— సౌమ్య వి.బి
సముద్రాన్ని చూస్తే నాలో ఏవో అలజడులు, అలల్లాగే చెలరేగిపోతూ, తన్నుకువస్తూ ఉంటాయి.
“నీళ్ళంటే నీకుండే భయంవల్ల అలా అనిపిస్తుంది” అంటుంది అమ్మ.
“అలా తీరిగ్గా కూర్చుంటావు కదా, సముద్రం చెంత – ఆలోచనలెక్కువై అవే అలజడులౌతాయి” అంటారు నాన్న.
“నీ మొహంలే, నోటికొచ్చిందేదో వాగేసి పెద్ద ఇదిగా ఫీలౌతూ ఉంటావు” అని వెక్కిరిస్తూ కొట్టిపారేస్తాడు పెద్దన్నయ్య. ప్రతిదానికీ మౌనంగా నవ్వేసి – “హుమ్” అని చిద్విలాసంగా చూడటం చిన్నన్నయ్య సమాధానం.
ఎన్నాళ్ళకో, ఎన్నేళ్ళకో ఇప్పుడిలా ఐదుగురం సముద్రం ఒడ్డున కూర్చుని ఉన్నాము.
మొదట పెద్దన్నయ్య, తరువాత చిన్నన్నయ్య, తరువాత నేను – వరుసగా ముగ్గురం పైచదువుల కోసం ఇల్లొదిలాము. మధ్యలో చిన్నన్నయ్యొక్కడే పీజీకైనా వెనక్కి వచ్చి అమ్మావాళ్ళతో ఉన్నది. అదవగానే ఉద్యోగరీత్యా వేరే ఊరు మళ్ళా. మేము ముగ్గురం ఒకేసారి ఇంట్లో ఉండి కొన్నేళ్ళౌతున్నట్లు ఉంది. ఒకరిక్కుదిరితే, ఒకరిక్కుదరదు. మధ్య మధ్య వచ్చే పిల్ల వీకెండ్లలో చెరొకర్ని కలిసేందుకు వెళ్ళివస్తూ ఉండేదాన్ని. వాళ్ళిద్దరి ఊర్లకూ మధ్యలో ఉంది నేనుండే ఊరు. ఒక్కోసారి ముగ్గురం కలిసేవాళ్ళం కానీ, ఇంటికెళ్ళడం కుదిరేది కాదు – దూరం! ఇలా దాదాపు ఐదేళ్ళ తరువాత నాన్నగారి షష్ఠిపూర్తి కోసం అందరం ఒకేసారి ఇంటికొచ్చాము. ఓవారం రోజులు ఆఫీసులూ పన్లూ ఏవీ లేకుండా ఉండేలా చూసుకుని, అందరం కలిసి సమయం గడపాలని ముందే అనుకున్నాము.
సాయంత్రం రాత్రౌతోంది. నల్లని చీకటి నెమ్మదిగా వెలుగును అల్లేసుకుంటోంది. సముద్రం ఒడ్డున మేమైదుగురం కూర్చుని ఉన్నాము. రెండు సముద్రాలు ఎదురెదురుగ్గా నిలబడి – వాటి మధ్య గోడ అడ్డుగా ఉంటే? సముద్రాల మధ్య ఏళ్ళ తరబడి తిష్ట వేసుక్కూర్చున్న ప్రేమానురాగాలుంటే? సముద్రాలకు ప్రేమలేమిటీ? అనురాగాలేమిటి? అంటారా? నాకోసం పొంగి పొరలి వస్తున్న ఆ అలల్లోనే సముద్రం ప్రేమ గాఢత తెలుస్తోందంటాను నేను. సముద్రాన్ని చూడగానే నాలో, తమలో తాము సంఘర్షించుకుంటూ బయటపడాలని తాపత్రయపడే ఆలోచనలుంటాయే – వాటి ఆరాటంలో సముద్రంపట్ల నా మనసుకున్న ప్రేమ తెలియట్లేదూ? అటోసంద్రం, ఇదో, ఇటు నాలో ఓ సంద్రం. నేనే అడ్డుగోడను రెంటికీ!
“సీ-ఫిలాసఫీ” లను సిలాసఫీ అనొచ్చేమో. సముద్రంతో జోడై ఎన్ని తాత్విక భావాలులేవు? ఒక్కల-ఒక్కల అరే! ఇదేదో బాగుందే. శ్రీశ్రీ ఒక్కల అని కథ రాస్తే “ఒక-కల” అనుకున్నానే గానీ, ఒక-అల కూడా కావొచ్చని నాకు అర్థం కావడానికి ఓ సముద్రం కావాల్సొచ్చింది! చిన్నన్నయ్య ఒక్కడే అటువైపు ఇసుకలో పచార్లు చేస్తున్నాడు. అమ్మా-నాన్నా-పెద్దన్నయ్యా బీచ్ లో ఉప్పర్ మీటింగ్ సంగతులు మాట్లాడుతున్నారు. అంటే, నా పెళ్ళి గురించే! పెళ్ళి-సంసారం-సాగరం-సముద్ర చింతన నన్ను వదిలేలా లేదు. “నా తరమా భవసాగరమీదను” …బ్రతుకూ సాగరం! సిలాసఫీలో మొత్తం ఫిలాసఫీ పట్టేసేలా ఉంది. మానవుడి బ్రతుకే సముద్రమట. ఇక పెళ్ళెంత? ఫిలాసఫీ ఎంత? “సముద్రంలో కాకిరెట్టంత” అంటారే! మనిషి బ్రతుకే కాకిరెట్ట నిజానికి. యావత్ ప్రపంచంలోని బ్రతుకు అనే మహాసంద్రంతో పోలిస్తే, ఒకరిదీ ఇద్దరిదీ జీవితాలెంతనీ? ఒకరిద్దరు చస్తే బ్రతికితే ప్రపంచానికి పెద్ద తేడా ఏమిటసలు?
నేను కాస్త ఆలోచనల్లో మునిగి కాసేపు బాహ్యస్మృతి కోల్పోయాను. ఏవో శబ్దాలు చెవిని సోకడంతో మళ్ళీ సంద్రం ముంగిట చేరాను. ఉరుములు! వర్షం పడేలా ఉంది. ఇక లేవాలని అందరం లేచాము. అప్పుడు – అప్పుడేం జరిగిందో అర్థం కాలేదు. ఉన్నట్లుండి ఓ పెద్ద శబ్దం. పిచ్చికోపంతో ఎగసిన అల ఒకటి. బాబోయ్! ఏమిటవి? భయంతో చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ చుట్టూ నా పట్టు బిగిసింది. కళ్ళకి చేయడ్డం పెట్టాను. అంతే!!!
రెండు క్షణాలాగి చేతులు తీశానా – ఏముందీ! శాంతం! కాకుంటే, అసలే పల్చగా ఉన్న జనసందోహం మరింత పల్చబడ్డట్లు అనిపించింది. హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు అందరూ. ఎక్కడబడితే అక్కడ చెల్లాచెదురుగా మనుష్యులు పడి ఉన్నారు. నాకసలేమీ అర్థం కావడంలేదు. ఈమనుషులు ఇలా పడుండటం ఏమిటీ, మిగితావాళ్ళు అలా తిరగడం ఏమిటీ? నేనిలా, అలాగే చేతిలో మొబైల్ ఫోన్ తో కూర్చుని ఉండటం ఏమిటీ? అసలేం జరిగింది? రెండు క్షణాలక్రిత్రం అలలు అంత ఎత్తుకొచ్చాక ఏమైంది? మరి నాకేం కాలేదేమిటి? అయోమయంగా పక్కకు తిరిగాను. అప్పుడు తగిలింది అసలు షాక్. నా చుట్టూ పదడుగుల దూరంలో – ఇసుక, ఓ వాటర్ బాటిల్, హ్యాండ్ బాగ్, చెప్పులజతా తప్ప ఏమీ లేవు. ఎవరూ లేరు కూడా. బాటిల్ నాన్న కొన్నది. బాగ్ అమ్మది. చెప్పులజత చిన్నన్నయ్యది – అని గమనించడానికి నాకు ఎంతోసేపు పట్టలేదు. మరి వాళ్ళేరీ?
అల్లంత దూరంలో ఇసుకలో అడుగులో అడుగేస్తున్న ఆకారం కనిపించింది. “అన్నయ్యా!” అని నాలుగడుగులు వేశానోలేదో, చిన్నన్నయ్య కాదని తేలిపోయింది.
“వీళ్ళేమయ్యారసలు? నేనిక్కడే ఉంటే, ఎక్కడికో వీళ్ళెలా వెళ్లగలరు?” నాకేమీ అర్థం కావట్లేదు.
“ఏమ్మా! ఎవరన్నా పోయారా?” జాలిగా అడిగాడొకాయన ఆ దారినపోతూ, అయోమయంగా చూస్తున్న నన్ను చూసి.
“లేదండీ, ఏమిటో కనబడ్డంలేదు. ఇంతసేపూ ఇక్కడే ఉన్నారు” అన్నాను పరధ్యానంగా.
“ఒక్కల చాల్దూ? ఒక్క క్షణం చాల్దూ?” గొణుక్కుంటూ వెళ్ళిపోయాడాయన.
ఎవడో పిచ్చివాడై ఉంటాడులే అనుకుని నేను అటూ ఇటూ వెదకడం మొదలుపెట్టాను. చిన్నన్నయ్య సెల్ కి ఎంత చేసినా నాట్ రీచబుల్ అని వస్తోంది. వీడొకడు. ఫోను పనిచేసేలా చూస్కోవచ్చుగా! ఒక్కొక్కరిగా నాన్నకూ, పెద్దన్నయ్యకూ చేశా – ఇదే సమస్య. అమ్మ ఫోనేగా నేను ఇప్పుడు వాడుతున్నది. వీళ్ళందరి ఫోన్లకూ అసలేమైనట్లు?
“ఒక్కల చాలదూ?” ఇందాకటి మనిషి మాటలు ఉన్నట్లుండి నా మనసులో మెదిలాయి. అంటే…. ఛ! నా మనసొప్పుకోవడం లేదు. ఈ వెధవ ఫోన్లు కలవొచ్చు కదా! ఇంకాసేపైతే ఇంకా చీకటైపోతుంది – వీళ్ళని వెదకడం కూడా కష్టం. టెన్షన్లో ఫోను బటన్లు నొక్కుతున్నాను. ఏం జరిగిందో ఏమిటో మరి, ఓ ఫొటో కనబడ్డది – కొయ్యబారిపోయాను. ప్రవాహంలో కొట్టుకుపోతున్న పెద్దన్నయ్య! నా కెమెరాలో! ఏమిటీ విచిత్ర, భయానక అనుభవం? ఈ ఫొటో ఏమిటీ? నా ఫోనులో ఏమిటీ? పిచ్చెక్కిపోతోంది. నిజం నా నెత్తుట్లోకి వెళ్ళేకొద్దీ బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది. కంటికి చెయ్యడ్డం పెట్టినప్పుడు ఫోన్ కెమెరాను నొక్కేసానేమో. అంటే, పెద్దన్నయ్య…. ఓ గాడ్! తలపట్టుకుని రెండడుగులు వేశానో లేదో – “నాన్నా!” అరిచినట్లే అనిపించింది నాకు. నాన్నే! ఆ బట్టలు… ఈ మసక వెల్తురులో మొహం తెలియట్లేదు. మరి అమ్మ….. చిన్నన్నయ్య,….??
అసలిక్కడ జరిగిందేమిటి? ఏమొచ్చి వీళ్ళని నాకు దూరం చేసింది? సునామీ అంటే ఇలా ఉండదే? అయినా, అందర్నీ పట్టుకెళ్ళి నన్ను మాత్రం ఎలా మిగిల్చింది? తన ప్రేయసికి నేనడ్డుగా నిలిచానని, ప్రతీకారమా సముద్రానిది? వాళ్ళందర్నీ తీసుకెళ్తే, వాళ్ళకోసం నేనొస్తే, నానుండి నా మనసును లాగేస్కుని కౌగిలించుకుందామన్న పిశాచపు ప్రణాళికా? ఓ గాడ్! ఏమాలోచిస్తున్నానసలు? కాలికేదో తగిలింది – తలదించి చూస్తేనో – ఏదో చెప్పుల జత. చూసినట్లే ఉందే – అన్నయ్య! చిన్నన్నయ్య! ఒక్కొక్కటిగా ఒక్కొక్కరి ఆనవాలూ ఇలా క్షణాల తేడాలో దొరుకుతూ ఉంటే కళ్ళలోంచి నీరు ఆగట్లేదు. అసలు, అసలు, నేను మాత్రం ఎలా మిగిలాను? అసల్నేనెందుకు మిగిలాను? ఏం చేయనిక్కడ? కళ్లలోంచి పొంగుతున్న గంగను ఆపేందుకు ఆనకట్టల రెప్పలు వాల్చాను. ఓ క్షణం ఆ చీకట్లో ఉన్నాను. కాలం ఓ అరగంట వెనక్కి తిరిగినా చాలు ఈ రెప్పపాటులో – అనుకుంటూ కళ్ళు తెరిచాను.
జివితంలో అత్యంత ఆనందకరమైన క్షణమేదన్నా ఉందంటే ఇదే కాబోలు. రెప్పల రెక్కలు విచ్చుకోగానే నాకు కనబడ్డది మా పడగ్గది! కల!! ఒక్కల!! తల్చుకుంటే గగుర్పాటుగా ఉన్నాకూడా! కల! ఒక్కల!! అనగానే ఎంత ఊరటగా ఉందో. మళ్ళీ ఎక్కడో అనుమానం – లేచి గబగబా గది తలుపులు దాటాను. బైట అన్నయ్యలిద్దరి మాటలు వినిపిస్తున్నాయి. రెండడుగులు వేస్తే వంటింట్లో అమ్మ, కాఫీ కప్పుతో బయటకొస్తూ నాన్న! “అమ్మా!” అంటూ వెళ్ళి నాన్నను కౌగిలించుకున్నాను. “ఏమ్మా!” అంటూనే “నాన్ననురా!” అన్నారాయన నవ్వుతూ.
“అవును నాన్నా! నాన్నే! నాన్నవే!” అన్నాను నవ్వుతూ, నా కన్నీటిని దాచే ప్రయత్నం చేస్తూ. నాన్నను దాటుకుని ముందుకెళ్తూ కన్నీటిని తుడిచేసుకుని అమ్మని ముద్దుపెట్టుకున్నాను.
అమ్మ నన్ను వదిలించుకుంటూ – “మొహం ఏమిటే అలా ఉంది? ఆరోగ్యం బానే ఉందా?” అంటూ జ్వరముందేమోనని చూసింది. “పడుకుని లేచింది కదా, అందుకేనేమోలే” అటువైపు నుండి వస్తూ నాన్న అన్నారు.
“ఆ..ఇలాగే గారాలు చేయండి. రాణీవారు అలాగే గారాలు పోతారు” లోపలికొస్తూ ఇదంతా విన్న పెద్దన్నయ్య అన్నాడు.
“అంత ఆలస్యంగా లేస్తే మొహం అలాగే ఉంటుంది మరి” ఎలాగుందో చూడకుండానే చురకంటించాడు చిన్నన్నయ్య.
అందరి గొంతుకలూ విన్నా, అందర్నీ చూశాక కూడా గుండెదడ ఇంకా తగ్గలేదు నాకు. ఒకళ్ళిద్దరు చస్తే, బ్రతికితే ప్రపంచానికేమిటసలు? అన్న నా మనసే, ఈ నల్గురిలో ఏ ఒక్కరులేకున్నా నా ప్రపంచం ఎలా తయారైఉండేదో అన్న భావన కలిగించింది.
ఒకవేళ – ఇది నిజమై ఉండి ఉంటే? “లాజికల్లీ, నువ్వు కూడా వాళ్ళతో పాటు సంద్రంలో కలిసిపోయి ఉండేదానివి. అది కల కనుక, నీకొచ్చింది కనుక, నువ్వు బ్రతికిపోయావు.” ఇప్పుడు మాత్రం తర్కాలు తీస్తోంది నా మనసు. ఓ పక్క నా భయాలకు సిగ్గుపడుతున్నా, ఓ పక్క నిజంగానే, నిజంగా ఇది జరిగితే, ఆ పరిస్థితి ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నా, ఓ పక్క ఆ తర్వాత ఎలా? అన్న ప్రశ్న వేధిస్తున్నా – నేనున్నది వాస్తవంలో అన్న స్పృహలోనే ఉండే ప్రయత్నం చేస్తూ – ఏదీ బయటకు చెప్పుకోలేక మౌనముద్రనే ఆశ్రయించాను. కల్లో ఏడ్చాననుకున్నా – నిజంగానే ఏడ్చినట్లున్నా. కళ్ళు మంటలు పుడుతున్నాయి.
కంటిమీద నీరు చల్లుకుంటూ ఉంటే సముద్రం గుర్తొచ్చి గుండె ఝల్లుమంది.
తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కామ్ లో ప్రచురితమయ్యాయి. పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో సౌమ్య ఒకరు.
కాసేపు భయపెట్టేసారు.చాలా చక్కగా వుంది.నావాళ్ళూ,నేనూ అంటూ ఆలోచిస్తుండగానే సీలాసఫీ చెప్పి ఆలోచనల దారి మళ్ళించారు.అవి నడుస్తుండగానే “పెద్దల” ని తెచ్చి ఆలోచనలను ఆపుచేసేసారు.ఏమిటో అంతా మీ ఇష్టం అయిపోయింది 🙂
కథ రసవత్తరంగా మొదలైనను, కొంత చదివే సరికి ఇదే కలే అనే విషయం పాఠకునికి తెలిసిపోడవలన పూర్తిగా చదవాలనే ఆసక్తి సన్నగిల్లిపోతుంది.
baagundi……..intaku mundu vaatikante idi parvaledu……..
“manam cheppalanukunndi edo different ga cheppalanukoni reder ni confuse chesebadulu neat ga direct chebite baaguntundemo………….”i felt
కధకు ఎన్నుకున్న అంశం బాగుంది. అంతరంగానికి , భౌతిక ప్రపంచానికి సమన్వయము సాధించటం చాలా కష్టం. ముఖ్యంగా ఆత్మీయుల పట్ల నిర్లిప్తంగా ఉండలేం. ఎవరో యోగులకే అది సాధ్యమౌతుందేమో !
chala bagundi mee kadha… starting lo nijam ga jarigindi cheptunnaru anukunnanu…ala ravatam daggaraku vatchetappatiki ammo emindo… emayyaro vallu ani tension kaligindi…last ku adi kala anetappatiki hai ga upiri peelchukunnanu….
good & heart touching story..
all the best
బాగుందండి !అమ్మ కే తెలుస్తుంది,”ప్రసవ వేదన “అంటే ఏమిటో !!
మనసులోని భావాలని అక్షరీకరించే రచయిత(త్రి )కే తెలుస్తుంది అందులోని “శ్రమ “ఏమిటో !!
మీరు మంచి రచయిత్రి కావాలని ఆశిస్తూ..
బాగ రాశారు.
మధ్యలో కాస్త
“సాయంత్రం రాత్రౌతోంది.”
లాంటి ప్రయోగాల దగ్గర తప్పిస్తే కథ అంత బాగా సాగింది.
మీ మనో సంద్రానికీ, ఆ సముద్రానికీ అడ్డుగోడగా మిమ్మల్ని పోల్చుకోవడం చాలాబాగుంది.
short and crisp story, keep it up
మీ మొదటి రెండు పారాలు చదివేసరికీ ఎప్పటినుండో నాలో ఇఱుక్కుపోయిన ఒక్కల ఇలా బయటపడ్డాది.
btw. ఒక్కల ఒకకల ఒక్క అల ఒక్కోలా ఒక్కలా అర్థం చేసుకోవడానికి లేదు. స్మార్ట్. 🙂
good show.