కథ. కథ అంతా తడిచుట్టూ తిరుగుతూంటుంది. చేలకు కావలసిన తడి, చేతులు తడపటం, చేతుల్లో తడారి పోవడం, కళ్ళలో తడి, నీళ్ళ తడి … ఇలా నానార్థాలతో వాడినా చదువరుల కంటతడి పెట్టించే కథ ఇది. చిన్న విషయాలకే పగలూ పట్టింపులూ , తలలు బద్దలు కొట్టుకోవడాలు కుటుంబాలను భ్రష్టు పట్టించి కోర్ట్ ల చుట్టూ తిరగడాలూ మానవ నైజాన్ని మనిషి బలహీనతల్ను ఎత్తిచూపుతోంది. చిన్నపాటి రైతులను అడ్డం పెట్టుకుని బొక్కసాలు నింపుకునే దళారీ పెద్దమనుషుల తీరు తెన్నులు, గొడవలు రేకెత్తించి వినోదం ఆదాయాలతో సంబరపడే దుర్మార్గపు మనస్తత్వాలను అద్దం పట్టి మరీ చూపించారు రచయిత. తన సహజ ధోరణిలో అతి సహజంగా పెల్లుబికి వచ్చిన కవిత్వ ధోరణులు కథలో ఇమిడిపోయి కొత్త అందాన్నిస్తాయి కథకు. కళ్ళెదుట కనబడే వాస్తవాన్ని అతి హృద్యంగా చిత్రించారు రచయిత. హృదయాన్ని చెమ్మగిల్లజేసే కథ “తడి”.
తడి, కొత్త దుప్పటి సంకలనం లోని కథ. కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.
‘ తడి ‘ కథ పై స్వాతి గారి రచన చదివాను.
ఈ రచనను ‘ సమీక్ష ‘ అనడం కంటే ‘ పరిచయం ‘ అంటేనే బాగుంటుందనుకుంటాను.
” రాయలసీమ ప్రాకృతిక లక్షణం కరవు. ఇక్కడి మనుషుల స్వాభావిక లక్షణం కరకుదనం.”
-కరువు, కరుకుదనం తప్ప రాయలసీమలో మరేమీ లేవా? ఎంత దారుణం! స్వాతీ గారూ?
మరొక్క మాట రాయలేక పోయారా? కథను బట్టైనా రాయలసీమ మనుసుల స్వభావం లో ఇంకేమీలేవా?
ఇది సమీక్ష కాదు పరిచయం మాత్రమే. నిజానికి ప్రాంతీయ లక్షణాలను ఆకళింపు చేసుకోకుండా ఒక కామేంట్ పడేయడం ఎంతవరకు సమంజసం. రాయలసీమ ప్రాక్రృతిక లక్షణం కరవు. ఇక్క డి మనుషుల స్వాభావిక లక్షణం కరకుదనం అన్న రెండు మాటల్లోనే తెలిసిపోతుంది రాయలసీమ గురించిన ప్రాంతీయ తత్వం విమర్శకురాలు సరిగా అవగాహన చేసుకోలేదని. నిజానికి తడి కథ ఉద్దేశ్యం అదికాదు. విద్వాన్ విశ్వం మాటల్లో చెప్పాలంటే రాయలసీమ ప్రజలు ” ఎడద చిక్కనకు మారు పేరు.” …… పెన్నేటి పాట చూడండి. రాయలసీమలోని కరవు ఎంత తీవ్రమైనా ఇక్కడి జనం గుండెలు మాత్రం కరకు కాదు… ఇది అక్షర సత్యం…… నీటి కోసం , జీవనాధారం కోసం తపించే మనసులు అర్థం చేసుకోలేకపోవడం దారుణం.
కన్నీళ్ళు కరవై కరకుదనం పెరిగుండొచ్చు. బ్రతుకు కరకుగా వుంటుందేమో కానీ మనసులు కావు. నేను కూడా రాయలసీమ వాసినే.
రాయలసీమ కరువు ప్రాంతమైనది సహజ వాతావరణ ప్రభావం వల్ల, ప్రకృతి చిన్నచూపు వల్ల ప్రాకృతిక లక్షణం అన్నది చిన్నచూపు వల్లకాదు. కరువు ప్రసక్తి తెచ్చినది సానుభూతి తో తప్ప మరో భావనతో కాదు. కరువు కాటకాల్లో అల్లాడే ప్రజలు రాటు దేరి ఓ రకమైన కాఠిన్యతకు అలవాటు పడటం ఒకవంక [కరకు అనే మాట వాడినది sharpness ,rough and harsh ]struggle for existence కోసం ఎంతకైనా తెగించడం ఐన వాళ్ళతోనే వైరాలు ఇవన్నీ ఒకవంక.
రాయలసీమ ఐనా , రష్యా ఐనా భాషలు వేరైనా కష్ట సుఖాలూ కన్నీళ్ళూ అనుభవాలూ అనుభూతులూ మనవజాతికంతటికీ ఒకటే అని నా నమ్మకం.
మనిషి స్వభావం అన్నది పుట్టి పెరిగిన వాతావరణం మీద వారసత్వంఘా తెచ్చుకున్న లక్షణాలమీద , చదువు తో వచ్చిన సంస్కారం మీద ఆధార పడివుంటుంది. సౌకుమార్యమో కరుకుదన్మో ఏ ఒక్కరి సొత్తూకాదు.
ఒక్క తడి కధే కాదు కొత్తదుప్పటి లోని ప్రతి కధా ప్రతి అఖ్శరం నేను చదివినన్ని సార్లు మరెవరూ చదివివుండరు. ఆ కధలు ఎంతగా మనసును కదిలించకపోతే అందులో ౧౫ కధలు ఆంగ్లంలోకి అనువదించి anthology తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నామో చెప్పుకోవలసిన సమయం మరి. ఎల్లలు లేని విశ్వ మానవ భావనలు నావి దానికి ప్రాంతీయత నాపాదించడం ఒక్కింత మనసు కష్టపడే విషయమే.
ఒక్క రెండు మాటలు తప్ప మిగతా వివరణలో సముచిత్వం కనిపించలేదా?
కల్లాకపటం తెలీని పసితనపు నవ్వు నా సీమ చిరునామ!
మాయ, మర్మం ఎరుగని అమాయకత్వం నా సీమ నైజం!
తడిగుడ్డలతో గొంతులు కోసే తత్వం ఇక్కడ కనబడదు!
‘ అండీ ‘ ల వెనుక గుండెలు తీసే ద్రోహాలకిక్కడ చోటే లేదు!
మాట కాస్త కరుకైతేనేం మనసు వెన్నపూస కాదా ?
మోటుతనం భౌతికమే గానీ మానసికం ఔతుందా?
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మాకు ముఖ్యం
చచ్చినా అందులోనే చూసుకుంటాము సౌఖ్యం!
తొలి తెలుగు శాసనం కరకుదనాన్ని చాటింది ఇక్కడే
తొలి తెలుగు కవయిత్రి కావ్యగానం మోగింది ఇక్కడే !
కరువు నా రాయలసీమకు కేవలం భౌగొళికశాపం
చందన పూలు పూయడం నా సీమ ప్రకృతి స్వభావం!
తడిగుడ్డలతో గొంతులు కోసే తత్వం ఇక్కడ కనబడదు!
‘ అండీ ‘ ల వెనుక గుండెలు తీసే ద్రోహాలకిక్కడ చోటే లేదు!
అయ్యా ఓబుల్ రెడ్డి గారు, మీరె విషయం మీద రాయలసీమప్రాంతం లో ఎప్పుడన్న శాస్త్రీయ పరిశోధనలు చేసారా.. ? మరెలా చెప్పగలరు “తడిగుడ్డతో “, అండీల వెనుకలేని గుండెలు…” అన్న చందాన రాయలసీమప్రాంతాలలో లేవని..? కాస్త కళ్ళు తెరవండి సార్, హింసా ప్రవృత్తి, మోసం, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం, ఇలాంటి ప్రవృత్తి కలిగిన మనుషులు ప్రతి చోట, ప్రతి కులం లోనూ, మతం లోనూ ఉంటారు అంతే గాని, గుణగణాలు కేవలం ఏ ఒక్కో ప్రాంతానికో.లేక ఏ ఒక్క కులానికో గుత్తాధిపత్యం ఉండదండి, నేను మీకు బాగా తెలిసిన మనిషినే కాస్త వెనక్కి రింగులు తిప్పుకోండి.
Good