నెరా నెరా నెరబండి

-రానారె

వారందినాలూ మూడుపేసుల కరంటు రాత్రిపూట వదులుతున్నారు. అడ్డపంచె, బనీను, భుజంపై తువ్వాలు, చేతిలో సలాఁకపారతో దారెమ్మట పొలానికి నడుస్తున్నాడు బసిరెడ్డి.

“ఇంకెవరూ దొరకలేదేమో ఈ చెవుటిముండాకొడుక్కు!”, అంటూ రెండున్నర వేలకు మరో ఐదొందలు జోడించి చెవుటోని ముఖాన విసిరికొట్టాడు మేనేజరు.

“ఏమయ్యా అంత కోపం నీకు? యెవ్వని నాయన సొత్తు? అప్పే కదా ఇది? బిచ్చం కాదుగదా?”

ఆ మాటతో మేనేజరు ఉగ్రుడయ్యాడు. మేనేజరు, బసిరెడ్డిల ముఖాల్లో వచ్చిన మార్పులతో అయోమయంలో పడ్డాడు చెవుటోడు. ఒక అడుగు ముందుకు వేసి బసిరెడ్డికి దగ్గరగా నిలబడ్డాడు.

“ఫో ఇక్కణ్ణుంచి!!” చెవుటోణ్ణి భస్మం చేసేలావుంది మేనేజరు చూపు.

పొలం దగ్గరపడుతుండగా కస్సుమని శబ్దం చేస్తూ అగ్గిపుల్ల వెలిగింది. ఆ వెలుగులో అతని ముఖం మెరిసింది. బీడీ ముట్టించి, ఆది ఆరిపోకుండా వెంటనే ఒక దమ్ము పీల్చి, అగ్గిపుల్లను ఆర్పి దారిపక్కన జారవిడిచాడు. వెలుగును చూసిన కండ్లు మళ్లీ మెల్లగా చీకటికి అలవాటుపడుతుండగా గబగబా అడుగులు వేస్తున్నాడు.

ఆ అదును పొద్దుతిరుగుడు కాపు పెద్దపెద్ద పూలతో బాగానే పండింది. గింజలు పాలుపట్టి నిండుగా కనిపిస్తున్నాయి. ఆఖరి తడి కట్టేస్తే కోత మొదలుబెట్టొచ్చు. నేరుగా బాయి కాడికే పోయి, కరెం టొచ్చిందో లేదో చూద్దామని స్టార్టరు బటను నొక్కినాడు. మోటరు గుయ్యీగయ్యీ మన్లా.

కంచెకు ఆవల మనిషి కదిలిన చప్పుడయింది. బసిరెడ్డి అటు చూసేలోగా, “కరంటు రాలేదులే ఇంగా. తొమ్మిదికి ఇంగ రోంత టైమున్నిట్టుండాది” అంటూ కంచెదాటి ఈవలికి వచ్చి నిలబడె చెవుటోడు. ఔనన్నట్టు తల పంకిస్తూ, “ఆఁ! ఇంగా రాలా” అని గట్టిగా అరిచి చెప్పాడు బసిరెడ్డి. ఏమర్థమయ్యిందో యేమో, చెప్పిన మాటే మళ్లీచెప్పాడు చెవుటోడు. తల మాత్రం పంకించి ఊరుకున్నాడు బసిరెడ్డి ఈసారి.

చెవుటోనిది మాలపల్లె. అతని అసలు పేరు నాగయ్య. బసిరెడ్డి మడికి పక్కనే వుండే శంకర్రెడ్డి తోటకు కావలి కాస్తూ అందులోనే చిన్న గుడిసెలో వుంటాడు. ఒకోసారి చెవుటోని భార్యా బిడ్డలూ కూడా పల్లెనుంచి వచ్చి అందులో వుంటారు. చెవుటోనికి పూర్తి చెవుడుగాదు. గట్టిగా అరిస్తే వినిపిస్తుంది. లేదా పెదవుల కదలికనుబట్టి, సైగలను బట్టి అర్థం చేసుకుంటాడు. ఒకోసారి వినిపించినా వినిపించనట్టు నటిస్తాడు -ముఖ్యంగా తానేదైనా పొరబాటు చేసినప్పుడు, ఎవరైనా పనులు పురమాయించ బోయినప్పుడు, తిట్టినప్పుడు, కోప్పడినప్పుడు. ఒకోసారి ఎంత గట్టిగా అరిచినా, పాపం, నిజంగానే వినిపించదు. అయితే చెవుటోడు, చెవుటోని భార్య మాట్లాడుకోవడం చూసినవాళ్లంతా అబ్బురపడక మానరు. కంఠాన్ని ఒక ప్రత్యేకమైన మంద్ర స్థాయిలో శ్రమ లేకుండా పలికిస్తూ ఆమె మాట్లాడుతూ వుంటే చెవుటోనికి చెవుడని నమ్మలేరెవరూ. తన మొగుడు చెవుటోడని ఆమెకెప్పుడూ అనిపించలేదు కాబోలు, ఇతరులతో అతని మాట మాట్లాడేటప్పుడు “మీ నాగడు …” అంటుంది.

బసిరెడ్డికి దగ్గరగా వచ్చి కుడిచెయ్యి చాచీచాచకుండా నిలబడ్డాడు చెవుటోడు. అడ్డపంచె కింద చెడ్డీజేబులో చెయ్యిబెట్టి బీడీకట్టను బైటికితీసి, అందులోంచి ఒక బీడీ లాగి చెవుటోనికిచ్చి, ఒకటి తన పళ్లమధ్య ఇరికించుకొని వెలిగించాడు బసిరెడ్డి. అదే అగ్గిపుల్ల చప్పుడు లేకుండా చేతులు మారి చెవుటోని బీడీనీ వెలిగించింది.

“కరంటొచ్చినిట్టుండాది సూడండి య్యా” అంటూ వచ్చింది చెవుటోని భార్య. బసిరెడ్డి స్టార్టరు బటన్ నొక్కినాడు. మోటరుపంపు తిరగడం మొదలుబెట్టింది. పార చేతబట్టుకొని కాలవ చివరకు నడవబట్టినాడు బసిరెడ్డి.

కాలువ వెంబడి నీళ్లు సాగి వచ్చి, ఎడ దగ్గర మలుపు తిరిగి, పొద్దుతిరుగుడు చెట్ల దోనెల్లోకి విస్తరిస్తున్నాయి. చెవుటోడొచ్చి బసిరెడ్డి చేతిలోని పారను తనచేతికి తీసుకొని ఎడ దగ్గర నిలబడినాడు. “మీ నాగడు కడతాడులేయ్యా” అంది చెవుటోని భార్య.

మొగుడూపెళ్లాలిద్దరూ కంచెదాటి ఈవలికొచ్చి చొరవగా సాయం చేస్తున్నారంటే వాళ్ళేదో అవసరంలో వున్నారని బసిరెడ్డికి అర్థమయింది. అతని చేతిలో చిల్లిగవ్వ కూడా లేదిప్పుడు. రెండేండ్లకు ముందు కోమటిశెట్టి దగ్గర తీసుకున్న బాకీ ఒకటుంది. ఈసారైనా కట్టమని ఇంటికొచ్చి అడుగుతున్నాడు శెట్టి. అంతో ఇంతో వడ్డీ కడుతూ ఉన్నాడు. ఎవరైనా ఇంటికొచ్చి అరుగుమింద కూర్చుంటే ఇల్లాలు కాఫీ ఇస్తుంది. అది మర్యాద. వసూలు కోసం వచ్చి అరుగుమింద కుచ్చునే శెట్టికి బాకీ బదులు కాఫీ ఇచ్చి, మాటలుచెప్పి సాగనంపాల్సి వస్తున్నదిప్పుడు. ఇదేం మర్యాద? ఎన్నాళ్లురా ఈ బతుకు అనిపిస్తోంది బసిరెడ్డికి.

“పొద్దుతిరుగుడు పంట బాగానే పండింది. గింజ నాణ్యంగానే వచ్చింది. మంచి రేటు కూడా పలుకుతోంది. నలుగురితో కలిసి బళ్లారివైపు చిన్న లారీలో వేసుకొని పోగలిగితే ఇంకా మంచి ధరకే అమ్ముకోవచ్చు. ఈ సొమ్ముతో పెద్దబాకీ ఒకటి సుమారుగా తీర్చేయొచ్చు. ఈసారితో సుమారైన బరువు నెత్తి దిగి పోతాది. మల్లా పంటకు ఎవుర్నైనా అడగాల్సిందే. ఈ చెవుటోనికి యే మవసరముందో! నా దగ్గర ఇప్పుడేమైనా ఆశించడమూ – వట్టిగొడ్డుకు పాలు పిండడమూ ఒకటే” అనుకొంటున్నాడు.

“నువ్వు మడికాడికి వస్చావేమోనని ఈరోజు మద్యానం నుంచి కాపెట్టుకోని వుండాడు య్యా మీ నాగడు. రెడ్డి కనబణ్ణాడా అని నన్ను గుడకా రెండుమూడు మాట్లు అడిగినాడు. ‘ఇయ్యాలప్పుడు యేమిటికొస్సాడు రెడ్డి? ఈ పొద్దు రేతిరికి గదా మోటర్లకు కరంటొచ్చేది’ అన్జెప్తిలే నీను”

‘కతా తానే వేసి, అర్థమూ తానే చెబుతాందీ చెవుటోని పెండ్లాము’ అనిపిస్తోంది బసిరెడ్డికి. చెవుటోడు కాలవలో వంగి పారతో ఎడ మారుస్తున్నాడు.

“యేమిరా విశేషము?” తెచ్చిపెట్టుకున్న కులాసా పలికించినాడు బసిరెడ్డి.

ఎడ మార్చి, పారకు అంటిన బురదను కాలవ నీళ్లతో కడిగి పక్కనున్న ఎడ మీద పెట్టి యడంగా వచ్చి నిలబడినాడు చెవుటోడు.

“నిన్నే! ఏమి సంగతి అని అడుగుతాండాడు రెడ్డి”

“బ్యాంకీలో రోంత పనిబడింది సామీ”

“యేం పనో సరీఁగా రెడ్డికి సెబితే గదా! ల్యాకపోతే ఎట్టతెలుచ్చుందీ?”

“గొర్లూ, మ్యాకలూ కొని మేపుకోమని .. మా యట్టా సన్నాబన్నోళ్లకు గౌర్నమెంటోళ్లు బ్యాంకీలో అప్పులిస్సాండారంట. ఆ అప్పులు తెచ్చుకునేదానికి రేపే ఆకిరీ దినం. రోంత నువ్వుగాన ఆ బ్యాంకీదాఁక వచ్చి నా పేరు రాయిచ్చినావంటె సాలు సామీ”

తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు బసిరెడ్డి. పొద్దుతిరుగుడు పూలు కొయ్యడానికి, గింజలు తీసి ఎండబెట్టి మూటలకెత్తడానికి కూలీలకూ ఇతర ఖర్చులకూ ఆయన దగ్గర డబ్బులేదు. ఊళ్లో అప్పులిచ్చేవాళ్లే గింజలూ కొంటున్నారు.

“శంకర్రెడ్డి వూళ్లో లేడా?”

“లేడు సామీ. వుంటే నీ కీ బరువు పెట్టకపోను”

“సరే, రేషను కార్డు తీసుకొని రేప్పొద్దున్నే ఇంటికి రా”.

* * * * * * * * *

పొద్దుపొద్దున్నే బసిరెడ్డి ఇంటిముందు ప్రత్యక్షమైనాడు చెవుటోడు. బ్యాంకు నుంచి వచ్చేటప్పటికి యే వేళ అవుతుందో యేమో, సద్ది తాగమన్నాడు బసిరెడ్డి. పల్లె నుంచి ఒకటిన్నర మైలు దూరంలోని మండలకేంద్రంలో వుంది బ్యాంకు. దారిలో చెవుటోడు అడక్కుండానే బీడీ ఇచ్చినాడు బసిరెడ్డి.

“యెంత ఇస్తాండారంటా?” చెవుటోని ముఖంలోకి చూస్తూ గట్టిగా అరిచినాడు.

“మూడువేలదాఁక ఇస్తాండారంట” చల్లగా చెవుటోని జవాబు.

“మనకొక ఆరు నూర్లు కావాల్నే!? గింజలమ్మఁగనే ఇస్తా”

” … ”

“ఇనబడిందా?”

“అల్లునికి వెయ్యి బాకీ వుండా. కూతురూ అల్లుడూ వొచ్చి కుచ్చోని తిండాండారు సామీ రెణ్ణెల్లబట్టీ”

“నీ సొమ్ము చాన్నాళ్లు బెట్టుకోను. గింజలమ్మఁగానే ఇస్తా”

“నీకు తెలీందేముండాది సామీ .. గొర్రెపిల్లల రేటు ‘పైన’ పలుకుతాంది”

‘అదీ నిజమే. యెంత చెట్టుకు అంత గాలి.’ దీర్ఘంగా ఆలోచిస్తూ నడుస్తున్నాడు బసిరెడ్డి. బసిరెడ్డి పెట్టిన మెలికతో చెమటలు పడుతున్నాయి చెవుటోనికి. నిముషం తరువాత బసిరెడ్డి గొంతు విప్పాడు, “పది రోజులు ఓపిక బట్టలేవంట్రా?!”
ప్రాధేయపూర్వకంగా వుందా మాట.

“అట్నే కానీలే సామీ”

ఆ తరువాత ఇద్దరికీ మాటల్లేవు. ఎవరి అవసరాల గురించి వాళ్లు ఆలోచిస్తూ నడుస్తూ బ్యాంకు చేరుకున్నారు. మేనేజరు ఇద్దరితోనూ సాదరంగా మాట్లాడి దరఖాస్తు పూరించి సంతకాలు చేయించి పంపించినాడు.

* * * * * * * * *
మూడు దినాల లోపునే, అప్పులు జారీ అయినాయనీ బ్యాంకుకు వచ్చి తీసుకోవలసిందనీ పల్లెలకు విజ్ఞప్తులు అందినాయి.

బసిరెడ్డి తానే చెవుటోణ్ణి తోడుకొని బ్యాంకులో అడుగుపెట్టాడు. బ్యాంకులో అనుకున్నంత రద్దీ లేదు. బసిరెడ్డి బ్యాంకు మేనేజరును దూరం నుంచి పలకరించి, చెవుటోణ్ణి చూపించాడు. మేనేజరు చెయ్యి కొద్దిగా పైకిలేపి చిరునవ్వు నవ్వి, వీళ్ల పని చూడమంటూ పురమాయించాడు. గుమాస్తాల చూట్టూ ఒక ప్రదక్షిణ చేసివచ్చి చివరిగా మళ్లీ మేనేజరు బల్లముందు ఆగారిద్దరూ.

బసిరెడ్డిని చూసి చిరునవ్వు నవ్వుతూ, “నాగయ్యా, ఇదిగోనయ్యా నీ డబ్బు” అని కరెన్సీ కట్టను చెవుటోని ముందుకు తోశాడు. ఆ కట్టను తాను తాకవచ్చునో లేదోనని సంశయిస్తూ బసిరెడ్డిని చూశాడు చెవుటోడు.

బసిరెడ్డి మేనేజరుతో, “మూడువేలు, కదా సార్”?

మేనేజరు చిరునవ్వు చెదరనీయక, “నాగయ్యనే లెక్కపెట్టుకోనివ్వండి”.

కళ్లముందు కొత్త నోట్లు, చిరునవ్వులూ కనిపిస్తున్నా, చెవుటోడు మొహమాట పడుతూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. మేనేజరు చిద్విలాసం చిందిస్తూనే ఉన్నాడు. బసిరెడ్డి చొరవగా ఆ నోట్లకట్టను తీసుకుని చకచకా లెక్కించాడు.

“ఐదు నూర్లు తక్కువ పడినట్టుంది సార్!!?”

“మీకు తెలీనిదేముంది బసిరెడ్డిగారూ!” అంటూ అరచేతులు చూపించాడు మేనేజరు.

మేనేజరు నవ్వును చూసి బసిరెడ్డి గుండెల్లో రాయిపడింది. వచ్చింది రెండున్నర వేలేనని తెలిస్తే చెవుటోడు ఆరొందలు అరువివ్వడు. జరగాల్సిన సంతకాలు జరిగిపోయాయి. బసిరెడ్డి ముఖంలో ఆందోళనను పసిగట్టిన మేనేజరు లాలనగా అన్నాడు,

“అంతా బ్యాంకువారికే కాదులెండి రెడ్డిగారూ! మీకు తెలీనిదేముందీ!”

‘ఐదొందలు మరీ ఎక్కువ సార్’ అందామనుకుని, ఆగాడు.

“రెడ్డిగారూ, నాగన్నను పంపించి రండి. మనం మాట్లాడుకుందాం.”

“ఏం మాట్లాడుకుందాం?”

“హహ్హ హ్హహ్హ భలేవారండీ! రెడ్డిగారూ, మీకు తెలీనిదేముందీ”

“శాంక్షన్ అయిన మొత్తం మూడువేలు, ఇచ్చేయండి సార్”

“మీరు బయటకెళ్లి కనుక్కోండి. నిన్నటి నుండి ఇప్పటివరకూ రెండు వందల పైగా లోన్లు ఇచ్చాం, అందరికీ ఇంతే. మన చిన్నారెడ్డిగారే ఇప్పించారు అందులో సుమారు సగం పైగా. ఈరోజు మనం కొత్తగా మాట్లాడటం ఏం బాగుంది చెప్పండి రెడ్డిగారూ, మీకు తెలీనిదేముందీ”

చిన్నారెడ్డి బసిరెడ్డికి బంధువు, చిన్నప్పటి నుంచి మిత్రుడు కూడా. చిన్నారెడ్డికి కూడా వాళ్ల నాన్నగారిలాగే రాజకీయాలంటే ఆసక్తి. మెల్లమెల్లగా ఆయన కూడా ప్రజల మనిషిగా మారుతున్నాడు. చిన్నారెడ్డిని పట్టుకుంటే పనులు జరుగుతాయని ప్రజలు అనుకుంటున్నారు. వాళ్లనుకొంటున్నట్టే ‘పనులు’ జరుగుతున్నాయి కూడా.

మేనేజరు మందహాసం స్థిరంగా వుంది. బసిరెడ్డికి ఆ మొహం మీద ఖాండ్రించి వుమ్మాలనిపించింది. కానీ తాను అవసరంలో వున్నాడు. ఇలాంటి రుణాల విషయంలో మామూళ్లు మామూలేనని, అందులో ప్రయోజనాల కోసమే పేదలకు రుణాలిప్పించే భగీరథులు అవతరిస్తారనీ, మళ్లీ ఎన్నికల సమయానికి ఈ రుణాలు చాలావరకు మాఫీ అయి, కొత్త రుణాలు వస్తాయనీ తనకు తెలీనిదేమీ కాదు. కానీ తాను నేరుగా ఇలా భగీరథావతారం ఎత్తడం ఇదే మొదటిసారి.

“ఐదొందలు మీకొక లెక్క కాదు, ఇచ్చేయండి సార్”

“మీరనేది నిజమే రెడ్డి గారూ. కానీ ఇప్పటివరకూ రెండొందలపైగా లోన్లు శాంక్షన్ చేశాం. ఇంకా చాలా చెయ్యాలి. ఒక్కరికోసం రూల్ మార్చడమంటే మనవల్ల ఔతుందా చెప్పండి? మీకు తెలీనిదేముంది. మీరొకసారి చిన్నారెడ్డితో మాట్లాడి రండి.”

ఒక క్లర్కు మేనేజరు కేబిన్ వైపు రాబోయాడు. మేనేజరు చూపుతోనే అతణ్ణి వారించాడు.

“శివునికి ఒళ్లంతా బూడిద. బసిరెడ్డి మామకు ఒళ్లంతా మొండితనం. వస్తా అమ్మా. కరంటొచ్చే టైమయ్యింది.” నవ్వుతూ అరుగు మీదినుంచి లేచి, వీధివైపుగా వెళ్లిపోయాడు చిన్నారెడ్డి. వీధి మలుపులో అతను కనుమరుగయ్యేదాకా అటే చూస్తుండిపోయారు దంపతులిద్దరూ.

“బూడిదంట బూడిద. అందురూ బెదిరించేవాళ్లే!” అంది బసిరెడ్డిభార్య.

“ఒళ్లంతా బూడిదే అయితే మంచిదే. సుమారైన మంట తగిలినా ఒళ్లు కాలదు.” బసిరెడ్డి నవ్వాడు.

“ఇది బ్రోకరు పని. మీరు చెయ్యడమూ బాగలేదు, నన్ను చెయ్యమనడం అంతకన్నా బాగలేదు.”

మేనేజరు ముఖంలో చిరునవ్వు మాయమయింది.

“అంటే చిన్నారెడ్డిని మీరు బ్రోకరంటున్నారా?”

“ఒక్కమాట చెప్పండి, మూడువేలు ఇస్తారా ఇవ్వరా?”

“ఇంకెవరూ దొరకలేదేమో ఈ చెవుటిముండాకొడుక్కు!”, అంటూ రెండున్నర వేలకు మరో ఐదొందలు జోడించి చెవుటోని ముఖాన విసిరికొట్టాడు మేనేజరు.

“ఏమయ్యా అంత కోపం నీకు? యెవ్వని నాయన సొత్తు? అప్పే కదా ఇది? బిచ్చం కాదుగదా?”

ఆ మాటతో మేనేజరు ఉగ్రుడయ్యాడు. మేనేజరు, బసిరెడ్డిల ముఖాల్లో వచ్చిన మార్పులతో అయోమయంలో పడ్డాడు చెవుటోడు. ఒక అడుగు ముందుకు వేసి బసిరెడ్డికి దగ్గరగా నిలబడ్డాడు.

“ఫో ఇక్కణ్ణుంచి!!” చెవుటోణ్ణి భస్మం చేసేలావుంది మేనేజరు చూపు.

బసిరెడ్డిని ఏమీ అనలేక, ఆగ్రహం చల్లారక, అతణ్ని తోడ్కొని వచ్చినందుకు చెవుటోణ్ణి నోటికొచ్చినట్టు తిడుతూ, తన కుర్చీ ఎత్తి విసరబోయాడు.

అంతలో మిగతా బ్యాంకు సిబ్బంది వచ్చి ఆయనను చల్లబరిచి, ఈ గందరగోళానికి చెవుటోడే కారణమని నిందిస్తూ బసిరెడ్డినీ చెవుటోణ్ణీ బయటకు సాగనంపుతున్నారు. బసిరెడ్డిని తోడ్కొని వచ్చినందుకు చెవుటోణ్ణి నిందిస్తున్నాడు మేనేజరు.

* * * * * * * * *
పొద్దుతిరుగుడుగింజలను అమ్మడానికి బళ్లారికి వెళ్లిన వారంతా డబ్బుతో తిరిగివచ్చేశారు – ఒక్క బసిరెడ్డి మాత్రం ఆ తరువాత రెండురోజులైనా ఇల్లు చేరలేదు. పొద్దు గూకింది. బసిరెడ్డి భార్య ముఖం నల్లబడింది. మనసు కీడు శంకించింది. సొమ్ముతో తమ ఇళ్లకు చేరిన రైతులతో బసిరెడ్డి గురించి అప్పటికే ఆమె అడిగింది. బళ్లారిలో తెలిసినవారో దూరపుబంధువులో ఎవరో వున్నారని, వాళ్లను చూడటానికి వెళ్తున్నట్టు తమతో చెప్పాడనీ ఒకరిద్దరు అన్నారు. సొమ్ము చేతిలో పడినాఁక ఇక తమకు కనిపించలేదని కొందరన్నారు. మరి కొందరు తమకు తెలీదన్నారు.

రాత్రి తొమ్మిదయింది. ఆమె అన్నం తినకుండా గడపలో కూర్చొని వుంది. ఆ పల్లెకు ఆఖరిబస్సు రాత్రి పది కావస్తోందనఁగా వస్తుంది. అది వచ్చేసరికి ఊరంతా నిద్రపోయి వుంటుంది. బస్సు చేసే చప్పుడు తమ ఇంటిదాక వినిపిస్తుంది.

పిల్లలిద్దరూ నెల్లూరులో ఒక పేరున్న రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్నారు. ఆ ఖర్చు లేకపోతే తమకు అప్పుల సమస్యలు వుండేవి కావు. తలకు మించిన భారం నెత్తికెత్తుకున్నావన్నారొకరు, సూటిగా బసిరెడ్డితోనే. కొడుకును నెల్లూరిలో చదివించి, కూతురును దగ్గర్లోనే గవర్నమెంటు కాలేజీలో చేర్పించమని సలహా ఇచ్చాడొకాయన. నెల్లూరిలో కాలేజీలు బాగలేవు, కర్నాటకలో చేర్పించమన్నాడొక విజ్ఞుడు. వీళ్ళంతా దగ్గరి బంధువులే. ఈ ఉచిత సలహాలన్నీ విన్న పిల్లలు తెల్లమొహాలు వేశారు. బసిరెడ్డి అయోమయంలో పడ్డాడు. అప్పుకోసం ఈ శ్రేయోభిలాషుల దగ్గరకు మాత్రం వెళ్లవద్దన్నది బసిరెడ్డి భార్య. అసలే బసిరెడ్డి చాలా పట్టుదల గల మనిషి. ఆ పట్టుదల గురించే ‘నీ యంత మొండోణ్ణి యాడా చూళ్లే’దంటారు ఆయనతో చనువున్నవాళ్లు, వరసైనవాళ్లూ తమాషాకు. ‘బసిరెడ్డికి రోంత తిక్క’ అని పరోక్షంలో నవ్వుకుంటారనీ ఆమెకు తెలుసు.

ఎప్పటి విషయాలో తలచుకొంటోందామె. తమ గతాన్నీ భవితనూ గుఱించిన ఆలోచనలు కలిగించిన ఆందోళనలో, ఆఖరి బస్సు వచ్చిందో లేదో గమనించలేదు. అంతలో ఆ ఇంటివైపే టార్చిలైటు వేసుకొని వస్తున్నాడొక మనిషి. తమ టార్చిలైటు తమ ఇంట్లోనే వుంది. కళ్లు మిరుమిట్లుగొలుపుతున్న ఆ వెలుగు వెనుక మనిషి ఎవరో పోల్చుకోవడం కష్టంగా వుందామెకు. అది తన భర్తే అయివుండాలని ఎంతగానో కోరుకుందామె. ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయి చూస్తూవుండగానే ఆ మనిషి సమీపానికి వస్తున్నాడు. ఆ నడకను బట్టి, అడుగుల చప్పుడును బట్టి, అవి తన భర్త అడుగులేనని గుర్తించి కళ్లలో నీళ్లు నిండగా లేచి నిలబడింది.

పందిట్లోకి వస్తూ ‘ఇంకా మేలుకోనే వుండావా?’ పలకరింపుగా అన్నాడు బసిరెడ్డి. అతని చేతిసంచిని అందుకొని, పైటచెంగుతో కళ్లొత్తుకుంటూ ఇంట్లోకి దారితీస్తూ, ‘పొంతలో వేణ్ణీలుండాయి తోడిస్తా, పోసుకోని రాపో – తిందాము’ అందామె. మరో మాట మాట్లాడకుండా ఆమెననుసరించాడు బసిరెడ్డి.

కిరసనాయిలు బుడ్డీ వెలుగులో ఇద్దరూ భోంచేస్తున్నారు.

“బళ్లారిలో మాంచి మడక కార్లు, మందపాటి పార, కోతకొడవండ్లూ కనబణ్ణాయి. మనకూ రెండు పట్టకచ్చినా. ఆచారి అని మనకు తెలిసినోళ్లుండార్లే. వాళ్లు తయారుజేసి అమ్ముతా వుంటారు. మంచి నాణ్ణెమైన సరుకులే. వాటితోపాటు మూడు బ్యాట్రీల లైటు కూడా తెచ్చినా. మంచి పవర్ఫుల్ లైటు.”

“ఇంగ రోంత అన్నముండాది పెట్టుకో. చారు గూడా వుండాది”

“ఈ రెండ్రోజులూ యేం జేసినానంటే ఆ మేనేజరుగాని ఘనకార్యమంతా మట్టంగా కాయితం మింద రాసి, కరపత్రం కొట్టిచ్చినా. మొత్తం ఐదునూర్ల కాపీలు. రేపు శనివారం చెవుటోడు నన్నూరు కాపీలు సంతలో పంచుతాడు. ఒక కాపీ మండలాఫీసు బయట గోడకు అంటిస్తాడు. ఒక కాపీ ఎమ్మార్వో ఆఫీసుకు. ఒక కాపీ పోలీస్ స్టేషన్లో ఇస్తా. మిగతావి మన హైస్కూల్లో. సోమవారానికల్లా వాని నాయనకు జ్వరం రావాల.”

“కించిత్తు లమ్డీకొడుకు” మొగునికి జరిగిన అవమానానికి ప్రతీకారం జరగాలన్న కసి తప్ప మరేమీ లే దా మాటలో. ‘ఇదంతా తమ నెత్తికి చుట్టుకుంటాదేమో, దీంతో ఎవురెవురికి కోపాలొస్తాయో యేం పాడో!’ అని భయపడింది. ‘ఆ మిడిమేలపు మేనేజరుతో మాటలు పడి, మళ్లీ బ్యాంకులో ఏదైనా పనిబడితే, ఏమీ జరగనట్టు మళ్లీ మొహం చూపించేదెట్టా?!’ అని మథనపడింది.

బసిరెడ్డికి ఈ ఆలోచనలేమీ పట్టినట్టు లేదు. హాయిగా భోజనం ముగించి లేచాడు. తేలికపడిన మనసుతో ఇంట్లోనుంచి బయటికొచ్చి బీడీ వెలిగించాడాయన. పందిట్లో మంచాలు వాల్చి, వాటిపై పరిచే పరుపులు తేవడానికి ఇంట్లోకెళ్లింది ఆమె.

* * * * * * * * *

శనివారం సాయంత్రం మూడుగంటలు కావస్తోంది. పందిట్లో అరుగుమీద కూర్చొని, విసనకర్రతో విసురుకొంటున్నాడు బసిరెడ్డి. లోపల కాఫీ సిద్ధం చేస్తూవుంది బసిరెడ్డి భార్య. చెఱువు గట్టు నుంచి నీళ్లలోకి జారిపోవాలని ఆత్రపడే కప్ప మాదిరిగా పెద్దపెద్ద అంగలతో నడిచి వస్తున్నాడు చిన్నారెడ్డి. వీధిలో యండ వాలుగా పడుతూ అతని చెంపను పగలగొడుతూవుంది. దూరం నుంచే అతని రాకను గమనించాడు బసిరెడ్డి. పందిటి దాపునకు వచ్చేటప్పటికి, అరుగుమీద జరిగికూర్చొని తువ్వాలుతో ధూళిని విదిల్చి, కూర్చొమ్మంటూ చిన్నారెడ్డికి చోటు చూపించాడు.

“కాఫీ తీస్కో అన్నా!” అంటూ ఇంట్లోనుంచి బయటికొచ్చింది బసిరెడ్డిభార్య.

“బాగుండారామ్మా?”

“బానే వుండాం న్నా” అంటూ, ఇద్దరికీ కాఫీగలాసు అందించిందామె.

“ఈ యండకు కాఫీ తాగితే పానం పోతాదేమో” అంటూనే కాఫీగలాసు అందుకున్నాడు.

“మంచినీళ్లు తెమ్మంటావా న్నా? మజ్జిగుండాది తాగుతావా?”

“వొద్దులేమ్మా! యంత యండలున్న్యా కాఫీ తాగకపోతే నాలిక పీకినట్టుంటాది పాడుది.”

ఒక్క గుక్క కాఫీ తాగి, “ఏం ప్పా ఊళ్లో సమాచారాలు?” అన్నాడు బసిరెడ్డి.

“నీకు తెలీకండా ఏముండాయి మామా!”
వయసులో ఒకటిరెండేండ్లు చిన్నవాడు కావడంతో బసిరెడ్డిని అట్లా వరస కలిపి పిలవడం, చిన్నాచితకా పరాచికాలాడటం చిన్నప్పటి నుంచి అలవాటు.

“…”

కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. కాఫీగలాసులు ఖాళీ అయినాయి. చిన్నారెడ్డి చల్లకొచ్చి ముంతదాస్తున్నాడన్న సంగతి క్షణాలు గడిచేకొద్దీ ప్రస్ఫుటం చేస్తోందా నిశ్శబ్దం. దానికి తోడు యండలో నడక, కాఫీ వేడీ కలిసి చమటలు పట్టిస్తున్నాయతనికి. ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికన్నట్టు, సరసంగా అన్నాడు – “ఏమ్మా, మా మామ మాట్లాడడు?”

“ఏమో నువ్వే అడిగి కనుక్కో న్నా” అందామె నవ్వుతూ.

“ఏం మామా?”

“…”

“పలకడు…?! మామకున్న పంతాలకు నువ్వు కాబట్టి ఓర్పుగా సంసారం సగేసుకొని వస్తాండావు మ్మా. ఇంకో ఆడదయుంటే ఈ పందిరిగుంజకు కట్టేసి, రోజూ ఈ అరుగు మిందనే కూడూ నీళ్లూ పెట్టేది”

“అంతేనంటావ్?”

“అంతగాక?! ఇంత పట్టుదలైతే ఎట్ట? చెవుటోణ్ణి ఏదో అన్న్యాడని మన బ్యాంకి మేనేజరును ఊళ్ళో తలెత్తుకోనీకుండా…”

“మన బ్యాంకి మేనేజరా? నీకు సుట్టమా రా వాడు? మెట్టుతో కొట్టొద్దూ వాణ్ణీ నిన్…”

“మానేజరు మనోడు కాకపోవచ్చు, బ్యాంకి మనదే గదా? చూస్తివామ్మా?! అందుకే మామకు తొందరెక్కువనేది.”

“మీ మామను నేరుగా ఏమీ అనల్యాకనే గదా, ఆ బ్యాంకీవోడు చెవుటోని మిందికి ఒంటికాలిమింద లేసింది?”

“నిజమే తల్లీ. నోటికాడ కూడు తీసేస్తాండామని, కుక్క మాదిరిగా వాడు ఏదో మొరిగినాడు. సరే. దానికి మామ ఏం జేసినాడు? ఎవురికీ తెలీకండా, ఆఖరికి నీక్కూడా తెలీకండా యాణ్ణో బళ్లారిలో మూడ్రోజులుండి ఆ కతంతా ప్రింట్లు కొట్టిచ్చి, చెవుటోనితో సంతలో పంచేదానికి పూనుకున్యాడు. ఎవడో పరాయోడు మనూరికొచ్చి మనల్ని ఒక మాట అన్న్యాడంటే, ఎవురుకి చిన్నతనము? ఉండూరోళ్లము మనకందరికీ కాదా? నాతో ఒక మాట చెప్పింటేనేమి? మామ కాళ్లకాడికి ఈడ్చుకొచ్చి తప్పైపోయిందని ఒప్పించకపోతినా నేను? ఏమి మేమంతా సచ్చినామనుకున్యాడా మామ? ఈ ఊళ్లో బతికి, ఈ ఊళ్ళోనే సచ్చేటోళ్లం మనము. మనకు అవమానం జరిగిందని దండువారికొట్టించి చెబితే మనకే చిన్నతనం. వానికేం బయసినము?”

“నువ్వనేదీ నిజమే అన్నోఁవ్. బ్యాంకీవోడు ఈ ఊరు కాకపోతే ఇంగోవూళ్లో బతుక్కుంటాడు. వానికేమి?”

“చేతిలో కాగితాలకట్టతో చెవుటోణ్ణి చూడఁగానే నాకు అనుమానమొచ్చి సంగతేమిరా అని కనుక్కుంటే, ఇదీ మా మామ పని. ఆ కట్ట తీస్కొని వాణ్ణి ఇంటికి పంపిచ్చినా కాబట్టి సరిపోయింది.”

“ల్యాకపోతే? ల్యాకపోతే ఏమయ్యేదిరా?”

“నీ యంత మొండోణ్ణి ఈ లోకంలో యాడా చూళ్ళ్యా మామా. యట్ట బతుకుతావు మామా ఇట్టైతే!”
సరసమూ సానుభూతీ కలిసున్నాయా మాటలో.

“వాని తరఫున మాట్టాడేదానికొచ్చినావేం వోయ్. వాణ్ణిగాదురా, నిన్ను కొట్టాల మెట్టుతో.” బసిరెడ్డి కూడా నవ్వుతూనే అంటించాడు.

“శివునికి ఒళ్లంతా బూడిద. బసిరెడ్డి మామకు ఒళ్లంతా మొండితనం. వస్తా అమ్మా. కరంటొచ్చే టైమయ్యింది.” నవ్వుతూ అరుగు మీదినుంచి లేచి, వీధివైపుగా వెళ్లిపోయాడు చిన్నారెడ్డి. వీధి మలుపులో అతను కనుమరుగయ్యేదాకా అటే చూస్తుండిపోయారు దంపతులిద్దరూ.

“బూడిదంట బూడిద. అందురూ బెదిరించేవాళ్లే!” అంది బసిరెడ్డిభార్య.

“ఒళ్లంతా బూడిదే అయితే మంచిదే. సుమారైన మంట తగిలినా ఒళ్లు కాలదు.” బసిరెడ్డి నవ్వాడు.

తరువాత కొంత సేపటికి చెవుటోడు వచ్చాడు. “సంతలో రెండు కట్టలు పంచినాఁక, చిన్నారెడ్డొచ్చి మూడోకట్ట …”

తెలుసులే ఫరవాలేదన్నట్టు సైగ జేశాడు బసిరెడ్డి. సోమవారం వచ్చి కొన్ని కరపత్రాలను తీసుకెళ్లి మండలాఫీసు, ఎమ్మార్వో కార్యాలయం, హైస్కూలు, బ్యాంకి బయట గోడలకు అంటించమని చెప్పి పంపించేశాడు.

రాత్రి భోజనమయ్యాక, పనేమీ లేకపోయినా అలవాటుగా పొలానికి వెళ్లాడు బసిరెడ్డి. పొలం మొత్తం దున్నకం పూర్తయింది. తడిమట్టి వాసన కలగలిపి చల్లగా గాలి వీస్తోంది ఆ వెన్నెలరాత్రి. పక్కనున్న తోటలో నుండి పాట వినిపిస్తోంది.

నను రమ్మన్నాది –
నిన్నూ రమ్మన్నాది –
యిద్దరిని రమ్మనీ నిద్దరోతోందో –
నెరా నెరా నెరబండి –
నెరనెర నెర బండీ –
నెరా నెరా నెరబండి
హెయ్‌య్‌య్‌ య్య

మనసులో ఏ అలజడీ లేకుండా హాయిగా గొంతెత్తి పాడుకొంటున్నాడు చెవుటోడు. బసిరెడ్డి ముఖంలో చిరునవ్వు మొలిచింది.

నెల రోజుల తరువాత, బ్యాంకు మేనేజరుకు బదిలీ అయిందని ఊళ్లో తెలిసింది. బసిరెడ్డి ప్రభావమేనన్నారు కొందరు. కాదు చిన్నారెడ్డి చేయించాడన్నాడు మరికొందరు. అండమానుకు బదిలీ చేశారని కొందరూ, అదిలాబాదుకే లెమ్మని కొందరూ అనుకున్నారు. చెవుటోనికి బ్యాంకు లోను మొత్తం అందిన సంగతి ఊరంతా తెలిసింది. తమకూ మరో ఐదొందలు వస్తాయేమో చిన్నారెడ్డిని కనుక్కుందామని సన్నాబన్నావాళ్లంతా కూడబలుక్కున్నారు.

*~*~*~*~సమాప్తం~*~*~*~*

——————-

రానారె పొద్దు సంపాదకవర్గ సభ్యుడు

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in కథ and tagged , , . Bookmark the permalink.

10 Responses to నెరా నెరా నెరబండి

  1. చాలా బాగుంది కథ. ఒక్కో వాక్యమూ మనసుకు హత్తుకుపోయింది. ఇంత మంచి కథ చదివి చాలా రోజులైంది!

  2. చదువుతుంటే కళ్ళముందు జరుగుతున్నట్లుగానే ఉంది. మాండలికంలోని పదాలు ఉండటం మూలాన కధకు సహజత్వం, అందం వచ్చాయి. అభినందనలు.

  3. krishna says:

    The story is very good. Present society needs more people like Basireddy.
    thanks and best wishes to the writer.

  4. రవి says:

    చక్కటి, చిక్కటి కథ. చాలా బావుంది. కథాప్రదేశం ఎక్కడన్నది కొంచెం ఆసక్తి గొలుపుతూంది. బళ్ళారి దగ్గర అయితే, కర్నూలు (హాలహర్వి వగైరా), లేదా అనంతపురం (రాయదుర్గం / ఉరవకొండ) వద్ద అయి ఉండాలి.

  5. రానారే గారూ!
    మంచి ప్రగతి శీల భావంతో ” నెరా నెరా నెరబండి” కథ రాశారు.
    కథ శీర్షిక చదవగానే చాలా రోజుల కిందట ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా వింటూ ఉండిన జానపద గేయం గుర్తుకు వచ్చింది.
    అభినందనలు!.

  6. sk says:

    చాలా బాగుంది.

    రానారె గారు యు రాఖ్!

  7. vsr nanduri says:

    కథ చాలా బాగుంది. అద్భుతమైన శైలి, మంచి విషయం. ముగింపు బాగుంది. అయితే వాస్తవంలో చిన్నా రెడ్డి అంత తేలికగా బసిరెడ్డిని క్షమించడు. అది చెప్పకుండా రానారె ఆశావహమైన ముగింపు ఇచ్చారు. అదీ మంచిదే.

  8. swarupkrishna says:

    చక్కని కథనం. స్వచ్చమైన శిల్ప విన్యాసం… వాస్తవికత ప్రతిబింబించే కథాకథనం…. అభినందనలు

  9. నెరా నెరా నెర బండి.. రానారె బండి…!! చాలా బాగుంది. ఇంతకు ముదే చెప్పినట్లు ఈ మాండలికంలో మీది చాలా ఆకట్టుకునే శైలి. కథా వస్తువు కూడా వాస్తవ పరిస్థితులకు చక్కగా అద్దం పట్టింది. నాగన్నలు ఎందరో ఇలాంటి మేనేజర్లకు “అలవాటు” పడి వున్నారు.. బసిరెడ్లే చాలా తక్కువగా వున్నారు..!!

  10. sunita says:

    >>వాస్తవంలో చిన్నా రెడ్డి అంత తేలికగా బసిరెడ్డిని క్షమించడు. >>
    >>నాగన్నలు ఎందరో ఇలాంటి మేనేజర్లకు “అలవాటు” పడి వున్నారు.. బసిరెడ్లే చాలా తక్కువగా వున్నారు..!!>>
    ఈ రెండు వాఖ్యలతో నేను ఏకీభవిస్తాను. ఇతివ్రిత్తం బాగుంది

Comments are closed.