– బొల్లోజు బాబా
ఇక్కడ నిను నేను ప్రేమిస్తున్నాను.
పైన్ వనాల చీకట్లలో గాలి స్వేచ్ఛప్రకటించుకొంది.
నీటి అలలపై చందమామ భాస్వరమై వెలుగుతోంది.
అన్నీ ఒకేలా ఉండే రోజులు, ఒకదానినొకటి వెంబడించుకొంటున్నాయి.
పొగమంచు అస్ఫష్ట రూపాలతో నర్తిస్తోంది.
ఓ వెండికొంగ ఎక్కడినుంచో వచ్చి వాలింది
మరొకటి తారలదాకా ఎగురుకొంటో సాగింది.
ఒకోసారి తొందరగా మెలుకువొచ్చేస్తుంది.
నా హృదయం తడిచి దూరంగా సముద్రపుటలలతో ప్రతిధ్వనిస్తోంది.
ఇక్కడే, ఈ ఓడ రేవు లో నిన్ను ప్రేమిస్తున్నాను.
ఇక్కడే నిను నే ప్రేమించాను.
దిగంతాలు నిను దాచేయాలని ప్రయత్నించాయి వృధాగా.
దహించే ఈ శీతగాలుల మధ్య కూడా నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను.
ఏనాడూ తిరిగిరాని పెద్ద పెద్ద ఓడలపై నా ముద్దులను పంపుతూనే ఉన్నాను.
పాతలంగరుల్లా నన్ను నేనే మరచిపోతున్నాను.
మధ్యాహ్నం లంగరు దింపుతోంది శోక తీరంపై.
నా జీవితం అలసిపోయింది. నిష్ప్రయోజనంగా అనిపిస్తోంది.
నా వద్దలేనిదానిని నేను ప్రేమిస్తున్నాను.
నీవు చాలా దూరంలో ఉన్నావు.
నా విరక్తి మసకసంధ్యలతో పెనుగులాడుతోంది.
కానీ రాత్రి వచ్చి నాకు పాటలు వినిపించి సాగిపోతూంది.
చందమామ తన స్వప్నాల కీలుబొమ్మలను ఆడిస్తూంది.
పెద్దపెద్ద నక్షత్రాలు నీ కళ్లతో నన్ను చూస్తూంటాయి.
నేను నిను ప్రేమిస్తూండగా
గాలిలో పైన్ తోపులు తమ ఆకులతో తీగలతో నీ నామాన్ని గానం చేస్తున్నాయి.
పాబ్లో నెరుడా Here I Love You – కు స్వేచ్ఛానువాదం
——————-
బొల్లోజు బాబా పుట్టింది యానాం. ప్రస్తుతం కాకినాడలో ప్రభుత్వ కాలేజీలో జూవాలజీ లెక్చరరుగా పనిచేస్తున్నారు. పుస్తక పఠనం, అప్పుడప్పుడూ ఆలోచనలను అక్షరాలలో పెట్టాలని ప్రయత్నించటం ఆయన అభిరుచులు.
ఆయన రచనలు:
1. 1954 లో ఫ్రెంచి వారి పాలననుండి యానాం ఏవిధంగా విముక్తి చెందిందో వివరించే “యానాం విమోచనోద్యమం” అనే పుస్తకం.
2. టాగోర్ రచించిన స్ట్రే బర్డ్స్ కు తెలుగు అనువాదం (ఈ లింకులో లభిస్తుంది)
ప్రస్తుతం కవితల సంపుటిని పుస్తకరూపంలో తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నారు.
బ్లాగు: http://sahitheeyanam.blogspot.com/
బాగుందండి!
చాలా అందమైన కవితను అనువదించి మాకందించారు ధన్యవాదాలు.
very nice…